
సోషల్‌మీడియా ద్వారా నగర వాసికి పరిచయం
త్వరలో పెళ్లి చేసుకుందామంటూ ప్రతిపాదన...
తన తల్లి ఆరోగ్యం దెబ్బతిన్నట్లు పలు సందేశాలు
వైద్య ఖర్చుల పేరుతో రూ.21.73 లక్షలు స్వాహా
సీసీఎస్‌లో కేసు నమోదు
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో సుదీర్ఘకాలం తర్వాత మాట్రిమోనియల్ ఫ్రాడ్ చోటు చేసుకుంది. సోషల్‌మీడియాలోని మాట్రిమోనియల్ గ్రూప్ ద్వారా పాకిస్థాన్‌కు చెందిన నటి ఫాతిమా ఎఫెండీగా పరిచయమైన సైబర్ నేరగాళ్లు పెళ్లి ప్రస్తావన తెచ్చారు. ఆపై తల్లికి అనారోగ్యం, వైద్య ఖర్చుల పేరు చెప్పి రూ.21.73 లక్షలు కాజేశారు. దీనిపై మంగళవారం కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బహదూర్‌పురా ప్రాంతానికి చెందిన యువకుడు (29) ఓ సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఉన్న మాట్రిమోనియల్ గ్రూపులో సభ్యుడిగా ఉన్నాడు.
అతడికి 2023 మార్చిలో ఆ గ్రూపు ద్వారానే పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ నటి ఫాతిమా ఎఫెండీ పేరుతో సైబర్ నేరగాడు పరిచయం అయ్యాడు. తన ఖాతాలకు డీపీగా సదరు నటి ఫొటోను పెట్టుకోవడంతో అతను పూర్తిగా నమ్మేశాడు. కొన్నాళ్లు చాటింగ్ చేసిన తర్వాత ప్రేమ, పెళ్లి అంటూ అసలు కథ మొదలుపెట్టాడు. ఓ దశలో నగర యువకుడిని పూర్తిగా నమ్మించడానికి ఫాతిమా సోదరి అనీసా ఎం.హుండేకర్ పేరుతోనూ చాటింగ్ చేశాడు. ఈ సందర్భలోనూ తన సోదరిని మీకు ఇచ్చి వివాహం చేయడానికి అభ్యంతరం లేదంటూ పదేపదే ప్రస్తావించి పూర్తిగా ఉచ్చులోకి దింపారు. ఇలా కొంతకాలం చాటింగ్స్ చేసిన తర్వాత ఫాతిమాగా చెప్పుకున్న సైబర్ నేరగాడు తన తల్లి ఆరోగ్యం దెబ్బతిందని, ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని చెప్పాడు.
దానికి ఆధారంగా అంటూ కొన్ని నకిలీ పత్రాలనూ వాట్సాప్ ద్వారా షేర్ చేశాడు. వైద్యం కోసం భారీగా ఖర్చు అవుతోందని నమ్మబలికాడు. పాకిస్థాన్‌లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం తన వద్ద నగదు అందుబాటులో లేదని సందేశం ఇచ్చాడు. వైద్య ఖర్చుల కోసం సాయం చేస్తే... కొంత తక్షణం, మరికొంత కొన్నాళ్లకు స్థిరాస్తులు విక్రయించి తిరిగి ఇచ్చేస్తానని చెప్పాడు. అవసరమైతే వడ్డీతో సహా చెల్లిస్తానని నమ్మబలికాడు. అతడిని పూర్తిగా నమ్మించడం కోసం తొలుత చిన్న మొత్తాలు బదిలీ చేయించుకుని, వాటిని కొన్ని రోజులకు తిరిగి చెల్లించేశాడు.
తాను సంప్రదింపులు జరుపుతోంది, లావాదేవీలు చేస్తోంది పాకిస్థాన్‌కు చెందిన నటి ఫాతిమా ఎఫెండీతోనే అని నగర యువకుడు పూర్తిగా నమ్మేశాడు. దీంతో సైబర్ నేరగాళ్లు కోరినప్పుడల్లా నగదు బదిలీ చేస్తూ వెళ్లాడు. ఇలా దఫదఫాలుగా రూ.21,73,912 చెల్లించాడు. ఆ తర్వాత ఫాతిమాగా చెప్పుకున్న సైబర్ నేరగాడు యువకుడికి సంబంధించిన అన్ని సోషల్‌మీడియా హ్యాండిల్స్, ఫోన్ నెంబర్‌ను బ్లాక్ చేసేశాడు. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు మంగళవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. నిందితుల ఫోన్ నెంబర్లు, సోషల్‌మీడియా ఖాతాలతో పాటు డబ్బు బదిలీ చేసిన బ్యాంకు అకౌంట్ల ఆ«ధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.