
హత్రాస్: హత్రాస్‌లో 121 మంది ప్రాణాలను బలి తీసుకున్న తొక్కిసలాట ఘటనపై ఆధ్యాత్మిక గురువు నారాయణ్ సాకార్ హరి అలియాస్ భోలె బాబాకు న్యాయ విచారణ కమిటీ క్లీన్ చిట్ ఇచ్చింది. గతేడాది జులై 2వ తేదీన ఈ దారుణం చోటుచేసుకుంది. దీనిపై యూపీ ప్రభుత్వం రిటైర్డు జస్టిస్ బ్రిజేశ్ కుమార్ శ్రీవాస్తవ్ సారథ్యంలో ముగ్గురు సభ్యుల జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. భోలె బాబా అసలు పేరు సూరజ్‌పాల్. అయితే, పోలీసులు నిందితుడి జాబితాలో సూరజ్‌పాల్ పేరును చేర్చలేదు. దర్యాప్తు సమయంలో గతేడాది అక్టోబర్‌లో కమిషన్ ఎదుట భోలె బాబా హాజరయ్యారు.
ఈ కమిటీ భోలెబాబాకు క్లీన్ చిట్ ఇస్తూ నివేదిక అందజేసిందని ఆయన లాయర్ ఏపీ సింగ్ వెల్లడించారు. కొందరు కుట్రదారులు భోలె బాబాను, యూపీ ప్రభుత్వం ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నించగా వారి ఎత్తుగడలను కమిషన్ బయటపెట్టిందన్నారు. ఇది సత్యానికి, విశ్వాసానికి లభించిన విజయంగా పేర్కొన్నారు. తొక్కిసలాట చోటుచేసుకున్న తర్వాత కార్యక్రమ ప్రధాన నిర్వాహకుడు ప్రకాశ్ మధుకర్ సహా 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జిని, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ కార్యక్రమానికి 80 వేల మందికి మాత్రమే అనుమతివ్వగా 2.50 లక్షల మందికి పైగా భక్తులు రావడంతోనే ఘోరం జరిగిందని యంత్రాంగం వాదించింది. కాగా, ఘటన వెనుక కుట్ర కోణం ఉందంటూ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment