ఊరంతా సంక్రాంతి జగమంతా క్రాంతి | Funday Sankranti Special | Sakshi
Sakshi News home page

ఊరంతా సంక్రాంతి జగమంతా క్రాంతి

Published Sun, Jan 10 2016 6:31 AM | Last Updated on Sun, Sep 3 2017 3:23 PM

ఊరంతా సంక్రాంతి జగమంతా క్రాంతి

ఊరంతా సంక్రాంతి జగమంతా క్రాంతి

ఇంటి ముంగిళ్లను అలరించే రంగవల్లులు... హరిలో రంగ హరీ... అంటూ శ్రావ్యంగా సాగే హరినామ సంకీర్తనలతో చిరుచీకట్లలో దర్శనమిచ్చే హరిదాసులు... అంబపలుకు జగదంబ పలుకు అంటూ డమరుకంతో బుడబుక్కల వాళ్లు... అయ్యవారికి దణ్ణం పెట్టు, అమ్మగారికి దణ్ణం పెట్టు అంటూ బసవన్నతో విన్యాసాలు చేయించే గంగిరెద్దుల వాళ్లు... కొత్తల్లుళ్ల వైభోగాలు... ముగ్గులుదిద్దే ముద్దుగుమ్మలు ఒక పక్క, కోడి పందాలు, పేకాటలు, భోగి మంటల సంరంభాలు ఇంకోపక్క, అరిసెలు, జంతికలు, నువ్వుండలు తదితర పిండి వంటల ఘుమఘుమలు వేరొకపక్క... మనోజ్ఞమైన ఈ దృశ్యాలన్నీ కళ్లకు కట్టేది ఒక్క సంక్రాంతి సమయంలోనే.
 
 సంక్రాంతి నెల వచ్చిందంటే చాలు... ముందుగా వాకిళ్లు ఊడ్చి, అందమైన రంగవల్లికలు తీర్చిదిద్ది... వాటిలో గొబ్బెమ్మలను పెట్టడం తెలుగింటి సంప్రదాయం. దీనినే సంక్రాంతి నెలపట్టడమంటారు.
 
సంక్రాంతి ముగ్గులు... గొబ్బెమ్మలు
హేమంత రుతువులో సూర్యుడు భూమికి దూరంగా ఉండటం వల్ల వాతావరణం చల్లగా ఉండి, క్రిమికీటకాదులతో వ్యాధులు ప్రబలే అవకాశముంది. ఇంటి ముంగిళ్లలో పేడనీళ్లు చల్లి గుల్లసున్నంతో ముగ్గులేయడం వల్ల సున్నంలోని క్యాల్షియం క్రిమికీటకాల సంహారానికి తోడ్పడుతుంది. ఆవుపేడతో కల్లాపు రోగ నిరోధక శక్తి పెంపొందించడానికి తోడ్పడుతుంది. ఆడపిల్లలు ఎంతో ఒద్దికగా వంగి ముగ్గులు వేయడం వల్ల శరీరానికి వ్యాయామం ఏర్పడుతుంది. తామెప్పుడో విన్న లేదా చూసిన ముగ్గులను గుర్తుకు తెచ్చుకుంటూ వేయడం వలన వారిలో ధారణశక్తి పెరుగుతుంది.
 
గొబ్బి శబ్దం పుట్టిందిలా...
గొబ్బి శబ్దం గోపి నుండి పుట్టింది. గోపి, గోపిక, గోపియ, గోబియ, గొబ్బియ, గొబ్బిగా రూపాంతరం చెందిందని పెద్దలు చెబుతారు. కన్నెపిల్లలు కృష్ణుని గోపిగా, గొబ్బెమ్మ (గోపెమ్మ)లను గోపికలుగా భావిస్తూ వాటి చుట్టూ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని వలయాకారంలో తిరుగుతూ పాటలు పాడడం మన సంస్కృతిలో భాగం. కొందరు పెద్దగొబ్బెమ్మను కృష్ణునిగా, తక్కిన ఎనిమిది గొబ్బెమ్మలను ఆయన అష్టభార్యలుగా గుర్తించాలంటారు. మరికొందరు పెద్దగొబ్బెమ్మ సూర్యుడికి, మిగతా గొబ్బెమ్మలు గ్రహాలకు సంకేతమని చెబుతారు. గొబ్బెమ్మలను గౌరీదేవిగా భావించి చివరిరోజున సందె గొబ్బెమ్మను పెట్టి కన్నెపిల్లలందరూ పాటలు పాడతారు. అలా చేస్తే కోరుకున్న వరుడొస్తాడని, తొందరగా పెళ్లవుతుందని ఒక నమ్మకం.
 
రంగురంగులుగా తీర్చిదిద్దిన రంగవల్లుల నడుమ గొబ్బెమ్మలను పెట్టడమంటే ఆకాశంలోని చుక్కలను ఇంటి ముంగిట పెట్టినట్లేనని, ఖగోళ శాస్త్ర రహస్యాలెన్నింటినో తెలియ చేసేందుకే గొబ్బెమ్మలను పెట్టే సంప్రదాయం ఏర్పడిందని కొందరు చెబుతారు. ఇలా గొబ్బెమ్మల వెనుక అంతరార్థాలెన్నో!
 
సంక్రాంతిని భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమగా నాలుగు రోజులు  జరుపుకుంటారు. అటు కుర్రకారును, ఇటు నడికారును ఉత్సాహపరుస్తూ మూడుకాళ్ల ముదుసలి వాళ్లు చేసే సందడి భోగిమంటలు. పాతదనాన్ని ఎప్పటికప్పుడు విసర్జిస్తేనే కొత్తదనపు సొబగులు సమకూరుతుంటాయి. అందుకు ప్రతీకగానే తెల్లవారు ఝామునుంచే ఇంటిలో ఉన్న పాత కలపను, పనికిరాని సామగ్రిని తీసుకుని నాలుగురోడ్ల కూడలికి పరుగులు తీస్తారు కుర్రకారు.

కణకణ మండే భోగిమంటలలో ఆ పాతవాసనలు కొట్టే పనికిరాని, విరిగిపోయిన సామగ్రిని దగ్ధం చేసి, ఎముకలను కొరికే చలిని తరిమికొట్టే ఆ వెచ్చదనపు వైభోగాన్ని ఆస్వాదించడం ఎప్పటికీ చెరిగిపోని ఓ నులివెచ్చటి జ్ఞాపకం. బూజుపట్టిన పాత ఆలోచనలను, ఇతరుల మీద పెంచుకున్న పగ, ఈర్ష్య, అసూయ, కుళ్లు, కుత్సితం, కుతంత్రం మొదలైన వాటిని కూడా ఆ మంటలలో కాల్చి వేసి, హృదయాన్ని ప్రేమతో నింపుకోమని చెప్పడం అందులోని అంతరార్థం.ఇక భోగిపళ్లు అంటే పిల్లలకు దృష్టిదోషం, అనారోగ్యం తదితర దోషాలు తొలగిపోవడానికి పెద్దవాళ్లు చేసే ఓ వేడుక. పిల్లలకు ఉదయమే తలంటిస్నానం చేయించి, కొత్తబట్టలు కట్టబెట్టి, నుదుట కుంకుమ బొట్టుపెట్టి చక్కగా ముస్తాబు చేస్తారు. ఇక సాయంకాలం వేళ అమ్మలక్కలను పిలిచి, పేరంటం చేస్తారు. ఇంటిలోని పెద్దలు, పేరంటానికి వచ్చిన వారందరూ ఒక్కొక్కరుగా వచ్చి మూడేసి పిడికిళ్ల రేగుపళ్లు, పూలరెక్కలు, చిల్లరపైసలను దిష్టి తీసినట్టుగా వారి తలచుట్టూ ముమ్మారు తిప్పి, తలమీద నుంచి కిందికి దొర్లేలా పోస్తారు.

ఆరోగ్యప్రదాత అయిన సూర్యుడికి రేగుపళ్లంటే చాలా ఇష్టం. అంతేగాక,  రేగుపళ్లలో ఎన్నో ఔషధగుణాలుంటాయట. సూర్యభగవానుడి ఆశీస్సులతోబాటు, అర్కఫలాల్లోని ఔషధగుణాలు కూడా పిల్లలకు అందాలన్నది పెద్దల ఆకాంక్ష. రెండవ రోజు మకరసంక్రాంతి లేదా మకర సంక్రమణం. సూరీడు ప్రతినెలలోనూ ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారుతుంటాడు. అయితే ఆయన ధనూరాశి నుండి మకరరాశిలోనికి ప్రవేశించించడమే ఉత్తరాయణ పుణ్యకాలమంటారు. ఎందుకంటే ఉత్తరాయణమనేది దేవతలకు పగటికాలం. అజ్ఞానమనే చీకట్లను పారద్రోలే పర్వకాలం. అందుకే ఉత్తరాయనానికి అంతటి ప్రాధాన్యత.
 
పెద్ద పండుగ అని ఎందుకంటారు?
సంక్రాంతిని పెద్ద పండుగ అనటానికి మరో కారణమేమిటంటే తొలిపంట ఇంటికి వచ్చే సమయంలో అన్నదాతలు ఎంతో ఆనందంగా ఉంటారు. కళకళలాడుతున్న పంటపొలాలను, పండబోయే దిగుబడిని తలుచుకొని సంతోషపడుతుంటారు. జనావళికి అన్నం పెట్టే అన్నదాత ఆనందానికి మించిన పండుగ ఇంకేముంటుంది? అందుకే శ్రమకు, సంపదకు గొప్ప స్థానమిచ్చే ఈ సంక్రాంతి పండుగను బీద, గొప్ప అనే తేడా లేకుండా అందరూ ఘనంగా జరుపుకుంటారు.

కర్షకులు ఆనందంలో పాలుపంచుకుంటారు. బుడబుక్కలవాళ్లు చక్కటి తత్వాలు చెబుతారు. హరిదాసులు దైవభక్తిని ప్రబోధిస్తారు. పంటలు పండి, ధాన్యంతో గాదెలు నిండిన రైతులు హరిదాసులకు, బుడబుక్కలవాళ్లకు, విప్రవినోదులకు, అందరికీ ధాన్యం కొలుస్తారు. కూరగాయలు, పప్పు, ఉప్పు, చింతపండు వంటి వాటిని కూడా సంతోషంగా వారికి సమర్పించుకుంటారు.

ఇక గంగిరెద్దులు తమ విన్యాసాలతో అందరికీ ఆనందాన్ని పంచుతాయి. సాక్షాత్తూ శివుడి వాహనమే తమ ఇంటి ముంగిటికి వచ్చిన అనుభూతిని కలిగిస్తాయి. ఆ ఆనందానుభూతులతో ఇంటిలోని పాత, కొత్తబట్టలు వాటి మూపురానికి కప్పి, వాటిని ఆడించే వారికి ధాన్యాన్ని, డబ్బును కానుకగా ఇస్తారు. దానితో ఆ మూగజీవాల కడుపు నిండుతుంది, వాటిని ఆడించే వారికి గ్రాసం లభిస్తుంది.గాలిపటాలు: కొన్ని ప్రాంతాలలో గాలిపటాలు ఎగరవేయడాన్ని పిల్లల ఆటగా భావిస్తారు కానీ, తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా హైదరాబాదులో సంక్రాంతిని పతంగుల పండుగగానే పేర్కొంటూ పెద్ద ఎత్తున వేడుకగా జరుపుకుంటారు. గాలిపటాలను ఎగురవేసే క్రమంలో గాలివాలు ఎటునుంచి ఎటువైపు వీస్తోందో తెలుస్తుంది. తద్వారా వర్షాలు ఎలా పడతాయి, పంటలు ఎలా పండుతాయి అనే విషయం అనుభవజ్ఞులైన రైతులకు అవగతం అవుతుంది.

అదేవిధంగా గాలిపటాల ఆట వల్ల ఏకాగ్రత అలవడుతుంది. బాధలు, కష్టాలు, దిగుళ్లు అన్నీ మర్చిపోయి మనసులో ఉల్లాసం, ఉత్సాహం పరవళ్లు తొక్కుతాయి. గాలిపటాలను ఎగుర వేసేటప్పుడు తెగిన గాలిపటంతోపాటే మన దురదృష్టం కూడా గాలి వాలుకి కొట్టుకుపోతుందన్నది తాత్వికుల భావన.
 
సంక్రాంతి రోజున ఏం చేయాలి?
ఇది సూర్యభగవానుడికి, విష్ణుదేవుడికి సంబంధించిన పండుగ. ఈ రోజు చేసే స్నాన, దాన, జపాదులు విశేష ఫల దాయకం. అన్నిటికన్నా ఉదయ కాల స్నానం ముఖ్యం. స్నానం చేసిన తరువాత నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. నువ్వులు, బియ్యం కలిపి శివుని అర్చించిన పిమ్మట ఆవునేతితో అభిషేకం చేయాలి. విష్ణువును, పౌష్యలక్ష్మిని పూజించి విష్ణుసహస్ర నామ పఠనం చేయాలి. తర్వాత లోకబాంధవుడు, ప్రత్యక్షనారాయణుడైన సూర్యభగవానుడిని పూజించి కొత్తబియ్యంతో పొంగలి, పులగం తయారుచేసి, పాలు పొంగించి భక్తిప్రపత్తులతో ఆయనకు నివేదించడం శుభప్రదం. భోజనంలో మంచి గుమ్మడి కూర ఉండేట్లు చూసుకోవాలి.

ఈ కాలంలో నువ్వుల వాడకం శుభప్రదం. రుతుపరంగా కూడా చల్లటి చలికాలం కాబట్టి, వేడి చేసే వస్తువైన నువ్వులు తినడం ఆరోగ్యపరంగా మంచిది. అందుకే సంక్రాంతినాడు చక్కెర పాకంలో నువ్వులు కలిపి చేసిన ఉండలను భుజించడం, చుట్టుపక్కల వారికి, స్నేహితులకు, హితులకు పంచిపెట్టడం వల్ల బాంధవ్యాలు పెంపొందుతాయి. మంచిగుమ్మడి కూర వాతం కలిగిస్తుంది కాబట్టి, దానికి విరుగుడుగా నువ్వుండలు తినడం మంచిదంటారు.
 
మూగజీవుల ఆనందాన్ని కనుమా...
సంక్రాంతి మరునాడు జరుపుకునే పండుగ కనుమ. దీనికి రైతుల పండుగ అనిపేరు.  కనుమ రోజు ఉదయాన్నే లేచి పశువుల కొట్టాలు శుభ్రం చేసి, పేడతో అలికి బియ్యప్పిండితో అందంగా ముగ్గులు పెడతారు. పాలిచ్చి మనల్ని పోషించే ఆవులను, వ్యవసాయంలో తమకెంతగానో తోడ్పడే ఎడ్లను శుభ్రంగా కడిగి గిట్టలను, కొమ్ములను కుంకుమతోటీ, పూలతోటి అలంకరించి, కృతజ్ఞతాపూర్వకంగా పూజిస్తారు. వ్యవసాయ పనిముట్లను కూడా పూజలో ఉంచుతారు.

అనంతరం పశువుల కొట్టాలలోనే పొంగలి వండి నైవేద్యం పెడతారు. ఆ పొంగలిలో పసుపు, కుంకుమలు కలిపి పొలాల్లో ‘పొలి’ చల్లుతారు. అనంతరం బాగా పండి ఉన్న పొలాలకు మంచి గుమ్మడికాయ పగలగొట్టి దిష్టితీస్తారు. ఆ తరువాతు ఇంతకు ముందే సిద్ధం చేసి ఉంచిన పొంగలిని పశువులకు తినిపిస్తారు. సాయంత్రం పశువులను అలంకరించి మేళ తాళాలతో ఊరేగిస్తారు. కోడిపందాలు, ఎడ్లపందాలు నిర్వహిస్తారు. కనుమ తరువాతి రోజు ముక్కనుమ. ఈ రోజు కూడా పశువులను అలంకరించి ఊరేగిస్తారు. ఈవేళ మాంసాహారులు తప్పనిసరిగా మాంసాహార వంటకాలను భుజిస్తారు. మాంసం తిననివారు మినుములతో వండిన గారెలను కడుపారా ఆరగిస్తారు.
 
కనుమనాడు కాకి కూడా తలను నీటిలో ముంచి స్నానం చేస్తుందంటారు. అంటే కనుమనాటి స్నానం ఫలప్రదమన్న మాట. అదేవిధంగా కనుమనాడు కాకికూడా ప్రయాణం చేయదని సామెత. అంటే కనుమనాడు శుభ్రంగా స్నానం చేసి, ఇంటిపట్టునే ఉండి కడుపునిండా భుజించడం మంచిదని పెద్దలు చెప్పిన మాటగా అర్థం చేసుకోవచ్చు.
 పండుగలనేవి మనుషులకే కాదు... మన పోషణలో చేదోడువాదోడుగా ఉన్న మూగజీవాలకు కూడా భాగస్వామ్యం కల్పించాలనేది కనుమ సంప్రదాయం.
 - డి.వి.ఆర్.భాస్కర్
 
గుమ్మడి కాయ దానం ఎందుకంటే..?
సంక్రమణ కాలంలో లేదా ఉత్తరాయణ  పుణ్యకాలంలో కూష్మాండ దానం చేయడం సంప్రదాయం. ఎందుకంటే శ్వేత వరాహకల్పం ఆరంభంలో యజ్ఞ వరాహమూర్తి భూమిని ఉద్ధరించినందుకు సంకేతంగా ఈ పుణ్యకాలంలో కూష్మాండం (గుమ్మడి పండును) దానం చేయాలని, అలా దానం చేస్తే సకల బ్రహ్మాండాన్ని విష్ణుమూర్తికి దానం చేసినట్టవుతుందని పురాణాలు చెబుతున్నాయి.
 
బొమ్మల కొలువు
సంక్రాంతికి బొమ్మల కొలువు పెట్టడం తెలుగునాట కొన్ని ప్రాంతాలలో ఆచారం. బ్రహ్మకొలువునే బొమ్మల కొలువుగా చెప్పుకుంటున్నాము. ఇంటిలోని దేవుళ్లు, దేవతల ప్రతిమలను ఒక వరుసలోనూ, ఇతర బొమ్మలను మరో వరుసలోనూ అందంగా పేర్చి, పేరంటం చేస్తారు. చూడవచ్చిన వారందరికీ పండు, తాంబూలం, శనగలు ఇచ్చి ఆశీర్వాదాలు అందుకుంటారు.
 
ఉత్తరాయన దానాలు... ఉత్తమ ఫలాలు...
అత్యంత పుణ్యప్రదమైన ఉత్తరాయణ కాలంలో కన్యాదానం, వస్త్రదానం, ధాన్యం, ఫలాలు, విసనకర్ర, సువర్ణం, కాయగూరలు, దుంపలు, తిలలు (నువ్వులు), చె రుకు, గోవులను దానం చేస్తే మంచిది. ఉత్తరాయణం ఉండే ఆరు నెలల్లో (186 రోజులు) పవిత్ర గంగ, గోదావరి, కృష్ణ, యమున తదితర పుణ్యనదుల్లో స్నానమాచరించి దీపం, నువ్వులు, బియ్యం వంటి వాటిని పండితులకు, బీదవారికి దానం చేయటం వల్ల ఉత్తమగతులు కలుగుతాయని, కన్నెపిల్లలకు కోరుకున్న వరుడు భర్తగా లభిస్తాడని, ఉద్యోగులు, వ్యాపారులు, చేతివృత్తిదారులకు రాణింపు లభించడంతోబాటు సకల శుభాలు కలుగుతాయని పురాణోక్తి.
 
ఉత్తరాయణ పుణ్య కార్యాలు...
నదీస్నానం, సూర్య నమస్కారాలు, భూమి పూజలు, నూతన గృహప్రవేశాలు, వేదాధ్యయనం, ఉపనయనం, వివాహం, విద్యారంభం తదితర శుభకార్యాలు చేయటం, ఆయా కార్యక్రమాలు తలపెట్టిన వారికి సహకరించటం వల్ల ఆయుష్షు పెరిగి ఆరోగ్య భాగ్యం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement