ఒక దేశం ఒక ఎన్నికపై... ఒక మాట! | Sakshi Guest Column On Jamili elections One Nation One Election | Sakshi
Sakshi News home page

ఒక దేశం ఒక ఎన్నికపై... ఒక మాట!

Published Mon, Dec 23 2024 12:05 AM | Last Updated on Mon, Dec 23 2024 5:47 AM

Sakshi Guest Column On Jamili elections One Nation One Election

అభిప్రాయం

‘భిన్నత్వంలో ఏకత్వం’ భారత లక్షణమే కాదు, విలక్షణ సంపద అని పలుమార్లు రుజువైంది. ఉద్వేగ నినాదంగా బాగున్నంత, ‘ఒక దేశం ఒక ఎన్నిక’ ఆచరణ గొప్పగా ఉంటుందనే నమ్మకం లేదు. ఇందులో పలు సమస్యలున్నాయి. దేశంలో రావాల్సిన ఎన్నికల సంస్కరణల్లో ఇదంత ప్రాధాన్యతాంశ మేమీ కాదు! అంతకన్నా ప్రాధాన్య అంశాలెన్నిటికో దిక్కూదివాణం లేక ప్రజాస్వామ్యమే వెనుకడుగులోకి జారుతోంది. ముందు ఆ సంస్కరణలు ముఖ్యం. జమిలితో... అభివృద్ధికి ఉండే ఆటంకాలు తొలగిపోతాయి. సమయం, ఆర్థికమానవ వనరుల దుబారా తగ్గుతుందనేది ఓ ఆశ! కానీ,ప్రాంతీయ అస్తిత్వాలకు అదొక గొడ్డలిపెట్టు. సమాఖ్య స్ఫూర్తికి భంగకరం.  

కేంద్ర ప్రభుత్వం ఆశిస్తున్నట్టుగానే... దేశ మంతటా ఒకేసారి (జమిలి) ఎన్నికలు జరిపించే విషయంలో సమగ్ర చర్చ జరగాలి. శాసనసభల స్పీకర్లతో పాటు మేధావులు, సమాజంలోని విభిన్నవర్గాల ప్రతినిధుల్ని భాగం చేసి చర్చించాలి. మాజీ రాష్ట్రపతి రావ్‌ునాథ్‌ కోవింద్‌ నేతృత్వంలోని కమిటీ సంప్రదింపుల్లో 32 పార్టీలు సానుకూలంగా మాట్లాడి, మద్దతు ప్రకటిస్తే 15 పార్టీలు పూర్తిగా వ్యతిరేకించాయి. వ్యతిరేకిస్తున్న పార్టీల్లో కాంగ్రెస్‌ ఉండటంతో... 1952 నుంచి 1967 వరకు, వరుస నాలుగు ఎన్నికల్లో కేంద్రం రాష్ట్రాల ఎన్నికల్ని కలిపి (జమిలి) నిర్వహించి నపుడు, మరిప్పుడెందుకు సాధ్యపడదు? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అనే ప్రశ్న పాలకపక్షాలు లేవనెత్తుతున్నాయి. 

స్వాతంత్య్రం వచ్చాక జరిగిన తొలి సభలు కావడంతో అది సాధ్యమైంది. తర్వాత ఎన్నో మార్పులొచ్చాయి. భాషా ప్రాతిపదికన రాష్ట్రాల విభజన జరిగింది. అవిశ్వాసాల్లో కొన్ని సభలు అర్ధంతరంగా ముగిశాయి. కొన్ని ప్రభుత్వాలు కూలిపోయో, రాష్ట్రపతి పాలన విధింపుతోనో ఎన్నికల ద్వారా కొత్త సభలు ఏర్పడ్డాయి. ఇలా వేర్వేరు పరిణామాల వల్ల లోక్‌సభకు, వివిధ శాసనసభలకు ఎన్నికల గడువు కాలాలు మారుతూ వచ్చాయి. 

భారత ఎన్నికల సంఘానికున్న విచక్షణాధికార పరిధి, వెసులుబాటు వల్ల... అప్పటికి రద్దయిన, రాష్ట్రపతి పాలనలో ఉన్న రాష్ట్రాల సభల ఎన్నికల కాలాలు స్వల్పంగా అటిటు అవుతూ వచ్చాయి. అందుకే, 1970ల తర్వాత జమిలి సాధ్య పడలేదు. ‘జమిలి కొత్తేం కాదు, ఇదివరకు జరిగిందే’ అని అమిత్‌ షా అంటున్నా, ఇవాళ్టి పరిస్థితి వేరు. అదంత సాధారణమే అయితే, ఇపుడు చట్టాలనూ, రాజ్యాంగాన్నీ మార్చడమెందుకు?

ఎలా సమానం చేస్తారు?
అన్ని ఎన్నికల్ని ఒక తేదీకి లాగే క్రమంలో... ఎన్నో మార్పులు చేయాల్సి ఉంటుంది. మొదట, పొట్టికాలం నిడివి సభలు, పొడుగు కాలం నిడివి సభలు అనివార్యమవుతాయి. బలవంతపు రాష్ట్రపతి పాలనలూ ఉంటాయేమో? ఇప్పుడు ప్రతిపాదిస్తున్నట్టు 2027లోనో, మరెపుడో జమిలి ఎన్నికల్ని నిర్వహించాక కూడా... ఏ కారణం చేతైనా ఒక రాష్ట్ర అసెంబ్లీ రద్దయితే, తిరిగి ఎన్నికల ద్వారా ఏర్పడే కొత్త సభను ఆ మిగిలిపోయిన కాలానికే పరిమితం చేస్తారు. సభ రద్దయిన సమయాన్ని (నాలుగేళ్లకో, మూడేళ్లకో రద్దయింది అనుకుంటే) బట్టి కొత్త సభకు ఏడాదో, రెండేళ్లో మిగలవచ్చు. 

సాధారణ ఎన్నికల్లో జరిగినట్టే అన్ని నియోజకవర్గాల, అందరు ఓటర్ల నిర్ణయంతో జరిగే మధ్యంతర ఎన్నికలో గెలిచిన సభ్యుల కొత్తసభ అలా ఆరు మాసాలకో, ఏడాదికో పరిమితం కావాల్సి రావడం ఏ రాజ్యాంగ ప్రజాస్వామ్య స్ఫూర్తికి ప్రతీక? అది డబ్బు, మానవ వనరుల దుబారా కాదా? అనే ప్రశ్న సహజం. దీనికి రాజకీయ పార్టీలు ఎలా అంగీ కరిస్తాయో చూడాలి. చాలా దేశాల్లో దేశవ్యాప్త ఎన్నికలు, ప్రాదేశిక ఎన్నికలు వేటికవిగానే జరుగుతాయి. 

జమిలి జరిపే ఏడెనిమిది దేశాల్లో అధ్యక్ష తరహా పాలనకిది సానుకూలమే! జమిలి ఎన్నికల నిర్వహణా ఒక సంక్లిష్టమే! మొన్నటి హరియాణా ఎన్నికలతో, గడువు సమీపించిన మహారాష్ట్ర, జార్ఖండ్‌ ఎన్నికల్ని ఎందుకు కలపటం లేదని అడిగితే, ‘... శాంతి భద్రతలు, నిర్వహణ పరంగా ఇబ్బందులుంటా య’ని ఎన్నికల సంఘం పేర్కొంది. నాలుగైదు రాష్ట్రాల్లోనే ఒకేసారి ఎన్నికలు నిర్వహించలేని వారు మొత్తం దేశవ్యాప్తంగా లోక్‌సభకు దాదాపు 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్ని కలిపి, రేపెప్పుడో స్థానిక సంస్థల ఎన్నికల్నీ కలిపి ‘మహా జమిలి’ ఎలా నిర్వహిస్తారు? అనే ప్రశ్న సహజం. 

సంస్కరణల సవాళ్లెన్నో...
భారీ ఓటర్ల భాగస్వామ్యంతో భారత ఎన్నికల నిర్వహణ ప్రపంచంలోనే ఒక అబ్బురం! బ్యాలెట్‌ నుంచి ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రా (ఈవీఎం) లకు మారిన తర్వాత కూడా, అభివృద్ధి చెందిన దేశాలు విస్మయం చెందే స్థాయిలో మన ‘మహా ఎన్నికలు’ జరుగుతున్నాయి. విడతలుగా జరిగిన ఎన్నికల సంస్కరణలు ప్రక్రియను చాలా వరకు పారదర్శకం చేశాయి. స్వేచ్ఛగా స్వతంత్రంగా ఓటర్లు తమ నిర్ణ యాన్ని ప్రకటిస్తున్నప్పటికీ... ఎన్నికల్లో ధన ప్రవాహం, ప్రక్రియలో లోపిస్తున్న జవాబుదారీతనం ఆందోళన కలిగిస్తున్నాయి. 

‘దేశ ఎన్ని కల ప్రక్రియలో ముదురుతున్న ‘క్యాష్‌ క్యాన్సర్‌’ను నియంత్రించే సంస్కరణ అత్యవసరంగా రావాలి’ అని సీనియర్‌ జర్నలిస్టు రాజ్‌దీప్‌ సర్దేశాయి ఇటీవల హైదరాబాద్‌లో చేసిన వ్యాఖ్య కీలకమైంది. ‘మునుగోడు’ అసెంబ్లీ ఉప ఎన్నికలో మనం కళ్లారా చూశాం. సరిగ్గా పోలింగ్‌కు ముందు లక్షల ఓట్లు గల్లంతయినా, నిన్న మహారాష్ట్రలో జరిగినట్టు ఒకటి, రెండు నెలల్లోనే లక్షలాది కొత్త ఓట్లు నమోదైనా... ఎన్నికల సంఘం నుంచి సరైన వివరణ, జవాబుదారీతనం లేక పోవడం దారుణం. 

ఈ సంస్కరణలు చేపట్టకుండా ‘జమిలి’కి పట్టుబట్టడం సరికాదనే అభిప్రాయం కొన్ని పార్టీల వారు, మేధావులు వ్యక్తంచేస్తున్నారు. విడిగా ప్రజాప్రతినిధులు గానీ, స్థూలంగా పార్టీలు గానీ, ప్రభుత్వాలు గానీ ఆశించిన/నిర్దేశించిన స్థాయిలో పనిచేయకుంటే వారిని వెనక్కి రప్పించే (కాల్‌ బ్యాక్‌) పద్ధతి ఉండాలనే డిమాండ్‌ పెరుగుతున్న తరుణంలో... అయిదేళ్ల కొకమారు అన్ని ఎన్నికలూ జరిపేయాలి, మధ్యలో ఏ ఎన్నికలూ ఉండొద్దనే నిర్బంధ మేమిటనే వాదన ఒకటుంది. 

మధ్యలో వేర్వేరు ఎన్నికలుంటేనే నాయకులైనా, పార్టీలైనా, ప్రభుత్వాలైనా కొద్దో గొప్పో భయంతో ఉంటాయనేది సాధారణ అభిప్రాయం. అందుకు, ఎన్నో సాక్ష్యాలు, తార్కాణాలు మన కళ్లముందే ఉన్నాయి. కాన్షీరావ్‌ు అన్నట్టు ‘ఏటా ఎన్నికలుండాలి’ అనే వాదనను బలపరచకపోయినా... ఎన్నికల భయం ఉన్నపుడే ప్రభుత్వాలు ప్రజానుకూలంగా నడుచుకోవడం తరచూ జరిగేదే! 

అలా కాకుండా, ఒకసారి ‘జమిలి’ జరిగితే, ఇక అయిదేళ్లూ ఏ ఎన్నికలుండవంటే... ప్రభుత్వాల ఏకస్వామ్యమే సాగుతుందనే భయాలున్నాయి. పైగా, భిన్నత్వ ప్రతీక అయిన దేశంలోని ప్రాంతీయ అస్తిత్వాలు, భావనలు, వాదనలు... ‘జమిలి’లో ఆధిపత్యం వహించే జాతీయ ప్రవాహంలో కొట్టుకుపోతాయనే ఆందోళన కూడా ఉంది. అందుకే, పలు ప్రాంతీయ పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి.

ఒక పార్టీ ఒక నాయకుడు అంటారేమో!
ఉభయ సభల్లో ఎన్డీయేకున్నది బొటాబొటీ మెజారిటీ! మూడింట రెండొంతుల మెజారిటీ ఉంటే తప్ప సాధ్యపడని రాజ్యాంగ సవ రణలకు ఎలా సాహసిస్తున్నారనేది ప్రశ్న! రాజ్యసభలో 164/243 అవసరమైనచోట 122 (42 తక్కువ) సంఖ్యాబలమే ఉంది. లోక్‌ సభలో 361/542 (ఒక ఖాళీ) అవసరం కాగా ఉన్నది 293 (63 కొరత) మాత్రమే! ఆ రోజు సభకు హాజరైన వారిలో మూడింట రెండొంతులు చాలు కనుక... ప్రత్యర్థి పార్టీల నుంచి క్రాస్‌ ఓటింగ్, గైర్హాజరీలను ప్రోత్సహిస్తారా? అని విపక్షంలో భయ సందేహాలున్నాయి. 

తరచూ ఎన్నికల వల్ల కోడ్‌ అమలు అభివృద్ధికి ఆటంకమనే భావనే తప్పని, ఓట్ల యావతో ఎన్నికలకు నెలల ముందే అభివృద్ధి పనులు చేయడం కాకుండా అయిదేళ్లపాటు జరిపితే కోడ్‌కు వెరవా ల్సిన భయమేమిటని ప్రశ్నిస్తున్నారు. ‘జమిలి’పై ఎందుకీ పంతం?’ ఇదే పంథాలో సాగి, రేపు ‘ఒక పార్టీ, ఒకే నాయకుడ’నే నినాదంతో ప్రజాస్వామ్యాన్ని అధ్యక్షతరహా పాలనవైపు నడిపే ప్రమాదాన్ని మొగ్గలోనే తుంచేయాలన్నది వ్యతిరేకవాదన వినిపించే వారి మాట!


దిలీప్‌ రెడ్డి 
వ్యాసకర్త ‘పీపుల్స్‌ పల్స్‌’ రీసెర్చ్‌ సంస్థ డైరెక్టర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement