బలి తీసుకుంటున్న సామాజిక మాధ్యమాల వేధింపులు
ఒక్కో సందర్భం...ఒక్కో తరహా
సాక్షి, హైదరాబాద్ : సోషల్ మీడియా ట్రోలింగ్ ప్రాణాల మీదకు తెస్తోంది. ఒక్కో సందర్భంలో..ఒక్కో తరహా వేధింపులు తప్పడం లేదు. ఇందులో మహిళలే ఎక్కువగా బాధితులుగా ఉంటున్నారు. తాజాగా గీతాంజలి ఆత్మహత్యే ఇందుకు నిదర్శనం. ట్రోల్ చేసి పైశాచిక ఆనందం పొందేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.
వర్చువల్‌లైఫ్ వేరు.. నిజజీవితం వేరు అని గుర్తించాలి
సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వాలని, గుర్తింపు పొందాలని ఈ మధ్య కాలంలో ఎక్కువగా రీల్స్, షార్ట్ వీడియోలు చేస్తున్నారు. అయితే, ఇలాంటి వీడియోలతో ప్రచారం ఎంత పొందుతారో, కొన్నిసార్లు ట్రోలింగ్‌కు గురవడం సహజమే అని గుర్తించాలి. పొగడ్తలకు పొంగిపోవడం కాదు..విమర్శలు వచ్చినప్పుడు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని మానసిక నిపుణులు చెబుతున్నారు.
వీటన్నింటికీ విరుగుడు సోషల్ మీడియాకు దూరంగా ఉండడమే అని వారు పేర్కొంటున్నారు. వ్యక్తిగతంగాను, కొన్నిసార్లు పార్టీలపరంగా టార్గెట్ చేసి ఇలాంటి తప్పుడు విమర్శలు, కామెంట్లు చేస్తున్నారన్నది మరవొద్దని వారు సూచిస్తున్నారు. ఫేక్ కంటెంట్ రాసినంత మాత్రాన మన చుట్టూ ఉండేవారి దగ్గర మనం తక్కువకాము అన్నది గుర్తించాలంటున్నారు.
కొన్ని రకాల ‘సోషల్’ వేధింపులు ఇలా....
సైబర్ బుల్లీయింగ్: ఈ తరహా సోషల్ మీడియా వేధింపులు యువతలో ఎక్కువగా ఉంటున్నాయి. అమ్మాయిలు, ఉద్యోగాలు చేస్తున్న మహిళలు సైబర్ బుల్లీయింగ్ తరహా వేధింపులు ఎక్కువగా ఎదుర్కొంటున్నారు.
ట్రోలింగ్: రాజకీయాల్లో ఉండేవారికి ఇవి తప్పడం లేదు. ప్రధానమంత్రి మొదలు అన్ని స్థాయిల్లోని రాజకీయనేతలు వీటి బారిన పడుతున్నారు. సినీతారలు, ప్రముఖ క్రీడాకారులు, ఇతర సెలబ్రెటీలకు సైతం ఇవి తలనొప్పిగా మారాయి.
స్వాటింగ్: తప్పుడు మెసేజ్‌ల ద్వారా దర్యాప్తు సంస్థల పేరు చెప్పి బెదిరింపులకు గురి చేయడం. ఇది ఎక్కువగా యూఎస్, యూకేలో ఉంది. ఇది కూడా ఒక తరహా సైబర్ వేధింపులే. మన దగ్గర ఈ తరహా సైబర్ వేధింపులు ఎక్కువగా లోన్‌యాప్స్ మోసాల్లో చూస్తున్నాం. మేం చెప్పినంత డబ్బు చెల్లించకపోతే మిమ్మల్ని పోలీసులకు అప్పగిస్తాం..మా ఏజెంట్ మీ ఇంటికి వచ్చి పరువు తీస్తాడు..అంటూ బెదిరింపులకు దిగి ఆత్మహత్యలు చేసుకునేలా ఒత్తిడి చేస్తున్నారు.
రివేంజ్ పోర్న్: స్నేహితులుగా లేదా ప్రేమికులుగా ఒక రిలేషన్లో ఉన్నప్పుడు సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలను వారి రిలేషన్‌షిప్ బ్రేక్ అయిన తర్వాత బెదిరింపుల కోసం వాడడమే రివేంజ్ పోర్న్. మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలు తయారు చేసి సోషల్ మీడియాలో పెడతామని అమ్మాయిలను వేధించడం, మానసికంగా కుంగదీయడం దీని కిందకే వస్తుంది.
ఈ జాగ్రత్తలు మరవొద్దు
♦ సోషల్ మీడియాలో అవసరానికి మించి మన వ్యక్తిగత సమాచారం, ఫొటోలు, వీడియోలు షేర్ చేయకపోవడమే బెటర్.
♦ ఏ తరహా సోషల్ మీడియా వేధింపులకు గురవుతున్నామన్నది ముందుగా గుర్తించాలి. వాటికి సంబంధించి స్క్రీన్‌షాట్‌లు తీసి పెట్టుకోవాలి. ఇవి భవిష్యత్‌లో ఆధారంగా పనికొస్తాయి.
♦వేధింపులు ఉన్నట్టు గమనిస్తే, సోషల్ మీడియా ఖాతాలకు దూరంగా ఉండటమే ఉత్తమం. వర్చువల్ ప్రపంచంలో ఎక్కడో కూర్చున్న అజ్ఞాత వ్యక్తులు చేసే కామెంట్లు పట్టించుకోవొద్దు.
♦ఎవరైనా మన సోషల్ మీడియా ఖాతాల్లోని గ్రూపులలో అభ్యంతరకర మెసేజ్‌లు పెడితే, వాటిని వెంటనే డిలీట్ చేయాలి. వాటిని ఫేస్బుక్, ఎక్స్, ఇన్‌స్ట్రాగామ్‌లో రిపోర్ట్ చేసే ఆప్షన్ ఉంటుంది. వాటిని వినియోగించుకోవాలి.
♦వేధింపులు మితిమీరితే 1930 నంబర్‌కు డయల్ చేసి సైబర్ క్రైం సెల్‌లో ఫిర్యాదు చేయాలి. ఠీఠీఠీ. ఛిyb్ఛటఛిటజీఝ్ఛ. జౌఠి. జీn పోర్టల్ ఫిర్యాదు చేస్తే పోలీసులు చర్యలు తీసుకుంటారు.
ఫిర్యాదు చేయడం ఉత్తమం
సోషల్ మీడియా అనేది ప్రతి ఒక్కరి జీవితాల్లో ఓ భాగమైంది. విమర్శలు, వ్యక్తిగత దూషణలు వచ్చినప్పుడు మానసిక స్థైర్యం కోల్పోవద్దు. వెంటనే పోలీసులను సంప్రదించాలి. – డా.ప్రసాద్ పాటిబండ్ల, సైబర్ ఇంటెలిజెన్స్ నిపుణుడు, న్యూఢిల్లీ
Comments
Please login to add a commentAdd a comment