టీడీపీ, జనసేన సోషల్ మీడియా మూకల బరితెగింపు
గీతాంజలి వ్యవహారంలో మరింత నీచానికి దిగజారిన పచ్చమూకలు
కేసుల భయంతో ఆమెపై పెట్టిన దారుణమైన వ్యాఖ్యలు తొలగింపు
ఆత్మహత్య సమయంలో ఎవరో తీసిన వీడియోను ఎడిట్ చేసిన టీడీపీ
అందులో ఆమె కేరక్టర్‌ను అవమానించేలా కొన్ని వ్యాఖ్యలు జోడింపు
‘ఎవరో ఇద్దరు తోసేశారట’, ‘ఎవరా ఇద్దరు’ అనే మాటలతో ఎడిట్
వాటినే పట్టుకుని ‘తోసేసింది ఎవరు’ అంటూ చెలరేగిపోయిన ముఠాలు
దాన్నే ‘వైసీపీ హత్యారాజకీయాలు’ అంటూ ట్వీట్ చేసిన నారా లోకేశ్
టీడీపీ దిగజారుడుతనంపై నివ్వెరపోయిన జాతీయ మీడియా
గీతాంజలి కుటుంబానికి రాష్ట్ర వ్యాప్తంగా సంఘీభావం.. ర్యాలీలు
ఆమె పిల్లలిద్దరికీ తలా రూ.10 లక్షల చొప్పున సాయం ప్రకటించిన సీఎం వైఎస్ జగన్
ఆడపిల్లల గౌరవానికి భంగం కలిగిస్తే కఠినంగా వ్యవహరిస్తామని వ్యాఖ్యలు
సోషల్ మీడియా వేధింపులు భరించలేకే ఆత్మహత్య: గీతాంజలి భర్త
ఆమె కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్సార్‌సీపీ నేతలు
కేసు నమోదు చేశాం... కారకులపై కఠినంగా వ్యవహరిస్తాం: ఎస్పీ
మధ్య తరగతి కుటుంబం.. ఎంతో విలువలతో కూడిన జీవితం. అత్తమామల మెప్పు పొందింది. పిల్లల అభిమానాన్ని... భర్త అనురాగాన్ని చూరగొంది. ప్రభుత్వం చేసిన సాయానికి పొంగిపోయింది. ఓ సాధారణ మహిళగా తన ఆనందాన్ని అందరితోనూ పంచుకుంది. అదే ఆమె పాలిట శాపమైంది. పచ్చ రాబందుల దుష్ట పన్నాగానికి బలైపోయింది. సోషల్ మీడియా వేదికగా చేసిన నీచాతినీచమైన వ్యాఖ్యలకు తల్లడిల్లిపోయింది. ఆమె ఆనందం ఎంతోసేపు నిలవనివ్వని సోషల్ మాఫియా వేధింపులకు మానసికంగా కలత చెందింది. నలుగురికి తన బాధను చెప్పుకోలేక రైలుకింద పడి ప్రాణం తీసుకుంది. ఇదీ తెనాలికి చెందిన బీసీ(విశ్వబ్రాహ్మణ) మహిళ గొల్తి గీతాంజలిది. ఇప్పుడు ఆమె చావుపైనా ఆ ‘పచ్చ’మూక తప్పుడు ప్రచారానికి పాల్పడుతోంది. ఆ సంఘటనకు తమకేమాత్రం బాధ్యతలేదని తప్పించుకోజూస్తోంది. కానీ పోలీసు యంత్రాంగం రంగంలోకి దిగి వాస్తవాలు వెలికి తీస్తోంది. ఆ నీచుల భరతం పట్టేందుకు సమాయత్తమవుతోంది.
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశ పెట్టిన పథకాలు తెనాలికి చెందిన గొల్తి గీతాంజలి కుటుంబానికి చాలావరకూ వర్తించాయి. ఇటీవలే తనకు ఇంటి స్థలం ఇచ్చారని.. తనకు ఎంతో సంతోషంగా ఉందని, అమ్మఒడి, పింఛన్, వైఎస్సార్ చేయూత వంటి మరెన్నో పథకాలు వచ్చాయని ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె సోషల్ మీడియాతో ఎంతో అమాయకంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పింది. సహజంగానే పచ్చనేతలకు ఆమె చెప్పిన విషయాలు రుచించలేదు. ఆమెపై టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన సోషల్ మీడియా ప్రతినిధులు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయటం ప్రారంభించారు.
ఆ ట్రోలింగ్‌లు చూసి గీతాంజలి తట్టుకోలేకపోయింది. ఆమె భర్తను దుర్భాషలాడుతూ, అమె వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పెట్టిన పోస్టింగులు చూసి విలవిలలాడి పోయింది. అవమానంతో కుంగిపోయింది. కనీసం ఇంట్లో వారితో కూడా తన బాధను పంచుకోలేక రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. ఇది కచ్చితంగా ఆత్మహత్యకాదు... సోషల్ మీడియా చేసిన హత్యేనని కుటుంబ సభ్యులు స్పష్టం చేస్తున్నారు. తమకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని గీతాంజలి భర్త బాలచంద్ర తెలిపారు. అన్యాయంగా తన భార్యను బలి తీసుకున్నారని కన్నీటిపర్యంతమయ్యారు.
రెచ్చిపోతున్న పచ్చ సోషల్ మూక
సోషల్ మీడియాలో వచ్చే అసభ్యకరమైన పోస్టింగ్‌లపై కేవలం సెక్షన్ 41 నోటీసులు ఇచ్చి వదిలిపెట్టాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో సోషల్ మీడియాలో ఐటీడీపీ, జనసేన సోషల్‌మీడియా రెచ్చిపోతోంది. వారి దాష్టీకంవల్లే ఆ నిండుప్రాణం బలైపోయింది. ఈ దుర్ఘటన యావత్ రాష్ట్రాన్ని కదిలించింది. పచ్చబ్యాచ్ దుర్మార్గాలపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, కొవ్వొత్తుల ప్రదర్శనలు జరిగాయి. ఆమె కుటుంబానికి పలువురు అండగా నిలిచారు. జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. గీతాంజలి కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
ఆడపిల్లల గౌరవ ప్రతిష్టలకు, మర్యాదలకు భంగం కలిగించే ఏ ఒక్కరినీ కూడా చట్టం వదిలిపెట్టబోమని ప్రకటించారు. వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కన్వీనర్ సజ్జల భార్గవ, మహిళా కమిషన్ మాజీ చైర్మన్ వాసిరెడ్డి పద్మ మంగళవారం డీజీపీ రవీంద్రనాథ్‌రెడ్డిని కలిసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. గీతాంజలి కుటుంబ సభ్యులను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎంపీ నందిగం సురేష్, వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కన్వీనర్ సజ్జల భార్గవ, ఎమ్మెల్సీ పోతుల సునీత, పార్టీ నేతలు వరుదు కళ్యాణి, వాసిరెడ్డి పద్మ, తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, మహిళా కమిషన్ సభ్యురాలు వెంకటలక్ష్మి తదితరులు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇది సోషల్‌మీడియా టెర్రరిజమని, దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
విచారణ ముమ్మరం
గీతాంజలి ఆత్మహత్యకు పురిగొల్పినవారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. సోషల్‌మీడియాలో ఆమెపై అసభ్యంగా ట్రోలింగ్ చేసిన 26 మందిని గుర్తించారు. ప్రైవేటు వ్యక్తులే కాకుండా పార్టీల అఫీషియల్ హ్యాండిల్స్ నుంచి కూడా ఘోరంగా ట్రోల్స్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ ఘటనపై కనీసం విచారం వ్యక్తం చేయని తెలుగుదేశం నేతలు... మరింత బరితెగించి ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించింది ఏడోతేదీ కాగా, ట్రోలింగ్ ఎనిమిది నుంచి మొదలైందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి ఆమె వీడియో వైరల్ అయిన ఆరో తేదీనే అజయ్‌చౌదరి సజ్జా, స్వాతీరెడ్డి మరికొందరు నీచాతినీచంగా ట్రోల్ చేశారు. ఒక్కరోజులోనే వందల సంఖ్యలో ట్రోల్స్ వచ్చాయి. ఆమె చనిపోయిందని తెలిసిన వెంటనే ఆ పోస్టులన్నీ డిలీట్ చేశారు. అయితే అప్పటికే పోలీసులు ఈ పోస్టులను సేకరించారు.
