కన్నుమూసిన కోట్లాది ఇస్మాయిలీ ముస్లింల ఆధ్యాత్మిక గురువు
ఎన్నో దేశాల్లో పలు అభివృద్ధి, సేవా కార్యక్రమాలు చేసిన ఆగాఖాన్ సంస్థ
సంతాపం వ్యక్తంచేసిన ప్రధాని మోదీ, పలువురు ప్రపంచ నేతలు
పారిస్: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ‘ఇస్మాయిలీ’ వర్గం ముస్లింల ఆధ్యాత్మిక గురువు, వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి ఆగాఖాన్ కన్నుమూశారు. షియా ఇస్మాయిలీ ముస్లింల 48వ ఇమామ్ హోదాను యుక్తవయసులో వారసత్వంగా పొంది దశాబ్దాలపాటు వేల కోట్ల రూపాయల దాతృత్వ కార్యక్రమాలు చేసి గొప్ప వితరణశీలిగా పేరు తెచ్చుకున్నారు.
ఆగాఖాన్ పోర్చుగల్‌లో మంగళవారం తుది శ్వాస విడిచారని ఆయన కుటుంబం బుధవారం ప్రకటించింది. ఆగా ఖాన్ అంత్యక్రియలు పోర్చుగల్ రాజధాని నగరం లిస్బన్‌లో జరుగుతాయని ఆగాఖాన్ డెవలప్‌మెంట్ నెట్‌వర్క్, ఇస్మాయిలీ రిలీజియన్ కమ్యూనిటీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆగాఖాన్‌కు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
మొహమ్మద్ ప్రవక్త వారసులుగా షియా ముస్లింలలో ఉప వర్గమైన ఇస్మాయిలీ వర్గానికి ఆగాఖాన్ కుటుంబం ఆధ్యాత్మిక గురువులుగా శతాబ్దాలుగా కొనసాగుతోంది. 1936 డిసెంబర్ 13న స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జన్మించిన ఈయన అసలు పేరు ప్రిన్స్ కరీమ్ అల్ హుస్సేనీ.
ఆగాఖాన్ తండ్రి ప్రిన్స్ అలీఖాన్ విలాస పురుషుడు. దీంతో అలీఖాన్‌ను కాదని తాత సర్ సుల్తాన్ మొహ మ్మద్ షా (ఆగాఖాన్– 3).. కరీమ్ అల్ హు స్సేనీను డిగ్రీ స్టూడెంట్‌గా ఉన్నప్పుడే ఆగా ఖాన్–4గా 1957 అక్టోబర్ 19వ తేదీన ప్రకటించారు. టాంజాని యాలోని దారెస్స లామ్‌లో ఈ కార్య క్రమం జరిగింది.
గతంలో ఇదే దారెస్సలామ్ వేదికగా ఆగాఖాన్–3ను ఇస్మాయిలీ వర్గీయులు ఆయనంత బరువు వజ్రాలను కానుకగా సమర్పించిన వార్త అప్పట్లో సంచలనమైంది. ఆనాటి నుంచి ఆధ్యాత్మిక గురువుగా కొనసాగుతూనే వేల కోట్ల రూపాయల విలువైన వ్యాపార సంస్థలను విజయవంతంగా నడిపిస్తున్నారు. వీళ్ల ఆగాఖాన్ డెవలప్‌మెంట్ నెట్‌వర్క్ ఆధ్వర్యంలో పలు ప్రపంచ దేశాల్లో వందలాది ఆస్పత్రులు సేవలందిస్తున్నాయి.
ఏటా ఒక బిలియన్ డాలర్ల మేర లాభాపేక్షలేని అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారు. ఆగా ఖాన్ మృతికి ప్రధాని మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, బ్రిటన్ రాజు ఛార్లెస్, ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ సహా పలు ప్రపంచదేశాల అధినేతలు తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. మరోవైపు ఇస్మాయిలీ ముస్లింల నూతన ఆధ్యాత్మిక గురువుగా ఆగాఖాన్4 కుమారుడు రహీమ్ అల్ హుస్సేనీ పేరును ప్రకటించారు. 50వ గురువుగా ఈయనను ఇకపై ఆగాఖాన్–5గా పిలవనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment