డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రపంచ మేధావి. భారత రాజ్యాంగ నిర్మాత. ఆయన పేరు పార్లమెంట్‌కు పెట్టడం సముచితమైంది. భారతదేశంలో కులం చట్రం నుండి బయటకు రాలేక చాలామంది దేశ నాయకులు ప్రపంచ మేధావులు కాలేక పోయారు. అంబేడ్కర్ ప్రపంచ మేధావిగా ఎదగ డానికి కారణం అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో సాగిన ఉన్నత విద్యాభ్యాసం, పరిశోధనలే. ఇక్కడ సంపాదించిన జ్ఞానంతోనే అస్పృశ్యత, లింగవివక్ష, మతమౌఢ్యాలన్నింటినీ ఎదిరించగలిగాడు. ప్రత్యామ్నాయ తత్వాన్ని రూపొందించగలిగాడు.
రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సుల్లోనూ, పార్లమెంట్ లోనూ, బహిరంగ వేదికల మీదా అనర్గళంగా మాట్లాడాడు. ఎన్నో పుస్తకాలు రాశాడు. హౌస్ ఆఫ్ కామన్స్ (బ్రిటిష్ పార్లమెంట్)లో ఆయన శత జయంతిని జరిపారంటే... ఆయన స్థాయి ఏమిటో అర్థమవుతుంది. ముక్కుసూటిదనం, తప్పును నిర్భయంగా ఖండించే తత్వం, అధ్యయన శీలత, దేశం పట్ల ప్రేమ ఆయన్ని దార్శనికునిగా నిలిపాయి. ఆయన 1951 అక్టోబర్ 29న పాటియా లాలో జరిగిన ఒక మహాసభలో మాట్లాడుతూ... ‘కాంగ్రెస్‌లో చేరాల్సిందిగా నాపై ఎంతో ఒత్తిడి తెచ్చారు. నా అస్పృశ్యులకు ఏమాత్రం మంచి పని చేయని పార్టీలో నేనెందుకు చేరాలి? నేను చేరలేదు సరికదా మంత్రి పదవికి కూడా రాజీనామా చేశాను. ఇతర మంత్రులను రాజీనామా చేయమని అడిగినట్లుగా నన్నెవరూ రాజీనామా చేయమని అడగలేదు. నాపై ఎటువంటి ఆరోపణలూ లేవు. ఎవరైనా నా శీలంపైన మచ్చపడే విధంగా ఏవైనా చెప్పమని ఛాలెంజ్ చేశా. నాపై వేలెత్తి చూపడానికి ఏ ఒక్కరూ సాహసించలేదు’ అన్నాడు.
ఇక రాజ్యాంగ రచన దగ్గరికొద్దాం. రాజ్యాం గాన్ని రాజ్యాంగ పరిషత్ రాసింది. రాజ్యాంగానికి ఒక రూపాన్ని ఇచ్చే నిమిత్తం ఏడుగురు సభ్యులతో ఒక ‘రాజ్యాంగ ముసాయిదా రూపకల్పన సంఘం’ ఏర్పాటు చేయబడింది. ఆ సంఘానికి అంబేడ్కర్ అధ్యక్షులు. వివిధ ఉప సంఘాలు పంపిన నివేదికలను క్రోడీకరించి, క్రమబద్ధీకరించి ఆ సంఘం రాజ్యాంగ ముసాయిదాను (చిత్తుప్రతి) తయారు చేసింది. 1948 జనవరిలో ఆ రాజ్యాంగ ముసాయిదా ప్రచురించబడి విడుదలయింది. ఆ ముసాయిదా రాజ్యాంగానికి 7,635 సవరణల ప్రతిపాదనలు వచ్చాయి. అయితే, వాటిలో కేవలం 2,473 సవరణలను మాత్రమే రాజ్యాంగ పరిషత్ చర్చించింది. మిగిలిన వాటిని తిరస్కరించింది. నూతన రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్ ఆమోదించగా, 1950 జనవరి 26 నుండి అమలులోకి వచ్చింది. దీంతో భారత్ గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించింది.
1947 ఏప్రిల్ 29వ తేదీన సమావేశమైన చట్ట సభలో అస్పృశ్యతను నిర్మూలిస్తూ తీర్మానం జరిగింది. దీనికి సంబంధించిన చిత్తుబిల్లును సర్దార్ వల్లభాయ్ పటేల్ చట్ట సభలో ప్రవేశపెట్టారు. ఇలా అస్పృశ్యతను చట్టరీత్యా నిర్మూలించే పరిస్థితి రావడానికి కారణం అంబేడ్కర్ మహోన్నతమైన కృషే కారణం. తరతరాలుగా అస్పృశ్యతలో మగ్గిపోతున్న ప్రజలకు ఈ చట్టం ఎంతో ఊరటను కలిగించింది. ఒక్క ఉదుటన వారు సంకెళ్ళను తెంచుకొని ప్రధాన స్రవంతి సమాజంలోకి పరుగులెత్తడానికి ఈ చట్టం రాచబాట వేసింది. అయితే ఈ కీర్తినంతా మహాత్మ గాంధీకి అంటగట్టాలని కాంగ్రెస్‌పార్టీ ఎంతో ప్రయత్నం చేసి విఫలమైంది. ఏ అస్పృశ్యతకైతే అంబేడ్కర్ గురి అయ్యారో ఆ అస్పృశ్యతా నివారణ చట్టాన్ని నిర్మించగలగడం, దాన్ని అగ్ర వర్ణాలు అధికంగా వున్న రాజ్యాంగ పరిషత్తులో నెగ్గేలా చేయడం అంబేడ్కర్ రాజనీతిజ్ఞతకు నిదర్శనం.
ఆయన తన ప్రత్యర్థులను, శత్రువుల్ని కూడా తన వాదనా పటిమతో, తన జ్ఞాన వికాసంతో, తన శాస్త్ర ప్రమాణాలతో ఒప్పించగలిగిన ధీశక్తి గలవాడు. భారతదేశంలో ఉన్న ప్రతి మనిషినీ ఆయన కులం నుండి బయటపడేయాలని ప్రయత్నం చేశాడు. కులం మనిషికి గీతలు గీస్తుందనీ, అతడు ఎదగాల్సిన దిశ నుండి ఎదగకుండా, హద్దుల్లో వుంచుతుందనీ, ఇవ్వాళ అస్పృశ్యులుగా చెప్ప బడుతున్న వారు ఆర్యుల చేత ఓటమి చెందిన జాతులే కాని అస్పృశ్యులు కాదనీ, వారు భారత్‌ను పాలించిన జాతులనీ నొక్కి వక్కాణించారు.
ఫ్రెంచి విప్లవం నుండి రూపొందిన స్వేచ్ఛ, సమానవత్వం, సౌభ్రాతృత్వ భావాలను ఆయన రాజ్యాంగంలో పొదిగారు. భారత పార్లమెంట్‌ను అత్యంత ఉన్నతమైన, ప్రజాస్వామ్య, లౌకిక, సామ్యవాద, భావజాల పూర్ణంగా రూపొందించారు. ఆయన నిర్మించిన ఈ ప్రజాస్వామ్య ‘భవనాని’కి ఆయన నామవాచకం పెట్టడం సముచితమైంది. అయోధ్యలోని రామ మందిరానికి రాముని పేరు పెడుతున్నారు కదా. అలాగే ఇదీ ప్రత్యా మ్నాయ భావజాలాల మానవతా మందిరం, మమతల సౌధం. అంబేడ్కర్ బౌద్ధ తత్వాన్ని జీర్ణించుకొన్న తాత్వికుడు. బౌద్ధ అంతస్సారమైన మానవత్వం, వ్యక్తిత్వ నిర్మాణం, అవినీతి రహిత జీవనం లాంటి భావాలన్నింటినీ ఆయన రాజ్యాం గంలో పొందుపరిచారు. అలా మౌఖిక దశలో వున్న బౌద్ధ ధర్మాలను చట్టరూపంలోకి తీసుకురా గలి గాడు. ఈ రాజ్యాంగ సౌధాన్ని ఎవరూ కదిలించలేరు. దానికి ప్రతివాదం చేసిన వారంతా ఆ వాదంలో ఇమిడి పోవాల్సిందే. (క్లిక్ చేయండి: అంబేడ్కర్ పేరు ఎందుకు పెట్టాలంటే...)
భారతదేశం ఈనాడు ప్రపంచం ముందు ప్రజాస్వామ్యం, ఆర్థిక స్వావలంబన, పౌర హక్కులు, స్త్రీ అభ్యున్నతి, రాజకీయ సమతుల్యత వంటి అనేక విషయాల్లో తల ఎత్తుకుని నిలబడిం దంటే అది అంబేడ్కర్ సిద్ధాంతాలు, ఆశయాలు, నిర్మాణ దక్షత వల్లనే. భారత ఉపఖండంలో చరిత్రను మార్చిన వారు బుద్ధుడు, అశోకుడు, అంబేడ్కర్. వారు చరిత్ర విస్మరించలేని విశ్వజనీనులు. అందుకే అశోకుడి ధర్మ చక్రం భారత పతాకలో చేరింది. బుద్ధుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించారు. అంబేడ్కర్ అస్తమించని సూర్యుడయ్యాడు. ఇప్పుడు పార్లమెంట్ భవనానికి ఆయన పేరే ఒక వెలుగు దివ్వె. ఆ వెలుగులో మనం నడుద్దాం!
- డాక్టర్ కత్తి పద్మారావు
‘అంబేడ్కర్ జీవిత చరిత్ర’ రచయిత
Comments
Please login to add a commentAdd a comment