
టీడీపీ నాయకుల దారుణంపై వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఆక్రోశం
115 మామిడి, 50 టేకు చెట్లను నరికివేసిన టీడీపీ నాయకులు
ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు
గంగాధర నెల్లూరు: ‘చెట్లను నరకడం కంటే.. మమ్మల్ని నరికేయండి’ అంటూ టీడీపీ నాయకులపై వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఆక్రోశం వ్యక్తం చేశాడు. మూడేళ్లుగా కంటికి రెప్పలా.. ఎంతో అపురూపంగా పెంచుకుంటున్న మామిడి, టేకు చెట్లను అన్యాయంగా నరికివేశారంటూ కన్నీరుమున్నీరయ్యాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదంటూ వాపోయాడు. వివరాలు.. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం కుప్పనపల్లికి చెందిన రైతు, వైఎస్సార్‌సీపీ కార్యకర్త శంకర్‌రెడ్డికి వరత్తూరులో సర్వే నం.840లో మూడు ఎకరాల 30 సెంట్ల భూమి ఉంది.
మూడేళ్ల క్రితం ఆ భూమిలో రూ.లక్షలు వెచ్చించి మామిడి, టేకు చెట్లను నాటారు. కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో.. స్థానిక టీడీపీ నాయకులు యువరాజురెడ్డి, గంగిరెడ్డి ఆ భూమిపై కన్నేశారు. దౌర్జన్యంగా భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నించారు. రెండు రోజుల క్రితం రాత్రి సమయంలో 115 మామిడి, 50 టేకు చెట్లను నరికేశారు. ఈ దారుణంపై శంకర్‌రెడ్డి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. కానిస్టేబుళ్లను పంపించి ప్రాథమిక విచారణ చేశారు.
కానీ రెండు రోజులు గడిచినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో రైతుఈ విషయాన్ని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కృపాలక్ష్మి, మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి దృష్టికి తీసుకెళ్లారు. నారాయణస్వామి మంగళవారం కుప్పనపల్లికి చేరుకుని శంకర్‌రెడ్డిని పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అధికారం అండతో ఎంతటికైనా దిగజారుతారా? అని మండిపడ్డారు. ఈ సమస్యపై జిల్లా ఎస్పీకి పలుమార్లు ఫోన్ చేసినా.. కనీస స్పందన లేదని చెప్పారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.