దేశంలో ఆధ్యాత్మిక చింతన కలిగిన ప్రతీఒక్కరూ చదవాల్సిన పుస్తకం ‘ఒక యోగి ఆత్మకథ’ అని చెబుతుంటారు. ఈ పుస్తకం ఎందరికో మార్గదర్శిగా నిలిచింది. పరమహంస యోగానంద తన జీవిత అనుభవాలను ‘ఒక యోగి ఆత్మకథ’ రూపంలో వెలువరించారు. ప్రముఖుల నుంచి సామాన్యుల వరకూ పరమహంస యోగానంద మార్గదర్శిగా నిలిచారు. ఈరోజు(జనవరి 5) ఆ మహనీయుని జన్మదినం. అందుకే ఆయన జీవితంలోని ముఖ్యఘట్టాలను ఒకసారి స్మరించుకుందాం.
యోగాకున్న ప్రాముఖ్యతను ప్రపంచమంతటికీ తెలియజేయడంలో పరమహంస యోగానంద(Paramahansa Yogananda) కీలక పాత్ర పోషించారు. పాశ్చాత్య దేశాల్లో ఆయనను ‘ఫాదర్ ఆఫ్ యోగా’ అని పిలుస్తారు. పరమహంస యోగానంద అందించిన ‘క్రియాయోగం’ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఆధ్యాత్మిక బోధనలకు ఏకరూపత కల్పించడం, శాస్త్రీయ ధ్యాన పద్ధతులను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం కోసం పరమహంస యోగానంద ఎనలేని కృషి చేశారు.
పరమహంస యోగానంద ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో 1893, జనవరి 5న జన్మించారు. అతని తండ్రి భగవతి చరణ్ ఘోష్ గోరఖ్‌పూర్ రైల్వేలో అధికారి. పరమహంస యోగానంద అసలు పేరు ముకుంద లాల్ ఘోష్. అనంతర కాలంలో పరమహంస యోగానంద అనే పేరుతో ఆయన ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. 1920లో తొలిసారిగా పరమహంస యోగానంద భారత ప్రతినిధిగా బోస్టన్‌లో జరిగిన మతపరమైన అంతర్జాతీయ సమావేశానికి హాజరయ్యారు. అదే ఏడాది యోగానంద భారత్‌లో తత్వశాస్త్రం, ధ్యాన శాస్త్రంపై బోధనలను వ్యాప్తి చేయడానికి సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్(Self-Realization Fellowship)ను స్థాపించారు. 1925లో లాస్ ఏంజిల్స్‌లో సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్‌కు అంతర్జాతీయ ప్రధాన కార్యాలయాన్ని నెలకొల్పారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పరమహంస యోగానంద శిష్యులుగా మారారు.
1917లో ఆయన ఆదర్శ జీవన్ విద్యాలయ(Adarsh Jeevan Vidyalaya)ను స్థాపించారు. ఈ పాఠశాలలో ఆధునిక విద్యా పద్ధతుల ద్వారా యోగా శిక్షణ, ఆధ్యాత్మిక ఆదర్శాలను అందించారు. పరమహంస యోగానంద ఆధ్యాత్మిక రంగంలో అందించిన సేవలను పురస్కరించుకుని భారత ప్రభుత్వం 1977, 2017లలో రెండు తపాలా బిళ్ళలను విడుదల చేసింది. పరమహంస యోగానంద 1952 మార్చి 7న లాస్ ఏంజెల్స్‌లో మహాసమాధిలో ప్రవేశించారు.
ఇది కూడా చదవండి: మూడు యుద్ధాల వీరుడు.. నాలుగు భాషల నిపుణుడు.. 107లోనూ ఫిట్‌గా ఉంటూ..
Comments
Please login to add a commentAdd a comment