ఆత్మసాక్షాత్కారం అంటే..? | What Is Self Realization In Bhagavad Gita | Sakshi
Sakshi News home page

ఆత్మసాక్షాత్కారం అంటే..?

Published Thu, Feb 6 2025 5:42 PM | Last Updated on Thu, Feb 6 2025 5:43 PM

What Is Self Realization In Bhagavad Gita

ఆత్మసాక్షాత్కారం మానవుని జన్మహక్కు అంటారు శ్రీ మాతాజీ. మనలోని కుండలినీ శక్తియే మన తల్లి. ఆమె మన అన్ని జన్మలలోను మనతోనే ఉంటూ, జాగృతి చెందే సదవకాశం కోసం ఎదురు చూస్తూ వస్తున్నది. స్త్రీలు, పురుషులు, పిల్లలు, అన్ని వర్ణాల, జాతుల వారు, ఎవరైనా సహజయోగ సాధన చేసుకోవచ్చును. 

ఆత్మసాక్షాత్కార అనుభూతి పొందవచ్చును. దీనికి కావలసింది ఆత్మసాక్షాత్కారం పొందాలనే శుద్ధమైన కోరిక మాత్రమే. అన్ని మతాలలోను, జ్ఞానమూర్తులు, అవతార పురుషులు సహజ యోగం గురించే బోధించారు. ఆత్మసాక్షాత్కారం ద్వారా పొందే ఆధ్యాత్మిక జీవనమే గొప్పదని చెప్పారు. 

ఆత్మసాక్షాత్కారం అంటే ఏమిటి?
పూర్వంలోలా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందటానికి ఏ అడవులకో, హిమాలయాలకో వెళ్ళనవసరం లేకుండానే తమ, తమ సంసారిక బాధ్యతలు, సాంఘిక పరమైన విధులు నిర్వర్తిస్తూనే ఆత్మసాక్షాత్కారం పొందే ప్రక్రియను మాతాజీ కనుగొన్నారు.

ఆత్మసాక్షాత్కారం పొందాలి అనే శుద్ధ ఇచ్ఛాశక్తి మనకు కలిగినప్పుడు నిద్రాణ స్థితిలో ఉన్న కుండలినీ శక్తి జాగృతమై కేంద్ర నాడీ వ్యవస్థ ద్వారా ఊర్ధ్వముఖంగా పయనించి, శిరస్సునందు గల సహస్రార చక్రాన్ని ఛేదించి, పరమ చైతన్య శక్తితో అనుసంధానం జరగటం వలన అనంతమైన దైవశక్తులన్నీ అనుభవంలోకి వచ్చి, తద్వారా మనకున్న అజ్ఞానం తొలగి పరిపూర్ణమైన ఆత్మజ్ఞానిగా... బ్రహ్మజ్ఞానిగా మార టమే ఆత్మసాక్షాత్కార పరమార్ధం.
ఆత్మసాక్షాత్కారం అనేది ఒక అంధ విశ్వాసం, మూఢ నమ్మకమూ కానే కాదు. 

అనుభవ స్థిరమైనది, స్వయం అనుభూతి  కలిగినటువంటిది. మాతాజీ  ఫోటో ముందు కూర్చుని, నిస్సంకోచంగా హృదయపూర్వకంగా శుద్ధ ఇచ్ఛాశక్తితో ధ్యానం చేసినా ఈ అనుభూతి సహస్రార చక్రంలోనికి ప్రవేశిస్తున్నప్పుడు అప్రయత్నంగా ఆలోచనలు నిలిచి΄ోతాయి. ఈ స్థితిని ‘నిర్విచారస్థితి’ అంటారు. ఈ స్థితిలో మన అరచేతులలో గానీ, మాడు పైనగాని, చల్లని వాయుతరంగాల అనుభూతి కలుగుతుంది. ఇది మీలోనే సంభవించు ‘ఆత్మసాక్షాత్కార’ అనుభవం, అనుభూతి.

శ్రీకృష్ణుడు, అర్జునునికి చేసిన గీతోపదేశంలో ‘యోగక్షేమం వహామ్యహం’ అన్నాడు. భగవంతుని యందు ఎల్లప్పుడూ ధ్యాన స్థితిలో నిమగ్నమై ఉన్న వారి యోగ క్షేమాలు తానే వహిస్తానని, యోగం ద్వారా భగవంతుని చేరినప్పుడే ఈ క్షేమం కలుగుతుందని బోధించిన విషయం మనందరికీ తెలిసినదే. ఇటువంటి యోగం అంటే ఆ సర్వవ్యాప్త భగవంతుని శక్తితో కలయిక ఈ సహజ యోగం ద్వారా సిద్ధిస్తుంది. శ్రీ లలితా సహస్రనామావళిలో పొందుపరచిన మంత్రాల సారాంశం కుండలిని జాగృతి ద్వారా ఆత్మసాక్షాత్కారం పొందగోరటమే. 

సాధారణంగా మనం ఎల్లప్పుడూ గతానికి సబంధించిన లేక భవిష్యత్‌ ప్రణాళికలకు సంబంధించిన విషయాలను ఆలోచిస్తూ ఉండటం వల్ల, శారీరకంగానూ, మానసికంగానూ సమతుల్యత లోపించటం వలన సదా మానసిక ఒత్తిడికి, శ్రమకు గురవుతూ ఉంటాం. 

అయితే సహజయోగలో కుండలినీ జాగృతి ద్వారా ఆత్మసాక్షాత్కారం పొందినప్పుడు మనల్ని ఎల్లప్పుడూ వర్తమానంలో ఉంచడం వల్ల మనం సమతుల్యతలో ఉండటం జరుగుతుంది. ఈ స్థితిని పొందటాన్ని ‘ఆధ్యాత్మిక పరివర్తన’ అని చెప్పవచ్చును.
– డాక్టర్‌ పి. రాకేష్‌ 
(శ్రీ మాతాజీ నిర్మలాదేవి ప్రసంగాల ఆధారంగా) 

(చదవండి: పవిత్రం... ఫలప్రదం భీష్మ ఏకాదశి..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement