భారత దేశంలో దళితులు, బీసీల వంటి సామాజికంగా వెనుకబడిన వర్గాలవారి ఉన్నతికి ప్రభుత్వ పరంగా ఇప్పుడు కొనసాగిస్తున్న అనేక సదుపాయాలు, హక్కులను 19వ శతాబ్దంలోనే తన కొల్హాపూర్ సంస్థాన ప్రజలకు అందించినవాడు సాహు మహరాజ్. 1894 ఏప్రిల్ 2న సింహాసనం అధిష్టించిన సాహు, వెనుకబడిన కులాల వారందరికీ పాఠశాలలు, వసతి గృహాలు ప్రారంభించి విద్యాబోధనను ఒక ఉద్యమంగా నడిపాడు.
1902 జులై 26, భారతదేశ చరిత్రలో ఒక చరిత్రాత్మక దినం. ఆ రోజు ఛత్రపతి సాహు మహారాజ్ ప్రభుత్వం, ప్రభుత్వోద్యోగాలన్నింటిలో వెనుకబడిన వర్గాల వారికి 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సంచలనాత్మక ఉత్తర్వులను జారీ చేసింది. గ్రామ పరిపాలన రంగంలో వంశపారం పర్యంగా వచ్చే ముఖ్యులైన పటేల్ (పాటిల్), పట్వారీ (కులకర్ణి) వ్యవస్థని 1918లో రద్దు చేశారు.
1919 సెప్టెంబర్ 6న అంటరానితనం పాటించడం నేరమని ప్రభుత్వం ప్రకటన ఇచ్చింది. 1920 మే 3వ తేదిన వెట్టిచాకిరీ వ్యవస్థను రద్దు చేస్తూ చట్టం చేశారు. అంబేడ్కర్ అస్పృశ్యుల హక్కుల సాధన కోసం స్థాపించిన ‘మూక్ నాయక్’ పత్రికకు ఆర్థిక సాయం చేశారు. 1920లో అంబేడ్కర్ ఇంగ్లాండ్ వెళ్లి చదువుకునేందుకు ఆర్థిక సహాయం చేశాడు. బాలికల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు ప్రారంభించాడు. 1919 జూన్‌లో బాల్య వివాహాల రద్దు చట్టం వచ్చింది.
1919 జులై 12న కులాంతర, వర్ణాంతర వివాహాలను చట్టబద్ధం చేస్తూ చట్టం తెచ్చాడు. విడాకులు మంజూరు చేయడంలో స్త్రీల నిర్ణయానికే ప్రాధాన్యతనిస్తూ 1919 ఆగస్టు 2న విడాకుల చట్టం చేశాడు. 1920 జనవరి 17న జోగిని, దేవదాసీ వ్యస్థను రద్దు చేశాడు. ప్రభుత్వం దేవదాసీల పునరావాసానికి చర్యలు తీసుకున్నాడు. 1918లో తన రాజ్యంలో వడ్డీ వ్యాపారాన్ని పూర్తిగా నిషేధిస్తూ సహకార సంఘాలను ఏర్పాటు చేశాడు. మహారాజుగా అనేక సంస్కరణలు తీసుకొచ్చిన రిజర్వేషన్ల పితామహుడు సాహు మహరాజ్ 1922 మే 6న మరణించాడు. – సంపత్ గడ్డం, కామారెడ్డి జిల్లా (నేడు సాహు మహరాజ్ జయంతి)
Comments
Please login to add a commentAdd a comment