ఒకరికి అందాల్సిన లంచ్‌బాక్స్ ఇంకొకరికి అందుతుంది. అందులోని భోజనం మహాద్భుతంగా ఉంటుంది. ఆ ప్రశంసనే ఓ కాగితం ముక్క మీద రాసి.. ఖాళీ అయిన ఆ డబ్బాలో పెడతాడు ఆ వ్యక్తి. ఆ డబ్బా యజమానికి చేరుతుంది. టిఫిన్‌బాక్స్ ఖాళీ అవడం ఒక ఆశ్చర్యమైతే .. తన వంటకు కితాబు రావడం ఒక సంభ్రమం ఆమెకు. ఎందుకంటే ఆ భోజనం డబ్బా తిరిగి ఆమె ఇంటికి ఖాళీగా ఎప్పుడూ రాదు. పెట్టిన భోజనం పెట్టినట్టే తిరిగొస్తుంది. అలాంటిది ఆ రోజు భోజనం ఖాళీ కావడంతోపాటు ప్రశంస కూడా. ఆమె మనసులో ఎక్కడో శంక.. ఇంతకీ డబ్బా చేరాల్సిన వాళ్లకే చేరిందా.. పొరపాటున ఇంకెవరికైనా చేరిందా అని. ఆమె అనుమానించినట్లుగానే ఆ భోజనం వేరేవాళ్లకు చేరుతుంది. ఓ ప్రేమ కథ మొదలవుతుంది..
ఇది లంచ్‌బాక్స్ సినిమా సారాంశం. అయితే ఈ కథనం దాని గురించి కాదు. భోజనం డబ్బాల బట్వాడా అనే ఇన్నేళ్ల చైన్ ప్రాసెస్‌లో ..అసలెప్పుడూ జరగని..లేదంటే చాలా చాలా అరుదుగా జరిగే ఒక్కటంటే ఒక్కటే పొరపాటును ఆధారంగా చేసుకుని దాని చుట్టూ అల్లుకున్న చక్కటి చిత్రం లంచ్‌బాక్స్. రీల్‌కి ఆవల..ఈ బట్వాడా పద్ధతి.. ఫోర్బ్స్ సిక్స్ సిగ్మా ప్రావీణ్యంగా పరిగణించే వంద శాతం ఉత్తమ సామర్థ్యాన్ని కనబరుస్తూ శతాబ్దానికి పైగా కొనసాగుతున్న విచిత్రం ‘డబ్బావాలా!’ ఆ వ్యవస్థ గురించే ఈ కథనం..
డబ్బావాలా పుట్టిల్లు.. ముంబై. ఆ మహానగరం పేరు చెప్పగానే అరబిక్ కడలి.. దాని ఒడ్డునున్న గేట్ వే ఆఫ్ ఇండియా, హోటల్ తాజ్, ఆకాశహార్మ్యాలు, బాలీవుడ్ కళ్లల్లో మెదులుతాయి. వీటితోపాటు డబ్బావాలాల ఫొటోలు కళ్ల ముందుకు వస్తాయి. క్రమశిక్షణలో భాగమైన సమయపాలన, నిబద్ధత, జీవన నైపుణ్యాల్లో ఒకటైన చక్కటి నిర్వహణా కౌశలమే ఈ డబ్బావాలాల విజయానికి మూలం. అదే వాళ్ల యూఎస్‌పీ. అవన్నీ సరే కానీ ఇప్పుడెందుకింత అకస్మాత్తుగా ఆ డబ్బావాలాల గురించి చెప్పుకోవడం అని అడిగితే జవాబు.. కరోనా మహమ్మారే.
ఆ వైరస్ ఈ రెండేళ్లు అన్ని రంగాలను కుదేలు చేసినట్టే డబ్బావాలాలకూ పని లేకుండా చేసింది. దాదాపు వలస కార్మికులు పడ్డ కష్టాలే వీరూ పడ్డారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. మళ్లీ సున్నా నుంచి మొదలుపెట్టారు. కెరటంలా నేల కరిచినా మళ్లీ లేచి నిలబడుతున్నారు. డబ్బాల్లో ఇంటి భోజనాన్ని మోసుకుంటూ వేలాది మంది ఆకలిని తీరుస్తున్నారు.. ఆ కుటుంబాల ఆత్మీయతానుబంధాలను పదిలం చేస్తున్నారు. ఇది సేవ కాదు.. జీతం తీసుకునే పనే. కానీ దానికి సేవాతత్పరతను జోడిస్తున్నారు. ఆ అంకితభావమే కరోనా పరచిన సవాళ్లను చుట్టచుట్టేసి సముద్రంలో విసిరేసేలా చేస్తోంది. డబ్బావాలాల కోసం ముంబై ముంగిళ్లు ఎదురుచూసేలా చేస్తోంది.
2020.. మార్చి..
ప్రపంచం అంతా అల్లల్లాడినట్టే మన దేశమూ.. దానికి పారిశ్రామిక రాజధాని అయిన ముంబై కూడా కుదేలయిపోయింది. నిత్యం దాదాపు రెండు లక్షల పై చిలుకు మందికి లంచ్ బాక్స్‌లను అందించడంలో తీరిక లేకుండా ఉండే డబ్బావాలాలకు మొదటిసారి పనిలేకుండా పోయింది. లాక్‌డౌన్ వల్ల కార్యాలయాలు, కర్మాగారాలు, బడులు, కాలేజీలు, రవాణా.. అన్నీ బంద్. వర్క్ ఫ్రమ్ హోమ్‌తో కొంత మందికి పని ఉన్నా.. టిఫిన్ డబ్బాలను తెప్పించుకునే అవసరం లేకుండా పోయింది. కాళ్లకు చక్రాలు కట్టుకుని గడియారం ముళ్లతో పోటీపడే డబ్బావాలాలు.. దాదాపు ఎనిమిది నెలలు ఆ పందెంలోంచి తప్పుకున్నారు. అది వాళ్లెన్నడూ కనీవినే కాదు కనీసం కలలో కూడా ఊహించనిది.
ఆ పరిస్థితిలో వాళ్లను వాళ్లే ఆదుకున్నారు. ‘నూతన్ టిఫిన్ బాక్స్ సప్లయర్స్’ గా ఉన్న వాళ్ల అసోసియేషనే కరోనా కాలంలో వాళ్లకు అండగా ఉంది. ఈ అసోసియేషన్‌లో చేరేప్పుడు వాళ్లు 30 వేల రూపాయల ప్రవేశ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. దాంతో వాళ్లకు నెలకు అయిదువేల రూపాయల జీతం, జీవితకాలపు కొలువును ఇస్తుంది అసోసియేషన్. ఆ భరోసాతోనే పూర్వపు స్థితి కోసం ఎదురుచూడసాగారు. ఇప్పుడిప్పుడే నెమ్మదిగా కాలం ఒళ్లు విరుచుకుంటోంది. ఆ ఉదయాలు డబ్బావాలాలకు బోలెడు ఆశనిస్తున్నాయి. ఆ కాసింత నమ్మకంతోనే మూలకు పడ్డ చక్రాలను తీసి కాళ్లకు కట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భమే డబ్బావాలాల మీద ఈ కవర్ స్టోరీకి ఆసక్తి కలిగించింది. వాళ్ల పుట్టుపూర్వోత్తరాలను మీతో పంచుకునే ఉత్సాహాన్ని రేకెత్తించింది.
మళ్లీ సున్నా నుంచి మొదలు..
కరోనా ఆంక్షల సడలింపు తర్వాత డబ్బావాలాలు తమ విధుల్లోకి చేరి యేడాదిన్నర (2020, అక్టోబర్) కావస్తోంది. అయినప్పటికీ మునుపటిలా పుంజుకోలేకపోతున్నారు. కరోనాకు ముందు సుమారు రెండు లక్షల టిఫిన్ డబ్బాలను బట్వాడా చేసేవారు. ఈ డిమాండ్ చూసి రైల్వే శాఖ వీరికి ముంబైలోని లోకల్ రైళ్లల్లో ఓ బోగిలో కొంత స్థలం కేటాయించింది టిఫిన్ డబ్బాలను పెట్టుకోవడానికి.
అంతటి సప్లయ్ ఇప్పుడు10 శాతానికి పడిపోయింది. వీరి సేవల పునఃప్రారంభం తర్వాత టిఫిన్ బాక్స్ పంపే ఖాతాదారుల నుంచి వీరికి ఊహించినంత స్పందన లభించలేదు. మొదట్లో అయితే కేవలం 200లోపు లంచ్ బాక్స్‌లే అందాయి. ఇది ‘డబ్బావాలా’ అనే సర్వీస్ తొట్టతొలి సంఖ్యకు కాస్త ఎక్కువ. అంటే దాదాపు మళ్లీ సున్నా నుంచి మొదలైనట్టే లెక్క. ఇందుకోసం ఏడెనిమిది వందల మంది డబ్బవాలాలకు మాత్రమే పని దొరికింది. ఇప్పుడిప్పుడే మెల్లగా ఖాతాదారులు పెరుగుతున్నారు. ప్రస్తుతం డబ్బావాలాలు 10 నుంచి 15 వేల మందికి లంచ్‌బాక్స్‌లను అందిస్తున్నారు.
కారణాలు..
అనుకున్నంత వేగంగా ఖాతాదారుల సంఖ్య పెరగకపోవడానికి చాలా కారణాలు ఉన్నప్పటికీ కరోనానే ముఖ్య కారణం. డబ్బావాలాలకున్న లంచ్‌బాక్స్ ఖాతాదారుల్లో 85 శాతం మంది ఉద్యోగులు, వ్యాపారులు, 15 శాతం మంది విద్యార్థులున్నారు. చాలా సంస్థలు ఇంటి నుంచే పని చేసే సౌకర్యాన్నే ఇంకా కొనసాగించడం, కరోనా ప్రభావంతో చాలా మంది వ్యాపారులు దివాలా తీయడం, కాస్త మెరుగ్గా ఉన్న వారు ఇంకా తమ వ్యాపారాలను పూర్తి స్థాయిలో పునరుద్ధరించుకోలేకపోవడం వంటి వాటి వల్ల ఆయా రంగాల సంబంధిత ఉద్యోగులు ఇప్పటికీ సెలవు మీదే ఉండడమో, ఇంటి నుంచే తమ సేవలను అందిచడమో జరుగుతోంది. చాలా చోట్ల విద్యాసంస్థలూ ఆన్‌లైన్ క్లాసెస్‌నే కొనసాగించడం వల్ల విద్యార్థులూ స్కూళ్లకు వెళ్లడం లేదు. లంచ్ బాక్స్‌ల గొడవ ఉండడం లేదు. వీటన్నిటి ప్రభావం డబ్బావాలాల మీద పడి టిఫిన్ డబ్బాల బట్వాడా అనుకున్నంతగా పెరగలేదు.
మరో కారణంగా.. స్విగ్గీ, జొమాటోలను చూపొచ్చు. ఆఫీసులకు వెళుతున్న అరకొర ఉద్యోగులు, కొంత మంది విద్యార్థులు స్విగ్గీ, జొమాటోల మీద ఆధారపడుతున్నారు. నిజానికి స్విగ్గీ, జొమాటో, ఊబర్ ఈట్స్ వంటి ఫుడ్ డెలివరీ యాప్స్‌లు మార్కెట్‌లోకి వచ్చిన కొత్తల్లో.. అంతెందుకు కరోనా కంటే ముందు వరకూ అవి డబ్బావాలాల సేవల మీద పెద్దగా ప్రభావం చూప లేదు. ఐటీ, సర్వీస్ సెక్టార్‌లోని కొంతమంది ఉద్యోగులు మాత్రమే స్విగ్గీ, జొమాటోలను ఆశ్రయిస్తున్నారు.
మిగిలిన వాళ్లంతా తమ ఇళ్ల నుంచి భోజనాన్ని మోసుకొచ్చే డబ్బావాలాల మీదే ఆధారపడ్డారు.. పడుతున్నారు.‘ స్విగ్గీ, జొమాటో కంపెనీలు కేవలం రెస్టారెంట్లు, హోటళ్లలో ఇచ్చిన ఆర్డర్‌లను మాత్రమే చేరవేస్తాయి. అది కూడా ఒకసారికి మాత్రమే. ఇంకో రోజు కావాలంటే మళ్లీ ఆర్డర్ ఇవ్వాల్సిందే. మేమలా కాదు ఇంట్లో వేడివేడిగా వండిన భోజనాన్ని .. ఇంట్లో వాళ్ల ప్రేమానురాగాలతో సహా తీసుకెళ్లి అందిస్తాం. హోటల్‌కు వెళ్లినా ఇంట్లో దొరికే రుచి, శుచి, శుభ్రత గురించే వెదుక్కుంటాం కదా. వాటిని మేం బట్వాడా చేస్తున్నాం.. ఇంటి నుంచి సరాసరి ఆ ఇంటి సభ్యులకు. అందుకే స్విగ్గీలు, జొమాటోలు మా డిమాండ్‌ను తగ్గించలేదు’ అంటున్నారు డబ్బావాలాలు.
2023 నుంచి పూర్తిస్థాయిలో..
ముంబైలో చాలా సంస్థలు తమ ఉద్యోగులకు దీపావళి వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. దీంతో వచ్చే యేడాది.. 2023 నుంచి అంతటా పూర్తిస్థాయిలో ఉద్యోగులు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే రానున్న యేడాది నుంచి తమకు వెనకటి మంచి రోజులు మొదలుకాబోతున్నాయనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు డబ్బావాలాలు. ముంబైకే గుర్తింపుగా మారిన ఈ డబ్బావాలాలు నిన్నా మొన్నా మొదలు కాలేదు. వీరి సేవలకు నూట ముప్పైమూడేళ్ల చరిత్ర ఉంది..
1800 శకం చివర్లో దేశం నలుమూలల నుంచి ముంబైకి వలసలు పెరిగాయి. హోటళ్లు, మెస్‌లు, క్యాంటీన్‌లు, సత్రాలు అంతగాలేని కాలం అది. ఉదయమే పనులకు వెళ్లేవారు మధ్యాహ్నమయ్యేసరికి ఆకలితో నకనకలాడిపోయేవారు. దొరికింది తిని కడుపు నింపుకోవడమే గగనమవుతుంటే ఇంటి భోజనం మాటెక్కడిది? ఆ పరిస్థితిని బాగా గమనించాడు మహాదేవ్ హవాజీ బచ్చే అనే వ్యక్తి. ఇతనూ ముంబై వలస వచ్చినవాడే ఫుణె దగ్గర్లోని భీమాశంకర్ అనే ప్రాంతం నుంచి. అతనికి అనిపించింది.. వీళ్లందరికీ వాళ్ల వాళ్ల ఇళ్ల నుంచి టిఫిన్‌బాక్స్‌లు అందించే పనిపెట్టుకుంటే సరి అని! ఆ అందరితో తన ఆలోచనను పంచుకున్నాడు. వాళ్లంతా సంతోషంగా సరే అన్నారు. కానీ అది తన ఒక్కడివల్ల అయ్యే పని కాదే అని విచారించి.. వెంటనే తన ఊరెళ్లి బంధు వర్గంతో విషయం చెప్పి.. సమ్మతించిన వంద మందిని వెంటపెట్టుకుని తిరిగి ముంబై చేరాడు.
తెల్లవారి నుంచే టిఫిన్ డబ్బాలను బట్వాడా చేసే పని మొదలుపెట్టాడు. అలా వందమందితో 1890లో ఈ డబ్బావాలాల ప్రస్థానం ప్రారంభమైంది. నేటికి అంచెలంచెలుగా ఎదిగి.. ముంబై వాసుల జీవనంలో భాగమైంది. డబ్బావాలాల్లో దాదాపు అందరూæ బంధువర్గీయులే. మూడు, నాలుగు తరాలుగా పనిచేస్తున్న వారూ ఉన్నారు. ఈ తరం ఈ కొలువులోకి రావడానికి పెద్దగా ఇష్టపడ్లేదట.. డబ్బావాలాల లాల్చీ పైజామా, తల మీద గాంధీ టోపీ వంటి డ్రెస్ కోడ్ వల్ల. డ్రెస్ కోడ్ అంటే గుర్తొచ్చింది.. ఈ వ్యాసం మొదట్లో డబ్బావాలాలకు 30 వేల రూపాయల అసోసియేషన్ ప్రవేశ రుసుము, దాంతో వారికి నెలకు అయిదు వేల రూపాయల వేతనం, జీవతకాలపు కొలువు తథ్యమని చెప్పుకున్నాం కదా. ఆ రుసుముతోపాటు డబ్బావాలాలు రెండు సైకిళ్లు, ఈ యూనిఫామ్, డబ్బాలు పెట్టుకోవడానికి చెక్క క్రేట్లు కూడా అసోసియేషన్‌కు ఇవ్వాల్సి ఉంటుంది.
అసోసియేషన్.. ట్రస్ట్
ఒకసారి ఓ ఖతాదారు .. ఒక డబ్బావాలాతో అమర్యాదకరంగా ప్రవర్తించడంతో డబ్బావాలాలంతా ఒక్కటై పోరాడారట. అప్పుడే అనిపించిందట ఇలాంటివి భవిష్యత్‌లోనూ ఎదురవ్వొచ్చు.. కాబట్టి ఒక అసోసియేషన్‌గా ఏర్పడాలి అని. అలా 1943లో అనధికారికంగా డబ్బావాలాల అసోసియేషన్ మొదలైనా రిజిస్టర్ అయింది మాత్రం 1968లో ‘నూతన్ ముంబై టిఫిన్ బాక్స్ సప్లయర్స్ అసోసియేషన్’గా. ఖాతాదారులతో వచ్చే ఇబ్బందులనే కాకుండా వాళ్లలో వాళ్లకు తలెత్తే సమస్యలు, వివాదాలనూ ఈ అసోసియేషన్ ద్వారే పరిష్కరించుకుంటారు. దీనికి ఎన్నికలూ ఉంటాయి ప్రతి ఆరేళ్లకు ఒకసారి.
అదే పేరుతో వీళ్లకు ట్రస్ట్ కూడా ఉంది. దీనికి అయిదేళ్లకు ఒకసారి ఎన్నికలుంటాయి. వీళ్లు భీమాశంకర్‌లో ఓ ధర్మశాలను నిర్మించుకున్నారు. దానికోసం ఫండ్‌ను ఏర్పాటు చేయడమే ఈ ట్రస్ట్ ముఖ్య విధి. కరోనా నుంచి డబ్బావాలాలకు కావాల్సిన నిత్యావసర సరకులన్నిటినీ అసోసియేషనే అందిస్తోంది ఉచితంగా. దీనికి యునైటెడ్ వే, శ్రామిక్ ఫౌండేషన్, మేకింగ్ ది డిఫరెన్స్ మొదలగు సంస్థలు సహాయం చేస్తున్నాయి.
సమావేశాలు.. సేవా కార్యక్రమాలు
డబ్బావాలాలు తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు ఓ ప్రణాళికను ఏర్పాటుచేసుకున్నారు. ప్రతినెల 15వ తేదీన సమావేశమై ఎదురైన సమస్యలు, సవాళ్లు, ఇబ్బందులను పరిష్కరించుకుంటారు. ఈవృత్తిలో కొనసాగుతున్న వాళ్లలో అత్యధిక శాతం పుణెతోపాటు కొంకణ్‌లోని çసహ్యాద్రి పర్వత పరిసర ప్రాంతాలవారే. ఈ డబ్బావాలాల బృందాలు ఏటా అనేక సేవా, జనజాగృతి కార్యక్రమాలూ చేపడతాయి.
ఎలా పని చేస్తారు?
ఉదయం తొమ్మిది గంటల నుంచి ఇంటింటికి వెళ్లి భోజనం డబ్బాలు సేకరించి, వాటిని ప్రత్యేకంగా చేయించుకున్న తమ సంస్థ డబ్బాల్లో పెట్టుకుంటారు. ఎవరిడబ్బా ఏదో గుర్తుపెట్టుకోవడానికి వాటి మీద పెయింట్‌తో మార్క్ చేసుకుంటారు. ఇలా సేకరించిన డబ్బాలను సైకిళ్లు, తోపుడు బండ్లు లేదా భుజాన (దూరాన్ని బట్టి) వేసుకుని సమీపంలోని లోకల్ రైల్వే స్టేషన్‌లకు చేరవేస్తారు. అక్కడున్న టీమ్ వాటిని ప్రాంతాలవారీగా వేరు చేసి.. స్టేషన్‌ల వారిగా డెలివరీ చేయాల్సిన టీమ్‌కు అందచేస్తారు. ఆ టీమ్ ఆ డబ్బాలతోపాటు ఆయా స్టేషన్‌లు చేరుకొని అక్కడున్న మరి కొందరు డబ్బావాలాల సహకారంతో సైకిళ్లు, తోపుడు బండ్లతోపాటు భుజానా వేసుకుని భోజన సమయానికల్లా అంటే మధ్యాహ్నం ఒంటి గంటలోపు సంబంధిత వ్యక్తులకు ఆ డబ్బాలను అందిస్తారు.
అయితే గమ్యస్థానం చేరేందుకు ఒక్కో లంచ్‌బాక్స్ 20 నుంచి 50 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇందులో రైలు ప్రయాణంతో పాటు సైకిల్, తోపుడు బండ్లు, కాలినడకా ఉంటాయి. ఇలా భోజనం డబ్బాలు అందించడమే కాదు మళ్లీ ఖాళీ అయిన డబ్బాలనూ ఇదే తీరుగా వారి వారి ఇళ్లకు చేరవేస్తారు. ఉదయం తొమ్మిది గంటలకు మొదలైన ఈ ప్రక్రియ సాయంత్రం అయిదు గంటల వరకు కొనసాగుతుంది. కరోనాకు ముందు అయిదు వేల మంది డబ్బావాలాలు జెట్ స్పీడ్ వేగంతో సుమారు 100 రైల్వేస్టేషన్‌ల ద్వారా ప్రయాణించి సంబంధిత వ్యక్తులకు లంచ్‌బాక్స్‌లను చేరవేసేవారు.
బ్యాకప్ టీమ్
విధి నిర్వహణలో డబ్బావాలాలకు అనుకోని ఇబ్బంది ఎదురైనా, ప్రమాదం జరిగినా వెంటనే బ్యాకప్ టీమ్ రంగంలోకి దిగి విధి నిర్వహణలో ఎలాంటి ఆటంకం కలగకుండా చూసుకుంటుంది. ఈ బ్యాకప్ టీమ్‌లోని సభ్యులు చాలా చురుగ్గా ఉంటారు. క్షణాల్లో ఘటనా స్థలానికి చేరుకుంటారు. అక్కడి పరిస్థితిని బట్టి చకచకా నిర్ణయాలు తీసుకుంటారు. ఇలా ఏ అవాంతరం వచ్చినా ఆ ప్రాంతపు బ్యాకప్ టీమ్ సమయస్ఫూర్తితో వ్యవహరించి ఇటు ఖాతాదారుడికి, అటు తమతోటి ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటుంది.
ఇదంతా కూడా కాగితం ముక్క మీద ఎలాంటి ప్రణాళిక లేకుండానే సాగుతుంది అంటే నమ్ముతారా? నమ్మాల్సిందే. ఇంకో మాట.. ఈ డబ్బావాలాలెవ్వరూ చదువుకున్న వారు కాదు. తక్కువలో తక్కువంటే మూడో తరగతి, ఎక్కువలో ఎక్కువ అంటే ఎనిమిదో తరగతి. అది కూడా చాలా చాలా తక్కువ మంది. అయినా ప్రపంచంలోని పేరున్న ఏ బిజినెస్ స్కూళ్లూ, మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లూ, యూనివర్శిటీలూ నిర్వహించలేనంత అద్భతంగా నిర్వహిస్తున్నారు.
ఇంకో మాట.. నిత్యం ఘుమఘుమలాడే ఇంటి భోజనాన్ని నిష్టగా తీసుకెళ్లే ఈ డబ్బావాలాల లంచ్ వెన్యూ ఎక్కడో తెలుసా? పరిసర ప్రాంతాల్లోని చెట్ల కింద, సమీప రైల్వేస్టేషన్లు, బస్సు షెల్టర్లు.. వాకవే పార్క్‌లు!
కఠోరనిష్టాగరిష్టులు.. విధి నిర్వహణలో వీరు మద్యం సహా ఎలాంటి మత్తుపదార్థాలు తీసుకోరు. బీడీ, సిగరెట్ వంటి ధూమపానం చేయరు. క్రమశిక్షణ, పనిపట్ల నిబద్ధత, అంకిత భావమే వీరి విజయ రహస్యం.
అందరూ సమానమే..
డబ్బావాలాల్లో నౌకర్లు, యజమానులంటూ ఉండరు. అందరూ కలిసికట్టుగా టీమ్ వర్క్ చేస్తారు. 10 మంది చొప్పున టీమ్‌గా ఏర్పడి సమన్వయంతో పని చేస్తారు. ఈ పది మందిలో ఇద్దరు బ్యాకప్ టీమ్‌లో ఉంటారు. మిగతా ఎనిమిది మంది డెలివరీ చేస్తారు. ఇలా అయిదు వందల టీమ్‌లు ఉన్నాయి. ఈ టీమ్స్‌కి సమన్వయకర్తలుగా ఉండేవారిని మొకద్దాం(లీడర్)గా పిలుస్తారు. ఈ మొకద్దామ్‌లే ప్రతి ఇంటికి వెళ్లి ఫీజులు వసూలు చేస్తారు. దూరాన్ని బట్టి ఫీజు ఉంటుంది. ప్రస్తుతం ఒక లంచ్‌బాక్స్‌కు కనిష్ఠంగా రూ. 900 నుంచి గరిష్ఠంగా రూ. 1200 వరకు తీసుకుంటున్నారు. వచ్చే ఆదాయంలో అందరికీ సమాన వాటా ఉంటుంది. అందరికీ ఆరోగ్యబీమా ఉంది.
ప్రకటనలు..
ముంబైలో డబ్బావాలాలు వాణిజ్య ఉత్పత్తుల ప్రచారకులు కూడా. మిగిలిన ప్రాంతాల్లో వార్తాపత్రికల్లో కరపత్రాలను పెట్టి ప్రచారం చేసుకున్నట్టే ముంబైలో ఈ డబ్బావాలాల డబ్బాల్లో కరపత్రాలను పెట్టి తమ ఉత్పత్తులకు ప్రచారం చేసుకుంటున్నాయి కొన్ని సంస్థలు. ముఖ్యంగా ఫాస్ట్ మూవింగ్ కన్సూ్యమర్ గూడ్స్ సంస్థలు. దీని ప్రభావం చాలా సానుకూలంగా ఉంటుందనీ చెప్తున్నారు ఆయా సంస్థల సిబ్బంది. త్వరలోనే దేశంలోని ఇతర నగరాల్లోనూ తమ టిఫిన్‌డబ్బాల బట్వాడా నిర్వహణను మొదలుపెట్టాలనుకుంటున్నారు డబ్బావాలాలు.
ఇంకొన్ని వివరాలు..
∙అయిదు వేల మంది డబ్బా వాలాల్లో 12 మంది మహిళలూ ఉన్నారు. వీళ్లు 2013లో ఈ విధుల్లోకి వచ్చారు.
∙డబ్బావాలాల నిబద్ధతను, వేగాన్ని రికార్డ్ చేసేందుకు బీబీసీ టీమ్ ఒకసారి ప్రయత్నించింది. కానీ డబ్బావాలా గమ్యం చేరిన గంటన్నరకు కానీ బీబీసీ కెమెరా టీమ్ గమ్యానికి చేరలేకపోయింది.
∙ఐఐఎమ్‌లు వంటి పలు జాతీయ సంస్థలు, హార్వర్డ్ యూనివర్శిటీ సహా పలు అంతర్జాతీయ సంస్థలు, విద్యార్థులు, వ్యక్తులు డబ్బావాలాలపై రిసెర్చ్ చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు.
∙డబ్బా వాలాల కొలువులోకి ఎక్కువగా వారి ప్రాంతాలకు చెందినవారినే తీసుకుంటారు. చాలా అరుదుగా డబ్బావాలాలెవరైనా తమకు తెలిసిన వ్యక్తిని సూచిస్తే.. తీసుకుంటారు. వారికి అయిదు రోజుల శిక్షణతోపాటు వారి పనితీరును చూశాక.. నచ్చితేనే తమలో ఒకరిగా కలుపుకుంటారు.
∙ప్రిన్స్ చార్ల్స్ ముంబైకి వచ్చినప్పుడు డబ్బావాలాలతో ప్రత్యేకంగా భేటీ అయ్యాడు. వాళ్లు బహుకరించిన గాంధీ టోపీని ధరించాడు. ఇది ఎందుకు విశేషం అయిందంటే అంతకుముందు రాజస్థాన్ సందర్శించిన ప్రిన్స్‌కు అక్కడ తలపాగా బహుకరిస్తే అది ధరించేందుకు ఆయన అంతగా ఇష్టపడలేదు. అంతేకాదు 2007లో తన వివాహానికి డబ్బావాలాలను ఆహ్వానించాడు ప్రిన్స్ చార్ల్స్. ఆ వేడుకలకు వెళ్లేందుకు డబ్బావాలాలకు అయిన ఖర్చును బ్రిటిష్ హై కమిషనే పెట్టుకుంది.
సెంట్రలైజ్డ్ కిచెన్.. మిగిలిన ప్రాంతాలకూ
ఇప్పుడు విధులు నిర్వహిస్తున్న మేమంతా నాలుగో తరం. మాకున్న చదువు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఈ డబ్బావాలా మేనేజ్‌మెంట్‌ను ఆధునికీకరించేందుకు ప్రయత్నిస్తున్నాం. కరోనా వల్ల ఆలస్యమవుతోంది. పాండమిక్‌లో మా వాళ్లు కొంతమంది పుణె ఎంఐడీసీలో, సెక్యూరిటీ గార్డులుగా, డ్రైవర్లుగా ఇలా ఏదో ఒకటి చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి కాబట్టి మళ్లీ వాళ్లంతా వస్తారు.
మా ప్రయత్నాలను కొనసాగిస్తాం. అలాగే తొందర్లోనే సెంట్రలైజ్డ్ కిచెన్‌నూ ఏర్పాటు చేస్తాం. ఇంటి సభ్యులు అందరూ ఉద్యోగాలు చేస్తున్న కుటుంబాలను దృష్టిలో పెట్టుకునే ఈ సెంట్రలైజ్డ్ కిచెన్‌ను ప్రాజెక్ట్‌ను చేపడతున్నాం. వాళ్లకు వాళ్లింటి భోజనంలాంటి భోజనాన్ని అందించడమే మా కిచెన్ లక్ష్యం. అలాగే మా ఈ బట్వాడా పద్ధతిని దేశంలోని ఇతర నగరాల్లోనూ ప్రవేశపెట్టే ఆలోచన చేస్తున్నాం. – రితేష్ ఆంద్రే (స్పోక్స్ పర్సన్)
గుండారపు శ్రీనివాస్
సాక్షి, ముంబై
Comments
Please login to add a commentAdd a comment