
ప్రతీకాత్మక చిత్రం
సందర్భం
అనాదిగా స్త్రీ ఒక ప్రకృతి శక్తిగా, ఉత్పత్తి పరికరాల సృష్టికర్తగా, చరిత్ర నిర్దేశకురాలుగా ఉంది. పితృస్వామ్య ఆధిపత్యం వచ్చేవరకూ ఆమెది విజయ గమనమే. మానవజాతి శైశవ దశలో తన సంతానాన్ని కాపాడుకోవటానికి కాయలు, దుంపలు, పళ్ల లాంటి ఆహార సేకరణలో తల్లే ప్రధాన పాత్ర వహించింది. ఇప్పటికీ ఆహార సేకరణ దశలో ఉన్న జాతుల్లో మాతృస్వామ్యం అమలులో ఉంది. నిప్పు ఉపయోగాన్ని తెలుసుకున్న కాలంలో, జలచరాలైన చేపలు, పీతలు, నత్తలు (Snails) తినే కాలంలో, నదీ తీర నాగరికతలను రూపొందించే కాలంలో స్త్రీ శ్రమయే కీలకం. వేటాడి తెచ్చిన మాంసాన్ని వండవలసిన అవసరాన్ని కూడా స్త్రీయే ముందుగా గమనించి ఉంటుంది. శరీరాన్ని కప్పుకోవాలనే ఆలోచన, కట్టుకోవటానికి చెట్టు బెరడును ఉపయోగించాలనే ఆలోచన స్త్రీకే వచ్చి ఉంటుంది. కుండను చేయడం ద్వారా నీటిని, ధాన్యాన్ని నిలవచేయడం, నేలలో విత్తునాటడం ద్వారా ఆహార సృష్టి... ఇలా నూత్న జీవన వ్యవస్థలను ఆమె సృష్టిస్తూ వెళ్ళింది.
సింధు నాగరికతలో స్నాన వాటికలు ప్రసిద్ధంగా విలసిల్లాయి. వీటి ప్రభావం తరువాత ఆర్యుల సంస్కృతి మీదా కనిపిస్తుంది. ఆ తరువాత దేవాలయాలకు అనుబంధంగా ఉమ్మడి స్నానఘట్టాలు రూపొందాయి. వీటి వద్ద అప్సరసలు లేదా జల దేవతలు ఉంటారని ఆనాడు నమ్మేవారు. ఈ స్నానఘట్టాల నిర్మాణంలో స్త్రీ ప్రాధాన్యత, స్త్రీ ఉమ్మడి తత్వానికి సంబంధించిన సంస్కృతి దృగ్గోచరమవుతుంది. మాతృభావన వీరి మతపరిణామ క్రమంలో ఆనాటికే రూపుదిద్దుకొని వున్నదని చెప్పటానికి మొహంజెదారో, హరప్పా లలో దొరికిన ఫలకాలు బలమైన ఋజువు అని పురావస్తు శాస్త్రజ్ఞుడు సర్ జాన్ మార్షల్ పేర్కొన్నారు. ప్రాచీన భారతీయులు స్త్రీ మూర్తిని (ప్రకృతి మాతగా) ఆరాధించినట్టు సింధూ లోయలో దొరికిన విగ్రహాలను బట్టి తెలుస్తుంది. ఇటువంటి ప్రతిమలే మెసపటోమియా, పశ్చిమాసియా, ఆసియా మైనర్‌లోనూ లభించాయి. స్త్రీమూర్తి ఆరాధన సింధూ లోయ (Indus Valley) నుంచి నైలునది వరకు వ్యాపించి వున్నట్లు భావించవచ్చు.
కానీ ఆ తరువాత అనేక పరిణామాలు భారతదేశంలో చోటు చేసుకుంటూ వచ్చాయి. ముఖ్యంగా మనుస్మృతి భావజాలం వల్ల స్త్రీ అణచివేత బహుముఖంగా ప్రారంభమైంది. ధర్మ సూత్రాలు స్త్రీ వ్యక్తిత్వానికి సంకెళ్ళు వేశాయి. స్త్రీ విద్య నిరోధానికి గురైంది. మనుస్మృతి (Manusmriti) క్రీ.పూ. రెండవ శతాబ్దిలో రాయబడి ఉంటుందని అంబేడ్కర్ అన్నారు. బౌద్ధయుగం అంతరించి హిందూ రాజ్యాలు ఆవిర్భవించే క్రమంలో పుష్యమిత్ర దీన్ని బ్రాహ్మణ రాజ్య నిర్మాణానికి సాధనంగా వాడుకున్నారు. వర్ణవ్యవస్థ పునరుద్ధరణ, స్త్రీ అణచివేత ఇందులో ప్రధానమైన అంశాలుగా ముందుకు వచ్చాయి.
కొనసాగాల్సిన పోరాటం
వీటన్నింటిని ఎదుర్కొంటూ స్త్రీ యుగ యుగాల ప్రస్థానం కొనసాగిస్తూ వచ్చింది. అనేక అవాంతరాలను అధిగమించి జీవన గమనంలో కొత్త పుంతలు తొక్కింది. ఆమెను అణగదొక్కడం పురుషుని వల్ల కాదు అని తెలుసుకోవడానికి చాలాకాలం పట్టింది. ఎందుకంటే ఆమె విద్యుల్లత. ఆమె ప్రకాశానికి తట్టుకోలేక పురుషుడు ఆమెకు సంకెళ్ళు బిగించాడు. ఆమె ఆ సంకెళ్ళను పటాపంచలు చేసి ముందుకు వెళుతోంది. స్త్రీకి శరీర సౌందర్యమే కాదు, మనో సౌందర్యమూ ఉంది. ఆమె మనస్సు వెన్నకంటే మెత్తనిది. ఆమె హృదయ వాది. ఆమె హృదయము లోతైనది. సూర్యగోళాలను, చంద్ర గోళాలను మనము పరిశీలించవచ్చు కాని స్త్రీ అంతరంగాన్ని అందుకోగలిగిన శక్తి ఇంకా పురుషుడికి రాలేదు. ఆ విషయంలో పురుషుడు అబలుడు. ఆమె అమ్మే కాదు, గొప్ప నాయకురాలు. భారత రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము త్రివిద దళాల సైనిక వందనాన్ని స్వీకరించారు. భారతదేశ కళాత్మక దృష్టి ఎంత గొప్పదో ద్రౌపదీ ముర్ము ఒక గిరిజన స్త్రీగా అత్యున్నత సింహాసనాన్ని అధిష్ఠించి నిరూపించారు.
‘ఆడపిల్ల గడప దాటకూడదు’ అనే భావాలు పాతవైనాయి. ఆడపిల్లలు దేశాంతరాలకు వెళ్ళి చదువుకొంటున్నారు. పిల్లల్ని పెంచే విధానంలో చాలా మార్పులు వచ్చాయి. ఈనాడు స్త్రీలలో వస్తున్న గుణాత్మకమైన మార్పు ‘నేను సంపాదిస్తూ బతకా’లనే అంశం. కేవలం గృహిణిగా ఇంట్లోనే ఉండటానికి స్త్రీ ఈనాడు ఇష్టపడటం లేదు. ఈ మార్పులన్నీ రావడానికి ఎన్నో ఉద్యమాలు జరిగాయి. మహారాష్ట్రలో సావిత్రిబాయి ఫూలే, జ్యోతిరావు ఫూలే, అంబేడ్కర్ ఉద్యమాలు; బ్రహ్మసమాజం, ఆర్య సమాజాలు చేసిన పోరాటాలు, తమిళనాడులో పెరియార్ రామస్వామి నాయకర్ చేసిన పోరాటం, కేరళలో నారాయణ గురు చేసిన విద్యా పోరాటం... ఇవన్నీ స్త్రీల అభ్యున్నతికి మార్గం వేశాయి.
చదవండి: ఆకాశంలో సగమైనా.. వివక్షేనా?
అయినప్పటికీ స్త్రీలు పితృస్వామ్య ఆధిపత్యానికి ఎదురీదుతూనే ఉన్నారు. వారిని వస్తు వ్యామోహితులుగా మార్చాలనీ, సోషల్ మీడియాకు ఎడిక్ట్ చేయాలనీ ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. గృహహింస పెరుగుతోంది. బాల్య వివాహాలు ఆగడం లేదు. కొడుకుతో సమానంగా కూతురికి ఆస్తి ఇవ్వడం ఆచరణలో అమలు కావడం లేదు. రాజకీయాల్లో స్త్రీలను అవమానించే ధోరణులు పెరుగు తున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో పాలకవర్గాలు, పితృస్వామ్య ఆధిపత్యాలను కొనసాగిస్తున్నాయి. వీటన్నింటిని స్త్రీలు ఎదుర్కొనే క్రమంలో ఇంకా పోరాటాన్ని చేయాల్సి ఉంది. ఇది మహిళా సాధికారతా యుగం. ఈ యుగ స్ఫూర్తిలో భాగంగా మనమూ నడుద్దాం. తల్లిని, చెల్లిని, సహచరిణిని, తోటి స్త్రీని గౌరవిద్దాం. వారి చైతన్యానికి తోడు నిలబడదాం. అదే నిజమైన రాజ్యాంగ స్ఫూర్తి.
- డాక్టర్ కత్తి పద్మారావు
దళితోద్యమ నాయకులు