అవినీతికి అడ్డాగా కొడవలూరు స్టేషన్
రెండు ఇసుక టిప్పర్లకు రూ.1.10 లక్షల వసూలు
ఎన్నికల వేళ రూ.50 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం
ఆయనొక పోలీస్ అధికారి. విధి నిర్వహణ కంటే.. కాసుల వేటకే అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. తాను పని చేసిన ప్రతి స్టేషన్‌ను అవినీతికి అడ్డాగా మార్చేస్తారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతల అండదండలతో పబ్బం గడుపుకునే ఆయన ఎన్నికల వేళ స్వతంత్ర ప్రతిపత్తి పేరుతో అక్రమాలతో చెలరేగిపోయారు. ఆ పార్టీ.. ఈ పార్టీ అనే తేడా లేకుండా భారీగానే వెనుకేశారు. నిత్యం ఆయన దృష్టి అంతా ఇసుక, గ్రావెల్ రవాణా వాహనాలపైనే ఉంటుంది. రెండు రోజుల క్రితం ఇసుక అక్రమ రవాణా చేస్తున్న రెండు టిప్పర్లను నిలబెట్టి బహిరంగంగానే బేరం పెట్టిన వైనంపై ఇప్పుడు పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది.
కోవూరు : ఆ పోలీస్ స్టేషన్‌కు ఆయనే బాస్. ఆయన పనిచేసే స్టేషన్‌లో కేసుల కంటే.. కాసుల లావాదేవీలే ఎక్కువగా ఉంటాయనే ఆరోపణలు ఉన్నాయి. క్రిమినల్ కేసుల్లోనే కాక.. సివిల్ కేసుల వివాదాల్లో తలదూర్చి మధ్యస్తాలు చేసి ఇరుపక్షాల నుంచి బాగానే గుంజుతున్నట్లు సమాచారం. ఆయన స్టేషన్ పరిధి.. కనుచూపు దాటి ఇసుక, గ్రావెల్ వాహనం దాటిపోదంటే అతిశయోక్తి లేదు. ఆ వాహనాలు ఆ స్టేషన్ దాటి పోవాలంటే.. నెలవారీ మామూళ్లు ఇవ్వాల్సిందే.. లేదంటే స్టేషన్ బయట తుప్పు పట్టి పోవాల్సిందే. విధి నిర్వహణలో నిర్లక్ష్యం.. బాధ్యతారాహిత్యం.. అవినీతి ఆరోపణలపై ఇప్పటికే తొమ్మిది చార్జ్ మెమోలు అందుకున్నారంటే ఆయనెంతటి నిజాయితీ అధికారినో అర్థం చేసుకోవచ్చు.
నిలబెట్టి వసూలు
చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారిపై ఉండే కొడవలూరు పోలీస్‌స్టేషన్.. గత కొంత కాలంగా అవినీతికి అడ్డాగా మారింది. ఆ స్టేషన్ అధికారి వద్ద చాటుమాటు బేరాలు ఉండవ్.. అంతా బహిరంగంగానే ఉంటాయని ఆ స్టేషన్‌లో పనిచేసే సిబ్బందే చెబుతుంటారు. అనుమతులు, బిల్లులతో గ్రావెల్, ఇసుక తరలించుకోవాలన్నా.. ఆయనకు నెలవారీ మామూళ్లు ఇచ్చుకోవాల్సిందే. ఇసుక, గ్రావెల్ తరలించే లారీలు, టిప్పర్లు, ట్రాక్టర్లు కోసం స్టేషన్‌లో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకుని దందాలు కొనసాగిస్తున్నారు. వసూలు చేసిన నగుదులో సిబ్బందికి సైతం ఒక్క రూపాయి ఇవ్వకుండా మొండిచేయి చూపడంతో వారు బయట పడలేక లోలోన మదనపడుతున్నారు.
రెండు టిప్పర్లు.. రూ.1.10 లక్షలు
ఎన్నికల వేళ ఇసుక రీచ్‌లకు ప్రభుత్వం అనుమతులు నిలిపివేసింది. ఈ క్రమంలో ఇసుక అక్రమ రవాణా కొంత పెరిగింది. ఇదే అదనుగా సదరు పోలీస్ అధికారి నిత్యం రేయింబవళ్లు జాతీయ రహదారిపై కాపు కాసి కేసుల పేరుతో కాసుల వేట సాగించారు. తాజాగా ఆదివారం విడవలూరు మండలం ముదివర్తి ఇసుక రీచ్ నుంచి రెండు టిప్పర్లు సామర్థ్యానికి మించి ఇసుక లోడ్‌తో ఒంగోలు వైపు బయలుదేరాయి. ఆ రెండు టిప్పర్లను హైవేలో సదరు అధికారి నిలబెట్టారు. సరైన పత్రాలు చూపలేదంటూ వాహనాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రాత్రి వరకు ఇసుక యజమానులను అక్కడ ఉంచారు. అందరూ ముందు లారీ ఓనర్లతో బేరం సాగించారు. రెండు టిప్పర్లకు కలిపి రూ.1.10 లక్షల ముట్ట చెప్పేలా ఒప్పందం కుదుర్చుకొన్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులకు సమాచారం అందడంతో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఎన్నికల వేళ ‘పచ్చ’పాతం
సదరు పోలీస్ అధికారి గతంలో బుచ్చిరెడ్డిపాళెంలో పని చేసినప్పుడు అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. పలు సందర్భాల్లో పోలీస్ ఉన్నతాధికారుల నుంచి చార్జ్ మెమోలు అందుకున్నారు. గతంలో వైఎస్సార్‌సీపీలో ఉండి.. ప్రస్తుతం టీడీపీలోకి వెళ్లిన నెల్లూరుకు చెందిన తన సామాజిక వర్గానికి సంబంధించిన ఓ నేత అండతో బుచ్చిరెడ్డిపాళెం నుంచి కొడవలూరు పోలీస్‌స్టేషన్‌కు బదిలీపై వచ్చారు. ప్రస్తుతం ఎన్నికల వేళ సదరు నేతతో మిలాఖత్ అయి అడుగడుగునా ‘పచ్చ’పాతం చూపించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇందు కోసం టీడీపీ అభ్యర్థి నుంచి కోవూరు నియోజకవర్గంలో పనిచేసే పోలీస్ అధికారులకు భారీగానే ముడుపులు అందించినట్లు జిల్లా పోలీస్‌శాఖలో ప్రస్తుతం చర్చ నడుస్తోంది. స్టేషన్ స్థాయి అధికారికి రూ.3 లక్షలు, సర్కిల్ అధికారికి రూ.5 లక్షల వంతున టీడీపీ నేతల ద్వారా ముడుపులు అందించి ఎన్నికల్లో ఆ పారీ్టకి అనుకూలంగా పని చేయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకూరుపేట, విడవలూరు మండలాల్లో మత్స్యకార గ్రామాల్లో అసాంఘిక దురాచారం అయిన ‘దురాయి’ ని టీడీపీ వేయించినా.. ఎటువంటి చర్యలు చేపట్టలేదనే ఆరోపణలకు ముడుపుల వ్యవహారమే అని అర్థమవుతోంది. తాను కూడా పనిలో పనిగా దాదాపు రూ.50 లక్షలు వెనుకేసినట్లు పోలీస్ వర్గాల విశ్వసనీయ సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment