గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఫెయిలయ్యిందని, వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై విపరీతమైన దాడులు జరుగుతున్నాయని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఇక్కడితోనే ఆగకుండా.. చంద్రబాబు తప్పు మీద తప్పు చేస్తున్నారని, టీడీపీ అనుకూల ప్లాట్‌ఫారంలలో వైఎస్ జగన్‌పై పరుషపదజాలంతో పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు.
‘‘చంద్రబాబు.. పోలీస్ యంత్రాంగాన్ని ప్రజలపైకి ఉసిగొల్పుతున్నారు. చెప్పినట్లు వినకపోతే ట్రాన్స్‌ఫర్లు చేస్తామని బెదిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. భయపెట్టాలని చూస్తున్నారు. అనుకూల మీడియా పత్రికల్లో వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా సెల్‌పై విషం చిమ్ముతున్నారు. అత్యాచారాలు, హత్యలు, దాడులు.. ఇలా రాష్ట్రంలో ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి. వాటన్నింటి నుంచి డైవర్ట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.
చంద్రబాబు చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. వైఎస్ జగన్‌ను ఉద్దేశించి అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు చూస్తే.. సైకో ఎవరనేది ఎవరికైనా అర్థమవుతుంది. (ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్, టీవీ5ల్లో తలాతోకా లేకుండా రాసిన కథనాలను అంబటి మీడియాకు చూపించారు). అభ్యంతరకరంగా ఉన్న హెడ్‌లైన్స్‌తో వచ్చిన వాటిని అంబటి చూపించారు. ఇదేనా భావ స్వేచ్ఛా ప్రకటనా? అని ప్రశ్నించారు. ఇలాంటి వాళ్ల మీద కేసులు పెట్టరా? అని అంబటి నిలదీశారు.
టీడీపీ అధికారిక పేజీల్లో వైఎస్ జగన్‌పై పరుషపదజాలం ఉపయోగిస్తున్నారు. వాటికి అనుకూలంగా ఉన్న పేజీల్లో, మనుషులచేత జగన్‌ను తిట్టిస్తున్నారు (సీమరాజా, కిర్రాక్ ఆర్పీ, స్వాతి.. ఇలా కొందరి పేర్లు ప్రస్తావించారు). మరి అలాంటి వాళ్లపై కేసులు ఎందుకు పెట్టరు?. ఇవన్నీ చూశాక.. ఉన్మాదుల కర్మాగారం ఎవరిది? వీళ్లందరినీ పెంచి పోషిస్తోంది ఎవరు?. పవన్ కల్యాణ్‌గారూ.. తన తల్లిని, బిడ్డలను తిట్టారని అన్నారు(పవన్ తన తల్లిని తిట్టారని గతంలో చేసిన వ్యాఖ్యల వీడియోను పోస్ట్ చేశారు). వాళ్లను క్షమించేశారు. మరి ఇవన్నీ తెలుగుదేశం ఫ్యాక్టరీలో తయారైనవే కదా. వీటన్నింటిని సూత్రధారి నారా లోకేష్. కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పుకుంటూ ఆయన ఆడిస్తున్న నాటకాలివి.
హోం మంత్రి, కాబోయే హోం మంత్రి పవన్ కల్యాణ్‌కు విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటికైనా ఇలాంటి వాళ్లపై చర్యలు తీసుకోండి. చెడును భుజాన వేసుకుని ఊరేగకండి అని అంబటి హితవు పలికారు.
అలాగే ‘‘ధర్మాధర్మాలు ఆలోచించుకోండి. బూతుపురాణాలు వద్దు. ధర్మంగా, న్యాయంగా పోస్టులు వేయండి. వైఎస్సార్, వైఎస్ జగన్ ఏనాడూ ఇలాంటి చేయమని చెప్పలేదు. కార్యకర్తలకు ఎల్లవేళా జగన్ అండగా ఉంటారు’’ అని వైఎస్సార్‌సీపీ అనుకూల విభాగాలకు కూడా అంబటి సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment