Maharaj
-
బీసీలకు దామాషా ప్రకారం.. పదవులు దక్కాలి!
‘‘అణగారిన జనం సకాలంలో పురోగమించకపోతే కులం అనే విసుర్రాయి కిందపడి నలిగిపోతారని నేను భయపడుతున్నాను. అణగారిన కులాలను బలపరచట మంటే కుల విద్వేషాలను ప్రోత్సహించినట్లు కాదు. మనుషుల్ని వారి పుట్టుకను బట్టి హీనులుగా పరిగణించే పద్ధతి మనలో అంతరించిపోయిన రోజు నా జీవితంలో సంతోషకరమైన రోజు అవుతుంది’’ అన్న ఛత్రపతి సాహూ మహరాజ్... బలహీనవర్గాల వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్లు ఇస్తూ 1902 జులై 26న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రోజు భారత సామాజిక ఉద్యమాల చరిత్రలో బడుగులు మరిచి పోలేని రోజు..వందేళ్ళ క్రితమే సాహూ మహరాజ్ కొల్హాపూర్ సంస్థానంలో దళితులను గ్రామాల్లో పట్వారీలుగా నియమించారు. కానీ స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్ళ తర్వాత కూడా బీసీ కులాల గణన చేసి జనాభా దామాషా ప్రకారం చట్ట సభల సీట్లు కేటాయించమని అడుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. సమాజంలో సగానికి పైగా ఉన్న బీసీలు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాలు చేస్తున్నారంటే దేశంలో ఆధిపత్య వర్గాలు నేటికినీ పల్లెలను ఎంతగా తమ చేతుల్లో పెట్టుకుని అధికారాల్ని చలాయిస్తున్నారో అవగతమవుతుంది. కులగణన ఎన్నికల వాగ్దానంగా మిగిలిపోయిందంటే పాలకులు ఇప్పటి దాకా ఎంత నిర్లక్ష్యంగా పాలిస్తూ వస్తున్నారో తెలుస్తుంది.బడుగులు బాగుపడకుండా ఈ దేశం బాగుపడ దని తెలిసి కూడా దుందుడుకుగా వ్యవహరిస్తున్నారు. ‘బీసీ సబ్ ప్లాన్’ను పెట్టాలనీ, దానికి అత్యధిక నిధులివ్వాలనీ బీసీలు వూరేగింపులు చేస్తున్నారంటే ఇంతకంటే దేశానికి దరిద్రం మరేముంటుంది! కులగణనను కాంగ్రెస్ తాత్సారం చేస్తుంటే, బీజేపీ కులగణన చేయనని చెబుతోంది. దేశంలో సగానికి పైగా ఉన్న బీసీల హక్కుల కోసం చట్టసభలు మాట్లాడకుండా దాటవేస్తూ రావటం ప్రజాస్వామ్యాన్ని హననం చేసినట్లుగానే భావించాలి. సగం దేశంగా ఉన్న బీసీ కులాల జీవన విధానం ఎట్లా ఉందో తెలుసుకోకుండా దేశాన్ని అభివృద్ధి పథంలో ఎట్లా నడిపిస్తారో మన సర్వసత్తాక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్య పాలకులే చెప్పాలి.దేశాన్ని మొత్తం ఆవరించి ఉన్న బీసీ ఉత్పత్తి కులాలు ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాలలో కీలక స్థానాలలోకి, నాయకత్వ దశకు రాకుండా దేశం అభివృద్ధి చెందదు. ఆధిపత్య కులాల పెట్టుబడి దారుల చేతుల్లో అధికార పగ్గాలు ఉన్నంత కాలం బీసీలు దుర్భరమైన పరిస్థితుల్లోనే మగ్గిపోక తప్పదు. దేశం అన్ని రంగాల్లోకి దూసుకు పోవాలంటే దేశాన్ని ప్రభావితం చేయగల బీసీలు అన్నిరంగాల్లో శిరసెత్తుకుని నిలవాలి. ఉత్పత్తి కులాల చేతులు పడకుండా దేశం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు.మనం చైనా దేశ జనాభాను దాటి ముందుకొచ్చాం. ఉత్పత్తి శక్తుల చేతుల్లోకి దేశ ప్రగతి రథచక్రాలు వచ్చినప్పుడే చైనా ప్రగతిని మించి ముందుకు సాగుతాం. నేటికినీ బడుగు వర్గాలకు, ఉత్పత్తి కులాలకు పాలించే లక్షణాలు లేవని మాట్లాడటం ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసినట్లే అవుతుంది. ఉత్పత్తి కులాలు ఉత్పత్తి శక్తులై పారిశ్రామికవేత్తలుగా తయారైనప్పుడే దేశం అన్ని రంగాల్లో అసలు సిసలు ప్రగతిని సాధిస్తుంది. దేశాన్నీ, రాష్ట్రాన్నీ పాలించే పాలకులు సాహూ మహరాజ్ లాగా ఆలోచించాలి. ఆధిపత్య వర్గాల నాయకులు తమ హ్రస్వదృష్టిని విడిచిపెట్టి బడుగుల భవిష్యత్తు మీద దృష్టి పెట్టాలి. తమ కులం గొప్పదని, బడుగుల కులాలు తక్కువన్న దుర్మార్గపు ఆలోచన నుంచి ఆధిపత్య కులాలు బైట పడాలి.బడుగుల బాగే దేశం బాగు అని ఆలోచించగలిగినవారే సాహూ మహారాజులు కాగలుగుతారు. సమ రాజ్యాన్ని నిర్మించగలుగుతారు. బహుజన హితం కోరి దేశం అభివృద్ధిని కాంక్షించి బడుగులకు పల్లెనుంచి పార్లమెంటు దాకా వాళ్ళ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు ఇవ్వాలి. స్థానిక సంస్థల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని వాగ్దానం చేసిన కాంగ్రెస్ వాళ్ళ జనాభా ఎంతో అంత శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి. కుల గణన చేస్తామని తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ బీసీల కుల గణన చేసినాకే స్థానిక సంస్థల ఎన్నికల్లోకి పోవాలన్నది బీసీల సామూహిక డిమాండ్. తమ వాటా స్థానాలను కోల్పోయిన బీసీలు తమ హక్కుల సాధనకు వారే గొంతెత్తి గర్జించాలి.– జూలూరు గౌరీశంకర్, వ్యాసకర్త తెలంగాణ రాష్ట్ర తొలి బీసీ కమిషన్ సభ్యులు (బలహీన వర్గాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్లు ఇస్తూ సాహు మహారాజ్ ఉత్తర్వులు జారీ చేసిన రోజు... జూలై 26) -
ఆ సీన్ చేసేటప్పుడు బయటకు పరిగెత్తా: అర్జున్ రెడ్డి హీరోయిన్
అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ షాలిని పాండే. ఆ తర్వాత మహానటి, ఇద్దరి లోకం ఒకటే చిత్రాల్లోనూ మెరిసింది. ప్రస్తుతం బాలీవుడ్లో బిజీగా ఉన్న షాలిని.. ఇటీవల మహారాజ్ మూవీతో ప్రేక్షకులను పలకరించింది. సిద్ధార్థ్ మల్హోత్రా దర్శకత్వం వహించిన మహారాజ్ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ జునైద్ ఖాన్, జైదీప్ అహ్లావత్ ప్రధాన పాత్రల్లో నటించారు.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన షాలిని పాండే పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఈ సినిమాలోని ఇంటిమేట్ సీన్ గురించి మాట్లాడింది. ఈ చిత్రంలో కిషోరి పాత్రను పోషించిన నటి షాలిని పాండే లైంగికపరమైన సీన్లో కనిపించారు. ఆ సన్నివేశంలో తన అనుభవం గురించి వెల్లడించింది.ఆ సీన్ చేసేటప్పుడు ఆకస్మాత్తుగా బయటకు వెళ్లానని తెలిపింది. అయితే అది నాపై ఎలాంటి ప్రభావం చూపిందో తెలియదు కానీ.. నాకు చీకటి గదిలో ఉండాలంటే భయమని షాలిని వెల్లడించింది. తనకు కొంత సమయం, ప్రశాంతమైన వాతావరణం కావాలని డైరెక్టర్‌ను అడిగానని వివరించింది. దీంతో వారు వెంటనే నా పరిస్థితిని అర్థం చేసుకున్నారని షాలిని పేర్కొంది. కాగా.. సిద్ధార్థ్ మల్హోత్రా దర్శకత్వం వహించిన మహారాజ్లో జైదీప్ అహ్లావత్ స్త్రీలపై అత్యాచారం చేసే పాత్రలో కనిపిస్తాడు. 1800 కాలంలో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. -
రిజర్వేషన్ల పితామహుడు..
భారత దేశంలో దళితులు, బీసీల వంటి సామాజికంగా వెనుకబడిన వర్గాలవారి ఉన్నతికి ప్రభుత్వ పరంగా ఇప్పుడు కొనసాగిస్తున్న అనేక సదుపాయాలు, హక్కులను 19వ శతాబ్దంలోనే తన కొల్హాపూర్ సంస్థాన ప్రజలకు అందించినవాడు సాహు మహరాజ్. 1894 ఏప్రిల్ 2న సింహాసనం అధిష్టించిన సాహు, వెనుకబడిన కులాల వారందరికీ పాఠశాలలు, వసతి గృహాలు ప్రారంభించి విద్యాబోధనను ఒక ఉద్యమంగా నడిపాడు.1902 జులై 26, భారతదేశ చరిత్రలో ఒక చరిత్రాత్మక దినం. ఆ రోజు ఛత్రపతి సాహు మహారాజ్ ప్రభుత్వం, ప్రభుత్వోద్యోగాలన్నింటిలో వెనుకబడిన వర్గాల వారికి 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సంచలనాత్మక ఉత్తర్వులను జారీ చేసింది. గ్రామ పరిపాలన రంగంలో వంశపారం పర్యంగా వచ్చే ముఖ్యులైన పటేల్ (పాటిల్), పట్వారీ (కులకర్ణి) వ్యవస్థని 1918లో రద్దు చేశారు.1919 సెప్టెంబర్ 6న అంటరానితనం పాటించడం నేరమని ప్రభుత్వం ప్రకటన ఇచ్చింది. 1920 మే 3వ తేదిన వెట్టిచాకిరీ వ్యవస్థను రద్దు చేస్తూ చట్టం చేశారు. అంబేడ్కర్ అస్పృశ్యుల హక్కుల సాధన కోసం స్థాపించిన ‘మూక్ నాయక్’ పత్రికకు ఆర్థిక సాయం చేశారు. 1920లో అంబేడ్కర్ ఇంగ్లాండ్ వెళ్లి చదువుకునేందుకు ఆర్థిక సహాయం చేశాడు. బాలికల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు ప్రారంభించాడు. 1919 జూన్‌లో బాల్య వివాహాల రద్దు చట్టం వచ్చింది.1919 జులై 12న కులాంతర, వర్ణాంతర వివాహాలను చట్టబద్ధం చేస్తూ చట్టం తెచ్చాడు. విడాకులు మంజూరు చేయడంలో స్త్రీల నిర్ణయానికే ప్రాధాన్యతనిస్తూ 1919 ఆగస్టు 2న విడాకుల చట్టం చేశాడు. 1920 జనవరి 17న జోగిని, దేవదాసీ వ్యస్థను రద్దు చేశాడు. ప్రభుత్వం దేవదాసీల పునరావాసానికి చర్యలు తీసుకున్నాడు. 1918లో తన రాజ్యంలో వడ్డీ వ్యాపారాన్ని పూర్తిగా నిషేధిస్తూ సహకార సంఘాలను ఏర్పాటు చేశాడు. మహారాజుగా అనేక సంస్కరణలు తీసుకొచ్చిన రిజర్వేషన్ల పితామహుడు సాహు మహరాజ్ 1922 మే 6న మరణించాడు. – సంపత్ గడ్డం, కామారెడ్డి జిల్లా (నేడు సాహు మహరాజ్ జయంతి) -
స్వామీ స్మరణానంద ఎవరు? ప్రధాని మోదీ ఎందుకు పరామర్శించారు?
కోల్‌కతా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న స్మామీ స్మరణానందను పరామర్శించారు. రామకృష్ణ మఠం 16వ అధ్యక్షుడు స్వామీ స్మరణానంద కోల్‌కతాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కోల్‌కతా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు ఆస్పత్రిని సందర్శించారు. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని షేర్ చేస్తూ, పలు ఫొటోలను పంచుకున్నారు. రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామీ స్మరణానంద మహరాజ్ ఆరోగ్యం గురించి ఆరా తీయడానికి తాను ఆసుపత్రికి వెళ్లానని పీఎం మోదీ పేర్కొన్నారు. ఆయన ఆరోగ్యం బాగుండాలని, త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామన్నారు. ఆసుపత్రి సందర్శన సమయంలోప్రధాని మోదీ నోటికి మాస్క్ ధరించారు. అలాగే చెప్పులు లేకుండా ఆసుపత్రి గదిలోనికి వెళ్లారు. రామకృష్ణ మఠం 16వ అధ్యక్షుడు స్వామీ స్మరణానంద... స్వామి ఆత్మస్థానానంద పరమపదించిన అనంతరం 2017 జూలై 17న అధ్యక్ష పదవిని చేపట్టారు. స్వామి స్మరణానంద తమిళనాడులోని తంజావూరులోని అందమి గ్రామంలో 1929లో జన్మించారు. 20 ఏళ్ల వయస్సులో ఆయనకు రామకృష్ణ మఠంతో పరిచయం ఏర్పడింది. 1952లో తన 22 ఏళ్ల వయసులో ఆయన సన్యాసం స్వీకరించారు. Upon reaching Kolkata, went to the hospital and enquired about the health of the President of Ramakrishna Math and Ramakrishna Mission, Srimat Swami Smaranananda ji Maharaj. We are all praying for his good health and quick recovery. pic.twitter.com/2jammDbWsH — Narendra Modi (@narendramodi) March 5, 2024 -
ఛత్రపతి శివాజీ శౌర్యానికి మారుపేరని ఎందుకంటారు?
ఛత్రపతి శివాజీ భారతదేశాన్ని మొఘలుల బారి నుండి విముక్తి చేసి, మరాఠా సామ్రాజ్యానికి పునాది వేశాడు. మొఘలులకు వ్యతిరేకంగా యుద్ధానికి దిగిన శివాజీ శౌర్య పరాక్రమాలు చరిత్రలోని బంగారు పుటలలో నిక్షిప్తమయ్యాయి. భారతదేశంలో శివాజీ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. నేటికీ ఛత్రపతి శివాజీని శౌర్యానికి ప్రతీకగా చెబుతుంటారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని ప్రతియేటా ఫిబ్రవరి 19 న జరుపుకుంటారు. శివాజీ 1630, ఫిబ్రవరి 19న శివనేరి కోటలోని మరాఠా కుటుంబంలో జన్మించాడు. శివాజీ పూర్తి పేరు శివాజీ భోంస్లే. అతని తండ్రి పేరు షాజీ భోంస్లే, తల్లి పేరు జిజియాబాయి. శివాజీ తండ్రి అహ్మద్‌నగర్ సుల్తానేట్‌లో పనిచేసేవారు. శివాజీ తల్లికి మతపరమైన గ్రంథాలపై అమితమైన ఆసక్తి ఉండేది. ఇదే శివాజీ జీవితంపై ప్రభావం చూపింది. మహారాజ్ శివాజీ జన్మించిన కాలంలో దేశంలో మొఘలుల దండయాత్ర కొనసాగుతోంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ తన 15 ఏళ్ల వయసులో మొఘలులపై తన మొదటి దాడిని చేశాడు. హిందూ సామ్రాజ్య స్థాపన కోసమే ఈ దాడి జరిగింది. దీనినే గెరిల్లా వార్ఫేర్ విధానం అంటారు. శివాజీ ఈ కొత్త తరహా యుద్ధానికి ప్రాచుర్యం కల్పించారు. గెరిల్లా వార్ఫేర్ సూత్రం ‘హిట్ అండ్ రన్‌వే’. శివాజీ బీజాపూర్‌పై తన గెరిల్లా యుద్ధ నైపుణ్యంతో దాడిచేసి అక్కడి పాలకుడు ఆదిల్షాను ఓడించి, బీజాపూర్‌ను కూడా స్వాధీనం చేసుకున్నాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ 1674లో పశ్చిమ భారతదేశంలో మరాఠా సామ్రాజ్యానికి పునాది వేశాడు. ఈ సమయంలోనే శివాజీ అధికారికంగా మరాఠా సామ్రాజ్య చక్రవర్తిగా పట్టాభిషిక్తుడయ్యాడు. ఛత్రపతి శివాజీని ‘మరాఠా గౌరవ్’ అని కూడా పిలిచేవారు. శివాజీ తీవ్ర అనారోగ్యంతో 1680 ఏప్రిల్ 3న కన్నుమూశాడు. అనంతరం ఆయన కుమారుడు శంభాజీ రాజ్యాధికారాన్ని చేపట్టాడు. -
జైన గురువు ‘సల్లేఖనం’
రాజ్‌నందన్‌గావ్: ప్రముఖ జైన గురువు ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ ‘సల్లేఖన’ వ్రతం ద్వారా శరీరత్యాగం చేశారు. రాజ్‌నందన్‌గావ్ జిల్లా డొంగార్‌గఢ్‌లోని చంద్రగిరి తీర్థ్‌లో ఆదివారం ఉదయం ఆయన తుదిశ్వాస వదిలారని తీర్థ్ ఒక ప్రకటనలో తెలిపింది. గత ఆరు నెలలుగా మహారాజ్ దొంగార్‌గఢ్ తీర్థ్‌లోనే ఉంటున్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మూడు రోజులుగా సల్లేఖన దీక్షను పాటిస్తున్నారు. జైన మతాచారం ప్రకారం సంపూర్ణ ఉపవాస దీక్ష (సల్లేఖనం)తో శరీరం వదిలారు. ఆత్మ శుద్ధీకరణార్థం ఈ దీక్ష చేపట్టారు’’ అని తీర్థ్ తెలిపింది. తీర్థ్‌లోనే అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తదితరులు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. -
అది శత్రువును నిలువునా చీల్చే శివాజీ ఆయుధం.. త్వరలో లండన్ నుంచి భారత్‌కు..
ఛత్రపతి శివాజీ మహారాజ్ వినియోగించిన ఆయుధం ‘బాఘ్ నఖ్’(పులి గోరు) వందల ఏళ్ల తరువాత తిరిగి భారత్ చేరుకోనున్నది. శివాజీ 1659లో బీజాపూర్ సుల్తానేట్ కమాండర్ అఫ్జల్ ఖాన్‌ను అంతమెందించడానికి ఈ ఆయుధాన్ని వినియోగించారు. అనంతర కాలంలో బ్రిటిష్ అధికారి దానిని బహుమతిగా బ్రిటన్‌కు తీసుకెళ్లారు. ఇప్పుడు ఆ ఆయుధాన్ని భారత్‌కు తిరిగి ఇచ్చేందుకు బ్రిటన్ అంగీకరించినట్లు సమాచారం. మహారాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి సుధీర్ ముంగంటివార్ సెప్టెంబరు 2023 చివరిలో లండన్‌ను సందర్శించనున్నారు. అప్పుడు ఈ ఆయుధాన్ని భారత్‌కు తిరిగి తీసుకువచ్చేందుకు ప్రయత్నించనున్నారు. ఈ సందర్భంగా ఆయన విక్టోరియా, ఆల్బర్ట్ మ్యూజియంతో అవగాహన ఒప్పందంపై సంతకం చేయనున్నారు. ఈ ఆయుధం ఈ మ్యూజియంలో ఉంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాదిలోనే ‘బాఘ్ నఖ్’ భారత్ చేరుకోనుంది. మహారాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి సుధీర్ ముంగంటివార్ మీడియాతో మాట్లాడుతూ బ్రిటీష్ అధికారుల నుంచి తమకు లేఖ వచ్చిందని, ఛత్రపతి శివాజీ మహారాజ్‌కు చెందిన ‘వాఘ్‌నఖ్’ను తిరిగి ఇవ్వడానికి వారు అంగీకరించారని తెలిపారు. తాము యుకె వెళ్లాక అక్కడ ప్రదర్శనలో ఉన్న శివాజీ జగదాంబ ఖడ్గం తదితర వస్తువులను తీసుకువచ్చేందుకు కూడా పరిశీలిస్తామన్నారు. 1659 నవంబర్ 10న అఫ్జల్ ఖాన్ హత్య గ్రెగోరియన్ క్యాలెండర్ ఆధారంగా చూస్తే అఫ్జల్ ఖాన్ హత్య 1659 నవంబర్ 10న జరిగిందని సుధీర్ తెలిపారు. కాగా ఛత్రపతి శివాజీ మహరాజ్ వినియోగించిన బాఘ్ నఖ్ చరిత్రలో అమూల్యమైన నిధి అని, రాష్ట్ర ప్రజల మనోభావాలు దీనితో ముడిపడి ఉన్నాయని సుధీర్ పేర్కొన్నారు. కాగా మంత్రి ముంగంటివార్‌తో పాటు సాంస్కృతిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ వికాస్ ఖర్గే, స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియమ్స్ డైరెక్టర్ డాక్టర్ తేజస్ గార్గే లండన్‌కు వెళ్లనున్నట్లు సాంస్కృతిక శాఖ తెలిపింది. ఈ ముగ్గురు సభ్యుల బృందం సెప్టెంబర్ 29 నుండి అక్టోబర్ 4 వరకు ఆరు రోజుల పర్యటన కోసం బ్రిటన్‌కు వెళ్లనుంది. ఆయుధాన్ని తీసుకెళ్లిన బ్రిటీష్ అధికారి ఉక్కుతో తయారైన ఈ ఆయుధానికి నాలుగు గోళ్లు ఉన్నాయి. మహారాష్ట్ర అధికారులు తెలిపిన వివరాల ప్రకారం వాఘ్ నఖ్ పిడికిలితో పట్టుకునే బాకు. సింహం, పులి, చిరుత గోళ్లను పోలినట్టు వీటిని తయారు చేశారు. ఇది శత్రువు చర్మం, కండరాలను చీల్చివేయడానికి రూపొందించారు. ఈ పులి గోరు శివాజీ వారసుల వద్ద ఉండేది. 1818లో దీనిని బ్రిటిష్ అధికారి జేమ్స్ గ్రాంట్ డఫ్ బహుమతిగా అందుకున్నాడు. ఆ సమయంలో డఫ్‌ను సతారా రాష్ట్ర రెసిడెంట్ పొలిటికల్ ఏజెంట్‌గా ఈస్ట్ ఇండియా కంపెనీ పంపింది. అతను 1818 నుండి 1824 వరకు సతారాలో పనిచేశాడు. ఆయన ఆ పులి పంజా ఆయుధాన్ని తనతో పాటు బ్రిటన్‌కు తీసుకెళ్లారు. అక్కడ అతని వారసులు దానిని ఆల్బర్ట్ మ్యూజియానికి విరాళంగా ఇచ్చారు. ఇది కూడా చదవండి: మేరీ మిల్బెన్ ఎవరు? ఆమె ప్రధాని మోదీకి ఎందుకు మద్దతు పలికారు? -
బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్: తలసాని
బంజారాహిల్స్ (హైదరాబాద్): తన జాతిని సన్మార్గంలో నడిపించి భారత్‌లోని దాదాపు 11 కోట్ల బంజారాలకు సంత్ సేవాలాల్ మహారాజ్ ఆరాధ్య దైవంగా మారారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. బంజారాహిల్స్‌లోని బంజారా భవన్లో బుధవారం నిర్వహించిన సంత్ సేవాలాల్ మహారాజ్ 284వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రకృతి ఆరాధన, ఆధ్యాత్మిక దృక్పథం, సామాజిక సాంస్కృతిక జీవన విధానాన్ని కాపాడటం కోసం సేవాలాల్ మహారాజ్ ఎంతో కృషి చేశారని చెప్పారు. తెలంగాణ వస్తే అణగారిన వర్గాల అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి తగిన గుర్తింపు దక్కుతుందనడానికి సేవాలాల్ జయంతిని అధికారికంగా ప్రభుత్వం నిర్వహించడమే నిదర్శనమన్నారు. ఉత్సవాల నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.కోటి మంజూరు చేసిందని తెలిపారు. మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం బంజారా, లంబాడా వర్గాలకు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. రాష్ట్రంలోని తాండాలను గ్రామ పంచాయితీలుగా మార్చి.. ‘మా తండాలో మా రాజ్యం’అనే గిరిజనుల చిరకాల ప్రజాస్వామిక ఆకాంక్షను నెరవేర్చిందని చెప్పారు. గిరిజన విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందించేందుకు రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. -
రేప్ బెదిరింపులతోనే భయ్యూ ఆత్మహత్య
ఇండోర్: మధ్యప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక గురువు భయ్యూ మహరాజ్(50) ఆత్మహత్య వెనుక మిస్టరీ వీడింది. తనను పెళ్లి చేసుకోకుంటే రేప్ కేసు పెడతానని సేవకురాలు పలక్ పురాణిక్(25) బెదిరించడంతోనే 2018, జూన్ 12న భయ్యూ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారని ఇండోర్ డీఐజీ మిశ్రా తెలిపారు. తగు సాక్ష్యాలు ఉన్నాయన్నారు. ఆశ్రమానికి చెందిన వినాయక్(42), శరద్(34)లు పలక్‌తో చేతులు కలిపి భయ్యూ మహారాజ్‌కు హైడోస్ మందులు ఇచ్చారని వెల్లడించారు. వీరంతా కలిసి ఆయన్ను ఆత్మహత్యకు పురిగొల్పా రని వ్యాఖ్యానించారు. ఈ ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా, 15 రోజుల కస్టడీకి కోర్టు అప్పగించిందన్నారు. -
ఆమె నా కూతురులాంటిది: దాతి బాబా
సాక్షి, న్యూఢిల్లీ : తానే స్వయంగా దేవుడి అవతారం అని చెప్పుకునే దాతి మహారాజ్ బాబాపై ఇటీవల ఢిల్లీ పోలీసులు ఓ మహిళ చేసిన ఫిర్యాదుతో అత్యాచార నేరం కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై దాతీ బాబా స్పందించారు. ఆమె నా కూతురులాంటిది. నాపై ఫిర్యాదు చేసినందుకు ఆమెపై నేను ఎలాంటి చర్యలు తీసుకోనని తెలిపారు. ఒక వేళ నాకు శిక్ష పడినా నేను ఆమెను ఏమీ అనలేనన్నారు. నేను నిజంగా తప్పు చేశానని రుజువైతే శిక్షించడానికి న్యాయస్థానాలు ఉన్నాయన్నారు. విచారణకు నేను పూర్తిగా సహకరిస్తానని తెలిపారు. మహారాజ్ ఆశ్రమం శనిధామ్‌లో రెండు సంవత్సరాల క్రితం తాను అత్యాచారానికి గురైనట్టు ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో దాతీబాబాపై ఐపీసీ 376, 377, 354, 34 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. విచారణ మొత్తం పూర్తయ్యే వరకూ ఆయన దేశం విడిచి పోరాదని పోలీసులు ఆదేశించారు. ఈయన ఉత్తర భారతదేశంలోనే పాపులర్ బాబా. -
భయ్యూ వెయ్యి కోట్ల ఆస్తి వినాయక్‌కు
ఇండోర్ : మానసిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్న ఆధ్యాత్మిక గురువు భయ్యూ మహారాజ్‌కు దాదాపు రూ.1000 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆత్మహత్య రోజు ఆయన రాసిన సూసైడ్ నోట్లో ఈ విషయాన్ని గుర్తించినట్లు ఇండోర్ డీఐజీ హరి నారాయణచారి మిశ్రా తెలిపారు. ఆ ఆస్తులకు సర్వహక్కులు భయ్యూ నమ్మిన బంటు వినాయక్‌కు చెందాలని తన సూసైడ్ నోట్లో రాసుకున్నట్లు వెల్లడించారు. దీని ప్రకారం భయ్యూ మహారాజ్ పేరున ఉన్న ఆస్తులు ఇకపై వినాయక్‌కు చెందుతాయని మిశ్రా స్పష్టం చేశారు. వినాయక్ గత పదిహేనేళ్లుగా భయ్యూ మహారాజ్‌కు నమ్మిన బంటుగా ఉన్నారు. ఆయన చేసే ప్రతిపనిలో వినాయక్ పాలుపంచుకున్నారు. ఈ కారణంగానే యావదాస్తిని వినాయక్‌కు చెందేలా సూసైట్ నోట్ రాశారని భావిస్తున్నారు. ఈ ఆస్తులపై భయ్యూ కుటుంబ సభ్యులకు ఎలాంటి హక్కులు ఉండవని డీఐజీ తెలిపారు. చట్టబద్ధంగా 1000 కోట్ల ఆస్తి ఉన్న భయ్యూకు లెక్కల్లో లేని ఇతర ఆస్తులు ఇంకా చాలా ఉండి ఉంటాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయం పడుతున్నారు. అయితే ఈ సూసైడ్ నోట్‌పై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ ఆస్తిని కాజేయండంలో భాగంగా కుట్ర పన్నుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇది చదవండి : అసలెవరీ భయ్యూజీ? ఆసక్తికర నిజాలు , ఆధ్యాత్మిక గురువు ఆత్మహత్యకు కారణం..? -
మిస్టరీ డెత్
-
‘భయ్యూజీ మరణానికి కారణం అదే...’
భోపాల్ : ప్రముఖ ఆధ్యాత్మిక గురువు భయ్యూజీ మహారాజ్ ఆత్మహత్య చేసుకోవడానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వమే కారణమని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని ప్రభుత్వం నర్మదా నది తీరంలో చేపట్టిన అక్రమ తవ్వకాల గురించి భయ్యూజీ ప్రశ్నించేవారని.. అయితే తమ అవినీతి గురించి నోరు విప్పకుండా ఉండేందుకు ఆయనకు మంత్రి పదవి ఆశ చూపినా లొంగలేదని వ్యాఖ్యానించారు. ఈ విషయం గురించి భయ్యూజీ తనతో ఫోన్లో మాట్లాడారని దిగ్విజయ్ సింగ్ అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్‌ను తిరస్కరించడం వల్లే ఆయనను మానసిక క్షోభకు గురి చేసి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారని ఆరోపించారు. కాగా భయ్యూజీ మహారాజ్ మంగళవారం ఇండోర్‌లోని తన నివాసంలో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన గదిలో ఓ నోట్‌ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నానని, కుటుంబ బాధ్యతలను ఎవరైనా తీసుకోవాలని భయ్యూజీ నోట్లో రాశారు. నోట్లోని దస్తూరీ మహారాజ్‌దే అని ఆయన కుటుంబ సభ్యులు నిర్ధారించారు. -
అసలెవరీ భయ్యూజీ? ఆసక్తికర నిజాలు
ఇండోర్ : ఆధ్యాత్మిక భోదనలు చేసే గురు భయ్యూజీ మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. మధ్యప్రదేశ్‌లో బాగా పాపులర్ అయినా, ఈయన గురించి ఇతర రాష్ట్రాల వారికి అంతగా తెలియదు. ఆధ్యాత్మిక, శాంతి బోధనలు చేసే గురువే ఆత్మహత్యకు పాల్పడంతో ఆయన మరణ వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. గురు భయ్యూజీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.. భయ్యూజీ అసలు పేరు ఉదయ్ సింగ్ దేశ్‌ముఖ్. 1968లో మధ్యప్రదేశ్‌లోని శాజాపూర్ జిల్లా శుజల్పూర్లో జమిందార్ వంశంలో జన్మించారు. మొదట ఒక ప్రైవేట్ ఉద్యోగం చేసిన భయ్యూజీ, తర్వాత మోడల్‌గా మారారు. ప్రముఖ వస్త్రాల బ్రాండ్ సియారామ్స్కు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా చేశారు. భయ్యూజీకి, మాధవితో వివాహం జరిగింది. వీరికి ఒక కూతురు కూడా ఉంది. 2015లో భార్య మాధవి చనిపోగా, 2017లో డాక్టర్ ఆయుషి శర్మను రెండో వివాహం చేసుకున్నారు. 1999లో ‘సద్గురు దత్తా ధార్మిక్ పర్మార్థిక్’ అనే ట్రస్ట్‌ను నెలకొల్పారు. ఇండోర్‌లోని భయ్యూజీ ఆశ్రమాన్ని ప్రధాని నరేంద్రమోదీ, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్, రాజ్ థాక్రే, లెజెండరీ సింగర్స్ లతా మంగేష్కర్, ఆశా భోంస్లేలు సందర్శించారు. ఈయన జీవన విధానం చాలా విలాసవంతంగా ఉండేది. మెర్సిడిస్ ఎస్యూవీ కార్లు, రోలెక్స్ చేతి గడియారాలు, గుర్రపు స్వారీలు, రిసార్ట్స్‌లో బసచేయడాలు అన్ని లగ్జరీగానే ఉండేవి. అవ్వడానికి ఆధ్యాత్మిక గురువైనప్పటికి రాజకీయంగా కూడా చాలా ప్రభావశాలిగా ఉండేవారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావు దేశ్‌ముఖ్‌కు భయ్యూజీకి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. అలాగే శివసేన వ్యవస్థాపకుడు బాల్‌థాక్రే, ఆయన కుమారుడు ఉద్ధవ్ థాక్రేతో కూడా ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భయ్యూజీ సన్నిహితంగా మెలిగే వారన్న విషయం తెలిసిందే. -
మరో ‘డేరా బాబా’పై రేప్ కేసు
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో మరో డేరా బాబా వెలుగులోకి వచ్చాడు. తానే స్వయంగా దేవుడి అవతారం అని చెప్పుకునే దాతి మహారాజ్ బాబాపై ఢిల్లీ పోలీసులు సోమవారం అత్యాచార నేరం కింద కేసు నమోదు చేశారు. వివరాలు.. మహారాజ్ ఆశ్రమం శనిధామ్‌లో రెండు సంవత్సరాల క్రితం తాను అత్యాచారానికి గురైనట్టు ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు సంవత్సరాల క్రితం తనపై లైంగిక దోపిడి జరిగినప్పటికి ప్రాణ భయం వల్ల, జీవితం అల్లరి పాలవుతుందని భయపడి అత్యాచార విషయాన్ని బయటికి చెప్పలేదని ఆమె తెలిపినట్టు పోలీసు వెల్లడించారు. అలాగే ఈ బాబాకు ఢిల్లీలోని ఫతేపూర్‌లో ఆఫీసు కూడా ఉంది. ఈయన ఉత్తర భారతదేశంలోనే పాపులర్ బాబా. -
బురిడీ బాబా హైడ్రామా
నెల్లూరు (వేదాయపాళెం): ఆధ్యాత్మిక ముసుగులో భక్తులను నయవంచనకు గురిచేసిన సుధాకర్ మహరాజ్ అలియాస్ టీచర్ సుధాకర్ అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు హైడ్రామా ఆడుతున్నారు. గత 13 రోజులుగా నగరంలోని సింహపురి ఆస్పత్రిలో వైద్యం పేరిట అజ్ఞాతంలోకి వెళ్లారు. వైద్య చికిత్సలకు సంబంధించి ఎప్పటికప్పుడు పరిస్థితిని బహిర్గతం చేయాల్సిన వైద్యులు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. నెల్లూరురూరల్ పోలీసులు కూడా కేసు దర్యాప్తును నీరుగారుస్తున్నారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. నగరంలోని ప్రశాంతినగర్‌లో ఉన్న సుధాకర్ మహరాజ్ ఆశ్రమంలో మంత్ర పీటం పేరిట 262 భక్తుల నుంచి రూ.3.72 కోట్ల వసూళ్లకు పాల్పడిన వ్యక్తులు అజ్ఞాతంలోకి వెళ్లిన వైనం గత నెల 15న వెలుగుచూసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి మోసపోయిన బాధితులు న్యాయం కోసం నెల్లూరు రూరల్ పోలీస్‌స్టేషన్, జిల్లా ఎస్పీలను కలిసి కోరుతున్నారు. అయితే నెల్లూరూరల్ పోలీసులు సుధాకర్‌మహరాజ్‌తోపాటు ఇందులో భాగస్వామ్యమైన వాసవి, భాస్కర్, నారాయణరెడ్డి, యశ్వంత్ సింగ్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సుధాకర్ మహరాజ్ ఆశ్రమం కార్యాలయంలో పనిచేసే సాయి, శ్రీనుపై కూడా విచారణ చేపడుతున్నారు. రాజకీయ నాయకులు, ప్రముఖులతో సుధాకర్‌కు పరిచయాలు, సాన్నిహిత్యం ఉన్న నేపథ్యంలో వీరి ఒత్తిడి పోలీసులపై ఉన్నట్లు తెలుస్తోంది. వాసవి, మిగతా వ్యక్తులు 13 రోజుల పాటు అజ్ఞాతంలో ఉన్నప్పటికీ పోలీసులు వీరి జాడను గుర్తించలేకపోతున్నారు. కళ్ల ముందు కనిపించే సుధాకర్‌ను సైతం ప్రశ్నించేందుకు చొరవ చూపడం లేదు. ఆస్పత్రిలో చేరిన కొద్ది రోజులు ఇంటెన్సీవ్ కేర్‌లో ఉన్న సుధాకర్‌ను ఇటీవల ప్రత్యేక గదిలోకి మార్చారు. సుధాకర్ అల్లుడు సంపత్ ఆస్పత్రి వద్ద ఉంటూ ఎవరినీ గదిలోకి పంపటం లేదు. నెల్లూరురూరల్ సీఐ శ్రీనివాసులు రెడ్డి ఒకటి రెండు సార్లు సుధాకర్‌ను విచారించేందుకు గదిలోకి వెళ్లినప్పటికీ సుధాకర్ సైగలు చేస్తూ సమాధానం చెప్పకపోవడంతో సీఐ వెనుదిరగాల్సి వచ్చింది. చిన్నపాటి దొంగతనాలు చేసే వ్యక్తులతో ఎంతో కఠనంగా వ్యవహరించే పోలీసులు బడా మోసానికి పాల్పడిన సుధాకర్‌ను తమదైన శైలిలో పోలీసులు ఎందుకు విచారణ సాగించడం లేదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉంటే సింహపురి ఆస్పత్రి యాజమాన్యం, వైద్యులను సుధాకర్ ఆరోగ్య పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని పోలీసులు కోరుతున్నప్పటికీ పోలీసులకు ఎలాంటి నివేదికలు అందలేదు. ఆస్పత్రిలో ఆశ్రయం పొందుతూ వైద్యం పేరిట సుధాకర్ బాధితుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కోర్టు ద్వారా బెయిల్ కోసం ప్రముఖ లాయర్లు ద్వారా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. బెయిల్ వచ్చే వరకు ఆస్పత్రిలోనే ఉంటూ కాలయాపన చేయాలనే భావనలో ఉన్నట్లు తెలుస్తుంది. బాధితులకు న్యాయం చేసే దిశగా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేయాల్సిన అవసరం ఉంది. మీడియా ప్రతినిధులు భాగస్వాములే నగరంలోని కొన్ని చానళ్ల ప్రతి నిధులు, పత్రికల విలేకరులు కూడా సుధాకర్ మహరాజ్‌కు కొమ్ము కాశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఓ చానల్లో పనిచేస్తున్న భాస్కర్ అనే వ్యక్తి భక్తుల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడ్డాడు. నెల్లూరురూరల్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయివుంది. నిందితుడు ఫరారీలో ఉన్నాడు. ఇదే తరహాలో పలు పత్రికల విలేకరుల కూడా సుధాకర్‌తో కుమ్మక్కు అయినట్లు తెలుస్తుంది. సుధాకర్‌తో సంబంధాలు ఉన్న మీడియా వారి వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. పురుగు మందు ఆశ్రమంలోకి ఎలా వచ్చింది!. సుధాకర్ ఆశ్రమంలో మోసాలు వెలుగు చూడడంతో ఒక్కసారిగా సుధాకర్ పురుగుమందు తాగాడని పెద్ద ఎత్తున హైడ్రామా ఆడుతూ హుటాహుటిన సింహపురి ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. ప్రశాంతతకు నెలవైన ఆశ్రమంలో పురుగు మందు డబ్బా ముందుగా ఎందుకు తేవాల్సి వచ్చిందో తెలియాల్సి ఉంది. ముందుగానే ఓ పథకం ప్రకారం పురుగు మందు డబ్బాను తెచ్చి ఉంచినట్లు తెలుస్తుంది. పరిస్థితి తల కిందులైనప్పుడు హైడ్రామాకు పురుగు మందు డబ్బా ఉపయోగపడుతుందని ముందస్తు వ్యూహంలో భాగంగానే వ్యవహరించారని తెలుస్తుంది. -
‘వాట్సాప్’ సందేశాలతో సమాధి కూల్చారు
సాక్షి, న్యూఢిల్లీ : పుణెకు సమీపంలోని ‘భీమా కోరేగావ్’లో ఘర్షణలు చెలరేగినప్పుడే ఆ గ్రామానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘వాడు బుద్రుక్’ గ్రామంలో కూడా ఘర్షణలు చెలరేగాయి. బుద్రుక్ గ్రామానికి కూడా చారిత్రక విశేషం ఉంది. మరాఠా చక్రవర్తి ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు సంభాజీ మహరాజ్ సమాధి ఈ గ్రామంలో ఉంది. (సాక్షి ప్రత్యేకం) వారి ప్రగతిశీల భావాలకుగాను ఈ ఇద్దరు రాజులను మరాఠాలతోపాటు దళితులు కూడా సమంగా ఆరాధిస్తూ వస్తున్నారు. ఇక్కడ ప్రచారంలో ఉన్న ఓ చారిత్రక కథ ప్రకారం మొగల్ చక్రవర్తి ఔరంగాజేబ్‌కు బద్ద శత్రువైన సంభాజీ మహరాజ్‌ను 1689లో హత్య చేయగా, ఆయన శరీర భాగాలు వాడు ముద్రుక్ గ్రామంలో చెల్లా చెదురుగా పడిపోయాయి. ఆ రాజుకు ఎవరు దహన సంస్కారాలు కూడా చేయకూడదంటూ ఢిల్లీ సుల్తాన్ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ ఉత్తర్వులకు స్థానిక ప్రజలు కూడా ఎక్కువ మంది భయపడి పోయారు. (సాక్షి ప్రత్యేకం) అప్పుడు బుద్రుక్ గ్రామానికే చెందిన మహర్ అనే దళితుడు గోవింద్ గైక్వాడ్ ముందుకు వచ్చి ధైర్యంగా మహరాజ్‌కు దహన సంస్కారాలు నిర్వహించారు. అందుకని ఆయన పేరిట గ్రామంలో ఓ స్మారక గహం వెలిసింది. భీమా కోరేగావ్ స్థూపాన్ని సందర్శించే వారంతా ఈ వాడు బుద్రుక్ గ్రామాన్ని కూడా సందర్శిస్తారు. ముందుగా సంభాజీ మహరాజ్ సమాధిని సందర్శించి, ఆ తర్వాత గైక్వాడ్ స్మారక భవనాన్ని సందర్శకులు సందర్శిస్తారని స్థానికులు తెలియజేస్తున్నారు. చాలా ఏళ్ల తర్వాత ఈసారి తమ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులను చూశామని పూర్తి పేరు వెల్లడించడానికి ఇష్టపడని గ్రామానికి చెందిన ఓ గైక్వాడ్ తెలిపారు. ఆరెస్సెస్ లాంటి సంస్థలు వాట్సాప్ ద్వారా హిందూ యువతను రెచ్చగొట్టడం వల్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయని తాము గ్రహించామని ఆయన చెప్పారు. (సాక్షి ప్రత్యేకం) ఘర్షణలను నివారించేందుకు ముందు జాగ్రత్తగా డిసెంబర్ 28వ తేదీనే గ్రామంలో ఓ శాంతి సమావేశాన్ని ఏర్పాటు చేశామని, ఎట్టి పరిస్థితుల్లో గొడవలు జరుగకుండా చూడాలని నిర్ణయించామన్నారు. ముఖ్యంగా ఎవరు రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దని, ఎట్టి పరిస్థితుల్లోనూ చేతుల్లోకి రాళ్లు, ఇతర ఆయుధాలు తీసుకోరాదని యువకులకు పిలుపునిచ్చామని గైక్వాడ్ తెలిపారు. శివప్రతిష్టాన్ నాయకుడు మనోహర్ అలియాస్ సంభాజీ భిడే (గురూజీ–85 ఏళ్లు), సమస్త హిందూ అఘదీ నాయకుడు మిలింద్ ఎక్బోటే (60) పిలుపుతో కొంత మంది ఆరెస్సెస్ కార్యకర్తలు డిసెంబర్ 30వ తేదీన వాడు ముద్రుక్‌లోని గోవింద్ గైక్వాడ్ సమాధిని ధ్వంసం చేయడంతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఢిల్లీ సుల్తానుల చేతుల్లో మరణించిన సంభాజీ మహరాజ్‌కు దళితుడైన గోవింద్ గైక్వాడ్ అంత్యక్రియలు నిర్వహించారని, అందుకే అక్కడ ఆయన స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేశారన్న విషయాన్ని జీర్ణించుకోలేకనే ఈ ఇద్దరు వద్ధ హిందూ నాయకులు గోవింద్ గైక్వాడ్ సమాధి ధ్వంసానికి ఆరెస్సెస్ కార్యకర్తలను వాట్సాప్ సందేశాల ద్వారా రెచ్చగొట్టినట్లు తెలుస్తోందని గైక్వాడ్ అభిప్రాయపడ్డారు. (సాక్షి ప్రత్యేకం) బీసీ నాయకుల డిమాండ్ మేరకు మహారాష్ట్ర పోలీసులు ఈ ఇరువురు హిందూ నాయకులపై కేసులు పెట్టారు. అయితే వారిని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. ఎక్బోటే, బిడేలు ఆరెస్సెస్‌తో లోతైన సంబంధాలు కలిగి ఉన్నవారు. అల్లర్లు నివారించేందుకు తాము ఎంత కషి చేసినా ఫలితం లేకపోవడం బాధాకరంగా ఉందని గైక్వాడ్ అన్నారు. దళితులే ముందుగా దాడికి దిగారని, అందుకే తాము ఎదురుదాడికి దిగాల్సి వచ్చిందని మరాఠాలు చెబుతున్నారని, తమ గ్రామంలో వంద మంది దళితులు ఉండగా, ఏడువేల మంది మరాఠాలు ఉన్నారని, అలాంటప్పుడు దళితులు దాడి చేయడం అటుంచి, రెచ్చగొట్టే పరిస్థితి కూడా లేదని గైక్వాడ్‌తోపాటు గ్రామంలో శాంతిని కోరుకుంటున్న కొందర పెద్దలు మీడియాతో వ్యాఖ్యానించారు. (సాక్షి ప్రత్యేకం) -
కుటుంబ నియంత్రణ పాటించ కుంటే ఓటు హక్కు వద్దు
బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ వ్యాఖ్యలు ఉన్నావ్(యూపీ): బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జనాభా పెరుగుదలను నియంత్రించాలంటే అందరూ కుటుంబ నియంత్రణ పాటించాలని, పాటించని వారికి ఓటుహక్కును రద్దు చేయాలని అన్నారు. హిందువుల్లాగే ముస్లింలూ కుటుంబ నియంత్రణ పాటించాలని, అందరికీ ఒకే చట్టం ఉండాలని డిమాండ్ చేశారు. ఉన్నావ్‌లో తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘నేను ముస్లింలు, క్రిస్టియన్లు తప్పకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకోవాలనడం లేదు. జనాభా పెరుగుదలను అడ్డుకోవాలంటే కు.ని. పాటించాల్సిందే. హిందువులు నలుగురు పిల్లల్ని కనాలంటే ఎంతో గొడవ చేశారు. అదే కొందరు నలుగురు భార్యల ద్వారా 40 మంది పిల్లల్ని కంటుంటే ఎవరూ ఏమీ అనరు’ అని అన్నారు. జనాభా పెరుగుదల దేశం ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యల్లో ఒకటని పేర్కొన్నారు. ‘ హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్లు.. ఎవరైనా కానీ అందరికీ ఒకే చట్టం ఉండాలి. ఒక్కరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు.. ఎందరు పిల్లలైనా సమాజంలోని అన్ని వర్గాలకు ఒకే చట్టం ఉండేలా చూడాలి. అందరికీ వర్తించేలా ఉమ్మడి చట్టం తేకుంటే దేశానికే నష్టం. ఇందుకు ప్రభుత్వం, ప్రతిపక్షం ముందుకు రావాలి. ఈ చట్టాన్ని పాటించనివారి ఓటు హక్కును రద్దు చేయాలి’ అని పేర్కొన్నారు. -
నలుగురు పిల్లల్ని కనాలి
హిందూ మహిళలకు బీజేపీ ఎంపీ మహరాజ్ సూచన మీరట్ /న్యూఢిల్లీ: జాతిపిత మహాత్మాగాంధీని చంపిన నాథురామ్ గాడ్సే గొప్ప దేశ భక్తుడని కొనియాడి పార్లమెంట్లో క్షమాపణలు చెప్పిన బీజేపీ ఎంపీ సాక్షీ మహరాజ్ మరో వివాదంతో తెరపైకి వచ్చారు. హిందూ మహిళలు ఒక్కొక్కరు కనీసం నలుగురు పిల్లల్ని కనాలని మంగళవారం మీరట్‌లో జరిగిన ఓ ఆధ్యాత్మిక సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘మేము గత ప్రభుత్వమిచ్చిన ‘హమ్ దో, హమారా ఏక్’ నినాదాన్ని స్వాగతిస్తున్నాం. ‘హమ్ దో ఔర్ హమారా’ అనే మరో నినాదాన్నీ వారిచ్చారు. కానీ ఇప్పుడు వీటితో ఎవరూ సంతృప్తి చెందడం లేదు. అమ్మాయిలను అమ్మాయిలే, అబ్బాయిలను అబ్బాయిలే వివాహాలు చేసుకోవడాన్ని గత ప్రభుత్వం ప్రోత్సహించింది. కానీ, ఇదంతా ఎందుకు? ప్రతి మహిళా కనీసం నలుగురు పిల్లల్ని కనాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వీరిలో ఒకరిని సాధువులకు ఇవ్వండి. మిగిలిన వారిని సైన్యానికి పంపండి’ అని మహరాజ్ అన్నారు. మండిపడ్డ విపక్షాలు.. మహరాజ్ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడ్డాయి. భారత దేశ జనాభా పెరుగుదల పద్ధతిని మార్చాలనుకుంటున్నారా? అని సంఘ్ పరివార్, నాయకులను హేళన చేశాయి. దీనిపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశాయి. 24 గంటలు గడిచినా ప్రధాని, హోంమంత్రి, ఆర్థికమంత్రి ఈ విషయంపై స్పందించకపోవడంపై విపక్షాలు మండిపడ్డాయి. ‘ఇది కొత్త జనాభా పద్ధతా? దేశం దీనికి సమాధానం కోరుకొంటోంది. కానీ, వారి నుంచి సమాధానం రాదని మాకు తెలుసు’ అని కాంగ్రెస్ ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ వ్యాఖ్యానించారు. కాగా, మహరాజ్ వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని, అది అతని వ్యక్తిగత అభిప్రాయమని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా భువనేశ్వర్‌లో అన్నారు.