Dharmaraju
-
నిదానమే.. ప్రధానం!
మేధాతిథి అనే తాపసుని పుత్రుడు చిరకారి. అతడు ఏ పనిని తొందర పడి చేయడు. చక్కగా అలోచించి చేస్తాడు. అందువలన అందరూ అతనిని చిరకారి అని పిలిచేవారు. ఒకసారి మేధాతిథికి భార్యపై బాగా కోపం వచ్చింది. కొడుకును పిలిచి ఆమెను చంపమని ఆజ్ఞాపించి అతడు ఎక్కడికో వెళ్ళిపోయాడు. చిరకారి చాలా సేపు ఇలా ఆలోచించాడు..‘తండ్రి ఆజ్ఞను ఉల్లంఘించటం మంచిది కాదు. అలాగని తల్లిని చంపటం యుక్తం కాదు. తల్లి నెలాగైనా కాపాడుకోవాలి. తల్లిదండ్రుల మధ్య పుత్రత్వం అనేది స్వేచ్ఛ లేనిదిగా ఉంది. నేను ఇద్దరికీ చెందినవాడను. ఈ క్లిష్ట పరిస్థితిలో వీరిద్దరిలో ఎవరిని వదులుకోవాలి? కొడుకు ఏ వయ సులో ఉన్నా తల్లి ప్రేమ, రక్షణ బాధ్యత ఒకే విధంగా ఉంటాయి. తల్లి లేకపోతే లోకం శూన్యమై పోతుంది. ఇంతటి పూజ్యురాలైన తల్లిని వధించటానికి నాకు చేతులెలా వస్తాయి?’ అనుకుంటూ చిరకారి సుదీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు.‘మాతృ దేవోభవ’ అనే సూక్తి కూడా తల్లినే ప్రథమ దైవంగా భావించమని బోధించింది. చిరకారి తండ్రి మాట కాదనలేక, తల్లిని చంపలేక కత్తి చేత్తో పట్టుకుని ఆలోచిస్తూ ఉండగా, మేధాతిథిలో పశ్చా త్తాప భావన మొదలైంది. చిన్న తప్పుకు కోపించి భార్యను చంపమని కొడుకుని ఆజ్ఞాపించాను. చిరకారి ఏ పనైనా దీర్ఘంగా అలోచించి కాని చేయడు. మాతృ వధకు పూనుకోకుండా తన పేరు సార్థకం చేసుకుంటే బాగుండును అనుకుంటూ ఇంటికి వస్తాడు. చిరకారి చేతిలో ఖడ్గాన్ని వదిలి తండ్రి పాదాలకు నమస్కరించాడు. భార్య కూడా ఆయనకు నమస్కరించింది. ఆయన వారిద్దరినీ దీవించాడు. ఏ పనైనా తొందరపడక, ఆలోచించి ధీరత్వంతో చేసేవాడు సమస్త శుభాలు పొందు తాడని మేధాతిథి చెబుతాడు.ధర్మరాజు కార్యాచరణలో అవసరమైనది బహు దీర్ఘ సమయమా? అత్యల్ప సమయమా అని భీష్ముని అడిగినప్పుడు ఆయన చిరకారి కథ చెప్పి అలా చేయమని చెబుతాడు. ఏ పనినైనా తొందరపాటుతో చేస్తే అనర్థాలు కలుగుతాయి. అలోచించి చేస్తే సత్ఫలితాలు కలుగుతాయి అని సారాంశం. – డా. చెంగల్వ రామలక్ష్మి -
విధి బలీయం...
జనమేజయుడు పరీక్షిత్తు కుమారుడు, అభిమన్యుడి మనుమడు. ఓ సర్పం మూలంగా తన తండ్రి మరణించడంతో యావత్తూ సర్పజాతినే నిర్మూలించేందుకు సర్పయాగం చేయించి, చరిత్రకెక్కినవాడు. అటువంటి జనమేజయుడు ఒకసారి వ్యాసమహర్షిని సందర్శించాడు. భక్తితో ఆయనకు నమస్కరించి, ‘‘మహామునీ, కురుక్షేత్ర సంగ్రామం జరుగుతుందని మీకు ముందే తెలుసుకదా, ఎంతో తపశ్శక్తి సంపన్నులైన మీరు అది తెలిసి ఉండి కూడా, ఆ సంగ్రామాన్ని ఎందుకు ఆపలేకపోయారు? మీరు ఆపి ఉంటే ఎంతో జననష్టం, ధనష్టం తప్పి ఉండేది కదా’’ అని అడిగాడు. అందుకు వ్యాసులవారు నవ్వుతూ ‘‘జనమేజయా! విధి ఎంతో బలీయమైనది. దానిని ఎవరూ తప్పించలేరు. ఆ మాటకొస్తే శ్రీకృష్ణుడు స్వయంగా భగవానుడు కదా! ఆయనే యుద్ధాన్ని నివారించలేకపోయాడు కదా’’ అన్నాడు. కాని, జనమేజయుడు మాత్రం ‘‘మీరు చెబితే ధర్మరాజు తప్పక విని ఉండేవాడు, దుర్యోధనుడు కూడా సంధికి ఒప్పుకునేవాడు, సమర్థులై ఉండీ మీరు చూస్తూ ఊరుకున్నారు. జరగబోయేదాని గురించి నాకు గనక ముందుగా తెలిసి ఉంటే, నేను దానిని తప్పక నివారించి ఉండేవాడిని’’ అంటూ వ్యాసుడిని తూలనాడాడు. విసిగిపోయిన వ్యాసుడు ‘‘సరే, నీకో సంగతి చెబుతాను. జాగ్రత్తగా విను. నీవు పొరపాటున కూడా ఉత్తరం వైపున ఉన్న అరణ్యానికి వెళ్లకు. వెళ్లినా, అక్కడ నీకు కనిపించిన అడవిపందిని వేటాడకు. ఒకవేళ వేటాడినా, అప్సరసగా మారిన ఆ పందిని వివాహమాడకు. వివాహమాడినా, మేలుజాతి గుర్రాలను కొనకు. ఒకవేళ కొన్నా, ఆమెతో కలసి యజ్ఞం చేయకు. చేసినా, వయసులో ఉన్న రుత్విజులను నియమించకు... అలా చేస్తే నీకు ఎన్నో కష్టనష్టాలు కలుగుతాయి’’ అని హెచ్చరించాడు. సరేనంటూ వ్యాసుడికి నమస్కరించి, అక్కడినుంచి వెళ్లిపోయాడు జనమేజయుడు ఇది జరిగి చాలా ఏళ్లు గడవడంతో రాజ్యపాలనలో పడి, తనకు, వ్యాసమునికీ మధ్య జరిగిన సంభాషణను పూర్తిగా మరచిపోతాడు. తర్వాత కొంతకాలానికి జనమేజయుడికి తన రాజ్యప్రజలు ఓ అడవిపంది వల్ల పంటనష్టం, ప్రాణనష్టం జరిగి తంటాలు పడుతున్న విషయం తెలుస్తుంది. ఆ పంది తన రాజ్యానికి ఉత్తర దిక్కునే ఉన్న అడవినుంచి వస్తోందని తెలిసి వెంటనే అక్కడికి వెళ్తాడు. అక్కడ తనకు కనిపించిన అడవిపంది మీద బాణాల వర్షం కురిపించి, దానిని సంహరిస్తాడు. అప్పుడు ఆ అడవిపంది కాస్తా ఓ అందమైన అమ్మాయిగా మారుతుంది. తాను ఓ అప్సరసనని, శాపవశాన ఇలా అడవిపందిగా మారానని, తనను వివాహం చేసుకోమని బలవంతం చేస్తుంది. రాజు ఆమెను పెళ్లాడి, రాజ్యానికి తీసుకెళతాడు. అప్పుడు గుర్తొస్తుంది జనమేజయునికి తాను వ్యాసునికిచ్చిన మాట. కానీ, చేసేదేమీలేక మిన్నకుండిపోతాడు. ఆ తర్వాత మరికొద్దికాలానికి మేలుజాతి అశ్వమొకటి బేరానికి వస్తే బోలెడంత ధనమిచ్చి దానిని కొంటాడు. సకల శుభలక్షణాలున్న ఆ అశ్వం ఉంది కాబట్టి అశ్వమేధయాగం చేయమని చాలామంది సలహా ఇస్తారు. దాంతో జనమేజయుడు అశ్వమేధయాగం ఆరంభిస్తాడు. కనీసం ఇక్కడైనా జాగ్రత్తగా ఉందామని బాగా అనుభవజ్ఞులైన వృద్ధ రుత్విజులను యాగానికి ఆహ్వానిస్తాడు. తీరా ముహూర్తం సమీపించాక వారిలో కొందరు జబ్బుపడి రాలేకపోవడంతో విధిలేక కొందరు యువ రుత్విజులను నియమిస్తాడు. యజ్ఞం జరిగే సమయానికి జనమేజయుడి భార్య అక్కడకు వచ్చి, తన మేలిముసుగు తీసి, ఆ రుత్విజులను చూసి అందంగా నవ్వుతుంది. దాంతో మనసు చలించిన రుత్విజులు యాగం మీద దృష్టి పెట్టలేక మంత్రాలు తప్పుగా చదువుతూ, యాగప్రక్రియను కూడా తప్పుగా జరిపిస్తారు. యాగం లోపభూయిష్టంగా జరగడంతో, యాగకర్త అయిన జనమేజయునికి కుష్టువ్యాధి వస్తుంది. రాజ్యాన్ని కోల్పోతాడు. అప్పుడు పశ్చాత్తాపంతో కంట తడిపెడుతూ, విధి ఎంత బలీయమైనదో కదా అని వేదవ్యాసుని తలచుకుని బాధపడతాడు జనమేజయుడు. -
ధర్మజుని గర్వభంగం
పురానీతి ధర్మరాజు అశ్వమేథ యాగం చేశాడు. ఈ సందర్భంగా ప్రజలందరికీ అన్నదానాలు, గోదానాలు, భూదానాలు, హిరణ్యదానాలు, వస్తుదానాలు చేశాడు. యాగం చేసిన రుత్విక్కులకు, బ్రాహ్మణులకు భూరిదక్షిణలిచ్చాడు. ధర్మరాజు దానగుణానికి అందరూ అనేక విధాలుగా ప్రశంసిస్తున్నారు. అది చూసి ధర్మజునిలో కొద్దిగా అహంకారం పొడసూపింది. ఇంతలో ఎక్కడినుంచి వచ్చిందో ఒక ముంగిస వచ్చింది. దాని శరీరం మూడువంతుల వరకు బంగారు రంగులో మెరుస్తోంది. అది సభాసదులను, ధర్మరాజును చూసి పకనకా నవ్వింది. అందరూ ఆశ్చర్యంగా, కోపంగా ‘‘ఎవరు నువ్వు? ఎలా వచ్చావిక్కడికి? ఎందుకు నవ్వుతున్నావు?’’ అని అడిగారు. ‘‘నేనెవరినో, ఎందుకు వచ్చానో తర్వాత చెబుతాను. మీరంతా ధర్మరాజును పొగడ్తలతో ముంచెత్తుతుంటే నవ్వు వచ్చింది. ఎందుకంటే, రారాజైన ధర్మరాజు చేసిన యాగం కానీ, దానధర్మాలు కానీ నిరుపేద బ్రాహ్మణుడైన సక్రుప్రస్థుడు చేసిన దానికన్నా గొప్పవి కావు కాబట్టి నవ్వొచ్చింది’’ అంది. ‘‘ఇంతకీ ఎవరా సక్రుప్రస్థుడు?’’ అనడిగాడు ధర్మరాజు అసూయగా. అప్పుడా ముంగిస ఇలా చెప్పింది. ‘‘కురుక్షేత్రంలో సక్రుప్రస్థుడనే పేద బ్రాహ్మణుడున్నాడు. ఆయనకు భార్య, కుమారుడు, కోడలు ఉన్నారు. వారు ఒక చిన్న పూరిపాక నిర్మించుకుని అందులో నివాసం ఉంటున్నారు. ఆ పక్కనే నా బిలం ఉంది. ఆయన వెదురుబియ్యాన్ని ఏరుకొస్తే, దానినే పిండి చేసుకుని అందరూ జీవించేవారు. ఉన్నదానిలోనే ఆయన అతిథి అభ్యాగతులను ఆదరిస్తూ, సంతృప్తిగా జీవిస్తున్నాడు. ఆయన భార్య, కొడుకు, కోడలు అందరూ ఆయన అడుగుజాడల్లోనే నడుస్తున్నారు. ఒకసారి ఆ ప్రాంతంలో తీవ్రమైన దుర్భిక్షం నెలకొంది. దాంతో ఆయనకు వెదురుబియ్యమే కాదు, ఎక్కడా భిక్ష కూడా దొరకడం లేదు. ఆకలి బాధకు అందరూ ప్రాణాలు కళ్లల్లో పెట్టుకుని ఉన్నారు. ఈ పరిస్థితుల్లోనే ధర్మదేవతకు ఆయనను పరీక్షించాలని బుద్ధిపుట్టి వారి ఇంటికి బాటసారి వేషంలో అతిథిగా వచ్చాడు. అప్పటికే మూడురోజుల నుంచి పస్తులున్న ఆ కుటుంబం తలా పిడికెడు పేలపిండిని తినడానికి కూర్చున్నారు. ఇంతలో అతిథి రావడంతో ఇంటి యజమాని అతణ్ణి సాదరంగా ఆహ్వానించి, కాళ్లకు నీళ్లిచ్చి, విస్తరి వేసి తన వాటా పేలపిండిని సమర్పించాడు. అతిథికి ఆకలి తీరినట్టు కనిపించలేదు. దాంతో సక్రుప్రస్థుని భార్య తన వాటా ఇచ్చింది. అది తిన్నాక కూడా, అతిథి కళ్లల్లో ఆకలి తీరిన జాడలు కనిపించలేదు. కుమారుడు తన వంతు పేలపిండిని ఇచ్చాడు. ఊహు.. ఆకలి తీరనే లేదు. కోడలు తన పేలపిండిని తెచ్చి వడ్డించింది. అప్పుడా అతిథి తృప్తిగా తేన్చాడు. ఒకపక్క ఆకలితో ప్రాణాలు కడగట్టిపోతున్నా సరే, అతిథినే దేవుడిగా ఎంచిన ఇంటి యజమాని, అతని ఆకలి తీర్చడమే తన బాధ్యతగా భావించాడు. అతని బాటలోనే అతని భార్య, కొడుకు, కోడలు కూడా నడిచారు. వారి త్యాగానికి మెచ్చిన ధర్మదేవత తన నిజరూపంతో వారికి సాక్షాత్కారమిచ్చాడు. వారికోసం బ్రహ్మలోకం నుంచి విమానం వచ్చింది. ఆ నలుగురినీ వెంటబెట్టుకుని ధర్మదేవత సగౌరవంగా స్వర్గానికి తీసుకెళ్లాడు. ఇదంతా చూసిన నేను సక్రుప్రస్థుడు అతిథికి అర్ఘ్యమిచ్చిన నీటిలో పొర్లాడాను. ఆ నీటితో తడిసినంత మేరా నా శరీర భాగాలు బంగారు రంగులోకి మారిపోయాయి. మిగతావి కూడా సువర్ణమయం అవుతాయేమోనన్న ఆశతో నేను ఎన్నో యజ్ఞశాలలకు వెళ్లి, వారు యజ్ఞం చేసిన ప్రదేశంలో పొర్లాడుతున్నాను కానీ, నా శరీరం బురదమయం, బూడిద మయం అవుతున్నదేగానీ, సువర్ణరూపు సంతరించుకోనేలేదు. ఇంతలో ధర్మరాజు గురించి విని, ఇక్కడికి వచ్చాను. ఇప్పటివరకూ అతడు దానం చేసిన గోవులు తరలి వెళ్లగా ఏర్పడిన మడుగులో పొర్లాడి వచ్చాను కానీ ఏమీ ప్రయోజనం లేకపోయింది. అది అతన్నే అడుగుదామని ఇక్కడికి వచ్చేసరికి మీరంతా అతన్ని పొగడ్తలతో ముంచెత్తడం చూసి నాకు నవ్వు వచ్చింది. ధర్మరాజు చేసిన దాన ధర్మాలేవీ భక్తితో చేసినవి కాదు. అహంకారంతో కూడుకున్నవి. అసలు అదంతా అతని కష్టార్జితం అయితేనే కదా... దాని ఫలితం అతనికి దక్కేది’’ అంటూ మరోమారు ఫక్కున నవ్వింది. ధర్మరాజుకు తల తీసేసినట్లయింది. అసంకల్పితంగా కృష్ణునివైపు చూశాడు. శ్రీకృష్ణుడు చిద్విలాసంగా చూస్తూ, జగన్మోహనంగా నవ్వాడు. ధర్మరాజుకు తన తప్పు తెలిసి వచ్చింది. - డి.వి.ఆర్ -
ప్రశ్నే ప్రగతికి మెట్టు! హేతువాదంతోనే పట్టు!!
కులము నీరుజేసె గురువును జంపించె పొసగ యేనుగంత బొంకు బొంకె పేరు ధర్మరాజు పెను వేప విత్తయా విశ్వదాభిరామ వినుర వేమ! పద్యానవనం మహాభారత కథలో పెద్దమనిషిగా చలామణి అయిన ధర్మరాజులోని ధర్మమెంతో తేటతెల్లం చేశాడు ప్రజాకవి వేమన. పేరుకే ధర్మరాజు తప్ప చెటక్కున చేదుగా ఉండే వేపవిత్తు లాంటి వాడని చెబుతాడు. సత్యవాక్పాలకుడని పేరుండీ యుదిష్ఠరుడు ఏనుగంత అబద్ధమాడాడు. ‘అశ్వత్థామ చనిపోయాడు...’ అని గట్టిగా అరిచి, వినిపించీ వినిపించనంత నెమ్మదిగా ‘...అది మనిషో! ఏనుగో!’ అని ఓ సందేహాన్ని జతజేసి వదిలాడు. మాటలు వినిపించని ఫలితంగా తన కుమారుడు చనిపోయాడని భావించి, ధర్మరాజు మాటల్ని నమ్మి... యుద్ధభూమిలో అస్త్రసన్యాసం చేసిన ద్రోణుడ్ని హతమారుస్తారు. బంగారు లేడి భూమ్మీద ఉంటుందా? ఉండదా? అన్న కనీస విచక్షణ చేయకుండానే మహిళను ఒంటరిగా వీడిపోయిన రాముడ్ని ప్రస్తావిస్తూ, ‘తెలివిలేనివాడు దేవుడెట్లాయెరా?’ అని ప్రశ్నిస్తాడు వేమన. పాలసముద్రంలోనే పవళించే విష్ణుమూర్తి కృష్ణుడిగా పొరిగిళ్లలో పాలెందుకు దొంగిలిస్తాడు? అని సందేహం లేవనెత్తి, ‘ఎదుటివారి సొత్తు ఎల్లవారికి ప్రీతి’ అని సూత్రీకరిస్తాడు. అధునికులు హేతువాద లక్ష్యాలుగా పేర్కొన్న గుడ్డినమ్మకాలకు వ్యతిరేకంగా మాట్లాడటం, విగ్రహారాధనను నిరసించడం, స్వర్గ-నరకాల్ని, ఆత్మ-పరమాత్మ వాదాల్ని, మత దురాచారాల్ని ఒప్పుకోకపోవడం వేమన పద్యాల్లో కొట్టొచ్చినట్టు కనిపించే లక్షణం. ‘శిలను ప్రతిమచేసి చీకటింటను బెట్టి మ్రొక్కవలదు వెర్రి మూఢులార! యుల్లమందు బ్రహ్మయుండుట తెలియుడి...’ అంటాడు. అదే విధంగా, ‘కొండరాళ్లు తెచ్చి కోరిక గట్టిన గుళ్లలోన దిరిగి కుళ్లనేల? పాయరాని శివుడు ప్రాణియై యుండగ...’ అంటూ, దేహమే దేవాలయం-జీవుడే సనాతన దైవం అన్న భావనకు పెద్దపీట వేశాడు. వేదాల్లో, ఉపనిషత్తుల్లో, పురాణాల్లో, ప్రాచీన-ఆధునిక సాహిత్యంలో ఉన్న కొన్ని ప్రస్తావనల్ని బట్టి హేతుబద్ధమైన ఆలోచన అనాదిగా వస్తున్నదే అని స్పష్టమౌతోంది. మానవేతిహాసంలో ప్రశ్నే ప్రగతికి మెట్టుగా వస్తోంది. ఏమిటి? ఎందుకు? ఎలా? అనే ప్రశ్నలే మనిషి జిజ్ఞాసకు ప్రతీకలుగా నిలిచాయి. భవిష్యత్తులో మానవ విజ్ఞాన-వికాసాలకు అవి బాటలు పరిచాయి. కాల పరీక్షకు నిలువని కట్టు కథల్ని, కుహనావాదాల్ని, వాస్తవ విరుద్ధాల్ని ప్రశ్నించే వారికి కష్టాలెదురైన సందర్భాలు అన్ని కాలాల్లోనూ ఉన్నాయి. శ్రీరామచంద్రుడిని వానప్రస్థానికి వెళ్లనవసరం లేదని చెబుతూ ‘కళ్లకు కనిపించేదే సత్యమని, కనిపించనిది లేదని బోధ చేస్తాడు’ సత్యకామ జాబాలి. నాస్తికుడని ముద్రవేసి ఆయన వాదనల్ని రాముడు తిరస్కరిస్తాడు. దేవతల అస్తిత్వాన్ని నిరాకరించిన వారిని ‘అదేవాః’ అని నిరసించారనే ప్రస్తావన ఋగ్వేదంలో ఉంది. యుద్ధంలో జరిగిన హింసకు ధర్మరాజును చార్వాకుడొకరు ప్రశ్నించినట్టు, ఫలితంగా హత్యకు గురైనట్టు మహాభారత శాంతిపర్వంలో ఓ ఉదంతముంది. పార్వతి కేశాలు సహజగంధ విలసితాలు కావని అన్నందుకు శివుని కోపానికి గురై కుష్ఠురోగిగా నత్కీరుడు శాపగ్రస్తుడైన కథ కాళహస్తీ మహాత్మ్యం చెబుతోంది. ఆయన చేసిందల్లా ఉన్నదున్నట్టు మాట్లాడటం. 12 శతాబ్ద కాలంలో శివకవులు కొంత సంస్కరణ వాదులుగా ఉండటంతో ఆ సమయంలో వచ్చిన కవిత్వానికి హేతుబద్ధత జోడింపు జరిగింది. వీరశైవం స్థాపించిన బసవేశ్వరుడు గొప్ప అభ్యుదయవాదిగా మన్నన పొందాడు. యజ్ఞయాగాదుల్ని, కుల-మత వ్యత్యాసాల్ని, స్త్రీ పురుష అసమానతల్ని నిరసించాడు. అస్పృశ్యతని ఈసడించి సామూహిక సహపంక్తి భోజనాలు జరిపించాడు. సంకీర్తనాచార్యుడు తాళ్లపాక అన్నమాచార్యుడు ఒక రకంగా సామ్యవాద భావనల్ని అరటిపండొలిచినట్టు చెప్పాడు. ‘‘నిండారా రాజు నిద్రించు నిద్రయు నొకటె అండనే బంటు నిద్ర అదియు నొకటే, మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి యొకటే చండాలుండేటి సరిభూమి యొకటే, అనుగు దేవతలకు అలకామ సుఖమొకటే ఘనకీట పశువులకు కామ సుఖమొకటే...’’ అంటూ సృష్టిలోని జీవులన్నీ ఒకటే అనే విశాల దృక్పథాన్ని వెల్లడించాడు. యుగకర్త గురజాడ అప్పారావు ‘ఎల్లలోకము లొక్కయిల్లై, వర్ణభేదములెల్ల కల్లై, మేల మెరుగని ప్రేమ బంధము వేడుకలు కురియు, మతములన్నియు మాసిపోవును జ్ఙానమొక్కటె నిలిచి వెలుగును’ అని ముత్యాల సరాలు కూర్చారు. హేతువుకు నిలువని మూఢభక్తిని నిరసించిన ఎందరో మహానుభావులు ‘మానవసేవే మాధవ సేవ’ అన్నారు. ‘శిథిలాలయమ్మున శివుడు లేడోయి, ప్రాంగణమ్మున గంట పలుకలేదోయి...’ అన్న దేవులపల్లి కృష్ణశాస్త్రి, మతిలేని మతవాదన పసలేనిదని తేల్చాడు. ప్రశ్న లేకుండా హేతువాదం లేదు. హేతువును వెదకలేని చోట ఆలోచన ఆగుతుంది. ఆలోచన ఆగడమంటే ఆయువు నిలిచిపోవడం లాంటిదే. తస్మాత్ జాగ్రత్త! - దిలీప్ రెడ్డి -
వీడిన సందిగ్ధం
మైసూరు దర్బార్ యథాతథం రాజుకు బదులు సింహాసనంపై పట్టాకత్తి మైసూరు : విశ్వ విఖ్యాత మైసూరు దసరా ఉత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచే ప్రైవేట్ దర్బారును ఈ ఏడాది కూడా సంప్రదాయ పద్ధతిలోనే నిర్వహించనున్నారు. గత డిసెంబరులో మైసూరు సంస్థానాధీశుల చివరి వారసుడు శ్రీకంఠదత్త నరసింహ రాజ ఒడయార్ మరణంతో ఈ దర్బారు నిర్వహణపై అనుమానాలు చోటు చేసుకున్నాయి. ఆయన వారసుడు ఎవరు అనే విషయం ఇంకా ప్రకటించక పోవడం, కోర్టు వ్యాజ్యాల్లో ప్రభుత్వ వైఖరిపై రాణి ప్రమోదా దేవి అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈసారి ప్రైవేట్ దర్బారు ఉండదనే అందరూ అనుకున్నారు. అయితే 400 సంవత్సరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని పక్కన పెట్టి, ప్రైవేట్ దర్బారును రద్దు చేయడం సరికాదని ప్రమోదా దేవికి పలువురు సూచించిన నేపథ్యంలో, ఆమె ఆలోచనలో మార్పు వచ్చింది. ఎప్పటిలాగే దర్బారును నిర్వహించాలని నిర్ణయించారు. వారసుడు లేనందున, పట్టా కత్తిని అలంకరించి, సింహాసనంపై ఉంచి పూజించడం ద్వారా దర్బారును నిర్వహించనున్నారు. ఏటా దసరా సందర్భంగా లోక కళ్యాణార్థం నిర్వహించే పూజా, విధి విధానాలను అర్చకులు పూర్తి చేయనున్నారు. అదే విధంగా ఏనుగు దంతాలను ఆయుధాలుగా చేసుకుని సాగే యుద్ధం (వజ్రముష్టి కాళగ)ను కూడా నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి జట్టి సామాజిక వర్గం వారు ప్రమోదా దేవితో చర్చించారు. మొత్తానికి దసరా సందర్భంగా ప్రైవేట్ దర్బారు నిర్వహణపై ఉన్న నీలి నీడలు తొలగిపోయాయి. మహా భారత కాలంలో ధర్మరాజు ఉపయోగించినదిగా చెబుతున్న 275 కిలోల స్వర్ణ సింహాసనంపై పట్టా కత్తిని ఉంచడం ద్వారా ప్రైవేట్ దర్బారు నిర్వహణకు మార్గం సుగమమైంది. -
మహాభారతం ఏ పర్వంలో ఏముంది?
మహాభారతంలో ఉన్నదంతా లోకంలో ఉన్నది. మహాభారతంలో లేనిదేదీ ఈ లోకంలో లేదు అని లోకోక్తి. మహాభారతంలో పద్దెనిమిది పర్వాలున్నాయని మాత్రమే తెలుసు కాని, ఆ పర్వాలేమిటో, ఏ పర్వంలో ఏముంటుందో తెలిసిన వారు తక్కువనే చెప్పవచ్చు. అటువంటివారికి అవగాహన కోసం... 1. ఆదిపర్వం: రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు, ఆయన కుమార్తె దేవయాని, చంద్రవంశ మహారాజు యయాతిల చరిత్రతోపాటు శకుంతల, దుష్యంతులకు సంబంధించిన అనేక పురాతన కథలను ఇది వివరిస్తుంది. ఈ పర్వంలో అధికభాగం కురువంశ మూలపురుషులైన శంతనుడు, భీష్ముడు, విచిత్రవీర్యుడు, ధృతరాష్ట్రుడు తదితరుల పరిచయం ఉంటుంది. పాండురాజు కథ, పాండవ కౌరవుల జననం, విద్యాభ్యాసం, వారి మధ్య బాల్యం నుంచే పొడసూపే స్పర్థలు, పాంచాల రాకుమారి ద్రౌపదితో పాండవుల వివాహం, అర్జునుడి తీర్థయాత్ర, శ్రీకృష్ణుని చెల్లెలైన సుభద్రతో పరిణయం తదితర విషయాలను కూడా ఆదిపర్వం వివరిస్తుంది. 2. సభాపర్వం: పాండవ ప్రథముడైన యుధిష్ఠిరుడు (ధర్మరాజు) రాజసూయయాగం చేయడం, కౌరవ ప్రథముడైన దుర్యోధనుడు శకుని సాయంతో జూదం గెలవటం, పర్యవసానంగా తలెత్తిన పరిణామాలు ప్రధానాంశాలు. 3. అరణ్యపర్వం: దీనినే వనపర్వం అని కూడా అంటారు. కామ్యక వనంలో పాండవుల వనవాస వర్ణన ఇందులో ఉంటుంది. దీనితోపాటు నలదమయంతుల కథ, సావిత్రిసత్యవంతుల గాథ, ఋష్యశృంగుడు, అగస్త్యుడు, మార్కండేయుడు తదితర మహామునులతోపాటు భగీరథుడు, శిబి వంటి చక్రవర్తుల వృత్తాంతాలు కూడా ఉంటాయి. 4. విరాటపర్వం: విరాటుని కొలువులో పాండవులు అజ్ఞాతవాసం చేయడం, దుష్టుడైన కీచకుని వధ, పాండవులను అజ్ఞాతవాసం నుంచి బయటకు రప్పించి దానిని భగ్నం చేయడానికి, విరాటరాజుకి చెందిన గోవులను పట్టుకున్న కౌరవులతో యుద్ధం, దక్షిణ గోగ్రహణం, ఉత్తర - అభిమన్యుల పరిణయం ఉంటుంది. 5. ఉద్యోగపర్వం: ఒకవైపు శాంతియత్నాలు, మరోవైపు యుద్ధసన్నాహాలు సమాంతరంగా సాగిపోవటం ఈ పర్వం ప్రత్యేకత. కర్ణుడు తన కొడుకే అని తెలిసిన కుంతీదేవి పరితాపం, శాంతియత్నాలు చేస్తూనే పాండవులను యుద్ధసన్నద్ధులను గావించే శ్రీ కృష్ణుని రాజనీతి... ఈ పర్వంలోని ముఖ్యాంశాలు. 6. కర్ణపర్వం: కౌరవ సోదరులలో రెండవవాడైన దుశ్శాసనుడు భీముని చేతిలో నేలకూలటం, మహావీరుడైన కర్ణుడు అర్జునుని చేతిలో వీరమరణం పొందటం... ఇందులోని ప్రధానాంశాలు. 7. భీష్మపర్వం: మహాభారతంలో ఆరవది భీష్మపర్వం. ఇది అతి ముఖ్యమైనది. ప్రపంచ సారస్వతానికే తలమానికమైన భగవద్గీతను శ్రీకృష్ణుడు అర్జునునికి బోధించింది ఈ పర్వంలోనే. పదిరోజుల యుద్ధ వర్ణన, భీష్మపితామహుడి మానవాతీత సాహసాల గురించిన అత్యద్భుత వర్ణన కనిపిస్తుంది. స్వచ్ఛంద మరణమనే వరం ఉండటం వల్ల భీష్ముడు ఉత్తరాయణం ప్రారంభం అయ్యేవరకు తన మరణాన్ని వాయిదా వేసుకుని అంపశయ్య మీదనే విశ్రమించడం ఉంటాయి. 8. ద్రోణపర్వం: ద్రోణాచార్యుల సాహసకృత్యాలు, విధిలేని విపత్కర పరిస్థితిలో ధర్మరాజు పలికిన ‘అశ్వత్థామ హతః’ అనే మాట ఫలితంగా ఆయన అస్త్రసన్యాసం చేసి వీరమరణం పొందటం ఇందులోని ముఖ్యాంశం. ఆ తర్వాత యుద్ధరంగంలో అభిమన్యుడి పోరాట పటిమ, ఆ యువకుడి వీరమరణం ఇతర ముఖ్యాంశాలు. 9. శల్యపర్వం: మహాభారత యుద్ధంలోని చివరి ఘట్టాలను వర్ణించేది శల్యపర్వం. భీమదుర్యోధనుల యుద్ధం, దుర్యోధనుడు తీవ్రంగా గాయపడి మరణించటం ముఖ్యాంశాలు. 10. సౌప్తికపర్వం: ద్రోణుడి కుమారుడైన అశ్వత్థామ ప్రతీకార కార్యకలాపాలు, రాత్రి సమయంలో నిద్రలో ఉన్న ఉపపాండవులను, పాండవుల సైన్యాన్ని, మిత్రపక్షాలను అశ్వత్థామ ఊచకోత కోయటం ఈ పర్వంలో ప్రధానాంశాలు. 11. స్త్రీపర్వం: వీరమరణం పొందిన కురుపాండవ యోధులకు సంబంధించిన భార్యల రోదనలు, విషాద సన్నివేశాలు ఇందులో ఉంటాయి. యుద్ధం ఎప్పుడు జరిగినా చివరకు మిగిలే విషాదం ఇందులో కళ్లకు కడుతుంది. 12, 13. శాంతి, అనుశాసనిక పర్వాలు: ధర్మరాజు అభ్యర్థన మేరకు, వంశకర్త అయిన భీష్ముడు ధర్మానికి సంబంధించిన అద్భుతమైన విషయాలను బోధించటం, అత్యంత ప్రాచుర్యం పొందిన విష్ణు సహస్రనామాలు, శివసహస్రనామాలు, భీష్ముని మరణం, ధర్మరాజుకి పట్టాభిషేకం ఇందులో కనిపిస్తాయి. 14. అశ్వమేధిక పర్వం: శ్రీకృష్ణుడు ద్వారకకు మరలిపోవటం, ధర్మరాజు చేసిన అశ్వమేథయాగ వర్ణన ఉంటాయి. ఒక నిరుపేద బ్రాహ్మణ కుటుంబం చేసిన అత్యున్నత త్యాగాన్ని గుర్తు చేస్తూ ఒక ముంగిస ధర్మరాజును పరాభవించటం ఇందులోని కొసమెరుపు. 15. ఆశ్రమవాసిక పర్వం: కుంతి, గాంధారి సమేతుడై ధృతరాష్ట్రుడు అరణ్యాలకు పయనమవ్వటం, అక్కడ ప్రమాదవశాత్తూ అరణ్యంలో దావాగ్నిలో అసువులు బాయటం ఇందులో చూడవచ్చు. 16. మౌసలపర్వం: యాదవ వీరులు తమ పతనాన్ని తామే కొని తెచ్చుకోవటం, ఒక వేటగాడి చేతిలో శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించటం వంటి ఘట్టాలు ఇందులో ఉంటాయి. 17. మహాప్రస్థానిక పర్వం: పాండవుల అంతిమయాత్ర గురించిన వర్ణన ఇందులో ఉంటుంది. 18. స్వర్గారోహణ పర్వం: భీమార్జున, నకులసహదేవుల మరణం, ధర్మరాజు ఒక్కడే స్వర్గానికి చేరటం ఇందులోని ప్రధానాంశం. - కూర్పు: డి.వి.ఆర్