త్రయం తాండవం | special chit chat with Tanikella Bharani | Sakshi
Sakshi News home page

త్రయం తాండవం

Published Tue, May 2 2017 11:39 PM | Last Updated on Tue, Sep 5 2017 10:13 AM

త్రయం తాండవం

త్రయం తాండవం

నేను నా దైవం

త్రికరణ శుద్ధితో... మనసు... మాట... తనువు నువ్వు... నేను... మనం గుడి... బడి... ఇల్లు నింగి... నేల... దిఙ్మండలంఫలం...  పుష్పం... బిల్వం ఉగ్ర... జ్ఞాన... అంతర నేత్రం శ్రీ... కాళ... హస్తి గంగ... గళం... గరళం బ్రహ్మ... విష్ణు... పరమేశ్వర అంతా శివమయం ఇదే భరణి త్రీ ఇన్‌ వన్‌ తత్త్వం పురివిప్పి పరవశింప జేసే త్రయం తాండవం

మీరు శివనామాలతోనే కనిపిస్తారు... శబ్బాష్‌ రా శంకరా అని శివతత్వం చెప్పారు... మీరు మహాభక్తులా!
భక్తుడినే కానీ, మహా కాదు. మన జీవితంలో మట్టి ప్రాధాన్యత తెలుసుకోవడం ముఖ్యం. అందుకే ఈ పూజకు ఒప్పుకున్నాను. నాకు ఎప్పుడూ ఉపవాసం అలవాటు లేదు. పూజ మొదలుపెట్టేటప్పుడే ‘అయ్యా, భక్తి ఎంత అవసరమో, భుక్తి కూడా అంతే అవసరం. సమయాన్ని పొడిగించకూడద’ని చెప్పాను. బుద్ధుడు కూడా మధ్యేమార్గాన్ని సూచించాడు. శరీరాన్ని కాపాడుకుంటూ దైవప్రార్థన చేయమని. శరీర లక్షణం ఏంటంటే వేళకు పెట్టే తిండి మానేస్తే... ఇంక వీడు తిండి పెట్టడు అనుకున్నప్పుడు తనే కొంతవరకు తయారుచేసుకుంటుంది. అలా ఆకలి అనిపించలేదు.
     
భక్తిలో ఉన్నవారు కుటుంబంతో డిటాచ్‌డ్‌గా ఉంటారంటారు. మరి భక్తి ఫ్యామిలీ లైఫ్‌కి ఎఫెక్ట్‌ అవుతుంది కదా!

భక్తి అనేది ఒక వ్యవహారం. మన భారతీయ జీవనంలో మనమేంటో ముందే డిసైడైపోతుంది. మీ తాత శివుని ఆరాధించేవాడు అనుకోండి. అది మీ తండ్రి నుంచి మీకు ట్రాన్స్‌ఫర్‌ అయిపోతుంది. ఈ ఆచారాలు సంప్రదాయాలు మనదగ్గర ముందే ఫిక్స్‌డ్‌. ఇంట్లో అందరూ భక్తులే ఉండాలనేం లేదు. మా పెద్దన్నయ్య శివారాధకుడు. రెండో అన్నయ్య ఫక్తు కమ్యూనిస్టు. నాలుగో అతను తటస్థం. మన ఇల్లే ఒక సమాజం. సమాజమే దేశం. దేవుడంటే ఒక నమ్మకం. ఒక విశ్వాసం. ఒక అనుభూతి. ఆ అనుభూతిని పొందాలే తప్ప మాటల్లో వ్యక్తం చేయలేం. అలాగని మూఢంగా నమ్మమని కాదు. నమ్మకానికి, మూఢ నమ్మకానికి తేడా ఉంది. భక్తకన్నప్పది మూఢభక్తి కాదు గాఢ భక్తి. ఏ స్థాయికెళ్లాడంటే దైవానికి కన్ను ఇచ్చేశాడు. మూఢనమ్మకమంటే... ఈ రాళ్లు పెట్టుకుంటే, ఫలానా రంగు చీర కట్టుకుంటే... మంచిది అంటే దానిని పాటిస్తుంటారు చూడండి అదన్నమాట.   

మనిషికి కర్తవ్యం అవసరం. అంతే కానీ, దేవుడే అంతా చూసుకుంటాడులే అనుకోవడం ఎంతవరకు సమంజసం?
దేవుడు అనేవాడు నువ్వు పని మానుకొని నన్నే పూజిస్తూ కూర్చో అని చెప్పలేదు. ‘కర్మణ్యే వాధికారస్యే, మా ఫలేషు కదాచనా! అంటే, పని చేయ్‌! ఫలితం ఆశించకు’ అన్నాడు. సృష్టిలో ఏ జంతువు, ఏ పక్షీ పనిచేయదు. కానీ, బతకడం కోసం పనిచేసే ఏకైక జంతువు మనిషి మాత్రమే! అందుకే, మనిషికి దేవుడంటే నమ్మకం, భయం.

దైవాన్ని నమ్మడం అంటే ధైర్యం కొరవడినట్టే అంటారు...
నమ్మినవాడికి దేవుడే ధైర్యం. నమ్మనివాడికి వాడికి వాడే ధైర్యం. దేవుడు చేయాల్సిన పనులు కూడా వాడే చేసుకుంటాడు కాబట్టి వాడికి వాడే దేవుడు. నాస్తికుడు నా దృష్టిలో పరమోత్కృష్టుడు. అయితే, నువ్వేది నమ్మినా వంద శాతం నమ్ము. ఎంత భక్తుడైనా సరే... అతడిని దేవుడు ఉన్నాడా అని ప్రశ్నించండి. ‘కలడు కలడనువాడు... కలడో లేడో... అంటాడు. అదే నాస్తికుడితో –‘ఏమయ్యా, దైవం నిజంగా లేడా!’ అంటే, సందేహంతో చూస్తాడు. ‘నేను నమ్మనండి. ఇంట్లో వాళ్లు ఏవో వ్రతాలు, నోములు చేసుకుంటారు’ అంటాడు. అంటే ఇంట్లోవారినే ప్రభావితం చేయనివాడు ఇక సమాజాన్ని ఏం చేస్తాడు.
     
కష్టం వచ్చినప్పుడు ఎదుర్కోవడం చేతకాక దేవుని ముందు నిలబడితే ఎలా? పిల్లలకు దీని గురించి ఏం చెబుతున్నాం?
సంకటకాలే వేంకటరమణ అన్నది ఓ సామెత ఉంది. కష్టాలు వచ్చినప్పుడే దైవాన్ని తలుచుకుంటాం. మనమేది చేస్తే, పిల్లలు అది చేస్తారు. పిల్లలతో ‘దేవున్ని మనం ఏమీ కోరనక్కర్లేదు. మనకన్నీ ఇచ్చాడు. ఈ జన్మను ఇచ్చినందుకు నీకు ధన్యవాదాలయ్యా! అని ఓ దణ్ణం పెట్టుకుంటే చాలు’అని చెబితే వాళ్లే అర్థం చేసుకుంటారు. అంతేకాదు, అసలు రహస్యం ఒకటుంది. నువ్వే శివుడివి అని చెప్పాలి. ‘నాలోన శివుడు గలడు .. నీలోన శివుడు గలడు..’ అంటే మన గురించి మనం తెలుసుకోవడమే దైవం.. విశ్వరూపం అంటే అర్థం ‘ఆ విశ్వం అంతా నీలో ఉంది. నీలో ఉన్నదంతా విశ్వంలో ఉంది’ ఇలాంటప్పుడు ఇంకేం కావాలి. దుఃఖం వద్దంటావా? దుఃఖం లేకపోతే మజా ఏముంటుంది? ఎండ లేకపోతే ఏసీ చల్లదనం ఎలా తెలుస్తుంది?  
     
పిల్లలను గుడికి తీసుకెళితే అక్కడి వారు రుచికరమైన ప్రసాదాన్నే ఇష్టపడతారు. అలాంటప్పుడు వాళ్లకేం చెప్పాలి?
ఇప్పటికీ నేనూ ప్రసాదం కోసమే వెళతాను (నవ్వు). వాళ్లు అక్కడ నమక చమకాలు వినిపిస్తుంటారు. ఏం చెప్పినా అక్కడి చక్కెర పొంగలి, పులిహోర ఊరిస్తుంటుంది. ప్రసాదం అంటే ప్రజెంటేషన్‌. ఈ క్షణం ఎంత అద్భుతమైనది. దానిని అనుభూతించాలని చెబుతుంది ప్రసాదం. పిల్లలు మనమేది ఆచరిస్తున్నామో అది తెలుసుకుంటారే తప్ప మనం చెబితే కాదు.
     
