D.V.R Bhaskar
-
ఊరంతా సంక్రాంతి జగమంతా క్రాంతి
ఇంటి ముంగిళ్లను అలరించే రంగవల్లులు... హరిలో రంగ హరీ... అంటూ శ్రావ్యంగా సాగే హరినామ సంకీర్తనలతో చిరుచీకట్లలో దర్శనమిచ్చే హరిదాసులు... అంబపలుకు జగదంబ పలుకు అంటూ డమరుకంతో బుడబుక్కల వాళ్లు... అయ్యవారికి దణ్ణం పెట్టు, అమ్మగారికి దణ్ణం పెట్టు అంటూ బసవన్నతో విన్యాసాలు చేయించే గంగిరెద్దుల వాళ్లు... కొత్తల్లుళ్ల వైభోగాలు... ముగ్గులుదిద్దే ముద్దుగుమ్మలు ఒక పక్క, కోడి పందాలు, పేకాటలు, భోగి మంటల సంరంభాలు ఇంకోపక్క, అరిసెలు, జంతికలు, నువ్వుండలు తదితర పిండి వంటల ఘుమఘుమలు వేరొకపక్క... మనోజ్ఞమైన ఈ దృశ్యాలన్నీ కళ్లకు కట్టేది ఒక్క సంక్రాంతి సమయంలోనే. సంక్రాంతి నెల వచ్చిందంటే చాలు... ముందుగా వాకిళ్లు ఊడ్చి, అందమైన రంగవల్లికలు తీర్చిదిద్ది... వాటిలో గొబ్బెమ్మలను పెట్టడం తెలుగింటి సంప్రదాయం. దీనినే సంక్రాంతి నెలపట్టడమంటారు. సంక్రాంతి ముగ్గులు... గొబ్బెమ్మలు హేమంత రుతువులో సూర్యుడు భూమికి దూరంగా ఉండటం వల్ల వాతావరణం చల్లగా ఉండి, క్రిమికీటకాదులతో వ్యాధులు ప్రబలే అవకాశముంది. ఇంటి ముంగిళ్లలో పేడనీళ్లు చల్లి గుల్లసున్నంతో ముగ్గులేయడం వల్ల సున్నంలోని క్యాల్షియం క్రిమికీటకాల సంహారానికి తోడ్పడుతుంది. ఆవుపేడతో కల్లాపు రోగ నిరోధక శక్తి పెంపొందించడానికి తోడ్పడుతుంది. ఆడపిల్లలు ఎంతో ఒద్దికగా వంగి ముగ్గులు వేయడం వల్ల శరీరానికి వ్యాయామం ఏర్పడుతుంది. తామెప్పుడో విన్న లేదా చూసిన ముగ్గులను గుర్తుకు తెచ్చుకుంటూ వేయడం వలన వారిలో ధారణశక్తి పెరుగుతుంది. గొబ్బి శబ్దం పుట్టిందిలా... గొబ్బి శబ్దం గోపి నుండి పుట్టింది. గోపి, గోపిక, గోపియ, గోబియ, గొబ్బియ, గొబ్బిగా రూపాంతరం చెందిందని పెద్దలు చెబుతారు. కన్నెపిల్లలు కృష్ణుని గోపిగా, గొబ్బెమ్మ (గోపెమ్మ)లను గోపికలుగా భావిస్తూ వాటి చుట్టూ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని వలయాకారంలో తిరుగుతూ పాటలు పాడడం మన సంస్కృతిలో భాగం. కొందరు పెద్దగొబ్బెమ్మను కృష్ణునిగా, తక్కిన ఎనిమిది గొబ్బెమ్మలను ఆయన అష్టభార్యలుగా గుర్తించాలంటారు. మరికొందరు పెద్దగొబ్బెమ్మ సూర్యుడికి, మిగతా గొబ్బెమ్మలు గ్రహాలకు సంకేతమని చెబుతారు. గొబ్బెమ్మలను గౌరీదేవిగా భావించి చివరిరోజున సందె గొబ్బెమ్మను పెట్టి కన్నెపిల్లలందరూ పాటలు పాడతారు. అలా చేస్తే కోరుకున్న వరుడొస్తాడని, తొందరగా పెళ్లవుతుందని ఒక నమ్మకం. రంగురంగులుగా తీర్చిదిద్దిన రంగవల్లుల నడుమ గొబ్బెమ్మలను పెట్టడమంటే ఆకాశంలోని చుక్కలను ఇంటి ముంగిట పెట్టినట్లేనని, ఖగోళ శాస్త్ర రహస్యాలెన్నింటినో తెలియ చేసేందుకే గొబ్బెమ్మలను పెట్టే సంప్రదాయం ఏర్పడిందని కొందరు చెబుతారు. ఇలా గొబ్బెమ్మల వెనుక అంతరార్థాలెన్నో! సంక్రాంతిని భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమగా నాలుగు రోజులు జరుపుకుంటారు. అటు కుర్రకారును, ఇటు నడికారును ఉత్సాహపరుస్తూ మూడుకాళ్ల ముదుసలి వాళ్లు చేసే సందడి భోగిమంటలు. పాతదనాన్ని ఎప్పటికప్పుడు విసర్జిస్తేనే కొత్తదనపు సొబగులు సమకూరుతుంటాయి. అందుకు ప్రతీకగానే తెల్లవారు ఝామునుంచే ఇంటిలో ఉన్న పాత కలపను, పనికిరాని సామగ్రిని తీసుకుని నాలుగురోడ్ల కూడలికి పరుగులు తీస్తారు కుర్రకారు. కణకణ మండే భోగిమంటలలో ఆ పాతవాసనలు కొట్టే పనికిరాని, విరిగిపోయిన సామగ్రిని దగ్ధం చేసి, ఎముకలను కొరికే చలిని తరిమికొట్టే ఆ వెచ్చదనపు వైభోగాన్ని ఆస్వాదించడం ఎప్పటికీ చెరిగిపోని ఓ నులివెచ్చటి జ్ఞాపకం. బూజుపట్టిన పాత ఆలోచనలను, ఇతరుల మీద పెంచుకున్న పగ, ఈర్ష్య, అసూయ, కుళ్లు, కుత్సితం, కుతంత్రం మొదలైన వాటిని కూడా ఆ మంటలలో కాల్చి వేసి, హృదయాన్ని ప్రేమతో నింపుకోమని చెప్పడం అందులోని అంతరార్థం.ఇక భోగిపళ్లు అంటే పిల్లలకు దృష్టిదోషం, అనారోగ్యం తదితర దోషాలు తొలగిపోవడానికి పెద్దవాళ్లు చేసే ఓ వేడుక. పిల్లలకు ఉదయమే తలంటిస్నానం చేయించి, కొత్తబట్టలు కట్టబెట్టి, నుదుట కుంకుమ బొట్టుపెట్టి చక్కగా ముస్తాబు చేస్తారు. ఇక సాయంకాలం వేళ అమ్మలక్కలను పిలిచి, పేరంటం చేస్తారు. ఇంటిలోని పెద్దలు, పేరంటానికి వచ్చిన వారందరూ ఒక్కొక్కరుగా వచ్చి మూడేసి పిడికిళ్ల రేగుపళ్లు, పూలరెక్కలు, చిల్లరపైసలను దిష్టి తీసినట్టుగా వారి తలచుట్టూ ముమ్మారు తిప్పి, తలమీద నుంచి కిందికి దొర్లేలా పోస్తారు. ఆరోగ్యప్రదాత అయిన సూర్యుడికి రేగుపళ్లంటే చాలా ఇష్టం. అంతేగాక, రేగుపళ్లలో ఎన్నో ఔషధగుణాలుంటాయట. సూర్యభగవానుడి ఆశీస్సులతోబాటు, అర్కఫలాల్లోని ఔషధగుణాలు కూడా పిల్లలకు అందాలన్నది పెద్దల ఆకాంక్ష. రెండవ రోజు మకరసంక్రాంతి లేదా మకర సంక్రమణం. సూరీడు ప్రతినెలలోనూ ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారుతుంటాడు. అయితే ఆయన ధనూరాశి నుండి మకరరాశిలోనికి ప్రవేశించించడమే ఉత్తరాయణ పుణ్యకాలమంటారు. ఎందుకంటే ఉత్తరాయణమనేది దేవతలకు పగటికాలం. అజ్ఞానమనే చీకట్లను పారద్రోలే పర్వకాలం. అందుకే ఉత్తరాయనానికి అంతటి ప్రాధాన్యత. పెద్ద పండుగ అని ఎందుకంటారు? సంక్రాంతిని పెద్ద పండుగ అనటానికి మరో కారణమేమిటంటే తొలిపంట ఇంటికి వచ్చే సమయంలో అన్నదాతలు ఎంతో ఆనందంగా ఉంటారు. కళకళలాడుతున్న పంటపొలాలను, పండబోయే దిగుబడిని తలుచుకొని సంతోషపడుతుంటారు. జనావళికి అన్నం పెట్టే అన్నదాత ఆనందానికి మించిన పండుగ ఇంకేముంటుంది? అందుకే శ్రమకు, సంపదకు గొప్ప స్థానమిచ్చే ఈ సంక్రాంతి పండుగను బీద, గొప్ప అనే తేడా లేకుండా అందరూ ఘనంగా జరుపుకుంటారు. కర్షకులు ఆనందంలో పాలుపంచుకుంటారు. బుడబుక్కలవాళ్లు చక్కటి తత్వాలు చెబుతారు. హరిదాసులు దైవభక్తిని ప్రబోధిస్తారు. పంటలు పండి, ధాన్యంతో గాదెలు నిండిన రైతులు హరిదాసులకు, బుడబుక్కలవాళ్లకు, విప్రవినోదులకు, అందరికీ ధాన్యం కొలుస్తారు. కూరగాయలు, పప్పు, ఉప్పు, చింతపండు వంటి వాటిని కూడా సంతోషంగా వారికి సమర్పించుకుంటారు. ఇక గంగిరెద్దులు తమ విన్యాసాలతో అందరికీ ఆనందాన్ని పంచుతాయి. సాక్షాత్తూ శివుడి వాహనమే తమ ఇంటి ముంగిటికి వచ్చిన అనుభూతిని కలిగిస్తాయి. ఆ ఆనందానుభూతులతో ఇంటిలోని పాత, కొత్తబట్టలు వాటి మూపురానికి కప్పి, వాటిని ఆడించే వారికి ధాన్యాన్ని, డబ్బును కానుకగా ఇస్తారు. దానితో ఆ మూగజీవాల కడుపు నిండుతుంది, వాటిని ఆడించే వారికి గ్రాసం లభిస్తుంది.గాలిపటాలు: కొన్ని ప్రాంతాలలో గాలిపటాలు ఎగరవేయడాన్ని పిల్లల ఆటగా భావిస్తారు కానీ, తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా హైదరాబాదులో సంక్రాంతిని పతంగుల పండుగగానే పేర్కొంటూ పెద్ద ఎత్తున వేడుకగా జరుపుకుంటారు. గాలిపటాలను ఎగురవేసే క్రమంలో గాలివాలు ఎటునుంచి ఎటువైపు వీస్తోందో తెలుస్తుంది. తద్వారా వర్షాలు ఎలా పడతాయి, పంటలు ఎలా పండుతాయి అనే విషయం అనుభవజ్ఞులైన రైతులకు అవగతం అవుతుంది. అదేవిధంగా గాలిపటాల ఆట వల్ల ఏకాగ్రత అలవడుతుంది. బాధలు, కష్టాలు, దిగుళ్లు అన్నీ మర్చిపోయి మనసులో ఉల్లాసం, ఉత్సాహం పరవళ్లు తొక్కుతాయి. గాలిపటాలను ఎగుర వేసేటప్పుడు తెగిన గాలిపటంతోపాటే మన దురదృష్టం కూడా గాలి వాలుకి కొట్టుకుపోతుందన్నది తాత్వికుల భావన. సంక్రాంతి రోజున ఏం చేయాలి? ఇది సూర్యభగవానుడికి, విష్ణుదేవుడికి సంబంధించిన పండుగ. ఈ రోజు చేసే స్నాన, దాన, జపాదులు విశేష ఫల దాయకం. అన్నిటికన్నా ఉదయ కాల స్నానం ముఖ్యం. స్నానం చేసిన తరువాత నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. నువ్వులు, బియ్యం కలిపి శివుని అర్చించిన పిమ్మట ఆవునేతితో అభిషేకం చేయాలి. విష్ణువును, పౌష్యలక్ష్మిని పూజించి విష్ణుసహస్ర నామ పఠనం చేయాలి. తర్వాత లోకబాంధవుడు, ప్రత్యక్షనారాయణుడైన సూర్యభగవానుడిని పూజించి కొత్తబియ్యంతో పొంగలి, పులగం తయారుచేసి, పాలు పొంగించి భక్తిప్రపత్తులతో ఆయనకు నివేదించడం శుభప్రదం. భోజనంలో మంచి గుమ్మడి కూర ఉండేట్లు చూసుకోవాలి. ఈ కాలంలో నువ్వుల వాడకం శుభప్రదం. రుతుపరంగా కూడా చల్లటి చలికాలం కాబట్టి, వేడి చేసే వస్తువైన నువ్వులు తినడం ఆరోగ్యపరంగా మంచిది. అందుకే సంక్రాంతినాడు చక్కెర పాకంలో నువ్వులు కలిపి చేసిన ఉండలను భుజించడం, చుట్టుపక్కల వారికి, స్నేహితులకు, హితులకు పంచిపెట్టడం వల్ల బాంధవ్యాలు పెంపొందుతాయి. మంచిగుమ్మడి కూర వాతం కలిగిస్తుంది కాబట్టి, దానికి విరుగుడుగా నువ్వుండలు తినడం మంచిదంటారు. మూగజీవుల ఆనందాన్ని కనుమా... సంక్రాంతి మరునాడు జరుపుకునే పండుగ కనుమ. దీనికి రైతుల పండుగ అనిపేరు. కనుమ రోజు ఉదయాన్నే లేచి పశువుల కొట్టాలు శుభ్రం చేసి, పేడతో అలికి బియ్యప్పిండితో అందంగా ముగ్గులు పెడతారు. పాలిచ్చి మనల్ని పోషించే ఆవులను, వ్యవసాయంలో తమకెంతగానో తోడ్పడే ఎడ్లను శుభ్రంగా కడిగి గిట్టలను, కొమ్ములను కుంకుమతోటీ, పూలతోటి అలంకరించి, కృతజ్ఞతాపూర్వకంగా పూజిస్తారు. వ్యవసాయ పనిముట్లను కూడా పూజలో ఉంచుతారు. అనంతరం పశువుల కొట్టాలలోనే పొంగలి వండి నైవేద్యం పెడతారు. ఆ పొంగలిలో పసుపు, కుంకుమలు కలిపి పొలాల్లో ‘పొలి’ చల్లుతారు. అనంతరం బాగా పండి ఉన్న పొలాలకు మంచి గుమ్మడికాయ పగలగొట్టి దిష్టితీస్తారు. ఆ తరువాతు ఇంతకు ముందే సిద్ధం చేసి ఉంచిన పొంగలిని పశువులకు తినిపిస్తారు. సాయంత్రం పశువులను అలంకరించి మేళ తాళాలతో ఊరేగిస్తారు. కోడిపందాలు, ఎడ్లపందాలు నిర్వహిస్తారు. కనుమ తరువాతి రోజు ముక్కనుమ. ఈ రోజు కూడా పశువులను అలంకరించి ఊరేగిస్తారు. ఈవేళ మాంసాహారులు తప్పనిసరిగా మాంసాహార వంటకాలను భుజిస్తారు. మాంసం తిననివారు మినుములతో వండిన గారెలను కడుపారా ఆరగిస్తారు. కనుమనాడు కాకి కూడా తలను నీటిలో ముంచి స్నానం చేస్తుందంటారు. అంటే కనుమనాటి స్నానం ఫలప్రదమన్న మాట. అదేవిధంగా కనుమనాడు కాకికూడా ప్రయాణం చేయదని సామెత. అంటే కనుమనాడు శుభ్రంగా స్నానం చేసి, ఇంటిపట్టునే ఉండి కడుపునిండా భుజించడం మంచిదని పెద్దలు చెప్పిన మాటగా అర్థం చేసుకోవచ్చు. పండుగలనేవి మనుషులకే కాదు... మన పోషణలో చేదోడువాదోడుగా ఉన్న మూగజీవాలకు కూడా భాగస్వామ్యం కల్పించాలనేది కనుమ సంప్రదాయం. - డి.వి.ఆర్.భాస్కర్ గుమ్మడి కాయ దానం ఎందుకంటే..? సంక్రమణ కాలంలో లేదా ఉత్తరాయణ పుణ్యకాలంలో కూష్మాండ దానం చేయడం సంప్రదాయం. ఎందుకంటే శ్వేత వరాహకల్పం ఆరంభంలో యజ్ఞ వరాహమూర్తి భూమిని ఉద్ధరించినందుకు సంకేతంగా ఈ పుణ్యకాలంలో కూష్మాండం (గుమ్మడి పండును) దానం చేయాలని, అలా దానం చేస్తే సకల బ్రహ్మాండాన్ని విష్ణుమూర్తికి దానం చేసినట్టవుతుందని పురాణాలు చెబుతున్నాయి. బొమ్మల కొలువు సంక్రాంతికి బొమ్మల కొలువు పెట్టడం తెలుగునాట కొన్ని ప్రాంతాలలో ఆచారం. బ్రహ్మకొలువునే బొమ్మల కొలువుగా చెప్పుకుంటున్నాము. ఇంటిలోని దేవుళ్లు, దేవతల ప్రతిమలను ఒక వరుసలోనూ, ఇతర బొమ్మలను మరో వరుసలోనూ అందంగా పేర్చి, పేరంటం చేస్తారు. చూడవచ్చిన వారందరికీ పండు, తాంబూలం, శనగలు ఇచ్చి ఆశీర్వాదాలు అందుకుంటారు. ఉత్తరాయన దానాలు... ఉత్తమ ఫలాలు... అత్యంత పుణ్యప్రదమైన ఉత్తరాయణ కాలంలో కన్యాదానం, వస్త్రదానం, ధాన్యం, ఫలాలు, విసనకర్ర, సువర్ణం, కాయగూరలు, దుంపలు, తిలలు (నువ్వులు), చె రుకు, గోవులను దానం చేస్తే మంచిది. ఉత్తరాయణం ఉండే ఆరు నెలల్లో (186 రోజులు) పవిత్ర గంగ, గోదావరి, కృష్ణ, యమున తదితర పుణ్యనదుల్లో స్నానమాచరించి దీపం, నువ్వులు, బియ్యం వంటి వాటిని పండితులకు, బీదవారికి దానం చేయటం వల్ల ఉత్తమగతులు కలుగుతాయని, కన్నెపిల్లలకు కోరుకున్న వరుడు భర్తగా లభిస్తాడని, ఉద్యోగులు, వ్యాపారులు, చేతివృత్తిదారులకు రాణింపు లభించడంతోబాటు సకల శుభాలు కలుగుతాయని పురాణోక్తి. ఉత్తరాయణ పుణ్య కార్యాలు... నదీస్నానం, సూర్య నమస్కారాలు, భూమి పూజలు, నూతన గృహప్రవేశాలు, వేదాధ్యయనం, ఉపనయనం, వివాహం, విద్యారంభం తదితర శుభకార్యాలు చేయటం, ఆయా కార్యక్రమాలు తలపెట్టిన వారికి సహకరించటం వల్ల ఆయుష్షు పెరిగి ఆరోగ్య భాగ్యం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. -
అట్లతద్దోయ్ ఆరట్లోయ్...
సందర్భం- నేడు అట్లతద్దె ఈ నోమును మొట్టమొదటిసారిగా గౌరీదేవి నారదమహాముని ప్రోద్బలంతో నోచుకుని సాక్షాత్తూ పరమేశ్వరుని పతిగా పొందిందని పురాణోక్తి. ఇందుకే ఈ నోముకు చంద్రోదయ గౌరీవ్రతమని కూడా పేరు. ‘అట్లతద్దోయ్ ఆరట్లోయ్- ముద్దపప్పోయ్ మూడట్లోయ్...’ ‘పీటకిందా పిడికెడు బియ్యం పిల్లల్లారా జెల్లల్లారా లేచిరండోయ్.. ’ అంటూ ఆటపాటలతో, కోలాహలంగా సాగే నోము అట్లతద్దె. ఈ నోమును కన్నెపిల్లలు సలక్షణమైన భర్త కోసం ఆచరిస్తే, వివాహితలు తమ కాపురం చల్లగా సాగాలని, కడుపు పండాలనీ నోచుకుంటారు. వ్రతవిధానం ఈ వ్రతం చేసేవారు ఆశ్వయుజ బహుళ తదియనాడు తెల్లవారు ఝామున లేచి చద్దెన్నం, గోంగూర పచ్చడి, పొట్లకాయ కూర, నువ్వులపొడి, ఉల్లిపాయ పులుసు, గడ్డపెరుగుతో విందారగించి, తాంబూలం వేసుకోవాలి. ఆ తర్వాత ఆటలు ఆడాలి. ఊయల ఊగాలి. స్నానపానాదులు పూర్తి చేసుకుని గౌరీదేవిని పూజించాలి. పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రదర్శనం అయిన అనంతరం తిరిగి గౌరీ పూజ చేసి అమ్మవారికి పది అట్లు నివేదించాలి తర్వాత ఓ ముత్తయిదువకు అలంకారం చేసి, పది అట్లు, పది ఫలాలు వాయనమివ్వాలి. (ప్రాంతీయ ఆచారాలను బట్టి ఈ సంఖ్య మారవచ్చు). తర్వాత కింది కథ చెప్పుకుని అక్షతలు వేసుకోవాలి. అనంతరం భోజనం చేయాలి. వ్రతకథ పూర్వం పాటలీపుత్రాన్ని సుశీలుడనే రాజు పాలిస్తుండేవాడు. వారికి లేకలేక పుట్టిన కుమార్తెకు ‘సునామ’ అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. సునామకు యుక్తవయస్సు రాగానే రాజదంపతులు ఆమెకు ఎన్నో సంబంధాలు చూశారు. అయితే అన్నీ ఏదో ఒక కారణంతో తప్పిపోతుండేవి. దాంతో విరక్తి చెందిన సునామ గౌరీదేవి ఆలయానికెళ్లి ఆత్మహత్యకు సిద్ధమైంది. సరిగ్గా ఆ తరుణంలో ‘‘చంద్రోదయ గౌరీవ్రతం ఆచరించినట్లయితే యోగ్యుడు, సర్వలక్షణ సంపన్నుడైన భర్త లభిస్తాడని, సంసారం సౌఖ్యంగా సాగిపోతుంద’’ని ఒక అదృశ్యవాణి పలుకుతూ, ఆ వ్రతవిధానాన్ని వివరించింది. ఆ మాటలతో ఉత్సాహం తెచ్చుకున్న సునామ ఆశ్వయుజ బహుళ తదియనాడు పొద్దున్నే మేల్కొని, రాత్రి చంద్రోదయం అయ్యేవరకూ కఠిన ఉపవాసం ఉంది. సునామ ఎంతో సుకుమారి కావడంతో సాయంత్రానికల్లా నీరసంతో పడిపోయింది. దాంతో ఆమె సోదరులు చెల్లెలి మీద ప్రేమతో చేరువలో ఉన్న చింతచెట్టుకి ఒక అద్దాన్ని కట్టి, దానికెదురుగా గడ్డిమోపుకు నిప్పంటించి, ఆ మంట వెలుగు అద్దంలో ప్రతిబింబించేలా చేశారు. చెల్లెల్ని లేపి, ‘‘సోదరీ! అదుగో ఆ చింతచెట్టు కొమ్మల్లోంచి చంద్రుడు కానవస్తున్నాడు చూడు’’ అన్నారు. సునామ ఆ వెలుగు చంద్రుడేనని భ్రమించి ఎంగిలిపడింది. తెలియక చేసినప్పటికీ వ్రత ఉల్లంఘన దోషం కారణంగా ఆమెకు ఎన్ని సంబంధాలు చూసినా కుదరకపోవడంతో విసుగు చెందిన తల్లిదండ్రులు వయసు ముదిరిన వరులను వెదకడం ఆరంభించారు. దాంతో ఒకనాటి రాత్రి సునామ అడవిలోకి పారిపోయి ఆత్మహత్యకు సిద్ధపడింది. అప్పుడు భూలోక సంచారం చేస్తున్న పార్వతీ పరమేశ్వరులు వృద్ధదంపతుల రూపంలో ఆమెకు ఎదురై, ఆమెని వారించారు. ఆమె అన్నలు చేసిన పని వల్ల వ్రతోల్లంఘనమయిందనీ, అందువల్లే సరైన సంబంధం కుదరడం లేదని, తిరిగి నియమ నిష్టలతో వ్రతాన్ని ఆచరించమని చెప్పి అదృశ్యమయ్యారు. ఈసారి వారు చెప్పిన విధంగా సజావుగా వ్రతాన్ని నిర్వహించింది సునామ. దాంతో ఆమెకు అతి స్వల్పకాలంలోనే అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. ఉద్యాపన విధానం పదిమంది ముత్తయిదువలకు ఒక్కొక్కరికి ఒక నల్లపూసల గొలుసు, లక్కజోళ్లు, రవికెల గుడ్డ, దక్షిణ, తాంబూలంతో పది అట్లు చొప్పున వాయనం ఇచ్చి, వారి ఆశీస్సులందుకోవాలి. అట్లే ఎందుకు తినాలంటే... నవగ్రహాలలోని కుజునికి అట్లంటే ప్రీతి కాబట్టి అట్లను నైవేద్యంగా పెడితే కుజదోషం పరిహారమవడమేగాక సంసారం సాఫీగా సాగుతుంది. గర్భధారణలో సమస్యలు తలెత్తవు. అట్లను తయారు చెయ్యడానికి వాడేది మినప పిండి, బియ్యప్పిండి మిశ్రమం కదా, అందులో మినుములు రాహువుకూ, బియ్యం చంద్రునికీ సంబంధించినవి. ఈ రెండూ కలిసిన అట్లను వాయన మివ్వడం వల్ల గర్భదోషాలు తొలగి సుఖప్రసవం అవుతుందని విశ్వాసం. సంప్రదాయమే కాదు... శాస్త్రీయ దృక్పథం కూడా..! గౌరీదేవికి ఆటపాటలంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ వ్రతంలో భాగంగా ఆడపిల్లలంతా తెల్లవారుజామున వెన్నెల్లో ఒక చోటికి చేరి బలంగా ఉన్న చెట్లకొమ్మకి ఉయ్యాలలు కట్టి తమ స్నేహితురాళ్లందరికీ వినిపించేలా చప్పట్లు చరుస్తూ పాటలు పాడతారు. అట్లతద్దిరోజు ఆటలాడటం వల్ల నడుము గట్టిపడుతుంది. తద్దెపాటలు లోకంలో బతకాల్సిన తీరు గురించి సందేశమిస్తాయి. అందుకే అట్లతద్దెకు ఆంధ్రదేశంలో అంత ప్రాధాన్యత. - డి.వి.ఆర్ -
అన్నార్తులను వెతుక్కుంటూ వెళ్తాడు!
ఆదర్శం రేగిన జుట్టు, మాసిన బట్టలు, వాడిన ముఖంతో, బిక్కచూపులు చూస్తూ ఎవరైనా అనామకుడు మన ముందు చెయ్యి చాస్తే ఏం చేస్తాం? వెంటనే ముఖం తిప్పేస్తాం. అంతకీ జాలేస్తే రూపాయో, రెండు రూపాయలో చేతిలో పెడతాం. కానీ ఆ యువకుడు అలా కాదు. అతడి దగ్గరకు వచ్చి ఎవరూ చేయి చాచనక్కర్లేదు. అలాంటి వారిని పనిగట్టుకుని వెతుక్కుంటూ తానే వెళ్తాడు. వాళ్ల కడుపు నింపి వస్తాడు. ఆకలి కడుపులు నింపడం కన్నా పుణ్యం ఏముంటుంది! కానీ అది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. నోరు తెరచి అడిగితే పట్టెడన్నం పెడతారేమో కానీ, పట్టెడన్నం పెట్టడం కోసమే ఆకలితో ఉన్నవారిని వెతుక్కుంటూ వెళ్లడం అనేది అందరూ చేయగలిగేది కాదు. ఖాదర్బాబు లాంటి ఏ కొందరో మాత్రమే చేయగలిగే గొప్ప పని అది! కృష్ణాజిల్లా, ఎ.కొండూరు మండలం, చీమలపాడు గ్రామానికి చెందిన అతడు మానవసేవలో తరిస్తున్నాడు. మనుషుల్లోనూ మాధవుడు ఉంటాడని నిరూపిస్తున్నాడు. ఫుట్పాత్లు, పేవ్మెంట్లపై ఆకలితో లుంగచుట్టుకుపోయి, ముడుచుకుని పడుకున్న వారిని లేపి, వారికి కడుపునిండా అన్నం తినిపించి, మంచినీళ్లు తాగించి వారి ఆకలి తీరితే చాలు... కోటి రూపాయలు దొరికినంతగా సంబర పడతాడు ఖాదర్బాబు. అతని తండ్రి అతావుల్లా ఖాదరీబాబా కూడా అంతే! రోజూ కొన్ని వేలమంది అన్నార్తులకు భోజనం పెట్టి, వాళ్లు ఆవురావురుమని తింటుంటే... సంతోషపడిపోతారు. అదే ఖాదర్కీ అలవడింది. అయితే తేడా ఒక్కటే. తండ్రేమో తన దగ్గర కు వెళ్లినవారి కడుపులు నింపుతాడు. తనయుడేమో ఒకడుగు ముందుకు వేసి... ఆహారం పొట్లాలు కొనుక్కుని వెళ్లి, తానే స్వయంగా తినిపించి మరీ వస్తాడు. అలా అని ఈ తండ్రీ కొడుకులు కోట్లకు పడగెత్తిన వారేమీ కారు. సాటివారికి సేవ చేయాలన్న సంకల్పం బలంగా ఉన్నవారు మాత్రమే! బాల్యంలోనే బీజం... ఖాదర్బాబు తండ్రి అతావుల్లా ఖాదరీబాబా వ్యవసాయం చేసేవారు. ఎనిమిది మంది పిల్లలు. అంటే ఇంట్లో మొత్తం పదిమంది. అందరికీ ఆయన సంపాదన ఒక్కటే ఆధారం. అయినా కూడా ఉన్నంతలో అందరికీ పెట్టే స్వభావం ఆయనది. ఇంటికెవరొచ్చినా కడుపునిండా భోజనం పెట్టి పంపడం ఆయనకు అలవాటు. అందుకు ఆయన భార్య కూడా సహకరించేది. విసుగు లేకుండా ఎంతమందికైనా వండి పెట్టేది. ఆ దంపతుల దాతృత్వం గురించి తెలిసి ఆకలితో అల్లాడుతున్న ఎంతోమంది వచ్చి చేయి చాచేవారు. వాళ్లందరికీ సుష్టుగా భోజనం లభించేది ఆ ఇంట్లో. అది ఖాదర్బాబులో స్ఫూర్తిని నింపింది. సేవ చేయాలన్న తపన బాల్యం నుంచే పెరిగింది. ఇంటికొచ్చినవాళ్లకి తన తండ్రి ఎలాగూ పెడుతున్నాడు కాబట్టి ఇంటిదాకా రాలేకపోతున్నవారి కోసం తానే వెళ్లాలి అనుకునేవాడు. ఓసారి అనుకోకుండా రోడ్డు పక్కన ఉన్న వృద్ధ యాచకుడికి ఆహారం తినిపించాడు ఖాదర్. కడుపు నిండిన ఆ యాచకుడి కళ్లలో ఆకలి తీరిన ఆనందం కదలాడింది. దానికితోడు అతను ఖాదర్ తలమీద చేయి వేసి... ‘నువ్వు చల్లగా ఉండాలి బాబూ’ అని దీవించడం ఎంతో తృప్తినిచ్చింది ఖాదర్కి. తన గమ్యం ఎటువైపో అప్పుడే అర్థమయిందతనికి! తన ముగ్గురన్నలు, నలుగురు అక్కలతో పాటు తానూ చదువుకున్నాడు ఖాదర్. వాళ్లంతా జీవితాల్లో స్థిరపడ్డారు. ఖర్జూరాల వ్యాపారం చేసే ఖాదర్ తన సంపాదనలో అధిక భాగాన్ని అన్నార్తుల కడుపు నింపడం కోసమే కేటాయిస్తుంటాడు. అందుకు అతడి సహధర్మచారిణి సల్మా కూడా సహకరిస్తుంది. ఆమె ప్రతిరోజూ వంట చేసి, ఓ ఐదారు ఆహార పొట్లాలు తయారు చేసి భర్తకు ఇస్తుంది. వాటితో పాటు కొన్ని మంచినీళ్ల బాటిళ్లు కొనుక్కుని బ్యాగులో వేసుకుని బయలుదేరుతాడు ఖాదర్. రోడ్ల పక్కన, బస్టాపుల్లో, గుడి మెట్ల మీద... ఎక్కడ ఎవరు పట్టెడన్నం కోసం ఎదురు చూస్తున్నా వారికి తన దగ్గరున్న ఆహారాన్ని స్వయంగా తినిపించి, మంచినీళ్లు తాగించి మరీ అక్కడ్నుంచి వెళ్తాడు. ఒక్కసారి ఒకచోట ఒక వ్యక్తికి అన్నం పెడితే... అప్పట్నుంచి రోజూ పెడుతూనే ఉంటాడు. అది మాత్రమే కాదు, చలికి అల్లాడిపోయే వారికి రగ్గులు, దుస్తులు ఇస్తుంటాడు. ఎవరైనా చింపిరి జుత్తుతో కనిపిస్తే చాలు... వెంటనే క్షురకుణ్ని తీసుకుని అక్కడ ప్రత్యక్షమైపోతాడు. శుభ్రంగా క్షవరం చేయిస్తాడు. ఆశ్రయం లేనివాళ్లని ఆశ్రమాలకి తరలిస్తుంటాడు. అయితే ఇంత చేస్తున్నా తనకి తృప్తి లేదంటాడు ఖాదర్. ఎప్పటికైనా తానే ఒక ఆశ్రమాన్ని పెట్టి, దిక్కులేని వాళ్లందరినీ అందులో ఉంచి, వాళ్లకి కడుపునిండా తిండి పెట్టి అన్నీ తానై చూసుకోవాలని ఆశిస్తున్నాడు. ఆలోచన మంచిదైనప్పుడు ఆచరణకు మార్గం తప్పక దొరుకుతుంది. అదే జరిగితే ఖాదర్ వల్ల మరెందరివో కడుపులు నిండుతాయి! - డి.వి.ఆర్.భాస్కర్ -
శుభప్రద మాసం...ఫలప్రద పున్నమి
కారుమబ్బులు కానరాని నిర్మలమైన నీలాకాశం... ఆహ్లాదకరమైన వాతావరణం... రకరకాల సువాసనా పుష్పాలతో నిండిన పూలమొక్కలు ... ఆలయాలు ప్రతిధ్వనించేలా కేశవనామాలు, శివపంచాక్షరీ స్తుతులు... మనసును ఆనంద డోలికలలో ముంచెత్తే పూజలు, కనువిందు చేసే దీపాలు... నాసికాపుటాలకు సోకే సుగంధపరిమళాలు... గుండెలలో నిండిన ఆధ్యాత్మికతతో, అరమోడ్చిన కన్నులతో కనిపించే భక్తులు... ఈ వాతావరణం కనపడిందీ అంటే అది కచ్చితంగా కార్తిక మాసమే! పౌర్ణమినాడు కృత్తికానక్షత్రం ఉండటం వల్ల ఈ మాసానికి కార్తికమాసమని పేరు. ఈ మాసంలో చేసే స్నాన, దాన, జపాలు, ఆలయ సందర్శనలు అటు హరికీ, ఇటు హరుడికీ, మరోపక్క వారిద్దరి తనయుడైన అయ్యప్పకీ కూడా ఎంతో ప్రీతిపాత్రమైనవి. ఇక ఈ మాసంలో పున్నమినాడు శివాలయంలో జరిగే జ్వాలాతోరణ సందర్శనం చేయడం అత్యంత పుణ్యప్రదం. అంతేకాదు... తులసిపూజ, వనభోజనాలు, సమారాధనలు, ఉపవాసాలు, అభిషేకాలు, సహస్రనామ పారాయణలతో అలరారుతూ... ఎంత నాస్తికుడికైనా ఆస్తికభావనలు కలుగజే స్తుంటాయి. ఈ మాసం శుక్లపక్షంలోని పద్నాలుగు రోజులు అప్పుడే గడిచిపోయాయి. రేపే పున్నమి. కార్తికమాసంలో అత్యంత పర్వదినం కార్తిక పూర్ణిమ. ‘‘కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః జలేస్థలే యే నివసంతి జీవాః దృష్ట్యాప్రదీపనం చ జన్మభాజనం భవన్తి నిత్యం శ్వపచాహివిప్రాః’’ కార్తీక జ్వాలాదర్శనం చేసినందువలన జాతిభేదం లేకుండా మానవులకు, కీటకాలకు, పక్షులకు, దోమలకు జలచరాలైన చేపలకు మున్నగువానికే కాక వృక్షాలకు కూడా పునర్జన్మ ఉండదని పై శ్లోకార్థం. శైవ, వైష్ణవ భేదం లేని అత్యున్నత మాసమైన కార్తిక మాసంలో నిండుపౌర్ణమి ఘడియలలో సాక్షాత్తూ ఆ శ్రీశైల మల్లికార్జునుడి సన్నిధిలో ప్రజ్వలించే జ్వాలాతోరణదర్శనంతో సర్వపాపాలు హరించబడి సద్గతి లభిస్తుందని పురాణకథనం. జ్వాలాతోరణ భస్మ, కాటుకలను ధరించడం వల్ల సర్వభయాలు వీడి, భూతప్రేత పిశాచబాధలు తొలగి, సకల శుభాలు కలుగుతాయని విశ్వాసం. త్రిపురాసుర సంహారానంతరం పరమేశ్వరునిపై పడ్డ దృష్టిదోష పరిహారం కోసం... ఈశ్వరుని గౌరవార్థం మొట్టమొదటగా పార్వతీదేవి కార్తికపౌర్ణమి రోజున జ్వాలాతోరణోత్సవాన్ని జరిపిందని పురాణాల ద్వారా తెలుస్తోంది. కార్తికపురాణం ప్రకారం ఒక్కో తిథికి ఒక్కో విశిష్టత ఉంది. ఏ రోజున ఏమి చేస్తే ఏ ఫలం కలుగుతుందో కార్తికపురాణం స్పష్టంగా పేర్కొంది. కాబట్టి అవకాశం మేరకు ఆ విధంగా చేయగలిగితే మంచిది. కార్తిక బహుళ పాడ్యమి: ఈరోజు ఆకుకూర దానం చేయడం శుభదాయకం. విదియ: వనభోజనం చేయడం విశేష ఫలాలనిస్తుంది. తదియ: పండితులకు, గురువులకు తులసిమాలను సమర్పించడంవల్ల తెలివితేటలు వృద్ధి అవుతాయి. చవితి: పగలంతా ఉపవసించి, సాయంత్రంవేళ గణపతిని గరికతో పూజ చేసి, ఆ గరికను తలగడ కింద పెట్టుకుని పడుకుంటే దుస్వప్న దోషాలు తొలగి సంపదలు కలుగుతాయి. పంచమి: చీమలకు నూకలు చల్లడం, శునకాలకు అన్నం తినిపించడం శుభఫలితాలనిస్తుంది. షష్ఠి: గ్రామదేవతలకు పూజ జరిపించడం వల్ల వారు సంతుష్టులై, ఏ కీడూ కలుగకుండా కాపాడతారు. సప్తమి: జిల్లేడు పూలతో గుచ్చిన దండను ఈశ్వరునికి సమర్పిస్తే సంపదలు వృద్ధి చెందుతాయి.. అష్టమి: కాలభైరవాష్టకం చదివి గారెలతో దండ చేసి, కాలభైరవానికి (కుక్కకు) సమర్పించడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది. నవమి: వెండి లేదా రాగి కలశంలో నీరు పోసి పండితునికి దానమిస్తే పితృదేవతలు తరిస్తారు. దశమి: నేడు అన్న సంతర్పణ చేస్తే విష్ణువుకు ప్రీతిపాత్రులై, కోరికలు తీరతాయని పురాణోక్తి. ఏకాదశి: విష్ణ్వాలయంలో దీపారాధన, పురాణ శ్రవణం, పఠనం, జాగరణవిశేషఫలదాయకం. ద్వాదశి: అన్నదానం లేదా స్వయంపాకం సమర్పించడం శుభప్రదం. త్రయోదశి: నవగ్రహారాధన చేయడంవల్ల గ్రహదోషాలు తొలగుతాయి. చతుర్దశి: ఈ మాస శివరాత్రినాడు ఈశ్వరార్చన, అభిషేకం వల్ల అపమృత్యుదోషాలు, గ్రహబాధలు తొలగి, ఆరోగ్యవంతులవుతారని పురాణోక్తి. అమావాస్య: ఈరోజు పితృదేవతల సంతృప్తి కోసం అన్నదానం చేయాలి లేదా పండితులకు, బ్రాహ్మణులకు స్వయంపాకం ఇవ్వాలి. పగలు ఉపవాసం ఉండటం మంచిది. శివకేశవ ప్రీత్యర్థం దీపారాధన చేసి, నారికేళాన్ని నివేదించాలి. మన పెద్దలు ఏది చెప్పినా ఊరికే చెప్పరు. దానివెనుక శాస్త్రీయ కారణాలెన్నో ఉంటాయి. లోతుగా ఆలోచిస్తే... పైన పదిహేను రోజులలో ఆచరించవలసిన విధులలో భూతదయకు ప్రథమ ప్రాధాన్యం ఇచ్చినట్లు కనపడుతోంది. ఉపవాసం ఉండమనేది కూడా మన ఆరోగ్యరక్షణ కోసమే. అంతేకాదు, మనం అభోజనంగా ఉంటేనే అవతలి వారి ఆకలి బాధ తెలుస్తుంది. అప్పుడే మనకు ఆకలి విలువ తెలిసి, అవతలి వారికి అన్నం పెట్టగలం. అలాగే చన్నీటిస్నానాలు చేయమనడం లోనూ, కొన్ని రకాల పదార్థాలను తినకూడదు అనడంలోనూ, ఫలానావి తినాలని చెప్పడంలోనూ ఆరోగ్యసూత్రాలెన్నో ఇమిడి వున్నాయి. ఇక ఈ మాసంలో వనభోజనాలకు పెద్దపీట వేయడం ఎందుకంటే... పత్రహరితంతోనే మానవాళి మనుగడ ముడి వేసుకుంటుందని చెప్పడం కార్తికవనభోజనాల అంతస్సూత్రం. ఆయుర్వేద వైద్యశాస్త్రంలో ఉసిరికున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఈ సంగతిని జనావళికి గుర్తుచేసేందుకే ఉసిరి చెట్లకింద పనస ఆకుల విస్తట్లో జరిగే విందులు. ఇవే పర్యావరణ ప్రాధాన్యతను తెలియజేసేందుకు సిసలైన మార్గాలు. ఏవీ కూడా ఇలా చేయండి అంటే ఎవరూ చేయరు. అది లోకరీతి. అదే భగవంతుని పేరు చెబితే... భక్తితో కాకబోయినా భయంతో అయినా చేస్తారనే పెద్దలు, పౌరాణికులు, అనుభవజ్ఞులు కొన్నింటికి దేవుణ్ణి, మరికొన్నింటికి పాపపుణ్యాల ప్రసక్తి తెచ్చి మరీ చెప్పారు. అది అర్థం చేసుకుంటే నాస్తికులు కూడా ఆస్తికులే అవుతారు! ఆ రకంగా చూస్తే ఇది శుభప్రద మాసమే కదా మరి! - డి.వి.ఆర్. -
పర్వదినాలకు శుభారంభం కార్తిక మాసం
పున్నమి చంద్రుడు కృత్తికానక్షత్రంలో సంచరిస్తాడు కనుక ఈ మాసానికి కార్తికమాసం అని పేరు. ఈ మాసంలో చేసే ఆలయ సందర్శనం, అర్చనలు, అభిషేకాలతోపాటు, స్నానదానాదులు కూడా అత్యంత విశిష్ఠమైనవే. అలాగే నదీస్నానం, ఉపవాసం, దీపారాధన, దీపదానం, సాలగ్రామ పూజ, వన సమారాధనలు ఆచరించదగ్గ విధులు. కార్తికమాసంలో శ్రీ మహావిష్ణువు చెరువులలో, దిగుడు బావులలో, పిల్లకాలువలలోనూ నివసిస్తాడట. అందుకే ఈ మాసంలో వాపీ, కూప, తటాకాదులలో స్నానం చేయడం ఉత్తమం. కుదరని పక్షంలో మనం స్నానం చేసే నీటిలోనే గంగ, యమున, గోదావరి, కృష్ణ, కావేరి, నర్మద, తపతి, సింధు మొదలయిన నదులన్నింటి నీరూ ఉందని భావిస్తూ... సూర్యోదయానికి ముందే తలారా స్నానం చేయాలి. ఈ మాసంలో ప్రతిరోజూ పుణ్యప్రదమైనదే. అయితే ఏ రోజున ఏమి చేస్తే మంచిదో తెలుసుకుని దాని ప్రకారం ఆచరిస్తే మరిన్ని ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. మచ్చుకు కొన్ని తిథులు... ఈవారం ఆచరించవలసిన విధుల వివరాలు... కార్తీక శుద్ధపాడ్యమి: తెల్లవారుజామునే లేచి స్నానం చేసి, అందుబాటులో ఉన్న ఏదైనా ఆలయానికెళ్లి, ‘నేను చేయదలచుకున్న కార్తీక వ్రతం నిర్విఘ్నంగా సాగేటట్లు అనుగ్రహించ’మని ప్రార్థించి సంకల్పం చెప్పుకుని ఆకాశదీపాన్ని సందర్శించుకోవాలి. విదియ: ఈ రోజు సోదరి చేతి భోజనం చేసి ఆమెకు యథాశక్తి కానుకలు ఇచ్చిరావాలి. అలా చేసిన వారికి యమగండం వాటిల్లదని పురాణోక్తి. తదియ: అమ్మవారికి కుంకుమపూజ చేయించుకోవడం వల్ల సౌభాగ్య సిద్ధి కలుగుతుందని ప్రతీతి. కార్తీక శుద్ధ చవితి: దీనికే నాగుల చవితి అని పేరు. ఈ వేళ పగలు ఉపవాసం ఉండి, నియమనిష్ఠలతో సుబ్రహ్మణ్యేశ్వరునికి పుట్టలో పాలు పోసిన వారికి కడుపు పండుతుందని కార్తికపురాణం చెబుతోంది. పంచమి: దీనికి జ్ఞానపంచమి అని పేరు. ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి ప్రీత్యర్థం అర్చనలు చేయించుకున్నవారికి జ్ఞానవృద్ధి కలుగుతుంది. రోజూ చేయలేకపోయినా... ఈ మాసంలో చేసే స్నాన దాన జపాల వల్ల అనంతమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయి. అయితే అలా రోజూ చేయలేనివారు కనీసం ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ, సోమవారాలలో లేదా ఒక్క పూర్ణిమ లేదా కనీసం ఒక్క సోమవారంనాడయినా సరే నియమ నిష్ఠలతో ఉపవాసం ఉండి, గుడికి వెళ్లి దీపం వెలిగిస్తే లభించే పుణ్యఫలాన్ని వర్ణించడం ఎవరితరమూ కాదని సాక్షాత్తూ బ్రహ్మదేవుడే చెప్పినట్లు కార్తిక పురాణం చెబుతోంది. కార్తీక పౌర్ణమినాడు పగలు ఉపవసించి, రుద్రాభిషేకం చేయించి శివాలయంలో 365 ఒత్తులను ఆవునేతితో వెలిగిస్తే సమస్త పాపాలూ భస్మీపటలమై ఇహలోకంలో సర్వసౌఖ్యాలను అనుభవించి అంత్యంలో పుణ్యలోకాలు పొందుతారని కార్తీక పురాణంలోని అనేక కథలు, గాథలు, ఇతివృత్తాలు, ఉపకథలను బట్టి తెలుస్తుంది. ఈమాసం... వనసమారాధనలకు ఆవాసం మామూలు రోజులలో గడపదాటి వెళ్లనివారు సైతం కార్తీక మాసంలో వన సమారాధనలో పాల్గొంటారు. వనసమారాధనలో ఉసిరిగ చెట్టునీడన సాలగ్రామరూపంలో శ్రీహరిని పూజించి శక్తి కొలది అన్న సమారాధన చేసిన వారిని యముడు కన్నెత్తి కూడా చూడలేడని, వనభోజనం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోయి విష్ణుసాయుజ్యం పొందుతారని కార్తీక పురాణం బోధిస్తోంది. కార్తీకమాసంలో వనభోజనం ఎవరు చేస్తారో, పురాణం ఎవరు వింటారో వారికి ఉత్తమ గతులు కలగడంతోపాటు హోమం చేసేటప్పుడు, జపం చేసేటప్పుడు, దేవతార్చన సమయంలో, పితృతర్పణ సమయంలో, భ్రష్టులు, ఛండాలురు, సూతకం ఉన్నవాళ్ల మాటలు వినడం వల్ల కలిగే పాపాలు తొలగుతాయని పురాణోక్తి. ఈ రెండు వాదనలూ సరైనవే... కార్తీకమాసం విష్ణుస్వరూపమని విష్ణుభక్తులు, కాదు... ఈశ్వరార్చనే ప్రశస్తమని శివభక్తులు భావిస్తారు. ఒకరకంగా ఆ ఇరువురిదీ వాదనా సరైనదే. ఎలాగంటే ఈ మాసం శివకేశవులకిరువురికీ ప్రీతిపాత్రమైనదే. ఈ మాసంలో ఇవి చేయరాదు తామసం కలిగించే ఉల్లి, వెల్లుల్లి, మద్యం, మాంసం జోలికి పోరాదు. ఎవ్వరికీ ద్రోహం చేయరాదు. పాపపు ఆలోచనలు చేయకూడదు. దైవదూషణ తగదు. దీపారాధనలకు తప్ప నువ్వులనూనెను ఇతరత్రా అవసరాలకు ఉపయోగించరాదు. మినుములు తినకూడదు. నలుగుపెట్టుకుని స్నానం చేయరాదు. కార్తీక వ్రతం పాటించేవారు ఆ వ్రతం చేయని వారి చేతి వంట తినరాదు. ఈ మాసం... ఇవి చేయడం మంచిది ఈ మాసంలో చేసే ఉపవాసం, జాగరణ, స్నానం, దానం మామూలుగా చేసేటప్పటికంటే ఎన్నో రెట్లు అధిక ఫలాన్నిస్తాయి. విష్ణువును తులసి దళాలు, మల్లె, కమలం, జాజి, అవిసెపువ్వు, గరిక, దర్భలతోను, శివుని బిల్వదళాలతోనూ, జిల్లేడుపూలతోనూ అర్చించిన వారికి ఇహపర సౌఖ్యాలతోబాటుఉత్తమ గతులు కలుగుతాయి. శక్తి లేనివారు ఉదయం స్నానం, జపం, దేవతారాధన యథావిధిగా చేసి మధ్యాహ్నభోజనం చేసి, రాత్రికి పాలు, పళ్లు తీసుకోవచ్చు. ఇలా చేయడం అధిక ఫలదాయకం కార్తీకమాసంలో దశమి, ఏకాదశి, ద్వాదశి తిథులలో శ్రీమహావిష్ణువును తులసిదళాలతోటీ, కమలాలతోటీ పూజిస్తే సమస్త సౌఖ్యాలు కలగడంతోపాటు జన్మరాహిత్యం కలుగుతుందట. ఆరుద్ర నక్షత్రాన, మాసశివరాత్రినాడు, సోమవారం రోజు, పున్నమినాడూ రుద్రాభిషేకం చేసి, బిల్వదళాలతో పూజించిన వారు అనంతమైన సౌఖ్యాలతోబాటు అంత్యమున శివసాయుజ్యం పొందుతారని కార్తీక పురాణం చెబుతోంది. ఇవేవీ పాటించ(లే)కున్నా, సంప్రదాయాన్ని పాటించేవారిని గేలిచేయకుండా, వారికి సాయం చేస్తూ, పరనిందకు దూరంగా ఉంటూ, కలిగినదానిలోనే దానధర్మాలు చేసేవారికి సైతం పుణ్యఫలాలు కలుగుతాయని పెద్దల వాక్కు. - డి.వి.ఆర్. కార్తీకమాసం విష్ణుస్వరూపమని విష్ణుభక్తులు, కాదు... ఈశ్వరార్చనే ప్రశస్తమని శివభక్తులూ వాదిస్తారు. ఒకరకంగా ఆ ఇరువురి వాదనా సరైనదే. ఎలాగంటే ఈ మాసం శివకేశవులకిరువురికీ ప్రీతిపాత్రమైనదే. సాక్షి ఫ్యామిలీకి సంబంధించి మీ సలహాలను, సూచనలను పంపండి. ఫోన్: టోల్ ఫ్రీ నంబర్: 1800 425 9899 (ఉ.7.00-రా.8.00వరకు) పోస్ట్: సాక్షి ఫ్యామిలీ, 6-3-249/1, సాక్షి టవర్స్, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్-500034 మెయిల్: sakshi.features@gmail.com -
జగత్ గురువులు... జగతికి వెలుగులు
జగత్తులో అనేక రకాల ఆధ్యాత్మిక సాధనాలున్నాయి. ఇందులో ఏది ఎవరికి తగినదనే దాన్ని సాధకుని యోగ్యత, అవగాహన స్థాయిని బట్టి నిర్ణయించి, అది వారికి ఉపదేశించేది గురువే. గురువు అంటే అజ్ఞానాన్ని దూరం చేసేవాడని అర్థం. ‘గు’ అంటే చీకటి. ‘రు’ అంటే ప్రకాశం. గురువు అంటే చీకటిని తొలగించి వెలుగుతో ప్రకాశింపచేసేవాడు అని అర్థం. జ్ఞాన మార్గ దర్శకుడైన గురువు స్థానం పరమ పవిత్రమైనది. జ్ఞానాన్ని ఆర్జించడం కన్నా సద్గురువు చరణారవిందాలను సేవించడం, అనుగ్రహాన్ని పొందడం ఉత్తమమైనది. దేవుడు ఉన్నాడని నమ్మేవారు ఆస్తికులు, లేడని చెప్పేవారు నాస్తికులు అయితే జగత్తు, దేవుడు, జీవుడు అనే పరంపర నుంచి మూడు వాదాలు ఉద్భవించాయి. అవే మూడు ప్రధాన మతసిద్ధాంతాలుగా ఆవిర్భవించి, విస్తృతంగా వ్యాప్తిచెందాయి. ఆ సిద్ధాంతాలే అద్వైతం, విశిష్టాద్వైతం, ద్వైతం అయితే... హైందవ ధర్మానికి మూలస్తంభాలుగా పేర్కొనదగ్గ ముగ్గురు ఆచార్యులు ఈ మూడు మత పరంపరలకు ఆద్యులు. వారే జగద్గురు ఆదిశంకరాచార్యులు, రామానుజాచార్యులు, వల్లభాచార్యులు లేదా మధ్వాచార్యులు. ఈ మూడు మతాలు మతత్రయంగా, ఈ ముగ్గురూ ఆచార్యత్రయంగా ప్రసిద్ధి. అద్వైతమతం... ఆదిశంకరాచార్యులు: అద్వైతం అంటే రెండు కానిది. అంటే జీవుడికి, దేవుడికి భేదం లేదని చెప్పే మతమన్నమాట. ఈ సిద్ధాంతానికి రూపకర్త జగద్గురు శ్రీ ఆదిశంకరులు. కేరళలోని కాలడి అనే గ్రామంలో జన్మించిన ఆదిశంకరులు ప్రపంచమంతా జగద్గురువుగా గౌరవించే అత్యున్నతమైన ఆధ్యాత్మికవేత్త, మహాజ్ఞాని, మహాపండితులు. సౌందర్యలహరి, శివానందలహరి, వివేకచూడామణి, ప్రస్థాన త్రయభాష్యంతోబాటు ఈనాడు మనం స్తుతించుకునే అనేక స్తోత్రగంథాలు, ప్రకరణ గ్రంథాలు, కనకధారాస్తోత్రం, భజగోవింద శ్లోకాలు ఆయన రచించినవే. రవాణా సదుపాయాలు లేని రోజుల్లోనే ప్రపంచమంతా కాలినడకన పర్యటించి అన్ని మతాలను, విశ్వాసాలను ఒక తాటిపైకి తెచ్చిన ఈ జగద్గురువు భారతదేశంలో నాలుగు పీఠాలను స్థాపించారు. బదరీనాథ్, పూరి, శృంగేరి, ద్వారకలలో వీరు స్థాపించిన ఈ పీఠాలకు బాధ్యతలు చేపట్టిన వారు కూడా వీరి నామంతోనే జగద్గురువులుగా ప్రఖ్యాతి చెందుతుండటం విశేషం. వీరి లెక్క ప్రకారం దేహమే దేవాలయం. దేహంలో ఉండే జీవుడే దేవుడు. భౌతికమైన దేహం నశించినా, ఆ దేహంలో ఉండే జీవుడు మాత్రం స్థిరంగా ఉంటాడని అద్వైతుల నమ్మకం. నిశ్చలమైన బుద్ధితో ‘అహం బ్రహ్మాస్మి’ అంటే నే నే బ్రహ్మను అని తెలుసుకునేవాడు జీవన్ముక్తుడు అవుతాడని అద్వైతులంటారు. విశిష్టాద్వైతం... రామానుజాచార్యులు: బ్రహ్మానికి, ప్రకృతికి భేదం లేదని బోధించే విశిష్టాద్వైత మత స్థాపకులు రామానుజాచార్యులు. ఈ మతాన్ని అనుసరించేవారు విశిష్టాద్వైతులుగా ప్రసిద్ధి. జగత్తు సత్యం, జీవుడు సత్యం, దేవుడు సత్యం అన్నది వీరి విశ్వాసం. దేహంలోని భాగాల వలె జీవుడు కూడా దేవునితో చేరి ఉంటారని, దేహం నశించిన తరువాత జీవుడు మరో దేహంలో ప్రవేశిస్తాడు లేదా ప్రకృతిలో లీనమైపోతారని వీరి నమ్మకం. విశిష్టాద్వైతమతాచార్యులైన భగవద్రామానుజులు నేటి చెన్నైకు చేరువలోని శ్రీపెరంబుదూరులో జన్మించారు. కాంచీపురం లోని తిరుక్కచినంబికి శిష్యులైన రామానుజులు శ్రీరంగంలో గొప్ప పండితుడు, వైష్ణవ మత ప్రవక్త అయిన యామునాచార్యులవారి వారసుడిగా నిలిచారు. బ్రహ్మసూత్రభాష్యానికి విశిష్టాద్వైత దృష్టితో శ్రీ భాష్యం వ్యాఖ్యను రచించారు. మొట్టమొదటి మత సంస్కర్తగా నిలిచిన రామానుజులవారు వేదాంత సంగ్రహం, గద్యత్రయం వంటి విశిష్టమైన గ్రంథాలను రచించారు. ఉత్తరభారతమంతా విస్తృతంగా పర్యటించిన ఆయన దేశం నలుమూలలా నాలుగు శ్రీైవైష్ణవ మఠాలను నెలకొల్పారు. జాతి, మత భేదాలను పాటించకుండా భక్తి భావంతో భగవంతుని సందర్శించాలనుకున్న ప్రతి ఒక్కరికి ఆలయ ప్రవేశం కల్పించేలా చేశారు. తిరుమలతో సహా అనేక దేవాలయాలలో నిర్దిష్టమైన పూజావిధానాలను, సంప్రదాయాలను ఏర్పరిచారు. ద్వైతమతం... మధ్వాచార్యులు: జీవుడు, దేవుడు వేర్వేరు. జీవాత్మ, పరమాత్మ రెండుగా ఉంటాయని చెప్పే ద్వైతమతాన్ని మధ్వాచార్యులు నెలకొల్పారు. వీరికే వల్లభాచార్యులని పేరు. ఈయన జన్మనామం వాసుదేవులు. ఈయనను వాయుదేవుడి అంశగా భావిస్తారు. జీవాత్మ, పరమాత్మలకు భేదం ఉందని ద్వైతమతవాదులు విశ్వసిస్తారు. వీరికి కూడా వేదాలే ప్రమాణాలు అయినప్పటికీ, అన్నింటిలోకి భాగవత గ్రంథాన్ని అత్యంత ప్రామాణికంగా భావిస్తారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఉడిపి సమీపంలోని కంచనపూర్ అనే గ్రామంలో జన్మించిన మధ్వాచార్యులవారు రామానుజాచార్యులవారు ప్రచారం చేసిన శ్రీవైష్ణవానికి బదులు సద్వైష్ణవం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. మహాభారతంపై తమదైన వ్యాఖ్యానం, శ్రీకృష్ణస్తుతి, ద్వాదశా స్తోత్రం, నఖస్తుతి, యమకభారతం, కృష్ణామృత మహార్ణవం, తంత్రసార, ఉపాధి ఖండన మొదలైన గ్రంథాలను అందించారు. జీవులందరూ విష్ణువు అధీనంలో ఉంటారని, ఆయన అనుగ్రహం పొందగలిగినవారికి ముక్తి లభిస్తుందని బోధించే మధ్వాచార్యులు ఉడిపిలో శ్రీకృష్ణుని దేవాలయాన్ని నిర్మించారు. శ్రీవైష్ణవులకు శ్రీరంగంలోని రంగనాథ దేవాలయం ఎంత పవిత్రమైనదో, ద్వైతులకు ఉడిపిలోని శ్రీకృష్ణ దేవాలయం అంతటి పవిత్రమైనది. వీరి సిద్ధాంతాలలోని సరళత్వం సామాన్యప్రజలను అనేకమందిని ఆకట్టుకుని, వీరి మతంవైపు మొగ్గుచూపేలా చేసింది. - డి.వి.ఆర్. -
ఆడపడచుల ఆటపాటల పండుగ... అట్లతద్దె
ఆశ్వయుజ బహుళ తదియ నాడు అట్లతద్దె నోము నోచుకోని తెలుగువారు అరుదు. అందుకే అష్టాదశ వర్ణాలకు అట్లతద్దె అని సామెత. కన్నెపిల్లలు తమకు సలక్షణమైన భర్త రావాలని, వివాహితలు తమ కాపురం కలకాలం సంతోషంగా సాగాలనీ కోరుతూ నోచే నోము అట్లతద్దె. ఈ నోమును మొట్టమొదటిసారిగా గౌరీదేవి నారదముని ప్రోద్బలంతో నోచుకుని సాక్షాత్తూ పరమేశ్వరుని పతిగా పొందిందని పురాణోక్తి. తూరుపు తెలతెలవారకముందే కన్నెపిల్లలు, కొత్తపెళ్లికూతుళ్ల కాళ్లు పారాణితోనూ, చేతులు గోరింటాకుతోనూ, నోరు తాంబూలంతోనూ, చెంపలు సిగ్గుతోనూ ఎర్రగా పండే పండుగ అట్లతద్దె. కొత్త పరికిణీ, వోణీ, మువ్వల పట్టాలు ధరించి ‘అట్లతద్దోయ్ ఆరట్లోయ్- ముద్దపప్పోయ్ మూడట్లోయ్... పీటకిందా పిడికెడు బియ్యం పిల్లల్లారా జెల్లల్లారా లేచిరండోయ్.. ’ అంటూ ముచ్చటగొలిపే ఆటపాటలతో ఆడపిల్లలు ఊరంతా సందడి చేస్తారు. సాయంత్రం సంజెచీకట్లు పడేసరికల్లా అట్లతద్దెనోము చంద్రోదయ వేళకు గౌరమ్మను షోడశోపచారాలతో పూజించి- పసుపు, కుంకుమ, రవికెల గుడ్డ సమర్పించి అట్లు నివేదించి, ముత్తయిదువలకు పండు, తాంబూలం, అట్లు వాయనమిస్తారు. వారు నిండు మనస్సుతో ‘‘మంచి మొగుడొచ్చి పిల్లాపాపలతో నీ కాపురం నిండు నూరేళ్లు చల్లగా సాగాలి’’ అంటూ ఆశీస్సులందిస్తారు. వ్రతవిధానం: ఆశ్వయుజ బహుళ తదియనాడు కన్నెపిల్లలు, కొత్తగా పెళ్లయిన ఆడపడచులు తెల్లవారు ఝామున లేచి చద్దెన్నం, పొట్లకాయకూర, గోంగూర పచ్చడి, నువ్వులపొడి, ఉల్లిపాయ పులుసు, గడ్డపెరుగుతో భుజించి తాంబూలం వేసుకోవాలి. ఆ తర్వాత తిన్న అన్నం వంటబట్టేదాకా ఆటపాటలతో గడపాలి. హాయిగా ఊయలలూగాలి. అనంతరం స్నానపానాదులు పూర్తి చేసుకుని గౌరీదేవిని పూజించాలి. పగలంతా ఉపవాసం ఉండి సాయంత్ర ం ఆకాశంలో తారాచంద్రులు తొంగి చూసే సమయానికి శుచిగా తయారై, గౌరీ పూజ చేసి అమ్మవారికి వారి వారి ఆనవాయితీ ప్రకారం నిర్ణీత సంఖ్యలో అట్లు నివేదించాలి. తర్వాత ఒక ముత్తయిదువను గౌరీదేవి ప్రతిరూపంగా భావించి, ఆమెకు అలంకారం చేసి, అట్లు, పండు తాంబూలం వాయనంగా ఇవ్వాలి. ఉద్యాపన విధానం: పదిమంది ముత్తయిదువలకు ఒక్కొక్కరికి ఒక నల్లపూసల గొలుసు, లక్కజోళ్లు, రవికెల గుడ్డ, దక్షిణ, తాంబూలంతో పది అట్లు చొప్పున వాయనం ఇవ్వాలి. అనంతరం వారికి భోజనం పెట్టి సంతుష్టి పరచి వారి వద్ద నుండి ఆశీస్సులందుకోవాలి. శాస్త్రీయ దృక్పథం: మన పెద్దలు ఏర్పరచిన ప్రతి సంప్రదాయం వెనుకా ఎంతో అమూల్యమైన శాస్త్రీయ దృక్పథం ఉంది. అట్లతద్ది నోములో కూడా అంతే విశిష్ఠత ఉంది. నవగ్రహాలలోని కుజునికి అట్లంటే ప్రీతి. కుజునికి అట్లను నైవేద్యంగా పెడితే కుజదోషం పరిహారమవడమేగాక సంసారంలో ఎటువంటి అడ్డంకులూ రావు. రజోగుణం కల కుజుడు స్త్రీలకు రుతుసంబంధమైన సమస్యలు, గర్భధారణ సమస్యలకు కారకుడు. కుజునికి అట్లు నివేదించడం వల్ల అటువంటి సమస్యలు తలెత్తవు. అట్లను తయారు చెయ్యడానికి వాడే మినప పిండి, బియ్యప్పిండి మిశ్రమంలో మినుములు రాహువుకూ, బియ్యం చంద్రునికీ సంబంధించినవి. అందువల్ల ఈ రెండూ కలిసిన అట్లను వాయనంగా ఇవ్వడం వల్ల గర్భదోషాలు తొలగి సుఖప్రసవం అవుతుంది. గౌరీదేవికి ఆటపాటలంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ వ్రతంలో భాగంగా ఆడపిల్లలంతా తెల్లవారుజామున మసక మసక వెలుతురులో ముందురోజే చెట్లకొమ్మకి కట్టి ఉంచిన ఉయ్యాలలు ఊగేందుకు వెళుతూ తమ స్నేహితురాళ్లందరికీ వినిపించేలా చప్పట్లు చరుస్తూ పాటలు పాడతారు. ఆ చప్పట్లకీ ఆటపాటలకీ, కోలాహలానికీ గలగల నవ్వుల సవ్వడికీ సాటి ఆడపిల్లలు, వారికి తోడుగా ఈడైన కుర్రకారు అక్కడికొచ్చి సందడి చేస్తారు. మొత్తం మీద అట్లతద్దె అంటే సంప్రదాయకంగా నోచే నోము మాత్రమే కాదు, ఆటపాటలతో గడిపే సంబరం కూడా. - డి.వి.ఆర్ అట్లతద్ది సందేశం: అట్లతద్ది రోజు ఆటలాడటం వల్ల నడుము గట్టిపడుతుంది. తద్దెపాటలు లోకంలో బతకాల్సిన తీరు గురించి సందేశమిస్తాయి. -
మహాభారతం ఏ పర్వంలో ఏముంది?
మహాభారతంలో ఉన్నదంతా లోకంలో ఉన్నది. మహాభారతంలో లేనిదేదీ ఈ లోకంలో లేదు అని లోకోక్తి. మహాభారతంలో పద్దెనిమిది పర్వాలున్నాయని మాత్రమే తెలుసు కాని, ఆ పర్వాలేమిటో, ఏ పర్వంలో ఏముంటుందో తెలిసిన వారు తక్కువనే చెప్పవచ్చు. అటువంటివారికి అవగాహన కోసం... 1. ఆదిపర్వం: రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు, ఆయన కుమార్తె దేవయాని, చంద్రవంశ మహారాజు యయాతిల చరిత్రతోపాటు శకుంతల, దుష్యంతులకు సంబంధించిన అనేక పురాతన కథలను ఇది వివరిస్తుంది. ఈ పర్వంలో అధికభాగం కురువంశ మూలపురుషులైన శంతనుడు, భీష్ముడు, విచిత్రవీర్యుడు, ధృతరాష్ట్రుడు తదితరుల పరిచయం ఉంటుంది. పాండురాజు కథ, పాండవ కౌరవుల జననం, విద్యాభ్యాసం, వారి మధ్య బాల్యం నుంచే పొడసూపే స్పర్థలు, పాంచాల రాకుమారి ద్రౌపదితో పాండవుల వివాహం, అర్జునుడి తీర్థయాత్ర, శ్రీకృష్ణుని చెల్లెలైన సుభద్రతో పరిణయం తదితర విషయాలను కూడా ఆదిపర్వం వివరిస్తుంది. 2. సభాపర్వం: పాండవ ప్రథముడైన యుధిష్ఠిరుడు (ధర్మరాజు) రాజసూయయాగం చేయడం, కౌరవ ప్రథముడైన దుర్యోధనుడు శకుని సాయంతో జూదం గెలవటం, పర్యవసానంగా తలెత్తిన పరిణామాలు ప్రధానాంశాలు. 3. అరణ్యపర్వం: దీనినే వనపర్వం అని కూడా అంటారు. కామ్యక వనంలో పాండవుల వనవాస వర్ణన ఇందులో ఉంటుంది. దీనితోపాటు నలదమయంతుల కథ, సావిత్రిసత్యవంతుల గాథ, ఋష్యశృంగుడు, అగస్త్యుడు, మార్కండేయుడు తదితర మహామునులతోపాటు భగీరథుడు, శిబి వంటి చక్రవర్తుల వృత్తాంతాలు కూడా ఉంటాయి. 4. విరాటపర్వం: విరాటుని కొలువులో పాండవులు అజ్ఞాతవాసం చేయడం, దుష్టుడైన కీచకుని వధ, పాండవులను అజ్ఞాతవాసం నుంచి బయటకు రప్పించి దానిని భగ్నం చేయడానికి, విరాటరాజుకి చెందిన గోవులను పట్టుకున్న కౌరవులతో యుద్ధం, దక్షిణ గోగ్రహణం, ఉత్తర - అభిమన్యుల పరిణయం ఉంటుంది. 5. ఉద్యోగపర్వం: ఒకవైపు శాంతియత్నాలు, మరోవైపు యుద్ధసన్నాహాలు సమాంతరంగా సాగిపోవటం ఈ పర్వం ప్రత్యేకత. కర్ణుడు తన కొడుకే అని తెలిసిన కుంతీదేవి పరితాపం, శాంతియత్నాలు చేస్తూనే పాండవులను యుద్ధసన్నద్ధులను గావించే శ్రీ కృష్ణుని రాజనీతి... ఈ పర్వంలోని ముఖ్యాంశాలు. 6. కర్ణపర్వం: కౌరవ సోదరులలో రెండవవాడైన దుశ్శాసనుడు భీముని చేతిలో నేలకూలటం, మహావీరుడైన కర్ణుడు అర్జునుని చేతిలో వీరమరణం పొందటం... ఇందులోని ప్రధానాంశాలు. 7. భీష్మపర్వం: మహాభారతంలో ఆరవది భీష్మపర్వం. ఇది అతి ముఖ్యమైనది. ప్రపంచ సారస్వతానికే తలమానికమైన భగవద్గీతను శ్రీకృష్ణుడు అర్జునునికి బోధించింది ఈ పర్వంలోనే. పదిరోజుల యుద్ధ వర్ణన, భీష్మపితామహుడి మానవాతీత సాహసాల గురించిన అత్యద్భుత వర్ణన కనిపిస్తుంది. స్వచ్ఛంద మరణమనే వరం ఉండటం వల్ల భీష్ముడు ఉత్తరాయణం ప్రారంభం అయ్యేవరకు తన మరణాన్ని వాయిదా వేసుకుని అంపశయ్య మీదనే విశ్రమించడం ఉంటాయి. 8. ద్రోణపర్వం: ద్రోణాచార్యుల సాహసకృత్యాలు, విధిలేని విపత్కర పరిస్థితిలో ధర్మరాజు పలికిన ‘అశ్వత్థామ హతః’ అనే మాట ఫలితంగా ఆయన అస్త్రసన్యాసం చేసి వీరమరణం పొందటం ఇందులోని ముఖ్యాంశం. ఆ తర్వాత యుద్ధరంగంలో అభిమన్యుడి పోరాట పటిమ, ఆ యువకుడి వీరమరణం ఇతర ముఖ్యాంశాలు. 9. శల్యపర్వం: మహాభారత యుద్ధంలోని చివరి ఘట్టాలను వర్ణించేది శల్యపర్వం. భీమదుర్యోధనుల యుద్ధం, దుర్యోధనుడు తీవ్రంగా గాయపడి మరణించటం ముఖ్యాంశాలు. 10. సౌప్తికపర్వం: ద్రోణుడి కుమారుడైన అశ్వత్థామ ప్రతీకార కార్యకలాపాలు, రాత్రి సమయంలో నిద్రలో ఉన్న ఉపపాండవులను, పాండవుల సైన్యాన్ని, మిత్రపక్షాలను అశ్వత్థామ ఊచకోత కోయటం ఈ పర్వంలో ప్రధానాంశాలు. 11. స్త్రీపర్వం: వీరమరణం పొందిన కురుపాండవ యోధులకు సంబంధించిన భార్యల రోదనలు, విషాద సన్నివేశాలు ఇందులో ఉంటాయి. యుద్ధం ఎప్పుడు జరిగినా చివరకు మిగిలే విషాదం ఇందులో కళ్లకు కడుతుంది. 12, 13. శాంతి, అనుశాసనిక పర్వాలు: ధర్మరాజు అభ్యర్థన మేరకు, వంశకర్త అయిన భీష్ముడు ధర్మానికి సంబంధించిన అద్భుతమైన విషయాలను బోధించటం, అత్యంత ప్రాచుర్యం పొందిన విష్ణు సహస్రనామాలు, శివసహస్రనామాలు, భీష్ముని మరణం, ధర్మరాజుకి పట్టాభిషేకం ఇందులో కనిపిస్తాయి. 14. అశ్వమేధిక పర్వం: శ్రీకృష్ణుడు ద్వారకకు మరలిపోవటం, ధర్మరాజు చేసిన అశ్వమేథయాగ వర్ణన ఉంటాయి. ఒక నిరుపేద బ్రాహ్మణ కుటుంబం చేసిన అత్యున్నత త్యాగాన్ని గుర్తు చేస్తూ ఒక ముంగిస ధర్మరాజును పరాభవించటం ఇందులోని కొసమెరుపు. 15. ఆశ్రమవాసిక పర్వం: కుంతి, గాంధారి సమేతుడై ధృతరాష్ట్రుడు అరణ్యాలకు పయనమవ్వటం, అక్కడ ప్రమాదవశాత్తూ అరణ్యంలో దావాగ్నిలో అసువులు బాయటం ఇందులో చూడవచ్చు. 16. మౌసలపర్వం: యాదవ వీరులు తమ పతనాన్ని తామే కొని తెచ్చుకోవటం, ఒక వేటగాడి చేతిలో శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించటం వంటి ఘట్టాలు ఇందులో ఉంటాయి. 17. మహాప్రస్థానిక పర్వం: పాండవుల అంతిమయాత్ర గురించిన వర్ణన ఇందులో ఉంటుంది. 18. స్వర్గారోహణ పర్వం: భీమార్జున, నకులసహదేవుల మరణం, ధర్మరాజు ఒక్కడే స్వర్గానికి చేరటం ఇందులోని ప్రధానాంశం. - కూర్పు: డి.వి.ఆర్ -
ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః
మహిళలందరూ ఎంతో ఆనందంగా, భక్తిశ్రద్ధలతో ఇళ్లలోనూ, గుళ్లలోనూ సామూహికంగా జరుపుకునే పండుగ వరలక్ష్మీవ్రతం. శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతం ఆచరిస్తారు. కుదరని వారు ఆ మాసంలో వచ్చే ఏదో ఒక శుక్రవారంనాడు ఈ వ్రతం జరుపుకోవచ్చు. ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసి, గుమ్మాన్ని పసుపు కుంకుమలు, మామిడాకు తోరణాలతో అలంకరించాలి. ఇల్లాలు తలంటి స్నానం చేసి, కలశం స్థాపించి, అందులో లక్ష్మీదేవిని ఉంచాలి. ముందుగా విఘ్న నివారణకై గణపతి పూజ చేయాలి. తర్వాత సంకల్పం చెప్పుకుని ఒక పంచపాత్రను గాని, లోటాను గాని తీసుకుని, అందులో నీరు పోసి అక్షతలు, పువ్వులు, తమలపాకులను ఉంచాలి. దానికి బయట మూడువైపులా పసుపు, కుంకుమ, గంధాలతో అలంకరించి కలశపూజ చేయాలి. వరలక్ష్మీ పూజావిధానం... సులభ పద్ధతిలో అమ్మవారిని ఇంటికి ఆహ్వానించి, కాళ్లు కడుక్కోవడానికి నీళ్లిచ్చి, నవరత్న ఖచిత సింహాసనంపై కూర్చుండబెట్టి, తాగడానికి నీళ్లిచ్చి, స్నానం చేయించి, వస్త్రాలు, ఆభరణాలు అలంకరించి, ధూపదీపనైవేద్యాలతో పూజించి, కథ చెప్పుకుని, శక్తికొద్దీ నైవేద్యాలు సమర్పించి, సకల మర్యాదలతో సాగనంపినట్లుగా భావించుకోవాలి. అదే పూజామంత్రాలలోని అంతరార్థం. ఇక పూజలోకి వద్దాం... ధ్యానం: పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరా భవ మే గేహే సురాసుర నమస్కృతే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ధ్యాయామి (అమ్మవారి కలశం ముందు కొన్ని పుష్పాలుంచి నమస్కరించాలి) ఆవాహన: సర్వమంగళ మాంగల్యే విష్ణు వక్షస్థలాలయే ఆవాహయామి దేవీ త్వాం సుప్రతా భవ సర్వదా, శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ఆవాహయామి’ అని చెబుతూ కలశం ముందు అక్షతలు వేయాలి. ఆసనం: శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. (అక్షతలు లేదా పుష్పాలు ఉంచాలి) అర్ఘ్యం: శ్రీవరలక్ష్మీ దేవతాయైనమః అర్ఘ్యం సమర్పయామి అంటూ ఉద్ధరిణతో నీటిని అమ్మవారికి చూపించి ముందున్న అర్ఘ్యపాత్రలో వేయాలి. పాద్యం: పాద్యం గృహాణ దేవత్వం సర్వదేవ నమస్కృతే అంటూ అర్ఘ్యపాత్రలో ఓ ఉద్ధరిణెడు నీటిని వేయాలి. ఆచమనం: శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః శుద్ధాచమనీయం సమర్పయామి (అర్ఘ్యపాత్రలో ఉద్ధరిణెడు నీటిని వేయాలి) పంచామృతస్నానం: పయోదధిఘృతో పేతం శర్కరా మధుసంయుతం పంచామృత స్నానమిదం గృహాణ కమలాలయే శ్రీవరలక్ష్మీ దేవతాయైనమః పంచామృతస్నానం సమర్పయామి (తమలపాకుతో కొన్ని చుక్కల నీటిని కలశం మీద చిలకరించాలి) శుద్ధోదకస్నానం: శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః శుద్ధోదక స్నానం సమర్పయామి (తమలపాకుతో కొన్ని చుక్కల నీటిని కలశం మీద చిలకరించాలి) ఆచమనీయం: స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి (అర్ఘ్యపాత్రలో ఉద్ధరిణెడు నీటిని వేయాలి) వస్త్రం: శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః వస్త్రయుగ్మం సమర్పయామి (అక్షతలు లేదా పుష్పాలు ఉంచాలి) ఆభరణం: శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః ఆభరణాని సమర్పయామి (పుష్పాలు ఉంచాలి) ఉపవీతం: శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః ఉపవీతం సమర్పయామి (పత్తితో చేసిన సూత్రం చివరలో గంధం రాసి కలశానికి అంటించాలి) గంధం: శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః గంధం సమర్పయామి (కలశంపై గంధం చిలకరించాలి) అక్షతలు: శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః అక్షతాన్ సమర్పయామి (అక్షతలు వేయాలి) పుష్పం: శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః పుష్పైః పూజయామి (అమ్మవారి కలశం ముందు పుష్పం ఉంచాలి). అధాంగ పూజ: పుష్పాలు లేదా అక్షతలతో కలశాన్ని పూజించాలి. అనంతరం అష్టోత్తర శతనామాలతో అర్చిస్తూ, పుష్పాలతో పూజించాలి). దూపం: శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ధూప మాఘ్రాపయామి (అగరు వత్తులు వెలిగించి ఆ ధూపాన్ని అమ్మవారికి చూపాలి) దీపం: శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః దీపం దర్శయామి ధూప దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి (దీపం చూపించి ఉద్ధరిణెతో కొంచెం నీటిని అర్ఘ్యపాత్రలో వేయాలి) నైవేద్యం: నైవేద్యం షడ్రసోపేతం దధిమధ్వాజ్య సంయుతం నానాభక్ష్య ఫలోపేతం గృహాణ హరి వల్లభే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః నైవేద్యం సమర్పయామి (ఉద్ధరిణెతో నీటిని అర్ఘ్యపాత్రలో ఉంచాలి) పానీయం: ఘనసార సుగంధేన మిశ్రీతం పుష్పవాసితం పానీయం గృహ్యతాం దేవీ శీతలం సుమనోహరమ్ శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః పానీయం సమర్పయామి (ఉద్ధరిణెతో నీటిని అర్ఘ్యపాత్రలో ఉంచాలి) తాంబూలం: పండు, పుష్పం, వక్క, దక్షిణతో కూడిన తాంబూలాన్ని అమ్మవారి వద్ద ఉంచాలి. నీరాజనం: శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః నీరాజనం సమర్పయామి (ఘంటానాదం చేస్తూ కర్పూర హారతిని అమ్మవారికి చూపించాలి) మంత్రపుష్పం: పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణే ప్రియే దేవి సుప్రీతో భవసర్వదా శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః మంత్రపుష్పం సమర్పయామి (పుష్పాలను అమ్మవారి ఎదుట ఉంచాలి) ప్రదక్షిణ: యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ తానితాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవా త్రాహిమాం కృపయాదేవి శరణాగత వత్సలే అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జగధారిణి శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః ప్రదక్షిణం సమర్పయామి (ముమ్మారు ప్రదక్షిణ చేయాలి) నమస్కారం: నమస్తే లోక జననీ నమస్తే విష్ణు వల్లభే పాహిమాం భక్తవరదే వరలక్ష్మీ దేవతాయై నమః నమస్కారాన్ సమర్పయామి (అమ్మవారికి అక్షతలు సమర్పించి నమస్కరించాలి) తోరపూజ: తోరాలను అమ్మవారి వద్ద ఉంచి అక్షతలతో పూజించి, తోరం కట్టుకోవాలి. తర్వాత వరలక్ష్మీ వ్రతకథ చదువుకొని అక్షతలు వేసుకుని, ముత్తయిదువులకు తాంబూలాలు ఇవ్వాలి. అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి, పూజచేసిన వారు కూడా తీర్థప్రసాదాలు స్వీకరించాక, అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని ఆరగించాలి. -కూర్పు: డి.వి.ఆర్.భాస్కర్ వతానికి సమకూర్చుకోవలసిన సంభారాలు పసుపు, కుంకుమ, వాయనానికవసరమైన వస్తువులు, అక్షతలు, ఎర్రటి రవికె, గంధం, పూలు, పండ్లు, తమలపాకులు, వక్కలు, తోరాలు చేసుకోవడానికి తగినంత నూలు దారం, 5 కొబ్బరికాయలు, దీపపు కుందులు, ఐదు వత్తులతో హారతి ఇవ్వడానికి అవసరమైన పంచహారతి, దీపారాధనకు ఆవునెయ్యి, కర్పూరం, అగరువత్తులు, బియ్యం, శనగలు, అర్ఘ్య పాత్ర (చిన్నగిన్నె) తదితరాలను సిద్ధంగా ఉంచుకోవాలి. పసుపు గణపతిని తయారు చేసి ఉంచుకోవాలి.