
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ (ఫైల్ ఫొటో)
భోపాల్ : ప్రముఖ ఆధ్యాత్మిక గురువు భయ్యూజీ మహారాజ్ ఆత్మహత్య చేసుకోవడానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వమే కారణమని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని ప్రభుత్వం నర్మదా నది తీరంలో చేపట్టిన అక్రమ తవ్వకాల గురించి భయ్యూజీ ప్రశ్నించేవారని.. అయితే తమ అవినీతి గురించి నోరు విప్పకుండా ఉండేందుకు ఆయనకు మంత్రి పదవి ఆశ చూపినా లొంగలేదని వ్యాఖ్యానించారు. ఈ విషయం గురించి భయ్యూజీ తనతో ఫోన్‌లో మాట్లాడారని దిగ్విజయ్ సింగ్ అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్‌ను తిరస్కరించడం వల్లే ఆయనను మానసిక క్షోభకు గురి చేసి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారని ఆరోపించారు.
కాగా భయ్యూజీ మహారాజ్ మంగళవారం ఇండోర్‌లోని తన నివాసంలో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన గదిలో ఓ నోట్‌ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నానని, కుటుంబ బాధ్యతలను ఎవరైనా తీసుకోవాలని భయ్యూజీ నోట్‌లో రాశారు. నోట్‌లోని దస్తూరీ మహారాజ్‌దే అని ఆయన కుటుంబ సభ్యులు నిర్ధారించారు.