ముక్కోటి దేవతలు ఉండగా మీకు శివుడు మీదే అంత ప్రేమ ఎందుకు? శివుడు ఎప్పుడు పరిచయం అయ్యాడు?
నా చిన్నప్పుడు మా ఊళ్లో హరిదాసు ‘అజామీళుడు’ అని ఓ కథ చెప్పాడు. ‘నువ్వు ఇన్ని పాపాలు చేసినా ఒక్క బిల్వ దళం ఆయన నెత్తిమీద వేస్తే కైలాసమే’ అన్నాడు. చిన్నమనసులో అది నాటుకుపోయింది. అప్పుడు పాపాలు చేస్తున్నామని తెలియని దశ. ఇప్పుడు పాపాలు చేయకుండా ఉండలేని దశ (నవ్వుతూ... ఒక్క అబద్ధం చెప్పడం కూడా పాపమే కదా!) ఇక శివుడంటేనే ఎందుకంత ఇష్టం అంటే, మన దగ్గర కాకాహోటల్‌ అని ఉంటుంది. స్టార్‌ హోటల్‌ ఉంటుంది. కాకాహోటల్‌కి ఏ అర్థరాత్రి అయినా వెళ్లచ్చు. పిలిచి మరీ తిండి, బస ఇస్తాడు. స్టార్‌ హోటల్‌ అనుకోండి. ఐడి కార్డు లేకపోతే అవతలకు పో అంటాడు.

అంత సింపుల్‌ శివయ్య. ‘చెంబెడు నీళ్లు పోస్తే ఖుష్‌.. చిటికెడు బూడిద పూస్తే బస్‌.. ఉట్టి పుణ్యానికే మోక్షమిస్తవ్‌ గదా! శబ్బాష్‌రా శంకరా!’ అని శివతత్త్వాలు రాసే శక్తినిచ్చాడు. శివుడు రూపరహితుడు. ఈయన్ను ఎక్కడైనా పెట్టచ్చు. ఈయనది అటామిక్‌ ఎనర్జీతో ఉండే భోళాతనం. ఎక్కువ రిస్ట్రిక్షన్స్‌ ఉండవు. సింబాలిక్‌గా చెప్పాలంటే లింగం. మనవాళ్లు ఒక ఆర్డర్‌ ప్రకారం అనుకూలంగా ఆయన్ను మార్చుకున్నారు. పుట్టించేటప్పుడు వాడు బ్రహ్మ, స్థితికారుడు విష్ణువు. లయం చేస్తే గెటప్‌ వేసుకొచ్చేది శివుడే. అంటే, త్రీ ఇన్‌ వన్‌ శివుడే! వంకాయతో కూర చేసుకోవచ్చు. వేపుడు చేసుకోవచ్చు, పచ్చడీ చేసుకోవచ్చు. ఇక్కడ పచ్చడి శివుడే!

శివ తాండవం అంటే ఏంటి? ఆయన ఎందుకలా డ్యాన్స్‌ చేస్తాడు?  నృత్యం ద్వారా ఏం సూచనలు ఇస్తున్నాడు?
(నవ్వుతూ) సమాజంలో బతకడానికి కొన్ని నటనలు చేస్తాం, తప్పదు. అయితే, ఈ శివ తాండవం జ్ఞానానికి సంబంధించింది. ఏది చేసిన తీవ్రంగా చేయ్‌. మనిషిగా నీకున్న తెలివితేటలు నాలుగు ఉంటే నాలుగూ వాడు. ప్రేమ ఉంటే అంతే తీవ్రంగా వాడు. ఆర్తి ఉంటే అంతే తీవ్రంగా వాడు అని చెప్పడం ఆ ఉద్దేశ్యం. జ్ఞానాన్ని ఎంత వీలైతే అంత పెంచుకో అని నృత్యంతో సూచిస్తున్నాడు.
     
శివుడికి రుద్రాక్షలు అంటే ఎందుకంత ఇష్టం? అవి మనిషి ధరిస్తే వచ్చే లాభమేంటి?
రుద్రాక్షల్లో పై భాగం గరుకుగా ఉంటుంది. ఇది జపం చేస్తున్నప్పుడు బొటనవేలికి ప్రెజర్‌ పెరిగి జ్ఞాననేత్రం తెరుచుకుంటుంది. ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ విషయం చెబితే వింటారా! నాయనా, ఇవి రుద్రుడి అక్షుల నుంచి పడినవి రా! ఇది ధరిస్తే మంచిది. దీంతో జపం చేస్తే రుద్రుడు సాక్షాత్కరిస్తాడంటే ఒక ఆశ పుడుతుంది.
     
భక్తి భావనలో మీ కళ్లలో నీళ్లు తిరిగిన సందర్భం...
ఓ రోజు పూజ గదిలో ఉన్నాను. మా ఇంట్లో దేవుడి రూమ్, వంటరూమ్‌ పక్కపక్కనే ఉంటాయి. మా ఆవిడ గోంగూర పచ్చడి చేస్తోంది. నేను స్వామికి అభిషేకం చేసుకుంటున్నాను. గోంగూర పచ్చడి తాలూకు ఘుమఘుమకు నోట్లో నీళ్లూరాయి. అఖిలాండకోటి భ్రమంఢానాయకుడిని ముందు కూర్చుంటే కళ్లమ్మంట నీళ్లు రావడం లేదు. గోంగూర రుచికి నోట్లో నీళ్లూరుతున్నాయి. ఇక నిన్నెలా వేడుకోను స్వామీ.. అనుకున్నప్పుడు ఉద్వేగానికి లోనయ్యాను. కళ్లు నీళ్లతో నిండిపోయాయి. ఆ క్షణంలో ఏ కోరికా లేని ఓ ఆనందాన్ని చవిచూశాను. ‘భూమిపై మూడు వంతులు నీళ్లు. మిగతాది కన్నీరు... ఆటగదరా శివా!’’ అంటూ శివ భక్తి గురించి ఎంత చెప్పినా తక్కువే! దాదాపు 15 ఏళ్లుగా దేవుణ్ణి ఏమీ వేడుకోవడం లేదు. నాకో పెద్ద లోకాసమస్తసుఖినోభవంతుః అనుకుంటున్నాను. బార్డర్‌లో ఉన్న జవాన్‌కు కూడా ఒక్క బుల్లెట్‌ తగలకూడదు. ఇరాక్‌లో స్త్రీ కూడా కన్నీరు పెట్టకూడదు.. అని కోరుకుంటున్నాను.

శివుడు బూడిద రాసుకొని ఉంటాడు, శ్మశానంలో తిరుగుతుంటాడు కదా! ఆయనకు అంత పవర్‌ ఎక్కణ్ణుంచి వచ్చింది?
ఐశ్వర్యానికి అధిపతి శివుడే! శివాలయాల్లో ద్వారం పైన లక్ష్మీదేవి బొమ్మ ఉంటుంది. డబ్బులు కావాలంటే ఈ పెద్దసార్‌ పర్మిషన్‌నే అడగాలి. అక్కడ విభూదినే ఇస్తారు. విభూదే మన ఐశ్వర్యం. నాటి రాజుల వద్ద అనంతమైన ధనరాశులుండేవి. చివరకు ఏమయ్యింది. పోయేటప్పుడు... మట్టి. అంటే బూడిద. నీ శరీరం... ఐశ్వర్యం. చివరకు కాలి బూడిదైపోతుందని చెప్పడమే  ఉద్దేశ్యం. స్థితికారకుడు కాబట్టి విష్ణువుకు నిలువు నామం. పోయేటప్పుడు పడుకోబెడ్తరు కాబట్టి ఈశ్వరుడికి అడ్డనామం. విశ్వమే ఆయనైనప్పుడు శక్తి కూడా ఆయనే కదా!

ఏకంగా గంగనే నెత్తిన పెట్టుకున్నా, ఈ అభిషేకాల పిచ్చెందుకు?
కాస్మిక్‌ ఎనర్జీ నిరంతరం వేడిని విడుదల చేస్తుంటుంది. శివలింగం నుంచి ఆ వేడి విడుదల అవుతుంది. మూడుసార్లు శివలింగం చుట్టు తిరిగితే మనకే ఒక శక్తి వస్తుంది. ఒక దివ్యానందంలో ఉంటాం. అంత దివ్యానందం పనికిరాదు అని కాసేపు ఆ ఆలయంలో కూర్చోమంటారు. అందుకే తడి బట్టలతో అభిషేకం చేస్తారు. కథా పరంగా చూస్తే నెత్తిన గంగ ఉన్నా దానిని జనుల కోసం వదిలాడు. అందుకే కృతజ్ఞతగా జలంతో అభిషేకిస్తారు. ప్రతి దైవకార్యంలోనూ పరోపకారమే కనిపిస్తుంది.

నాలో సగం అంటూ శివయ్య ఇంతికి అంత విలువ ఎందుకు ఇచ్చాడు? దాన్నుంచి మనమేం నేర్చుకోవాలి?
శివరూపం ఎత్తినప్పుడు సగభాగం ఇచ్చాడు. విష్ణుమూర్తి వేషం కట్టినప్పుడు కాళ్లొత్తమన్నడు. బ్రహ్మ రూపం ఎత్తినప్పుడు వీణవాయించమన్నడు. ఈయనేం సామాన్యుడు కాదు. (నవ్వులు) అయినా, చివరకు అన్ని రూపాల్లోనూ ఆ అయ్య అమ్మ ముందే మోకరిల్లాడు. నీకోసం ఏం కావాలో, ఏది అవసరమో అమ్మ ఇస్తుందని చాటాడు. దైవాన్ని పరిచయం చేసేది అమ్మే! అమ్మను కొలుచుకున్నవాడు ఈశ్వరుడిని ఆరాధించినట్టే!

అన్ని అదుపాజ్ఞలో ఉంచుకునే దైవానికి అంత కోపమెందుకు? మన్మధుడిని మసి చేయడం ఎందుకు?
మనలో ఉండే లక్షణాలకు తగ్గట్టే దేవుణ్ణి తయారుచేసుకున్నాం. జీవితంలో అన్ని రసాలు ఉండాలి. వాటిలో కోపం కూడా ఒకటి. మన్మధుడిని మసి చేశాడు కాబట్టి ఈ విషయంపై అంతా ఒకేలా ఆలోచిస్తారు. నీలో కామం పెరిగినప్పుడు అంతర్నేత్రంతో దానిని కట్టడి చేయి. అక్రమమైన కామం కలిగినప్పుడు దానిని దహించివేసే శక్తి నీలోనే ఉందని గ్రహించి దానిని అంతం చేయ్‌. అదే తెలుసుకో! అని ఈ కథ ద్వారా చెబుతారు.
   
కడుపునిండా భోజనం తినమని ప్రకృతిలో ఇన్ని రుచులను ఇచ్చిన దేవుడు శివరాత్రినాడు ఉపవాసం ఉంటే సంతోషించడం ఏంటి? జాగరణ చేస్తే మురిసిపోయి వరాలివ్వడం ఏంటి?
ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా ఉండటం. జాగారణ మనసును జాగృతం చేయడం. అంతే కానీ, ఈ రోజు పూర్తిగా తిండి మానేసి మరుసటి రోజు ఫుల్లుగా లాగించమని కాదు. నిద్రమానేసి సినిమాలు చూస్తూ జాగరణ చేయడం అని కాదు. నీలోని అంతర్జ్యోతిని బయటకు తేవాలి. వారానికి ఒకసారి ఉపవాసం చేస్తే ఆరోగ్యం బాగుంటుందని మన పెద్దలు చెప్పారు. ఇది సైన్స్‌ పరంగానూ ధ్రువీకరించారు. ఇదే అంశంమీద మొన్నీమధ్యే ఒక విదేశీయుడుకి అవార్డు కూడా వచ్చింది. ఇది మనవాళ్లు ఎప్పుడో చెప్పారు? శరీరం పడిపోకుండా ఆహారాన్ని తీసుకుంటూనే దైవాన్ని తెలుసుకోవడం.

అసలు పాపం చేయకుండా ఉండలేం కదా! భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు అని మూడు దశలు ఉంటాయి. ముందు పూజ ఉంటుంది. దీంట్లో కొబ్బరి కాయలు కొడతాం. ఓ పది సార్లు తిరుపతికి వెళ్లొస్తాం. అభిషేకాలు చేసేస్తుంటాం. ఈ దశలో ప్రపంచానికి చెప్పుకోవడం కోసమే పూజ ఉంటుంది. నే చెప్పేదేంటంటే ఏదైతే క్రియ ఉందో అది వద్దు. పూజ స్థాయి నుంచి ధ్యానం స్థాయికి చేరుకోవాలి. ఈ రెండోదశలో భక్తి నిశ్చలంగా ఉంటుంది. ఆ తర్వాతి దశలో అది కూడా ఉండదు. రమణమహర్షి. అంటే యోగి స్థాయికి చేరుకుంటాం. నిరంతరం నీలో ఓంకారం పలుకుతుంటే ఇంక ఏం కావాలి?

మీరు గుడికి వెళ్తుంటారా?  
గుళ్లను దర్శించే ది అప్పటి శిల్పుల కళను తెలుసుకోవడానికి. ఆ కట్టడాల అందం చూడటానికి.  దైవారాధనకు నమకచమకాలు అక్కర్లేదు. అలాంటి వాటికే దేవుడు లొంగడు. శ్రీ కాళహస్తిలో పురుగేం నేర్చుకుంది? పామేం తెలుసుకుంది? ఏనుగేమి చేసింది? వాటిని అనుగ్రహించలేదా శివుడు.
– నిర్మలారెడ్డి చిల్కమర్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement