నేరెళ్ల దళితులపై దాడి రాజ్యహింసే
♦ టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో నేతలు
♦ ఇసుక మాఫియాను అరికట్టాలని డిమాండ్
♦ రైతులను టీఆర్‌ఎస్ ప్రభుత్వం బిచ్చగాళ్లు చేసిందని విమర్శ
సాక్షి, హైదరాబాద్: సిరిసిల్ల జిల్లా నేరెళ్లలో దళితులపై పోలీసుల దాడి రాజ్యహింసేనని టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం అభివర్ణిం చింది. థర్డ్ డిగ్రీ జరిపిన పోలీసులపై చర్యలు తీసుకునేవరకు, బాధితులకు న్యాయం జరిగేవరకూ కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉంటుందని పార్టీ నేతలు స్పష్టం చేశారు. ఇసుక మాఫియాను అరికట్టి, దళితులకు న్యాయం కోసం పోరాడుతామన్నారు.ఆది వారం గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన విస్తృతస్థాయి సమావేశం జరిగింది.
రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి రామచంద్ర కుంతియా హాజరయ్యారు. సమావేశంలో చేసిన తీర్మానా లను టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి, దాసోజు శ్రవణ్, అద్దంకి దయాకర్ మీడియా కు వివరించారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీపై గుజరాత్‌లో దాడిని సమా వేశం ఖండించినట్లు వారు తెలిపారు. ఉత్తర ప్రదేశ్‌లో వారంలో 60మంది చిన్నపిల్లలు చనిపోవడం అక్కడి బీజేపీ ప్రభుత్వ పని తీరుకు నిదర్శనమని విమర్శించారు.
రీడిజైన్ పేరుతో టీఆర్‌ఎస్ లూఠీ
నీళ్ళు, నిధులు, నియామకాల నినాదాన్ని టీఆర్‌ఎస్ నీరుగార్చిందని మల్లు రవి, దాసోజు శ్రవణ్ విమర్శించారు. టీఎస్‌పీఎస్సీ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేయకున్నా సభ్యులు, చైర్మన్ జీతాలను 3 రెట్లు పెంచుకు న్నారన్నారు. రైతును రాజు చేస్తామన్న ప్రభుత్వం వారిని బిచ్చగాళ్లు చేసిందన్నారు.
ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో ప్రభుత్వం భారీగా లూఠీకి పాల్పడుతోందని శ్రవణ్ ఆరోపించారు. రైతులకు రుణాలివ్వాలని, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం తీర్మానించినట్లు పేర్కొన్నారు. కర్ణాటక నుంచి తెలంగాణకు నీటి విడుదలకు పార్టీ పరంగా కృషి చేస్తామన్నారు.
రాష్ట్ర పార్టీకి సాంస్కృతిక విభాగం
పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని సమావేశంలో నిర్ణయించామని మల్లు రవి, శ్రవణ్ తెలిపారు. బూత్, గ్రామ, మండల, డివిజన్,జిల్లా స్థాయి, అనుంబంధ విభాగాల కమిటీలను సెప్టెంబర్ నెలాఖరులోగా భర్తీ చేయాలని సూచించామన్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌కి సాంస్కృతిక విభాగం ఏర్పాటు చేస్తామన్నారు. పార్టీలో రీసెర్చ్ అండ్ ఎనాలసిస్ కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తామని చెప్పారు.
రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రాహుల్ సందేశ్ యాత్రలు నిర్వహిస్తామని, గడపగడపకూ కాంగ్రెస్ పార్టీ నినాదంతో ముందుకెళ్తామ న్నారు. 2019లో కాంగ్రెస్ పార్టీని అధికారం లోకి తీసుకురావడానికి సమావేశంలో దిశా నిర్దేశం జరిగిందన్నారు. ఇన్‌చార్జి కార్యదర్శి సతీశ్ జార్కోలి, సీఎల్పీ నేతలు కె.జానారెడ్డి, షబ్బీర్ అలీ, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, పార్టీ నేతలు, మాజీ మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు, జిల్లా పార్టీల అధ్యక్షులు పాల్గొన్నారు.