
చైత్రశుక్ల దశమికే ధర్మరాజ దశమి అని పేరు. సాధారణంగా ధర్మరాజన గానే పాండవ జ్యేష్ఠుడైన ధర్మరాజే అందరికీ గుర్తొస్తాడు. కానీ ఇక్కడ ధర్మరాజంటే యమ ధర్మరాజు. ఈ దశమి రోజు యముడిని పూజిస్తే మరణభయం తొలగి΄ోతుందని పెద్దలు చెబుతారు. ముఖ్యంగా నచికేతుడి కథ వినడం ఈ ధర్మరాజ దశమి రోజు చాలా మంచిది.
ఇక నచికేతుడి కథలోకి వెళితే..
పూర్వం వాజశ్రవసుడనే బ్రాహ్మణుడున్నాడు. అతను ఒకసారి విశ్వజిత్ యాగాన్ని సంకల్పించాడు. యాగం అద్భుతంగా సాగి, నిరాటంకంగా ముగిసింది. వాజశ్రవసుడు తన వద్ద ఉన్న వాటన్నింటినీ అడిగిన వారికల్లా లేదనకుండా దానాలు చేయసాగాడు. బాల్యచాపల్యంతో నచికేతుడు తండ్రి దగ్గరకు వెళ్లి,‘‘నాన్నా! నన్నెవరికి దానం చేస్తారు?’’ అని అడిగాడు.
పిల్లవాడు అదే ప్రశ్నను మాటిమాటికీ అడగడంతో, తండ్రి చికాకుతో ‘నిన్ను ఆ యముడికి దానం చేస్తున్నాను అన్నాడు. తండ్రి నోటినుంచి ఆ మాట వినిపించగానే, నచికేతుడు ఆ యమునికి తనను తాను అర్పించుకునేందుకు బయలుదేరాడు.
యమలోకంలో నచికేతునికి యముని దర్శనం అంత త్వరగా లభించలేదు. ఎప్పుడో మూడు రోజుల తరువాత నచికేతుని గమనించాడు యముడు. అతని నుంచి విషయం తెలుసుకున్నాడు. బాలుడైన నచికేతుని సత్యనిష్ఠకు ముచ్చటపడి, ‘‘నువ్వు నా ద్వారం ముందు మూడురోజుల΄ాటు నిద్రాహారాలు లేకుండా గడి΄ావు కాబట్టి, నేను నీకు మూడు వరాలను ఇస్తాను.. తీసుకో..’’ అన్నాడు. ’మీరు నన్ను దానంగా స్వీకరించలేదు కాబట్టి, నా తండ్రి నా మీద కోపగించుకో కుండా, నన్ను సంతోషంగా తిరిగి స్వీకరించాలి. అదే నా తొలి కోరిక’ అన్నాడు నచికేతుడు.
దానికి యముడు ’తథాస్తు’ అన్నాడు. ఇక రెండవ కోరికగా, ’ఎవరైనా సరే.. స్వర్గాన్ని చేరుకునేలా ఒక యజ్ఞాన్ని అనుగ్రహించండి’ అన్నాడు నచికేతుడు. యముడు, ’నచికేత యజ్ఞం’ పేరుతో ఒక యజ్ఞాన్ని ఉపదేశించాడు. ఇక మూడవ కోరికగా, ’చనిపోయిన తరువాత మనిషి ఏమవుతాడు?’ అని అడిగాడు నచికేతుడు. నచికేతుని తృష్ణను చూసిన యముడు ముచ్చటపడి అతడికి ఆత్మతత్వం గురించి సుదీర్ఘంగా వివరించాడు.
ఆత్మజ్ఞానం గురించి యముడికీ నచికేతునికీ మధ్య జరిగిన సంభాషణే, కఠోపనిషత్తులో ముఖ్య భాగం వహిస్తుంది. నిజానికి ఈ ఉపనిషత్తు, మరో భగవద్గీతను తలపిస్తుంది. అందుకే వివేకానందుల వంటి జ్ఞానులకి, ‘కఠోపనిషత్తు’ అంటే ఎంతో ఇష్టం. ‘నచికేతుడి వంటి దృఢమైన విశ్వాసం ఉన్న ఓ పది పన్నెండు మంది పిల్లలు ఉంటే, ఈ దేశానికే ఒక కొత్త దిశను చూపించగలను’ అంటారు వివేకానందులవారు.
– .డి.వి.ఆర్.
(నేడు ధర్మరాజ దశమి)