జనం గుండె చప్పుడులా మోగిన ఆ పాట దరువు ఆగింది. మద్దెల మోతల్ల విరబూసిన ఆ పదాల తోట వాడింది. ఉద్యమంలా జనాన్ని చైతన్యంవైపు నడిపించిన ఆ పాట పడమటి దిక్కున అస్తమించింది. కామ్రేడు గద్దరన్నా! కానరాని లోకాలకు పోయిండు, తన పాటను మన యాదిలో వదిలేసి!
-సాక్షి, హైదరాబాద్
ప్రజా బాహుళ్యాన్ని తన పాటలతో ఉర్రూతలూగించిన ప్రజా గాయకుడు గుమ్మడి విఠల్ అలియాస్ గద్దర్ ఆదివారంనాడు అనారోగ్య కారణాలతో దివికేగారు. తొలి నుంచి పూర్తిస్థాయి మావోయిస్టుగా, సానుభూతిపరుడిగా ఉన్న గద్దర్.. జీవిత చరమాంకంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు, చేసిన పనులు విస్మయం కలిగించాయి.
తన కర్రకు కట్టిన ఎర్ర జెండాను విప్పేయడం, సూటూబూటు ధరించడం, అచ్చమైన కమ్యూనిస్టు అయి ఉండీ.. ఎన్నికల్లో ఓటు వేయడం, గుళ్లకు, స్వామీజీల వద్దకు వెళ్లడంపై ఆశ్చర్యం వ్యక్తమైంది.
మావోయిస్టులు తీవ్రంగా వ్యతిరేకించే చంద్రబాబు కడుపులో తలపెట్టడం, కాంగ్రెస్ వారి వేదిక ఎక్కడం, ప్రధాని మోదీ సభకు ఆహ్వానం లేకున్నా వెళ్లడం వంటివీ చర్చనీయాంశంగా మారాయి. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో గద్దర్ పెద్దపల్లి నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు ప్రచారం కూడా జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment