
మన హృదయంలో ఉండేది శ్రీ మహాదేవుని ప్రతిబింబం. ఇది శ్రీ శివుని నివాసం. ఇది అన్నింటినీ మించినది. మన మనస్సుకు, ఆలోచనలకు అన్నింటికీ అతీతమైనది. ఈ శివ తత్త్వాన్ని పొందాలంటే, ముందుగా మనం శ్రద్ధ వహించి మన హృదయం ఎంత స్వచ్ఛంగా ఉందో మన లోపలికి మనం చూసుకోవాలి.
మన హృదయం లోపల, మనం చాలా మురికిని పెంచుకుంటాము. ఉదాహరణకు, మనం ఎవరినైనా చూసి అసూయపడతాం. ఎవరో మనకు చెడు చేసినట్టు అసూయ పడుతుంటాము. వారు మనకు నిజంగా హాని చేసినా కూడా, ఇబ్బంది కలిగించినా కూడా వారి పట్ల అసూయపడి ప్రయోజనం లేదు. మన హృదయం శుభ్రంగా ఉంటే, మన హృదయమనే అద్దంలో గల సర్వ శక్తిమంతుడైన భగవంతుని ప్రతిబింబం స్పష్టంగా ఉంటుంది.
కానీ మనం మన లోపల అసూయను కలిగి ఉంటే, అప్పుడు ఆ అద్దం శుభ్రంగా ఉండదు. అందులో భగవంతుని ప్రతిబింబం కూడా పరిపూర్ణంగా ఉండదు. ఎవరితోనైనా శత్రుత్వం కలిగి ఉండటం, ఎవరి పట్లనైనా హృదయంలో కోపం లేదా చెడు భావాలను కలిగి ఉండటం చాలా తప్పు. దాని వలన శ్రీ శివతత్త్వాన్ని కలిగి ఉండలేము. అందుకే మనం అందరినీ ప్రేమించడం, క్షమించడం చాలా ముఖ్యం. మనం రోజూ శివునికి పూజలు, అభిషేకాదులు చేస్తూ మన లోపల గల అరిషడ్వర్గాలను విడిచి పెట్టలేకపోతే శ్రీ శివతత్త్వాన్ని పొందలేం. శ్రీ శివతత్త్వాన్ని పొందాలంటే మన హృదయం నిర్మలంగా ఉండాలి.
ఎటువంటి అలజడులు లేని స్వచ్ఛమైన నీటిని కలిగి ఉన్న సరస్సు మాత్రమే ఆకాశంలో ఉన్న సూర్యుని చక్కగా ప్రతిబింబించ గలుగుతుంది. అదే విధంగా మన హృదయం కూడా ఎటువంటి ఆలోచనలు లేని నిర్విచార స్థితిలో, ఇతరుల పట్ల ఏ విధమైన ద్వేషం, కోపం లేకుండా ఉన్నప్పుడు మాత్రమే భగవంతుని నిజమైన స్వరూపాన్ని ప్రతిబింబించ గలుగుతాము. అనగా శ్రీ శివ తత్త్వాన్ని పొందగలుగుతాం.
శ్రీ శివుని సచ్చిదానంద స్వరూపుడు అని వర్ణిస్తారు. అనగా సత్ + చిత్ + ఆనంద స్వరూపుడు. సత్యము, చిత్తము మరియు ఆనందమును స్వరూపముగా కలిగిన వాడు శ్రీ శివుడు. ఏ విషయం గురించైనా సత్యము ఏమిటి అనేది మనకు సహస్రారములో ఉండే శ్రీ సదాశివుని పాదాల వద్దనే తెలుస్తుంది. మన చిత్తం ఆత్మ ప్రకాశంతో నిండినప్పుడే మనకు ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది. నిరంతరం నిర్మలమైన ఆనందంతో ఉండే వ్యక్తే భగవంతుని పరిపూర్ణంగా ప్రతిబింబించ గలుగుతాడు. ఈ సచ్చిదానంద స్వరూపమయిన శ్రీ శివ తత్త్వాన్ని పొందగలిగిన వారి జన్మ ధన్యం.
మన లోపల ఉండే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలు మన హృదయంలో ఉండే శ్రీ శివుని ప్రకాశానికి అడ్డు పొరలుగా ఏర్పడతాయి. మనం సహజ యోగంలో కుండలినీ జాగృతి ద్వారా ఆత్మ సాక్షాత్కారం పొందినప్పుడు ఈ ఆత్మ ఉనికిని మన చేతి వేళ్ళపై అనుభూతి చెందడం ప్రారంభిస్తాం.
అప్పుడు ఆత్మ పరిశీలన ద్వారా ఈ అరిషడ్వర్గాలను క్రమంగా తొలగించుకొన్నప్పుడు, పరిపూర్ణంగా ఆత్మ స్వరూపులమయ్యి భగవంతుని ప్రతిబింబాన్ని స్పష్టంగా మన హృదయంలో ప్రతిబింబించ గలుగుతాం. అటువంటి వ్యక్తులలో దైవికమైన సుగుణాలన్నీ స్పష్టంగా ప్రస్ఫుటమవుతూ ఉంటాయి. అటువంటి వ్యక్తులు నిత్య నిరామయమైన శ్రీ శివ తత్త్వాన్ని పొంది, సదా శివసాన్నిధ్యంలో ఉంటారు.
– డా. పి. రాకేష్
(పరమపూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి ప్రవచనాల ఆధారంగా)
Comments
Please login to add a commentAdd a comment