
విజయవాడలో అశేష జనవాహిని నడుమ వేదికా రెడ్డి అనే చిన్నారి... మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌మోన్ రెడ్డిని కలవాలని ఏడ్చింది. అది చూసిన ఆయన చిన్నారిని దగ్గరకు తీసుకుని ఆప్యాయత పంచారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. అంతే... తెలుగుదేశం – జనసేన పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తల్లోని సైకోలు నిద్రలేచారు. బాలిక, ఆమె కుటుంబంపై దుష్ప్రచారానికి తెరతీశారు. ‘ఆమె కుటుంబ నేపథ్యం ఇదీ’ అంటూ తప్పుడు ప్రచారానికి పూనుకున్నారు. తాము స్పాన్సర్ చేస్తున్న సోషల్ మీడియా యాప్స్‌లో మీమ్స్, రీల్స్ (Reels) పెట్టి వ్యక్తిత్వ హనానికి పూనుకున్నారు. వీళ్లకు ఇలా చేయడం కొత్తేమీ కాదు. పాదయాత్ర సమయంలో, వివిధ కార్యక్రమాల్లో జగన్ చిన్నారులను దగ్గరకు తీసుకున్నప్పుడు ఎంతో దారుణంగా ట్రోల్స్ చేశారు.
టీడీపీ మొదటి నుంచి సోషల్ మీడియా (Social Media) ద్వారా జగన్‌పై తప్పుడు ప్రచారం చేస్తోంది. దీనికి జనసేన తోడైంది. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ రెండు పార్టీల సోషల్ మీడియా సభ్యులు రెచ్చిపోయి పోస్టులు పెట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి. బెండపూడి విద్యార్థులు అమెరికన్ శ్లాంగ్‌లో ఇంగ్లిష్‌లో మాట్లాడారు. దీనిపై టీడీపీ– జనసేన నేతలు, కార్యకర్తలు చేసిన ట్రోల్స్ అంతా ఇంతా కాదు. టీడీపీకి అనుకూలమైన టీవీ, సినిమా సెలబ్రిటీస్ కూడా ఆ జాబితాలోకి ఎక్కారు. అలాగే నాడు జగన్ ప్రభుత్వం చేసిన మంచిని ఓ మహిళ సంతోషంగా చెప్పింది. ఇది ఆ పార్టీల్లోని సైకోలకు నచ్చలేదు. వెంటనే ఆమెపై ట్రోల్స్ (Trolls) మొదలుపెట్టి చివరికి ఆత్మహత్యకు కారణమయ్యారు. అయినా వారిలో మార్పు అనేది రాలేదు. కూటమి అధికారంలోకి వచ్చాక ఇటువంటి వికృత చేష్టలు మరింత పెరిగాయి. తాజాగా విజయవాడలో జగన్‌ను కలి సిన చిన్నారిపై చేసిన ట్రోల్స్ ఇందుకు నిదర్శనం.
ఇక్కడ కొన్ని విషయాలు గమనించాలి. టీడీపీ, జనసేనల సోషల్ మీడియా కార్యకర్తలు అనేక విషయాల్లో చెత్త పోస్టులు పెడుతుంటారు. రాజకీయ ప్రత్యర్థిని ధైర్యంగా ఎదుర్కొనే సత్తా లేని ఆ పార్టీల అధిష్ఠానాలు సోషల్ మీడియాలో జగన్‌పై తప్పుడు ప్రచారం చేయడం కోసం... చాలామంది నిర్వహించే ఖాతాలను (పేజీలను), యూట్యూబ్ చానళ్లను స్పాన్సర్ చేస్తున్నాయి. ఇదంతా ఆర్గనైజ్డ్ క్రెమ్‌లా జరుగుతుందనేది నిజం.
డబ్బులు తీసుకుని తమ పేజీల్లో బెండపూడి విద్యార్థులు, గీతాంజలి అనే మహిళపై దారుణమైన మీమ్స్ చేసి పెట్టారు. నేడు ఓ చిన్నారిని ట్రోల్ చేస్తూ చైల్డ్ అబ్యూజ్‌కు పాల్పడుతున్నారు. వాస్త వానికి సోషల్ మీడియాలోని ఈ స్పాన్సర్డ్ పేజీలు పైకి వేరే ముసుగుల్లో కనిపిస్తాయి. సినిమా రిలీజ్‌లు, సమీక్షలు, నటుల ఫొటోలను పెడుతుంటాయి. నవ్వించే మీమ్స్ పోస్టు చేస్తుంటాయి. దీంతో ఫాలోయర్స్ సంఖ్య అధికంగానే ఉంటుంది. దీని వెనుక ఎత్తుగడ ఏంటంటే... మధ్య మధ్యలో వైఎస్సార్సీపీ, జగన్‌పై దారుణమైన పోస్టులు పెడుతూ జనాన్ని నమ్మించే ప్రయత్నం చేయడమే! ఇప్పటికే అబద్ధపు రాతలతో ఎల్లో పత్రికలు కొన్ని తరాల మెదళ్లను తమ గుప్పెట్లో పెట్టుకున్నాయి. ఇప్పుడు టీడీపీ మరో అడుగు ముందుకేసి సోషల్ మీడియాలో స్పాన్సర్డ్ పేజీల ద్వారా సమాజానికి హానికరమైన వ్యవస్థను నడుపుతోంది.
చదవండి: మీరు చాలా మారాలి సార్!
కూటమి ప్రభుత్వంలోని లోపాలు ప్రజల్లోకి వెళ్లకుండా ఇతర అంశాలను ట్రెండింగ్ లోకి తీసుకొస్తుంటారు. ఈ క్రమంలో ట్రోల్ చేయడమనే విష సంస్కృతికి వారు బీజం వేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన కొత్తలో సోషల్ మీడియాలో చిన్న పిల్లలు, మహిళలపై ఇష్టానుసారంగా పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు. కానీ ఇప్పుడు జగన్‌ను కలిసిన చిన్నారిపై జుగుప్సాకర రీతిలో పోస్టులు పెట్టినవారిపై ఏ చర్యా తీసుకోకుండా మౌనం దాల్చారు. దీన్ని జనం ముమ్మాటికీ హర్షించరు. సమయం వచ్చినప్పుడు సరైన తీర్పు చెబుతారు.
– వెంకట్
Comments
Please login to add a commentAdd a comment