ప్రశ్నే ప్రగతికి మెట్టు! హేతువాదంతోనే పట్టు!!
కులము నీరుజేసె గురువును జంపించె
పొసగ యేనుగంత బొంకు బొంకె
పేరు ధర్మరాజు పెను వేప విత్తయా
విశ్వదాభిరామ వినుర వేమ!
పద్యానవనం
మహాభారత కథలో పెద్దమనిషిగా చలామణి అయిన ధర్మరాజులోని ధర్మమెంతో తేటతెల్లం చేశాడు ప్రజాకవి వేమన. పేరుకే ధర్మరాజు తప్ప చెటక్కున చేదుగా ఉండే వేపవిత్తు లాంటి వాడని చెబుతాడు. సత్యవాక్పాలకుడని పేరుండీ యుదిష్ఠరుడు ఏనుగంత అబద్ధమాడాడు. ‘అశ్వత్థామ చనిపోయాడు...’ అని గట్టిగా అరిచి, వినిపించీ వినిపించనంత నెమ్మదిగా ‘...అది మనిషో! ఏనుగో!’ అని ఓ సందేహాన్ని జతజేసి వదిలాడు. మాటలు వినిపించని ఫలితంగా తన కుమారుడు చనిపోయాడని భావించి, ధర్మరాజు మాటల్ని నమ్మి... యుద్ధభూమిలో అస్త్రసన్యాసం చేసిన ద్రోణుడ్ని హతమారుస్తారు.
బంగారు లేడి భూమ్మీద ఉంటుందా? ఉండదా? అన్న కనీస విచక్షణ చేయకుండానే మహిళను ఒంటరిగా వీడిపోయిన రాముడ్ని ప్రస్తావిస్తూ, ‘తెలివిలేనివాడు దేవుడెట్లాయెరా?’ అని ప్రశ్నిస్తాడు వేమన. పాలసముద్రంలోనే పవళించే విష్ణుమూర్తి కృష్ణుడిగా పొరిగిళ్లలో పాలెందుకు దొంగిలిస్తాడు? అని సందేహం లేవనెత్తి, ‘ఎదుటివారి సొత్తు ఎల్లవారికి ప్రీతి’ అని సూత్రీకరిస్తాడు. అధునికులు హేతువాద లక్ష్యాలుగా పేర్కొన్న గుడ్డినమ్మకాలకు వ్యతిరేకంగా మాట్లాడటం, విగ్రహారాధనను నిరసించడం, స్వర్గ-నరకాల్ని, ఆత్మ-పరమాత్మ వాదాల్ని, మత దురాచారాల్ని ఒప్పుకోకపోవడం వేమన పద్యాల్లో కొట్టొచ్చినట్టు కనిపించే లక్షణం. ‘శిలను ప్రతిమచేసి చీకటింటను బెట్టి మ్రొక్కవలదు వెర్రి మూఢులార! యుల్లమందు బ్రహ్మయుండుట తెలియుడి...’ అంటాడు. అదే విధంగా, ‘కొండరాళ్లు తెచ్చి కోరిక గట్టిన గుళ్లలోన దిరిగి కుళ్లనేల? పాయరాని శివుడు ప్రాణియై యుండగ...’ అంటూ, దేహమే దేవాలయం-జీవుడే సనాతన దైవం అన్న భావనకు పెద్దపీట వేశాడు.
వేదాల్లో, ఉపనిషత్తుల్లో, పురాణాల్లో, ప్రాచీన-ఆధునిక సాహిత్యంలో ఉన్న కొన్ని ప్రస్తావనల్ని బట్టి హేతుబద్ధమైన ఆలోచన అనాదిగా వస్తున్నదే అని స్పష్టమౌతోంది. మానవేతిహాసంలో ప్రశ్నే ప్రగతికి మెట్టుగా వస్తోంది. ఏమిటి? ఎందుకు? ఎలా? అనే ప్రశ్నలే మనిషి జిజ్ఞాసకు ప్రతీకలుగా నిలిచాయి. భవిష్యత్తులో మానవ విజ్ఞాన-వికాసాలకు అవి బాటలు పరిచాయి. కాల పరీక్షకు నిలువని కట్టు కథల్ని, కుహనావాదాల్ని, వాస్తవ విరుద్ధాల్ని ప్రశ్నించే వారికి కష్టాలెదురైన సందర్భాలు అన్ని కాలాల్లోనూ ఉన్నాయి. శ్రీరామచంద్రుడిని వానప్రస్థానికి వెళ్లనవసరం లేదని చెబుతూ ‘కళ్లకు కనిపించేదే సత్యమని, కనిపించనిది లేదని బోధ చేస్తాడు’ సత్యకామ జాబాలి. నాస్తికుడని ముద్రవేసి ఆయన వాదనల్ని రాముడు తిరస్కరిస్తాడు.
దేవతల అస్తిత్వాన్ని నిరాకరించిన వారిని ‘అదేవాః’ అని నిరసించారనే ప్రస్తావన ఋగ్వేదంలో ఉంది. యుద్ధంలో జరిగిన హింసకు ధర్మరాజును చార్వాకుడొకరు ప్రశ్నించినట్టు, ఫలితంగా హత్యకు గురైనట్టు మహాభారత శాంతిపర్వంలో ఓ ఉదంతముంది. పార్వతి కేశాలు సహజగంధ విలసితాలు కావని అన్నందుకు శివుని కోపానికి గురై కుష్ఠురోగిగా నత్కీరుడు శాపగ్రస్తుడైన కథ కాళహస్తీ మహాత్మ్యం చెబుతోంది. ఆయన చేసిందల్లా ఉన్నదున్నట్టు మాట్లాడటం.
12 శతాబ్ద కాలంలో శివకవులు కొంత సంస్కరణ వాదులుగా ఉండటంతో ఆ సమయంలో వచ్చిన కవిత్వానికి హేతుబద్ధత జోడింపు జరిగింది. వీరశైవం స్థాపించిన బసవేశ్వరుడు గొప్ప అభ్యుదయవాదిగా మన్నన పొందాడు. యజ్ఞయాగాదుల్ని, కుల-మత వ్యత్యాసాల్ని, స్త్రీ పురుష అసమానతల్ని నిరసించాడు. అస్పృశ్యతని ఈసడించి సామూహిక సహపంక్తి భోజనాలు జరిపించాడు. సంకీర్తనాచార్యుడు తాళ్లపాక అన్నమాచార్యుడు ఒక రకంగా సామ్యవాద భావనల్ని అరటిపండొలిచినట్టు చెప్పాడు. ‘‘నిండారా రాజు నిద్రించు నిద్రయు నొకటె అండనే బంటు నిద్ర అదియు నొకటే, మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి యొకటే చండాలుండేటి సరిభూమి యొకటే, అనుగు దేవతలకు అలకామ సుఖమొకటే ఘనకీట పశువులకు కామ సుఖమొకటే...’’ అంటూ సృష్టిలోని జీవులన్నీ ఒకటే అనే విశాల దృక్పథాన్ని వెల్లడించాడు.
యుగకర్త గురజాడ అప్పారావు ‘ఎల్లలోకము లొక్కయిల్లై, వర్ణభేదములెల్ల కల్లై, మేల మెరుగని ప్రేమ బంధము వేడుకలు కురియు, మతములన్నియు మాసిపోవును జ్ఙానమొక్కటె నిలిచి వెలుగును’ అని ముత్యాల సరాలు కూర్చారు. హేతువుకు నిలువని మూఢభక్తిని నిరసించిన ఎందరో మహానుభావులు ‘మానవసేవే మాధవ సేవ’ అన్నారు. ‘శిథిలాలయమ్మున శివుడు లేడోయి, ప్రాంగణమ్మున గంట పలుకలేదోయి...’ అన్న దేవులపల్లి కృష్ణశాస్త్రి, మతిలేని మతవాదన పసలేనిదని తేల్చాడు.
ప్రశ్న లేకుండా హేతువాదం లేదు. హేతువును వెదకలేని చోట ఆలోచన ఆగుతుంది. ఆలోచన ఆగడమంటే ఆయువు నిలిచిపోవడం లాంటిదే. తస్మాత్ జాగ్రత్త! - దిలీప్ రెడ్డి