నేరెళ్ల దళితులపై ఎందుకింత కక్ష?
నేరెళ్ల దళితులపై ఎందుకింత కక్ష?
Published Fri, Jul 28 2017 9:11 AM | Last Updated on Tue, Sep 5 2017 5:05 PM
గరగపర్రు గాయం మానక ముందే మరోసారి దళితులపై అగ్రవర్ణ ఆధిపత్యం విరుచుకుపడింది. కాకుంటే ఈసారి తెలంగాణ వంతుగా మారింది. కేటీఆర్ నియోజకవర్గమైన సిరిసిల్ల రాజన్న జిల్లాలో అమాయకులైన దళితులపై ఖాకీ క్రౌర్యం విరుచుకుపడడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇసుక మాఫియా దందా ఎప్పటి నుంచో యథేచ్ఛగా సాగుతోంది. అడ్డుకోవాల్సిన సర్కారు, మాఫియాకే వత్తాసు పలికింది. అధికారికంగానే ఇసుక మాఫియాను ప్రోత్సహిస్తున్నారు.
అక్రమ ఇసుక రవాణా సమయంలో రాజన్న సిరి సిల్ల జిల్లాలోని జిల్లేల్ల, నేరెళ్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగాయి. లారీలకు బలై, గత ఏడాదిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. యమపాశంలా మారిన లారీల రాకపోకలను బంద్ చేయించాలని కోరుతూ పెద్దఎత్తున ఉద్యమించారు ప్రజలు. ఈ సమయంలో అక్కడున్న లారీలు తగులబడ్డాయి. దీంతో భారీగా బలగాలను మోహరింపజేసి లాఠీచార్జీ చేయించారు. నేరెళ్ల గ్రామం మీద పడి దళితులను అరెస్టులు చేశారు. ఇళ్ల మీద పడి ఈడ్చుకొచ్చారు. అక్రమ కేసులు బనాయించడమే కాకుండా, జిల్లా ఎస్పీ సమక్షంలో థర్డ్ డిగ్రీ ప్రయోగించడం ద్వారా దేశం తలదించుకునేలా చేశారు.
ఈ ఘటనలో దళితులను పాశవికంగా కొట్టడం దారుణం. లారీలు తగులపెట్టడం నేరమైతే, దాన్ని ఎవరు చేశారో దర్యాప్తు చేసి నిరూపించి వారిని కోర్టులో హాజరు పరిచి, చట్ట ప్రకారం శిక్షించాలి. అంతేగాని దళితులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడటం ఘోరం. దీంట్లో జిల్లా ఎస్పీ పాల్గొనడం, దళితులను కులం పేరుతో దూషిస్తూ చావుదెబ్బలు కొట్టడమేగాక, ఈ విషయం బయటపెడితే మీ ఆడవాళ్లపై వ్యభిచార కేసులు పెడతానని బెదిరించడం ఏ రకమైన ఫ్రెండ్లీ పోలీసు వ్యవస్థో పాలకులే చెప్పాలి. ఏ పని చేయడానికీ పనికి రాకుండా కొట్టి, వారిని రిమాండ్‌కు పంపడం పోలీసు వ్యవస్థకే మచ్చ. ఒక జైలరే వారిపై హింసను చూసి జైలులో చేర్చుకోలేమని నిరాకరించాడంటే, కరీం నగర్ పోలీసుల వికృతపోకడలకు వేరే సాక్ష్యమేల?
తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఇంతటి దుర్మార్గం ఏనాడూ లేదు. ఇది గరగపర్రు కంటే అమానుషమైనది. అక్కడైనా కనీసం వెలేసి వదిలేశారు. మరి ఇక్కడేమో పోలీసులను పెట్టి మరీ నరకం చూపించారు. తెలంగాణ పాలకులు దళితులపైన కక్ష గడుతున్న తీరు ప్రతి గుండెను రగిలిస్తోంది. ఇందుకోసమేనా తెలంగాణను సాధించుకున్నదనే ప్రశ్న ఉదయిస్తున్నది. నిజానికి తెలంగాణ సాధనకోసం ప్రాణాలిచ్చిన బలిదానాల్లో కింది కులాల వారే అధికం. ఎస్సీ, ఎస్టీ, బీసీల పిల్లలు తమను తాము కాల్చుకొని ఉద్యమాన్ని రగిలించారు.
ఇప్పుడు వారి త్యాగాలకు విలువలేకపోగా, దళిత బహుజన సమాజం పట్ల అధికారికంగా రాజ్యహింస కొనసాగుతోంది. ఈ సంఘటనపై సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించి, దళితులపై కక్షపూరితంగా వ్యవహరించి, దాడి చేసిన పోలీసు అధికారులను తక్షణం సస్పెండ్ చేయాలి. దళితులను కులంపేరుతో దూషించినందుకు ఎస్పీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. వారిని విధులనుంచి తప్పించి, బాధితులైన దళితులకు, బీసీలకు నష్ట పరిహారం అందించాలి. ప్రభుత్వం దళితులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేకుంటే రానున్న 2019 ఎన్నికల్లో తప్పకుండా టీఆర్‌ఎస్‌కు ప్రజలు గుణపాఠం నేర్పడం ఖాయం.
డా‘‘ పసునూరి రవీందర్, కేంద్ర సాహిత్య
అకాడమీ యువపురస్కార గ్రహీత ‘ 77026 48825
Advertisement
Advertisement