Aga Khan : ఆధ్యాత్మిక నేత, ప్రముఖ దాత ఆగా ఖాన్ కన్నుమూత | Spiritual leader and philanthropist Aga Khan Passed at 88 | Sakshi
Sakshi News home page

Aga Khan : ప్రముఖ ఆధ్యాత్మికనేత, దాత ఆగా ఖాన్ కన్నుమూత

Published Wed, Feb 5 2025 11:19 AM | Last Updated on Wed, Feb 5 2025 12:05 PM

Spiritual leader and philanthropist Aga Khan Passed at 88

బిలియనీర్‌,ప్రపంచ  ముస్లింల ఆధ్యాత్మిక గురువు,  పద్మవిభూషణ్‌  ఆగాఖాన్‌ (88) (Aga Khan) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆగా ఖాన్‌ ఫౌండేషన్‌ ధృవీకరించింది. పోర్చుగల్‌లోని లిస్బన్‌లో తుదిశ్వాస విడిచారని ఆగాఖాన్‌ ఫౌండేషన్‌ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది. ఆయన వారసుడిని త్వరలో ప్రకటిస్తామని చెప్పింది. 

ఆగాఖాన్‌మృతిపై విచారాన్ని ప్రకటించిన షౌండేషన్‌,  ఆయన కుటుంబానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్మాయిలీ కమ్యూనిటీకి సంతాపం తెలిపింది.   ప్రపంచంలోని వ్యక్తులంతా మతపరమైన భేదాలు లేకుండా ఆయన కోరుకున్నట్లుగా ప్రజల జీవితాన్ని మెరుగుపరిచేందుకు తమ భాగస్వాములతో కలిసి పనిచేస్తామని  తెలిపింది.

ఆగా ఖాన్‌కు హైదరాబాద్‌తో చారిత్రక సంబంధం కూడా ఉంది. అతని పూర్వీకులు ఈ ప్రాంతంలో వాణిజ్యం ,దాతృత్వం సేవలను అందించారు. ఆగా ఖాన్ డెవలప్‌మెంట్ నెట్‌వర్క్ (AKDN) ద్వారా నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో AKDN పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, వృత్తి శిక్షణా కేంద్రాలతో సహా అనేక విద్యా సంస్థలను స్థాపించింది. 1967లో ఆగాఖాన్‌ డెవలప్‌మెంట్‌ నెట్‌వర్క్‌ను స్థాపించారు.  దీని ద్వారా ప్రపంచ వ్యాప్తంగా  వందిలాది ఆసుపత్రులు ,విద్యా, సాంస్కృతిక సంస్థలను అభివృద్ధి చేయడంతోపాటు అనేక ఇతర  సేవా  కార్యక్రమాలకు తన సంపదను వెచ్చించారు. ఈ  సేవలకు గాను 2015లో  దేశీయ అతిపెద్ద పౌరపురస్కారాలలో ఒకటైన పద్మ విభూషణ్‌తో కేంద్ర ప్రభుత్వం ఆయన్ను సత్కరించింది. అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతుల మీదుగా దీన్ని అందుకున్నారు. 

ప్రిన్స్ కరీం అల్-హుస్సేనీ అగా ఖాన్ IV అని పిలుచుకునే ఆగా ఖాన్‌  స్విట్జర్లాండ్‌లో జన్మించారు.  ‍ప్రస్తుతం బ్రిటన్‌ పౌరుడిగా ఉన్నారు. 1957లో తన 20 ఏండ్ల వయస్సులో ఇస్మాయిలీ ముస్లింల 49వ వంశపారంపర్య ఇమామ్‌గా నియమితులయ్యారు. వారసత్వంగా వస్తున్న గుర్రపు పెంపకంతోపాటు అనేక ఇతర వ్యాపారాల్లో రాణించారు. యూకే‌, ఫ్రాన్స్‌, ఐర్లాండ్‌ వంటి దేశాల్లో నిర్వహించే గుర్రాల రేసుల్లో ఆయన పాల్గొన్నారు. షేర్గర్‌ జాతికి చెందిన గుర్రంతో రేసుల్లో పాల్గొనేవారు. 1969లో బేగం సమ్లిమా అగా ఖాన్‌ను వివాహం చేసుకున్నారు. తరువాత 1998లో బేగం ఇనారా అగా ఖాన్‌ను రెండో వివాహం చేసుకున్నారు ఆగాఖాన్‌ ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆగాఖాన్‌ మృతిపట్ల కింగ్‌ చార్లెస్‌ 3  సంతాపం ప్రకటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement