కాంగ్రెస్ నేతలవి లత్కోరు రాజకీయాలు
► మండిపడిన మంత్రి కేటీఆర్
► జైరాం రమేశ్, దిగ్విజయ్, ఉత్తమ్‌లవి లేకి మాటలు
► నేరెళ్ల ఘటనపై దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నాయకులు లత్కోరు రాజకీయాలకు పాల్పడుతున్నారని, సిరిసిల్ల నియోజకవర్గం నేరెళ్లలో జరిగిన ఘటనపై ఉన్నవీ లేనివీ ప్రచారం చేస్తున్నారని మంత్రి కె.తారకరామారావు మండిపడ్డారు. 125 ఏళ్ల ముసలి నక్క కాంగ్రెస్ పార్టీ అని, దళితుల సంక్షేమంపై ఆ పార్టీ మాట్లాడట మంటే.. మేకలు, గొర్రెల సంక్షేమం కోసం తోడేళ్లు సమావేశం పెట్టుకున్నట్టేనని వ్యాఖ్యా నించారు. దళితులపై జరిగిన అకృత్యాలపై చార్జిషీటు వేయాల్సి వస్తే.. అందులో ఏ1 ముద్దాయి కాంగ్రెస్ మాత్రమేనని, కాంగ్రెస్ జెండాకు ఉన్న రక్తం మరకలన్నీ దళితుల వేనని విమర్శించారు. మంగళవారం టీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
ఉత్తమ్ ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని కేటీఆర్ పేర్కొ న్నారు. ‘‘కాంగ్రెస్ పాలనంతా ఇసుకాసురుల పాలనే. కాంగ్రెస్ పాలనలో 2007–08 నుంచి 2014–15 మధ్య ఇసుక ద్వారా వచ్చిన అత్యధిక ఆదాయం రూ.10 కోట్లు మాత్రమే. అదే మా టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక 2015–16లో రూ.374.88 కోట్లు, 2016–17లో రూ.435 కోట్లు, 2017–18లో ఇప్పటివరకు రూ.200 కోట్లు ఆదాయం సమకూరింది.
అంటే సగటున ఏటా రూ.400 కోట్ల ఆదాయాన్ని అంచనా వేస్తే.. కాంగ్రెస్ పాలనలోని పదేళ్లలో రూ.4 వేల కోట్లు ఎవరి జేబుల్లోకి పోయాయి. ఈ లెక్కన ఎవరి కాలంలో ఇసుక మాఫియా ఉందో అర్థం కావడం లేదా?..’’ అని నిలదీశారు. కాంగ్రెస్ నేతల తీరు ‘లూట్– ఝూట్–స్కూట్ (దోపిడీ–అబద్ధం–పారిపోవడం)’లా ఉందని విమర్శించారు. అక్రమ ఇసుక దందా నియం త్రణలో భాగంగా ఒక్క సిరిసిల్ల జిల్లాలోనే రెండు వందల కేసులు నమోదు చేశామని.. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా ఎక్కువగా ఉన్నాయని చెప్పారు.
శాంతిభద్రతల కోసమే...
పోలీసుల కోసం కొనుగోలు చేసిన వాహనాల (ఇన్నోవాల) విషయంగా కాంగ్రెస్ నాయ కుడు జైరాం రమేశ్ దిగజారుడు ఆరోపణలు చేశారని కేటీఆర్ మండిపడ్డారు. కొత్త రాష్ట్రం కాబట్టి శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట యంత్రాంగం ఉండాలనే పోలీసు శాఖను ఆధునీకరించామని.. ఇందులో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థ డీజీఎస్‌ఎన్‌డీ ద్వారా యూపీఏ ప్రభుత్వ హయాంలో నిర్ణయించిన ధరల మేరకే వాహనాల కోసం నేరుగా ఫ్యాక్టరీకి ఆర్డర్ ఇచ్చామన్నారు.
కానీ జైరాం రమేశ్ అడ్డగోలు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తనకు కంపెనీ ఉందో చూపిస్తే దానిని జైరాం రమేశ్, ఉత్తమ్ కుమార్‌రెడ్డిలకు రాసిస్తానని కేటీఆర్ పేర్కొ న్నారు. ఇక లాభాపేక్ష లేకుండా ప్రజలకు సేవచేసే సంస్థలకు మినహాయిం పులు ఇవ్వడం అన్ని ప్రభుత్వాలు చేసేదేనని.. ఆ తరహాలోనే వెంకయ్యనాయుడు కుమార్తె స్వర్ణ భారతి ట్రస్ట్ మినహాయింపులు ఇచ్చామని చెప్పారు. సమావేశంలో మండలి చీఫ్ విప్ సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, షిండే, చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
ఉత్తినే వాగొద్దు!
కాంగ్రెస్ నేతలు ఆధారాలుంటే బయట పెట్టాలని, ఉత్తినే టీవీల ముందు వాగొ ద్దని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మంత్రు లు ఎందుకు రాజీనామా చేయాలని నిలదీశారు. నేరెళ్ల ఘటనలో కేసులు నమోదైన 12 మందిలో దళితులు నలుగురు మాత్రమేనని చెప్పారు. దళితులపై దాడులు జరిగాయంటూ కాం గ్రెస్ దిక్కుమాలిన రాజకీయాలకు పాల్ప డుతోందని మండి పడ్డారు. ‘‘సిరిసిల్లకు పోతామంటున్నారు. పోయి ఏం చెబు తారు? మా (కాంగ్రెస్) దగుల్బాజీ పాలన లో సిరిశాలను ఉరిశాలగా మార్చామని చెబుతారా? సిరిసిల్లలో ఎన్‌కౌంటర్లతో నెత్తురు పారించామని చెబుతారా?’’అని మండిపడ్డారు.