అతి ప్రాచీనమైన సింధు నాగరికతలో అత్యంత ముఖ్యపట్టణం రాఖీఘరీ. ప్రస్తుతం మన దేశంలోని హరియాణా రాష్ట్రంలో ఉంది. 4,500 ఏళ్ల క్రితం ఆ పట్టణ శివార్లలోని ఒక పురుషుడు, ఒక మహిళని ఉమ్మడిగా సమాధి చేశారు. ఇçప్పుడు ఇన్నేళ్ల తర్వాత వారిద్దరి అస్తిపంజరాలు భారతదేశం, దక్షిణ కొరియాకు చెందిన పురావస్తు శాస్త్రవేత్తలకు లభ్యమయ్యాయి. 2016వ సంవత్సరం లోనే ఆ అస్థి పంజరాలను గుర్తించిన శాస్త్రవేత్తలు వాటిపై విస్తృతంగా పరిశోధన చేసి హరప్పా కాలం నాటి పరిస్థితుల్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు.
వాటి వివరాలను ఒక అంతర్జాతీయ జర్నల్‌లో ప్రచురించారు. ‘‘ఒక పురుషుడు, మహిళకు చెందిన ఆ అస్థిపంజరాలు ఒకరికొకరు అభిముఖంగా, అత్యంత సన్నిహితంగా ఉన్నాయి. వాళ్లిద్దరూ భార్యాభర్తలు అయి ఉంటారు. ఒకేసారి వారిద్దరూ మరణించారు. అతని వయసు దాదాపుగా 35 ఏళ్లు ఉంటే, ఆమె వయసు 25 ఉంటుంది. ఇద్దరూ మంచి పొడగరులు. అతను 5 అడుగుల 8 అంగుళాలు ఉంటే, ఆమె 5 అడుగుల 6 అంగుళాలు ఉంటుంది. వాళ్లు మరణించే సమయంలో ఆరోగ్యకరంగానే ఉన్నారు.
వారి ఎముకల్ని పరీక్షించి చూశాం. ఎవరూ వారిని హత్య చెయ్యలేదు. బ్రెయిన్ ఫీవర్ వంటి అనారోగ్యాలు కూడా వారికి లేవు. మరి వారి మరణానికి కారణమేమై ఉంటుందో ఇంకా అంతు పట్టడం లేదు‘ అని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన పురావస్తు శాస్త్రవేత్త , పుణేలోని డెక్కన్ కాలేజీకి చెందిన వసంత్ షిండే వెల్లడించారు. ఇలా జంటగా అస్తిపంజరాలు బయటపడడం అరుదైన విషయమని, దీనిని బట్టి భారతీయ వివాహ వ్యవస్థ అత్యంత ప్రాచీనమైనదని తెలుస్తోందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.
ఇదే మొదటిది కాదు
హరప్పాలో ఇలా జంటగా పాతిపెట్టిన సమాధులు బయటపడడం ఇది తొలిసారేం కాదు. 1950లో గుజరాత్‌లోని లోథల్‌లో కూడా ఇలాంటి సమాధి బయటపడింది. అందులో మహిళ అస్థిపంజరం తలపై గాయాలు కనిపించాయి. భర్తని ఎవరో చంపేస్తే, దానిని తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకుందని పురావస్తు శాస్త్రవేత్తలు తేల్చారు. రఖీఘరీలో ఇప్పటికే పురావస్తు శాస్త్రవేత్తలు 70 సమాధుల్ని గుర్తించారు. వాటిలో 40ని తవ్వి వాటిల్లో దాగి ఉన్న రహస్యాలను వెలికితీసే పనిలో ఉన్నారు.
ఇలా జంట అస్తిపంజరాలు బయల్పడడం మాత్రం ఉత్సుకతనే నింపింది. హరప్పాలో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇలా ఎన్నో సమాధుల్లో స్త్రీ, పురుషుల అస్థిపంజరాలు ఉమ్మడిగా దర్శనమిచ్చాయి. ఇటలీ, రష్యా వంటిదేశాల్లో స్త్రీ, పురుషుల అస్థిపంజరాలు అత్యంత సన్నిహితంగా, చేతిలో చెయ్యి వేసుకున్నట్టు కనిపించింది. ఇక గ్రీస్‌లో 6 వేల ఏళ్ల క్రితం నాటి జంట అస్థిపంజరాలు ఒకరినొకరు విడిచి ఉండలేనంతగా కౌగిలించుకొని కనిపించాయి.
సమాధుల్లో సంగతులెన్నో
హరప్పా, మొహంజదారో సమాధుల్లో ఎక్కడా ఆడంబరాలు కనిపించవు. పశ్చిమాసియా రాజుల మాదిరిగా అంత్యక్రియలు వాళ్లు ఆడంబరంగా జరుపుకోరు అని ఎర్లీ ఇండియన్స్, ది స్టోరీ ఆఫ్ అవర్ ఏన్సెస్టర్స్ అండ్ వేర్ వి కేమ్ ఫ్రమ్ పుస్తక రచయిత టోని జోసెఫ్ అభిప్రాయపడ్డారు. మోసొపొటేమియా నాగరికత కాలం నాటి సమాధుల్లో అత్యంత విలువైన నగలు, కళాఖండాలు దర్శనమిస్తాయి. విశేషమేమిటంటే హరప్పా నుంచి ఎగుమతి అయిన అత్యంత విలువైన నవరత్నాలు, నీలాలు, గోమేధికాలతో తయారు చేసిన నగలతోనే అప్పట్లో రాజుల్ని పూడ్చి పెట్టేవారని చరిత్రకారుల అంచనా. అదే హరప్పా సమాధుల్లో ఆహారంతో నింపిన కుండలు, కొన్ని పూసల నగలు కనిపిస్తాయి. మరణించిన వారికి పునర్జన్మ ఉంటుందన్న నమ్మకంతో అప్పట్లో ఆహారంతో నింపిన కుండలు సమాధుల్లో ఉంచేవారని చరిత్రకారుల అభిప్రాయం.
Comments
Please login to add a commentAdd a comment