సృజన స్వరం వేదికపై మాట్లాడుతున్న గద్దర్
కవాడిగూడ: రాజును, రాజ్యాన్నిప్రశ్నించేదే పాట అని ప్రజాయుద్ధ నౌక గద్దర్ అన్నారు. గురువారం హైదరాబాద్ ఫెస్ట్‌లో సృజన స్వరం వేదికపై పాట అనే అంశంపై గద్దర్ మాట్లాడారు. శబ్దం ఉత్పత్తి, శబ్దం జానపదం.. జ్ఞానపదం, అభ్యుదయ పదం, విప్లవపథం అక్షరాల సమూహమే పాట అవుతుందని అన్నారు. భావం భౌతికంగా మారినప్పుడే పాటకు రూపం వస్తుందన్నారు. అనంతరం నిస్సార్, దేవేందర్ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర పోరాటం, తెలంగాణ ఉద్యమంలో, నగ్జల్బరీ ఉద్యమంలో పాట గొప్ప పాత్ర పోషించిందన్నారు. పాట నిండు చందమామ అని కొనియాడారు. కార్యక్రమంలో స్ఫూర్తి, నేర్నాల కిశోర్, జగన్ పాల్గొన్నారు.
బాలోత్సవ్‌లో..
బాలోత్సవ్‌లో పిల్లలకు చిత్రలేఖనం, బొమ్మల తయారీ, కథ చెప్పడం, రాయడం లాంటి అంశాలపై విశ్లేషించారు. ఇవేదికపై ‘చిన్నారుల మానవీయత’ అంశంపై సంఘ సేవకురాలు డాక్టర్ లీక్ , రచయిత సోనియా శాండిల్య పాల్గొని మాట్లాడారు.
మహిళా వేదికపై..
హైదరాబాద్ ఫెస్ట్‌లో ఏర్పాటు చేసిన మహిళ వేదికపై సెంటర్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ అంశంపై మహిళలకు, పిల్లలకు అవగాహన కల్పించారు.
మాయా లేదు.. మర్మం లేదు..
మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలపై విద్యార్థులు అసక్తి చూపుతున్నారు. మాయా లేదు.. మర్మం లేదు అంతా సైన్స్ పరిజ్ఞానమే అంటూ చంద్రయ్య మనోహర్ మ్యాజిక్ షో పిల్లలను, పెద్దలను ఆకట్టుకుంటోంది.
సుద్దాల హనుమంతు వేదికపై..
సుద్దాల హనుమంతు వేదికపై సినీ దర్శకుడు కాశీ విశ్వనాథ్, ఏపీఎఫ్ చైర్‌పర్సన్ విమల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సూర్యాపేటకు చెందిన కళాకారుల జడ కోలాటం, పృథ్వీరాజ్ క్లాసికల్ శాస్త్రీయ నృత్యం, భూదేవి బృందం సోలో సాంగ్, విక్టరీ బృందం బోనాల డాన్స్, కృష్ణా జిల్లా కళాకారుల వీధి నాటకం, పల్లె సుద్దులు, అభ్యుదయ అకాడమీ పూలే నాటకం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. గాయకురాలు విమల ఆలపించిన గీతాలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో ఫెస్ట్ కార్యదర్శి కోయ చంద్రమోహన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment