మహాభారతం ఏ పర్వంలో ఏముంది? | During the Mahabharata had any? | Sakshi
Sakshi News home page

మహాభారతం ఏ పర్వంలో ఏముంది?

Published Thu, Sep 26 2013 12:13 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

మహాభారతం ఏ పర్వంలో ఏముంది? - Sakshi

మహాభారతం ఏ పర్వంలో ఏముంది?

మహాభారతంలో ఉన్నదంతా లోకంలో ఉన్నది. మహాభారతంలో లేనిదేదీ ఈ లోకంలో లేదు అని లోకోక్తి. మహాభారతంలో పద్దెనిమిది పర్వాలున్నాయని మాత్రమే తెలుసు కాని, ఆ పర్వాలేమిటో, ఏ పర్వంలో ఏముంటుందో తెలిసిన వారు తక్కువనే చెప్పవచ్చు. అటువంటివారికి అవగాహన కోసం...
 
 1. ఆదిపర్వం: రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు, ఆయన కుమార్తె దేవయాని, చంద్రవంశ మహారాజు యయాతిల చరిత్రతోపాటు శకుంతల, దుష్యంతులకు సంబంధించిన అనేక పురాతన కథలను ఇది వివరిస్తుంది. ఈ పర్వంలో అధికభాగం కురువంశ  మూలపురుషులైన శంతనుడు, భీష్ముడు, విచిత్రవీర్యుడు, ధృతరాష్ట్రుడు తదితరుల పరిచయం ఉంటుంది. పాండురాజు కథ, పాండవ కౌరవుల జననం, విద్యాభ్యాసం, వారి మధ్య బాల్యం నుంచే పొడసూపే స్పర్థలు, పాంచాల రాకుమారి ద్రౌపదితో పాండవుల వివాహం, అర్జునుడి తీర్థయాత్ర, శ్రీకృష్ణుని చెల్లెలైన సుభద్రతో పరిణయం తదితర విషయాలను కూడా ఆదిపర్వం వివరిస్తుంది.
 
 2. సభాపర్వం: పాండవ ప్రథముడైన యుధిష్ఠిరుడు (ధర్మరాజు) రాజసూయయాగం చేయడం, కౌరవ ప్రథముడైన దుర్యోధనుడు శకుని సాయంతో జూదం గెలవటం, పర్యవసానంగా తలెత్తిన పరిణామాలు ప్రధానాంశాలు.
 
 3. అరణ్యపర్వం: దీనినే వనపర్వం అని కూడా అంటారు. కామ్యక వనంలో పాండవుల వనవాస వర్ణన ఇందులో ఉంటుంది. దీనితోపాటు నలదమయంతుల కథ, సావిత్రిసత్యవంతుల గాథ, ఋష్యశృంగుడు, అగస్త్యుడు, మార్కండేయుడు తదితర మహామునులతోపాటు భగీరథుడు, శిబి వంటి చక్రవర్తుల వృత్తాంతాలు కూడా ఉంటాయి.
 
 4. విరాటపర్వం: విరాటుని కొలువులో పాండవులు అజ్ఞాతవాసం చేయడం, దుష్టుడైన కీచకుని వధ, పాండవులను అజ్ఞాతవాసం నుంచి బయటకు రప్పించి దానిని భగ్నం చేయడానికి, విరాటరాజుకి చెందిన గోవులను పట్టుకున్న కౌరవులతో యుద్ధం, దక్షిణ గోగ్రహణం, ఉత్తర - అభిమన్యుల పరిణయం ఉంటుంది.
 
 5. ఉద్యోగపర్వం: ఒకవైపు శాంతియత్నాలు, మరోవైపు యుద్ధసన్నాహాలు సమాంతరంగా సాగిపోవటం ఈ పర్వం ప్రత్యేకత. కర్ణుడు తన కొడుకే అని తెలిసిన కుంతీదేవి పరితాపం, శాంతియత్నాలు చేస్తూనే పాండవులను యుద్ధసన్నద్ధులను గావించే శ్రీ కృష్ణుని రాజనీతి... ఈ పర్వంలోని ముఖ్యాంశాలు.
 
 6. కర్ణపర్వం: కౌరవ సోదరులలో రెండవవాడైన దుశ్శాసనుడు భీముని చేతిలో నేలకూలటం, మహావీరుడైన కర్ణుడు అర్జునుని చేతిలో వీరమరణం పొందటం... ఇందులోని ప్రధానాంశాలు.
 
 7. భీష్మపర్వం: మహాభారతంలో ఆరవది భీష్మపర్వం. ఇది అతి ముఖ్యమైనది. ప్రపంచ సారస్వతానికే తలమానికమైన భగవద్గీతను శ్రీకృష్ణుడు అర్జునునికి బోధించింది ఈ పర్వంలోనే. పదిరోజుల యుద్ధ వర్ణన, భీష్మపితామహుడి మానవాతీత సాహసాల గురించిన అత్యద్భుత వర్ణన కనిపిస్తుంది. స్వచ్ఛంద మరణమనే వరం ఉండటం వల్ల భీష్ముడు ఉత్తరాయణం ప్రారంభం అయ్యేవరకు తన మరణాన్ని వాయిదా వేసుకుని అంపశయ్య మీదనే విశ్రమించడం ఉంటాయి.
 
 8. ద్రోణపర్వం: ద్రోణాచార్యుల సాహసకృత్యాలు, విధిలేని విపత్కర పరిస్థితిలో ధర్మరాజు పలికిన ‘అశ్వత్థామ హతః’ అనే మాట ఫలితంగా ఆయన అస్త్రసన్యాసం చేసి వీరమరణం పొందటం ఇందులోని ముఖ్యాంశం. ఆ తర్వాత యుద్ధరంగంలో అభిమన్యుడి పోరాట పటిమ, ఆ యువకుడి వీరమరణం ఇతర ముఖ్యాంశాలు.
 
 9. శల్యపర్వం: మహాభారత యుద్ధంలోని చివరి ఘట్టాలను వర్ణించేది శల్యపర్వం. భీమదుర్యోధనుల యుద్ధం, దుర్యోధనుడు తీవ్రంగా గాయపడి మరణించటం ముఖ్యాంశాలు.
 
 10. సౌప్తికపర్వం: ద్రోణుడి కుమారుడైన అశ్వత్థామ ప్రతీకార కార్యకలాపాలు, రాత్రి సమయంలో నిద్రలో ఉన్న ఉపపాండవులను, పాండవుల సైన్యాన్ని, మిత్రపక్షాలను అశ్వత్థామ ఊచకోత కోయటం ఈ పర్వంలో ప్రధానాంశాలు.
 
 11. స్త్రీపర్వం: వీరమరణం పొందిన కురుపాండవ యోధులకు సంబంధించిన భార్యల రోదనలు, విషాద సన్నివేశాలు ఇందులో ఉంటాయి. యుద్ధం ఎప్పుడు జరిగినా చివరకు మిగిలే విషాదం ఇందులో కళ్లకు కడుతుంది.
 
 12, 13. శాంతి, అనుశాసనిక పర్వాలు: ధర్మరాజు అభ్యర్థన మేరకు, వంశకర్త అయిన భీష్ముడు ధర్మానికి సంబంధించిన అద్భుతమైన విషయాలను బోధించటం, అత్యంత ప్రాచుర్యం పొందిన విష్ణు సహస్రనామాలు, శివసహస్రనామాలు, భీష్ముని మరణం, ధర్మరాజుకి పట్టాభిషేకం ఇందులో కనిపిస్తాయి.
 
 14. అశ్వమేధిక పర్వం: శ్రీకృష్ణుడు ద్వారకకు మరలిపోవటం, ధర్మరాజు చేసిన అశ్వమేథయాగ వర్ణన ఉంటాయి. ఒక నిరుపేద బ్రాహ్మణ కుటుంబం చేసిన అత్యున్నత త్యాగాన్ని గుర్తు చేస్తూ ఒక ముంగిస ధర్మరాజును పరాభవించటం ఇందులోని కొసమెరుపు.
 
 15. ఆశ్రమవాసిక పర్వం: కుంతి, గాంధారి సమేతుడై ధృతరాష్ట్రుడు అరణ్యాలకు పయనమవ్వటం, అక్కడ ప్రమాదవశాత్తూ అరణ్యంలో దావాగ్నిలో అసువులు బాయటం ఇందులో చూడవచ్చు.
 
 16. మౌసలపర్వం: యాదవ వీరులు తమ పతనాన్ని తామే కొని తెచ్చుకోవటం, ఒక వేటగాడి చేతిలో శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించటం వంటి ఘట్టాలు ఇందులో ఉంటాయి.
 
 17. మహాప్రస్థానిక పర్వం: పాండవుల అంతిమయాత్ర గురించిన వర్ణన ఇందులో ఉంటుంది.
 
 18. స్వర్గారోహణ పర్వం: భీమార్జున, నకులసహదేవుల మరణం, ధర్మరాజు ఒక్కడే స్వర్గానికి చేరటం ఇందులోని ప్రధానాంశం.
 
 - కూర్పు: డి.వి.ఆర్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement