2016లో వైరా, కట్టెలేరు సంగమ ప్రాంతంలో మృత్యువాత పడిన కుటుంబసభ్యులు (ఫైల్ )
నందిగామ : ఇసుక దందా ప్రజల ప్రాణాలను హరిస్తోంది. ఇసుక మాఫియా ధన దాహం అమాయకుల ప్రాణాలను బలిగొంటోంది. ఇష్టారాజ్యంగా సాగించిన తవ్వకాల వల్ల మున్నేరు, ఉప నదుల్లో లోతైన గుంతలు ఏర్పడుతున్నాయి. నీరు వచ్చిన సమయంలో లోతును అంచనా వేయలేక వాటిలో చిక్కుకొని పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. ఏటూరు–జిడుగు మధ్య ఐదుగురు విద్యార్థులు కృష్ణా నదిలో పడి మృతిచెందిన ఘటన మరువక ముందే... నందిగామ మండల పరిధిలోని దాములూరు కూడలి వద్ద వైరా, కట్టెలేరు సంగమ ప్రాంతంలో ముగ్గురు నీట మునిగి చనిపోయారు. నందిగామ మున్నేటిలో ఓ బాలుడు మృత్యువాత పడ్డాడు. ఇసుక ఉచిత పంపిణీ పేరిట ప్రభుత్వం అధికారిక క్వారీల నుంచి మాత్రమే ఇసుక తవ్వుకోవాలంటూ నిబంధన విధించినప్పటికీ, ఇసుక మాఫియాను అరికట్టడంలో ఘోరంగా విఫలమైంది. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇసుక మాఫియా ఎక్కడబడితే అక్కడ.. ఎలా బడితే అలా... తవ్వకాలు సాగించినా, వేడుక చూసిందే తప్ప ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ఫలితంగా కేవలం ఇసుక తవ్వకాల కారణంగానే పలువురు మృత్యువాత పడటం గమనార్హం.
ప్రజల ప్రాణాలు పోతున్నా...పట్టించుకోరా....?
ఇసుక అక్రమ తవ్వకాల కారణంగా ప్రజల ప్రాణాలు గాలిలో కలసిపోతున్నా, ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోంది. అధికారులు కూడా అడపా దడపా దాడులు నిర్వహించి మిన్నకుండిపోతున్నారు తప్ప అక్రమ తవ్వకాలు, రవాణాను పూర్తిగా అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవడం లేదు. సమాచారం అందినప్పుడో. ఎవరైనా ఫిర్యాదు చేసిన సందర్భంలోనో స్పందించి అరకొర వాహనాలను స్వాధీనం చేసుకొని జరిమానాలు విధించి సరి పెట్టుకుంటున్నారు. సదరు మాఫియాకు అధికార పార్టీ నాయకుల అండదండలు పుష్కలంగా ఉండటంతో కొన్ని సందర్భాల్లో అధికారులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఓ పక్క ఉచితమంటూనే మరో పక్క ఇసుక అక్రమ రవాణాకు ప్రభుత్వం ఊతమిస్తుండటంతో ఉచిత ఇసుక పథకం నిష్ప్రయోజనమవుతుండటమే కాకుండా ఇలా ప్రజల ప్రాణాలు బలైపోవడానికి కారణమవుతోంది.
నాలుగేళ్లలో తొమ్మిది మంది బలి : చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు నాలుగేళ్ల కాలంలో ఇసుక మాఫియా కాసుల కక్కుర్తికి నందిగామ నియోజకవర్గంలో మొత్తం తొమ్మిది నిండు ప్రాణాలు బలయ్యాయి. 2016, ఆగస్టు 16న పుష్కర స్నానం కోసం చందర్లపాడు మండల పరిధిలోని ఏటూరు–గుంటూరు జిల్లా జిడుగు మధ్య కృష్ణా నదిలో ఐదుగురు విద్యార్థులు మునిగి చనిపోయారు. అదే ఏడాది సెప్టెంబర్ 18న వైరా, కట్టెలేరు సంగమ ప్రాంతంలో నందిగామ మండల పరిధిలోని దాములూరు కూడలి వద్ద ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యు ఒడికి చేరుకున్నారు. వాటి నుంచి తేరు కోక ముందే తాజాగా నందిగామ పట్టణ శివారుల్లోని మున్నేటిలో పడి పట్టణానికి చెందిన షక్ నూర్ అహ్మద్ ఖాన్ అనే బాలుడు కన్ను మూశాడు. ఈ మూడు సంఘటనలు ఇసుక మాఫియా కాసుల కక్కుర్తి కారణంగానే జరిగాయన్నది నిర్వివాదాంశం. 2016లో జరిగిన రెండు ఘటనలు ఇసుక అక్రమ తవ్వకాల వల్లే జరిగాయంటూ వైఎస్సార్ సీపీ నాయకులు ఆందోళనలు నిర్వహించగా, సదరు నాయకులపై కేసులు సైతం నమోదయ్యాయి. ఇంత జరుగుతున్నా, ప్రభుత్వం ఇసుక అక్రమ రవాణాకు అడ్డు కట్ట వేయలేకపోతోందని, ఇంకా ఎంత మంది ప్రాణాలను బలిగొంటే ఇసుక మాఫియా ధన దాహం తీరుతుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
బాలుడి కుటుంబాన్ని ఆదుకోవాలి: వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ మొండితోక అరుణ్‌కుమార్
నందిగామ : మునేటిలో ప్రాణాలు కోల్పోయిన బాలుడి కుటుంబాన్ని ప్రభుత్వం అదుకోవాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ మొండితోక అరుణ్‌కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టణానికి చెందిన నూర్ అహ్మద్‌ఖాన్ అనే బాలుడు మున్నేటిలో స్నానానికి వెళ్లి మృత్యువాత పడిన ఘటన పాఠకులకు విదితమే. ఈ నేపధ్యంలో సోమవారం మృతదేహం లభ్యమవ్వడంతో అధికారులు పంచనామా నిమిత్తం ప్రభుత్వ అస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని సందర్శించిన ఆయన బాలుడికి నివాళి అర్పించడంతో పాటు వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేసి రూ. 10 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. డాక్టర్ అరుణ్‌కుమార్ మాట్లాడుతూ, కేవలం అక్రమ ఇసుక రవాణా కారణంగానే అనేక మంది నిండు ప్రాణాలు నీటిపాలవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నందిగామ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు అనేక మంది మృత్యువాత పడ్డారన్నారు. అధికార పార్టీ ధనదాహానికి అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మునేటిలో మృతి చెందిన నూర్ అహ్మద్‌ఖాన్ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట పార్టీ నాయకులు కత్తురోజు శ్రీనివాసాచారి, మహమ్మద్ మస్తాన్, షేక్ ఖాలిఖ్, బొల్లినేని శ్రీనివాసరావు, ఆవుల విజయ్, ముఖర్జి, ఖాసీంఖాన్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment