సోషల్‌ మీడియా చీడ పురుగులు  | Satanism of TDP and Jana Sena social media sections | Sakshi
Sakshi News home page

సోషల్‌ మీడియా చీడ పురుగులు 

Published Thu, Mar 14 2024 4:57 AM | Last Updated on Thu, Mar 14 2024 4:57 AM

Satanism of TDP and Jana Sena social media sections - Sakshi

టీడీపీ, జనసేన సోషల్‌ మీడియా విభాగాల పైశాచికత్వం 

అందుకోసం ప్రత్యేకంగా విభాగాలు.. వేలాది ఫేక్‌ ఖాతాలు 

మహిళలు, విద్యార్థులు, సామాన్యులే లక్ష్యం.. 

ప్రభుత్వ పథకాల లబ్దిదారుల గొంతు నొక్కే కుట్ర 

సాక్షి, అమరావతి:పేదింటి పిల్లలు ప్రభుత్వ బడుల్లో చదువుకుని ఇంగ్లిష్‌లో గలగలా మాట్లాడితే వారికి కడుపు మంట..వారిపై సోషల్‌ మీడియాలో హేళనలు... వేధింపులు ప్రభుత్వ బడిలో చదువుకుని ప్రతిభా పాటవాలతో అమెరికా వెళ్లి ఐక్యరాజ్యసమితిలో ప్రసంగిస్తే చాలు... సోషల్‌ మీడియాలో ఈసడింపులు... చీత్కారాలు.. ప్రభుత్వం తనకు ఇల్లు ఇచ్చిందని పేద మహిళ సంతోషం వ్యక్తం చేస్తే చాలు... సోషల్‌ మీడియాలో దూషణలు, దుర్భాషలు.. పేదలు, సామాన్యులు హాయిగా నవ్వితే ఓర్చుకోలేరు... సంతోషంగా ఉంటే తట్టుకోలేరు... జీవితంలో ఒక మెట్టు పైకి ఎక్కితే సహించలేరు.

దూషణలతో వేధిస్తూ.. పరుష పదజాలంతో దూషిస్తున్నారు. చివరికి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. ఎలాంటి తప్పు చేయకపోయినా అవమానభారంతో నలుగురులోకి రాలేని పరిస్థితి తీసుకువస్తారు. తాజాగా తెనాలికి చెందిన గీతాంజలి ఉదంతమే అందుకు తార్కాణం. రాష్ట్రంలో దాదాపు ఐదేళ్లుగా టీడీపీ, జనసేనలు సాగిస్తున్న వికృత క్రీడ ఇది. మహిళలు, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని సోషల్‌ మీడియా వేదికలపై ట్రోలింగ్‌తో పైశాచికత్వం ప్రదర్శిస్తున్నా­రు. అందుకోసం టీడీపీ, జనసేన పార్టీలు ఏకంగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేసి మరీ సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌కు పాల్పడుతుండటం ఆ రెండు పార్టీల దుర్మార్గ రాజకీయాలకు పరాకాష్ట..

ఓటమిని జీర్ణించుకోలేక దిగజారుడు రాజకీయాలు
2019 ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ ఘోరపరాజయంతో చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు బరితెగించారు. సాధారణ  మహిళలు, విద్యార్థులు, సామాన్యుల్ని లక్ష్యంగా చేసుకుని దుర్మార్గ రాజకీయాలకు తెరతీశారు. సోషల్‌ మీడియా ద్వారా అసభ్య కామెంట్లతో దాడులు చేయమని తమ పార్టీ సోషల్‌ మీడియా విభాగాలకు ఆదేశించారు. అందుకు పవన్‌ కళ్యాణ్‌ కూడా తోడయ్యారు. టీడీపీ, జనసేన పార్టీలు పక్కా పన్నాగంతో సోషల్‌ మీడియా వేదికగా కుట్రకు తెరతీశాయి.

హైదరాబాద్‌లో ప్రత్యేకంగా కార్యాలయాలను ఏర్పాటు చేసి వందలాది మందిని తమ సోషల్‌ మీడియా విభాగాల్లో నియమించాయి. వేలాది ఫేక్‌ అకౌంట్లు సృష్టించి వాటి ద్వారా సామాన్యులను వేధించడం మొదలుపెట్టాయి. టీడీపీ సీనియర్‌ నేతలు అయ్యన్న పాత్రుడు, బండారు సత్యనారాయణ మూర్తిలు కూడా సోషల్‌ మీడియా ద్వారా సామాన్యులను వేధించడం విభ్రాంతి కలిగిస్తోంది. ఆ రెండు పార్టీల సోషల్‌ మీడియా విభాగాలకు చెందిన వందలాది మంది ట్రోలింగ్‌ పిశాచాలుగా మారి సామాన్యులను వేధింపులకు గురిచేశారు. 

లబ్ధిదారులే లక్ష్యం
పేదలందరికీ ఇళ్లు, వైఎస్సార్‌ ఆసరా, వాహన­మిత్ర, చేయూత, తోడు, చేదోడు, సున్నావడ్డీ, రైతు భరోసా తదితర పథకాల లబ్ధిదారులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తే చాలు వారిని వ్యక్తిగతంగా దూషిస్తూ విరుచుకుపడు­తున్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు తమ సంతోషాన్ని వ్యక్తం చేయకుండా కట్టడిచేయాలన్నదే టీడీపీ, జనసేన పార్టీల కుట్ర. 

న్యాయ వ్యవస్థపైనా ట్రోలింగే
టీడీపీ, జనసేన పార్టీలు చివరికి న్యాయ వ్యవస్థను కూడా విడిచిపెట్టకపోవడం పరాకాష్ట. స్కిల్‌ డెవలప్‌­మెంట్‌ కుంభకోనం కేసులో అరెస్టయిన చంద్ర­బాబుకు జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించిన విజయవాడ ఏసీబీ న్యాయస్థానం న్యాయమూర్తిని కించపరుస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. హైకోర్టు ఆదేశాలతో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. న్యాయమూర్తి లక్ష్యంగా పోస్టులు పెట్టిన టీడీపీ సోషల్‌ మీడియా రాష్ట్ర కార్యని­ర్వాహక కార్యదర్శి ముల్లా ఖాజా హుస్సే­న్‌ను గతేడాది నవంబర్‌ 27న పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

పోలీసులు, సీఐడీ కఠిన చర్యలు
సామాన్యులను లక్ష్యంగా చేసుకుని సోషల్‌ మీడియాలో వేధింపులపై పోలీసు శాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. అసభ్యకర, రెచ్చగొట్టే పోస్టింగులు పెడుతున్నవారిరి ఐపీ అడ్రస్‌లతో గుర్తించి కేసులు నమోదు చేస్తోంది. సైబర్‌ బుల్లీషీట్లను తెరచి దర్యాప్తు ముమ్మరం చేస్తోంది. ఈ నాలుగున్నరేళ్లలో సీఐడీ 2,919 సైబర్‌ బుల్లీషీట్లను నమోదు చేసింది. సోషల్‌ మీడియా వేధింపులకు భయపడకుండా ఫిర్యాదు చేయాలని సీఐడీ విభాగం కోరుతోంది. 

సామాన్యుల గొంతు నొక్కే కుట్ర
ప్రతిపక్షాలు అధికార పార్టీని విమర్శించవచ్చు... పథకాల్లో లోపాలను ప్రశ్నించవచ్చు. అందుకు విరుద్ధంగా పథకాలు, కార్యక్రమాల లబ్ధిదారులను లక్ష్యంగా చేసుకుని వారిని వ్యక్తిగతంగా వేధించేందుకు బరితెగించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌  మీడియం విధానంపై ప్రశంసలు వ్యక్తమవడం ప్రతిపక్ష పార్టీలకు నచ్చలేదు.

కాకినాడ జిల్లా బెండపూడి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఇంగ్లిష్‌లో అనర్గళంగా ప్రసంగించడంతో ఓర్వలేక వారిని లక్ష్యంగా చేసుకుని టీడీపీ, జనసేన నేతలు, సోషల్‌మీడియా విభాగాలు వేధింపులకు పాల్పడ్డాయి. అమెరికాలోని ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులనూ అదే రీతిలో వేధించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయ­డమే ఆ రెండు పార్టీల లక్ష్యం. ఇంగ్లీష్‌ మీడియం చదువుల గురించి మాట్లాడకుండా చేయాలన్నదే కుతంత్రం. 

వేధిస్తే కఠిన శిక్షలు
ఆన్‌లైన్‌ వేధింపులు, సోషల్‌ మీడియా ట్రోలింగ్‌కు పాల్పడేవారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారు.

67 ఐటీ చట్టం: ఆన్‌లైన్‌ వేధింపులు, సోషల్‌ మీడియా ట్రోలింగ్‌లకు పాల్పడితే ఈ సెక్షన్‌ కింద గరిష్టంగా ఐదేళ్ల వరకు జైలు శిక్షతోపాటు జరిమానా 

ఐపీసీ 354:  ఉద్దేశపూర్వకంగా ఓ మహిళను లక్ష్యంగా చేసుకుని వేధిస్తే ఈ సెక్షన్‌ ప్రకారం కేసు నమోదు చేస్తారు. మహిళను నేరుగా గానీ ఆన్‌లైన్, సోషల్‌ మీడియా వేదికల ద్వారా అదే పనిగా సంప్రదించడం, వెంటపడటం, దూషించడం, అవమానించడం, వేధించడం తీవ్రమైన నేరాలు.. అందుకు గరిష్టంగా ఐదేళ్ల జైలు శిక్షతోపాటు జరిమానా 

ఐపీసీ 509: ఉద్దేశపూర్వకంగా ఓ మహిళను తమ మాటలు, చేతలు, సైగల ద్వారా అవమానించడం, ఆమె గౌరవానికి భంగం కలిగించడం తీవ్రమైన నేరం. గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్షతోపాటు జరిమానా 
 
ఐపీసీ 306: ఒకర్ని వేధించి ఆత్మహత్యకు పాల్పడేలా చేయడం. బాధ్యులకు గరిష్టంగా పదేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా 

ఐపీసీ 120ఎ: ఇద్దరు గానీ అంతకంటే ఎక్కువ మంది ఉద్దేశపూర్వకంగా ఒకరిని నేరుగా లేదా ఆన్‌లైన్, సోషల్‌ మీడియా వేదికల ద్వారా వేధించడం తీవ్రమైన నేరం.

ఐపీసీ 504: ఉద్దేశ పూర్వకంగా గౌరవానికి భంగం కలిగించడం తీవ్రమైన నేరం. రెండేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా 

ఫిర్యాదు ఇలా...సైబర్‌ క్రైమ్‌ పోర్టల్‌: 
https:// cybercrime. gov. in/
సైబర్‌ మిత్ర వాట్సాప్‌ నంబర్‌: 9121211100
సైబర్‌ బుల్లీయింగ్‌ 4ఎస్‌4యు: 9071666667

ఇంగ్లిషులో మాట్లాడితే ఓర్వలేక..
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడ జిల్లా తొండంగి మండలం బెండపూడి జెడ్పీ పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘లాంగ్వేజ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రోగ్రాం’ (ఎల్‌ఐపీ), ‘ లెర్న్‌ ఏ వర్డ్‌ ఏ డే’ వంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులు ఆంగ్ల భాషను అనర్గళంగా మాట్లాడే స్థాయికి వచ్చారు. ఇంగ్లిష్‌ ఉపాధ్యాయుడు అమెరికన్‌ యాక్సెంట్‌లో మాట్లాడడం నేర్పించారు.

అమెరికాలోని అట్లాంటా, జార్జియా ప్రాంతాల్లో ఉన్న పిల్లలు, వారి స్నేహితులతో ఆన్‌లైన్‌లో విద్యార్ధులతో డిబేట్‌ నిర్వహించారు. తోలెం మేఘన, తేజస్విని వంటి విద్యార్థినులు మెరికల్లా రాణించారు. అమెరికన్‌ యాసలో అనర్గళంగా మాట్లాడుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. ఇవి టీడీపీ నేతలకు కంటగింపుగా మారాయి. ఆ విద్యార్థినులకు వ్యతిరేకంగా ట్రోల్‌ చేయించారు.

ఆ విద్యార్థినులు టెన్త్‌లో ఫెయిల్‌ అయ్యారంటూ టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు నోరుపారేసుకున్నారు. ఆ విద్యార్థిని టెన్త్‌లో 478 మార్కులతో పాసైంది. ఆ విద్యార్థిని తల్లి తొండంగి పోలీసులకు 2022 జూన్‌లో ఫిర్యాదు చేయడంతో అప్పట్లో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు కూడా నమోదు చేశారు. మేఘనపై అసభ్యకర పదజాలంతో ట్రోలింగ్‌ చేశారు. ఆమె తల్లి తొండంగి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఐపీసీ సెక్షన్‌ 509, ఐటీ యాక్ట్‌ 2020 సెక్షన్‌ 67 కింద ట్రోలర్స్‌పై అప్పటి ఎస్సై రవికుమార్‌ కేసు నమోదు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement