ఆధునిక అవసరాలు తీర్చే విద్య కావాలి | What Modern Education Really Needs To Focus On: Katti Padma Rao View | Sakshi
Sakshi News home page

ఆధునిక అవసరాలు తీర్చే విద్య కావాలి

Published Thu, Jun 23 2022 12:35 PM | Last Updated on Thu, Jun 23 2022 12:37 PM

What Modern Education Really Needs To Focus On: Katti Padma Rao View - Sakshi

విద్య అనేది ఒక సామాజిక, సాంస్కృతిక జీవన మార్గాన్ని రూపొందిస్తుంది. అది ప్రపంచ జ్ఞానానికి మార్గం. ప్రపంచాన్ని మన ముందు ఆవిష్కరిస్తుంది. ప్రపంచ గమనాన్ని నిర్దేశిస్తుంది. మానవ జీవన సోపానమైన విద్య ప్రపంచ వ్యక్తిత్వాన్ని మనకు ఆవాహనం చేస్తుంది. మానవుడు విద్యను స్వార్థానికి ఉపయోగిస్తున్న సందర్భంగా అది కార్పొరేట్‌ కబంధ హస్తాల్లోకి వెళ్ళింది. కార్పొరేట్‌ విద్యా వ్యవస్థ మెదడుకు ఒత్తిడిని కలిగించి, జ్ఞానాన్ని ధ్వంసించి పరీక్షోన్ముఖమైన దారి చూపుతుంది. ప్రభుత్వ ధనాన్ని కొల్లగొడుతున్నవారు కొందరు.. తమ పిల్లల్ని కార్పొరేట్‌ విద్యలోకి నెట్టి జ్ఞానశూన్యమైన విద్యా సోపానాన్ని ఎక్కించాలని ప్రయత్నిస్తున్నారు. కార్పొరేట్‌ విద్యాలయాలకు అధిక ధనాన్ని విద్యార్జన కోసం వెచ్చిస్తున్నారు. 

మనిషి మౌఖిక సాంప్రదాయం నుంచి వచ్చిన వాడు. దళిత బహుజన మైనారిటీ విద్యను బోధనా పటిమ నుండి అందుకోవలసి ఉంటుంది. విద్యను ఒక జ్ఞాన స్రవంతిగా, వాస్తవ జీవన ప్రవాహంగా అభ్యసించినప్పుడే వాళ్ళు ప్రపంచ గమనంలోకి వెళ్లగలుగుతారు. దానికి భిన్నమైన కృత్రిమ విద్య వారు గ్రహించలేరు. అందుకే విద్యాంతరాలు ఏర్పడుతున్నాయి. విద్యలోకి కూడా మత, కుల, వర్గ భేదాలు జొరబడ్డాయి. 

నిజానికి ప్రకృతిలో ఉండే అనేక శక్తుల్ని మానవుడు బయటకు తీశాడు. వాటిని శాస్త్రాలుగా అభివృద్ధి చేశాడు. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వృక్ష శాస్త్రం, జంతు శాస్త్రం, మనో విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక శాస్త్రం... ఇలా ఎన్నో శాస్త్రాలను అభివృద్ధి చేశాడు. ఈ శాస్త్రాలతో అంతఃసంబంధం ఉన్న బడుగు వర్గాల విద్యార్థులకు ఇవి బాగా మెదడులోకి చొచ్చుకు వెళతాయి. 

అయితే ఇప్పుడు విద్యా బోధనలో నాణ్యత తీసుకురావడమే ముఖ్యమైన అంశం. కార్పొరేట్‌ విద్యా లయాల్లో ఉన్న వ్యాపార సంస్కృతిని ప్రభుత్వం నేరమై నదిగా గుర్తించాలి. వాటిలో ఆటస్థలాలు లేవు. లాబ్‌లు లేవు. ఎన్‌రోల్‌మెంట్‌ కూడా వేరే ప్రభుత్వ కాలేజీల్లో చేస్తున్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించవలసి ఉంది. 

ప్రభుత్వ విద్య అభివృద్ధి చెందాలంటే ప్రపంచ భాషగా అభివృద్ధి చెందిన ఇంగ్లిష్‌ మాధ్యమ బోధన అనివార్యం. అంత మాత్రాన మాతృభాషను విస్మరించ కూడదు. మాతృ భాషలో జీవశక్తులు ఉంటాయి. ఆ జీవ శక్తులను నేర్చుకునే భాషలోకి పరివర్తితం చేయగలగాలి. ఇంగ్లిష్‌ భాషని మనం నేర్పే క్రమంలో గృహాన్ని కూడా మోడ్రన్‌ స్ట్రక్చర్‌లోకి తీసుకు వెళ్ళాలి. విద్యార్థులకు ప్రత్యేకమైన గదులుండాలి. టేబుళ్లుండాలి. డిక్షనరీలు ఉండాలి. టేబుల్‌ మీద గ్లోబ్‌ ఉండాలి. ‘బైజూస్‌‘ లాంటి తగిన నూతన పరికర ప్రాయోగిక అంశాలు... గృహ వాతా వరణం లేకుండా వర్ధిల్లవు. ప్రపంచ వేగాన్ని బట్టి, సమాజ పరిణామాన్ని బట్టి అవన్నీ అవసరం. 

తల్లిదండ్రుల్ని కూడా వయోజన విద్యాపరులుగా మార్చాలి. మరీ ముఖ్యంగా తాగుడుని పూర్తిగా నిర్మూ లించకుండా గృహ సంస్కృతిలో విద్య వర్ధిల్లదు. టీవీ సీరియల్స్‌ ప్రమాదకరంగా మారాయి. మధ్యతరగతి గృహిణుల గృహ వాతావరణాన్ని విద్వేషపూరితంగా సీరియల్స్‌ ద్వారా మారుస్తున్నాం. దానివల్ల విద్యార్థులకు విద్యా వాతావరణం గృహాల్లో లేదు. కార్పొరేట్‌ విద్యాశాలలు బలవంతమైన విద్యను బుద్ధి మీద రుద్దుతున్నాయి. దాని వల్ల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకూ, కార్పొరేట్‌ స్కూళ్ల విద్యార్థులకూ మధ్య తీవ్రమైన వైరుధ్యం ముందుకు వచ్చేసింది. 

విద్యార్జనకు సంబంధించిన శారీరక శక్తి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థికి లేదు. హైస్కూళ్ళలో అసెంబ్లీ మొదలయ్యే సమయానికి విద్యార్థులకు రాగి బిస్కట్లు, క్యాల్షియం బిస్కట్లు, ఒక గ్లాసు పాలు ఇవ్వాలి. దానిమ్మ, యాపిల్, బొప్పాయి, జామ వంటి పండ్లు ఉదయం 11 గంటలకు అందివ్వాల్సి ఉంది. విద్యార్థులు పోషకాహార లేమితో రక్తహీనతతో బాధపడుతున్నారు. డేట్స్‌ జెల్‌ వారికి పాలలో కలిపి ఇవ్వాల్సి ఉంది. జీడిపప్పు, బాదం పప్పు, వేరుసెనగ పప్పు వంటి బలవర్ధకమైన ఆహారాలు విద్యార్థులకు అందివ్వాల్సి ఉంది. ఇవన్నీ ఇప్పుడు ఇజ్రా యిల్, జర్మనీ, జపాన్, స్విట్జర్లాండ్, అమెరికా వంటి దేశాలలోని స్కూల్స్‌లో తప్పనిసరిగా అందిస్తున్నారు. మెదడు చురుకుగా పనిచేయడానికి కావలసిన శక్తి మంచి ఆహారం వల్లనే లభిస్తుంది. శారీరక శక్తి లేని విద్యార్థులు చివరి పీరియడ్‌ కల్లా బల్లమీద ఒరిగిపోతున్నారు.

విద్య అంటే అది జీవన సంస్కృతీ నిర్మాణం. మానవాభ్యుదయానికి అది సోపానం. ఈనాటి ప్రభుత్వ విద్యలో ఇంగ్లిష్‌ మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం ఎంత ముఖ్యమో... సామాజిక వాతావరణ రూపకల్పన కూడా అంతే అవసరం. జీవించడం అంటే సమాజంతో జీవించడమే. మానవత్వంతో జీవించడమే. ఈర్ష్య, ద్వేషాలను ప్రక్కనపెట్టినవారే అత్యున్నతమైన స్థానాలకు వెళ్తారు.

ప్రపంచ వ్యాప్తంగా విద్య పెరుగుతోంది. విద్యా ప్రమాణాలు పెరుగుతున్నాయి. భాషాధ్యయనమే ఒక ఉపాధిగా కూడా పెరుగుతోంది. వరల్డ్‌ బ్యాంక్, యూఎన్‌ఓ, యునెస్కో, డబ్లు్యహెచ్‌ఓ, యునిసెఫ్‌ వంటి అంతర్జాతీయ సంస్థల్లో భాషా నిపుణుల అవసరం ఉంటోంది. ఇప్పుడు ఒక్క ఇంగ్లిషే కాదు... చైనీస్, జర్మన్, ఫ్రెంచ్, రష్యన్‌ వంటి అన్ని భాషలూ నేర్చుకోవాల్సిన అవసరం ముందుకొచ్చింది. వివిధ భాషలతో పాటు శిల్పం, చిత్రలేఖనం, సంగీతం, నృత్యం, సాహిత్యం, కవిత్వం వంటి అనేక కళలూ; క్రీడల సామర్ధ్యం, సాంకేతిక విద్యలు కూడా ఈనాడు విద్యార్థులు అభ్యసించవలసిన అవసరం ఏర్పడింది. (క్లిక్‌: ఉన్నవి అమ్ముతూ వ్యయం తగ్గింపా?)

ప్రభుత్వం, ప్రజలు మమేకమై... విద్యా సాంస్కృతిక వికాసానికీ, కుల, మత రహిత జీవన విధాన అభ్యసనా నికీ; ఆచరణకూ, భారత రాజ్యాంగ స్ఫూర్తికీ... డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆశయాన్ని సాఫల్యం చేసే దిశలో ముందడుగు వేయవలసిన చారిత్రక సందర్భమిది. (క్లిక్‌: రాష్ట్రపతి ఎన్నిక ఎందుకు ప్రతిష్ఠాత్మకం?)


- డాక్టర్‌ కత్తి పద్మారావు 
దళిత ఉద్యమ నిర్మాత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement