katti padma rao
-
ప్రజలే బుద్ధి చెబుతారు!
భారతదేశం నదీ నాగరికతల దేశం. అసలు ఇక్కడ నదులను దేవతలుగా కొలవడం సంస్కృతిలో భాగం. ఈ సంస్కృతికి మూల విరాట్టులు ఆదివాసీలూ, దళితులే. అడవులు, నదీతీరాలు వీరి ఆవాసాలుగా ఉన్నప్పుడు వాటికి ఏ ఇబ్బందులూ కలగలేదు. ఎప్పుడైతే పారిశ్రామిక విప్లవం వచ్చి, వస్తూత్పత్తి వాణిజ్య స్థాయిలో అవ్వడం ప్రారంభమయ్యిందో... అప్పుడే ప్రకృతి వనరులను విచక్షణా రహితంగా దోచుకోవడం ప్రారంభమయ్యింది. పట్టణాలు, నగరాలు విస్తరించాయి. చివరికి నదులు, కాలువలు, చెరువులు, అడవులు అన్నింటినీ ఆధిపత్య వర్గాలవారు కబ్జా చేశారు. వీరి చేతుల్లోనే భూమి, మూలధనం కేంద్రీ కృతమై ఉన్నందున వీరే పరిశ్రమలు, ఇతర వ్యాపారాలను స్థాపించి పేరాశతో డబ్బు, అధికార దర్పాలతో కబ్జాలకు తెరలేపారు. తత్ఫలితమే విజయవాడ, ఖమ్మం వంటి చోట్ల ఇవ్వాళ నదులు లేదా ఏరులు సృష్టించిన విలయాలు! ఈ నేపథ్యంలో విజయవాడను చుట్టుముట్టిన వరదలను చూడాలి. ఇక్కడ ప్రజల కడగండ్లకు ప్రధాన కారణం బుడమేరు కాలువ/ వాగు. జలవనరుల శాఖ పరిభాషలో ఇది ఒక మేజర్ డ్రెయిన్. ఎన్టీఆర్,కృష్ణా జిల్లాల్లో పంట పొలాల్లోని మిగులు నీరు ప్రవహించే ఒక వాగు. ఖమ్మం జిల్లాలో పుట్టిన ఈ వాగు మైలవరం నియోజకవర్గంలో ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశిస్తుంది. రెడ్డిగూడెం, మైలవరం, కొండూరు మండలాల్లోని పులివాగు, భీవ్ువాగు, లోయవాగును కలుపుకొని ముందుకు సాగుతుంది. విస్సన్నపేట, తిరువూరు నుంచి వచ్చే కొన్ని ఏరులు కూడా దీనిలో కలుస్తాయి. ఇవన్నీ కలిశాక, వెలగలేరు మీదుగా విజయవాడ శివారులోని సింగ్‌నగర్, గూడవల్లి, గన్నవరం, బాపులపాడు, గుడివాడ, నందివాడ వైపు సాగి చివరకు కొల్లేరులో కలుస్తుంది. బుడమేరు గరిష్ఠ నీటి ప్రవాహ సామర్థ్యం 11 వేల క్యూసెక్కులు మాత్రమే. దీని ఉద్ధృతి తగ్గించేందుకు 1970ల్లోనాటి ప్రభుత్వం జి. కొండూరు మండలం వెలగలేరు వద్ద ఒక రెగ్యులేటరీని నిర్మించింది. అక్కడ చిన్న జలాశయాన్ని తలపిస్తుంది. ఈ హెడ్ రెగ్యులేటరీ ద్వారా కిందకు వరద ప్రవాహాన్ని నియంత్రించే వారు. తర్వాత దీన్నుంచి మళ్లింపు కాలువ (బుడ మేరు డైవర్షన్ ఛానెల్– బీడీసీ)ని తవ్వారు. అధికంగా వచ్చే వరద ఈ ఛానెల్ ద్వారానే ప్రవహించి, ఇబ్రహీంపట్నం సమీపంలో కృష్ణా నదిలో కలుస్తుంది. వీటీపీఎస్‌లోని వృథా నీటిని కూడా దీని ద్వారానే కృష్ణాలోకి పంపిస్తారు. దీని సామర్థ్యం చాలా తక్కువ.కాలువ సామర్థ్యం పెంపు ప్రతిపాదనల్లో ఉండ గానే బుడమేరుకు 2005లో సుమారు 70 వేల క్యూసెక్కుల వరద పోటెత్తి, విజయవాడను ముంచెత్తింది. వరదను అరికట్టాలంటే మళ్లింపు కాలువ విస్తరణే మార్గమని ప్రతిపాదన వచ్చింది. తర్వాత పోలవరం కుడి కాలువను బుడమేరులో కలిపారు. అంటే పోలవరం నుంచి వచ్చే నీటిని కృష్ణా నదిలో కలిపేందుకు దీన్నొక అనుసంధాన కాలువగా మలిచారు. పోలవరం కుడి కాలువను 37,500 క్యూసెక్కుల సామర్థ్యంతో డిజైన్ చేయగా, ప్రస్తుత సామర్థ్యం 8,500 క్యూసెక్కులు మాత్రమే. గత ఏడెనిమిదేళ్లుగా పట్టిసీమ నీళ్లు ఈ కాలువ ద్వారానే కృష్ణాలోకి వస్తున్నాయి. భవిష్యత్తులో పోలవరం కాలువను విస్తరించేందుకు అవకాశ ముంది. ఆ మేరకు బీడీసీ సామర్థ్యం కూడా ఇప్పుడున్న 10 వేల క్యూసెక్కుల నుంచి పెంచాల్సిన అవసరముంది. సహజమైన నదీ తీరాన్ని ఇవ్వాళ ధ్వంసం చేసి పెద్ద పెద్ద అంతస్తులతో భవనాలు కట్టి నదీ గమనానికి అడ్డుగా నిలవడమే కాక నదీజలాలు కలుషితం కావడానికి కూడా కారణమవుతున్నారు బడాబాబులు. విజయవాడకు ఇంతటి పెనుముప్పు రావడానికి ఇదే ప్రధాన కారణం. కృష్ణా నది కరకట్ట మీద పెత్తందారుల అక్రమ కట్టడాల వల్లే ఇది జరిగింది. ఈ కరకట్ట మీద ఉన్న ముఖ్యమంత్రి నివాసం, కొంతమంది వైద్యం పేరుతో వ్యాపారం చేస్తున్న వారి కట్టడాలు ఉన్నాయి. వాటిని కూలుస్తామనే మాట పాలకులు చెప్పడం లేదు. ఈనాడు తెలంగాణలో ‘హైడ్రా’ చెరువులు కబ్జా చేసిన వారి అక్రమ కట్టడాలను కూల్చి వేస్తున్నట్లు అన్ని రాష్ట్రాలలో కూల్చివేయాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ కూల్చివేతల అవసరం ఎంతైనా ఉంది. ఇక ప్రజలు ప్రాకృతిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ పునరుజ్జీవనం గురించి ఆలోచించవలసిన సమయం వచ్చింది. ప్రజల్లో అలముకున్న నిరాశ, నిస్పృహల స్థానంలో సమకాలీన పరిస్థితుల పట్ల స్పష్టమైన అవగాహన నింపాలి. అప్పుడే వారు పెత్తందార్లకు బుద్ధి చెబుతారు. ప్రజలే చరిత్ర నిర్మాతలు కదా!డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695 -
దేశ పునర్నిర్మాణానికి ఊపిరి
అంబేడ్కర్ ప్రతిపాదించిన సామాజిక విప్లవ సిద్ధాంతం భారతీయ సామాజిక పునర్నిర్మాణానికీ, దళితజాతుల విముక్తి పోరాటానికీ లక్ష్యాన్ని, గమ్యాన్ని నిర్దేశించింది. తరతరాలుగా భారతీయ సంస్కృతి కోల్పోయిన మానవతను, సమతను ఆయన విముక్తి పోరాటం పునరుజ్జీవింప జేసింది. నేడు భారత దేశంలో సమసమాజ నిర్మాణానికి ఉద్యుక్తులవుతున్న వారందరూ అంబేడ్కర్‌ను అధ్యయనం చేయకుండా, సమన్వయ పర్చుకోకుండా వారి పోరాటాల్లో విజయం సాధించటం అసాధ్యం. అంబేడ్కర్‌ను విస్మరించినవారు తమ లక్ష్యాల్లో, గమ్యాల్లో వైఫల్యం చెందుతూ ఆ వైఫల్యానికి కారణాలు గుర్తెరగలేక తిరోగమిస్తున్నారు. ఏ వ్యవస్థలోనైనా పునాదులతో సహా మార్పు తేవాలన్నప్పుడు, ఆ సామాజిక వ్యవస్థను శాస్త్రీయ దృక్పథంతో విశ్లేషించాలి.వికసిత భారత నిర్మాణం ద్వారా మన ప్రస్థానం ప్రపంచానికి స్ఫూర్తిదాయకం కావా లని ఆగస్టు 15న ఎర్రకోటపై చేసిన తన 98 నిమిషాల సుదీర్ఘ ప్రసంగంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఉద్ఘాటించారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఒక ప్రధాని చేసిన సుదీర్ఘ ప్రసంగం ఇది. మోదీ ఇప్పటికి ఎర్రకోట మీద 11 సార్లు జెండా ఎగురవేసి, ఎక్కువసార్లు ఎగురవేసిన మూడో ప్రధానిగా నిలిచారు.భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఎర్రకోట మీద 17 సార్లు జెండా ఎగురవేశారు. ఆయన ప్రసంగాలు ప్రపంచ దేశా లను ఆకట్టుకున్నాయి. నెహ్రూ తన ప్రసంగాలలో భారత భౌగోళిక, సామాజిక, సాంస్కృతిక, చారిత్రక అంశాలతో పాటు ఆర్థిక అంశా లను, అంతర్జాతీయ అంశాలను ఉటంకించేవారు. నెహ్రూ గొప్ప చదువరి. స్వతహాగా పండితుడు. ప్రపంచ దేశాల ప్రధాన మంత్రులతో విస్తృతమైన స్నేహం ఉన్నవారు. ఆ తరువాత ఇందిరా గాంధీ 16 సార్లు ఎర్రకోట మీద పతాకను ఎగురవేశారు. ఇందిర ప్రసంగాలలో కూడా విస్తృతమైన అంశాలు చర్చలకు వచ్చేవి. పేదరిక నిర్మూలన, బ్యాంకుల జాతీయీకరణ, భూసంస్కరణల వంటి అనేక అంశాల్ని ఆమె పేర్కొన్నారు. భారత దేశ మౌలిక స్వభావాన్ని మార్చే భూసంస్కరణలు, బ్యాంకుల జాతీయీకరణ పెద్ద చర్చనీయాంశాలుగా మారాయి. స్వాతంత్రం వచ్చేనాటికి మన దేశ జనాభా 40 కోట్ల లోపే. ఇందిరాగాంధీ పాలన వరకు అది సుమారు 80 కోట్లు. ఇప్పుడు 140 కోట్లకు పెరిగింది. జనాభా ఇంతగా పెరిగిన ఈ సందర్భంలో ప్రజలందరూ ప్రధాని ఉపన్యాసంలో వచ్చే ముఖ్యమైన అంశాల కోసం ఎదురు చూడటం సహజం. ఇప్పటి జనాభాలో ప్రధానమైన శక్తిగా యువత 40 కోట్ల మందిగా ఉన్నారు. దగ్గర దగ్గర 67 కోట్ల మంది స్త్రీలు ఉన్నారు. భారత సమాజంలో కోటీశ్వరులు పెరుగుతున్నారు. 20 కోట్ల మంది కోటీశ్వరులు ఉంటే, పేదలు 70 కోట్ల మంది ఉన్నారు. సమాజం ఇంకా సామాజిక అసమానతలతోనూ, స్త్రీల అణచివేతల తోనూ, నిరుద్యోగ భారతంగానూ ఉన్న సందర్భమిది. అందుకే ప్రధాని ప్రసంగంలోని నిర్మాణాత్మకమైన అంశాల కోసం ప్రజలు ఎదురుచూశారు. ప్రధాని యువతకు నూత్న ఉపాధి అంశాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఉపాధి కల్పనలో గణనీయమైన ప్రగతి సాధించామన్నారు. దేశాభివృద్ధికి మరిన్ని నూతన ఆర్థిక విధానాలు అమలు చేస్తున్నామన్నారు. దేశాన్ని గ్లోబల్ మ్యాను ఫ్యాక్చరింగ్ హబ్‌గా మార్చడానికి ఇది సువర్ణావకాశం అని కూడా అన్నారు. ఇవన్నీ దేశ ప్రజలను ఉత్తేజితం చేసే మాటలే అయినప్పటికీ రెండు కోట్ల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామనే వాగ్దానం కనుమరు గైనట్టేనని అనిపించింది. నిజానికి ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తున్న రైల్వేలు, టెలిఫోన్లు, విద్యుత్, ఇంధన, అనేక భారీ పరిశ్రమలు కార్పొరేట్ చేతుల్లోకి వెళుతున్న సందర్భమిది. భారత రాజ్యాంగంలో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేస్తేనే భారత ఆర్థిక సంపద ఇతర దేశాల ఆర్థిక సంపదకు దీటుగా పెరుగుతుందని చెప్పారు.ఇకపోతే మోదీ గ్లోబల్ కంపెనీలను భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఆహ్వానించాలనీ, వాటిని ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభు త్వాలు తమలో తాము పోటీ పడాలనీ సూచించారు. నిజానికి మోదీ లక్ష్యం చేసిన 2047వ సంవత్సరానికి భారత జనాభా 170 కోట్లను దాటవచ్చును. ఇప్పటికే 70 కోట్ల మంది ప్రజలకు ఇళ్ళ స్థలాలు లేవు. 170 కోట్లకు జనాభా పెరిగినప్పుడు, విదేశీ కంపెనీలకు స్థలాలు యిచ్చుకుంటూపోతే 2047 కంతా భారతదేశ ప్రజలకు ఇళ్ళ స్థలం దొరక్కపోగా, కొన్ని దేశాలవలే మనమూ సముద్రాల పైన ఇళ్ళు నిర్మించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని భౌగోళిక శాస్త్రవేత్తలు అంటున్నారు. నరేంద్ర మోదీ ప్రసంగంలో దేశంలో సాంకేతిక రంగంలో ప్రధాన భూమికను వహిస్తున్న మైనారిటీలకు రాజ్యాంగం కల్పిస్తున్న హక్కుల విషయంలో మార్పులు తేవాలనే భావన కనిపిస్తుంది. ఈ విషయా లను హ్యూమన్ రైట్స్ వాచ్ ఖండించింది. ప్రధాని సహజంగా మతా తీత భావనలో ప్రసంగిస్తేనే దేశంలో సామరస్యత, శాంతి, క్రాంతి కలుగుతాయని లౌకికవాదుల భావన. నిజానికి సాంస్కృతిక లౌకిక వాదం అంటే చర్చనీయాంశం అవుతుంది. నెహ్రూ, ఇందిరాగాంధీ, వి.పి. సింగ్... వీరంతా భారతదేశం లౌకిక ప్రజాస్వామ్యదేశం అని చెప్పారు. ఇకపోతే రాజ్యాంగ సభ సమయంలో అంబేడ్కర్ మతాతీత లౌకిక భావనతో పాలకవర్గం ఉన్నప్పుడు దేశంలో సామరస్యం నెల కొంటుందనీ, ముస్లింలు, క్రైస్తవులు, పార్శీలు, జైనులుగా చెప్పబడు తున్న ప్రజలంతా భారతీయులేననీ నొక్కి వక్కాణించారు. మైనారిటీలు, దళితుల వెనుకబాటుతనాన్ని గూర్చి, వారి అభ్యున్నతికి పాటు పడాల్సిన అంశాలను గూర్చి అంబేడ్కర్ ఇలా చెప్పారు: సాంఘిక, ఆర్థిక, రాజకీయ విషయాల్లో మనలో మనకు తీవ్రమైన భేదాభిప్రా యాలున్నవని నేనేరుగుదును. అయినప్పటికీ మనమంతా కలిసి వివిధ ధోరణులనన్నింటిని సమన్వయింపజేసికొని ఒక దేశం, ఒకే ప్రజలు అనిపించే జాతీయ భావంతో మెలగ్గలిగే రోజులు రాగలవనే విశ్వసిస్తున్నాను. ఇకపోతే అనుక్షణం మారుతున్న ఆధునాతన యుగంలో విద్యకున్న విలువ మరి దేనికీ లేదు. అందులోనూ సాంఘిక గౌరవాన్ని పెంపొందించుకోవాల్సివున్న నిమ్న జాతుల్లో విద్య చాలా అవసరం.ఇకపోతే అంబేడ్కర్ ప్రతిపాదించిన సామాజిక విప్లవ సిద్ధాంతం భారతీయ సామాజిక పునర్నిర్మాణానికీ, దళితజాతుల విముక్తి పోరాటానికీ లక్ష్యాన్ని, గమ్యాన్ని నిర్దేశించింది. తరతరాలుగా భారతీయ సంస్కృతి కోల్పోయిన మానవతను, సమతను ఆయన విముక్తి పోరాటం పునరుజ్జీవింప జేసింది. నేడు భారతదేశంలో సమసమాజ నిర్మాణానికి ఉద్యుక్తులవుతున్న వారందరూ అంబేడ్కర్‌ను అధ్యయనం చేయకుండా, సమన్వయ పర్చుకోకుండా వారి పోరాటాల్లో విజయం సాధించటం అసాధ్యం. అంబేడ్కర్‌ను విస్మరించినవారు, అంబేడ్కర్‌ను అధ్యయనం చేయనివారు తమ లక్ష్యాల్లో, గమ్యాల్లో నిరంతర వైఫల్యం చెందుతూ ఆ వైఫల్యానికి కారణాలు గుర్తెరగలేక తిరోగమిస్తున్నారు. ఏ వ్యవస్థలోనైనా పునా దులతో సహా మార్పు తేవాలన్నప్పుడు, ఆ సామాజిక వ్యవస్థను మొత్తం శాస్త్రీయ దృక్పథంతో విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఆ అవసరాన్ని విస్మరించిన ఏ వాదమూ సజీవమైనది కాదు. ఈ వాస్తవాన్ని హిందూ కర్మవాదులు, కులవాదులు నిరంతరం విభేది స్తూనే ఉంటారు. అంబేడ్కర్ వారసులుగా వారితో మన యుద్ధం సాగుతూనే ఉంటుంది.ఇకపోతే భారతదేశాన్ని పాలించే పాలకులకు తప్పక కొన్ని అభ్యుదయ భావాలు ఉంటాయి, కాదనలేము, స్త్రీలపై జరిగే అత్యాచారాల విషయంలో ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపును అందరూ స్వీకరించాల్సిందే. ప్రతిపక్ష నాయకుణ్ణి మొదటి వరుసలో కూర్చో బెడితే బాగుండేది. ఎందుకంటే నెహ్రూ, వాజ్‌పేయి ఈ సంప్రదా యాన్ని పాటించారు. నిజానికి తన సుదీర్ఘమైన ప్రసంగంలో రాజ్యాంగ కర్తను బహుదా ప్రస్తావించటం ఆయన ధర్మం. అస్పృశ్యతా నివారణ, కులనిర్మూలన, దళితుల రక్షణ, పౌరహక్కుల రక్షణ, విశ్వ విద్యాలయాల్లో శాస్త్రీయభావాల పెంపునకు సంబంధించిన రాజ్యాంగ స్ఫూర్తి కలిగి ఉండటం ఒక చారిత్రక అవసరం. ఏమైనా అంతిమంగా అంబేడ్కర్ రాజ్యాంగమే స్వాతంత్య్ర దినోత్సవ ఆశయాలకు దిక్సూచి. అంబేడ్కర్ మార్గమే భారతదేశ అభివృద్ధికి ప్రధాన భూమిక. ఆ మార్గంలో పయనిద్దాం!డా‘‘ కత్తి పద్మారావువ్యాసకర్త దళితోద్యమ నాయకుడు ‘ 98497 41695 -
ఓటు ప్రజాస్వామ్య జీవధాతువు
భారతదేశంలో రాజకీయాలు 2024 సార్వత్రిక ఎన్నికల శంఖారావంతో ఊపందుకున్నాయి. ఓటరు చైతన్యం ఇందులో కీలకం. ఓటు దేశ ప్రజలకు జీవధాతువు. మన జీవిత నిర్మాణానికి అది ఒక పనిముట్టు. ఓటుహక్కును మనం దుర్వినియోగం చేసుకుంటే, మన మిగిలిన హక్కులన్నీ కాల రాయ బడతాయి. అందుకే ఓటు అనేది అత్యున్నతమైనది. దాని విలువ అమూల్యమైనది. ఆ విలువ మానవ విలువలతో సమానమైనది. భిన్న భావజాలాల ప్రభావం ఈ ఎన్నికల మీద ఉండబోతోంది. అంబేద్కర్ వాదుల, సామ్యవాదుల, సోషలిస్టుల, కమ్యూనిస్టుల, స్త్రీవాదుల, దళిత బహుజన వాదుల, మైనారిటీ హక్కుల వాదుల, మానవ హక్కుల పోరాటవాదుల సిద్ధాంతాల ప్రజ్వలనం సమాజంలో అంతర్గతంగా బలంగా ఉందని చెప్పక తప్పదు. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) మళ్ళీ తెరపైకి వచ్చింది. సార్వత్రిక ఎన్నికలకు మరో మూడు నాలుగు రోజుల్లో షెడ్యూలు వస్తుందనగా... బీజేపీకి ఓట్లు కురిపిస్తుందని భావిస్తున్న సీఏఏను మోదీ సర్కారు బ్రహ్మాస్త్రంగా బయటికి తీసింది. పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు మనదేశ పౌరసత్వాన్ని కల్పించడం దీని లక్ష్యం. సీఏఏ చట్టం 2019 లోనే పార్ల మెంట్ ఆమోదం పొందినా, రాష్ట్రపతి సమ్మతి కూడా లభించినా... విపక్షాల ఆందోళనలు, దేశవ్యాప్తంగా నిరసనల కారణంగా అమలులో జాప్యం జరిగింది. పూర్తిస్థాయి నిబంధనలపై సందిగ్ధం నెలకొనడంతో చట్టం కార్యరూపం దాల్చలేదు. సార్వత్రిక ఎన్నికలకు ముందే దీన్ని అమల్లోకి తీసుకొస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పలుమార్లు చెబుతూ వచ్చారు. సరిగ్గా అదను చూసి ఇపుడు దానిని తెరపైకి తెచ్చారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ నుంచి 2014 డిసెంబర్ 31 కంటే ముందు మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీలకు ఈ చట్టం వర్తిస్తుంది. భారతదేశంలోకి అనేక మతాలవారు ఆయా కాలాల్లో వచ్చారు. భారతీయ జన జీవనంలో కలసిపోయారు. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చే నాటికి అన్ని మతాలవారు, కులాల వారు కలసి పోరా డారు. భారతదేశానికి మొదటి ఎన్నికలు జరిగినప్పటి నుండి ముస్లింలకు పార్లమెంట్‌లోనూ, అసెంబ్లీలోనూ ప్రాతినిధ్యం ఇస్తూ వస్తు న్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1952లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో ముస్లిం సభ్యులు 76 మంది ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో ముస్లిం ఎంపీలు గణనీయంగా ఎన్నికయ్యారు. ఆనాడు ముస్లింల జనాభా 6 శాతం కంటే తక్కువ. మొదటి రాజ్యసభలో సుమారు 10.5 శాతం ముస్లిం సభ్యులున్నారు. 2014లో బీజేపీ స్వల్ప మెజారిటీతో లోక్‌సభ ఎన్నికలలో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ అధికారానికి వచ్చిన నాటి నుండి ముస్లింల ప్రాతినిధ్యం అత్యల్పం. అందుకే 2024 ఎన్నికల్లో ముస్లింలు ఏకమై సెక్యులర్ పార్టీలకు ఓట్లు వేస్తారని ఒక పరిశోధనా పత్రం పేర్కొంది. బీజేపీపై పోటీ చేసే బలమైన అభ్యర్థికి ఓట్లు వేస్తారని ఆ పరిశోధన అంచనా వేసింది. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 27 మంది ముస్లిం అభ్యర్థులు గెలవగా (17వ లోక్‌సభ), 16వ లోక్‌సభలో 23 మంది ముస్లిం సభ్యు లున్నారు. పార్లమెంట్ చరిత్రలో ఇది ముస్లింలు తక్కువ సంఖ్యలో వున్న రెండోసభ. ప్రపంచంలో భారత్ మూడవ అతిపెద్ద ముస్లిం జనాభా (17.22 కోట్లు్ల) కలిగివున్న దేశం. నిజానికి ముస్లింలు ఈ దేశ స్వాతంత్య్రంలో పాల్గొన్న ప్రధానమైన శక్తులు. వారిని నిర్లక్ష్యం చేయడం దేశ అభివృద్ధికి, సౌభాగ్యానికి గొడ్డలిపెట్టు. క్రైస్తవులు భారతదేశానికి ఇతర దేశాల నుండి వలస వచ్చినవారు కాదు. హిందూమతంలో అస్పృశ్యతకు, నిరాదరణకు గురైనవారు ఆ మతంలోకి వెళ్ళి అక్షర విద్యను నేర్చుకున్నారు. దళితులు ఎక్కువ మంది క్రైస్తవ మతంలో చేరి అక్షర విద్యను నేర్చుకున్నారు. వారిని నిరాకరించడం వల్ల, జనరల్ సీట్లలో ప్రాతినిధ్యం ఇవ్వకపోవడం వల్ల లౌకికవాదం దెబ్బతింటుంది. ఇక బౌద్ధం భారతదేశంలో సామాజిక, సాంస్కృతిక విప్లవాన్ని తీసుకువచ్చింది. సమసమాజ భావాన్ని ప్రజ్వ లింప చేసింది. మానవతా ధర్మాన్ని ప్రబోధం చేసింది. భారతదేశ వ్యాప్తంగా బౌద్ధ సంస్కృతి వికాసం జరిగింది. భారతదేశం నుండి ప్రపంచ దేశాలకు బౌద్ధం విస్తరించింది. భారతదేశ వ్యాప్తంగా బౌద్ధులు కోట్లాది మంది వున్నారు. వారు ప్రత్యక్షంగా లేకపోవచ్చు. పరోక్ష రాజకీయ ఉద్యమంలో వున్నారు. తప్పకుండా భారత రాజ కీయాల్లో వీరి ప్రభావం స్పష్టంగా వుంది. ఇకపోతే రావ్‌ు మనోహర్ లోహియా ప్రభావం దళిత బహుజన రాజకీయాల మీద బలంగా వుంది. మండల కమిషన్ రిపోర్టును బయటికి తీసుకొచ్చిన వి.పి.సింగ్ ప్రభావం కూడా బలంగా వుంది. కమ్యూనిస్ట్‌లు, అంబేడ్కర్ వాదుల అశేషమైన భావజాలం కూడా 2024 ఎన్నికల మీద వుంది. భారతదేశంలో అనేక భావజాలాల ప్రభావానికి ఈ ఎన్నికలు గురవు తాయి అనడంలో సందేహం లేదు. ఫూలే, అంబేడ్కర్, రావ్‌ు మనో హర్ లోహియా, పెరియార్ రామస్వామి నాయకర్, వి.పి. సింగ్, కాన్షీరావ్‌ు... వీరందరి ప్రభావం తప్పక ప్రజల మీద ఉంది. ఇకపోతే 2014లో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గడిచిన తొమ్మిదేళ్ళ పది మాసాల్లో పెరిగిన నిరుద్యోగం, చుక్కలనంటిన నిత్యావసరాల ధరలు, నల్ల ధనాన్ని వెనక్కి తీసుకురావడంలో విఫలం కావడం, సామాన్య మధ్య తరగతి ప్రజలు ఎదుర్కొన్న అష్ట కష్టాలను ప్రధానాంశాలుగా ప్రతిపక్షాల కూటిమి ‘ఇండియా’ విస్తృతంగా ప్రచారం చేయాలి. మాజీ ఎన్నికల కమిషనర్ టి.ఎన్. శేషన్ చెప్పినట్లుగా దశ మహపాతకాలు దేశ ఎన్నికల వ్యవస్థను కరకర నమిలేస్తున్నాయి. భారతదేశంలో ఎన్నికలు కొత్త కాదు. ప్రజలు చైతన్యవంతులు, ఆలోచనాపరులు. అయితే, యువతకు ఉద్యోగ వసతి కల్పిస్తారనీ, ఆర్థిక అభివృద్ధి చేస్తారనీ ఎక్కువమంది మోదీకి ఓట్లు వేశారు. కానీ పేద ప్రజలకు భరోసాని ఇచ్చే ‘జాతీయ గ్రామీణ ఉపాధి హామి’ పథకాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నీరుగార్చింది. స్వేచ్ఛగా, సక్రమంగా ఎన్నికలు నిర్వహించడమనేది కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యాంగ బద్ధ విధి. ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు నిర్వహించడం వల్ల కొంత మేలు ఉన్నప్పటికీ, లోపాలు కూడా లేక పోలేదు. సున్నితమైన నియోజకవర్గాల్లో, ఎన్నికల సంబంధ హింసాకాండ చోటు చేసుకొనే అవకాశమున్న పోలింగ్ కేంద్రాల్లో తగిన సంఖ్యలో కేంద్ర బలగాలను మోహరించడానికి విడతలవారీ ఎన్నికల నిర్వహణ దోహదపడుతుంది. 85 ఏళ్ళ వయస్సు పై బడిన వారందరూ ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. 85 వయస్సు పైబడిన ఓటర్లు దేశ వ్యాప్తంగా 82 లక్షల మంది ఉన్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఇందులో వందేళ్ళు దాటిన ఓటర్లు 2 లక్షల 18 వేల మంది వున్నారు. భారతదేశ రాజకీయాల్లో ఈనాడు అనివార్యంగా ఓబీసీలకు సీట్లు పెంచవలసిన చారిత్రక అవసరం ముందుకు వచ్చింది. బీసీలు వృత్తికారులే కాక, శ్రామికశక్తులు! చాలామంది బీసీలు తమ విముక్తిదాతైన ఫూలే గూర్చి తెలుసుకోలేకపోతున్నారు. మహాత్మా ఫూలే ఓబీసీలకు అర్థమైనపుడే వారిలో సామాజిక, రాజ కీయ చైతన్యం వస్తుంది. స్త్రీలకు కూడా మునిపటి కంటే ఎక్కువ సీట్లు ఇస్తారు. విద్యాధికులు, రిటైర్డ్ ఆఫీసర్లు, అడ్వకేట్లు, పాత్రికేయ ప్రము ఖులు, రిటైర్డ్ జడ్జిలు, రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఇప్పుడు రాజకీయ రంగంలోకి దూకారు. ఆంధ్రప్రదేశ్‌లోకి బీజేపీని ఆహ్వానించడం వల్ల చంద్రబాబు ముస్లింల, క్రైస్తవుల, సోషలిస్టుల, కమ్యూ నిస్టుల ఓట్లు కోల్పోతున్నారు. రాజ్యాంగేతరమైన భావజాలం ఎన్ని కలలో పెరగడం ఆశ్చర్యకరం. అయితే భారతదేశంలో ఇవన్నీ అనేక సందర్భాలలో జరుగుతూ వచ్చాయి. వాటన్నింటినీ భారతదేశం తట్టుకొని నిలబడుతూ వచ్చింది. బీజేపీ తన వ్యూహ ప్రతి వ్యూహ రచనల్లో ప్రధానంగా పార్టీలను చీల్చడం, లొంగదీసుకోవటం వంటి అనేక వ్యూహాలతో ముందుకువెళ్తోంది. కానీ భారత రాజ్యాంగాన్ని దాటి వెళ్లే శక్తి ఏ వ్యక్తికీ, ఏ పార్టీకీ లేదని మనం తప్పక నమ్మాలి. దాని అంతర్గత శక్తి బౌద్ధ సూత్రాలతో నిండి ఉంది. అందుకే 2024 ఎన్నికలకు దళిత బహుజన లౌకికవాద భావజాలంతో ముందుకు నడవాల్సిన చారిత్రక సందర్భం ఇది. డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు ‘ 98497 41695 -
ఈ యుగం బాబాసాహెబ్‌దే!
ఇవ్వాళ పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు అందరూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్‌ను భుజానికి ఎత్తుకుంటున్నారు. ఇందులో కొందరు అంబేడ్కర్ చెప్పిన సామాజిక న్యాయాన్ని ప్రజలకు అందించేవారూ ఉన్నారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... బాబాసాహెబ్ ఏం చెప్పారో దానికి పూర్తి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ దేశ రాజ్యాంగ మౌలిక సూత్రాలనే దెబ్బతీయ చూస్తున్నవారూ ఉండటం! విభిన్న భౌగోళిక ప్రాంతాలూ, అనేక జాతులూ, మతాలూ, కులాలూ, భాషలూ ఉన్న భారతదేశం సమాఖ్య లౌకిక రాజ్యంగా విలసిల్లాలని అంబేడ్కర్ ఆశించారు. ఆ మేర రాజ్యాంగంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కానీ నేడు కొందరు పాలకులు, ప్రభుత్వాలు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు తూట్లు పొడిచే విధంగా అడుగులు వేస్తుండడం విషాదకరం. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 132వ జయంతి సందర్భంగా, ప్రపంచవ్యాప్తంగా ఆయన వ్యక్తిత్వాన్ని గురించి, సిద్ధాంత అన్వ యం గురించి ముఖ్యంగా భారత రాజ్యాంగ నిర్మాణం గురించి, కుల నిర్మూలనా సిద్ధాంత ప్రతిపాదన గురించి చర్చ జరుగుతోంది. ఆయన తన జీవిత కాలంలో విస్తృతంగా రచనలు చేశారు. ఆయన మేధో సంపన్నత ఆయన గవేషణ పద్ధతిలోనే ఉంది. ముఖ్యంగా వేదాలను పరిశీలించిన పద్ధతి వినూత్నమైనది, విప్లవాత్మకమైనది. ఎందుకంటే అంతకుముందు వేదాల గురించి పరిశోధించిన మాక్స్ ముల్లర్, సురేంద్ర దాస్ గుప్తా, సర్వేపల్లి రాధాకష్ణన్ వంటివారు ఎవరూ కూడా వేదాలు అశాస్త్రీయమైన భావాలతో రూపొందాయని చెప్ప లేకపోయారు. ముఖ్యంగా శంకరాచార్యులు, రామా నుజాచార్యులు, మధ్వాచార్యులు తమ తమ కోణాల్లో వేద సమర్థుకులుగా భాష్యం రాసు కున్నారు. అంబేడ్కర్ ఒక్కరే వేదాలను, భగవద్గీ తను హింసాత్మక గ్రంథాలుగా పేర్కొన్న సాహస వంతుడు. అలాగే ఆయన ‘శాక్రెడ్ ఆఫ్ ఈస్ట్’ పేరుతో వచ్చిన 50 వాల్యూమ్స్ చదివి రాసుకున్న నోట్స్ ఎంతో విలువైనది. దాన్ని ముద్రిస్తే ప్రపంచ మూల తత్త్వ శాస్త్రానికి ఎంతో విలువైన సమా చారం జోడించగల గ్రంథాలు అందుబాటులోకి వస్తాయి. ఆయన తాత్త్విక దర్శనాలు శాస్త్రీయమైన చర్చతో కూడి ఉంటాయి. మార్క్స్, ఎంగెల్స్‌లు రాసిన ‘కమ్యూనిస్ట్ మేనిఫెస్టో’, ఎంగెల్స్ రాసిన ‘డైలెక్టిక్స్ ఆఫ్ నేచర్’, మోర్గాన్ రాసిన ‘ఏన్షియంట్ సొసైటీ’ వంటి వాటి స్థాయిలో... ఆయన తాత్విక, సామాజిక, రాజకీయ చర్చలు ఉంటాయి. వేదాల గురించి అంబేడ్కర్ ఇలా అన్నారు. ‘వేదాలు హిందువుల మతసాహిత్యంలో అత్యు న్నత స్థానాన్ని ఆక్రమించుకున్నాయని చెప్పడం వాటిని గురించి చాలా తక్కువ చెప్పినట్టే అవుతుంది. వేదాలు హిందువుల పవిత్ర సాహిత్యం అని చెప్పినా సరిపోనిదే అవుతుంది. ఎందుచేతనంటే అవి తప్పు పట్టడానికి వీలు లేనివి. వాటిని అపౌరు షేయాలని నమ్ముతారు కాబట్టి’. అంటే వేదాలు మానవ కల్పితాలు కావు అని అర్థం. మానవ కల్పితాలు కాకపోవడం వల్ల సాధారణంగా ప్రతి మానవుడు చేసే తప్పిదాలకు, దోషాలకు, పొరపాట్లకు అవి అతీతంగా ఉంటాయి. అందుచేతనే అవి అమోఘమైనవిగా భారతీయులు నమ్ముతున్నారు. అయితే అంబేడ్కర్ వేదాలను మానవ మాత్రులైన రుషులే రచించారని చెప్పారు. ఒకరిని ద్వేషించే, అపహాస్యం చేసే, హింసను ప్రోత్సహించే ఏ గ్రంథా లైనా అవి విశ్వజనీనమైనవి కావు అని అంబేడ్కర్ చెప్పారు. అంబేడ్కర్ ప్రతిభ బహుముఖీనం. ప్రధానంగా ఆయన తాత్వికులు. ముందు తన్ను తాను తెలుసుకున్నారు. తర్వాత తన చుట్టూ ఉన్న సమా జాన్ని కూడా తెలుసుకున్నారు. తనకూ సమాజానికీ ఉండే అంతఃసంబంధాలను అధ్యయనం చేశారు. సమాజానికి అంతః ప్రకృతి అయిన రాజ్యాన్నీ, దాని అంగమైన ప్రభుత్వాన్నీ, వాటి పునాదుల్నీ పరిశోధించారు. వాటికీ తనకూ ఉండే వైరుధ్యాలనూ బయటకు తీశారు. ఈ దృష్టితో చూసిన ప్పుడు భారతావనిలో బుద్ధుని తర్వాత అంత లోతైన నైతిక వ్యక్తిత్వం అంబేడ్కర్‌దే అవుతుంది. ఆయన సామాజిక జీవితానికి పునాది బుద్ధుని బోధనా తత్వంలోనే అంతర్లీనంగా ఉంది. ఆయన బోధనలో ప్రేమ, కరుణ, ప్రజ్ఞ, ఆచరణ, దుఃఖ నివారణ, సంఘ నిర్మాణం, నైతికత, త్యాగం, ప్రధానమైనవి. ఆయన ఎంతో నిబద్ధంగా జీవించారు. రాత్రి పది గంటలకు ఆయన అన్నం తినేటప్పుడు పుస్తకాల జ్వలనంతో పాటు ఆకలి మంట కూడా రగులుతూనే ఉండేది. లండన్ వీధుల్లో అర్ధాకలితో తిరిగారు. ఆయన ధనాన్ని జ్ఞానానికి ఎక్కువ ఖర్చు చేశారు. ఆకలి తీర్చుకోవడానికి తక్కువ డబ్బు వాడేవారు. కాల్చిన రొట్టె ముక్క లను ఒక కప్పు టీలో ముంచి తిని అనంత అధ్యయనం చేసిన త్యాగశీలి ఆయన. ఈరోజు స్కాలర్‌షిప్‌తో చదు వుకుంటున్న కొందరు దళిత విద్యార్థులు తమ ఉపకార వేతనాన్ని విలాసాలకు వాడుతున్న వైనం చూస్తుంటే అంబేడ్కర్ నుంచి వీరు ఎంత నేర్చు కోవాలో అర్థమవుతుంది. అంబేడ్కర్ పరీక్షల కోసం చదవలేదు. విజ్ఞానం కోసం, అవగాహన కోసం సిద్ధాంత నిర్మాణం కోసం, సాక్ష్యాధారాల కోసం చదివారు. రాత్రంతా చదువుతూ కనిపించే అంబేడ్కర్‌తో రూవ్ుమేట్ ఎప్పుడైనా చదువు ఆపు అంటే...‘నా పరిస్థితులు, నా పేదరికం, నేను ఎంత త్వరగా విద్యార్జన పూర్తి చేస్తే అంత మంచిది. నా కాలాన్ని నేను ఎంత విద్యార్జనలో గడిపితే, ఎంత సద్వి నియోగం చేసుకుంటే అంత మంచిది’ అని చెప్పే వారు. ఆయన చదువు పట్ల చూపిన నిబద్ధతని ఈనాటి దళిత విద్యార్థి లోకం అనుసరించినట్లయితే మేధోసంపన్నత వీరి సొంతమై వీరు భారత దేశ పునర్నిర్మాణానికి ముందుకు వస్తారు. నీటి వినియోగం పైన అంబేడ్కర్ పెట్టిన శ్రద్ధ ఏ జాతీయ నాయకుడూ పెట్టలేదు. అంతగా పట్టించుకోలేదు. ఆయన ప్రణాళికలు నిర్దిష్టమై నవి. కార్మి కుల అభివృద్ధి కోసం, వ్యవసాయ, వ్యవసాయేతర కార్మికులకు ఉపాధి కల్పించాలని ఆయన పోరా డారు. గ్రామీణ శ్రామి కులను పారిశ్రామిక పనుల్లో ఉపయోగించుకుంటే పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కొలంబియా, హార్వార్డ్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలలో అంబేడ్కర్ మీద జరిగి నంత పరిశోధన భారతదేశంలో జరగడం లేదు. అన్ని కేంద్రీయ, రాష్ట్రీయ, దేశీయ విశ్వ విద్యాలయాల్లోనూ అంబేడ్కర్ పరిశోధనా కేంద్రాలు నిర్మించి... తగినన్ని నిధులు ఇచ్చి ప్రోత్సహించటం ద్వారా ఆయన రచనల లోని ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, విద్యా అంశాలపై పరి శోధనలు జరిగేలా చూడాలి. ఆయన నడిపిన పత్రికలు, ఆయన నిర్మించిన సంస్థలు, పార్టీలు, ఆయన ప్రణాళికలు దేశ భవిష్యత్తుకు మార్గదర్శ కాలు. ముఖ్యంగా భూమినీ, పరిశ్రమలనూ జాతీయం చేయాలనే ఆయన ఆలోచన... దళిత, బహుజన, మైనారిటీలు రాజకీయ అధికార సాధన మీద ఆధారపడి ఉంది. అంబేడ్కర్ ముందటి భారతదేశం వేరు. ఆయన తర్వాతి భారతదేశం వేరు. అందుకే అంబేడ్కర్ యుగ కర్త. ఈ యుగం ఆయనదే. ఆయన మార్గంలో నడుద్దాం. డాక్టర్ కత్తి పద్మారావు వ్యాసకర్త దళిత ఉద్యమ నాయకులు రాజ్యాంగం నిర్దేశించిన సూత్రాల ప్రకారమే భారత్‌లో సమాఖ్య ప్రభుత్వాలు పూర్తిగా నడవక పోయినా... రాజ్యాంగ మౌలిక సూత్రాలను మాత్రం గత ఆరు దశాబ్దాల్లో అవి అతిక్రమించ లేదనేది వాస్తవం. ఒక వేళ అటువంటి పరిస్థితులు తలెత్తినా న్యాయవ్యవస్థ ఎప్పటికప్పుడు తన న్యాయ సమీక్షాధికారం ద్వారా రాజ్యాంగాన్ని రక్షిస్తూ వచ్చింది. ఆర్ఎస్ఎస్ భావజాలం పుణికిపుచ్చుకున్న బీజేపీ ‘ఒకే జాతి, ఒకే భాష, ఒకే దేశం’ అంటూ నియంతృత్వ భారతాన్ని నిర్మించడానికి వడి వడిగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. భారత రాజ్యాంగం బోధిస్తున్న బహుళత్వం, పరస్పర సహకారం, రాష్ట్రాల హక్కులు, స్థానిక స్వయం పరిపాలన వంటి వాటిని తుంగలో తొక్కడానికే అఖండ ఏకైక భారత్ ప్రాపగాండా అనేది స్పష్టం. ఈ దేశంలోని వేల కులాలు, విభిన్న జాతులు, మతాలు, ప్రాంతాల అస్తిత్వాలను కనుమరుగు చేసి మెజారిటీ మతాన్నీ, భాషనూ ఇతరులపై రుద్దడానికి చేస్తున్న ప్రయత్నాలను ఇంతకన్నా ఏవిధంగా అర్థం చేసుకోవాలి? ‘రాష్ట్రాలు మిథ్య, కేంద్రమే నిజం’ అన్న రీతిలో కేంద్రంలోని అధికార పార్టీ విధానాలు సాగుతున్నాయి. ఇదే సమయంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ మాత్రం చైతన్యరహితంగా తన పాత పద్ధతుల్లోనే వ్యవహ రిస్తూ అనేక రుగ్మతలతో కునారిల్లుతోంది. దేశ నవ నిర్మాణంపై స్పష్టమైన జాతీయ విధానాలు లేని మిగతా జాతీయ పార్టీలు నామమాత్రంగానే మను గడ సాగిస్తున్నాయి. మరో పక్క చాలా ప్రాంతీయ పార్టీలు అవినీతికి, కుటుంబ పాలనకు కేరాఫ్ అడ్రస్‌గా ఉంటూ జాతీయ రాజకీయాల్లో ప్రభావ వంతమైన పాత్రను పోషించే స్థితిలో లేవు. ఈ పరిస్థితులను అనువుగా తీసుకుని బీజేపీ ఈసారి పార్లమెంట్లో అత్యధిక మెజారిటీ సాధించడంతో పాటూ, దేశంలోని సగానికి పైగా రాష్ట్రాల్లో ప్రభుత్వాలను హస్తగతం చేసుకోవాలని వ్యూహం పన్నుతోంది. నిజంగా ఈ వ్యూహం ఫలిస్తే రాజ్యాంగానికి భారీ సవరణలు చేపట్టి దాని మౌలిక స్వరూపాన్ని మార్చడం బీజేపీకి సులువవుతుంది. మెజారిటీ మతం దేశ ప్రజలందరి మతం అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఆ మతానుయాయుల సంస్కృతే మొత్తం దేశ సంస్కృతిగా చలామణీ అవుతుంది. ఇప్పటికే మైనారిటీలు, నిమ్నవర్గాల ఆహార విహారాలపై ఛాందసవాదుల దాడులు, ఆంక్షలను చూస్తూనే ఉన్నాం. బీఫ్‌ను ఆహారంగా తీసుకున్న వారు మత విలువల్ని కించపరచిన వారుగా దాడులకు గురవుతున్నారు. ఎక్కువగా ఉత్తరాదికి పరిమితమైన మూక దాడుల సంస్కృతిని దక్షిణాదికీ, ఈశాన్య భారతానికీ ఛాందస వాదులు విస్తరింపచూస్తున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశ మైన భారత్‌లో ఇప్పటి వరకు ఎలాంటి సైనిక, ప్రజా తిరుగుబాటులు జరుగలేదంటే అందుకు రాజ్యాంగం ఇచ్చిన లౌకిక ప్రజాస్వామ్య విలువలే ప్రధాన కారణం. అన్ని కులాలూ, జాతులూ, మతాలూ, భాషలూ, ప్రాంతాలకు సమాన ప్రాతినిధ్యం, హక్కులు కల్పించడమనే మౌలిక సూత్రం రాజ్యాంగంలో ఉన్నది కాబట్టే తిరుగుబాట్లు తలెత్తలేదు. కానీ ఒకే దేశం, ఒకే జాతి లాంటి నినాదాలను ముందుకు తెచ్చి కేంద్రీకృత నియంతృత్వ విధానాలనూ, ఫాసిజాన్నీ దేశంలో అమలు చేయడానికి నేడు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అధికార పార్టీ తన నియంతృత్వ ధోరణిలో భాగంగానే పెద్ద నోట్ల రద్దు వంటి నిర్ణయాలను రాత్రికి రాత్రే తీసుకుని ప్రజలను ఇక్కట్ల పాలు చేసింది. ప్రాతినిధ్య ప్రజాస్వామ్య దేశ నిర్మాణంలో భాగంగా డాక్టర్ అంబేడ్కర్... ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సామాజికంగా వెనుక బడిన కారణంగా వారికి రాజ్యాంగంలో రిజర్వే షన్లు పొందుపరచి... విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అవకాశాలు కల్పించారు. కానీ అంబేడ్కర్ నిర్దేశించిన రిజ ర్వేషన్ల స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ ఆర్థికంగా వెనుకబాటు ఆధారంగా 10 శాతం అగ్ర వర్ణ పేదలకు రిజర్వేషన్లను ఎటువంటి కమిషన్ వేయ కుండా, ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మూడు రోజుల్లోనే పార్లమెంట్లో ఆమోదింపచేసుకున్న మోదీ ప్రభుత్వాన్ని ఏవిధంగా అర్థం చేసుకోవాలి? 6 కోట్ల జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు సామా జిక న్యాయాన్ని పాటిస్తూ అయిదుగురికి ఉప ముఖ్యమంత్రి పదవులనిచ్చి ముఖ్యమ్రంతి జగన్ దేశానికే ఆదర్శంగా నిలిచారు. 135 కోట్ల జనా భాను పాలించే బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కనీసం అయిదు ప్రాంతాలకు అయిదు గురు ఉపప్రధానులను చేస్తే తప్పేమిటి? 1955 లోనే మొదటి ‘రాష్ట్రాల విభజన కమిషన్’కు భారత రాజ్యాంగ పిత అంబేడ్కర్ ఓ లేఖ రాస్తూ... ఉత్తరాదిన ఢిల్లీని మొదటి దేశ రాజధానిగానూ, దక్షిణాదిన ఉన్న హైద్రాబాద్‌ను దేశ రెండో రాజ ధానిగానూ చేయాలని ప్రతిపాదించారు. ఇంత వరకు కాంగ్రెస్ కాని, బీజేపీ కానీ ఈ ప్రతిపాదనను పట్టించుకోలేదు. పాలన, అధికార వికేంద్రీకరణ జరిగితేనే కదా అన్ని ప్రాంతాల ప్రజలకూ న్యాయం జరిగేది. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా... 135 కోట్ల జనాభాకు కేవలం 29 రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయి. అన్ని అంశాల్లో అమెరికాను ఆదర్శంగా తీసుకుంటున్న భారత్ రాష్ట్రాల సంఖ్య విషయంలో ఎందుకు తీసుకోదో అర్థం కాదు. 35 కోట్ల జనాభాకన్నా తక్కువే ఉన్న అమెరికాలో 50 రాష్ట్రాలు ఉన్నాయి. స్వయం నిర్ణ యాధికారాలూ, సొంత సుప్రీంకోర్టు, సొంత రాజ్యాంగం, సొంత జెండా, ఎజెండా కలిగి ఉండే స్వేచ్ఛ అక్కడి రాష్ట్రాలకు ఉంది. అందుకే అక్కడ రాష్ట్రాలు సర్వతోముఖాభివృద్ధి చెందాయి. బాబా సాహెబ్ సూచించినట్లు భారత్‌లో 2 కోట్ల జనాభాకు ఒక రాష్ట్రం చొప్పున ఏర్పాటు చేస్తే మేలు జరిగి ఉండేది. జాతీయ వాదం ముసుగులో దళిత, మైనార్టీలపై దాడులు చేస్తే... దేశ జనాభాలో 35 శాతం ఉన్న ఈ వర్గాలు ఎలా నవభారత నిర్మాణంలో భాగస్వాములు అవుతాయి? అందుకే బీజేపీ పాల కులు దుందుడుకు పోకడలకు పోకుండా అంబే డ్కర్ ఆశయాల సాధనకు పాటు పడితే దేశం దానంతట అదే అభివృద్ధి చెందుతుంది. డా. గాలి వినోద్ కుమార్ వ్యాసకర్త ఫౌండర్ చైర్మన్, నవ భారత్ నిర్మాణ్ ఛారిటబుల్ ట్రస్టు (ఈ వ్యాసం Apr 14, 2023 రోజున sakshi.comలో ప్రచురితమైనది) -
నవ భారతంలోకి ముందడుగు
దేశంలో మహిళలు ఇప్పటికీ అర్ధ బానిసత్వంలోనే ఉన్నారు. పితృస్వామ్యం, సంకుచిత సామాజిక, సాంస్కృతిక విలువలు, లింగ వివక్ష వంటివి మహిళల వెనుకబాటుతనానికి కారణాలు. భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందక పోవడానికి కారణం, పితృస్వామ్యం. ఈ పరిస్థితి మారాలి. మహిళతో పాటు నిరుద్యోగి, రైతు, కార్మికుడు, యువత కూడా జీవన సంక్షోభంలో ఉన్నారు. స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామ్యవాద భావనలు కూడా సంక్షోభంలో పడ్డాయి. అందుకే 2024 సంవత్సరంలో ప్రజలు ఆత్మగౌరవంతో, అభ్యుదయ భావాలతో నడవాలి. గిరిజనులు, దళితులు, బహుజనులు, ప్రజాస్వామ్యవాదులు స్వేచ్ఛగా జీవించగలిగే నూత్న భారత నిర్మాణం కోసం కలిసికట్టుగా పనిచేయాలి. భారతదేశం లౌకిక దేశం. భారతాన్ని వర్ణ భారతంగా మార్చాలన్నది పెద్ద వ్యూహం. కానీ అది సాధ్యం కాదు. ఎందుకంటే డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామిక, లౌకిక రాజ్యాంగంగా రూపుదిద్దారు. దాని పునాదులను కదపటం ఎవరి వల్లా కాదు. అంబేడ్కర్ రాజ్యాంగ రూపకల్పనలో ఫ్రెంచి విప్లవంలోని వాల్టేర్, రూసో భావాలను తీసు కున్నారు. నిజానికి ఆయన రాజ్యాంగం పునాదుల పునర్నిర్మాణం నుండి ప్రారంభమైంది. రాజ్యాంగం ప్రకారం, ఆరు సంవత్సరముల వయసు పూర్తి అగు వరకు బాల బాలికల ఆరోగ్య పరిరక్షణకు, విద్యా వసతులు కల్పించటానికి ప్రభుత్వం కృషి చేయాలి. 14 సంవత్సరాల వయసు వచ్చువరకు బాల బాలికలకు ఉచిత నిర్బంధ విద్య నేర్పాలి. అయితే ఈనాటికీ బాల బాలికలకు పౌష్టిక ఆహారం పెట్టలేని స్థితిలో మనం ఉన్నాము. పసిపిల్లలకు పాలు ఇవ్వలేని స్థితిలో ఉన్నాము. పిల్ల లకు పౌష్టికాహారం కావాలి, ఆరోగ్య పరిరక్షణ కావాలి, పర్యావరణ పరిరక్షణ కావాలి. పురిటిలోనే శిశువులు చనిపోతున్న పరిస్థితులు పెరుగుతున్నాయి. ఒక శిశువుని పెంచి పోషించాలంటే పేదరాలైన తల్లి వల్ల కాదు. దానికి ప్రభుత్వపు, సమాజపు బాధ్యత కూడా కావాలి. నిజానికి ఒక శిశువు మరణిస్తే ఆ దేశానికి భవిష్యత్తు మరణించినట్టే. రాను రాను భారతదేశంలో ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతోంది. దానికి కారణం విపరీతంగా రేట్లు పెరిగిపోవడమే. 2019 జనవరి నుండి 2022 మే వరకు కూరగాయలు, పాలు, బెల్లం,దుంపలు, వంటనూనె, గుడ్లు, పంచదార ఉత్పత్తి, సరఫరా తగ్గు ముఖం పట్టాయి. బియ్యం, పప్పులు, ఉప్పులు కొనుక్కోలేని స్థితికి సామాన్యులు నెట్టబడుతున్నారు. కారణం కూరగాయలు రైతులకు గిట్టుబాటు కావడం లేదు. ఎరువులు, విత్తనాల ధరలు ఎక్కువవు తున్నాయి. అకాల వర్షాలకు రైతు కుదేలవుతున్నాడు. కాళ్ళు సన్నగా, కడుపులు బోలుగా, భుజాన కండలేక 40 కోట్ల మంది ఈసురోమంటున్నారు. ఇంక స్త్రీల విషయానికి వస్తే పురుషులు తినినంత కూడా తినలేక పోతున్నారు. వాళ్లు అర్ధ బానిసత్వంలోనే ఉన్నారు. వారితో ఆరు గాలం పనిచేయించుకుంటున్నారు. మహిళల్లో సగం మంది కూడా ఉద్యోగినులు లేరు. పితృస్వామ్యం, సంకుచిత సామాజిక, సాంస్కృతిక విలువలు, అల్ప విద్యాస్థాయి, తగు ఆస్తులు లేకపోవడం, లింగ వివక్ష, మహిళలపై నేరాలు, ఘోరాలు అత్యధికంగా ఉండడం వంటివి మహిళల వెనుకబాటుతనానికి కారణాలుగా చెప్పక తప్పదు. ఎన్సీ ఆర్బి (నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో) నివేదిక (డిసెంబర్ 2023) ప్రకారం, మహిళల పట్ల జరుగుతున్న నేరాలు 2021లో కంటే, 2022లో 4 శాతం అధికంగా సంభవించాయి. 2022లో మహిళలకు వ్యతిరేకంగా 4,45,000 నేర ఘటనలు జరిగాయి. కుటుంబ సభ్యుల క్రూరత్వం, దౌర్జన్యాలు ఈ నేరాలలో అత్యధికం. ప్రతీ జీవన వ్యవ హారంలోనూ, మరీ ముఖ్యంగా ఆదాయంలో లింగ వ్యత్యాసం, వివక్ష తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఉత్పత్తి కార్యకలాపాలలో పట్టణ మహిళల భాగస్వామ్యం 24.0 శాతం కాగా, పురుషుల శాతం 73.8 శాతంగా ఉన్నది. 2004–2005, 2011–2012 సంవత్సరాల మధ్య కార్మిక శ్రేణుల నుంచి దాదాపు రెండు కోట్ల మంది మహిళలు వైదొలిగారని ప్రపంచ బ్యాంకు నివేదికలు వెల్లడించాయి. ఈ అంతరాలను విస్మరించడమంటే, మహిళలు ఇంకా పలు దశా బ్దాల పాటు అణచివేతకు గురికావడమే అని నిష్కర్షగా చెప్పక తప్పదు. భారతదేశం పితృస్వామ్య వ్యవస్థా నిర్మాణంతో ఉంది.అంటే ప్రతీ అంశంలోనూ పురుషుడిదే ఆధిపత్యం. అందుకే ఆడశిశువు భ్రూణ హత్యలు ఎక్కువగా జరిగాయి. ఫలితంగా చాలామంది పురు షులకు ఇప్పుడు పెళ్ళి చేసుకోవడానికి అమ్మాయిలు దొరకడం లేదు. కొందరు ఎదురు కట్నం ఇచ్చి పెళ్ళి చేసుకుంటున్నారనే కథనాలు వినిపిస్తున్నాయి. మరోవైపు బాలికలు, యువతులను అపహరించడం, వారిని అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలించి వ్యభిచార వృత్తిలోకి దింపడం ఎక్కువవుతోంది. స్త్రీలను అవమానించడం, అను మానించడం, అపహాస్యం చేయడం, అత్యాచారం చేయడం, అణచి వేయడం నిత్యాచారమైంది. భారతదేశం అంతా ఆర్థికంగా అభివృద్ధి చెందక పోవడానికి కారణం, పితృస్వామ్యం. ముందుగా స్త్రీకి మనం పౌష్టికాహారం పెట్టగలగాలి. స్త్రీల పేరు మీద భూములకు పట్టా లివ్వాలి. బస్సుల్లోనే కాక రైళ్ళల్లోనూ, విమానాల్లోనూ ఉచిత సేవలు అందించాలి. అప్పుడు అన్ని చోట్లకీ ఆమె ప్రయాణించగలుగుతుంది. ప్రస్తుతం బంగారు నిల్వలు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి, మూడు శవర్లు బంగారం ప్రతీ స్త్రీకి ఇవ్వాలి. ఇకపోతే నిరుద్యోగుల సంఖ్య భారతదేశంలో పెరిగిపోతోంది. ‘స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా’ నివేదిక 2023 ప్రకారం, 25 సంవ త్సరాల లోపు వయసు పట్టభద్రులలో నిరుద్యోగితా రేటు 42.3 శాతం. 30 నుంచి 34 సంవత్సరాల వయసు పట్టభద్రులలో ఇది 9.8 శాతం. ఈ నిరుద్యోగిత పరిస్థితులు సమాజంపై విషమ ప్రభావాన్ని చూపుతున్నాయి. అంతర్గత వలసలు, అంతకంతకూ పెచ్చరిల్లుతోన్న నేరాలు, హింసాకాండ, మాదకద్రవ్యాల వినియోగం నిరుద్యోగిత పర్యవసానాలే అనడంలో సందేహం లేదు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామన్న పాలకపక్షం హామీ కేవలం ఒక ఎన్నికల జుమ్లా (వంచన) అని తేలిపోయింది. నిరుద్యోగులు ఎక్కువ మంది ఆత్మహ త్యలు చేసుకుంటున్నారు. ఎంఏ, ఎంఎడ్, బీటెక్, ఎంటెక్, బీఎస్సీ, బీఎడ్‌లు చేసి కూడా ఉపాధి పనులకు వెళ్తున్నారు. సింగపూర్‌లోని హ్యూమన్ క్యాపిటల్ లీడర్షిప్ ఇన్స్టిట్యూట్, మరికొన్ని సంస్థలు కలిసి ఏటా విశ్వ ప్రతిభా పోటీతత్వ సూచీ(జీటీసీఐ)ని వెలువరిస్తుంటాయి. విద్య, నైపుణ్య శిక్షణ, అవకాశాల లభ్యత, ప్రభుత్వాల చేయూత వంటి ప్రమాణాల ఆధారంగా ‘జీటీసీఐ’ని రూపొంది స్తాయి. 2023 సూచీలో 134 దేశాలకు గాను ఇండియాకు 103వ స్థానం దఖలుపడింది. అయినా, ప్రపంచంలో అతిపెద్ద ప్రతిభా కర్మా గారం ఇండియాయేనని ప్రభుత్వ వర్గాలు ఊదరగొడుతున్నాయి. ఆర్థిక సాంఘిక సాంస్కృతిక విద్యా సాంకేతిక రంగాలు సంక్షోభంలో ఉన్నాయి. శిశువు, స్త్రీ, నిరుద్యోగి, రైతు, కార్మికుడు, యువత జీవన సంక్షోభంలో ఉన్నారు. భారత రాజ్యాంగం సమర్పించిన స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, సమత, మమత, ప్రజాస్వామ్యం, లౌకిక వాదం, సామ్యవాదం కూడా సంక్షోభంలో పడ్డాయి. అందుకే 2024 సంవత్సరంలో ప్రజలు సామర్థ్యాన్ని పెంచుకొని, చైతన్యవంతంగా ఉత్పత్తిని పెంచుకోవాలి. సామరస్యతను పెంచుకొని ఆత్మగౌరవంతో, అభ్యుదయ భావాలతో నడవాలి. అంబేడ్కర్, ఫూలే, బుద్ధుని ఆశయా లతో సంపద అందరికి పంపిణీ అయ్యే విధానంతో సాగాలి. మొత్తం భారతదేశం 2025 జనవరి 1 కల్లా సంపూర్ణ అక్షరాస్యతను సాధించాలి. పారిశ్రామిక విప్లవంలో ముందడుగు వేయాలి. గిరిజనులు, దళితులు, బహుజనులు, ప్రజాస్వామ్యవాదులు స్వేచ్ఛగా జీవించ గలిగే నూత్న భారత నిర్మాణం కోసం అందరూ కలిసికట్టుగా పని చేయాలి. నదులను అనుసంధానం చేసుకొని ఎక్కువ ఎగుమతులు చేయగలిగిన స్థాయిలో ఉత్పత్తిని పెంచుకోవాలి. సాంకేతిక పరిజ్ఞా నాన్ని మరింతగా పెంచుకోవాలి. చంద్రుడినే కాదు, అనేక గ్రహాలను అధీనం చేసుకునే స్థాయికి ఎదగాలి. భౌతిక, రసాయన శాస్త్ర అధ్యయన విస్తృతి పెరగాలి. నోబెల్ బహుమతి పొందగలిగే స్థాయిలో విశ్వవిద్యాలయాలలో ఉన్నత విద్యను పెంచాలి. అన్ని దిశలా అన్ని రంగాల్లో భారతీయులందరం భాగస్వాములై భారత భాగ్యోదయా నికి కృషి చేద్దాం. చరిత్రను పాలకులు కాదు, ప్రజలే మారుస్తారు. చరిత్ర నిర్మాణానికి ముందుకు నడుద్దాం. డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు ‘ 98497 41695 -
స్త్రీశక్తి వినిమయంతోనే అభివృద్ధి!
ప్రపంచ వ్యాప్తంగా స్త్రీ కర్షకుల అసమానతల మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది, పోరాటం కూడా జరుగుతోంది. నిజానికి అనాది కాలం నుంచి ప్రధానమైన అసంఘటిత శ్రామికులుగా స్త్రీలు ఉన్నారు. వారు కేవలం శ్రామికులే కాదు, ఉత్పత్తి శక్తులు కూడా! కానీ వారిని రానురాను పురుషాధి పత్యంతో అన్ని రంగాల్లోనూ తొక్కివేశారు. శ్రామిక స్త్రీ ప్రపంచానికి ఊపిరి. స్త్రీ శక్తిని సంపూర్ణంగా వినియోగించుకోకుండా మనం అభివృద్ధి పథంలో పయనించలేం. కుల, మత, లింగ బేధాలు లేకుండా ఆత్మగౌరవంతో ముందుకు వెళ్ళవలసిన సందర్భం ఇది. నిజానికి మానవాళి చరిత్రలో జరిగిన మార్పులన్నీ స్త్రీలు ఉత్పత్తికి దగ్గరయ్యే క్రమంతోనే ముడిపడి వున్నాయి. పురుషులతోనూ, తన పిల్లలతోనూ, తల్లిదండ్రులతోనూ స్త్రీకుండే సంబంధ బాంధ వ్యాలే మానవాళి చరిత్ర. స్త్రీలకూ, పురుషులకూ మధ్య వ్యక్తమయ్యే ఐక్యత, ఘర్షణల్లో సామాజిక సంబంధాలు నిర్ణయమయ్యాయి. ఒక సారి మనం చరిత్ర పూర్వ యుగానికి వెళితే, ఉత్పత్తిలో తనకు సహకరించే పురుషుణ్ణి స్త్రీయే ఎన్నుకునేది. ఈ విధమైన పద్ధతి భారత సమాజంలో ఆర్యులు రాకపూర్వం వుండేది. ఆర్యులు వచ్చాక ఉత్పత్తి రంగం నుండి వారిని తప్పించి బానిసత్వంలోకి నెట్టారు. ఆదిమ సమాజం నుండి స్త్రీ గణనాయికగా, సామాజిక శ్రామిక శక్తిగా,పంపిణీదారుగా వేలాది సంవత్సరాల పాటు సమసమాజ భావనతో సమాజాన్ని నడిపించింది. హెన్రీ మోర్గాన్ తన ‘ప్రాచీన సమాజం’లో ఈ సమాజ పరిణామ క్రమాన్ని విశ్లేషించారు. 2018–19 పరిస్థితులతో 2022–23 పరిస్థితులను పీఎల్ఎఫ్ఎస్ (పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే) నివేదికతో సరిపోల్చితే పనిపరంగా స్త్రీల ముఖచిత్రం ఎలా మారిందో అర్థమవుతుంది. స్వీయ ఉపాధిపై ఆధారపడే మహిళలు 53 శాతం నుంచి 65 శాతానికి పెరిగితే, రెగ్యులర్ మహిళా ఉద్యోగులు 22 శాతం నుంచి 16 శాతానికి తగ్గారు. క్యాజువల్ ఉద్యోగులు 25 శాతం నుంచి 19 శాతానికి తగ్గిపోయారు. యజమానులుగా వుండే మహిళలు 23 శాతం నుంచి 28 శాతానికి పెరిగితే, జీతాలు లేని పనివారి వాటా 31 శాతం నుంచి 38 శాతానికి చేరుకుంది. అదే పురుషులలో ఈ శాతాలు కాస్త భిన్నంగా ఉన్నాయి. స్వీయ ఉపాధి పొందే పురుషులు ఈ ఐదేళ్లలో 52 శాతం నుంచి 54 శాతానికి పెరగగా, యజమానులు 44 శాతం నుంచి 44.3 శాతానికి, జీతాల్లేని సహాయకులు 7.6 శాతం నుంచి 9.3 శాతానికి పెరిగారు. వ్యవసాయంపై ఆధారపడే కార్మికుల వాటా 41 శాతం నుంచి 43 శాతానికి, నిర్మాణరంగ పనులను నమ్ముకునే వారి వాటా 12 శాతం నుంచి 13 శాతానికి పెరిగింది. స్త్రీ, పురుషుల మధ్య ఉపాధి, ఆదాయాలలో వ్యత్యాసాలకు సంబంధించిన 200 సంవత్సరాల రికార్డు లను విశ్లేషించి... నోబెల్ బహుమతి గ్రహీతలు ఎంతో ఆసక్తికర విషయాలను బయట పెట్టారు. ప్రపంచ వ్యాప్తంగా ఇంకా సుమారు 120 కోట్ల మంది పేదవారున్నారు. వీరిలో భారతదేశం, పాకిస్తాన్‌తో కూడిన దక్షిణాసియా ప్రాంతంలో అత్యధికంగా వున్నారని నివేదికలు చెబుతున్నాయి. ఆఫ్రికాలో 38 శాతం మంది పేదలు వున్నారు. అలాగే బహువిధ పేదరిక సూచీని నీతి ఆయోగ్ ఇటీవల వెలువరించింది. విద్య, వైద్యం, జీవన ప్రమాణాలు వంటి 12 అంశాల ఆధారంగా రూపొందే ఈ సూచీ ప్రకారం, 2015–16లో 25 శాతం వున్న బహువిధ పేదరికం 2019–21 నాటికి 15 శాతానికి తగ్గింది. ఉత్తరప్రదేశ్, బిహార్, రాజ స్థాన్, మధ్యప్రదేశ్, ఒడిశాలలో పేదరిక నిర్మూలనలో మంచి పురోగతి కనిపించింది. బిహార్‌లో 34 శాతం, జార్ఖండ్‌లో 28.8 శాతం, ఉత్త రప్రదేశ్‌లో 23 శాతం, మధ్యప్రదేశ్‌లో 21 శాతం, అస్సామ్‌లో 19 శాతం, ఛత్తీస్‌గఢ్‌లో 16 శాతం మేర బహువిధ పేదరికం తగ్గింది. అయినప్పటికీ, ఈ రాష్ట్రాల్లో పేదరికం జాతీయ సగటు కన్నా ఎక్కువే. ప్రపంచంలో పనిచేసే జనాభాలో మూడింట రెండొంతుల మంది అసంఘటిత రంగంలోనే వున్నారన్నది అంతర్జాతీయ కార్మిక సంఘం అంచనా. వీరు లాటిన్ అమెరికా, సహారా ఎడారి దిగువ దేశాలు, దక్షిణాసియా దేశాల్లోనే ఎక్కువగా ఉన్నారు. అసంఘటిత కార్మికుల్లో 58 శాతం మహిళలే. పురుషులతో పోలిస్తే వారి వేతనాలు తక్కువ. డిజిటల్ వేదికల ద్వారా ఉపాధి పొందేవారిని ప్లాట్‌ఫామ్ కార్మికులని అంటారు. అసంఘటిత రంగంలో వీరిని కొత్త వర్గంగా పరిగణిస్తున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వ్యవస్థలు వచ్చిన తర్వాత ఐటీ రంగంలో యువతులు ముమ్మరంగా ప్రవేశించారు. అమెరికా, ఆస్ట్రే లియా, కెనడా, ఇంగ్లాండ్ దేశాల్లో ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థలు ఎక్కువగా ఉన్నాయి. వీటికి అనుగుణంగా ఢిల్లీ, బాంబే, హైదరాబాద్, మంగుళూరు, కొచ్చిన్‌లలో భారతీయ యువతులు రాత్రివేళల్లో పని చేస్తున్నారు. దీంతో అనేకమంది ఇబ్బందులకు గురవుతున్నారు. స్మార్ట్‌ఫోన్ విప్లవం ద్వారా ఇప్పుడు పరిమిత కాల పనులు వచ్చాయి. భారత్‌లో ఈ తరహా గిగ్ వర్కర్ల సంఖ్య 80 లక్షలు. యువ జనులు, వలస వచ్చిన వారు ఈ ఉద్యోగాలను ఆశ్రయిస్తున్నారు. వీరి పని పరిస్థితులు మెరుగుపడాలనీ, వీరికి ఆరోగ్య బీమా, పింఛన్ సౌకర్యాలు అందించాలనీ ఆర్థికవేత్తలు సిఫార్సు చేస్తున్నారు. గిగ్ వర్కర్లలో కేవలం 12.2 శాతానికే ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా సౌకర్యం ఉంది. నాలుగు శాతం అటల్ పెన్షన్ పథకంలో చేరారు. సామాజిక భద్రత అంటే ఫించన్, ఆరోగ్య బీమా సదుపాయాలు రెండూ ఉండడం. దీన్ని ఎవరు కల్పించాలనేది ప్రశ్న. కేంద్ర ప్రభుత్వమా లేక డిజిటల్ ప్లాట్‌ఫామ్ కంపెనీలా? కంపెనీల నుంచి కొంత రుసుము వసూలు చేసి ప్రభుత్వ సంక్షేమ నిధిలో జమ చేయాలి. గిగ్ వర్కర్ల నైపుణ్య శిక్షణకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడానికి ప్లాట్‌ఫామ్ కంపెనీలు జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థతో కలసి సాగాలి. ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యాధిపత్యం, పెట్టుబడిదారీ వ్యవస్థ, భూస్వామ్య వ్యవస్థలు స్త్రీని ఇంకా బలహీనమైనదిగా చూస్తున్నాయి. ఈ ధోరణి అంతం కావాలంటే డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్, మహాత్మా ఫూలే ఆలోచనలతో ముందుకు సాగాలి. రాజ్యాంగ స్ఫూర్తిని అందు కోవాలి. కుల, మత, లింగ భేదాలు లేకుండా ఆత్మ గౌరవంతో ముందుకు వెళ్ళవలసిన సందర్భం ఇది. సంకెళ్ళు తెంచుకోవాల్సింది స్త్రీలే, ఎవరో కాదు. స్త్రీలు ఆత్మగౌరవ పోరాట పతాకాన్ని ఎగర వేయాలి. శ్రామిక స్త్రీ ప్రపంచానికి ఊపిరి! డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమనేత ‘ 98497 41695 -
బహుజనులకు అదే విముక్తి మార్గం
కోట్లాది మంది రాజ్యాధికారానికి నోచుకోకుండా పోవడానికి రాజకీయాల్లో ఉన్న వర్ణతత్వమే కారణం అన్నారు అంబేడ్కర్. నిజానికి అంబేడ్కర్, మహాత్మా ఫూలే, పెరియార్ రామస్వామి నాయకర్ బహుజన వర్గాల సామాజిక, సాంస్కృతిక రాజకీయ విముక్తి కోసం బాటలు వేస్తూనే వచ్చారు. కానీ దళిత బహుజనులు, మైనారిటీలు మత భావాల ఊబిలో కూరుకుపోయారు. రాజ్యాధికారాన్ని అగ్రవర్ణ పార్టీల మీద ఆధారపడి పొందాలనే భావనలోనే ఇంకా ఉన్నారు. దేశంలో సామాజిక న్యాయం సంపూర్ణంగా జరగాలంటే కులాల వారీగా జనాభా లెక్కలు సేకరించాలి. శూద్రులను రాజకీయంగా, ఆర్థికంగా పైకి తేవడం అన్ని పార్టీల తక్షణ కర్తవ్యం కావాలి. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రారంభించిన బీసీ కుల గణన ఇండియా కూటమికి ప్రధాన ఎజెండాగా ఉంది. దేశంలో సామాజిక న్యాయం సంపూర్ణంగా జరగాలంటే కులాల వారీగా జనాభా లెక్కలు సేకరించాలి. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజ స్థాన్, మిజోరం, తెలంగాణ వంటి ముఖ్యమైన రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో దగ్గర దగ్గర 16.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం ఓటర్లలో దళిత బహుజన మైనారిటీలు 85 శాతం. అభ్యర్థులుగా నిలబడుతున్న మెజారిటీ వర్గం అగ్ర కులాలే. డబ్బును, మద్యాన్ని నియంత్రించడానికి ఈ రాష్ట్రాల్లో 970 చెక్‌పోస్టులు పెట్టారని చెబుతున్నారు. నిజానికి ఎన్నికల వ్యవహారం మొత్తం మద్యం, మాఫియా, డబ్బు పంపిణీలో మునిగిపోయి వుందని అందరికీ తెలుసు. ఎన్నికల బరిలో కోటీశ్వరులు, అవినీతి సమ్రాట్లు, కల్తీ వ్యాపారులు, విద్యా వ్యాపారులు ఎక్కువమంది నిలబడుతు న్నారు. కేసుల్లో ఉన్నవారు భారీగా ఉన్నారు. దీనికి పార్టీల భేదం లేదు. అందులో ఉన్నవారు ఇందులో ఉంటారు. ఆ పార్టీలో ఉన్నవారు టికెట్ లేకపోతే రెండో రోజే జంప్ అవుతారు. సామాజిక న్యాయానికి దూరంగా బతుకుతున్న పార్టీలు ఇవన్నీ. ఇంతకుముందు ఇచ్చిన మానిఫెస్టోనే మరలా కొత్తగా ప్రకటిస్తారు. రాజ్యాంగాన్ని పూర్తి చేసిన తరువాత అంబేడ్కర్ చేసిన ప్రకటన చాలా విలువైనది. జనవరి 26, 1950 నుంచి వైరుద్ధ్యాల జీవితంలోకి మనం అడుగు పెడుతున్నాం. రాజకీయాల్లో, ఆర్థిక, సాంఘిక జీవి తాల్లో అసమానత్వం, వైరుధ్యాలను తొలగించకపోతే అసమానత్వంతో బాధపడుతున్న ప్రజలు ఈ రాజకీయ ప్రజాస్వామ్య వ్యవ స్థను పేల్చివేస్తారు అని హెచ్చరించారు. ఇది చాలా వాస్తవమైన ప్రక టన. రాజ్యాంగం ఇచ్చిన హక్కును గౌరవించలేని అంధత్వం సోకాల్డ్ రాజకీయ నాయకుల్ని వెంటాడుతోంది. అంబేడ్కర్ భారతదేశానికి బ్రాహ్మణవాదం, పెట్టుబడిదారీ వాదాలను శత్రువులన్నాడు. బ్రాహ్మణవాదం అంటే ఇది బ్రాహ్మణు లకు పరిమితమైంది కాదు. నా కులమే అన్ని కులాల కంటే అధికమైందనే భావం, ఆ కుల భావంతో ఇతరులను కించపరచడం. నేను, నా కుటుంబం, నా కులం మాత్రమే ఆర్థికంగా పైకి రావాలని ఆలోచించడం. కులాన్ని, కుటుంబాన్ని దాటలేనివాడు రాజనీతిజ్ఞుడు కాలేడు. అంబేడ్కర్ ఆలోచనలు ఆనాటి నుండి ఈనాటి వరకు సమ కాలీనంగానే ఉండడానికి కారణం సమాజంలో మార్పు చాలా ఆలస్యంగా జరుగుతోంది. నిజానికి కాంగ్రెస్ పార్టీ బీసీలకు మొదటి నుండి అన్యాయం చేస్తూనే వచ్చింది. కాకా కాలేల్కర్ కమీషన్‌ను తొక్కిపెట్టింది. మండల్ కమిషన్‌ను తొక్కి పెట్టింది. ఇకపోతే 1951లో రాజ్యాంగంలో 15(4), 16(4) క్లాజులను పొందుపరచి రాజ్యాంగ పరంగా బీసీ రిజర్వేషన్లకు వున్న అడ్డంకి తొలగించబడింది. అక్కడి నుండి 1978 వరకు పరిపాలనలో వున్న కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను తమ రాజకీయ చదరంగంలో పావులుగా వాడుకున్నదే తప్ప వారి సంక్షేమానికి ఇసుమంత సౌలభ్యాన్ని కూడా కలిగించలేదు. 2012– 1978న అప్పటి జనతాపార్టీ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ పార్లమెంటులో చేసిన ప్రకటన మేరకు మాజీ పార్లమెంటు సభ్యులు బి.పి. మండల్ అధ్యక్షతన వెనుకబడిన తరగతుల కమీషన్ నియమింపబడింది. ఆ కమీషన్లో ఆర్.ఆర్. బోలె, దివాన్ మోహన్ లాల్, దీనబంధు సాహు, కె. సుబ్రహ్మణ్యం, యన్.యన్. గిల్ సభ్యులుగా వున్నారు. ఈ కమిషన్ మొత్తం 40 సిఫార్సులను చేసింది. అందులో ప్రధానమైనవి: సాంఘికంగా, విద్యా విషయకంగా వెనుకబాటుతనం, ఆర్థిక పేదరికం అనేవి అంగవైకల్యం పొందిన కుల వ్యవస్థ తాలూకు రెండు ప్రత్యక్ష ఫలితాలు. వీటిని తొలగించడానికి తీవ్రమైన పరిపాలనా మార్పులు అవసరం; రిజర్వేషన్లు వుండడం వలన అర్హత, యోగ్యత ఏమీ దెబ్బతినవు. జనాభాలో 52 శాతం వున్న వీరికి ఆ జనాభాకు తగిన రిజర్వేషన్లు విద్యా ప్రభుత్వోద్యోగాల్లో వుండాలి; ఉద్యోగ నియా మకాలలో ప్రత్యక్షంగా భర్తీ చేసుకొనేటప్పుడు అభ్యర్థుల వయసు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల వలె పొడిగించాలి; ఆయా కులాల్లోని అభ్యర్థులు దొరకనపుడు ఖాళీలను మూడు సంవత్సరాల వరకు అట్టి పెట్టాలి; మిగులు భూముల పంపిణీ బీసీలకు కూడా జరపాలి; 3,743 కులా లను బీసీ కులాలుగా తేల్చారు. మండల్ కమిషన్ నివేదిక అమలు జరపకపోవడం వల్లే ఆనాడు కాంగ్రెస్‌కు బీసీలు దూరమయ్యారు. ఆ తరువాత జనతా పార్టీ ఏర్పడిన తరువాత మండల్ కమీషన్ నివేదికలోని కొన్ని అంశాలు అమలు జరపడం గురించే జన సంఘ్ బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీగా రూపొందింది. బీసీల రిజర్వేషన్ల విషయంలో బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఒకటిగానే ఉన్నాయని మాజీ ప్రధాని వీపీ సింగ్ ఈ వ్యాసకర్తతో స్వయంగా అన్నారు. బీసీలంతా హిందువులే అని బీజేపీ ప్రకటిస్తుంది. శూద్రులను క్షత్రియత్వం నుండి కిందకి నెట్టి బాని సలుగా మార్చారని అంబేడ్కర్ చెప్పారు. ఏ బానిసత్వాన్ని అయితే వైదిక, బ్రాహ్మణవాదం, హిందూ వాదం బీసీలపై రుద్దిందో వారు అదే హిందూ ఆచారాలని ఆచరించడం ఆశ్చర్యాన్ని కొలిపే విషయం. సామాజిక, రాజకీయ బానిసత్వం అనే భావజాలం కట్టు బాని సలుగా చేస్తుంది. శూద్రులను బానిసత్వం నుండి విముక్తి చేయడం కోసం, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో తీవ్రంగా కృషి చేశారు జ్యోతిబా ఫూలే. శూద్రులను రాజకీయంగా, ఆర్థికంగా పైకి తేవటం ప్రభుత్వ కర్తవ్యం. శూద్రుల మనస్సు çహృదయమూ సంతోషపడినట్ల యితే ముందు ముందు బ్రిటిష్ ప్రభుత్వం వారి విధేయత గురించి ఆలోచించవలసిన అవసరమే రాదు అన్నారు జ్యోతిబా. ఆయన ఉద్యమం 1840 నుండి 1880 వరకు బలంగా సాగింది. ఆయన సత్య శోధక్ సమాజాన్ని స్థాపించి శూద్రుల్లోనూ, దళితుల్లోనూ ఉత్తేజక రమైన మార్పులు తీసుకువచ్చాడు. శూద్రుల్లోని భూస్వామ్య కులాలు ఓబీసీల నుండి విడిపోయాక బ్రాహ్మణవాదులు, భూస్వామ్య కులాలు కలసి ఓబీసీలను, దళితులను అణుస్తూ వచ్చాయి. నిజానికి 1870 దశకంలోనే జ్యోతిబా, ఆయన శ్రీమతి నిమ్న జాతుల పాఠశాలల కోసం సుమారు పది సంవత్సరాల పాటు కృషి చేశారు. అవి స్థిరపడ్డా యనుకొన్న తర్వాతనే ఇతర సాంఘిక, సేవా కార్యక్రమాలవైపు దృష్టి మళ్ళించారు. అయితే విదేశీయుల ఆదరణ తగ్గటం, స్థానికులు వాటిపై తగినంత శ్రద్ధ చూపకపోవటం వంటి కారణాల వల్ల అవి ప్రత్యేకంగా నిలబడలేకపోయాయి. నిజానికి దళితులని, శూద్రులని ఎప్పటికప్పుడు నూత్నమైన నినాదాలతో అగ్రకుల పార్టీలు మోసం చేస్తూనే వస్తున్నాయి. అంబేడ్కర్, మహాత్మా ఫూలే, పెరియార్ రామస్వామి నాయకర్ ఈ వర్గాల సామాజిక, సాంస్కృతిక రాజకీయ విముక్తి కోసం బాటలు వేస్తూనే వచ్చారు. కానీ దళిత బహుజనులు, మైనార్టీలు మత భావాల ఊబిలో కూరుకుపోయారు. రాజ్యాధికారాన్ని అగ్రవర్ణ పార్టీల మీద ఆధారపడి పొందాలనే భావనలోనే ఇంకా ఉన్నారు. ఇండియా కూటమి ఒక దళితుడిని ప్రధానమంత్రిగా ప్రకటించే స్థాయిలో ఎందుకు లేదు? నిరంతరం రాజ్యాంగ సూత్రాలను ధ్వంసం చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తున్న బీజేపీని కొన్ని ప్రయోజనాలను ఆశించో, కొన్ని ఆచారాలకు లోబడో, మళ్ళీ మళ్ళీ ఎన్నుకుంటున్నారు. వారి గంభీరమైన ఉపన్యాసాలకు మైమరచిపోయి వారికి సామాజిక, రాజకీయ బానిసత్వం చేస్తూనే వస్తున్నారు. కోట్లాది మంది రాజ్యాధికారానికి నోచుకోకుండా పోవడానికి కారణం రాజకీయాల్లో ఉన్న వర్ణతత్వమే అన్నారు అంబేడ్కర్. ఆయన మార్గంలోనే విముక్తి ఉందని దళిత, బహుజనులు గమనించినప్పుడే మత, కుల భావాలకు అతీతంగా సమ సమాజ నిర్మాణం సాధ్యమవుతుంది. డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమనేత ‘ 98497 41695 -
సహజ వాగ్గేయకారుడు
జనం గుండెల నుంచి ప్రభవించిన సజీవ వాగ్గేయకారుడు గద్దర్. కవిత్వాన్ని పాటలో రంగరించి తత్వాన్ని బోధించిన మానవతా మూర్తి. ఆయన పాటల్లో పల్లె జీవన సంస్కృతీ వికాసం ఉంది. వేమన, పోతులూరి వీరబ్రహ్మం, కబీరు,సంత్ రవిదాసు సూక్తులు ఆయన పాటల్లో ప్రతిధ్వనిస్తుంటాయి. ఆయన ‘జననాట్యమండలి’ సృష్టికర్త. ఆయన నాలుక మీద ఆదిమ జాతుల స్వర విన్యాసం ఉంది. సముద్ర ఘోషను ఆయన ఊరిలోనికి మోసుకొచ్చాడు. అడవి వేదనలను రాజ్య ప్రసాదాల్లోకి ప్రవహింప చేశాడు. నేను విశాఖపట్నం జైల్లో ఉన్నప్పుడు నక్సలైట్ సెల్ నుంచి ‘సిరిమల్లె సెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మా, నీవు సినబోయి కూచున్నవెందుకమ్మో ఎందుకమ్మా’ పాట అర్ధరాత్రి పాడాడు. అది నాలో పునరుత్తేజాన్ని తీసుకొచ్చింది. దళిత వీరుల చెవుల్లో విప్లవ స్వరాన్ని విని పించి సైనిక కవాతు చేయించిన సైన్యా ధ్యక్షుడు ఆయన. 1985లో కారంచేడు ఉద్యమంలో మమేకమై ‘దళిత పులులమ్మ, కారంచేడు భూస్వాములతో కలబడి నిల బడి పోరు చేసిన దళిత పులులమ్మ’ అని దళితులకు చైతన్యాన్నీ, ధైర్యాన్నీ, పోరాట శక్తినీ కల్పించిన దళిత వీరుడు ఆయన. ఆయన తండ్రి అంబేద్కర్ స్థాపించిన మిలింద విశ్వవిద్యాలయా నికి రాళ్లెత్తాడు. అంబేడ్కర్ కుల నిర్మూ లన ఉద్యమానికి గద్దర్ వెన్ను తట్టాడు. చేతిలో ఎర్ర జెండా ఉన్న ప్పుడు కూడా గుండెల్లో అంబేడ్కర్‌ని నింపుకున్నాడు. అందుకే ఆయన తన గమనంలో కుల నిర్మూలన వాదిగా ధ్వనిస్తూ వచ్చాడు. కులం మీద ఆయన గొడ్డలి వేటు వేశాడు. ‘దళిత పులులమ్మ’ పాటలో కథా కథన చాతుర్యాన్ని చూపాడు. గద్దర్ కారంచేడులో దళితులు చనిపోయిన ప్రదే శానికి వచ్చినప్పుడు ‘వీళ్ళు పోరాటంలో చనిపోయారు గాని, పిరికి వాళ్ళై చనిపోలేద’ని స్థానిక దళితులు చెప్పారు. అప్పుడు గద్దర్ ఈ పాట రాశాడు. ‘దళిత పులులమ్మా / కారంచేడు భూస్వాములతోనే / కలబడి నిలబడి పోరు చేసినా/ మాల సాయిబు వడ్డెర జాతికి మాదిగపల్లె తల్లిలాంటిది/ శరణుకోరిన శత్రువునైనా ప్రేమతో చూసే పేదలపల్లె/ మాదిగపల్లె పేరు వింటెరా/ బరిశె నెత్తుకొని పందె మాడితే ఊరి దొరలకు ఉచ్చబడతది/ కోటి బాధలతో మునిగి తేలినా అన్న మాటకు అటుఇటు గారు/ వడ్డీల మీద వడ్డీలు గట్టి – నడ్డి విరిగినా బుద్ధిమంతులు/ మట్టిలో మటై్ట మన్నులో మన్నై – పండించిన ప్రతి వడ్లగింజను/ బలిసిన దొరల గరిసెలు నింపి – పస్తులు పండే కష్ట జీవులు.’ ఈ పాట చరిత్రకు సాక్ష్యంగా నిలబడింది. దళితుల పోరాట పటిమకు అద్దం పడుతుంది. గద్దర్ దళిత బిడ్డ. ఆయన అంబే డ్కర్ బుర్రకథల ద్వారానే ముందుకు నడిచాడు. తరువాత జన నాట్యమండలి నిర్మించాడు. పీపుల్స్‌వార్‌కు అనుబంధంగా జన నాట్యమండలి కృషి చేసింది. జననాట్యమండలి ఆనాడు దళిత ఉద్యమానికి వ్యతిరేకంగా ఉంది. అది ఆనాడు దళిత ఉద్యమాన్ని హైజాక్ చేయాలని అనుకొంది. ఆ సందర్భంగా గద్దర్‌పై దళిత ఉద్యమ ప్రభావం పడింది. దాని ఫలితమే ఈ పాట. మొదటి సారిగా, జననాట్యమండలి పాటల్లో కులాధిపత్యం వర్గాధిప త్యాన్ని జోడించి పాడటం ప్రారంభమైంది గద్దర్‌తోనే! ఇది దళిత ఉద్యమ విజయం. ఈ పాటను 1985 సెప్టెంబర్ 1న ‘చలో చీరాల’ మహాసభలో గద్దర్ పాడాడు. ఈ పాట ఒక ఉజ్జ్వల జ్వలనాన్ని ప్రేక్షకుల్లో రూపొందించింది. సుమారు 3 లక్షల మంది దళితులు ‘దళిత మహాసభ’ ఆధ్వర్యంలో చీరాల హైస్కూలు గ్రౌండ్స్‌లో హాజరయ్యారు. ఈ వ్యాస రచయితే అధ్యక్షత వహించాడు. గద్దర్ నిజానికి ఒక తాత్త్వికుడు. నీకిష్టమైన పాటేదంటే ‘ఏలరో ఈ మాదిగ బతుకు’ అంటాడు. నిజానికి ఈ పాటలో ఈ దళిత కులాల జాతీయతను ఎలుగెత్తి చాటాడు గద్దర్: ‘ఏలరో ఈ మాదిగ బతుకు మొత్తుకుంటే దొరకదురా మెతుకు/ బంగారు పంటలిచ్చె భరత గడ్డమనది / గంగమ్మ ప్రవహించే పుణ్యభూమి మనది / గంగ యమున బ్రహ్మపుత్ర కృష్ణ పెన్నా కావేరి/ ఎన్నెన్నో జీవ నదులు ప్రవహించే జీవగడ్డ / మాల మాదిగలకే మంచినీళ్లు కరువాయే’ అని గద్దర్ సామా జిక తత్త్వాన్నీ, సామాజిక సమస్యనూ దళిత జాతీయ దృక్పథంతో అనేక పాటల్లో విశ్లేషిస్తాడు. దళిత ఉద్యమంలో పాటలు పాడే దళాలన్నీ అవి ఏ పేరుతో ఉన్నా గద్దర్, మాష్టార్జీ ప్రభావంతోనే పాటలు పాడుతూ వచ్చాయి. అందుకే దళిత ఉద్యమం మీద గద్దర్ ప్రభావం సాంస్కృతికంగా బలంగా ఉందనక తప్పదు. మనం ఎన్ని దృక్కోణాల నుంచి చూసినా ఆయన జాతి వైతాళికుడు. కుల మత భేదాలు లేని బౌద్ధ సిద్ధాంతగామి. ఆయన ఒక నశించని సామాజిక విప్లవ స్వరం. ఆయన పాట లతో లోకం మేల్కొంది. అందుకే ఆయన ఈ యుగం జాతి వైతాళికుడు. ఆయన పాటల బాటలో నడుద్దాం. కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నేత ‘ 98497 41695 -
అంబేడ్కర్ స్ఫూర్తి ప్రతిఫలించేదెప్పుడు!
సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, ప్రజాస్వామ్యం, మానవ హక్కులు వంటి వాటన్నింటినీ వాగ్దానం చేస్తున్న భారత రాజ్యాంగ నిర్దేశాలకు విలువే లేకుండా పోతోంది. అతి కొద్దిమందిగా ఉన్న అత్యధిక సంపన్నులను ఒక వైపు, అత్యధికులైన అతి పేదలను మరొక వైపు చూస్తున్నాం. ఈ విషయంగా మనం తప్పక బాబా సాహెబ్ అంబేడ్కర్ ఆలోచనలను మననం చేసుకోవలసిన అవసరం ఉంది. సామాజిక అసమానతల్ని తొలగించే క్రమంలోనే ఆర్థిక అసమానతలూ తొలగాలని అంబేడ్కర్ అన్నారు. అలాగే దేశంలోని ప్రజలందరూ ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ సాంకేతిక రంగాల న్నింటిలో సమానతను సాధించుకోవడమే రాజ్యాంగ లక్ష్యమని బాబాసాహెబ్ స్పష్టంగా ప్రకటించారు. ఆ మార్గంలో నడవడం మన పాలకుల ధర్మం. భారతదేశాన్ని ఎందరో పరిపాలించారు. వారందరికీ భారతదేశం అర్థం కావాలని ఏమీ లేదు. ఆర్యులకు, యవనులకు, కుషానులకు, అరబ్బులకు, మొఘలు లకు, బ్రిటిష్ వాళ్ళకు కూడా భారతదేశం అర్థం అయ్యిందని చెప్పలేం. వారంతా మూలవాసుల్ని అణచివేయడానికి ప్రయత్నించిన వారే. సామరస్యమూ, శాంతి, ప్రేమతో కూడిన మూలవాసుల భావన లను ధ్వంసం చేసే క్రమంలో వారంతా భారత చరిత్ర వక్రీకరణకు కారణం అయినవారే. ప్రస్తుత పాలకులు సైతం మన పూర్వ పాల కుల్లా నిజమైన సంస్కృతీ వికాసం మతవాదుల్లో ఉందనే నమ్ము తున్నారు. నిజానికి ఆ వికాసం హేతువాదులు, భౌతికవాదులు, అంబేడ్కర్ వాదులు, లౌకికవాదుల్లో వుంది. అసలు భారతదేశానికి మొదటి దర్శనం చార్వాక దర్శనం, రెండవ దర్శనం జైన దర్శనం, మూడు బౌద్ధ దర్శనం, నాలుగు సాంఖ్య దర్శనం. ఇవన్నీ నిరీశ్వర వాద దర్శనాలే. బౌద్ధ దర్శనం సాంఘిక సమానత్వానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలబడింది. అది మూలవాసుల నుండి జనించింది. మాన వాళి పట్ల దయార్ధ్ర దృష్టితో మెలగడం కరుణ అనీ, సాటి వారి పట్ల సౌహార్ద్ర దృష్టిని కలిగి ఉండటమే మైత్రి అనీ, ఈ సౌశీల్య విధానాలు ప్రతి ఒక్కరూ శక్తివంచన లేకుండా పాటించాలనీ బుద్ధుడు ప్రబోధించాడు. వ్యక్తి నిర్మలత్వానికి కూడా ఆయన ప్రాధాన్యం ఇచ్చాడు. బుద్ధుని సిద్ధాంతాలు.. అప్పటి వరకు వైదిక సంస్కృతి ఆచరణలోకి తీసుకు వచ్చిన మూఢ నమ్మకాలను, యజ్ఞ యాగాదులను, వ్యక్తి స్వార్థాన్ని, దుష్ట ప్రవర్తనను ఖండించి నూత్న సామాజిక దృక్పథాన్ని కలిగించాయి. క్రీ.పూ. 6వ శతాబ్దం నుండే భారతదేశం బౌద్ధ సంస్కృతిలో నడిచింది. భారత రాజ్యాంగంలో అంబేడ్కర్ ఈ బౌద్ధ సూత్రాలనే పొందు పరిచారు. ఆ ప్రకారం.. ఏ మతానికి చెందిన పాలకులైనా ఆ మతాన్ని వ్యక్తిగతంగానే ఉంచుకోవాలిగాని, దాన్ని రాజ్యం మీద రుద్దకూడదు. అయితే మతం, మతస్వేచ్ఛ గురించి చర్చించుకునే క్రమంలో మనం ప్రధానంగా గమనించాల్సింది ఏమిటంటే లౌకిక భావంతో వ్యవహ రించాల్సిన ప్రభుత్వాలే మతతత్వాన్ని ప్రేరేపిస్తుండటం! మరోవైపు సుసంపన్నమైన దేశంగా పరిగణన పొందుతున్న మన నేలలో ఆకలి చావులతో మరణిస్తున్న వారి సంఖ్య పెరగడం ఆశ్చర్యం కలిగించే విషయం. ముఖ్యంగా అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. కుల, మత, అసమానతలు నిరంతరం వృద్ధి చెందుతున్నాయనీ; అణచివేతలు, గృహహింస విపరీతంగా పెరిగిపోతున్నాయనీ సామాజిక సర్వేలు చెపుతున్నాయి. ఇదే సమ యంలో కార్పొరేట్ పెట్టుబడిదారీ సామ్రాజ్యాన్ని కొన్ని శక్తులు యథేచ్ఛగా విస్తరించుకుంటూ వెళ్తున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలన్ని టినీ ప్రైవేటు వ్యక్తులకు అధీనం చేయడం వల్ల భారతదేశంలో దళిత బహుజన యువకులకు ఉద్యోగ వసతి గగన కుసుమం అయింది. వ్యవసాయరంగం దారుణంగా దెబ్బతిన్నది. అయితే ఇది వ్యవసాయ ఉత్పత్తులు తగ్గడం మూలాన కాదు. వ్యవసాయ ఉత్పత్తి ధరలు విప రీతంగా పడిపోవడం వల్ల. దీంతో వ్యవసాయం గిట్టుబాటు కాకుండా పోయింది. రైతులు రుణగ్రస్థులయ్యారు. లక్షలాదిమంది జీవన వ్యవస్థలు కుంటుపడ్డాయి. గ్రామాల నుంచి వలసలు పెరిగాయి. ఈ సంక్షోభం నుండి రైతాంగాన్ని కాపాడటానికి బదులు పాలకులు వ్యవసాయ రంగం కార్పొరేటీకరణను ప్రోత్సహిస్తున్నారు. ప్రపంచ వాణిజ్య (డబ్ల్యూటీఓ) షరతులు కూడ మన దేశ రైతాంగానికి ప్రతికూలంగా ఉన్నాయి. అధికార పార్టీ తన సంఖ్యాబలంతో పార్ల మెంటరీ కమిటీల పరిశీలనలు, పార్లమెంటరీ ప్రొసీజర్లు లేకుండానే చట్టాలకు దారి ఏర్పచుకుంటోంది. ముఖ్యమైన చట్టాలు ఎలాంటి చర్చ లేకుండా గందరగోళాల మధ్యనే ఆమోదం పొందుతున్నాయి. అందుకే పార్లమెంట్లో అంతర్గత నియంతృత్వం కొనసాగుతోందన్న విమర్శలు వస్తున్నాయి. పార్లమెంట్ పట్ల తన జవాబుదారీతనం నుండి ప్రభుత్వం తప్పుకుంటున్నది. నూట పదకొండుమంది ఎస్సీ, ఎస్టీ ఎంపీలు పార్లమెంట్లో సామాజిక న్యాయాన్ని సాధించటంలో నిరంతరం విఫలం అవుతున్నారు. మహిళా ఎంపీల హక్కుల పోరాట స్వరాలు నిష్ఫలం అవుతున్నాయి. సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, ప్రజాస్వామ్యం, మానవ హక్కులు వంటి వాటన్నింటినీ వాగ్దానం చేస్తున్న భారత రాజ్యాంగ నిర్దేశాలకు విలువే లేకుండాపోతోంది. పేదలకు భూమి పంపకం లేదు. గిరిజనుల భూములకు రక్షణ లేదు. ఆదివాసుల జీవన ప్రమా ణాలు, విద్యా వైద్య వసతులు నానాటికీ కుంటుపడుతున్నాయి. రక్తలేమితో బాధపడుతున్న స్త్రీల సంఖ్య పెరుగుతోంది. గర్భవతులకు, వితంతువులకు సంరక్షణ లేదు. ఆర్థిక సామాజిక, రాజకీయ అంత రాలు ఎక్కువవుతున్నాయి. అతి కొద్ది మందిగా ఉన్న అత్యధిక సంపన్నులు ఒకవైపు, అత్యధికులైన అతి పేదలు మరొక వైపు అన్నట్లుగా ఉంది. ఈ విషయంగా మనం తప్పక బాబా సాహెబ్ అంబేడ్కర్ ఆలోచనలను మననం చేసుకోవలసిన అవసరం ఉంది. సామాజిక అసమానతల్ని తొలగించే క్రమంలోనే ఆర్థిక అసమా నతలూ తొలగాలని చెబుతూ అంబేడ్కర్... శ్రామికవర్గం హక్కులు, ప్రాతినిధ్యం, సాధికారతల గురించి చాలా నిశితమైన వివరణల్ని 1943 సెప్టెంబర్ 6, 7 తేదీల్లో కొత్త ఢిల్లీలో జరిగిన కార్మిక సమ్మేళనంలో వ్యక్తపరిచారు. అందులోని చాలా అంశాల ఉల్లంఘన నేడు మనకు దృశ్యీకృతం అవుతోంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ కింద అత్యధికుల అభీష్టం మేరకు శాసన, పాలనా విధానాలు అమల వుతున్నాయి. ఎవరైతే సంఘానికి ఆర్థిక నిర్మాణాన్ని దేశ సామాజికత ఆధారంగా రూపకల్పన చేయదలిచారో... వారు ప్రాథమిక ఆవశ్యకతను విస్మరించకుండా తమ లక్ష్యాన్ని పూర్తిచేయాలని గుర్తుంచుకోవాలి. సంఘ ఆర్థిక నిర్మాణాన్ని రాజ్యాంగం నిర్దేశించాలన్న ప్రతిపాదన నిర్వివాదాంశం. ఆర్థిక నిర్మాణ విధానం ఎలా ఉండాలన్నదే మిగిలి ఉన్న ప్రశ్న. దానిని ఈ మూడు విధానాల నుండి ఎంపిక చేయాలి. 1. పెట్టుబడిదారీ విధానం, 2. సోషలిజం, 3. కమ్యూనిజం. మరి శ్రామికుల ఎంపిక ఎలా ఉండాలి? శ్రామికులు పెట్టుబడిదారీ విధానాన్ని ఎంపిక చేసుకోలేరు, ఆ విధంగా పెట్టుబడిదారీ విధానాన్ని ఎంపిక చేసుకుంటే శ్రామికులు వారి స్వేచ్ఛను కోల్పో తారు. అందుకే వారి భవితవ్యానికి ముఖ్యమైన ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛ, సంతోషాలు పొందడంలో ప్రజాస్వామ్య దేశాలు అవలంబించవలసిన మార్గాలు ఏంటంటే... ప్రభుత్వ అధికారాన్ని రాజకీయ రంగంలో తక్కువగా జోక్యం చేసుకోనివ్వడం; చాలా శక్తిమంతమైన వ్యక్తుల ఆధిక్యతను అణచటానికి సాధారణ శాసనాధికారాన్ని మేల్కొల్పి, తక్కువ శక్తిమంతమైన ఆర్థికరంగంపై అసంబద్ధమైన ఇబ్బందులను విధించకుండా ఉండడం. ఈ విధమైన అంబేడ్కర్ ఆలోచనలు రాను రాను భారతీయ సమాజాన్ని పున ర్నిర్మించడానికి అత్యవసరం అవుతున్నాయి. ఆయన రాజ్యాంగ రచనకు ముందూ, వెనుకా అన్ని తరగతుల ప్రజల జీవన ప్రమాణాలను దర్శించారు. ‘‘భారతదేశానికి అనేక మతాలు వచ్చాయి, అనేక మతాలు ఇక్కడే ఆవిర్భవించాయి. అయితే ఏ మతా ధిపత్యంలోకీ భారతదేశం వెళ్లకూడదు. భారతదేశం లౌకిక రాజ్యంగానే మనగలగాలి. భారతదేశంలో ప్రతీ పౌరుడు ఒకే సామాజిక, ఆర్థిక, రాజకీయ గౌరవాన్ని కలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడే నేను రూపొందించిన రాజ్యాంగం అన్ని దిశలా ప్రతిఫలిస్తుంది’’ అని అంబేడ్కర్ భావించారు. రాజ్యాంగ రూపకల్పన కృషిలో అంబేడ్కర్ తన ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టారు. భారతదేశంలోని ప్రజలందరూ ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ సాంకేతిక రంగాల న్నింటిలో సమానతను సాధించుకోవడమే ఈ రాజ్యాగం లక్ష్యమని ఆయన ప్రకటించారు. ఆ మార్గంలో నడుద్దాం. డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళిత ఉద్యమ నేత ‘ 98497 41695 -
కత్తి పద్మారావుతో కొమ్మినేని భేటీ
పొన్నూరు(గుంటూరు జిల్లా): ప్రముఖ రచయిత సామాజిక వేత్త కత్తి పద్మారావుతో ప్రెస్ అకాడమి చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు శనివారం మధ్యాహ్నం భేటి అయ్యారు. పొన్నూరులో కత్తి పద్మారావు ఇంటికి వెళ్ళి ఆయన్ను సత్కరించారు. ఇప్పటికి సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాహిత్య రంగాలలో 80 పుస్తకాలు రచించిన పద్మారావు మరో 20 పుస్తకాలు రచించే పనిలో వున్నారు. ఈ సంధర్బంగా తాను రచించిన తన ఆటోబయోగ్రఫీ పుస్తకంతో పాటు ఆధునిక ఆంధ్ర రాజకీయాలు, భారత దేశ చరిత్ర - సామాజిక దృక్పథం, భారత రాజకీయాలు - అంబేద్కర్ దృక్పథం పుస్తకాలను కొమ్మినేనికి బహుకరించారు. కొమ్మినేని కూడ తాను రచించిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సామాజిక విశ్లేషణ పుస్తకాన్ని పద్మారావుకు అందచేసారు. కత్తి పద్మారావు మాట్లాడుతూ దళిత పేద వర్గాలకు జగన్ ప్రభుత్వం చేస్తున్న పనులను అభినందించారు. ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ లు ఎప్పటికప్పుడు సత్వరమే ఇవ్వాలని ఆయన సూచించారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ప్రభుత్వం అవార్డులిస్తే బాగుంటుందని... వ్యవసాయ భూములు లేని దళిత, పేద వర్గాలకు ఎంతో కొంత భూమిని ఇచ్చే ఏర్పాటు జగన్ ప్రభుత్వం చేయగలిగితే ఇక ఆయనకు తిరుగుండదని పద్మారావు వాఖ్యానించారు. ఒకే సారి లక్ష ముఫై వేల మందికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఘనత భారత దేశ చరిత్రలో ఒక జగన్ ప్రభుత్వానిదేనని... అదొక రికార్డని కొమ్మినేని గుర్తు చేసారు. ఎన్నికల ప్రణాళికలోని హామీల ప్రకారం 98 శాతం అమలు చేసిన ఘనత జగన్‌దేనని కొమ్మినేని చెప్పారు. వివిధ పథకాలను పేదలకు మానవత హృదయంతో జగన్ అమలు చేస్తున్నారని పద్మారావు ప్రశంసించారు. -
కులగణనే సమస్యలకు పరిష్కారం
భారత దేశ సామాజిక, ఆర్థిక వ్యవస్థలు నిచ్చెన మెట్ల కుల వ్యవస్థపై ఆధారపడి నిర్మితమయ్యాయి. భూమి మీద ఎవరికైతే హక్కు ఉందో వారే రాజ్యాధికారాన్నీ అనుభవించే పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది. అయితే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వంటి పై మూడు ఆధిపత్య కులాలవారితో పాటూ శూద్రులైన కొన్ని కులాల వారూ సంపదనూ, రాజ్యాధికారాన్నీ అనుభవించ గలుగుతున్నారు. అయితే రాజ్యాధికారంతో పాటూ దేశ సంపదను కులాల దామాషా ప్రకారం ఎవరికి దక్కాల్సింది వారికి దక్కినప్పుడే... రాజ్యాంగం ఇచ్చిన సమానత్వ హక్కుకు సార్థకత్వం చేకూరుతుంది. ఇందుకు దేశంలో ఏ కులంవారు ఎంత మంది ఉన్నారనే లెక్కలు అవసరం. అందుకే కుల గణనను ప్రభుత్వం తక్షణం చేపట్టాలి. భారతదేశంలో సాంఘిక అసమానతలు తగ్గాలంటే కుల గణనతో పాటు కుల సంపద గణన కూడా జరగాల్సి ఉంది. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ కులగణనకు పూనుకోవడం అందుకు 500 కోట్లు కేటాయించడం ఒక సామాజిక పరిణామానికి తప్పక దోహదం చేస్తుంది. అంబేడ్కర్, లోహియాలు ఇరువురూ ఈ కులగణన విషయంలో గట్టిగా పట్టుపట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు అందరూ హిందువులే అనే వాదనలో బ్రాహ్మణవాదం ఉంది అని వీరు పసిగట్టారు. అది ఒక సందర్భంలో ఎస్సీలను హరిజనులు లేదా దేవుని బిడ్డలు అని చెప్పిన ప్పుడు అంబేడ్కర్ అంటరానివారు దేవుని బిడ్డలు అయితే మరి మిగిలిన వారందరూ దెయ్యం బిడ్డలా అని ప్రశ్నించాడు. ఈ సందర్భంలో మాట్లాడుతూ ఇప్పటికైనా భారతదేశాన్ని మనం మార్చు కోవాలి. సామాజిక న్యాయాన్ని పాలనలో తీసుకురావాలంటే తప్ప కుండా కులగణన జరగాలి. అందరికీ భూమి హక్కు వచ్చినప్పుడే సమానత చేకూరుతుంది. వ్యవసాయం ప్రభుత్వ పరిశ్రమగా ఉండాలి. ప్రభుత్వాధీనంలోకి దేశంలోని భూమిని తీసుకురావాలి. అప్పుడే భూస్వామి, భూమిలేని పేద వ్యవసాయ కూలీ, కౌలుదారు అనే భేదాలు తొలగి పోతాయ న్నాడు అంబేడ్కర్. హిందూ మత భావన జాతి వ్యతిరేకమైనదని ఆయన ప్రకటించాడు. సాంఘిక, ఆర్థిక ప్రజాస్వామ్యం లేకుండా రాజ కీయ ప్రజాస్వామ్యానికి మనుగడ లేదు అని ప్రకటించాడు. దేన్నైనా అమ్ముకోండి గానీ ఆత్మాభిమానాన్ని మాత్రం అమ్ముకోవద్దని శూద్రు లకు, అతిశూద్రులకు చాటి చెప్పాడు. నిజానికి బిహార్ బౌద్ధ భూమి. అక్కడ బీసీలుగా చెప్పబడుతున్న అనేక కులాల వారు కొన్ని శతాబ్దాలు బౌద్ధులే. భారతదేశంలో ఉన్న శిల్పాలన్నీ దళితులు, బౌద్ధులు చెక్కారు. నిజానికి భారతదేశంలో దళితులు, బహుజనులు కొన్ని శతాబ్దాలు బౌద్ధంలోనే ఉన్నారు. పైగా వారు బౌద్ధ కవులుగా, బౌద్ధ తాత్వికులుగా, బౌద్ధ శిల్పులుగా, బౌద్ధ భిక్షువులుగా జీవించారు. బీసీలు హిందువులుగా మారింది క్రీ.శ. 6వ శతాబ్దం తరువాతే. క్రీ.శ. 6వ శతాబ్దం ప్రాంతంలో భాగవతాన్ని సృష్టించారు. అందులో కృష్ణుని పాత్ర సృష్టించారు. కృష్ణుడు యాదవు డని బహు భార్యాత్వాన్ని ఆయనకి ఆపాదించారు. భగవద్గీతను కూడా ఆయన చేత చెప్పించారు. అప్పటి నుండే యాదవులు హిందువులుగా మారడం ప్రారంభించారు. భగవద్గీత బుద్ధుని పరిణామ వాదానికీ, ప్రకృతివాదానికీ భిన్నంగా చెప్పబడింది. బుద్ధుడు ఏదీ నిత్యం కాదనీ, మిశ్రతమైనదేదీ శాశ్వతం కాదని చెప్పాడు. ఆ అంశాన్ని వివరిస్తూ అంబేడ్కర్ దీనికి అసంగుని వివరణ ఇలా ఇచ్చారు. ‘‘ఒక దాని ఆధారంగా మరొకటి ఏర్పడిన మిశ్రమంలో ఏ ఒక్కటీ స్వయం శక్తి కలిగి ఉండజాలదు. మిశ్రమం విడిపోయినప్పుడు అందలి ధాతువులు సహితం నాశనమైపోవడం అనివార్యం అవుతుంది.’’ మన్ను, నీరు, నిప్పు, వాయువుల మిశ్రమమే జీవి. ఈ నాలుగు ధాతువులు విడిపోయినప్పుడు జీవి విగతమౌతుందనీ, దానినే మిశ్రమ పదార్థ అనిత్యతత్వం అంటారనీ, ‘ఒక వ్యక్తి శాశ్వత మెలా అవుతాడన్నది’’ ఈ శాస్త్రం వివరిస్తుందని అంబేడ్కర్ శాస్త్రీ యంగా క్రోడీకరించాడు. నిజానికి యాదవులు వ్యవసాయ కులం గొర్రెల కాపరులుగా ఉన్నారు. భగవద్గీత వచ్చాక వారిలో భూస్వామ్య ఆధిపత్యం వచ్చింది. బౌద్ధ భావం తగ్గింది. నిజానికి కమ్మరి, కుమ్మరి, చాకలి, మంగలి వారంతా శాతవాహనులుగా, రజకులుగా, నాయీ బ్రాహ్మణులుగా తమనుతాము ఆర్యీకరించుకోవడం, బ్రాహ్మణీకరించుకోవడం; భాగ వత, రామాయణ, భారతాల కథలు బుర్రలకు ఎక్కించుకొన్నాకే జరిగింది. అలా బీసీ కులాల వారు హిందువులుగా మారారు. జ్యోతి రావు ఫూలే బీసీలు హిందువులు కాదని చెప్పడం గమనార్హం. భూమిపై ఆధిపత్యం ఉన్నవారు ఆధిపత్య కులాలుగా అవతరించారు. వారే అధికారాన్ని చేపట్టగలుగుతున్నారు. బ్రాహణ, క్షత్రియ, వైశ్య కులాలవారితో పాటూ కొందరు శూద్రకులాలలో ఆధిపత్య కులాల స్థాయికి చేరినవారూ (తెలుగు రాష్ట్రాల్లో కమ్మ, రెడ్డి; బిహార్‌లో యాదవ) అధికార పీఠం ఎక్కగలుగుతున్నారు. వీరిదగ్గరే సంపద పోగుపడిపోతున్నది. కూలినాలీ చేసుకొనే వారికి 40 కోట్ల మందికి ఇళ్లే లేవు. ఆధిపత్య కులాలవారి సంపద తేలితేనే సమ సమాజ రూప కల్పనకు ప్రణాళిక రూపొందించుకునే వీలుంది. అయితే భూమి పంచడానికీ, ఇతర సంపద పంచడానికీ ఆధిపత్య కులాలు సిద్ధంగా లేవు. కాగా నామమాత్రపు రిజర్వేషన్లకు ఈర్ష్య పడుతున్నారు. బిహార్ జనాభా పన్నెండు కోట్ల 70 లక్షల మంది. 16 శాతం ఎస్సీలు, 48 శాతం ఓబీసీలు, 17 శాతం ముస్లింలు, 1.28 శాతం ఎస్టీలు జీవిస్తున్నారు. తాజా జనగణన తర్వాత కులాల శాతాలు కూడా బయటకు వస్తాయి. భారతదేశంలో 1871లోనే బ్రిటిష్ ప్రభుత్వం ఎందుకు కులగణన చేపట్టింది? బ్రిటిష్‌వాళ్లకు భారతీయ కులవ్యవస్థపై ఒక అవగాహన వస్తే కానీ వారు ఇక్కడ మనలేరు. బహుశా అందుకే కులగణన చేసి ఉంటారు. ఈ కుల గణన వల్ల శూద్రులకు, అతి శూద్రులకు సామాజిక çస్పృహ వస్తుందని మహాత్మా ఫూలే నడిపిన సత్యశోధక్ సమాజ్ పేర్కొంది. అంబేడ్కర్ ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్, బీజేపీ ఆంత ర్యాన్ని కనిపెట్టాడు. రాముడు వర్ణాశ్రమ ధర్మాన్ని రక్షించడం కోసం శంబూకుణ్ణి చంపాడు కాబట్టి అన్ని విశ్వవిద్యాలయాల్లో శూద్ర, అతి శూద్ర, మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయి. తామే చదువు కోవాలి, ఇంకొకరు చదువుకోకూడదు. తమకే భూములుండాలి, మరొ కరికి ఉండకూడదు; తమకే రాజ్యాధిపత్యం ఉండాలి, వేరే వారికి ఉండకూడదు అనే మనువాద భావాలను బాగా నమ్ముతున్నారు కనుక ఇటువంటి దాడులకు వారు తెగబడుతున్నారు ఆధిపత్య కులాల వారు. ఈ భావాలు ఏ కులం వారికి ఉన్నా అవి రాజ్యాంగ విరుద్ధమై నవే. రాజ్యాంగానికి వ్యతిరేకంగా జీవిస్తున్న అగ్రవర్ణ ఆధిపత్య బ్రాహ్మణవాదులు నిషేధిత సంస్థల నుండి ఆవిర్భవించినవారేవీరంతా. వారెప్పుడూ రాజ్యాంగానికి బాధ్యులుగా లేరు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించే మార్గంలో వారు నడుస్తున్నారు. మాట్లాడే స్వేచ్ఛను రాజ్యాంగం ఇచ్చిందని వారికి తెలియదు. ఈ మనువాదానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉండే బౌద్ధాన్ని అంబేడ్కర్, లోహియా, మహాత్మాఫూలే, పెరియార్ రామస్వామి నాయకర్ అనుసరించారు. ఇప్పుడు మనం బౌద్ధ భారతాన్ని నిర్మించుకోవాలి. బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలు ఉత్పత్తి శక్తులు. వారిని పేదరికంలోఉంచి, వారిని దుఃఖంలో ఉంచి ఎవరైనా రాజ్యాంగేతరులుగా పరిపాలించాలని అనుకుంటే అది వట్టి భ్రమే. రాజ్యాంగంలోని 15వ ఆర్టికల్ ఈ విధంగా చెబుతుంది. కుల, మత, లింగ, పుట్టిన ప్రదేశం కారణాలుగా వివక్షకు తావులేదు.1) కేవలం మతం, జాతి, కులం, లింగం, పుట్టిన ప్రదేశం లేక వాటిలో కొన్నింటి ప్రాతిపదికపై ఏ వ్యక్తినీ ప్రభుత్వం వివక్షకు గురి చేయరాదు. 2) కేవలం, మతం, జాతి, కులం, లింగం పుట్టిన ప్రదేశం లేక వాటిలో కొన్నింటి ప్రాతిపదికపై పౌరులెవరికీ హక్కులను నిరాకరించటం, నియంత్రించటం, అర్హత లేకుండా చేయడం గాని చేయరాదు. భారతదేశ పునర్నిర్మాణానికి భారత రాజ్యాంగమే గీటురాయి. మతతత్వవాదులు తప్పక ఓడిపోతారు. ఒక మతం భారతదేశాన్ని ఎప్పటికీ పరిపాలించలేదు. ఒక కులం భారతదేశాన్ని ఎప్పటికీ పరిపా లించలేదు. భారతదేశం అంతర్గతంగా తీవ్రమైన సామాజిక, సాంస్కృతిక, సాంకేతిక విద్యాపరమైన మార్పుకు గురవుతూ వస్తుంది. దళిత బహుజన మైనార్టీలు లౌకికవాదులు ఏకమై సమ సమాజ నిర్మాణానికి పోరాడాల్సిన యుగమిది. కులగణనే కాదు కులసంపద గణన కూడా జరగాల్సిందే. భారతదేశంలో ప్రజలందరూ సమానంగా బతికే రోజు కోసం పోరాడాల్సిందే. అదే అంబేడ్కర్, ఫూలే మార్గం. డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళిత ఉద్యమ నేత -
కులాంతర వివాహాలు శాస్త్రబద్ధమే
భారతీయ సమాజంలో ఇప్పుడు కుల, మతాలకు అతీతంగా విందులూ, వినోదాల్లో పాల్గొనడం కొంతమేర పెరిగింది. అయినా వివాహ బంధాలతో కులాన్నీ, మతాన్నీ చెరిపి వేయలేకపోతున్నారు. ఇటువంటి వారందరిపైనా హిందూ పురాణాలు, ఇతిహాసాల ప్రభావం ఎక్కువ. అయితే ఈ గ్రంథాల్లోనే అనేకమంది రుషులు కులాంతర, జాత్యంతర వివాహాలు చేసుకున్నట్లు ఉన్నా... నిజ జీవితంలో మాత్రం కులాంతర వివాహాలకు అంగీకరించకపోవడం విడ్డూరం. పైగా కృష్ణుడు వంటి దేవుళ్లను చూపించి... దేవుళ్లకే కులం బాధ తప్పలేదు మనమెంత అని తప్పించుకుంటూ ఉంటారు. ఇది అన్యాయం. నిజానికి కులాంతర వివాహాలు అత్యంత శాస్త్రీయమైనవని శాస్త్రజ్ఞులు అంటున్నారు. దేశంలో కుల దురంహంకార జాడ్యం ప్రమాదకర సమస్యగా మారిందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ప్రేమ వివాహాల విషయంలో విపరీతమైన వధ జరుగుతోంది. డా‘‘ బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగంలో రూపొందించిన కుల నిర్మూలనా భావన ఆధిపత్య కులాలకు అర్థం కావడం లేదని చంద్ర చూడ్ ఆవేదన చెందారు. పవిత్ర హత్యల వెనక మతోన్మాద, కులో న్మాద భావనలున్నాయి. కులం... వర్ణ వ్యవస్థ నుండి జనించింది. వర్ణాలను కొందరు ఆధిపత్యం కోసం సృష్టించారు. తమ పిల్లలు అణగారిన వర్గాల నుండి వచ్చిన వారిని ప్రేమ వివాహాలు చేసుకోవడాన్ని వీళ్ళు తట్టుకోలేక పోతున్నారు. వర్ణాన్ని బట్టి కులాన్నో, జాతినో నిర్ణయించడం అశాస్త్రీయమైన విషయం. కుల వ్యవస్థ మీద అత్యంత పరిశోధనలు చేసిన జె.హెచ్. హట్టన్ ‘ది క్యాస్ట్ ఇన్ ఇండియా’లో క్యాస్ట్ గురించి ఈ విధంగా అన్నారు. ‘‘క్యాస్ట్ అను మాట, ‘కాస్ట’ అను పోర్చుగీసు శబ్దము నుండి వచ్చింది. ‘కాస్ట’ అను శబ్దము ‘చాలు’, ‘జాతి’, ‘రకము’ అను పదముల అర్థమును తెలుపును. ఆ భాషలో ‘హోమెండీ బోయ కాస్ట’ అను పద సమూహమునకు ‘మంచి కుటుంబములోని మనిషి’ లేక ‘కులీనుడు’ అని అర్థము’’. 1563లో గార్సియాడి ఓర్టా ‘‘తన తండ్రి నుండి ఎవడూ మారడు, చెప్పులు కుట్టు కులం వారంతా ఒకటే’’ అని రాసిన నాటి నుండి ఈ ‘కాస్ట’ మాటను మనమిప్పుడు గ్రహించిన పరిమితమైన ‘‘కులం (క్యాస్టు)’’ అర్థములో వాడుతున్నట్టు కనిపిస్తున్నది. కులాన్ని నిచ్చెనమెట్ల సమాజంగా రూపొందించారని అంబేడ్కర్ తన ‘కుల నిర్మూలన’ గ్రంథంలో పేర్కొన్నారు. ఒక కులం అబ్బాయి మరొక కులం అమ్మాయిని చేసుకోవటం సామాన్యమైన విషయం. లేని కులం కోసం ఉన్న బిడ్డల్ని చంపుకోవటం అమానుషమైన విషయం. అందుకే అంబేడ్కర్ ఇలా అన్నారు... ‘ఇండియాలో వివిధ కులాల మధ్య వర్ణాంతర వివాహాల ద్వారా జాతి మిశ్రణ, రక్త సమ్మేళన జరగనిస్తే వచ్చిన హాని ఏమున్నది? మృగాలకు, మనుష్యులకు మధ్య అనంతమైన భేదం ఉన్నది గనుక మృగాలు, మనుష్యులు రెండు భిన్న రకాల జాతులు సంతతకి చెంది ఉన్నట్లు విజ్ఞానశాస్త్రం అంగీకరించింది. జాతుల స్వచ్ఛతలో నమ్మకం ఉన్న శాస్త్రజ్ఞులు కూడ మనుషుల్లోని వివిధ జాతులు భిన్న రకాల జాతుల సంతతి అని అనడం లేదు. ‘‘వారంతా ఒకే సంతతికి చెందిన పలు జాతులు. సర్వజాతుల మానవులూ ఏక జీవాల సృష్టే కనుక ఆయా జాతుల మధ్య అంతః సంయోగం వల్ల కలిగే సంతానం మానవులదే కానీ గొడ్డుది కాజాలదు.’’ కులాంతర వివాహాలపై ద్వేషం పెరగడానికి కారణం మత మౌఢ్యం, కులతత్వం అని అంబేడ్కర్ ఈ విధంగా చెప్పాడు.. ‘మొత్తం భరత ఖండం అంతటా హిందువుల జీవిత విధానాన్ని చూస్తే వారి ఆచార వ్యవహారాలలో, ఆలోచనలో ఒక విధమైన పోలిక ఉంది కాబట్టి, ఈ ఏకత్వానికిది తార్కాణమని వాదిస్తారు. పోలికలున్న మాట నిజమే అయితే తత్కారణంగా హిందువులు ఒక సమాజంగా ఏర్పడి ఉన్నారని చెప్పే వాదాన్ని ఎవ్వరూ అంగీకరించరు. అలా అంగీకరించడం అంటే సమాజ నిర్మాణ ప్రాతిపదికల్ని అపార్థం చేసుకోవడమే. మానవులు భౌతికంగా దగ్గర దగ్గరగా నివసిస్తున్నంత మాత్రాన వారు ఒక సమాజంగా ఉన్నట్టు కాదు. మరొక విషయం ఏమిటంటే మానవులు ఒక సమాజంగా నిర్మాణం కావాలంటే ఆచార వ్యవహారాలలోను, సంప్రదాయాలలోను, విశ్వాసాలలోను, ఆలోచన లోను పోలికవుంటే చాలదు. ఏ వస్తువైనా ఇటుకల వలె భౌతికంగా ఒకరి చేతుల నుంచి మరొకరి చేతులలోకి పోవచ్చు. ఒక వర్గానికి చెందిన ఆచారాలు, సంప్రదాయాలు, నమ్మకాలు, భావాలు మరొక వర్గం వారిచే స్వీకరించబడవచ్చు. అప్పుడా రెండు వర్గాల మధ్య పోలిక కన్పించవచ్చు. సంస్కృతి అనేది ఎల్లప్పుడూ వికసిస్తూ విస్తరి స్తూనే ఉంటుంది.’’ కులాంతర వివాహాలది శాస్త్రీయ బంధమే అని మానవ పరిణామ శాస్త్రవాదులు నిరూపించారు. ఇప్పుడైతే జాత్యంతర వివాహాలు కూడా ముమ్మరంగానే జరుగుతున్నాయి. వాటిని అంగీకరిస్తున్నారు. కులాంతర వివాహాల్లోనూ అస్పృశ్యులుగా చెప్పబడుతున్న దళితుల వివాహాలనే ఎక్కువగా వ్యతిరేకిస్తున్నారు. కారణం వారి మనసుల్లో పేరుకు పోయిన దళిత వ్యతిరేక భావన. రిజర్వేషన్ల వల్ల విద్యావంతులు అవుతున్నారనే ద్వేషం కూడా ఉంది. నిజానికి దళితులు చేసుకునే వివాహాలన్నీ సక్సెస్ అవుతున్నాయి. కారణం వారిలో ప్రేమ, అభిమానం, ఆత్మీయత, అనురాగం, రక్షణ వంటి అంశాలు మిక్కుటముగా ఉండటమే. దళిత విద్యావంతులకు సామాన్యంగా కుల భేదాలు ఉండవు. వారు ప్రేమ వివాహాలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే పగ, ద్వేషం, క్రౌర్యం, హింస, అవమానం, నిరాకరణ అమ్మాయి తల్లిదండ్రుల నుంచి వారికి ఎదురవుతున్నాయి. నిజానికి ప్రేమ వివాహాల్లో కట్నాలు ఉండవు. నిరాకరణ ఉండదు. యువతి యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకోవడం అనేది ఒక శాస్త్రీయమైన భావన. వీరు ఎవరి గ్రంథాలు అయితే చదివి ఈ కుల వర్ణ ద్వేష భావాలు పెంచుకున్నారో ఆ రుషులంతా కులాంతర వివాహాలు చేసుకున్నారు. హిందువుల సాహిత్యం నిండా కులాల చరిత్రను గురించి రాసి ఉంటుంది. అందులో ఒక కులాన్ని ఉత్తమ జన్మగాను, మరొక కులాన్ని నీచ జన్మగాను చిత్రించే యత్నం జరిగినట్టు కన్పిస్తున్నది. ఈ రకమైన సాహిత్యంలో ‘సహ్యాద్రి ఖండం’ అనేది పేరు పొందిన గ్రంథం. కులం అనేది ఒక సంస్కృతి కాదు, ఒక మతం కాదు, అది ఒక నమ్మకం. బాబాలు, యోగులు, స్వాములు, గురువులు వివిధ కులాల నుండి వచ్చి ఎలా బోధ చేయగలుగుతున్నారు. ఇదివరకు కొందరికి పరిమితమైన ఈ వేదాంత బోధ అందరికీ ఎలా సాధ్యమైంది. అలాగే వివాహం కూడా ఏ కులం వారైనా ఇంకొక కులం వారిని చేసు కోవచ్చు. మంచి సంతానం కనవచ్చు. ఈ కులాన్ని పోషించడానికీ హిందూమతం తన శక్తిని రంగరించి పోసింది. కరుణరసానికి పెట్టింది పేరైన రామాయణంలో శంబూకుడు ఈ కులం ముద్రతోనే చంపబడ్డాడు. ఇకపోతే భారతంలో ద్రోణుడు ఏకలవ్యుని విద్యా సంపత్తిని కులం పేరుతో అనర్హుడుగా ప్రకటించి దోచుకున్నాడు. కాని ధర్మశాస్త్రం ప్రకారం ద్రోణుడు ఉత్తమ బ్రాహ్మణుడై కూడా తన విద్యను పొట్ట కూటికి అమ్ముకున్నాడు. కులగోత్రాలు లేని పాండవులకు విద్య చెప్పడంలో లేని ధర్మ ప్రసక్తి ఏకలవ్యునికి విద్య చెప్పడంలో ఎందుకు వచ్చిందో అర్థం కాదు. అయితే ఈ పురాణాలు బహుముఖాలుగా ప్రచారమై, పురాణ పురుషులకే, కులధర్మం తప్పలేదు, మనమెంత? అనే భావానికి సమాజాన్ని తీసుకొచ్చాయి. గీతను ప్రవచించి కులాన్ని మానవ ధర్మంగా నిర్దేశించిన కృష్ణుడు కులం పేరుతో రాజసూయయాగంలో శిశుపాలుని చేత నిలవేయబడ్డాడు. హరిశ్చంద్రుడు కులం కోసం రాజ్యాన్ని, భార్యని, కుమారుని చివరకు తన్నుతాను అమ్ముకున్నాడు. అయితే ఇవన్నీ పురాణ గాథలే. ఇవన్నీ సత్యాలు కావు. కాని భారతీయ హృదయ పేటికల మీద ముద్రవేయబడ్డ వాళ్ళు వీళ్ళే కదా! నిజానికి కులాంతర వివాహమే శాస్త్రీయ బంధం. కులం పెళ్లిలో అశాస్త్రీయత ఎక్కువ వుంది. పిల్లలు సరిగా పుట్టరు. మేధలో కూడా తేడా వస్తుంది. జీన్స్ మారితేనే శాస్త్రీయ బంధం రూపొందుతుంది. ఇప్పుడు యువత ఎక్కువ మంది కులాంతర సంస్కృతి జీవనం వైపు, బంధం వైపు నడవడం భారత రాజ్యాంగబద్ధ జీవన విధానానికి ఆయువు పోసినట్టే. భారత రాజ్యాంగ ఆచరణే జీవన సాఫల్యం. చరిత్రతో నడవడం కాదు, చరిత్రను మారుద్దాం. (చదవండి: అంబేడ్కర్ చూపుతోనే సోషలిజం!) - డాక్టర్ త్తి పద్మారావు దళిత ఉద్యమ నేత -
అంబేడ్కర్ చూపుతోనే సోషలిజం!
ఇవ్వాళ కమ్యూనిస్టులైనా, సోషలిస్టులైనా, మత తత్త్వ వాదులైనా అంబేడ్కర్‌ను స్మరించడం సాధారణ దృశ్యమయ్యింది. సంఘ్ పరివార్ శక్తులతోపాటూ... కాంగ్రెస్‌లో ఉన్న హిందూ తత్త్వం ఒంటబట్టించుకున్న అనేక మంది నాయకులూ అంబేడ్కర్ బతికున్న కాలంలోనూ అనేక సందర్భాల్లో ఆయన్ని వ్యతిరేకించినవారే. భారత్‌లో వర్గం అంటే కులమేననీ... కుల వ్యవస్థ నశిస్తే కానీ వర్గ వ్యవస్థ కనుమరుగు కాదనీ, అప్పుడుకానీ సామ్యవాద సమాజ స్థాపన సాధ్యంకాదనీ అంబేడ్కర్ అన్న మాటలను కమ్యూనిస్టులూ, సోషలిస్టులూ పట్టించుకోలేదు. ప్రముఖ సోషలిస్ట్ నాయకుడూ, బీసీ నేత ములాయం సింగ్ యాదవ్ తుది శ్వాస విడిచిన ఈ తరుణంలో మరొకసారి ఈ దిశలో చర్చ జరగవలసిన అవసరం ఉంది. భారతదేశ రాజకీయాల్లో రామ్ మనోహర్ లోహియా ప్రతినిధిగా రాజకీయాల్లో జీవిం చిన ప్రముఖ నాయకుడు ములాయం సింగ్ యాదవ్. అక్టోబర్ 11న ఆయనకు తుది వీడ్కోలు పలకడం భారతదేశానికి ఒక విషాద ఘట్టమే. మహాత్మాగాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు ఇచ్చిన ప్రాధాన్యత ఒక సోషలిస్ట్ బీసీ రాజకీయ నాయకుడు చనిపోయినప్పుడు ఇవ్వకపోవడం బ్రాహ్మణవాద భావజాలమే ఇంకా నడుస్తుందనడానికి ఒక నిద ర్శనం. ఇది చాలా బాధాకరమైన విషయం. భారతీయ సోషలిస్ట్ విధానాన్ని రూపొందించిన రావ్‌ు మనోహర్ లోహియా ఒక మార్వాడీ కులం నుండి వచ్చారు. కానీ ఆయన బీసీ లకు రాజకీయ అధికారం కావాలని నినదించారు. ఆ స్ఫూర్తి నుండి వచ్చిన వారే లాలూ ప్రసాద్ యాదవ్, శరద్ యాదవ్, రాంవిలాస్ పాశ్వాన్, ములాయం సింగ్ యాదవ్ వంటివారు. ఇంకా ఎందరో రాజకీయ నాయకులు లోహియా ప్రభావంతో రాజకీయాల్లో బ్రాహ్మణవాద రాజకీయాలకు ఎదురు నిలబడ్డారు. ఈరోజు బీజేపీ అనే ఒక పార్టీ ఏర్పడిందంటే ఆరోజు వాళ్ల కాంగ్రెస్‌కు వ్యతిరేక పోరాటాలే అనేది మరువరాదు. మండల్ కమిషన్ నివేదిక అమలు జరపాలని లోహియా స్ఫూర్తితో వీపీ సింగ్ ముందుకు వచ్చేటప్పటికి జనతా పార్టీ చీలిపోయి మతోన్మాద బీజేపీ ఏర్పడింది. కమ్యూనిస్టులు, కార్ల్ మార్క్స్ వర్గ సిద్ధాంతాన్ని భారతదేశానికి అన్వయం చేయలేకపోయారు. అలా అన్వయం చేసి వుంటే భారత దేశంలో నిజమైన వైరుధ్యం కులం అని గుర్తించేవారు. అమానవీయ అస్పృశ్యతా నిర్మూలన ద్వారానే కుల నిర్మూలనా సాధ్యమనే లోహియా వాదులూ దీనిని విస్మరించారు. మొదటి నుండి లోహియా వర్గంలో సోషలిస్టులు అగ్ర వర్ణాలకు సంబంధించినవారే ఎక్కువ. లోహియాకి గాంధీ మీద అపారమైన గౌరవం వుంది. కానీ ఇద్దరి అభిప్రాయాలూ చాలా భిన్నమైనవి. లోహియాకు దేవుడిపై విశ్వాసం లేదు. ఆయన నాస్తికుడు. గాంధీజీ దేవుడు, సత్యం, అంతర్వాణి వంటి విషయాలకు ప్రాధాన్యం ఇచ్చారు. అయినా గాంధీజీతో లోహియా చాలా సన్నిహితంగా మెలుగుతూ వచ్చాడు. 1948 జనవరి 28న గాంధీజీ లోహియాతో ‘నీతో చాలా విషయాలు వివరంగా మాట్లాడాలని వుంది. కానీ నాకు సమయం దొరకటం లేదు. నా గదిలోనే నీవు కూడా పడుకో. మనం రాత్రికి మాట్లాడు కుందాం’ అన్నాడు. లోహియా గాంధీతో పాటు ఆయన గదిలోనే పడుకున్న ప్పటికీ గాంధీజీ లోహియా నిద్రకు భంగం కలిగించలేక పోయాడు. మరుసటి రోజు లోహియాతో గాంధీజీ, ‘నేను చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలని, సోషలిస్టు పార్టీ గురించీ, కాంగ్రెస్ గురించీ ఏదో ఒకటి నిర్ణయించాలని అందువల్ల మరుసటి రోజు (జనవరి 30) సాయంత్రం తప్పకరావాలని’ అన్నాడు. కానీ ఆ రోజే ఆయన మతోన్మాది చేతుల్లో హత్యకు గురైన సంగతి తెలిసిందే. లోహియా అనుచరులంతా ఆయన భావజాలాన్ని తీసుకోలేదు. గాంధీ భావాలే లాలూప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, ఇతర సోష లిస్టుల్లోనూ ఎక్కువగా వున్నాయి. అందుకే వీరు బీజేపీని ఎదిరించలేక పోతున్నారు. ఇకపోతే అస్పృశ్యుల జీవితాలు చూసి అంబేడ్కర్ తన జీవితంలో ఎన్నోసార్లు కంటతడి పెట్టాడు. ఈ సమాజంలో తన ప్రజలు ఎందుకు అస్పృశ్యులుగా జీవిస్తున్నారు. ఈ హిందువులు కుక్కలకు సబ్బుపెట్టి స్నానం చేయిస్తూ, వాటికి పసుపు రాస్తూ వాటిని గౌరవిస్తూ... సాటి మనిషిని నువ్వు అంటరాని వాడివి అంటూ ఎందుకు హింస చేస్తు న్నారు? అని ఎంతో మథనపడ్డాడు. ఆ మథనం నుండే ఆయన వ్యక్తిత్వం రూపొందింది. కొలంబియా యూనివర్సిటీలో పీహెచ్డీ తీసుకున్న మేధావికి బరోడాలో ఒక మామూలు బంట్రోతు మంచి నీళ్ళు ఇవ్వకుండా నిరాకరించినందుకు ఆయన తపన చెందాడు. ఆ తపన నుండే ఆయన ఉద్యమాన్ని సృష్టించాడు. తన లక్ష్య సాధన కోసం, అస్పృశ్యుల సమస్యలను ప్రభుత్వం ముందు వుంచడం కోసం, వారి కష్టాలను తొలగించడం కోసం ఒక కేంద్ర వ్యవస్థ ఏర్పాటుపై అభిప్రాయాలను తెలుసుకోవడం కోసం 1924 మార్చి 9వ తేదీన బొంబాయిలోని దామోదర్ హాల్లో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. తీవ్రమైన చర్చోపచర్చల తర్వాత ఒక వ్యవస్థ ఏర్పాటు చేయాలని తీర్మానించారు. తదనుగుణంగా జూలై 20వ తేదీన ‘బహిష్కృతకారిణి సభ’ను 1860 చట్టం కింద నమోదు చేశారు. దళితుల చరిత్రను రూపొందించడంలో అంబేడ్కర్ త్యాగపూరిత మైన కృషిని నిర్వహించారు. భారత సామాజిక వ్యవస్థలో కులం, అస్పృశ్యత ఎలా ఏర్పడ్డాయో తెలియకుండా భారతదేశంలో నూతన వ్యక్తిత్వ నిర్మాణం జరగడం సాధ్యం కాదు. ఇప్పుడు మనకు కులంలేని మనుషులు కావాలి. కుల జీవితం భారతదేశంలో ఒక నిబద్ధతగా మారిపోయింది. అందుకే అంబేడ్కర్ కులం గురించి తన కుల నిర్మూ లనా గ్రంథంలో ‘హిందూ సమాజం ఒక కులాల సమ్మేళనం. ప్రతి కులమూ అదొక పరిమిత సంస్థ కాగా అందులోకి క్రొత్తవాడికి ప్రవేశం లేదు. ఇతర మతాల వాళ్ళను, జాతులను తమ మతంలో కలుపుకొని తద్వారా తమ మతాన్నీ, తమ సమాజాన్నీ విస్తరింపజేసుకొనే అవ కాశం హిందువులకు లేకుండా పోవడానికి కారణం కేవలం కులవ్యవస్థే’ అని పేర్కొన్నాడు. అంబేడ్కర్‌ను పూర్తిగా వ్యతిరేకించాలనే బీజేపీ వ్యూహం సామాజిక న్యాయం వైపుకు నడవడంలేదు. దళితులపై ద్వేషాన్ని ప్రకటిస్తుంది. ఆవు పేరు చెప్పి ఎంతోమంది దళితులను వేటాడారు. ముస్లివ్ులపై ద్వేషాన్ని కుమ్మరించారు. తేజస్వినీ యాదవ్, శరద్ యాదవ్, మమతా బెనర్జీ వంటివారంతా దళితులపై అణచివేతను నివారించడానికి గొప్ప ఉద్యమం నడపలేకపోయారు. మధ్యతరగతి రైతులు, మధ్య తరగతి భూస్వాములుగా వ్యవహరించారు. వీళ్ళకు అంబేడ్కర్ భావజాలం ఒంటబట్టే వరకూ బీజేపీకి ప్రత్యామ్నాయం కాలేరు. ఆ పార్టీకీ వీళ్ళకు సన్నని గీత మాత్రమే తేడా వుంది. అంబే డ్కర్ భావజాల స్ఫూర్తిలో బౌద్ధం దాగి వుంది. ముఖ్యంగా స్త్రీ విముక్తి పోరాటంలో కూడా వీరు అంబేడ్కర్ ఆలోచనలను తీసు కోలేదు. కనీసం మహాత్మాఫూలే, సావిత్రీబాయి ఫూలే స్ఫూర్తి కూడా వీరి దగ్గర లేదు. అంబేడ్కర్ భార్య చనిపోయిన తరువాత కూడా కామతృష్ణకు గురికాకుండా జీవించాడు. గాంధీ, నెహ్రూల స్త్రీలకు సంబంధించిన కథనాలు లాంటివి అంబేడ్కర్‌కు లేవు. ఆయన మరో బుద్ధుడిలా జీవించాడు. స్త్రీ వ్యామోహం అనేక మంది నాయకుల్ని పతనావస్థకు తీసుకెళ్ళింది. వ్యక్తిత్వం అనేది వ్యామోహ రహితమైన దైతే కానీ విశ్వవ్యాపితమైన ప్రేమను అందించ లేరు. అంబేడ్కర్ స్త్రీల పట్ల గౌరవంగా వుండడమే గాక ‘హిందూ కోడ్ బిల్’ ద్వారా వారి హక్కులను సాధించిన మహోన్నత వ్యక్తి. ఏ నాయకుడైతే స్త్రీల చేత గౌరవించబడతారో ఆ నాయకుడే ప్రపంచ వ్యాపిత కీర్తిని ఆర్జిస్తాడు. స్త్రీలు నిశ్శబ్ద ప్రచారకులు. వారొక వ్యక్తిత్వాన్ని గౌరవిస్తే దాన్ని మౌఖికంగా ప్రచారం చేస్తారు. అంబే డ్కర్కి విపరీతమైన స్త్రీల ఫాలోయింగ్ వుండేది. బ్రాహ్మణ స్త్రీల దగ్గర నుండి దళిత స్త్రీల వరకు వారి విముక్తి కోసం ఆయన తన మంత్రి పదవికే రాజీనామా ఇచ్చాడు. స్త్రీలలో ప్రేమనూ, దుఃఖాన్నీ, వ్యధనీ చూశాడు. స్త్రీల అభ్యున్నతి కోసం మథన పడ్డాడు. లోహియా భావాలు కూడా సామ్యవాద భావాలే. అయితే ఇప్పుడున్న సోషలిస్టులు సామాజిక న్యాయ సాధనలో అస్పృశ్యతా నివారణ, కుల నిర్మూలన కోసం సామాజిక సాంస్కృతిక విప్లవ భావాలతో ముందుకు రావాల్సివుంది. బహుజన, దళిత, మైనార్టీల విముక్తి కోసం కొత్త రాజకీయ ఎజెండాతో ముందుకు నడవవలసిన బాధ్యత అందరి మీదా ఉంది. ములాయం సింగ్ స్మృతిలో లోహియా భావాల పునరుజ్జీవనమే గాక... అంబేడ్కర్ ఆలోచనలతో వాటిని సమన్వయం చేసుకోవడం అవసరం. ఈనాటి రాజకీయాలకు ఈ సమన్వయం అవసరం. అప్పుడే భారత్‌లో సామ్యవాద, సాంఘిక వాద రాజకీయ పునరుజ్జీవనం జరుగుతుంది. ఆ దిశగా నడుద్దాం. డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు ‘ 98497 41695 -
BR Ambedkar: ప్రత్యామ్నాయ భావజాల దార్శనికుడు
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రపంచ మేధావి. భారత రాజ్యాంగ నిర్మాత. ఆయన పేరు పార్లమెంట్‌కు పెట్టడం సముచితమైంది. భారతదేశంలో కులం చట్రం నుండి బయటకు రాలేక చాలామంది దేశ నాయకులు ప్రపంచ మేధావులు కాలేక పోయారు. అంబేడ్కర్ ప్రపంచ మేధావిగా ఎదగ డానికి కారణం అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో సాగిన ఉన్నత విద్యాభ్యాసం, పరిశోధనలే. ఇక్కడ సంపాదించిన జ్ఞానంతోనే అస్పృశ్యత, లింగవివక్ష, మతమౌఢ్యాలన్నింటినీ ఎదిరించగలిగాడు. ప్రత్యామ్నాయ తత్వాన్ని రూపొందించగలిగాడు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సుల్లోనూ, పార్లమెంట్ లోనూ, బహిరంగ వేదికల మీదా అనర్గళంగా మాట్లాడాడు. ఎన్నో పుస్తకాలు రాశాడు. హౌస్ ఆఫ్ కామన్స్ (బ్రిటిష్ పార్లమెంట్)లో ఆయన శత జయంతిని జరిపారంటే... ఆయన స్థాయి ఏమిటో అర్థమవుతుంది. ముక్కుసూటిదనం, తప్పును నిర్భయంగా ఖండించే తత్వం, అధ్యయన శీలత, దేశం పట్ల ప్రేమ ఆయన్ని దార్శనికునిగా నిలిపాయి. ఆయన 1951 అక్టోబర్ 29న పాటియా లాలో జరిగిన ఒక మహాసభలో మాట్లాడుతూ... ‘కాంగ్రెస్‌లో చేరాల్సిందిగా నాపై ఎంతో ఒత్తిడి తెచ్చారు. నా అస్పృశ్యులకు ఏమాత్రం మంచి పని చేయని పార్టీలో నేనెందుకు చేరాలి? నేను చేరలేదు సరికదా మంత్రి పదవికి కూడా రాజీనామా చేశాను. ఇతర మంత్రులను రాజీనామా చేయమని అడిగినట్లుగా నన్నెవరూ రాజీనామా చేయమని అడగలేదు. నాపై ఎటువంటి ఆరోపణలూ లేవు. ఎవరైనా నా శీలంపైన మచ్చపడే విధంగా ఏవైనా చెప్పమని ఛాలెంజ్ చేశా. నాపై వేలెత్తి చూపడానికి ఏ ఒక్కరూ సాహసించలేదు’ అన్నాడు. ఇక రాజ్యాంగ రచన దగ్గరికొద్దాం. రాజ్యాం గాన్ని రాజ్యాంగ పరిషత్ రాసింది. రాజ్యాంగానికి ఒక రూపాన్ని ఇచ్చే నిమిత్తం ఏడుగురు సభ్యులతో ఒక ‘రాజ్యాంగ ముసాయిదా రూపకల్పన సంఘం’ ఏర్పాటు చేయబడింది. ఆ సంఘానికి అంబేడ్కర్ అధ్యక్షులు. వివిధ ఉప సంఘాలు పంపిన నివేదికలను క్రోడీకరించి, క్రమబద్ధీకరించి ఆ సంఘం రాజ్యాంగ ముసాయిదాను (చిత్తుప్రతి) తయారు చేసింది. 1948 జనవరిలో ఆ రాజ్యాంగ ముసాయిదా ప్రచురించబడి విడుదలయింది. ఆ ముసాయిదా రాజ్యాంగానికి 7,635 సవరణల ప్రతిపాదనలు వచ్చాయి. అయితే, వాటిలో కేవలం 2,473 సవరణలను మాత్రమే రాజ్యాంగ పరిషత్ చర్చించింది. మిగిలిన వాటిని తిరస్కరించింది. నూతన రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్ ఆమోదించగా, 1950 జనవరి 26 నుండి అమలులోకి వచ్చింది. దీంతో భారత్ గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించింది. 1947 ఏప్రిల్ 29వ తేదీన సమావేశమైన చట్ట సభలో అస్పృశ్యతను నిర్మూలిస్తూ తీర్మానం జరిగింది. దీనికి సంబంధించిన చిత్తుబిల్లును సర్దార్ వల్లభాయ్ పటేల్ చట్ట సభలో ప్రవేశపెట్టారు. ఇలా అస్పృశ్యతను చట్టరీత్యా నిర్మూలించే పరిస్థితి రావడానికి కారణం అంబేడ్కర్ మహోన్నతమైన కృషే కారణం. తరతరాలుగా అస్పృశ్యతలో మగ్గిపోతున్న ప్రజలకు ఈ చట్టం ఎంతో ఊరటను కలిగించింది. ఒక్క ఉదుటన వారు సంకెళ్ళను తెంచుకొని ప్రధాన స్రవంతి సమాజంలోకి పరుగులెత్తడానికి ఈ చట్టం రాచబాట వేసింది. అయితే ఈ కీర్తినంతా మహాత్మ గాంధీకి అంటగట్టాలని కాంగ్రెస్‌పార్టీ ఎంతో ప్రయత్నం చేసి విఫలమైంది. ఏ అస్పృశ్యతకైతే అంబేడ్కర్ గురి అయ్యారో ఆ అస్పృశ్యతా నివారణ చట్టాన్ని నిర్మించగలగడం, దాన్ని అగ్ర వర్ణాలు అధికంగా వున్న రాజ్యాంగ పరిషత్తులో నెగ్గేలా చేయడం అంబేడ్కర్ రాజనీతిజ్ఞతకు నిదర్శనం. ఆయన తన ప్రత్యర్థులను, శత్రువుల్ని కూడా తన వాదనా పటిమతో, తన జ్ఞాన వికాసంతో, తన శాస్త్ర ప్రమాణాలతో ఒప్పించగలిగిన ధీశక్తి గలవాడు. భారతదేశంలో ఉన్న ప్రతి మనిషినీ ఆయన కులం నుండి బయటపడేయాలని ప్రయత్నం చేశాడు. కులం మనిషికి గీతలు గీస్తుందనీ, అతడు ఎదగాల్సిన దిశ నుండి ఎదగకుండా, హద్దుల్లో వుంచుతుందనీ, ఇవ్వాళ అస్పృశ్యులుగా చెప్ప బడుతున్న వారు ఆర్యుల చేత ఓటమి చెందిన జాతులే కాని అస్పృశ్యులు కాదనీ, వారు భారత్‌ను పాలించిన జాతులనీ నొక్కి వక్కాణించారు. ఫ్రెంచి విప్లవం నుండి రూపొందిన స్వేచ్ఛ, సమానవత్వం, సౌభ్రాతృత్వ భావాలను ఆయన రాజ్యాంగంలో పొదిగారు. భారత పార్లమెంట్‌ను అత్యంత ఉన్నతమైన, ప్రజాస్వామ్య, లౌకిక, సామ్యవాద, భావజాల పూర్ణంగా రూపొందించారు. ఆయన నిర్మించిన ఈ ప్రజాస్వామ్య ‘భవనాని’కి ఆయన నామవాచకం పెట్టడం సముచితమైంది. అయోధ్యలోని రామ మందిరానికి రాముని పేరు పెడుతున్నారు కదా. అలాగే ఇదీ ప్రత్యా మ్నాయ భావజాలాల మానవతా మందిరం, మమతల సౌధం. అంబేడ్కర్ బౌద్ధ తత్వాన్ని జీర్ణించుకొన్న తాత్వికుడు. బౌద్ధ అంతస్సారమైన మానవత్వం, వ్యక్తిత్వ నిర్మాణం, అవినీతి రహిత జీవనం లాంటి భావాలన్నింటినీ ఆయన రాజ్యాం గంలో పొందుపరిచారు. అలా మౌఖిక దశలో వున్న బౌద్ధ ధర్మాలను చట్టరూపంలోకి తీసుకురా గలి గాడు. ఈ రాజ్యాంగ సౌధాన్ని ఎవరూ కదిలించలేరు. దానికి ప్రతివాదం చేసిన వారంతా ఆ వాదంలో ఇమిడి పోవాల్సిందే. (క్లిక్ చేయండి: అంబేడ్కర్ పేరు ఎందుకు పెట్టాలంటే...) భారతదేశం ఈనాడు ప్రపంచం ముందు ప్రజాస్వామ్యం, ఆర్థిక స్వావలంబన, పౌర హక్కులు, స్త్రీ అభ్యున్నతి, రాజకీయ సమతుల్యత వంటి అనేక విషయాల్లో తల ఎత్తుకుని నిలబడిం దంటే అది అంబేడ్కర్ సిద్ధాంతాలు, ఆశయాలు, నిర్మాణ దక్షత వల్లనే. భారత ఉపఖండంలో చరిత్రను మార్చిన వారు బుద్ధుడు, అశోకుడు, అంబేడ్కర్. వారు చరిత్ర విస్మరించలేని విశ్వజనీనులు. అందుకే అశోకుడి ధర్మ చక్రం భారత పతాకలో చేరింది. బుద్ధుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించారు. అంబేడ్కర్ అస్తమించని సూర్యుడయ్యాడు. ఇప్పుడు పార్లమెంట్ భవనానికి ఆయన పేరే ఒక వెలుగు దివ్వె. ఆ వెలుగులో మనం నడుద్దాం! - డాక్టర్ కత్తి పద్మారావు ‘అంబేడ్కర్ జీవిత చరిత్ర’ రచయిత -
శాస్త్ర జ్ఞానాభివృద్ధే దేశానికి ఊపిరి
భారతదేశంలో శాస్త్రీయ భావ జాలాలపై హిందూ పౌరాణిక వ్యవస్థ దాడి చేస్తోంది. మొత్తం సూర్య కేంద్ర సిద్ధాంతాన్ని ధ్వంసం చేసి భూ కేంద్ర సిద్ధాంతాలతో కూడిన జ్యోతిష్యం, మూఢవిశ్వాసాలతో కూడిన భావజాలాన్ని వ్యాప్తి చేస్తు న్నారు. దానివల్ల భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం, ఇలా అన్నీ సంక్షోభంలో పడు తున్నాయి. మానవుని పుట్టుక, నిర్మాణం మీదే ఇంకా సందిగ్ధ భావనలు ప్రచారం చేస్తున్నారు. నిజానికి భారతదేశంలో చార్వాకం, బౌద్ధం, జైనం, సాంఖ్యం విస్తరిల్లి భారతీయ భౌతిక శాస్త్రం అత్యున్నతంగా ప్రజ్వలించింది. ఇతర దేశాల వారు సాంఖ్య దర్శనం లోని అనేక అంశాలను తీసుకుని వారి భౌతిక శాస్త్రాన్ని అభివృద్ధి చేసుకున్నారు. సాంఖ్యం బుద్ధుణ్ణి తర్కబద్ధమైన ఆలోచనలకు పురిగొల్పింది. జ్ఞానం ధ్యానం నుండి వచ్చేది కాదనీ, అది తర్క బద్ధమైనదనీ ఆయన గ్రహించాడు. సాంఖ్య దర్శనం భారతీయ తత్వ శాస్త్రాలలో హేతు బద్ధమైనది, భౌతిక వాదంతో కూడినది. ఈ దర్శనాన్ని రచించిన ‘కపిలుడు’ నిరీశ్వర వాదాన్ని ప్రతిపాదించాడు. దీనిపై పరిశోధన చేసిన ‘కీత్’ ‘ప్రపంచం మొత్తంలో భౌతిక వాదానికి సాంఖ్య దర్శనం ప్రేరణ శక్తి’ అన్నాడు. శాస్త్ర జ్ఞానానికి జ్ఞాన సంపద, హేతు దృష్టి, కార్యాచరణ శీలత, గ్రహణశక్తి, విశ్లేషణా శక్తి, అవసరం. అయితే ఇప్పుడు శాస్త్రాన్ని బోధించే ఆచార్యులు కూడా మూఢ నమ్మకాలు కలిగి ఉండటం ఆశ్చర్యం. భౌతిక వాదాన్ని, భౌతికశాస్త్రాన్ని, రసాయన శాస్త్రాన్ని, జీవశాస్త్రాన్ని బోధించే ఆచార్యులు కూడా వర్ణధర్మాన్ని యజ్ఞ, యాగ, కర్మకాండలపై నమ్మకాన్ని, కులాచరణను కలిగి ఉండటంవల్ల శాస్త్ర జ్ఞాన బోధ పెదవుల నుండే జరుగుతోంది కానీ అది మేధస్సుకు పదును పెట్టలేక పోతోంది. అందుకే ఇప్పుడు దేవాల యాల యాత్రలకు శాస్త్రవేత్తలు క్యూ కడుతున్నారు. ఇది ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే పదార్థవాదం చెప్పే ఒక ఉపాధ్యాయుడు తన భావజాలం నుండి బయటపడలేక పదార్థం వెనుక కూడా ఏదో అదృశ్య శక్తి ఉన్నదని బోధించే దశలో ఉండటం వల్ల విశ్వవిద్యాలయాల్లో ద్వైదీ భావజాలం పరిఢవిల్లుతోంది. అందువల్లే అక్కడ రూపొందే విద్యార్థులు శాస్త్రీయ ఆవిష్కరణల్లో వెనుక బడిపోతున్నారు. ఫలితంగా మన విశ్వ విద్యాలయాల కోసం చేస్తున్న కొన్ని కోట్ల రూపాయల ఖర్చు వ్యర్థమైపోతోంది. శాస్త్ర జ్ఞాన లోపం వల్ల ఉత్పత్తి క్రమం కూడా భారతదేశంలో తగ్గిపోతోంది. శాస్త్ర సాంకేతిక జ్ఞానం వల్ల చైనా, జపాన్, జర్మనీల్లో ఉత్పత్తి పెరిగింది. మనదగ్గర అది కనిపించకపోవడానికి శాస్త్ర జ్ఞాన లోపమే కారణం. నైతిక శక్తిని బోధించే బౌద్ధాన్ని విశ్వవిద్యాలయాల్లో, కళాశాలల్లో, రాజకీయ పాఠశాలల్లో విస్తృ తంగా బోధించకపోవడం వల్ల నైతిక శక్తి సైతం తగ్గిపోతూ వస్తోంది. అవినీతిపరులు పెరగడం, దేశాన్ని దోచుకుని ఇతర దేశాల్లో దాచుకునేవారు పెరగడం, దేశీయ ఉత్పత్తులకు పునాదైన సాంకేతిక జ్ఞాన శూన్యత వల్ల మూఢాచారాలు పెరగడం సహజమైపోయింది. రాళ్ళూ, రప్పలకు బుర్రలు తాకట్టు పెట్టడం వల్ల పేరుకు 140 కోట్లు మంది ఉన్నా కూడా ఆలోచించే వాళ్ళు 20 కోట్ల మంది కంటే తక్కువే ఉన్నారని అర్థ మవుతుంది. శ్రామికుడిని హీనంగా చూస్తూ విగ్రహా లను ఆధారం చేసుకుని బతికే వారిని పండితులుగా, భూదేవతలుగా కొనియాడటం జరుగుతోంది. రాగ ద్వేషాలను, కుల మత వైరుధ్యాలను పెంచే సంఘర్షణోన్మాద, యుద్ధోన్మాదాన్ని పెంచే కల్పిత యుద్ధ గాథల ప్రవచనాల వల్ల, దృశ్యాల వల్ల భారతదేశం నిరంతరం ఘర్షణలతో అట్టుడుకుతోంది. బౌద్ధ భారత నిర్మాణం వల్ల నైతిక శక్తి పెరుగుతుంది. పగతో పగ చల్లారదు. ప్రేమ వల్లే పగ చల్లారుతుంది అనే ధమ్మ పథం సూత్రాలు నేడు అవసరం. స్థిరత్వంతో, సంయమనంతో, కోప రహితుడిగా ఉండి... నిబ్బరంగా, నిజాయితీగా ఉండే విజ్ఞానవంతుడు వరదల ధాటికి మునగని దీవి లాంటివాడని, అటువంటి స్థిరత్వాన్ని శాస్త్రజ్ఞులు సాధించాలని బౌద్ధ బోధనలు చెబుతున్నాయి. శాస్త్ర జ్ఞానం ప్రకారం పుట్టుకలో గానీ, మరణంలోగానీ మానవులందరూ ఒకే రకంగా ఉన్నారు. ఒకే కులంలోని వ్యక్తులు కూడా అనేక వృత్తులు చేపడుతున్నారు. కానీ మనసుల్లో వర్ణభేదాలు, కుల భేదాలు, మూఢనమ్మకాలు ఉండడం వల్ల తమను తాము మనుషులుగా గుర్తించుకోలేక పోతున్నారు. గొప్ప జీవశాస్త్ర జ్ఞానమున్న వాళ్ళు కూడా మంత్ర గాళ్లకు, జ్యోతిష్యులకు లొంగిపోతున్నారు. వ్యవసాయ దారులు, వర్తకులు, విద్యావంతులు కూడా వీరికి బానిసలవుతున్నారు. అందువల్ల శాస్త్ర జ్ఞానం జీవితంలో ఫలించడం లేదు. అవినీతి ద్వారా సంపాదించిన డబ్బు తీసుకెళ్ళి దేవుని హుండీల్లో వేస్తున్నారు. మనిషి పవిత్రత, అపవిత్రత అనేది ప్రవర్తన వల్ల రుజువు కావాలి కానీ దేవుడికి ఇచ్చే కానుకల వల్ల కాదు. దొంగలు, అవినీతి పరులు, అప్పు చేసి ఇతర దేశాలకు పారిపోయే వారంతా గొప్ప భక్తులుగా చలామణి అవుతున్నారు. నిజమైన శాస్త్రజ్ఞులకు సరైన గుర్తింపు, ఆదరణ లేదు. కనీసం ఇప్పటికైనా మన శాస్త్రీయ విజ్ఞానాభివృద్ధి తెచ్చిన ఫలితాలతో ముందుకు వెళ్ళవలసిన చారిత్రక సందర్భం ఇది. శాస్త్ర విజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడం ద్వారానే ప్రజా జీవన సమృద్ధికి ప్రేరణ కలుగుతుంది. ఉత్పత్తి, జ్ఞానం, విద్య, సాంకేతికతల సమన్వయంతో భారతదేశం ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. అప్పుడే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగం జీవితాల్లో ప్రతిఫలిస్తుంది. (క్లిక్: ఉన్నవాళ్లకే మరిన్ని రాయితీలా?) - డాక్టర్ కత్తి పద్మారావు కవి, దళితోద్యమ నాయకుడు -
ప్రణాళికాబద్ధంగా దూరం చేస్తున్నారు!
డెబ్భై ఐదేళ్ల స్వాతంత్య్ర భారతంలో సామాజిక ఆర్థిక వ్యవస్థ మరింత కూలిపోవడానికి కారణం దళిత, బహుజన ఉత్పత్తి వర్గాలను ప్రధాన స్రవంతి లోని ఉత్పాదక శక్తులుగా మార్చకపోవడమే. అంటే ఒక 500 ఏళ్ల నుంచి నాటు వేసే కుటుంబాలు భూమి కలిగి లేకపోవడం; ఏ రంగంలో అయితే వారు తమ శ్రమను ధారబోస్తున్నారో ఆ రంగం భూస్వామ్య పెట్టుబడిదారుల చేతుల్లో ఉండడం ప్రధాన కారణం. 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో శిశు ఆరోగ్య సంరక్షణ మరింతగా క్షీణించడం వలన పుట్టే పిల్లలు శక్తిమంతంగా పుట్టడం లేదు. మాతా శిశు పోషక ఆరోగ్య బాధ్యతలు మరింతగా క్షీణిస్తున్నాయి. అవినీతి అన్ని వైపులా అల్లుకుంటూ ఇచ్చే చేతికీ, తీసుకునే చేతికీ మధ్య వంద చేతులు ఏర్పడుతున్నాయి. భరత భూమిలో ప్రధాన వనరు భూమి. భూమి అందరి సొత్తు. కానీ ప్రతి రాష్ట్రంలోనూ ఇప్పుడు అది ఐదు కులాల చేతుల్లోనే ఉంది. మొత్తం భారత దేశంలో సుమారు 6,000 కులాలున్నాయి. అయితే దాదాపు భూమి అంతా 100 కులాల చేతుల్లోనే ఉంది. ఇంతకంటే పెద్ద అసమానత మనకి ఏ దేశంలోనూ కనిపించదు. మన జాతీయాదాయం మొత్తంలో 22 శాతం... ఒక్క శాతం మంది దగ్గరే ఉంది. భారతదేశ సంపదాభివృద్ధి ప్రక్రియలోకి దళితులను ఎందుకు రానివ్వడం లేదు అనేది మన ముందున్న ప్రశ్న. ఇదంతా ఒక ప్రణాళికాబద్ధంగా జరుగుతోంది. సంపదను సృష్టిస్తున్న ఐటీ పరిశ్రమ భారతదేశంలో 1990 నుండి ప్రారంభమైంది. అతికొద్ది కాలంలోనే 16 లక్షల కోట్లు వ్యాపారం చేసింది. ఈ రంగంలో దేశంలోని పది, పది హేను కులాలే జొరబడ్డాయి. ఈ రంగంలోకి దళితులు ప్రవేశించకుండా పెద్ద ప్రయత్నం జరుగుతోంది. ఇది పెద్ద సామాజిక ద్రోహం. ఇక జీడీపీ సంగతికొస్తే... ప్రపం చంలో రెండు దేశాలు ముందున్నాయి. ఒకటి చైనా. రెండోది దక్షిణ కొరియా. దీనికి కారణం అక్కడ కుల, మత భేదాలు లేకుండా అందరినీ, అన్ని రంగాలలో ప్రోత్సహించడమే. భారతదేశంలో అటువంటి ప్రోత్సాహమే లేదు. దానికి కారణం కులవ్యవస్థ, అస్పృశ్యతా భావన. చైనా ప్రపంచంలో రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. చైనాతో మనం పోటీపడలేక పోవ డానికి కారణం మనదేశం లోని 60 కోట్ల మందినీ మనం ఉత్పత్తి రంగంలోకి తీసుకురాకపోవడం. సామాజిక న్యాయానికి విఘాతం ముఖ్యంగా 1970 తర్వాత ఏ కులం వారు ఆ కుల వ్యవస్థను పటిష్టం చేసుకుంటున్నారు. పారిశ్రామిక వ్యవస్థలు, విద్యా సంస్థలు అన్నింటిలోనూ స్వకులం వారినే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇది సామాజిక న్యాయ దూరం. మరోపక్క దేశంలో అవినీతి పెరిగిపోతోంది. అవినీతి మీద మాట్లాడే గళాలను అణచి వేయాలని చూస్తున్నారు. కనీసం స్వాతంత్య్రం వచ్చిన మొదట్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, రామ్ మనోహర్ లోహియా, హీరేన్ ముఖర్జీ, డాంగే, పుచ్చలపల్లి సుందరయ్య, కృష్ణ మీనన్, మాలవ్యా, లాల్ బహదూర్ శాస్త్రి, గుల్జారీలాల్ నందా, సుశీలా నాయర్, మొరార్జీ దేశాయ్, నంబూద్రి పాద్ వంటి వారు ప్రజాస్వామ్యంలోని లొసుగులను గురించి తమ గళాలు వినిపించగలిగే వారు. ఇప్పుడా పరిస్థితి భారత దేశంలో లేదు. స్వాతంత్య్ర భారతంలో ప్రజల వాక్కుకు స్వాతంత్య్రం లేదు. ఈ దశాబ్దంలో ఎంతో మంది తమ వాక్కు వినిపించి హతులయ్యారు. సంపన్న వర్గాలు, అగ్రకులాలు ఎన్నికలను పెట్టుబడి, రాబడిగా చూస్తున్నాయి. రాజకీయ రంగంలో ఓటు కొనడం ఎప్పుడు ప్రారంభించారో అప్పుడే ప్రజాస్వామ్య విలువలు కుప్పకూలడం ప్రారంభమయ్యింది. ధనికుల రక్షణ, పేదల భక్షణ కొనసాగుతోంది. పోలీసు వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, పాలక వ్యవస్థ ధనవంతులకు ఊడిగం చేస్తున్నాయి. ధనవంతులు మరింత ధనవంతులు కావడానికి కారణం రాజ్యాంగ ఉల్లంఘనే. ఈ 75 ఏళ్లలో శాస్త్రీయ, వైజ్ఞానిక, సాంకేతిక జ్ఞానం అంతరిస్తూ వస్తోంది. భారతదేశంలో ప్రధాన మతమైన బౌద్ధం పునరుజ్జీవం మీద దెబ్బ కొట్టారు. హిందూ మతో ద్ధరణకు పూనుకుని బడులు తగ్గించి గుడులు పెంచారు. హిందూ మతేతరమైన జైన, సిక్కు, బౌద్ధ, క్రైస్తవ, జొరాస్ట్రియన్ వంటి మత ధర్మాలను ఎదగకుండా చేశారు. మానవ, సామాజిక, వ్యక్తి ధర్మాలను ధ్వంసం చేసి అరాచకత్వాన్ని పెంచారు. భారతీయ తాత్వికులైన చార్వాకులు, సాంఖ్యాయనులు వంటి భౌతిక తాత్వికుల ధర్మాలను కాలరాశారు. వీటన్నిటి ఫలితంగా భారతదేశం సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక దోపిడీలో మగ్గుతోంది. స్వాతంత్య్రం అగ్రకులాల, అగ్ర వర్గాల అనుభవైకవేద్యమయ్యింది. (క్లిక్: ప్రగతి ఫలాలు దక్కిందెవరికి?) అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని ప్రతి ఒక్క దళితుడూ, బహుజనుడూ, మైనారిటీలు చేతబూనాల్సిన చారిత్రక సందర్భం ఇది. రాజ్యాంగం ఇచ్చిన ఉద్యమ హక్కుని, పోరాట హక్కుని పునరుజ్జీవింపజేసి మనుషులు చైతన్యవంతులై, నీతిమంతులై, వ్యక్తిత్వ నిర్మాణదక్షులై తమను తాము అమ్ముకోకుండా; తమను తాము రక్షించుకుని, జీవింపజేసుకుని, నూతన భావాలను పునరుజ్జీవింప జేసుకుని రాజ్యాధికార దిశగా కొనసాగ వలసిన రోజులివి. పోరాటం మానవుని హక్కు. జీవించడం మానవుని హక్కు. సంపద అందరికీ సమానంగా పంపిణీ అయ్యే వరకూ పిడికిళ్లు బిగుసుకునే ఉంటాయి. ఐక్యతా పోరాటమే స్వాతంత్య్రానికి పునాది. - డాక్టర్ కత్తి పద్మారావు సామాజిక ఉద్యమకారుడు -
వివక్షే ఆర్థికాభివృద్ధికి గొడ్డలిపెట్టు
భారత దేశ ఆర్థిక, సామాజిక, రాజకీయ వ్యవస్థలన్నీ... కులం, కులానికి పునాదైన మతం వల్ల ప్రభావితమై ఉన్నాయి. అందువల్లనే దేశ ఆర్థిక వ్యవస్థ ఉత్పత్తి, పంపిణీల్లో తీవ్రమైన అసమానతలతో కునారిల్లుతోంది. కులానికో ఉత్పత్తి బాధ్యత ఉన్న దేశంలో ఆయా కులాల పట్ల వివక్ష చూపడం, వారికి భూమిని దక్కకుండా చేయడం వల్ల ఉత్పత్తిని స్తబ్ధత ఆవరించిందని అంబేడ్కర్ అన్నాడు. భారతదేశంలో ప్రారంభమైన ఏ విప్లవమైనా కులం ఊబిలోనే సతమతమవుతోంది. కులానికి పునాది అయిన మతాన్ని విస్మరించి మన ఉపరితలంలో ఎంత మాట్లాడుకున్నా మూలం ఘనీభవిస్తూనే ఉంటుంది. మళ్లీ భారతదేశాన్ని పునర్నిర్మించాలంటే అంబేడ్కర్‌ను అధ్యయనం చేయాల్సిన అవసరం ఇక్కడే తప్పనిసరి అవుతుంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రూపొందించిన భారత రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని మనకు అవగతమవుతోంది. అంబేడ్కర్... రాజకీయాల్లో వ్యక్తిత్వం, ఆదర్శం, నీతి, నిజాయితీ చాలా అవసరమని చెప్పి ఆయన స్వయంగా ఆచరించాడు. నాయకులకు వ్యక్తిత్వం శూన్యమైతే భారత సామాజిక, సాంస్కృతిక వ్యవస్థ సంక్షోభంలో పడక తప్పదు. భారతదేశ వ్యాప్తంగా అవినీతి పెరిగింది. అందువల్ల దేశ సంపద అంతా అధికంగా నాయకులు, కార్పొరేట్లు, పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్లింది. ఈ క్రమంలో ప్రతి పదిమందిలో ఒకరు దుర్భరమైన చాకిరీ చేస్తే కానీ బతకలేని స్థితి దాపురించింది. వీళ్ళందరిలో ఎస్సీ, ఎస్టీల పిల్లలు తొంభై శాతం అని సర్వేలు చెబుతున్నాయి. ఇప్పటికీ చాలామంది బొగ్గు క్వారీల్లో, హోటళ్లలో పనిచేస్తూ... రైల్వే ట్రాక్‌ల మీద కాగితాలు, విసిరేసిన సీసాలు ఏరుకుంటూ కాలే కడుపుతో కళ్ళు పీక్కుపోయి బతుకుతున్నారు. రాజ్యాంగం వీరికి కల్పించిన హక్కులు కాలరాయబడుతున్నాయి. భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న మరో విషయం నిరుద్యోగం. సంస్కరణలు వృద్ధి రేటును పెంచినట్టు చూపిస్తున్నాయి. కానీ నిరుద్యోగం అధికమవుతోంది. రెగ్యులర్ ఎంప్లాయీస్‌ను తగ్గిస్తూ క్యాజువల్ లేబర్‌ను పెంచుతున్నారు. దానివల్ల ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం లేకుండా పోయింది. శ్రామిక సంక్షోభానికి తూట్లు పొడిచారు. ఆర్థిక వ్యవస్థ కుంటుపడడానికి కారణమైన లాకౌట్లు యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల జరిగినవే. సంస్కరణల పేరుతో వ్యవస్థాపకులు శాశ్వత శ్రామికుల్ని తొలగించి తాత్కాలిక ఉద్యోగుల్ని నియమిస్తూ వస్తున్నారు. శాశ్వత శ్రామిక వర్గాన్ని అంతరింపజేయాలనీ; సమ్మె, పోరాటం అనే రాజ్యాంగ హక్కులను దెబ్బతీయాలనీ పెద్ద ప్రయత్నం జరుగుతోంది. వ్యయసాయ రంగ విస్తరణ తొమ్మిదో ప్రణాళిక నుండి పధ్నాలుగో ప్రణాళిక వరకూ రెండు శాతం దగ్గరే స్తబ్ధంగా ఉండిపోయింది. దీనికి కారణం వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడుల శాతం తగ్గిపోవడమే. భారతదేశ వ్యాప్తంగా వ్యవసాయ రంగానికి సరైన ప్రోత్సాహం లేదు. వరి, గోధుమ వంటి పంటలను ప్రోత్సహించి భూసారాన్ని సహజంగా పెంచే ప్రక్రియకు తిలోదకాలిచ్చారు. అలాగే వ్యవసాయ కూలీలుగా ఉన్న ముప్పై కోట్ల మంది ఎస్సీ, ఎస్టీలకు ఒక్క శాతం భూమి కూడా లేదు. అంబేడ్కర్ భూమిని పంచకుండా ఆర్థిక సామాజిక వ్యవస్థ బలపడదని స్పష్టంగా చెప్పాడు. ప్రధానంగాఎస్సీ, ఎస్టీలకు భూమి పంపకం జరగలేదు. దానివల్ల దళితుల్లో వ్యక్తిత్వ నిర్మాణం జరగడం లేదు. ‘భారతదేశంలో నేనొక వ్యక్తిని, నాదొక కుటుంబం’ అనే భరోసా రావాలంటే అది భూమి పంపకంతో సాధ్యమవుతుందని అంబేడ్కర్ చెప్పాడు. రైతులు అంటే అన్ని రాష్ట్రాల్లో భూమి కలిగిన ఐదు అగ్ర కులాలను చెప్పుకోవడంలోనే నిర్లక్ష్యం దాగి ఉంది. అంబేడ్కర్ దేశంలోని ప్రతి గ్రామంలోనూ నివసిస్తున్న దళితులందరికీ విద్యుత్ సౌకర్యం ఉచితంగా అందించినప్పుడే వారిలో వెలుగు వస్తుందని చెప్పాడు. ఇప్పటివరకూ నలభై శాతం దళిత వాడల్లో విద్యుత్తు లేదు. ఎస్సీ, ఎస్టీలు చీకటి గుహల్లో జీవిస్తున్నారు. అటువంటి సమయంలో వారి పిల్లలకు విద్యావకాశాలు ఎలా మెరుగు పడతాయని ఈనాటి సామాజిక శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. దళితులను వ్యవసాయ కూలీల నుండి వ్యవసాయ దారులుగా మార్చకపోయినట్లయితే భారతదేశ ఉత్పత్తులు పెరగవని అంబేడ్కర్ ఆనాడే చెప్పాడు. భారతదేశంలో ఉత్పత్తులు స్తబ్ధతలో ఉండడానికి కారణం దళితులకు భూమీ, నీరూ, విద్యుత్తు, విద్య, ఉద్యోగ, ఉపాధి కల్పనల్లో తగిన వాటా లభించకపోవడమే. ఇకపోతే 2017–18 నాటి యునెస్కో లెక్కల ప్రకారం ముప్పై ఐదు శాతం మంది చదవడం, రాయడం రానివారు భారతదేశంలోనే ఉన్నారని తేలింది. ఇందులో నిరక్షరాస్యులుగా ఉంది ఎస్సీ, ఎస్టీలే. నిరక్షరాస్యులుగా ఉంచి మతభావాలు, కులభావాలు కలిగించడం ద్వారా ఓట్లు కొల్లగొట్టాలనే రాజకీయ వ్యూహం నుండి దళితులను, దళిత వయోజనలను బయటకు తీసుకు వచ్చినప్పుడే దళిత విద్యార్థులు విద్యాపరంగా అభివృద్ధి చెందుతారు. ప్రకృతి శక్తులైన దళిత శ్రామికుల మీద చూపిస్తున్న నిర్లక్ష్యం... రాజ్యాంగేతర భావజాలంతో పెరుగుతోంది. అంబేడ్కర్ భారతదేశంలోని కుల, మతాలను అర్థం చేసుకుని, ఆ దృక్కోణంలోనే ఆర్థిక, రాజకీయ వ్యవస్థలను అధ్యయనం చేశాడు. అందుకే భారత రాజకీయాలనూ, ఆర్థిక వ్యవస్థనూ కులం, దానికి పునాది అయిన మతం నేపథ్యంలోనే వ్యాఖ్యానించారు. మార్క్సిస్టులు ఈ అవగాహన నుండి ఇంతవరకు ఆర్థిక శాస్త్రాన్ని చూడలేకపోయారు. భారతదేశంలో ప్రారంభమైన ఏ విప్లవమైనా అది కులం ఊబిలోనే సతమతమవుతోంది. కులానికి పునాది అయిన మతాన్ని విస్మరించి మన ఉపరితలంలో ఎంత మాట్లాడుకున్నా మూలం ఘనీభవిస్తూనే ఉంటుంది. మళ్లీ భారతదేశాన్ని పునర్నిర్మించాలంటే అంబేడ్కర్‌ను అధ్యయనం చేయాల్సిన అవసరం ఇక్కడే తప్పనిసరి అవుతుంది. అంబేడ్కర్ ఇలా అన్నాడు: ‘అధికారంలో ఉన్న వ్యక్తులు దేశ ప్రయోజనాల పట్ల నిర్ద్వంద్వమైన నిబద్ధత కలిగి ఉండేటటువంటి ప్రభుత్వం మనకు రావాలి. న్యాయాన్ని ఇచ్చే సామాజిక, ఆర్థిక నియమావళిని సవరించేటటువంటి ప్రభుత్వం మనకు రావాలి’. ఇకపోతే ఇప్పటికీ ఉద్యోగ వ్యవస్థలో బ్రాహ్మణ, బనియాలదే పెద్ద పాత్ర. ‘ఈపీడబ్ల్యూ’ భారతదేశ అధికార వర్గ వ్యవస్థ గురించి ఇలా పేర్కొంది. దేశ కార్పొరేట్ బోర్డ్ డైరెక్టర్లు... కులాల ప్రకారం బ్రాహ్మణులు 44.6 శాతం, వైశ్యులు 46.0 శాతం ఉంటే, ఎస్సీ, ఎస్టీలు కేవలం 1 శాతంగా ఉన్నారు. 1989–90లో ప్రభుత్వ సంస్థలు 1,160 ఉంటే 2010 నాటికి అవి 21,642కు పెరిగాయి. అదే ప్రైవేటు రంగ కంపెనీలు 1990లో రెండు లక్షలు ఉంటే ఇప్పుడు 8.5 లక్షలకు పెరిగాయి. వాటిలో పెట్టుబడి 64 వేల కోట్ల నుండి 11 లక్షల కోట్లకు పెరిగింది. తాజా అంచనాల ప్రకారం భారత కుబేరుల మొత్తం సంపద జీడీపీలో 15 శాతానికి సమానం. ఐదేళ్ల కిందట ఇది 10 శాతం గానే ఉంది. ప్రస్తుతం దేశంలో 166 మంది బిలియనీర్లు ఉన్నారు. ఆదాయం, వినియోగం, సంపద విషయాల్లో ప్రపంచంలోనే అత్యంత అసమానతలు ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. కులం, మతం, ప్రాంతం, లింగ భేదాలతో కునారిల్లుతున్న భారతీయ సమాజానికి ఆర్థిక అసమానతలు మరింత ఆందోళన కలిగించేవే. ఈ ఆర్థిక అసమానతల వల్ల దళిత, మైనారిటీల స్త్రీల పరిస్థితి అధోగతి పాలయ్యింది. అంబేడ్కర్ ఆర్థిక శాస్త్ర సంపన్నుడు. ఆయన భారత దేశంలో కులం, అçస్పృశ్యత, స్త్రీ వివక్ష పోయినప్పుడు మాత్రమే ఆర్థిక సంపద పెరుగుతుందని చెప్పాడు. ఈ విషయాన్ని ముఖ్యంగా కమ్యూనిస్టులు అర్థం చేసుకోలేకపోయారు. అందువల్ల హిందూవాదులు కులాన్నీ, అస్పృశ్యతనూ స్థిరీకరించే క్రమంలో కార్పొరేట్ వ్యవస్థను విస్తృతం చేసి, రాజ్యాంగ సూత్రాలు దళితులకు అన్వయం కాకుండా చేసి, అçస్పృశ్య భారతాన్ని కొనసాగించాలనే దుర్వ్యూహంలో ఉన్నారు. అంబేడ్కర్ కుల నిర్మూలన, అçస్పృశ్యతా నిర్మూలన భావజాలంతో భారతదేశాన్ని ప్రేమించి, దేశంలో ఉన్న ప్రతి పౌరునికీ ఆర్థిక స్వావలంబనకు అవకాశం కల్పించి, భారతదేశ ఆర్థిక ఉత్పత్తుల్ని పెంచి, కుల రహిత గ్రామీణాభి వృద్ధీ, కుల వివక్ష లేని ఉద్యోగిత; మత అణచివేత లేని, స్త్రీ అణచివేత లేని సామాజిక వాదం సమ్మిశ్రితంగా నూతన ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక విప్లవాన్ని అంబేడ్కర్ మార్గంలో నిర్మిద్దాం. డాక్టర్ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు, కవి. 98497 41695 -
ఆధునిక అవసరాలు తీర్చే విద్య కావాలి
విద్య అనేది ఒక సామాజిక, సాంస్కృతిక జీవన మార్గాన్ని రూపొందిస్తుంది. అది ప్రపంచ జ్ఞానానికి మార్గం. ప్రపంచాన్ని మన ముందు ఆవిష్కరిస్తుంది. ప్రపంచ గమనాన్ని నిర్దేశిస్తుంది. మానవ జీవన సోపానమైన విద్య ప్రపంచ వ్యక్తిత్వాన్ని మనకు ఆవాహనం చేస్తుంది. మానవుడు విద్యను స్వార్థానికి ఉపయోగిస్తున్న సందర్భంగా అది కార్పొరేట్ కబంధ హస్తాల్లోకి వెళ్ళింది. కార్పొరేట్ విద్యా వ్యవస్థ మెదడుకు ఒత్తిడిని కలిగించి, జ్ఞానాన్ని ధ్వంసించి పరీక్షోన్ముఖమైన దారి చూపుతుంది. ప్రభుత్వ ధనాన్ని కొల్లగొడుతున్నవారు కొందరు.. తమ పిల్లల్ని కార్పొరేట్ విద్యలోకి నెట్టి జ్ఞానశూన్యమైన విద్యా సోపానాన్ని ఎక్కించాలని ప్రయత్నిస్తున్నారు. కార్పొరేట్ విద్యాలయాలకు అధిక ధనాన్ని విద్యార్జన కోసం వెచ్చిస్తున్నారు. మనిషి మౌఖిక సాంప్రదాయం నుంచి వచ్చిన వాడు. దళిత బహుజన మైనారిటీ విద్యను బోధనా పటిమ నుండి అందుకోవలసి ఉంటుంది. విద్యను ఒక జ్ఞాన స్రవంతిగా, వాస్తవ జీవన ప్రవాహంగా అభ్యసించినప్పుడే వాళ్ళు ప్రపంచ గమనంలోకి వెళ్లగలుగుతారు. దానికి భిన్నమైన కృత్రిమ విద్య వారు గ్రహించలేరు. అందుకే విద్యాంతరాలు ఏర్పడుతున్నాయి. విద్యలోకి కూడా మత, కుల, వర్గ భేదాలు జొరబడ్డాయి. నిజానికి ప్రకృతిలో ఉండే అనేక శక్తుల్ని మానవుడు బయటకు తీశాడు. వాటిని శాస్త్రాలుగా అభివృద్ధి చేశాడు. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వృక్ష శాస్త్రం, జంతు శాస్త్రం, మనో విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక శాస్త్రం... ఇలా ఎన్నో శాస్త్రాలను అభివృద్ధి చేశాడు. ఈ శాస్త్రాలతో అంతఃసంబంధం ఉన్న బడుగు వర్గాల విద్యార్థులకు ఇవి బాగా మెదడులోకి చొచ్చుకు వెళతాయి. అయితే ఇప్పుడు విద్యా బోధనలో నాణ్యత తీసుకురావడమే ముఖ్యమైన అంశం. కార్పొరేట్ విద్యా లయాల్లో ఉన్న వ్యాపార సంస్కృతిని ప్రభుత్వం నేరమై నదిగా గుర్తించాలి. వాటిలో ఆటస్థలాలు లేవు. లాబ్‌లు లేవు. ఎన్రోల్మెంట్ కూడా వేరే ప్రభుత్వ కాలేజీల్లో చేస్తున్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించవలసి ఉంది. ప్రభుత్వ విద్య అభివృద్ధి చెందాలంటే ప్రపంచ భాషగా అభివృద్ధి చెందిన ఇంగ్లిష్ మాధ్యమ బోధన అనివార్యం. అంత మాత్రాన మాతృభాషను విస్మరించ కూడదు. మాతృ భాషలో జీవశక్తులు ఉంటాయి. ఆ జీవ శక్తులను నేర్చుకునే భాషలోకి పరివర్తితం చేయగలగాలి. ఇంగ్లిష్ భాషని మనం నేర్పే క్రమంలో గృహాన్ని కూడా మోడ్రన్ స్ట్రక్చర్లోకి తీసుకు వెళ్ళాలి. విద్యార్థులకు ప్రత్యేకమైన గదులుండాలి. టేబుళ్లుండాలి. డిక్షనరీలు ఉండాలి. టేబుల్ మీద గ్లోబ్ ఉండాలి. ‘బైజూస్‘ లాంటి తగిన నూతన పరికర ప్రాయోగిక అంశాలు... గృహ వాతా వరణం లేకుండా వర్ధిల్లవు. ప్రపంచ వేగాన్ని బట్టి, సమాజ పరిణామాన్ని బట్టి అవన్నీ అవసరం. తల్లిదండ్రుల్ని కూడా వయోజన విద్యాపరులుగా మార్చాలి. మరీ ముఖ్యంగా తాగుడుని పూర్తిగా నిర్మూ లించకుండా గృహ సంస్కృతిలో విద్య వర్ధిల్లదు. టీవీ సీరియల్స్ ప్రమాదకరంగా మారాయి. మధ్యతరగతి గృహిణుల గృహ వాతావరణాన్ని విద్వేషపూరితంగా సీరియల్స్ ద్వారా మారుస్తున్నాం. దానివల్ల విద్యార్థులకు విద్యా వాతావరణం గృహాల్లో లేదు. కార్పొరేట్ విద్యాశాలలు బలవంతమైన విద్యను బుద్ధి మీద రుద్దుతున్నాయి. దాని వల్ల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకూ, కార్పొరేట్ స్కూళ్ల విద్యార్థులకూ మధ్య తీవ్రమైన వైరుధ్యం ముందుకు వచ్చేసింది. విద్యార్జనకు సంబంధించిన శారీరక శక్తి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థికి లేదు. హైస్కూళ్ళలో అసెంబ్లీ మొదలయ్యే సమయానికి విద్యార్థులకు రాగి బిస్కట్లు, క్యాల్షియం బిస్కట్లు, ఒక గ్లాసు పాలు ఇవ్వాలి. దానిమ్మ, యాపిల్, బొప్పాయి, జామ వంటి పండ్లు ఉదయం 11 గంటలకు అందివ్వాల్సి ఉంది. విద్యార్థులు పోషకాహార లేమితో రక్తహీనతతో బాధపడుతున్నారు. డేట్స్ జెల్ వారికి పాలలో కలిపి ఇవ్వాల్సి ఉంది. జీడిపప్పు, బాదం పప్పు, వేరుసెనగ పప్పు వంటి బలవర్ధకమైన ఆహారాలు విద్యార్థులకు అందివ్వాల్సి ఉంది. ఇవన్నీ ఇప్పుడు ఇజ్రా యిల్, జర్మనీ, జపాన్, స్విట్జర్లాండ్, అమెరికా వంటి దేశాలలోని స్కూల్స్‌లో తప్పనిసరిగా అందిస్తున్నారు. మెదడు చురుకుగా పనిచేయడానికి కావలసిన శక్తి మంచి ఆహారం వల్లనే లభిస్తుంది. శారీరక శక్తి లేని విద్యార్థులు చివరి పీరియడ్ కల్లా బల్లమీద ఒరిగిపోతున్నారు. విద్య అంటే అది జీవన సంస్కృతీ నిర్మాణం. మానవాభ్యుదయానికి అది సోపానం. ఈనాటి ప్రభుత్వ విద్యలో ఇంగ్లిష్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం ఎంత ముఖ్యమో... సామాజిక వాతావరణ రూపకల్పన కూడా అంతే అవసరం. జీవించడం అంటే సమాజంతో జీవించడమే. మానవత్వంతో జీవించడమే. ఈర్ష్య, ద్వేషాలను ప్రక్కనపెట్టినవారే అత్యున్నతమైన స్థానాలకు వెళ్తారు. ప్రపంచ వ్యాప్తంగా విద్య పెరుగుతోంది. విద్యా ప్రమాణాలు పెరుగుతున్నాయి. భాషాధ్యయనమే ఒక ఉపాధిగా కూడా పెరుగుతోంది. వరల్డ్ బ్యాంక్, యూఎన్ఓ, యునెస్కో, డబ్లు్యహెచ్‌ఓ, యునిసెఫ్ వంటి అంతర్జాతీయ సంస్థల్లో భాషా నిపుణుల అవసరం ఉంటోంది. ఇప్పుడు ఒక్క ఇంగ్లిషే కాదు... చైనీస్, జర్మన్, ఫ్రెంచ్, రష్యన్ వంటి అన్ని భాషలూ నేర్చుకోవాల్సిన అవసరం ముందుకొచ్చింది. వివిధ భాషలతో పాటు శిల్పం, చిత్రలేఖనం, సంగీతం, నృత్యం, సాహిత్యం, కవిత్వం వంటి అనేక కళలూ; క్రీడల సామర్ధ్యం, సాంకేతిక విద్యలు కూడా ఈనాడు విద్యార్థులు అభ్యసించవలసిన అవసరం ఏర్పడింది. (క్లిక్: ఉన్నవి అమ్ముతూ వ్యయం తగ్గింపా?) ప్రభుత్వం, ప్రజలు మమేకమై... విద్యా సాంస్కృతిక వికాసానికీ, కుల, మత రహిత జీవన విధాన అభ్యసనా నికీ; ఆచరణకూ, భారత రాజ్యాంగ స్ఫూర్తికీ... డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాన్ని సాఫల్యం చేసే దిశలో ముందడుగు వేయవలసిన చారిత్రక సందర్భమిది. (క్లిక్: రాష్ట్రపతి ఎన్నిక ఎందుకు ప్రతిష్ఠాత్మకం?) - డాక్టర్ కత్తి పద్మారావు దళిత ఉద్యమ నిర్మాత -
ఆ నామవాచకం ఓ చైతన్య జ్వలనం!
ఓ జ్ఞానజ్యోతీ, భారత రాజ్యాంగ నిర్మాతా, ప్రపంచ మేధావీ అయిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరును కోనసీమకు పెట్టడంలో ఒక చారిత్రక నేపథ్యం ఉంది. అంబేడ్కర్ స్వయంగా తూర్పుగోదావరి ప్రాంతమంతా పర్యటించారు. ఈ ప్రాంతమంతా చారిత్రకంగా బౌద్ధ భూమి. ఇక్కడ వేల సంవత్సరాలు బౌద్ధం విరాజిల్లింది. అందుకే ఇక్కడ సామాజిక సామరస్యం ఎక్కువ. సర్ ఆర్థర్ కాటన్ మహోన్నతమైన కృషి వల్ల ఇక్కడ వ్యవసాయ విస్తరణ జరిగింది. ప్రాజెక్టుల నిర్మాణంలోనూ, బ్యారేజీల నిర్మాణంలోనూ, నీటిపారుదల కాల్వల నిర్మాణంలోనూ ప్రజలందరూ కులమత భేదాలు లేకుండా భాగస్వాములయ్యారు. ఇక్కడ భాష కూడా అందరూ ఒకే రకంగా కుల మతాలకు అతీతంగా మాట్లాడతారు. ఊనికలు ఒకే రకంగా ఉంటాయి. ఇక్కడ కులాలు రూపొందాయి కానీ కులాలు లేవు. అంబేడ్కర్ స్ఫూర్తితో ఇక్కడ విద్య వికసించింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరులో వ్యక్తిత్వ నిర్మాణం ఉంది. విద్యా వికాసం ఉంది. ప్రపంచ జ్ఞానం ఉంది. ముఖ్యంగా ఆత్మగౌరవం ఉంది. బౌద్ధ సంస్కృతీ వికాసం ఉంది. సామాజిక సమతుల్యత ఉంది. ఆర్థిక సముత్తేజం ఉంది. కుల నిర్మూలన ఉంది. అంబేడ్కర్ పేరు వలన కోనసీమకే కీర్తి వస్తుంది. అంబేడ్కర్‌ది అంతర్జాతీయ నామవాచకం. అందుకే కోనసీమకు అంబేడ్కర్ పేరు ఉచితమై నది. ఆ పేరును భారతదేశంలో ఎక్కువ విశ్వవిద్యాలయాలకు పెట్టారు. భారత దేశంలో ఉన్న ఏడు లక్షల గ్రామాల్లో ఎక్కువ గ్రామాలకు పెట్టిన పేరు అంబేడ్కర్. ఆయన నామవాచకంలో విద్యా, సాంస్కృతిక వికాసం ఉంది. అంబేడ్కర్ కుల నామవాచకం కాదు. కుల నిర్మూ లనా ప్రతీక! అది మతాలకు, కులాలకు సంబంధం లేని జాతీయ స్ఫూర్తిని కలిగిస్తుంది. అంబేడ్కర్ విగ్రహాన్ని లండన్‌లోని ‘ఇండియన్ హౌస్’లో రూపొందించుకున్నారు. నేను స్వయంగా వీక్షించాను. ఆ విగ్రహ సమక్షంలో నా రచన ‘కాస్ట్ అండ్ ఆల్టర్నేటివ్ కల్చర్’ పుస్తకాన్ని వీపీ సింగ్ ఆవిష్కరించారు. లండన్ మ్యూజియం లైబ్రరీలో అంబేడ్కర్ చిత్ర పటం ఉంది. అదీ నేను స్వయంగా వీక్షించాను. లండన్ ‘హౌస్ ఆఫ్ కామన్స్’లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ శత జయంతి చేశారు. దానికి నేను హాజరయ్యాను. అంబేడ్కర్ నామవాచకం బుద్ధుని తర్వాత, అశోకుని తర్వాత భారతదేశ ఔన్నత్యానికి ప్రతీకగా నిలిచింది. నిజానికి కోనసీమ ప్రేమసీమ! ఇక్కడ అంబేడ్కర్ పేరు పెట్టినందుకు వచ్చిన ఆవేశం నీటి తుంపరల నుండి వచ్చిన అగ్నిచ్ఛట లాంటిది. కొన్నిసార్లు ఆవేశం అనర్థానికి దారి తీస్తుంది. ప్రతి ఆవేశం వెనుక కొన్ని రాజకీయ కారణాలుంటాయి. ఈ రాజకీయ కారణాలకు అతీతమైన వాడు అంబేడ్కర్. భారతదేశాన్ని కులరహిత సమాజంగా తీర్చిదిద్దాలనుకున్నవారు. సమాజ పరిణామంలో కులం ఇటీవల వచ్చింది. మళ్లీ అది పోతుంది. కుల భావనకు విరుగుడు జ్ఞానార్జనే అని అంబేడ్కర్ చెప్పారు. మను షులకు మనుషులు పుడతారనేది జ్ఞానం. కులాలకు మనుషులు పుట్టరనేదే తత్త్వం. మామూలు మనుషులు, ప్రతిభ లేని మనుషులు కులం పేరు చెప్పుకుని బతకాలని చూస్తారు. కులానికి అతీతమైన నామవాచకాలు ఇప్పుడు దేశానికి అవసరం. అంబేడ్కర్‌ను మహాత్మా గాంధీ ‘డాక్టర్’ అని పిలిచారు. ఆనాటి ప్రజా సమూహాలు అంబేడ్కర్‌ను ‘బాబా సాహెబ్’ అని పిలిచాయి. అంటే తండ్రి అని అర్థం. పెరియార్ రామస్వామి నాయకర్ అంబేడ్కర్‌ను ‘బాబా సాహెబ్’ అనే ప్రస్తావించారు. ఆయన భారతదేశానికి తండ్రి స్థాయికి బతికి ఉన్నప్పుడే ఎదిగారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ అంబేడ్కర్ మరణించినప్పుడు ‘భారత దేశ ధ్రువతార’ రాలిపోయిందని అన్నారు. అంబేడ్కర్ ఐదు లక్షల మందితో 1956 అక్టోబర్‌లో పూనాలో జరిపిన బౌద్ధ దీక్షకు కోనసీమ నుండి ఆ రోజుల్లోనే ప్రతినిధులు విస్తృతంగా హాజరయ్యారు. ఆయన అందరి మెదళ్లలో దీపాలు వెలిగిస్తూ వెళ్ళారు. కానీ మీరు భవంతులు తగలబెడుతున్నారు. తగలబడిన ప్రతి భవంతీ కొత్తరూపం తీసుకుంటుంది. అంబేడ్కర్ భావజాలంతో మీలో మార్పు రావాలి. నీకు తిరగబడే చైతన్యాన్నిచ్చిన వాడు కూడా ఆయనే అని ముందు గుర్తించాలి. భేదాభిప్రాయాల్ని సదభిప్రాయంగా మార్చు కోవడమే అంబేడ్కరిజం. సుప్రసిద్ధ నరవర్గ శాస్త్రవేత్తల ప్రకారం భారతదేశం క్రీస్తు పూర్వమే ఆర్యుల, ద్రావిడుల, మంగోలుల, సిథియన్ల, మూలవాసుల సమ్మిశ్రితం. అందుకే అంబేడ్కర్... భారతదేశంలో ప్రతి ఒక్కరూ సంకరం నుండి ఆవిర్భవించిన వారే అని చెప్పారు. నిర్దిష్ట కులం లేదని చెప్పారు. ఇప్పుడు కులాతీత జీవనంతో ఉన్న రాజకీయ నాయకులు, కులాంతర వివాహితులు, ఆర్థిక సంపన్నులు, లౌకిక భాషాభివ్యక్తులై ఉండి కూడా.. కులం పునాదుల మీద రాజకీయాలు నిర్మించాలనుకోవడం అపహాస్యమే! కులం మనిషిని సంకుచితుణ్ణి చేస్తుంది. కులం భావావేశాలను రెచ్చగొడుతుంది. దాని ఫలితమే ప్రస్తుతం కోనసీమలో నెలకొన్న పరిస్థితులు. (క్లిక్: మళ్లీ మొదటికొచ్చిన కశ్మీర్ సమస్య) భారత దేశ చరిత్రలో గానీ, సాహిత్యంలో గానీ 500 సంవత్సరాల పూర్వం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఆధిపత్య కులాలేమీ లేవు. అన్నీ ఆయా కాలాల్లో రూపొందిన కులాలే. ఇప్పుడు మనకు కావల్సింది అంబేడ్కర్ ప్రజాస్వామ్య లౌకికవాద ఆచరణ. ఆ స్ఫూర్తితోనే మనం ఆయన నామవాచకాన్ని బహుదా మననం చేసుకుంటున్నాం. కోనసీమకు అంబేడ్కర్ పేరు ఒక లేత సూర్య కాంతి. అంబేడ్కర్ పేరులో చైతన్య జ్వలనం ఉంది. అందుకే ఆ పేరు పాటలుగా, మాటలుగా, సూక్తులుగా, నిర్వచనాలుగా, జీవన గాథలుగా విస్తరిస్తోంది. అందుకే అంబేడ్కర్ పేరును ఆహ్వానిద్దాం! ఆకాశ నక్షత్రాలుగా వెలుగొందుదాం! (క్లిక్: కరోనా కాదు.. అసమానతే.. అసలు వైరస్!) - డాక్టర్ కత్తి పద్మారావు దళిత ఉద్యమ నిర్మాత -
రాజ్యాంగస్ఫూర్తే విరుగుడు!
ఇటీవల దేశంలోనూ, రాష్ట్రంలోనూ పరువు హత్యల పేరుతో వందలాది మంది యువతీ, యువకులను హత మారుస్తున్నారు. వర్ణం, కులం రెండూ కల్పించబడినవే. మానవుల నుండి మానవులే ఆవిర్భవిస్తారని మానవ పరిణామ శాస్త్రం చెబుతోంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఈ విషయం మీద అనంత పరిశోధన చేశారు. మానవ పుట్టుక మీదా, మానవ పరివర్తన మీదా ఆయన అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనా పత్రాలు సమర్పించారు. మనుస్మృతి నిర్మించిన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణ వ్యవస్థ కల్పితమైనదని రుజువు చేశారు. 1927 డిసెంబర్ 25వ తేదీ ‘మహద్ చెరువు’ పోరాటంలో భాగంగా మనుస్మృతిని దహనం చేశారు కూడా! ప్రత్యామ్నాయంగా, భారత రాజ్యాంగంలో కులం, మతం, ప్రాంతం, జాతి, భాషలకు సంబంధించి భేద భావం లేకుండా ఎవరు ఎవరినైనా వివాహం చేసుకునే అవకాశం కల్పించారు. అయితే భారత రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, రిజర్వేషన్లు వంటివాటిని అనుభవిస్తున్నవారే తమ పిల్లలు కులాంతర, మతాంతర వివాహాలు చేసుకుంటే సహించలేక వారిని చంపివేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దీనికి కారణం మతవాదులు, కుల వాదులు రాజ్యాంగ సంస్కృతికి భిన్నంగా చేసే ప్రబోధమే కారణం. మొదటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కుమార్తె ఇందిరా ప్రియదర్శిని పారశీకుడైన ఫిరోజ్‌ను ప్రేమించి పెళ్లాడింది. కరమ్ చంద్ గాంధీ వారి వివాహాన్ని నిర్వహించారు. అయితే నెహ్రూ, ఇందిరాగాంధీ పాలనల్లో గానీ, ఆ తర్వాత వచ్చిన పాలకుల కాలంలో కానీ కులాంతర, మతాంతర వివాహాలను ప్రోత్సహించలేదు. భారత దేశాన్ని పాలించిన రాజ వంశీకులు మౌర్యులు, మొగలాయీలు, గుప్తులు – అందరూ వర్ణాంతర వివాహితులే. అలాగే హిందూ మతానికి పునాదులు వేసిన వైదిక రుషులు వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, అగస్త్యుడు వంటి వారందరూ వర్ణాంతర వివాహితులే. అయితే వారు సమాజంలో కులాంతర, మతాంతర వివాహాలను ప్రోత్సహించకపోవడం గమనార్హం. ప్రస్తుత కాలంలో సినిమా, పారిశ్రామిక, కళా, క్రీడా రంగాలలో ఉన్నవారు వర్ణాంతరులైనా, కులాంతరులైనా అభినందనీయులే అవుతున్నారు. భారతీయ సినిమా మార్కెట్ విస్తరణ కోసం బ్రాహ్మణ నాయకి, ఒక ముస్లిం హీరోల కెమిస్ట్రీని పెద్ద పెద్ద పోస్టర్లు ఆవిష్కరించి హిందూ, ముస్లిం వర్గాలను థియేటర్‌కు తేగలుగుతున్నారు. అదే వాస్తవ జీవితంలో హిందూ, ముస్లిం వివాహ సందర్భం వస్తే దాడులు జరుగుతున్నాయి. ఇటీవల ముస్లిం, దళిత కులాల వాళ్ళు ప్రేమ వివాహం చేసుకుంటే దళిత యువకుడిని హత్య జేశారు. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి విద్యార్జనావకాశం వల్ల ఈ 70 ఏళ్లలో చదువుకుని అన్ని రంగాల్లో పైకి వస్తున్న దళితులు కులాంతర, మతాంతర వివాహాలు చేసుకునే స్థాయికి వస్తున్నారు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పరువు హత్యలు పెరగడానికి... దళిత, బహుజన, మైనారిటీ వర్గాల్లో పెరుగుతున్న రాజ్యాంగ స్ఫూర్తి; వర్ణ, కులాధిపత్య భావజాలంలో కొట్టు మిట్టాడుతున్న వారి మూఢత్వాల మధ్య తలెత్తుతున్న ఘర్షణే కారణం. ఇప్పటికీ రాజ్యమేలుతున్న మనుస్మృతికి వ్యతిరేకంగా భారతదేశం సెక్యులర్‌గా ఎదగాలంటే బౌద్ధ జీవన వ్యవస్థను, భారత రాజ్యాంగ స్ఫూర్తిని పెంపొందించాలి. కరుణ, ప్రేమ, ప్రజ్ఞ అనే సూత్రాలను ప్రజల మెదళ్లలోకి వెళ్ళేటట్లు చూడాలి. రాజకీయమంటే ఆధిపత్యం కాదు. ప్రజాస్వామ్య లౌకిక సామ్యవాద భావజాల ఆచరణ అని ప్రతి ఒక్కరూ తెల్సుకోవాల్సి ఉంది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తమిళనాడులో కులాంతర వివాహితులకు పది లక్షల నగదు కానుక, ఉద్యోగావకాశం, భూవసతి, నివాస వసతి కల్పిస్తున్నారు. దీని కొరకు చట్టం తెచ్చారు. కేరళలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ కులాంతర వివాహితులకు రక్షణ గృహాలు ఏర్పాటు చేశారు. దీని వల్ల ఆ రెండు రాష్ట్రాల్లో కులాంతర, మతాంతర వివాహాలు విస్తరిస్తున్నాయి. అన్ని రాష్ట్రాల్లో కూడా రాజ్యాంగ స్పూర్తితో కులాంతర, మతాంతర వివాహాల వేదికలను ప్రభుత్వమే నిర్వహించవలసిన బాధ్యత ఉంది. అంతే కాకుండా దీని కొరకు ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. పరువు హత్యలకు పాల్పడిన వారిని ప్రత్యేక కోర్టులో విచారించి మరణ శిక్షను విధించడమే కాకుండా వారి ఆస్తులను జప్తు చేయాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా ప్రభుత్వాలు కూడా రాజ్యాంగ స్ఫూర్తితో కుల నిర్మూలనా భావజాల ఆచరణ కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో చేపట్టాలి. (చదవండి: నల్ల చట్టానికి అమృతోత్సవాలా?) - డా. కత్తి పద్మారావు -
దక్షిణాదిపై ఇంత చిన్నచూపా!
దక్షిణ భారతదేశం ప్రపంచ చరిత్రలోనే భౌగోళికంగా, సాంస్కృతికంగా, తాత్వికంగా, సాంకేతికంగా భాషా సంపత్తిగా అత్యున్నతమైన కీర్తి కలిగిన ప్రాంతం. ఇక్కడ ప్రకృతి వనరులు, మానవ వనరులు, సామాజిక జీవన సామరస్యం, బౌద్ధ సంస్కృతీ జీవన మార్గం నిత్య ప్రభాసితాలు. ఇటువంటి దక్షిణ భారతదేశాన్ని కేంద్రం మొదటి నుండి అణగదొక్కుతూ, దోపిడీ చేస్తూ, నిర్లక్ష్యం చేస్తూ, అవమానిస్తూ వస్తుంది. ఈనాడు పార్లమెంటులో జరుగుతున్న చర్చల్లో ప్రత్యేక హోదా గురించి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వివిధ పార్టీల ఎంపీలు ప్రశ్నించినపుడు, కేంద్రం అంతకు ముందటి పార్లమెంట్ ఒప్పందాన్నే నిర్లక్ష్యం చేస్తూ, నిరాకరిస్తూ సమాధానం చెప్పడం ఆంధ్రులను తీవ్రంగా అవమానించడమే! పార్లమెంటు తీర్మానాల్ని కూడా పార్లమెంటే నిరాకరించడం రాజ్యాంగ ఉల్లంఘన కాదా? అందులో దక్షిణ భారతదేశం నుంచి వెళ్లిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంక్షోభంలో ఉందనడం విషయాన్ని పక్కదారి పట్టించడమే! బీజేపీ రాష్ట్రాలన్నీ అప్పుల్లోనే కాదు... మత ఘర్షణల్లో, వర్ణాధిపత్య, కులాధిపత్య ఊబిలో కూరుకుపోయి ఉన్నాయి. దక్షిణ భారత రాష్ట్రాల నుండి బీజేపీ రాష్ట్రాలు అనేక విషయాలు నేర్చుకోవాల్సి ఉంది కూడా! అక్కడ లౌకిక వాదం మంటగలుస్తూ ఉంది. పార్లమెంటులో ఉత్తరాది గొంతుల ఆధిపత్యం కొనసాగుతుంది. లౌకిక రాజ్యానికి ప్రధానమంత్రిగా ఉన్న మోదీ ఒక మతాధిపతిగా గుడులు గోపురాలను సందర్శించి అనుచితమైన మతపరమైన ప్రసంగాలు చేయడం చూస్తే... రాజ్యాంగంలోని ప్రజాస్వామ్య లౌకిక వాద, సామ్యవాద భావజాలాన్ని నిరాకరించి మత విద్వేషాలు, వర్ణ విద్వేషాలు, అçస్పృశ్యత ఆచరణను కొనసాగిస్తున్నారని అర్థమవుతుంది. నిజానికి భారతదేశం తాత్విక పునాదుల మీద నిలబడి ఉంది. ముఖ్యంగా చార్వాకుడు, సాంఖ్యులు, జైనులు, బౌద్ధులు ఎంతో తత్వశాస్త్రాన్ని అందించి అచంచలమైన మానవ అభ్యుదయానికి పునాదులు వేశారు. ఈ తత్వశాస్త్ర అధ్యయనం మోదీకి లేకపోవడం వల్ల ఆయన హిందూ మతవాద భావనలకు, కల్పిత కథలకు మాత్రమే పరిమితమవ్వడం వల్ల ప్రపంచ దేశాల్లో భారతదేశ సమున్నత గౌరవాన్ని నిలబెట్టలేకపోతున్నారు. భారతదేశంలో వచ్చిన తాత్విక మూలాలు ఎక్కువగా దక్షిణ భారతం నుండే జనియించాయి. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళ భాషల్లో భారతదేశ పునరుజ్జీవన, సాంçస్కృతిక పునాదులున్నాయి. అయితే వాటి మూలాలను దెబ్బతీయడానికే ఉత్తర భారత పుక్కిటి గాథలను ప్రచారం చేస్తున్నారు. దక్షిణాది రాజ్య పాలకుల్ని, నాయకుల్ని ప్రతినాయకులుగా చూపిస్తున్నారు. రాముడు, కృష్ణుడు, పరశురాముడు... వీళ్లందరూ ఉత్తరభారతం నుండి పుట్టిన అవతారాలే. రావణాసురుడు, కుంభకర్ణుడు, వాలి... వీరంతా దక్షిణ భారతం నుంచి రాగా, మధ్య భారతం నుంచి నరకాసురుడు, ఈశాన్య భారతం నుంచి మహిషాసురులను ప్రతినాయకులుగా చేసి వారిని వధించే ఘట్టాల్ని ప్రచారం చేస్తున్నారు. దీనివల్ల దళిత, బహుజన, మైనారిటీల నాయకత్వ పునాదులను ధ్వంసం చేయాలనే ప్రయత్నం జరుగుతుంది. విశ్వవిద్యాలయాల్లో కూడా పుక్కిటి çకథలే ప్రచారం చేసి సాంకేతిక, సాంçస్కృతిక, తాత్విక, జ్ఞాన, విజ్ఞాన సంస్కృతులపై దాడులు చేస్తున్నారు. మరో ప్రక్క రాజకీయంగా రాష్ట్రాల మధ్య వైరుద్ధ్యాలు, వర్ణాల మధ్య వెరుద్ధ్యాలు, మతాల మధ్య వెరుద్ధ్యాలను సృష్టి్టంచే పనిని ఆరెస్సెస్ ముమ్మరంగా చేస్తోంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను విస్మరించాలనే బృహత్తర ప్రయత్నం జరుగుతోంది. అంబేడ్కర్ తన ప్రణాళికలో భారత సమైక్యతకు, ఉన్నతికి ఈ సూత్రాలు అందించారు. భారతీయులందరికీ హక్కుల సమానత్వం. ప్రతి పౌరుడూ తనను తాను అభివృద్ధి చేసుకోవడానికి ప్రభుత్వం సోపానం కావాలి. మత, ఆర్థిక, రాజకీయ, స్వాతంత్య్రాలు ప్రతి భారతీయుడి హక్కు. సమాన అవకాశాలు ప్రతి భారతీయుడి హక్కు. మనిషిని మనిషి, వర్గాన్ని వర్గం, దేశాన్ని దేశం దోచుకోవడం మానేయాలి. ఈనాడు డాక్టర్ భారతదేశాన్ని సమైక్యంగా, సమున్నతంగా, సమ సమాజ నిర్మాణ దక్షతతో నడపాలంటే, మోదీ కేంద్ర పాలన ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ దక్షిణ భారతదేశమే కాక అన్ని లౌకికవాద శక్తులూ అంబేడ్కర్ మార్గంలో నడిచి భారతదేశాన్ని రక్షించుకోవాల్సిన చారిత్రక సందర్భం ఇది. భారత రాజ్యాంగమే భారతదేశ పునర్నిర్మాణానికి గీటురాయి. డాక్టర్ కత్తి పద్మారావు వ్యాసకర్త రచయిత, సామాజిక విశ్లేషకుడు. మొబైల్: 9849749695 -
నిరంతర జనకవిత్వ సృజన శిఖరం
మహాత్మా పూలే, అంబేడ్కర్, పెరియార్, వేమన, పోతులూరి వీరబ్రహ్మం, త్రిపురనేని రామస్వామి చౌదరి, జాషువా వంటి సంస్కర్తల దారిలో... వర్తమాన సాహిత్యాన్ని, చరిత్రను సుసంపన్నం చేస్తున్న మహాకవి కత్తి పద్మారావు. గత ఐదు దశాబ్దాలుగా కఠోర అధ్యయనం, పరిశోధన, ఆచరణతో ముందుకు సాగుతున్నారు. ఒక సమగ్ర సామాజిక మార్పు కోసం తన రచనలను, ఆచరణను అంకితం చేశారు. తన జాతి జనుల శ్రేయస్సే లక్ష్యంగా ప్రత్యామ్నాయ సాహిత్యాన్ని అపారంగా రచించారు. అమ్మ చెప్పిన మాటతో కులం పునాదుల్ని వెలికితీసి అనేకానేక వివక్షలను, ఆధిపత్యాలను సమాధి చేస్తున్నారు. వేలాదిమంది పీడితులకు తన అక్షర సైన్యంతో ధైర్యమై నిలిచారు. ‘కులం పునాదుల మీద ఒక జాతినీ, ఒక నీతినీ నిర్మించలేరన్న’ అంబేడ్కర్ సత్య వాక్కు కత్తి పద్మారావు కవితా ఝరి. ‘సత్యవాక్యంబెవ్వడుల్లంఘింపడో వాడేపో నరుడిద్ధరా మండలిన్’ అనే జాషువా మహాకవి మాట కత్తి పద్మారావు గారి కవిత్వానికి ఊపిరి. పద్మారావు జీవితంలో కులజీవన విధానం లేదు. ఆయన కులనిర్మూలన వాది. క్లాసులో చెప్పే పాఠాలకు మించి వేలాది సభల్లో, విశ్వవిద్యాలయాల్లో మాట్లాడిన మహోపాధ్యాయుడు. ‘అణగారిన ప్రజల మూగభాషను నా కవిత్వం ఉక్కు నాలుకతో సంభాషిస్తుంది అంటూ దళితులకు సామాజికంగా, సాంస్కృతికంగా తాత్వికంగా నాయకత్వం వహిస్తున్నారు. ‘మళ్లీ మళ్లీ కవిగానే పుడతా’నంటున్న కవిత్వ శ్వాస అతడు. ‘దళిత కవితా దిక్సూచి అతడు. ‘పక్షి గమనం నాకు ఆదర్శం, ప్రకృతి సౌందర్యం నాకు స్ఫూర్తి, మనిషిలోని వైరుధ్యం నా తర్కం, సమన్వయం నా దర్శనం’ అంటున్న నల్ల సముద్రం అతడు. సజీవ వాస్తవిక మానవ సంఘర్షణల మహాకావ్యం ‘అస్పృశ్యుని యుద్ధ గాథ’ కత్తి పద్మారావు. తీవ్రమైన కులవివక్షకు గురైన పనికులాల పక్షం వహించిన ప్రజాకవి. ‘నా తర్కం చార్వాకం, నా తత్వం బౌద్ధం, నా ఆయుధం అంబేడ్కరిజం’ అంటూ పీడక శక్తులపై కలాన్ని కత్తిగా దూసిన యుగ కవి కత్తి పద్మారావు. కడుపు నిండా ఆకలిని, గుండెల నిండా అవమానాలను, బతుకు నిండా కష్టాలను నింపుకున్న నిరుపేద కుటుంబం లోంచి వచ్చిన పద్మారావు... అగాథపు అంచుల్లో ఉన్న జనాన్ని కవిత్వ వస్తువులు చేసి వారికి సాహితీ గౌరవం కల్పించారు. దళిత జీవితంలోని సౌందర్యాన్ని, తాత్వికతని పద్మారావు అద్భుతంగా అక్షీకరించారు. అందుకే తరతరాల నిరంతర జనకవిత్వ సృజన శిఖరంగా నిలిచారు. పిడికెడు ప్రేమకోసం, మానవ స్వేచ్ఛా సమానతల కోసం దీపధారిగా నిలిచారు. మహాకవి గుర్రం జాషువా మహాసభలు ముంబైలో జరిగినప్పుడు ముఖ్యఅతిథిగా పాల్గొని జాషువా కవిత్వ గొప్పతనాన్ని వినిపించారు. తన ‘సాంఘిక విప్లవ చరిత్ర’లో కూడా జాషువా సాహిత్య ప్రస్థానం గురించి పేర్కొన్నారు. ‘దళిత సాహిత్యవాదం – జాషువా’ (1995),‘జాషువా సామాజిక తత్త్వం’ (1996), ‘మహాకవి జాషువా–సామాజిక విప్లవం’(2007) అనే మూడు బృహత్ గ్రంథాల ద్వారా తెలుగు సాహిత్యానికి జాషువా సామాజిక, సాహిత్య దర్శనాన్ని అందించారు. జాషువా కవితా శిల్పం, ఆర్ద్రత, మానవతా దృక్పథం, విశ్వజనీన తత్వం అనేవి తన నుండి ఈ నాటి దళిత బహుజన కవులందరికీ ఆదర్శం అంటారు. ‘కులం పునాదులు’ మీంచి ‘నల్లకలువ’లు, ‘నీలికేక’లు, ‘భూమిభాష’లు, ‘ముళ్ళకిరీటం’లు, ‘కట్టెలమోపు’లు, ‘ఆత్మగౌరవ స్వరం’లు, ‘అస్పృశ్యుని యుద్ధగాథ’లును చరిత్రకు అందించినవారు. పునర్నిర్మాణానికీ, ప్రత్యామ్నాయ సంస్కృతీ విధానానికీ దారులు వేసిన 95 గ్రంథాలు వెలువరించారు. తెలుగు రాష్ట్రాలలో అన్ని విశ్వవిద్యాలయాల్లోనూ విశేషంగా తన ఉపన్యాసాలతో రాబోయే తరాలను చైతన్యపరిచారు. ‘గబ్బిలం’, ‘ఫిరదౌసి’ వంటి పలు జాషువా రచనల మీద గొప్ప కృషి చేసారు. కత్తి పద్మారావు సామాజిక జీవితంలో రాజకీయ పార్శ్వం ఉంది. దళిత బహుజనుల్ని చైతన్యవంతుల్ని చేయడంలో అద్వితీయ పాత్ర వుంది. వక్తృత్వ పోటీలు, నాటకాలు, బుర్రకథలు పాటలు రాయడం, నాటకాలు రాసి తనే పాత్ర పోషించి ప్రదర్శించడం శాంతినగర్ లూథరిన్ చర్చ్ సండే స్కూల్లో చిన్నప్పుడే అలవడినాయి. భారతీయ అలంకార శాస్త్రాలు, గ్రీకు అలంకార శాస్త్రాలు, పాశ్చాత్య ఆధునిక ఈస్థటిక్స్, మనస్తత్వ శాస్త్రాలు, భాషా శాస్త్రాలు అధ్యయనం విస్తృతంగా చేశారు. వాల్మీకి, కాళిదాసు మొదలు ఖలీల్ జిబ్రాన్, షెల్లీ వర్డ్సవర్త్, జాన్ మిల్టన్, జిడ్డు కృషమూర్తి తదితరుల ప్రకృతి వర్ణాలను అధిగమించి ఆధునిక మానవునిలోని ప్రకృతి స్పృహని నూతనంగా తన రచనల్లో నింపారు. ‘అమృత నిష్యంతనమైన వాక్కులు నాకు నా తల్లి ప్రసాదించింది. ఔషధపు కట్టలు కట్టే వైద్యశాస్త్రం నా అక్షరాల్లో ఉందంటూ’ తన తల్లి ప్రభావం తనపై ఎలా అణువణువునా నిండి ఉందో అనేక కవితల్లో చెప్పారు. ‘నీ జోలపాటే ప్రపంచ సాహిత్యానికి పల్లవి’ అంటూ అడుగడుగునా వాళ్ళమ్మను గుర్తుచేసుకుంటారు పద్మారావు. ‘శిల్పమూ నీవే, చిత్రమూ నీవే, చిరునవ్వూ నీవే, ప్రళయాగ్నివీ నీవే. నువ్వు నవ్వితే భూమి పులకరిస్తుంది. నువ్వు కరిగితే సముద్రానివి. నువ్వు మండితే అగ్ని గోళానివి’ అంటూ వాళ్ళ అమ్మను కవిత్వీకరిస్తారు. ‘పొద్దున్నే చల్ల చారుతో, చద్ది బువ్వ కలిపి ఎర్రగారపు పచ్చడి నంజు పెడితే శాస్త్రవేత్తలా కనిపించింది అమ్మ’ అంటారు. డా. కత్తిపద్మారావు నిరంతర సాహితీ కృషిలో వారి సహచరి స్వర్ణకుమారి సహకారం విశేషమైనది. వెనుతిరగని నది మాటలా, నిర్మలమైన పాటల ఆకాశంలా, పవిత్రమైన నిప్పుల నినాదంలా, స్వచ్ఛమైన నీటి చెలమలా, అచ్చమైన తల్లి గాలి ప్రేమలా, భూమితల్లి జోలలా అతడు ప్రజలకవి. అతనిది ప్రజాకవిత్వం. ఇటీవలే ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారి లోకనాయక్ ఫాండేషన్, విశాఖపట్నం వారు స్వర్గీయ ఎన్.టి.రామారావు, స్వర్గీయ హరివంశరాయ్ బచ్చన్ స్మృత్యర్థం ఇచ్చే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన లోకనాయక్ ఫౌండేషన్ పురస్కారం ‘అస్పృశ్యుని యుద్ధగాథ’కు గానూ రెండు లక్షల రూపాయల నగదు పురస్కారాన్ని కత్తిపద్మారావు అందుకున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకోవడం ద్వారా ఆయనపై బాధ్యత మరింత పెరిగినట్లు అయింది. -శిఖా–ఆకాష్ వ్యాసకర్త ప్రధాన కార్యదర్శి కృష్ణాజిల్లా అభ్యుదయ రచయితల సంఘం మొబైల్: 93815 22247 (నవంబర్ 1న డా.కత్తి పద్మారావు, ఏపీ ప్రభుత్వ ‘వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారా’న్ని అందుకుంటున్న సందర్భంగా) -
నవ కవితా యుగ ప్రవర్తకుడు
మహాకవి జాషువా ఆధునిక కవితా యుగ ప్రవర్తకుడు. కవిత్వంలో నూత్నప్రత్యామ్నాయ ఆవిష్కరణలు చేసిన ప్రయోక్త. సామాజిక జీవితం లోని వైవిధ్యాలకు అద్దం పట్టిన చిత్ర కారుడు. అస్పృశ్యతా భారతంలోని వేదనను అక్షరదృశ్యాలు చేసి, ఆకాశ నక్షత్రాలుగా వెలిగించిన సృష్టికర్త. గతించి అర్ధ శతాబ్ది అయినా కవికి మరణం లేదని నిరూపించిన పునరుజ్జీవుడు. వస్తువు ఏదైనా శృతిహితంగా తెలుగు నుడికారపు సొగసుతో చెప్పగలిగిన ధీశాలి. ‘రాజు మరణించె ఒక తార రాలిపోయే. సుకవి మర ణించె ఒక తార గగనమెక్కే’; ‘రాజు జీవించు రాతి విగ్రహ ములయందు. సుకవి జీవించు ప్రజల నాల్కలయందు’ అని చెప్పిన జాషువా ప్రజల నాల్కల మీద నర్తిస్తున్నాడు. ఆయన రచించిన ‘గబ్బిలం’ నాకు లండన్ మ్యూజియం లైబ్రరీలో సాక్షాత్కరించింది. వినుకొండ నుండి గుంటూరుకు, గుంటూరు నుండి ఢిల్లీకి, ఢిల్లీ నుండి లండన్‌కు ఎగబాకిన విశ్వకవి జాషువా. ‘గబ్బిలం’ తెలుగు సాహిత్యంలోని పంచకావ్యాలకు ప్రత్యామ్నాయ కావ్యంగా మలచబడింది. ‘చిక్కిన కాసుచే తనివి చెందు అమాయ కుడు’ ఆయన నాయకుడు. గబ్బిలం అనే నామకరణం ద్వారా అస్పృశ్య జీవుని గురించే కాదు, అస్పృశ్యమైన పక్షుల గురించి కూడా ఆయన గానం చేశాడు. ఆయన కవితా ఖండి కల్లో ‘శ్మశానవాటిక’ అద్భుతమైంది. అందులో దళిత తాత్త్విక వాదాన్ని ప్రవేశపెట్టాడు. ‘ఏలే బుగ్గల సౌరు రూపరి యెనో యేముద్దు నిద్రించేనో! యేలీలావతి గర్భ గోళమున వహ్నిజ్వాల జీవించెనో’ అంటూ సాగిన కవితలో దళితవాడ తత్త్వం ఉంది. ఒక గాఢమైన సామాజిక ప్రపంచం ఉంది. జాషువా కవితలో ఒక సత్యం కళతో మమేకమై ఉంటుంది. ‘ఎన్నో యేండ్లు గతించి పోయినవి గానీ’; ‘కన్నుల్ మోడ్చిన మందభాగ్యుడొక్కడైనన్ లేచిరాడు; ‘ఎన్నాళ్లీ చల నంబు లేని శయనంబు’; ‘ఏ తల్లులల్లాడిరో’; ‘కన్నీ టంబడి క్రాగిపోయినవి నిక్కంబిందు పాషాణముల్’; పద్యాన్ని వేదనా ప్రకటనకు, జ్వలిత చైతన్య విస్ఫోటనకు, సమస మాజ నిర్మాణోద్యమ సారథ్యానికి ప్రబలవాహికగా మలుచు కున్న క్రాంతదర్శి జాషువా అనుటలో అత్యుక్తి లేదు. ‘చల నంబులేని శయనంబు’ వంటి చిన్నచిన్న పదబంధాలు గుండెను తొలిచివేస్తాయి. మానవ వాక్కులకందతగిన ఆనం దకరమైనట్టియు, రసస్ఫోరకమైనట్టి, నిర్దుష్టమైనట్టి రచనా శిల్పమే కవిత్వం అన్న ఆంగ్ల విమర్శకుని వ్యాఖ్యానంలోని శిల్పం జాషువా కవిత్వంలో భాసిస్తుంది. కరుణరసప్లావి తమైనపుడు ఏమాత్రం హృదయ స్పందన ఉన్నవాణ్ణి కూడా అంతర్ముఖుణ్ణి చేయగల శక్తి ఆయన కవితకున్నది. జాషువా కవిత్వంలో కులతత్వ నిరసన ప్రధానాంశం. ఆయన ముందు ప్రకృతిని పరిశీలించారు. అందులో అసమానతలు లేవు. మనుషుల్లో అసమానతలు ఎక్కువ. ఇవన్నీ కల్పించుకున్నవే. కొందరు కేవలం ప్రకృతి కవులు. మరికొందరు ప్రకృతి ఆరాధకులు. ప్రకృతిలో ఉన్న సహజ జీవిత గుణాలను మానవులకు ఉత్తేజంగొల్పే దిశగా వర్ణించడం ఉన్నత కవుల లక్షణం. ఆ ఔన్నత్యమే జాషు వాను మహాకవిని చేసింది. ‘ముసలివాడైన బ్రహ్మకు బుట్టి నారు నలువురు కుమారులనుట విన్నాము గాని, పసర మున కన్న హీనుడభాగ్యుడైన ఐదవ కులస్థుడె వ్వరమ్మా! సావిత్రీ?’ ఈ మాటలు కలంలోనుంచి వచ్చినవి గానీ, గళంలోనుంచి జారినవి గానీ కాదు; ఇవి గుండె రాపిడిలో నుంచి లేచిన నిప్పురవ్వలు. ‘అసమ సమాజం బాకులు గుమ్మినపుడు, అంటరానితనం నిషాగ్నులు చిమ్మిన పుడు, దుర్భర దారిద్య్రం వెన్నుడికినపుడు, దురంత వేదన గుండె లలో తుక తుక ఉడికినపుడు’ పెల్లుబికిన ప్రశ్నల వెల్లువ. భారతమ్మోరిని, భారతీయుల్ని నిలదీసి అడుగు తుంది జాషువా కవిత. ఆయన నిజజీవితంలో కూడా కరుణార్ద్ర హృదయుడు. కుక్కలను ఎంతో ఇష్టంగా పెంచేవారు. పక్షులకు గింజలేసి ఆదరించేవారు. ఆయన నివసించిన వినుకొండ రామణీ యకమైన ప్రదేశం. ఒక పక్క కొండ, మరో పక్క నది, ఇంకో పక్క అడవి, మరో పక్క ఊరు–వాడ. ఆ ప్రదేశాన్ని చూసిన ప్పుడే కవిత్వమొస్తుంది. తండ్రి వీరయ్య యాదవులు. తల్లి లింగమాంబ దళిత స్త్రీ. తలిదండ్రులిద్దరూ వర్ణాంతర వివా హాన్ని ఆ రోజుల్లోనే ధైర్యంగా చేసుకున్నారు. తండ్రి క్రైస్తవ ఫాదర్. తల్లి ప్రేమమూర్తి. తండ్రిలోని గొల్ల సుద్దుల శ్రుతి వచ్చింది. బైబిల్లోని శాంతి, కరుణ, ప్రేమ కవిత్వంలో ప్రవ హించింది. వీరి ‘క్రీస్తుచరిత్ర’కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. వీరి కావ్యాల్లో ‘ఫిరదౌసి’ అత్యుత్తమ మైనది. మోసపోయిన కవి ఆవేదనను దిక్కులు పిక్కటిల్లేలా చెప్పారు. జాషువా మతమౌఢ్యాన్ని నిరసించారు. ‘వాని రెక్కల కష్టంబు లేనినాడు సస్యరమ పండి పులకింప సంశ యించు’; ‘వారు చెమ్మటలలోడ్చి ప్రపంచమునకు భోజనం బెట్టు వానికి భుక్తి లేదు’ అని సామాజిక ఆర్థిక దోపిడీని ఎలుగెత్తి చాటారు. పగటి దివిటీలతో ఆయన్ని ఊరేగిం చారు. పద్మశ్రీ, పద్మ భూషణ్ వరించాయి. నవయుగ కవి చక్రవర్తిగా కీర్తించ బడ్డారు. శ్రీనాథుడిలా కవిసార్వభౌ ముడు. వేమనలా కవితా సందేశం, తిక్కనలా తెలుగు నుడికారపు విన్నాణవ్ు చాటారు. దళితులకు ఆత్మగౌరవం, ఆత్మ సై్థర్యం నేర్పారు. భారత దేశ సృష్టికర్తలుగా వారిని పేర్కొన్నారు. ఆధునిక దళిత కవితా యుగాన్ని సృష్టించారు. శత్రువుల్ని కూడా ఆశ్చర్య చకితుల్ని చేశారు. తన కూతురు హేమలతను సంస్కర్త అయిన గోరా కుమారుడు లవణంకు ఇచ్చి పెళ్లి చేసి విశ్వజ నీనతను చాటాడు. ‘ముంతాజ్ మహల్’, ‘కాందిశీకులు’, ‘బాపూజీ’, ‘నేతాజీ’ వంటి అనేక కావ్యాలు తెలుగు భాషకు సమర్పించాడు. ‘సాలీడు’, ‘గిజిగాడు’ వంటి ఎన్నో కావ్య చిత్రాలు గీశారు. శిశువు, శ్మశానవాటిక వంటి అమేయమైన కవితా ఖండికలు ఒక్కొక్క కావ్యంతో సమానం.‘వాక్యం రసాత్మకం కావ్యం’ అనేది జాషువాలోనే చూస్తాము. జాతీ యత, మానవత, నవ్యత, శ్రవ్యత, సమత, మమత వంటి అనేక గుణాల శిల్పమే మహాకవి జాషువా. ఆయన పేరు మీద ఒక గొప్ప కళాక్షేత్రాన్ని నిర్మించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ప్రతి మండలంలో జాషువా సాహితీ గ్రంథాలయాలు నిర్మించి ఆయన రచనలను 6వ తరగతి నుండి ఎంఏ వరకు పాఠ్యగ్రంథాలుగా పెట్టి ఆయన కవితా జీవనవ్యవస్థకు ప్రతిష్ట కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వా లకు ఉంది. ఈ 50వ వర్ధంతిని ఆయన ప్రజ్వలిత కవితా జీవన మార్గంగా భావిద్దాం. ఆ స్ఫూర్తితో పయనిద్దాం. వ్యాసకర్త ఐసీఎస్ఎస్ఆర్ సీనియర్ రీసెర్చ్ ఫెలో (నేడు గుర్రం జాషువా 50వ వర్ధంతి) -
వర్తమాన అవసరం అంబేడ్కర్
కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచీ దేశంలో మతోన్మాదం పెచ్చరిల్లుతోంది. ఆయన, హోంమంత్రి అమిత్ షా కలిసి రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్నారు. మానవ హక్కుల్ని నిరంతరం ఉల్లంఘిస్తున్నారు. వాస్తవానికి ఇది లౌకికవాదంపై సాగుతున్న దాడి. స్త్రీల హక్కులపై జరుగుతున్న దాడి. మైనారిటీల హక్కులపై జరుగుతున్న దాడి. రాజ్యాంగంపైనా, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆలోచనలపైనా స్పష్ట మైన అవగాహన ఉన్న ప్రతి ఒక్కరూ దీన్ని గుర్తిం చగలరు. స్వాతంత్య్రోద్యమం సాగుతున్న కాలం లోనే అంబేడ్కర్ ఒక మాటన్నారు. ‘నా ఉద్దేశంలో హిందూ సమాజం కులరహిత సమాజం అయిన ప్పుడు మాత్రమే అది తనను తాను రక్షించుకునే శక్తిని, సామర్థ్యాన్ని సంతరించుకోగలదు. అంతర్గత బలం లేకుండా హిందువులకు స్వరాజ్యం వచ్చినా మళ్లీ దాస్యంవైపు ఒక అడుగు ముందుకు వేయడమే కావొచ్చు. బాగా ఆలోచిం చండి’’ అని ఆయన చెప్పారు. హిందూ సామ్రాజ్య భావనను అంబేడ్కర్ అప్పట్లోనే గుర్తించారు. ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర నమోదు చిట్టా (ఎన్ఆర్సీ) వంటి రాజ్యాంగ వ్యతిరేకమైన చట్టాలు దేశ పౌరుల హక్కులు కాలరాస్తున్నాయి. మద్రాసు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రు మనం భారతీయులమా కాదా అనే అను మానం కలిగేలా ప్రస్తుత పాలన కొనసాగుతోందని ఇటీవల చేసిన వ్యాఖ్యానం వర్తమాన పరిస్థితుల్ని ప్రతిబింబిస్తోంది. మన రాజ్యాంగంలోని 14 నుంచి 18 వరకూ ఉన్న అధికరణలు చట్ట సమా నత్వానికి సంబంధించినవి. చట్టం ముందు ఎవరూ అధికులు కారు. అందరూ సమానులు. అయితే ఆర్థిక, సామాజిక, భౌగోళిక అసమాన తలు, విద్యా అసమానత ఉన్న దేశంలో సమా నావకాశాలు, చట్ట సమానత్వం ఎలా సాధ్యం? అందువల్ల ఈ అధికరణలను వాస్తవిక దృక్ప థంతో, విస్తృత పరిధిలో అన్వయించుకోవాలని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో చెప్పింది. పౌర సత్వ సవరణ చట్టం రాజ్యాంగేతరమైనదే కాక, ఆరెస్సెస్ ఎజెండాకు అనుగుణమైనది. పౌరులను మత ప్రాతిపదికన చూసేది. ఇలాంటి ప్రమాదాన్ని అంబేడ్కర్ చాలా ముందుగానే గుర్తించారు. అందువల్లే ఆ భావజాలంపై పోరాడటానికి పూను కొన్నారు. గాంధీ, జిన్నాలు ఇద్దరివల్లా రాజకీ యాల్లో వికార ప్రదర్శనల పోటీ మొదలైందని ఆయన వ్యాఖ్యానించారు. భారత ఉపఖండ విభజనకు వీరిద్దరే పునాదులు వేశారని కూడా అన్నారు. కానీ అంబే డ్కర్ మతం గురించి, కులం గురించి మాట్లాడు తున్నారని కమ్యూనిస్టులు అప్పుడు ఎద్దేవా చేశారు. తమకు హిందూ మతంలో రక్షణ లేదని, అందువల్ల బౌద్ధమతంలోకి వెళ్లిపోతున్నామని అంబేడ్కర్ చెప్పారు. సమాజంలో కనబడే అస్పృ శ్యతను అర్థం చేసుకోనివారికి తన ప్రకటన వెనక వున్న ఉద్దేశాలు అర్థం కావని వ్యాఖ్యానించారు. అట్టడుగు కులాలవారిపై అత్యాచారాలు, వారి పిల్లల్ని పాఠశాలలో చేర్చాలనుకున్నప్పుడు, ఊరి బావి నుంచి నీరు తోడుకోవడానికి ప్రయత్నించి నప్పుడు, వారు మంచి దుస్తులు ధరించినందుకు, వీధుల్లో చెప్పులు వేసుకుని తిరిగినందుకు, వ్యవ సాయం చేసినందుకు, గుర్రంపై పెళ్లి కొడుకు ఊరే గినందుకు వారిని అగ్రవర్ణాలు అనేక రకాలుగా హింసించిన తీరును, వారి ఇళ్లను తగలబెట్టిన ఉదంతాలను అంబేడ్కర్ వివరించారు. చాలా కాలం కమ్యూనిస్టులు అంబేడ్కర్ కుల నిర్మూ లనను, హిందూ మతవాద నిరసనను పట్టించు కోలేదు. అందువల్లే ఇప్పుడు భారత రాజ్యాంగ పరిరక్షణకు వారు పిలుపునిచ్చే పరిస్థితులు ఏర్ప డ్డాయి. దేశంలో జరుగుతున్న నిరసనల్లో ఉద్యమ కారులంతా మతాలకు అతీతంగా అంబేడ్కర్ ఫొటోలు, రాజ్యాంగం ప్రతులు చేతబూనడం కన బడుతుంది. కమ్యూనిస్టు పార్టీలు, కాంగ్రెస్ ద్వంద్వ విధానాలను విడనాడి అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగంతో పాటు ఆయన సిద్ధాంతాలను ఆచ రించినప్పుడే ప్రజలు వారిని విశ్వసిస్తారు. ఇది చారి త్రక సమయం. లౌకికవాద వ్యవస్థను పునర్నిర్మిం చుకోవడానికి అందరూ సంసిద్ధులైతే సమసమాజం తథ్యం. డాక్టర్ కత్తిపద్మారావు వ్యాసకర్త సామాజిక తత్వవేత్త, నవ్యాంధ్రపార్టీ, వ్యవస్థాపక అధ్యక్షులు మొబైల్ : 98497 41695 -
దక్షిణాది భాషలపై హిందీ పెత్తనం
దక్షిణ భారతదేశంపై హిందీ భాషను రుద్దడానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఇది భారత రాజ్యాంగం ప్రతిపాదిస్తున్న ఫెడరిలిజంపై గొడ్డలి వేటు వేయడమే. భారత రాజ్యాంగం దేశీయ భాషల అస్తిత్వానికిచ్చిన స్వేచ్ఛను భగ్నపరచడం తప్ప మరొకటి కాదు. దక్షిణాది భాషలన్నీ అతి ప్రాచీనమైనవి. భారతదేశానికి వలస వచ్చిన అనేక జాతుల భాషలను సంలీనం చేసుకొన్న భాషా జాతులు దక్షిణాది భాషలు. ఇతర దేశీయ దాడులకు ఉత్తర భారతం గురైనంతగా దక్షిణ భారతం గురికాలేదు. అందుకే ఇక్కడ భాషల్లోని మాతృస్వామికత, దేశీయతల పునాది చెక్కు చెదరలేదు. దక్షిణ భారత భాషలు ప్రపంచ భాషా చరిత్రలో అత్యున్నత ప్రాధాన్యం కలిగినవి. నిజానికి తెలుగు, తమిళ, కన్నడం, మలయాళ భాషలకు మూలం ద్రవిడ భాషే. అయితే అవి 21 భాషలుగా అభివృద్ధి చెందాయి. క్రీస్తు పూర్వం మూడు వేల సంవత్సరాల నాడు మూల ద్రవిడ భాష నుండి ఈ భాషలు ఒకటొకటిగా స్వతంత్రతను సంతరించుకున్నాయని భాషా చరిత్రకారులు చెప్తున్నారు. ఒకటొకటి స్వతంత్ర భాషగా రూపొందడానికి వెయ్యి యేండ్లు పట్టింది. తెలుగు భాష ప్రభావం ఇప్పటికీ తెలుగు తెగల మీద వుండటాన్ని మనం గుర్తించాలి. ముఖ్యంగా కోయ భాషలో ఎన్నో తెలుగు పదాలు వున్నాయి. తెలుగులో అతి ప్రాచీన జాతుల్లో సవరలు ఒకరు. వారి పాటలు ఆర్యులకు పూర్వం నాటివి. ఆ సవరుల భాషలో ఎన్నో తెలుగు పదాలు వున్నట్టు గిడుగు శ్రీరామమూర్తిగారు నిరూపించారు. అమిత్ షా ప్రకటనలో ఆర్.యస్.యస్. ఎజెండా వుంది. భిన్నత్వంలో ఏకత్వం అంటూనే అంతా ‘రామ’ మయం చేయాలంటారు. దక్షిణ భారతదేశంలో సామాజిక సాంస్కృతిక, తాత్విక ఉద్యమాలన్నీ భాషా పునాదిగా పుట్టాయి. ఇప్పటికీ అధిక శాతం మంది నిరక్షరాస్యులుగా వుండి తమ భాషలోనే తమ జీవన క్రమాన్ని నడుపుకొంటున్నారు. చదువుకొనే వారికి, చదువుకోని వారికి ఆయా ప్రాంతీయభాషలే జీవ వాహికలుగా వున్నాయి. దక్షిణాది వారు హిందీకి వ్యతిరేకులు కాదు. కానీ, ఏ భాషనూ ప్రభుత్వం ప్రజ లపై రుద్దకూడదు. వారి వారి ఉత్సాహాన్ని బట్టి భాషను నేర్చుకొంటారు. అప్పుడే భాష వస్తుంది. భాష మెదడు మీద రుద్దితే వచ్చేది కాదు. అది నేర్చుకునే ఔత్సాహికత నుండే వస్తుంది. అంబేడ్కర్ ఈ సందర్భంగా ఫెడరల్ స్ట్రక్చర్ మనుగడ ఆయా దేశీయ భాషల్ని రక్షించి అభివృద్ధి చేయడం మీదే ఆధారపడి ఉందని చెప్పారు. భాషా రాష్ట్రాల ఏర్పాటు సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఇలా పేర్కొన్నారు. ‘‘సమాఖ్య రాజ్యాంగం విజయవంతంగా పనిచేయడానికి రాష్ట్రాలు ఎక్కువగా సమతుల్యతలో ఉండడం అవసరమని నేను భావిస్తున్నాను. వ్యత్యాసం మరీ ఎక్కువగా ఉన్నట్లయితే అది అనుమానాల్ని, అసంతృప్తిని కలిగించడమే కాదు, ఫెడరల్ వ్యవస్థనే విచ్ఛిన్నం చేయగల శక్తులను సృష్టించడం దేశ ఐక్యతకే ప్రమాదకారి అవుతుంది. భాషల అంశం చాలా లోత్తైంది’’. నిజానికి కేంద్రం దక్షిణాది భాషల అభివృద్ధికి వెయ్యి కోట్లు ఇవ్వాల్సి వుంది. కానీ దేశీయ భాషలను సంస్కృతులను ప్రోత్సహించకుండా దెబ్బతీయాలని చూస్తున్నారు. ఇది అత్యంత సంకుచిత రాజకీయం. దక్షిణాది భాషలకు కేంద్ర ప్రభుత్వం నుండి సరైన సహకారం లేదు. డా‘‘ బి.ఆర్.అంబేడ్కర్ రాజ్యాంగ స్పూర్తికి షా ప్రకటన విరుద్ధం. దక్షిణ భారతీయులు అశోకుణ్ని, ఔరంగజేబుని నియంత్రించిన సమర్థులు. దక్షిణాది సంస్కృతులపై దాడి చేసి నిలిచిన వారు లేరు. ఈ సందర్భంగా దక్షిణ భారత ముఖ్యమంత్రులు, భాషావేత్తలు, ప్రజలు ఏకమై మహత్తర పోరాటాన్ని సాగించడం ద్వారా భారతీయ సమైక్యతను సముజ్వలతను కాపాడుకోవాల్సిన చారి త్రక సందర్భం ఇది. ఇది కేవలం హిందీ పేరుతో జరుగుతున్న పాలక వర్గపు రాజకీయ దాడి. అందుకే సామాజిక భాషా శక్తులే కాక రాజకీయ శక్తులు కూడా ఈ పోరాటంలో భాగస్వాములు కావాల్సిన సందర్భం ఇది. దక్షిణ భారతీయులు పోరాటమే ఊపిరిగా తరతరాలుగా తమ అస్తిత్వాలను చాటుకొంటున్నారు. ఈ పోరాటంలో మనమూ భాగస్వాములు అవుదాం. డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త సామాజిక తత్వవేత్త, నవ్యాంధ్ర పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మొబైల్ : 98497 41695