సంబరాల సంక్రాంతి.. | Sakshi Funday Cover Story On Sankranthi Festival | Sakshi
Sakshi News home page

సంబరాల సంక్రాంతి..

Published Sun, Jan 15 2023 11:53 AM | Last Updated on Mon, Jan 16 2023 3:29 PM

Sakshi Funday Cover Story On Sankranthi Festival

నెల రోజులపాటు జరుపుకొనే అచ్చ తెలుగు పండుగ సంక్రాంతి. ప్రత్యేకతలెన్నో ఉన్న పండగ సంక్రాంతి. మనం జరుపుకునే పండుగలన్నీ చాంద్రమానం ప్రకారం జరుపుకునేవే! సంక్రాంతి పండుగ మాత్రం అందుకు భిన్నం. దీనిని సౌరమానం ప్రకారం జరుపుకుంటాం. ఈ పండుగ ప్రత్యేకించి ఒక దేవుడికో, దేవతకో సంబంధించినది కాదు. పంటల పండుగ. కళాకారుల పండుగ. రైతుల పండుగ. కొత్తల్లుళ్ల పండుగ. పెద్దల పండుగ. రంగవల్లుల పండుగ. వినోదాల పండుగ. ఇన్ని ప్రత్యేకతలున్నాయి కనకనే అందరికీ పెద్ద పండుగ అయ్యింది. 

ఆరుగాలం పంటపొలాలలో శ్రమించే రైతన్న తమ పంట పండి ఇంటికి వచ్చిన సంబరంతో చేసుకునే పండుగ ఇది. పంట వేసినప్పటినుంచి çకోతకోసి ఇంటికి వచ్చేదాకా ఉదయం నుంచీ అర్ధరాత్రి వరకు పొలంలో కష్టపడిన రైతన్నకు వివిధ చేతివృత్తుల వాళ్లు, కళాకారులు అండగా నిలబడతారు. రైతుల అవసరాలు తీర్చి, వినోదం పంచి మానసికోల్లాసం కలిగిస్తారు. ప్రతిఫలంగా రైతులు వారికి ధాన్యం కొలిచి ఇస్తారు. 

ఉత్తరాయణంలో జరుపుకునే శుభాల పండుగ
సంక్రాంతి పండుగ ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే తొలి పండుగ. ఉత్తరాయణం సకల శుభకార్యాలు జరుపుకొనేందుకు యోగ్యమైన కాలం. ఇంతకీ ఉత్తరాయణమంటే ఏమిటో చూద్దాం. సూర్యుని సంచారం రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి ఉత్తరాయణం, రెండోది దక్షిణాయనం. మనకు ఒక సంవత్సరకాలం దేవతలకు ఒక్క రోజు. అంటే ఆరుమాసాల ఉత్తరాయణ కాలం దేవతలకు పగలు.

దక్షిణాయనం రాత్రి. ‘సంక్రాంతి’ లేదా ‘సంక్రమణం’ అంటే ‘చేరడం’ లేదా ‘మారడం’ అని అర్థం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశుల్లో క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తర రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి. పురాణాల ప్రకారం సూర్య భగవానుడు ఈ రోజునే తన కుమారుడైన శని ఇంటికి వెళతాడు. ఆయనం అనగా పయనించడం అని అర్థం. ఉత్తర ఆయనం అంటే ఉత్తరం వైపు పయనించడం అని అర్థం. 

సూర్యుడు భూమికి కొంత కాలం దక్షిణం వైపు పయనించాక తన దిశ మార్చుకుని ఉత్తరం వైపు పయనించనారంభిస్తాడు. సూర్యుడు పయనించే దిక్కును బట్టి, దక్షిణం వైపు పయనిస్తున్నప్పుడు దక్షిణాయనం అనీ, ఉత్తరం వైపు పయనిస్తున్నప్పుడు ఉత్తరాయణం అని అంటారు.

ఉత్తరాయణం పుణ్యకాలం అంటే దక్షిణాయనం పాప కాలం అని కాదు. దక్షిణాయనం కూడా పుణ్యకాలమే! అయితే ఉత్తరాయణం విశిష్ఠత వేరు. భూమిపై రాత్రి, పగలు ఎలా ఉన్నాయో అలాగే దేవతలకు కూడా రాత్రి పగలు ఉంటాయని, సూర్యుడు భూమిపై దక్షిణం వైపు పయనిస్తున్నంత కాలం రాత్రిగాను, ఉత్తరం వైపు పయనిస్తున్నంత కాలం పగలు గాను అభివర్ణించారు.

మానవులు రాత్రులు నిద్రపోయి పగలు ఏ విధంగా మేలుకుంటారో అలాగే దేవతలు కూడా ఉత్తరాయణంలో మేలుకొని ఉంటారని, వారు మేలుకొని ఉండగా అడిగిన కోర్కెలు వెంటనే తీరుస్తారని, ఆ విషయం అందరికీ తెలియజేయడం కోసం పెద్దలు ఈ పండుగలను జరపడం మొదలుపెట్టారని అర్థం చేసుకోవచ్చు.

ఉత్తరాయణం నుంచి స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు పేర్కొన్నాయి. అందుకే కురుక్షేత్ర యుద్ధంలో అంపశయ్య పై ఒరిగిన భీష్మ పితామహుడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తరువాతనే ప్రాణాలు వదిలాడు.

ఎందుకంటే ఈ మకర సంక్రమణం దేవతలకు పగటి కాలం కావడమే ప్రధాన కారణం. శాస్త్ర ప్రకారం ప్రతి సంక్రమణానికీ పితృతర్పణాలు ఇవ్వాలి. అయితే, మిగిలిన పదకొండు సంక్రమణాల్లో ఇవ్వకపోయినా, మకర సంక్రమణం సందర్భంగా మాత్రం తప్పకుండా పితృతర్పణాలు ఇస్తారు.

సంక్రమణ దానాలు... సర్వపాపహరాలు
ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజున చేసే ఏ దానమైనా శ్రేష్ఠమైందని ఆర్యోక్తి. ఉత్తరాయణ కాలంలో చేసే దానాలలో ధాన్యం, ఫలాలు, విసనకర్ర, వస్త్రం, కాయగూరలు, దుంపలు, నువ్వులు, చెరకు మొదలైనవి ఉత్తమమైనవి. ఈ కాలంలో గోవును దానం చేస్తే స్వర్గ వాసం కలుగుతుందని ఆస్తిక లోక విశ్వాసం.

సంక్రాంతి అనేది నెలరోజుల పండుగ. ధనుర్మాసంలో వచ్చే పండుగ. ధనుర్మాసం అని పండితులంటారు కానీ, వాడుకభాషలో చెప్పాలంటే సంక్రాంతి నెల పట్టటం అంటారు. ఈ నెల పట్టిన దగ్గరనుంచి తెలుగు లోగిళ్లలో పండగ వాతావరణం మొదలవుతుంది. ఇంటిముందు ముగ్గులు, హరిదాసులు, బుడబుక్కలవారు, గంగిరెద్దులవాళ్లతో గ్రామాల్లో పండుగ వాతావరణం వస్తుంది. ఆడపడచులు ఇంటిముందు ఊడ్చి, కళ్లాపి చల్లి రకరకాల ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి వాటిని బియ్యప్పిండి, పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి పూజిస్తారు. 

హరిదాసుల ఆగమనం వెనక...
లేలేత సూర్యకిరణాలు భూమిని తాకే వేళ , ఇంటి ముందు మహిళలు ముగ్గులు పెట్టేవేళ, రామదాసు కీర్తనలు, హరినామ సంకీర్తన, శ్రీకృష్ణ లీలామృతాన్ని గానం చేసుకుంటూ, కాలికి గజ్జెకట్టి తంబుర మీటుతూ, తలపై అక్షయ పాత్రతో, చేతిలో చిడతలతో హరిదాసులు చేసే సంకీర్తనలు సంక్రాంతి సందర్భంగా కనిపించే సంప్రదాయాల్లో ఒకటిగా చెప్పవచ్చును. సంక్రాంతి ముందు మాత్రమే హరిదాసులు కనపడతారు. వీరి తలపై ఉండే పాత్రకు అక్షయ పాత్ర అని పేరు.

హరిదాసుల అక్షయపాత్రలో బియ్యం పోస్తే మనం తెలిసీ తెలియక చేసిన ఎన్నో పాపాలు తొలగిపోతాయని పెద్దలు చెబుతారు. అందుకే పిల్లలు, పెద్దలు పోటీలు పడి మరీ హరిదాసుల తలపై ఉండే అక్షయ పాత్రలో బియ్యం, కూరగాయలు వంటివి ఉంచుతారు. ధనుర్మాసం నెలరోజులు సూర్యోదయానికి ముందే గోదాదేవిని శ్రీకృష్ణుడిని స్మరించి, తిరుప్పావై పఠించి, అక్షయ పాత్రను ధరించి హరిదాసులు గ్రామ సంచారం ప్రారంభిస్తారు.

గొబ్బెమ్మలను ఇంటి ముందు చక్కగా అలంకరించి, హరినామ స్మరణ చేసే వారిని అనుగ్రహించడానికి హరిదాసు రూపంలో వైకుంఠపురం నుంచి శ్రీమహావిష్ణువు వస్తాడన్నది ఒక నమ్మకం. నెలరోజుల పాటు హరినామాన్ని గానం చేసినందుకు చివరి రోజున స్వయంపాకానికి అందరూ ఇచ్చే ధన, ధాన్య, వస్తు దానాలను స్వీకరిస్తారు. ఇంటికి తిరిగి వెళ్లే వరకు హరినామ సంకీర్తన తప్ప మరేమీ మాట్లాడరు.

అక్షయపాత్రను దించరు. హరిదాసు పేద, ధనిక భేదం లేకుండా అందరి ఇంటికి వెళ్తాడు. ఎవరి ఇంటి ముందు ఆగడు. శ్రీమద్రమా రమణ గోవిందో హరీ అంటూ ఇంటి ముందు ముగ్గు చుట్టూ ఒకసారి తిరుగుతాడు. గుమ్మంలో ఎవరూ లేకపోతే మరో ఇంటికి వెళ్తాడు.

హరిదాసు ఉత్త చేతులతో వెళ్ళిపోతే ఆ ఇంటికి అరిష్టమంటారు పెద్దలు. అందుకే గ్రామాలలో హరిదాసు వస్తున్నాడంటే ఇంటి యజమానులు గుమ్మాలలో ధాన్యంతో సిద్ధంగా ఉంటారు. అక్షయపాత్రలో బియ్యం పోయడాన్ని ఆ శ్రీమహా విష్ణువుకు కానుకలు బహూకరించినట్లుగా భక్తులు భావిస్తారు.

హరిదాసులతోపాటు, ఈ  పర్వదినాలలో గంగిరెద్దుల వారు, బుడబుక్కల వారు, పగటి వేషధారులు, గారడీవాళ్ళు, ఎందరెందరో జానపద కళాకారులు కన్నుల పండువుగా తమ కళాకౌసలాన్ని ప్రదర్శిస్తారు. సంక్రాంతి పర్వదినంతో ఈ కళా ప్రదర్శనలన్నీ ముగుస్తాయి. పంటను ఇంటికి తెచ్చుకుని కళకళలాడే రైతు కుటుంబాలు సంక్రాంతి సంతోషంలో అందరినీ ఆదరిస్తారు.

సంక్రాంతి పండుగలో మరిన్ని ప్రత్యేకతలు... 
పూర్వం సగరుడు అనే రాజు ఉండేవాడు. ఆయనకు అరవైవేల మంది కొడుకులు. వీళ్లంతా ఓసారి కపిలముని ఆశ్రమంలోకి ప్రవేశించి, ఆయన తపస్సుని భంగం చేయడంతో కపిలముని వాళ్లందరినీ తన కంటిచూపు నుంచి వెలువడిన క్రోధాగ్ని జ్వాలలతో భస్మం చేశాడు. దాంతో వారికి మోక్షం లభించక అధోలోకాలలో పడి ఉన్నారని, వారికి సద్గతులు కలగాలంటే వారి భస్మరాశుల మీద గంగ ప్రవహించాలని తెలుసుకున్న వారి వంశీకులు చాలామంది గంగను భువికి రప్పించాలని పరిపరివిధాలా ప్రయత్నించి విఫలమయ్యారు.

ఎట్టకేలకు భగీరథుడు తన కఠోర తపస్సు, ఎడతెగని ప్రయత్నాలతో ఈ పని చేయగలిగాడు. ఆయన తపస్సుకి మెచ్చి సంక్రాంతి రోజునే గంగమ్మ నేల మీద అవతరించిందట. అందుకే సంక్రాంతి నాడు చేసే స్నానం గంగాజలంలో మునక వేసినంత సత్ఫలితాలనిస్తుందని పెద్దలు చెబుతారు. 

సంక్రాంతి గంగిరెద్దుల వెనుక కూడా ఓ కథ ఉంది. పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. శివుడు తన కడుపులో ఉండేలా ఆ గజాసురుడు వరాన్ని కోరుకున్నాడు. శివుని బయటకు రప్పించేందుకు విష్ణుమూర్తి ఒక ఉపాయం ఆలోచించాడు. దేవతలంతా తలా ఓ వాద్యాన్ని పట్టుకుని, నందితో కలిసి గజాసురుడి దగ్గరకు వెళ్లి అత్యంత అద్భుతంగా గంగిరెడ్ల విన్యాసం చేయించారు. వీళ్ల ప్రదర్శనకు మెచ్చుకున్న గజాసురుడు ఏదన్నా వరాన్ని కోరుకొమ్మని అడిగాడు. ఇంకేముంది! నీ పొట్టలో ఉన్న శివుడిని బయటకు పంపమని వరాన్ని అడిగేశారు. అలా ఆనాడు శివుని పొందేందుకు దేవతలు చేసిన విన్యాసాలే ఇప్పటి గంగిరెద్దుల సంప్రదాయానికి నాంది అని చెబుతారు.

ప్రతి ఆచారానికీ ఓ కథ...
కనుమను పశువుల పండుగగా వ్యవహరిస్తారు. పంటలు చేతికి అందడంలో తమకు సహాయపడిన పశుపక్ష్యాదులను పూజిస్తారు. సంవత్సరంలో మిగిలిన రోజులన్నీ తమతో పాటు కష్టపడి పని చేసిన ఆవులను, ఎద్దులను పూజించి ప్రేమగా చూసుకునే రోజు ఇదే! పక్షులు కూడా రైతన్న నేస్తాలే! అందుకే వాటి కోసమే అన్నట్టు ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులు వేలాడ దీస్తారు.

ఈ నెలరోజులు వాకిట్లో అందమైన ముగ్గులతో అలంకరిస్తాం. కానీ ఈ కనుమ రోజున మాత్రం ర«థం ముగ్గువేసి ఆ రథాన్ని వీధిచివరి వరకూ లాగినట్టుగా ముగ్గువేస్తారు. కనుమ రోజు పశువులను పూజించడం వెనుక కూడా ఓ కథ వినిపిస్తుంది. ఒకసారి శివుడు నందిని పిలిచి ‘భూలోకంలో అందరూ రోజూ ఒంటికి నూనె పట్టించి స్నానం చేయాలి, నెలకి ఓసారే ఆహారం తీసుకోవాలి’ అని చెప్పి రమ్మన్నాడు.

కానీ నంది అయోమయంలో ‘రోజూ ఆహారం తీసుకోవాలి, నెలకి ఓసారి నూనె పట్టించి స్నానం చేయాలి’ అని చెప్పాడట. దాంతో కోపం వచ్చిన శివుడు ‘ప్రజలు రోజూ తినాలంటే చాలా ఆహారం కావాలి. ఆ ఆహారాన్ని పండించేందుకు నువ్వే సాయపడాలి’ అని శపించాడట. అప్పటి నుంచి ఎద్దులు, వ్యవసాయంలో సాయపడుతున్నాయట. అందుకే కనుమ రోజు పశువులను ముఖ్యంగా ఎడ్లను సాక్షాత్తు నందీశ్వరులుగా భావించి పూజిస్తుంటారు.

డుబుక్కు డుబుక్కు... బుడబుక్కలవాళ్లు
ఈ పండుగ కళారూపాలలో తొలి తాంబూలం బుడబుక్కలవానిది. పగలంతా కష్టపడిన రైతన్న రాత్రికి నడుం వాలిస్తే కళ్ళంలోని ధాన్యాన్ని దొంగలు తరలించుకు పోకుండా తొలిజాములో ఊరి పొలిమేరలలో సంచరిస్తూ కొత్తవాళ్ళను గ్రామంలోకి చొరబడనీకుండా డుబుక్కు డుబుక్కుమని శబ్దం చేస్తూ అందరినీ అప్రమత్తం చేస్తూ కొత్తవారిని కట్టడి చేస్తారు బుడబుక్కలవాళ్లు. వీరు తొలిజామంతా పంటకు కాపలా కాసి రెండోజాము ప్రవేశిస్తుండగా జంగం దేవరకు ఆ పని అప్పచెబుతారు.

శంఖనాదాల జంగందేవర
సాక్షాత్తూ శివుని అవతార అంశగా భావించే ఈ జంగందేవర శంఖనాదాలతో ఢమరుక శబ్దాలతో రైతుల కళ్ళాలకు ఊరి ప్రజానీకానికి శుభం పలుకుతూ పరమశివుని ఆశీస్సులను అందించే కాపాలికుడు ఈ జంగందేవర! జంగందేవర రాకను గ్రామీణులు శుభంగా భావిస్తారు. 

పిట్టలదొరలు
గంగిరెడ్లు, డూడూ బసవన్నలు వెళ్ళాక చిత్ర విచిత్ర వేషధారణలో మనలను నవ్వులలో ముంచెత్తే కబుర్ల పోగు, కోతలరాయుడు పిట్టలదొర వస్తాడు. ఇతడి మాటలే కాదు, ఆహార్యమూ వింతగా ఉంటుంది. పిల్లలందరికీ నవ్వుల పువ్వులు పంచుతాడు. అందుకే ఏమాత్రం పొసగని దుస్తులు ధరించేవారిని, డంబాలు పోయేవారిని పిట్టలదొరతో పోల్చుతుంటారు. 

సోదెమ్మ
‘సోదె చెబుతానమ్మా సోదె చెబుతాను. ఉన్నదున్నట్టు చెబుతాను. లేనీదేమీ చెప్పను తల్లీ!’ అంటూ మన భవిష్యత్తులో జరగబోయే వాటి గురించి తనకు తోచింది చెప్పి ఇంత ధాన్యం, పాతచీర, రవికలగుడ్డ పెట్టించుకుని చల్లగా ఉండమని ఆశీర్వదించి వెళ్లిపోతుంది సోదెమ్మ. 

ఇంతమంది కళాకారులు నెలరోజుల పాటు రైతుల పంటలకు కాపలా కాస్తూ రైతుల క్షేమాన్ని కాంక్షిస్తూ మనం బాగుంటే తామూ బాగుంటామని, మన క్షేమసౌఖ్యాలలో తామూ ఉంటామని భావిస్తూ, అందుకు తగ్గట్టే గ్రామస్థులకు మనోల్లాసం కలిగిస్తారు. 

మనకింత సాయం చేసిన వాళ్లు మననుంచి కోరుకునేది కాసిన్ని బియ్యం, కాసిని చిల్లర పైసలు, కాసిన్ని పాత దుస్తులే కదా... అందుకే లేదని కసిరికొట్టకుండా వారు కోరినది ఇచ్చి మన ముంగిటికొచ్చే చిరుకళాకారులను ఆదరించాలి. అందరికీ మంచిని పంచాలి. అందరి మంచిని పెంచాలి. 

సంక్రాంతి అల్లుడి ఘనత ఏమిటంటారా ? 
ఏ పండగకైనా ఇంటి అల్లుడి హాజరు తప్పని సరిగా ఉంటుంది. అయితే ఈ సంక్రాంతి రోజున అల్లుడికి శాస్త్రం విశిష్టమైన స్థానాన్ని ఇచ్చింది. అల్లుడు విష్ణు స్వరూపం అన్నారు. అదేవిధంగా సూర్యుడిని సూర్య నారాయణ మూర్తి అని కూడా సంబోధిస్తున్నాం. అంటే సూర్యుడి మకర రాశి ప్రవేశంలో గొప్ప రహస్యం దాగి ఉంది. జ్యోతిర్మండలంలో మకరరాశి పదో రాశి.

ఇది అత్తగారిల్లు అంటే విశ్వానికి అల్లుడైన సూర్యుడు తన అత్తగారి ఇంటిలోకి అడుగు పెట్టాడని అర్థం. అందుకే సంక్రాంతికి ఇంటి అల్లుడిని తప్పని సరిగా పిలవాలని సంప్రదాయం ఏర్పడింది. ఈ రోజున అల్లుడి చేత గడ్డపెరుగును తినిపిస్తారు. ఇలా చేయడం వలన అల్లుడి వంశం వృద్ధి చెందుతుందని, అల్లుడు లేని వారు ఈ రోజున పండితులకి పెరుగును దానం చేయాలని పరాశర సంహిత చెబుతోంది.

పూలూ–పిండి వంటల వెనుక సైతం 
సంక్రాంతి రోజున గుమ్మడి కాయ ముక్కలు వేసిన పులుసు, మినప గారెలు, నువ్వుల పొడి, చెరకు ముక్క తప్పని సరిగా తినాలని శాస్త్ర వచనం. ఎందుకు చెప్పిందంటే, ఇవన్నీ కూడా ఔషధ గుణాలు కలిగిన పదార్థాలు కనుక. ఇందులో ఒక్క గుమ్మడికాయను మినహాయిస్తే మిగిలినవి మన దేహాన్ని వెచ్చబరచి పుష్యమాసపు చలి నుంచి శరీరాన్ని రక్షించే పదార్థాలు. ఇక గుమ్మడికాయ స్త్రీ–పురుషుల్లోని వంధ్యత్వాన్ని నివారించి గర్భాశయ దోషాలను, వీర్యదోషాలను నివారించే గొప్ప ఔషధం. 

ఈ కాలంలో స్త్రీలు వాడే బంతి, చేమంతి, డిసెంబర్‌ పూలు, మునిగోరింట పూలు అన్నీ చలిని తట్టుకునే వేడిని ఇచ్చేవే. సంక్రాంతి సందర్భంగా చేసుకునే పిండివంటలు అన్నీ ఆరోగ్యాన్ని, ఒంటికి సత్తువనూ ఇచ్చేవే.  

కనుమ రోజు ప్రయాణం ఎందుకు చేయకూడదంటే..?
సంక్రాంతి అంటే పంటల పండుగ కదా! కానీ ఆ పంటలు బాగా పండాలంటే, పశువుల సాయం కూడా కావాలిగా! అందుకే సంక్రాంతి మర్నాడు కనుమని పశువుల పండుగగా పిలుస్తారు. పశువులు ఉన్నవారు ఆ రోజు వాటిని శుభ్రంగా అలంకరించి మంచి ఆహారం పెడతారు. పక్షులకు కూడా ఆహారం అందేలా ఇంటిచూరుకి ధాన్యపుకంకులను వేలాడదీస్తారు.

ఇదంతా రైతుల సంగతి. కానీ మిగతావారు పాటించే ఆచారాలు కూడా చాలా ఉన్నాయి. ఈ రోజున చనిపోయిన పెద్దలను తల్చుకుంటూ ప్రసాదాలు పెట్టాలని ఆచారం. కనుమ రోజు అటు పెద్దలకి ప్రసాదం పెట్టేందుకు, మాంసం తినని వారికి దాంతో సమానమైన పోషకాలని ఇచ్చే మినుములతో తయారు చేసిన గారెలు తినాలంటారు. గారెలు, మాంసంతో ఈ రోజు పెద్దలకి ప్రసాదం పెడతారు. కనుమ రోజు పెద్దల కోసం విందుభోజనం తయారు చేయడమే కాదు, దాన్ని అందరూ కలిసి తినాలని నియమం.

అందుకే అక్కాచెల్లెళ్లు, అల్లుళ్లతో కలిసి ఈ కనుమ వేడుకని చేసుకుంటారు. కొన్ని పల్లెటూళ్లలో కనుమరోజు పొంగళ్లు వండటం, బలి ఇవ్వడంలాంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి కాబట్టి ఆ రోజు కూడా ఆగి,  బంధువులతో కాస్త సమయం గడిపి, విశ్రాంతి తీసుకుని, మర్నాడు ప్రయాణించమని చెబుతారు. అందుకే ‘కనుమ రోజు కాకి కూడా కదలదు’ అన్న సామెత పుట్టి ఉండవచ్చు. 

సంక్రాంతి రోజున శబరిమలలో జరిగే మకర జ్యోతి దర్శనం, తిరుమలలో జరిగే పారువేట, శ్రీశైలంలో జరిగే బ్రహ్మోత్సవాలు గోదావరి జిల్లాలో జరిగే ప్రభల తీర్థం ఈ పండుగ ప్రత్యేకతను చాటి చెబుతాయి. ఈ ఉత్తరాయణంలో అందరికీ శుభాలు జరగాలని ఆశిద్దాం. -డి.వి.ఆర్‌. భాస్కర్‌


కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా తెలంగాణలో సంక్రాంతికి గాలిపటాలు ఎగరేయడం ఆచారం. దీనికి కూడా ఓ కథ చెబుతారు. సంక్రాంతి నెల రోజులూ నాడు దేవతలంతా  ఆకాశంలో విహరిస్తారట. అందుకే వారికి స్వాగతం పలికేందుకు, వారి దృష్టిని ఆకర్షించేందుకు ఈ పండగ సమయంలో గాలిపటాలు ఎగరేయాలని చెబుతారు.  గాలిపటాన్ని ఎగురవేయాలంటే ఎంతో నేర్పు, ఓర్పు కావాలి. చాకచక్యంగా గాలిపటాన్ని ఎగురవేసిన వారికి జీవితాన్ని సమతుల్యంగా నిర్వహించే సామర్థ్యం కలుగుతుందని, తెగిన గాలిపటాలతో పాటే దురదృష్టం కూడా మనల్ని వీడి వెళ్లిపోతుందనీ పెద్దలు చెబుతారు. 

బొమ్మలకొలువు
సంక్రాంతి సంబరాలలో భాగమే బొమ్మల కొలువు కూడా. బొమ్మల కొలువును దేవీ నవరాత్రి ఉత్సవాల సమయంలో కూడా పెడతారు. ఇళ్లలో, ఆలయాలలో బొమ్మల కొలువులు ఏర్పాటు చేస్తారు. గృహిణులు తమ వద్దనున్న బొమ్మలననుసరించి మూడు, ఐదు, ఏడు, తొమ్మిది మెట్ల వరసలలో బొమ్మల కొలువులు పెట్టడం ఆచారం. ఇలా బొమ్మల కొలువులు పేర్చడంలో కొన్ని నియమాలు, సూత్రాలు ఉన్నాయి. భగవంతుడి దశావతారాల సూత్ర ప్రకారం ఈ సృష్టి పరిణామ క్రమాన్ని మానవుడి అభివృద్ధి క్రమాన్ని దృష్టిలో పెట్టుకొని కింది మెట్టునుంచి పై మెట్టువరకు వివిధ వర్ణాలు, వివిధ ప్రమాణాలలో బొమ్మలను అమరుస్తారు.

గంగిరెడ్లు
‘అయ్యగారికి దండం పెట్టు! అమ్మగారికి దండం పెట్టు! బాబుగారికి దండంపెట్టు! పాపగారికి దండం పెట్టు!’ అంటూ బసవన్నల చేత దండాలు పెట్టించి, రైతు బతుకుకు అంతా తానై నడిపే ఎడ్లను అలంకరించి ఇంటిముంగిట్లో ఎడ్లను ఆడించి ఇంట్లోని చిన్నా పెద్ద అందరినీ అలరించే గంగిరెద్దుల వాళ్ళు ఊదే సన్నాయి సన్నాయి కూడా మంగళవాద్యమే. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement