నీ మీద నమ్మకం పోయిందన్నా.. నీ వెంట నడిచే ఓపిక లేదు.. | Fight Between JSP And TDP Activists On Social Media Over Janasena-TDP Seat Sharing - Sakshi
Sakshi News home page

నీ మీద నమ్మకం పోయిందన్నా.. నీ వెంట నడిచే ఓపిక లేదు..

Published Mon, Feb 26 2024 12:56 AM | Last Updated on Mon, Feb 26 2024 12:58 PM

- - Sakshi

తొలి జాబితాతోనే యుద్ధం మొదలైంది.. ఈ యుద్ధం ఎన్నికల క్షేత్రంలో కాదు.. సామాజిక మాధ్యమాల్లో. వైరి శ్రేణుల మధ్య కాదు.. పొత్తు కౌగిల్లో ఉన్న పారీ్టల మధ్య. పొత్తుల మాటున చంద్రబాబుకు అలవాటైన వెన్నుపోటుతో జనసేన నాయకులు, కార్యకర్తలు విలవిల్లాడుతున్నారు. మా నాయకుడ్ని సీఎం కుర్చీపై చూస్తామని అనుకుంటే.. ముష్టి విదిలించినట్లు 24 సీట్లు ఇవ్వడంపై జనసేన కార్యకర్తలు జీర్ణించుకోలేక.. ఈ కూలి బతుకులు మాకొద్దంటూ.. పవన్‌కు గ్లాసుకూ ఒక దండం పెట్టేస్తున్నారు. మీ తొత్తు పారీ్టకి 24 సీట్లే ఎక్కువ మూసుకొని బానిసల్లా ఉండడమేనంటూ టీడీపీ కార్యకర్తలు కవ్వింపు మాటలతో రెచ్చగొడుతున్నారు. పావలా వంతు కూడా సీట్లు దక్కించుకోలేని జనసేన, పొత్తు పేరుతో బానిస పారీ్టలాగానే జనసేనని చూస్తున్న టీడీపీ కార్యకర్తల మధ్య ‘సోషల్‌’ యుద్ధం జరుగుతోంది. 

సాక్షి, విశాఖపట్నం : ‘అన్నా.. ఇన్నాళ్లూ.. నీ మీద నమ్మకంతో జెండా పట్టి కూలీలా పనిచేశాం. రెండు జెండాలు పట్టుకొని తిరుగుదామని పిలుపునిస్తే.. తిరిగాం.. ఇంక మా వల్ల కాదు.. నీ కోసం క్షేత్ర స్థాయిలో మేం రొమ్ము విరుచుకొని పనిచేస్తుంటే.. నువ్వు చంద్రబాబు ఎదుట సాగిలాపడుతూ బాంచన్‌ దొర అన్నట్లుగా తలూపుతుంటే ఇంకా చూస్తూ తట్టుకోవడం మా వల్ల కావడం లేదు.. ఇక సెలవు అన్నా.. పవన్‌ అంటే ప్రాణం.. కానీ.. ఓటు మాత్రం వైఎస్‌ జగన్‌కే వేస్తాం..’ అని ఒకరు. ‘నీ మీద నమ్మకం పోయిందన్నా..  నీ వెంట నడిచే ఓపిక లేదు.. నడిచే ప్రసక్తే లేదు..’ అంటూ మరొక జనసేన కార్యకర్త పవన్‌ని సోషల్‌ మీడియా వేదికగా తూర్పారబడుతున్నారు. 

టీడీపీ, జనసేన సంయుక్తంగా విడుదల చేసిన తొలి జాబితా.. ఆయా పార్టీ శ్రేణుల్లో చిచ్చు రేపుతోంది. టీడీపీ, జనసేన శ్రేణులు ఒకరిపై ఒకరు సొషల్‌ మీడియాలో కత్తులు దూసుకుంటున్నారు. మాటల తూటాలతో యుద్ధం చేసుకుంటున్నారు. 2024లో కచ్చితంగా పవన్‌ని ముఖ్యమంత్రిగా చూస్తామని ఇన్నాళ్లూ కలలు కన్న జనశ్రేణులు.. అవన్నీ పగటి కలలని తేలడంతో.. ఏం చేయాలో పాలుపోని దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయారు. ఒక్కొక్కరుగా.. పారీ్టకి ఇన్నాళ్లూ సేవలు చేసినా.. చివరికి బానిసల్లా పవన్‌ కల్యాణ్‌ మార్చేశారంటూ ఆవేదనతో జనసేనకు గుడ్‌బై చెబుతున్నట్లు సోషల్‌ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

ఇలాంటి పొత్తులతో ఓట్‌ షేరింగ్‌ జరిగే ప్రసక్తే లేదనీ.. రాబోయే ఎన్నికల్లోనూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డే ముఖ్యమంత్రి అవుతారని బల్లగుద్దీ మరీ పోస్టుల్లో చెబుతున్నారు. వీటిని సహించలేని కొందరు జనసేన పార్టీ నాయకులు.. ఎప్పటిలాగానే.. వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారిని కోవర్టులంటూ బూతు పురాణాలు లంఖిస్తున్నారు. దీంతో.. సామాజిక మా«ధ్యమాల్లో జనసేన కార్యకర్తలు, నాయకులు రెండుగా చీలిపోయారు. కొందరు పవన్‌ ఏం చేసినా తప్పదు. ఆయన వెంటే నడుస్తామని నైరాశ్యంతో చెబుతుంటే.. సింహభాగం నాయకులు, కార్యకర్తలు మాత్రం.. చంద్రబాబు, లోకేష్ తోపాటు పవన్‌నీ తిడుతూ.. ఈసారి వైఎస్‌ జగన్‌కే మా ఓటు.. ఆయనే సీఎం అని బాహాటంగానే తమ నిర్ణయాన్ని వ్యక్తం చేసే వర్గంగా విడిపోయారు. 

జనసేనను ఆటాడుకుంటున్న టీడీపీ 
మరోవైపు సీట్ల కేటాయింపుతో నిరాశ  నిస్పృహలకు లోనైన జనసేన కార్యకర్తలు, నాయకులతో టీడీపీ శ్రేణులు ఆటాడుకుంటున్నాయి. పావలా బతుకులకు 24 సీట్లే ఎక్కువనీ.. ఇచ్చిన సీట్లన్నీ గెలిపించుకోగలరా అంటూ సవాల్‌ విసురుతున్నారు. మరికొందరు ఒకడుగు ముందుకెళ్లి.. చంద్రబాబు లేదా లోకేష్‌ సీఎం అవుతారు తప్ప.. పవన్‌కు డిప్యూటీ సీఎం పదవి కూడా ఇచ్చే ప్రసక్తే లేదంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఇంకొందరైతే.. ముందు ఎమ్మెల్యేని చెయ్యండి.. తర్వాత సీఎంని చేసే ఆలోచన దగ్గరకు రండి అంటూ రెచ్చగొట్టే ధోరణితో మాట్లాడుతుండటంతో.. జనసేన సోషల్‌ మీడియా కార్యకర్తలు రగిలిపోతున్నారు. అనవసరంగా చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు మద్దతునిచ్చి పవన్‌ తప్పు చేశారనీ.. లేదంటే.. అచ్చెన్నాయుడు చెప్పినట్లు ఈ సమయానికి పార్టీ లేదు.. బొ–– లేదు అనే మాటే నిజమై ఉండేదని సమాధానమిస్తున్నారు. ఇలా.. రెండు రోజులుగా ట్విటర్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్‌లో టీడీపీ, జనసేన మధ్య సోషల్‌ వార్‌నడుస్తోంది.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement