indus valley civilization
-
సింధు లోయ లిపిని పరిష్కరిస్తే 10 లక్షల డాలర్ల నజరానా
చెన్నై: శతాబ్ద కాలానికి పైగా అపరిష్కృతంగా మిగిలి పోయిన సింధు నదీ లోయ నాగరికత కాలం నాటి లిపిని పరిష్కరించిన వారికి 10 లక్షల డాలర్ల బహుమానం అందజేస్తామని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ప్రకటించారు. సింధూ నాగరికతను వెలుగులో వచ్చి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటైన మూడు రోజుల అంతర్జాతీయ సదస్సును ఆదివారం ఆయన చెన్నైలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్..ఒకప్పుడు విలసిల్లిన సింధు లోయ నాగరికతకు చెందిన లిపిని ఇప్పటి వరకు స్పష్టంగా ఎవరూ అర్థం చేసుకో లేకపోయారని పేర్కొన్నారు. లిపిని పరిష్కరించేందుకు ఇప్పటికీ పండితులు ప్రయత్ని స్తూనే ఉన్నారన్నారు. ఈ దిశగా కృషి చేసి, విజయం సాధించిన వ్యక్తులు, సంస్థలకు ప్రోత్సా హంగా 10 లక్షల డాలర్ల బహుమానం అందజేస్తామని ప్రకటించారు. -
సింధు ప్రజల ముఖ ఆకృతి ఎలా ఉండేది? శాస్త్రవేత్తల పరిశోధనల్లో ఏమి తేలింది?
సింధు లోయ నాగరికతకు చెందిన ప్రజల ముఖాలు ఎటువంటి ఆకృతిలో ఉండేవనే ఇన్నాళ్ల సందేహాలకు ఇప్పుడు తెరపడింది. తాజాగా పరిశోధకులు సింధూ ప్రజల ముఖాకృతి ఇదేనంటూ ఒక ఫొటోను విడుదల చేశారు. సింధూ నాగరిత నాటి ఒక స్మశానవాటికలో లభ్యమైన రెండు పుర్రెల ఆధారంగా వాటి ముఖాలకు ఆకృతి తీసుకువచ్చి, లోకం ముందు ఉంచారు. ఈ ఫొటో ఇప్పుడు ఎంతో ఆసకికరంగా మారింది. ప్రపంచంలోని పురాతన నాగరికతలలో సింధు లోయ నాగరికత ఒకటి. ఈ నాగరికత క్రీ.పూ. 3300 నుండి 2500 వరకు కొనసాగింది. ప్రముఖ పత్రిక నేచర్‌లో ప్రచురితమైన పరిశోధనా వ్యాసంలోని వివరాల ప్రకారం సింధు లోయ నాగరికత 8000 సంవత్సరాల పురాతనమైనది. భారతదేశ చరిత్ర హరప్పా నాగరికతగా పేరొందినప్పటికీ, అది కూడా సింధు లోయ నాగరికతతో పాటు ప్రారంభమయ్యిందని చరిత్ర చెబుతోంది. మొహెంజొదారో, కలిబంగా, లోథాల్, ధోలావీరా, రాఖీగర్హి మొదలైనవి హరప్పా, సింధు లోయ నాగరికతలకు ప్రధాన కేంద్రాలుగా పరిగణిస్తారు. సింధు లోయ నాగరికతకు చెందిన పురాతన నగరం 2014లో హర్యానాలోని ఫతేహాబాద్ జిల్లాలోని భిర్దానాలో కనుగొన్నారు. దీని స్థాపన సుమారు క్రీ.పూ. 7570 నాటిదని చెబుతారు. పురావస్తు శాస్త్రవేత్తలు, చరిత్రకారులు సింధు లోయ నాగరికత అత్యంత అభివృద్ధి చెందిన నాగరికత అని అంటారు. సింధు లోయ నాగరికతను అధ్యయనం చేసేందుకు శాస్త్రవేత్తలు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. అయితే సింధూ ప్రజల ముఖ రూపాన్ని గుర్తించేందుకు చేసిన ప్రయత్నాలేవీ నేటివరకూ పూర్తిస్థాయిలో విజయవంతం కాలేదు. అయితే తాజాగా పూరాతత్వ పరిశోధకులు క్రీ.పూ. 2273, 2616 నాటిదిగా అంచనా వేసిన సింధునాగరికత స్మశానవాటిక రాఖీగర్హి లో పరిశోధినలు సాగించారు. ఈ నేపధ్యంలో రాఖీగర్హిలో లభ్యమైన రెండు పుర్రెల కంప్యూటెడ్ టోమోగ్రఫీ డేటాను ఉపయోగించి క్రానియోఫేషియల్ రీకన్స్ట్రక్షన్ (సీఎఫ్ఆర్) విధానం ద్వారా సుమారు 4500 సంవత్సరాల క్రితం ఖననం చేసిన సింధు నాగరితక వ్యక్తులకు చెందిన ముఖాలను విజయవంతంగా పునర్నిర్మించామని శాస్త్రవేత్తలు తెలిపారు. సింధు నాగరికుల ముఖ స్వరూపాన్ని అంచనావేసేందుకు శాస్త్రీయంగా జరిగిన మొదటి ప్రయత్నం ఇదేనని వారు పేర్కొన్నారు. ఈ వివరాలను అనాటమికల్ సైన్స్ ఇంటర్నేషనల్ వాల్యూమ్- 95లో శాస్త్రవేత్తలు జూన్ లీ, వసంత్ షిండే, డాంగ్ హూన్ షిన్ షోలు పొందుపరిచారు. ఇది కూడా చదవండి: యూదుల ఇజ్రాయెల్ ఎలా ఏర్పడింది? జనాభా ఎంత? -
హరప్పా సమాధుల్లో చరిత్ర
అతి ప్రాచీనమైన సింధు నాగరికతలో అత్యంత ముఖ్యపట్టణం రాఖీఘరీ. ప్రస్తుతం మన దేశంలోని హరియాణా రాష్ట్రంలో ఉంది. 4,500 ఏళ్ల క్రితం ఆ పట్టణ శివార్లలోని ఒక పురుషుడు, ఒక మహిళని ఉమ్మడిగా సమాధి చేశారు. ఇçప్పుడు ఇన్నేళ్ల తర్వాత వారిద్దరి అస్తిపంజరాలు భారతదేశం, దక్షిణ కొరియాకు చెందిన పురావస్తు శాస్త్రవేత్తలకు లభ్యమయ్యాయి. 2016వ సంవత్సరం లోనే ఆ అస్థి పంజరాలను గుర్తించిన శాస్త్రవేత్తలు వాటిపై విస్తృతంగా పరిశోధన చేసి హరప్పా కాలం నాటి పరిస్థితుల్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. వాటి వివరాలను ఒక అంతర్జాతీయ జర్నల్‌లో ప్రచురించారు. ‘‘ఒక పురుషుడు, మహిళకు చెందిన ఆ అస్థిపంజరాలు ఒకరికొకరు అభిముఖంగా, అత్యంత సన్నిహితంగా ఉన్నాయి. వాళ్లిద్దరూ భార్యాభర్తలు అయి ఉంటారు. ఒకేసారి వారిద్దరూ మరణించారు. అతని వయసు దాదాపుగా 35 ఏళ్లు ఉంటే, ఆమె వయసు 25 ఉంటుంది. ఇద్దరూ మంచి పొడగరులు. అతను 5 అడుగుల 8 అంగుళాలు ఉంటే, ఆమె 5 అడుగుల 6 అంగుళాలు ఉంటుంది. వాళ్లు మరణించే సమయంలో ఆరోగ్యకరంగానే ఉన్నారు. వారి ఎముకల్ని పరీక్షించి చూశాం. ఎవరూ వారిని హత్య చెయ్యలేదు. బ్రెయిన్ ఫీవర్ వంటి అనారోగ్యాలు కూడా వారికి లేవు. మరి వారి మరణానికి కారణమేమై ఉంటుందో ఇంకా అంతు పట్టడం లేదు‘ అని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన పురావస్తు శాస్త్రవేత్త , పుణేలోని డెక్కన్ కాలేజీకి చెందిన వసంత్ షిండే వెల్లడించారు. ఇలా జంటగా అస్తిపంజరాలు బయటపడడం అరుదైన విషయమని, దీనిని బట్టి భారతీయ వివాహ వ్యవస్థ అత్యంత ప్రాచీనమైనదని తెలుస్తోందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ఇదే మొదటిది కాదు హరప్పాలో ఇలా జంటగా పాతిపెట్టిన సమాధులు బయటపడడం ఇది తొలిసారేం కాదు. 1950లో గుజరాత్‌లోని లోథల్‌లో కూడా ఇలాంటి సమాధి బయటపడింది. అందులో మహిళ అస్థిపంజరం తలపై గాయాలు కనిపించాయి. భర్తని ఎవరో చంపేస్తే, దానిని తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకుందని పురావస్తు శాస్త్రవేత్తలు తేల్చారు. రఖీఘరీలో ఇప్పటికే పురావస్తు శాస్త్రవేత్తలు 70 సమాధుల్ని గుర్తించారు. వాటిలో 40ని తవ్వి వాటిల్లో దాగి ఉన్న రహస్యాలను వెలికితీసే పనిలో ఉన్నారు. ఇలా జంట అస్తిపంజరాలు బయల్పడడం మాత్రం ఉత్సుకతనే నింపింది. హరప్పాలో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇలా ఎన్నో సమాధుల్లో స్త్రీ, పురుషుల అస్థిపంజరాలు ఉమ్మడిగా దర్శనమిచ్చాయి. ఇటలీ, రష్యా వంటిదేశాల్లో స్త్రీ, పురుషుల అస్థిపంజరాలు అత్యంత సన్నిహితంగా, చేతిలో చెయ్యి వేసుకున్నట్టు కనిపించింది. ఇక గ్రీస్‌లో 6 వేల ఏళ్ల క్రితం నాటి జంట అస్థిపంజరాలు ఒకరినొకరు విడిచి ఉండలేనంతగా కౌగిలించుకొని కనిపించాయి. సమాధుల్లో సంగతులెన్నో హరప్పా, మొహంజదారో సమాధుల్లో ఎక్కడా ఆడంబరాలు కనిపించవు. పశ్చిమాసియా రాజుల మాదిరిగా అంత్యక్రియలు వాళ్లు ఆడంబరంగా జరుపుకోరు అని ఎర్లీ ఇండియన్స్, ది స్టోరీ ఆఫ్ అవర్ ఏన్సెస్టర్స్ అండ్ వేర్ వి కేమ్ ఫ్రమ్ పుస్తక రచయిత టోని జోసెఫ్ అభిప్రాయపడ్డారు. మోసొపొటేమియా నాగరికత కాలం నాటి సమాధుల్లో అత్యంత విలువైన నగలు, కళాఖండాలు దర్శనమిస్తాయి. విశేషమేమిటంటే హరప్పా నుంచి ఎగుమతి అయిన అత్యంత విలువైన నవరత్నాలు, నీలాలు, గోమేధికాలతో తయారు చేసిన నగలతోనే అప్పట్లో రాజుల్ని పూడ్చి పెట్టేవారని చరిత్రకారుల అంచనా. అదే హరప్పా సమాధుల్లో ఆహారంతో నింపిన కుండలు, కొన్ని పూసల నగలు కనిపిస్తాయి. మరణించిన వారికి పునర్జన్మ ఉంటుందన్న నమ్మకంతో అప్పట్లో ఆహారంతో నింపిన కుండలు సమాధుల్లో ఉంచేవారని చరిత్రకారుల అభిప్రాయం. -
పొలంలో బంగారపు గని ఉందని..
బిజ్నోర్: జిల్లాలోని చాంద్ పూర్ ప్రాంతానికి చెందిన ఓ రైతు తన పొలంలో దున్నుతుండగా హరప్పా నాగరికతకు చెందిన 4,500 సంవత్సరాలకు పూర్వం తయారుచేసిన రాగి వస్తువులు బయటపడ్డాయి. దీంతో ఆశ్చర్యపోయిన రైతు పొలంలో బంగారపు గని ఉండే అవకాశం ఉందని తవ్వకాలు ప్రారంభించాడు. కొద్ది సమయంలో ఈ వార్త హరినగర్ గ్రామం మొత్తం పాకడంతో ఆ రైతు చుట్టుపక్కల పొలాలు కలిగిన రైతులు కూడా బంగారం కోసం తవ్వకాలు మొదలుపెట్టారు. ఈ తవ్వకాల్లో మరికొన్ని రాగి వస్తువులు బయటపడ్డాయి. బంగారం కోసం హరినగర్ గ్రామం పొలాల్లో తవ్వకాలు జరుపుతున్నారనే వార్తను తెలుసుకున్న జిల్లా మేజిస్ట్రేట్ బీ చంద్రకళ ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ)కు సమాచారం అందించారు. దీంతో హూటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకున్న ఏఎస్ఐ బృందం హరప్పా నాగరికతకు చెందిన వస్తువులు బయటపడ్డ ప్రదేశాన్ని పరిశీలించింది. ఇతరులను ఆ ప్రదేశంలోకి ప్రవేశించకుండా పోలీసుల సాయం తీసుకుంది. వస్తువుల గురించి మాట్లాడిన ఏఎస్ఐ సూపరింటెండెంట్ భువన్ విక్రమ్ తవ్వకాల్లో దొరికిన రాగి వస్తువులన్నీ హరప్పా నాగరికతకు చెందినవిగా భావిస్తున్నామని తెలిపారు. పరిశోధనలు పూర్తయిన తర్వాత వీటి కచ్చితమైన వయస్సును నిర్దారిస్తామని అన్నారు. ఈ ప్రాంతంలో ఇంకా మరిన్ని విలువైన వస్తువులు లభ్యమయ్యే అవకాశం ఉందని చెప్పారు.