రూ.20 లక్షల సాయం ప్రకటించిన సీఎం జగన్
గీతాంజలి ఆత్మహత్య ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. మృతురాలి కుటుంబాన్ని ఆదుకోవడానికి అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ఆమె కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. ఆడపిల్లల గౌరవ ప్రతిష్టలకు, మర్యాదలకు భంగం కలిగించే ఏ ఒక్కరినీ కూడా చట్టం వదిలి పెట్టదని హెచ్చరించారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల కారణంగా తన కుటుంబానికి ఎంతో మేలు జరిగిందంటూ గీతాంజలి ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూపై ప్రతిపక్షాలకు చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు అనుచిత వ్యాఖ్యలు పోస్టు చేయడంతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందంటూ కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలువురు నేతలు ఈ ఘటనపై తీవ్రంగా స్పందిస్తూ వేర్వేరు ప్రాంతాల్లో మీడియాతో మాట్లాడారు.
సెన్సేషనల్ అంటూ ఫేక్ వీడియో
టీడీపీ, జనసైనికుల సోషల్‌మీడియా ట్రోలింగ్‌లకు బలైన గీతాంజలి విషయంలో తెలుగుదేశం పార్టీ మరోసారి తప్పుడు ప్రచారానికి సిద్ధం అయ్యింది. సెన్సేషనల్ అంటూ ఒక వీడియోను విడుదల చేసింది. అందులో గీతాంజలి ఆత్మహత్యాయత్నం చేసుకున్న సమయంలో లోకో పైలెట్ ఆమెను రైలులోనే రైల్వే స్టేషన్‌కు తీసుకువచ్చిన దృశ్యాన్ని చూపిస్తూ ఆమెను ఎవరో ఇద్దరు తోసేశారంటగా మావా.. అంటూ ఇద్దరు మాట్లాడుకుంటున్నట్లు వాయిస్ ఓవర్‌తో ఒక వీడియో విడుదల చేశారు.
ఇంటి పట్టా వచ్చినందుకు ఆనందంగా మీడియాతో మాట్లాడినందుకే ట్రోల్ చేసిన తెలుగుదేశం సోషల్‌మీడియా ఇప్పుడు ఈ వ్యవహారం తమ మెడకు చుట్టుకుంటుండటంతో దాని నుంచి బయటపడేందుకు గీతాంజలి క్యారెక్టర్‌ను తప్పుగా చూపించేలా ప్రచారం మొదలుపెట్టింది. ఆమె ఎవరో ఇద్దరితో రైల్వే స్టేషన్‌కు వచ్చినట్లు, వారు ఆమెను రైలు కిందకి తోసేసి పారిపోయారన్నట్లుగా వాయిస్ ఓవర్‌తో ప్రచారం చేస్తోంది. ఆ వీడియో గమనించిన ఎవరికైనా అది ఎడిటింగ్ వీడియో అని స్పష్టంగా అర్థం అవుతోంది. ఈ వ్యవహారం తమ దృష్టికి కూడా వచ్చిందని, ఈ వీడియోపై కూడా విచారణ జరుపుతామని పోలీసులు స్పష్టం చేశారు
బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు
గీతాంజలిని ట్రోల్ చేసి ఆమెను ఆత్మహత్యకు పురికొల్పిన వారిపై కఠిన చర్యలు తప్పవు. ఇప్పటికే బాధ్యులను గుర్తించాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ఓవర్‌యాక్షన్ చేసి కొంత మందిని ఇబ్బంది పెట్టిన వారిపై 6,970 సోషల్‌మీడియా బుల్లీయింగ్ షీట్‌లు నమోదు చేశాం. సుమారు 7వేల మందిని అరెస్ట్ చేశాం. సైబర్ క్రైమ్‌కు సంబంధించి 2023 సంవత్సరంలో ఆయా అకౌంట్‌దారులపై 327 కేసులు నమోదు చేశాం.
హైకోర్టు జడ్జిని దూషించిన కేసులో 53 మందిపై కేసులు నమోదు చేశాం. దిశ చట్టంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా సైబర్, సోషల్ మీడియా అంశాలకు సంబంధించి ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసింది. కాగ్నిజబుల్, నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసేలా పొందుపరిచి బిల్లు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపింది.
– పాలరాజ్, ఐజీ, గుంటూరు రేంజ్
Comments
Please login to add a commentAdd a comment