సహజ వాగ్గేయకారుడు | Sakshi Guest Column On Gaddar By Katti Padmarao | Sakshi
Sakshi News home page

సహజ వాగ్గేయకారుడు

Published Sun, Aug 13 2023 12:47 AM | Last Updated on Sun, Aug 13 2023 5:12 AM

Sakshi Guest Column On Gaddar By Katti Padmarao

జనం గుండెల నుంచి ప్రభవించిన సజీవ వాగ్గేయకారుడు గద్దర్‌. కవిత్వాన్ని పాటలో రంగరించి తత్వాన్ని బోధించిన మానవతా మూర్తి. ఆయన పాటల్లో పల్లె జీవన సంస్కృతీ వికాసం ఉంది. వేమన, పోతులూరి వీరబ్రహ్మం, కబీరు,సంత్‌ రవిదాసు సూక్తులు ఆయన పాటల్లో ప్రతిధ్వనిస్తుంటాయి. ఆయన ‘జననాట్యమండలి’ సృష్టికర్త. ఆయన నాలుక మీద ఆదిమ జాతుల స్వర విన్యాసం ఉంది. సముద్ర ఘోషను ఆయన ఊరిలోనికి మోసుకొచ్చాడు. అడవి వేదనలను రాజ్య ప్రసాదాల్లోకి ప్రవహింప చేశాడు. 

నేను విశాఖపట్నం జైల్లో ఉన్నప్పుడు నక్సలైట్‌ సెల్‌ నుంచి ‘సిరిమల్లె సెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మా, నీవు సినబోయి కూచున్నవెందుకమ్మో ఎందుకమ్మా’ పాట అర్ధరాత్రి పాడాడు. అది నాలో పునరుత్తేజాన్ని తీసుకొచ్చింది. దళిత వీరుల చెవుల్లో విప్లవ స్వరాన్ని విని పించి సైనిక కవాతు చేయించిన సైన్యా ధ్యక్షుడు ఆయన. 

1985లో కారంచేడు ఉద్యమంలో మమేకమై ‘దళిత పులులమ్మ, కారంచేడు భూస్వాములతో కలబడి నిల బడి పోరు చేసిన దళిత పులులమ్మ’ అని దళితులకు చైతన్యాన్నీ, ధైర్యాన్నీ,  పోరాట శక్తినీ కల్పించిన దళిత వీరుడు ఆయన. ఆయన తండ్రి అంబేద్కర్‌ స్థాపించిన మిలింద విశ్వవిద్యాలయా నికి రాళ్లెత్తాడు. అంబేడ్కర్‌ కుల నిర్మూ లన ఉద్యమానికి గద్దర్‌ వెన్ను తట్టాడు.

చేతిలో ఎర్ర జెండా ఉన్న ప్పుడు కూడా గుండెల్లో అంబేడ్కర్‌ని నింపుకున్నాడు. అందుకే ఆయన తన గమనంలో కుల నిర్మూలన వాదిగా ధ్వనిస్తూ వచ్చాడు. కులం మీద ఆయన గొడ్డలి వేటు వేశాడు. ‘దళిత పులులమ్మ’ పాటలో కథా కథన చాతుర్యాన్ని చూపాడు. గద్దర్‌ కారంచేడులో దళితులు చనిపోయిన ప్రదే శానికి వచ్చినప్పుడు  ‘వీళ్ళు పోరాటంలో చనిపోయారు గాని, పిరికి వాళ్ళై చనిపోలేద’ని స్థానిక దళితులు చెప్పారు. అప్పుడు గద్దర్‌ ఈ పాట రాశాడు.

‘దళిత పులులమ్మా / కారంచేడు భూస్వాములతోనే / కలబడి నిలబడి పోరు చేసినా/ మాల సాయిబు వడ్డెర జాతికి మాదిగపల్లె తల్లిలాంటిది/ శరణుకోరిన శత్రువునైనా ప్రేమతో చూసే పేదలపల్లె/ మాదిగపల్లె పేరు వింటెరా/ బరిశె నెత్తుకొని పందె మాడితే  ఊరి దొరలకు ఉచ్చబడతది/ కోటి బాధలతో మునిగి తేలినా అన్న మాటకు అటుఇటు గారు/ వడ్డీల మీద వడ్డీలు గట్టి – నడ్డి విరిగినా బుద్ధిమంతులు/ మట్టిలో మటై్ట మన్నులో మన్నై – పండించిన ప్రతి వడ్లగింజను/ బలిసిన దొరల గరిసెలు నింపి – పస్తులు పండే కష్ట జీవులు.’    

ఈ పాట చరిత్రకు సాక్ష్యంగా నిలబడింది. దళితుల పోరాట పటిమకు అద్దం పడుతుంది. గద్దర్‌ దళిత బిడ్డ. ఆయన అంబే డ్కర్‌ బుర్రకథల ద్వారానే ముందుకు నడిచాడు. తరువాత జన నాట్యమండలి నిర్మించాడు. పీపుల్స్‌వార్‌కు అనుబంధంగా జన నాట్యమండలి కృషి చేసింది. జననాట్యమండలి ఆనాడు దళిత ఉద్యమానికి వ్యతిరేకంగా ఉంది. అది ఆనాడు దళిత ఉద్యమాన్ని హైజాక్‌ చేయాలని అనుకొంది. ఆ సందర్భంగా గద్దర్‌పై దళిత ఉద్యమ ప్రభావం పడింది. దాని ఫలితమే ఈ పాట.

మొదటి సారిగా, జననాట్యమండలి పాటల్లో కులాధిపత్యం వర్గాధిప త్యాన్ని జోడించి పాడటం ప్రారంభమైంది గద్దర్‌తోనే! ఇది దళిత ఉద్యమ విజయం. ఈ పాటను 1985 సెప్టెంబర్‌ 1న ‘చలో చీరాల’ మహాసభలో గద్దర్‌ పాడాడు. ఈ పాట ఒక ఉజ్జ్వల జ్వలనాన్ని ప్రేక్షకుల్లో రూపొందించింది. సుమారు 3 లక్షల మంది దళితులు ‘దళిత మహాసభ’ ఆధ్వర్యంలో చీరాల హైస్కూలు గ్రౌండ్స్‌లో హాజరయ్యారు. ఈ వ్యాస రచయితే అధ్యక్షత వహించాడు. గద్దర్‌ నిజానికి ఒక తాత్త్వికుడు. నీకిష్టమైన పాటేదంటే ‘ఏలరో ఈ మాదిగ బతుకు’ అంటాడు. నిజానికి ఈ పాటలో ఈ దళిత కులాల జాతీయతను ఎలుగెత్తి చాటాడు గద్దర్‌:

‘ఏలరో ఈ మాదిగ బతుకు మొత్తుకుంటే దొరకదురా మెతుకు/ బంగారు పంటలిచ్చె భరత గడ్డమనది / గంగమ్మ ప్రవహించే  పుణ్యభూమి మనది / గంగ యమున బ్రహ్మపుత్ర కృష్ణ పెన్నా కావేరి/ ఎన్నెన్నో జీవ నదులు  ప్రవహించే జీవగడ్డ / మాల మాదిగలకే మంచినీళ్లు కరువాయే’ అని గద్దర్‌ సామా జిక తత్త్వాన్నీ, సామాజిక సమస్యనూ దళిత జాతీయ దృక్పథంతో అనేక పాటల్లో విశ్లేషిస్తాడు.

దళిత ఉద్యమంలో పాటలు పాడే దళాలన్నీ అవి ఏ పేరుతో ఉన్నా గద్దర్, మాష్టార్జీ ప్రభావంతోనే పాటలు పాడుతూ వచ్చాయి. అందుకే దళిత ఉద్యమం మీద గద్దర్‌ ప్రభావం సాంస్కృతికంగా బలంగా ఉందనక తప్పదు. మనం ఎన్ని దృక్కోణాల నుంచి చూసినా ఆయన జాతి వైతాళికుడు. కుల మత భేదాలు లేని బౌద్ధ సిద్ధాంతగామి. ఆయన ఒక నశించని సామాజిక విప్లవ స్వరం. ఆయన పాట లతో లోకం మేల్కొంది. అందుకే ఆయన ఈ యుగం జాతి వైతాళికుడు. ఆయన పాటల బాటలో నడుద్దాం.
కత్తి పద్మారావు 
వ్యాసకర్త దళితోద్యమ నేత ‘ 98497 41695 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement