‘గద్దరమ్మ నోటికి దండం’ అనేవాళ్లు, ఇప్పుడు ‘గద్దర్’ నోటికి దండాలు పెట్టే రోజులొచ్చాయి! ఒక ఉద్యోగిగా సరి పెట్టుకుని, పెరుగుతున్న ధరలతోనే రాజీపడి బతుకు భారాన్ని చిరునవ్వుతో మోసుకుంటూ కాలక్షేపం చేయలేక, కళారంగాన్ని కదనరంగంగా మార్చిన విప్లవ కవితా ఉద్యమ వారసుడు, కవి, మధుర గాయకుడు అయిన గుమ్మడి విఠల్ రావు (గద్దర్) కాకతీయ మహాయుగానికి, తెలంగాణ విప్లవోద్యమానికి కారణమయిన తెలంగాణలో పుట్టి పెరిగిన వాడు. సామాజిక అసమానతలపైన, అన్యాయాలపైన అతని విమర్శ వ్యక్తిగతమైనది కాదు, వ్యవస్థాగతమైనది.
నిత్య హత్యా సత్యమైన ఆస్తిహక్కుకు బద్ధవిరోధి. అది రద్దు కానంత వరకు ఈ కుల వ్యవస్థ, ఈ మత దురహంకార వర్గ సమాజం మారదనీ, మానవుడు మారడనీ నమ్ముతున్నవాడు. సరికొత్త బాణీలతో, సొంత గొంతుతో అట్టడుగు ప్రజల యాసలో, మాండలిక భాషలో కళారంగాన్ని విప్లవీకరించిన వ్యక్తిగా గద్దర్‌కు ఈ దేశంలోనే కాదు, ఖండాంతరాలలో కూడా పోలిక – నీగ్రో బానిసల బతుకులకు అర్థం చెప్పి వాళ్ళ బాధల గాథలే పల్లవిగా, అను పల్లవిగా, వీధి వీధినీ గానం చేసి అజ్ఞాత జీవితాలకూ, అస్థిరమైన ప్రవాస జీవితాలకూ నాద బ్రహ్మగా నిలిచిన పాల్ రాబ్సన్ ఒక్కడే!
ఆ బానిసల గర్భశోకానికి శ్రుతిగా సంగీతం వెలయించిన పాల్ రాబ్సన్ 1950లలో ‘ఫిస్క్ జూబ్లీ గాయకుల’కు ప్రత్యక్ష వారసుడు. స్పానిష్ అంతర్ యుద్ధంలో సమర గీతాలు ఆలపించాడు. ఈ సమర కళాయాత్రను సహించలేని అమెరికా పాల కులు రాబ్సన్ నోరు నొక్కబోయారు. అతని గాన సభలను దేశ మంతటా నిషేధించారు. విదేశాలకు వెళ్ళకుండా పాస్‌పోర్ట్ నిరా కరించారు. అయినా జ్ఞాతంగానూ, అజ్ఞాతంగానూ దేశంలోనూ, దేశాంతరాలలోనూ ప్రభుత్వాలూ, అధికారులూ, సంస్థలూ, జీవన రంగంలో సర్వ విభాగాలకు చెందిన మేధావులూ రాబ్స న్‌ను తలకెత్తుకున్నారు.
అలాంటివాడు మన గద్దర్. ‘ఫెస్క్ జూబ్లీ’ గాయకులకు రాబ్సన్ వారసుడైనట్లే, నూతన ఫక్కీలో శ్రీకాకుళ గిరిజనోద్య మానికి అక్షర రూపమిచ్చిన జముకుల కథకు జనకుడు, గాయ కుడూ అయిన పాణిగ్రాహి జానపద కళాసృష్టికీ ప్రత్యక్ష వార సుడు గద్దర్. పాణిగ్రాహి జముకుల కథలోని కథకుడైన చిన బాబు వయస్సు ఆనాటికి 14 ఏళ్ళే అయినా బుద్ధిలేని ప్రభుత్వం రైల్వే స్టేషన్లో జనం మధ్యనే అరెస్ట్ చేసి అర్ధరాత్రి అడవులలో ‘ఎన్‌కౌంటర్’ జరిపి ఆ ‘అభిమన్యుడి’ని పొట్టన పెట్టుకుంది! నాటి ఆంధ్ర కళారంగంలో విప్లవానికి అదే నాంది. రచ యితలను, కళాకారులను నిర్బంధించడం ఏ ప్రభుత్వ పతనా నికైనా తొలి మెట్టు అవుతుంది. అప్పుడు ఎవరికి వారే ఆలోచించుకుని కాంగో కవి ‘లెవెన్ ట్రీ’ అన్నట్టుగా ‘తన విముక్తికి తానే నడుం కడతాడు.’
కనుకనే శ్రీకాకుళం ఏజెన్సీ ప్రాంత కల్లోలానికి కలం, గళం సారథ్యం వహించిన పాణిగ్రాహి గానీ, తెలంగాణలో గిరిజన ప్రాంతాలలో దోపిడీ వ్యవస్థపై గజ్జె కట్టి గుండె చప్పుళ్ళు విన్పించిన గద్దర్ గానీ లక్షలాది జనాన్ని కదిలించారు. గద్దర్ బాణీ విప్లవ రచయితల సంఘానికి ‘పారాణి’గా అమరింది. ఆంధ్ర ప్రజా నాట్యమండలి చేతుల మీదుగా, ఒకనాటి సాంస్కృతిక పునరుజ్జీవన కాలంలో పునరుద్ధరణ పొందిన ఎన్నో జానపద కళారూపాలు ఆనాటి వాతావరణాన్ని పుణికి పుచ్చుకోగా ఇటీవల పాణిగ్రాహి, గద్దర్ చేపట్టిన కళా రూపాలు సరికొత్త ఫక్కీలో తెలుగు భారతి నొసట వీర రస గంగాధర తిలకాలు దిద్దాయి!
అందుకే తెలుగు బుర్రకథను రమ్యమైన కళాఖండంగా తీర్చిదిద్ది దేశాన్ని ఊపివేసిన నాజర్ కూడా పాణిగ్రాహి, గద్దర్ ప్రయోగాలను కళ్ళ కద్దుకున్నాడు. కథకు, వర్ణనకు, హాస్యా నికి, గంభీరతకు, రౌద్రానికి, కరుణకు, కాఠిన్యానికి, బీభత్సానికి, రమ్యతకు, సభ్యతకు – ఒకటేమిటి, నవరసాలకు మించిన నవ్య పోషణకు నగలు తొడిగే సామాన్యుని నాగరికతా సంస్కృతుల నట్టింటి మాణిక్యంగా గద్దర్ బృందం దిద్ది తీర్చినదే జన నాట్యమండలి! అమరవీరులను తలచుకుంటూ అతను రాసిన ‘పాదాపాదాల పరిపరి దండాలు’, ‘సిరిమల్లె చెట్టుకింద’, ‘లాల్ సలామ్’ పాటలు, ఖవాలీ,సంగీత నృత్య రూపకాలు మరపురాని కళాస్మృతులు. గద్దర్, వంగపండు ప్రసాద్ (విశాఖ బాణీలో) ‘జజ్జనక జనారే’ అనే పాట విన్నప్పుడు ఈ జోస్టాలే 'Rumba' పాట గుర్తుకొస్తుంది! గద్దర్ అంగోలా కవి అగస్తినో నేటో లాంటివాడు. గద్దర్ రాష్ట్ర సరి హద్దులు దాటి, దండకారణ్యంలో దూకి, రాముడికి బదులు పరశు రాముడై సంచరించి, మణిపూర్, అస్సాం ఉద్యమాల ఊపిరిని కూడా పొదుగుకొని, భాషల అక్షరాభ్యాసం చేసి హైదరాబాద్‌లో మళ్ళీ పొద్దుపొడుపై వాలాడు!
ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు
– రచనా కాలం ఫిబ్రవరి 25, 1990
abkprasad2006@yahoo.co.in
మన ‘పాల్ రాబ్సన్’!
Published Sun, Aug 13 2023 12:27 AM | Last Updated on Sun, Aug 13 2023 5:13 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment