రజిత కొండసాని: రవ్వల ముద్దులు...కథ | Rajita Kondasani Ravvala Mudhulu Telugu Story Funday Magazine | Sakshi
Sakshi News home page

రజిత కొండసాని: రవ్వల ముద్దులు...కథ

Published Sun, Mar 20 2022 2:28 PM | Last Updated on Sun, Mar 20 2022 2:37 PM

Rajita Kondasani Ravvala Mudhulu Telugu Story Funday Magazine - Sakshi

పొద్దు బారడెక్కినాది చ్యాటలో బియ్యం వేసుకుని సెరుగుతా దొండ్లోకి తొంగిసూసినాను.. కూసానిక్కట్టేసిన గొర్రిపొట్లి నెమరేత్తాండాది. మా నాయన పట్టించిన పిల్లగొర్రెది బాగా మేసి బలిసినాది. దేవర్లకు,పండగలకి సానామంది రేటును కట్నారు ఐనా ఇయ్యలేదు. మా ఆయనేమో ‘లాభమొత్తాంటే అట్నే పెట్టుకుంటావేందే ఎర్రిదాన అమ్మితగలెట్టు’ అంటా ఈసడిత్తాన్నా నేను మాత్రం ఊకొట్లే..అమ్మేసి రవ్వల దుద్దులు కొనుక్కోవాలని సిన్నప్పట్నుంచి కోరిక. ఒకతూరైనా ఎట్టకపోతానా అని పట్టుపట్నాను.

‘కూలోళ్ళు సేనికాడికిపొయ్యి పెదింత పొద్దయింది.. ఇంగా చ్యాట పట్టుకున్యావా.. పొయ్యిలో అగ్గెప్పుడేస్తావు కూడెప్పుడు సేస్తావు’  అంటా ఎనకమాలే మా ఆయన శీనయ్య గెంతులేస్తా వచ్చినాడు. బిరబిరా పొయ్యికాడికి పోయి నిప్పులెగేసి ఎసురు పెట్టేసినాను. పొద్దెలగా లెయ్యాల.. కసుఊడ్చాల.. గొడ్లు మార్సికట్టేసి ఉట్లగడ్డి కింద ఇదిలియ్యాల.. ఇయన్నీ నేనే సెయ్యాల.. మా ఆయన పగలంతా పనికిపొయ్యి రెక్కలిరగా కట్టపడి మాపట్యాళకు ఇంటికొత్తే కాళ్లు ముఖం కడిగి.. నాల్గు పిడచలు కడుపుకేసి తొంగుంటే.. పొద్దు బారడెక్కాక లేస్తాడు.

పొయ్యిలో కట్లెగేస్తాంటే పక్కింటి సూరమ్మత్త సక్కా వచ్చినాది ‘సూడే లచ్చిమీ.. మనం యాళపొద్దు మీరేదంకా రెక్కలిరుసుకున్నా..రవ్వంత బంగారం ముఖం సూడకపోతిమి. పక్కింటి అక్కమ్మ సూడూ.. ఆళ్ళాయనతో పట్టుపట్టి రవ్వల దుద్దులు కొనించుకుందంట’  అంటానే ప్యాణం సివుక్కుమన్నాది.  రాతిరి కల్లో కూడా దుద్దులే కానస్తాండాయి. గొర్రెపొట్లి పెద్దయ్యాక అమ్మేసి తెచ్చుకోవల్లా.. మనసు గట్టిగా నిలగట్టుకున్నాను. ఎట్లైనా సరే అనుకుంది సాదించాల.. అనుకుంటా గంపకు సద్దెట్టి సేన్లోకి ఎళ్ళబార్నాను. కూలోళ్ళు కలుపుతీస్తాండారు. గనెంపై గంప దించినాను. తింటానికొచ్చినారు కూలోళ్ళు. ఆళ్ళలో అచ్చమ్మక్క సెవులవంకే నా సూప్పోయినాది. దుద్దులు ధగధగా మెరుస్తాండాయి. రెప్పార్పకుండా సూస్తాండాను. 

‘దుద్దులొంక అట్టా సూస్తావేంటే దిష్టి తగుల్తుంది’ అన్యాది అచ్చమ్మక్క.
‘దుద్దులెంతా’ అనడిగాన్నేను. 
‘కూలిసేసిందంతా దీన్లకే ముదలార్చినాను. వయసు సందేళై వాలిపోతాంటే ఇయన్నీ దేనికే అంటా నెత్తి పొడిసి పొడిసి తీసిచ్చాళ్ళే మా సచ్చినోడు’ అంటా అచ్చమ్మక్క అంటాంటే పక్కుమన్యారందరూ.
‘సానా బాగుండాయి.. నిగనిగలాడ్తాండాయి. తెచ్చేసుకుందామని ఆపొద్దున్నుంచి యోచన సేస్తాండానే కానీ ఏసింది లేదు పోయింది లేదనుకో’ సింతాకంత ముఖం పెట్టి అన్యాను. 

అందరూ తిని నడుమొంచినంక సద్దిగంప ఎత్తుకుని గట్లంటి నడుస్తాన్నానన్న మాటేగానీ అచ్చమ్మక్క సెవికేలాడ్తున్న దుద్దులొంకే మనసు పీకుతుండాది. పుట్టింటోళ్ళిచ్చిన గొడ్డు గోదా అమ్మరాదని ఎవరో సెప్తే.. గుటకలు మింగినాను.  రవ్వల దుద్దుల కోరిక తీరాలంటే అదొక్కటే దారి. ఊళ్ళో సున్నపురాళ్ళ సినెంగట్రాముడు మూనాళ్ళ నుంచి బంగపోతాండాడు గొర్రిపొట్లినియ్యమని. రేప్పొద్దున్నే రమ్మని సెప్పాల. యాదోఒగ రేటు కూసేస్తే ఆడికే కొలబెట్టాలనుకుని,తిని పడకేసినాను.

ఆరుబయట పడుకుని జాముసుక్క ఎప్పుడు పొడుస్తాదాని సూస్తా మేల్కొన్నా.. నిద్ర ఇంచుక్కూడా రాలేదు. ఎట్లైనా పొట్లినమ్మేసి రవ్వల దుద్దులు కొనుక్కోవాల. ఏసుకుని బజారెంట పోతాంటే ఈది ఈదంతా నోట్లోకేలెట్టుకోవల్లా.. అబ్బురుపోవల్లా.. ఇలా ఆలోచిస్తాంటే సూరిమీద కోడి రెక్కలు పటపటా కొట్టి కూతేసినాది. బిరక్కన లేసి పాకలోకి పరిగెత్తినాను గొర్రిపొట్లి కనపల్లే.
‘ఇక్కర్రారయ్యో.. గొర్రిపొట్లి కనపల్లే’ అంటా కూతెట్టినాను. పరిగెత్తొచ్చినాడు మా ఆయన ఇసురు కట్టి చేత్తో ఎట్టుకుని పాక సుట్టూర సూసినాం.. యాడా కనపల్లే. దొంగలెత్తుకు పోయారేమో.. రవ్వల దుద్దులు కొనుక్కుందామంటే బండెడంత ఆశ బట్టబయలైపాయే!
∙∙ 
 ఏడుస్తా కూకున్నాను కంట్లో నీళ్లు తుడిసే కొంగుకు లోకువైనట్లు తెల్లార్లు ముద్ద మింగకుండా కూచున్నాను. 
‘నీ దుద్దులు మీద బండపడా. అట్లా ఏడుస్తా కూకోద్దే పంట ఇంటికొస్తే తీసిస్తాలే. పోయి కాసింత ఎంగిలి పడు’ అంటాండాడు మా ఆయన. 
ఈసారి గింజలింటికొస్తే రవ్వల దుద్దులు కొనుక్కోవాల.. బాగా కాళ్ళిరగా కట్టపడితే పంట బాగా ఇదిలిస్తాదని నేను కూడా సేన్లోకి ఉరికురికిపోయినాను. సెనక్కాయలసెట్లు మోకాలెత్తు పెరిగి, సీకు పొదల్లా సిక్కగా కాసింటే దిష్టిబొమ్మ నడిమి సేన్లో పెట్టినాము.  హమ్మయ్య ఈతూరైనా రవ్వల  దుద్దులు ఏసుకోచ్చనే ఆనందం అటకెక్కించినాను. 

దీపావళి పండగ సానా ఇదిగా చేసినాం. అమ్మవారికి నైవేద్యం పెట్టినాం. సీర కట్టినాం. నా దుద్దుల సంగతి మర్చిపోకని సెవిలో ఊదినా.. ఆయమ్మే నా ఆశ తీర్చాలా..!
సెనగసెట్లు పీకి ఒదులేస్తాంటే కుచ్చులు కుచ్చులు కాసిన కాయిల్ని చూసి కండ్లు మెరుపులైనాయనుకో. బాగా ఎండనిచ్చి కుప్పేద్దామని రొండు దినాలుండినాం. రేప్పొద్దున్నే కుప్పెయ్యాల. ఆ రాతిరి సంతోసం సుక్కలంటి కన్రెప్పెయ్యనే లేదు. సరిగ్గా అర్ధరేత్రి పొద్దుకాడ తూరుపక్కన మెరిసినాది. ఒక్కొక్క సినుకు రాల్తాంటే గుండె సెరువైనాది. 

‘అయ్యో.. భగవంతుడా.. సెట్టు నానిపోతే కాయలు బూజొస్తాయి.. రేటు పోవు’ అనుకుంటా ఎట్లసేయాలో పాలుపోలేదు. పొయ్యింట్లోకి బయటింట్లోకి కాలు కాలిన పిల్లిలా తిరగతాండాను. ఫెళఫెళమంటా ఉరుములొచ్చేసరికి ఆశల మీద మన్ను కప్పెట్టేసాను. వాన జోరుగా కురిసినాది. సెరువులు, కుంటలు ఏకమైపోయినాయి. నెత్తిన గుడ్డేసుకుని సేనుకాడికి పరిగెత్తినాము.

‘ఒసేయ్‌.. నువ్వింటికాడే పడుండు నేన్చూసొత్తా’  అని మా ఆయన అంటాన్నా నావల్ల కాలే ఎనకాల్నే సిన్నగా పోయినా. 
పంటంతా మునిగిపోయినాది. శాడకేసిన మడికెయ్యల్లాగా సెలకలన్నీ నీళ్ల సెలమలైపోయినాయి. రవ్వల దుద్దులు ఈ పంటకైనా తెచ్చుకుందామని ఉవిల్లూరినా.. అంతా నీళ్లపాలైనాది. సెట్టుకింద ఒక్కత్తే కూకుని ఆలోసిస్తాన్నా ఎట్లైనా సరే రవ్వల దుద్దులు ఏసుకోవల్ల. అచ్చమ్మక్క సూడు కూలినాలి పోయి తెచ్చుకున్నాది. నేను కూడా కూలి పోతా అనుకుని మాప్పొద్దున్నే వాళ్ళెనకంటి సాలమ్మత్త మడికెయ్యి కోసేకి ఎళ్ళబారినా. 
మా ఆయన సూసి.. ‘నీ రవ్వల దుద్దులు మోజు కూలికాడ దాకా తీసుకుపోతాంటే. .ఏందే ఇది వయసు యాళపొద్దు దాటేసింది, ఇంగా ఈ ముదనష్టపు కోరికేందే..’ అంటా ఆడిపోసినాడు.

ఐనా ఇన్లే. రవ్వల దుద్దులు కోసమై ఆ పని ఈ పని అనకా అన్ని పన్లూ చేసినా. ఎట్లైనా తిరునాళ్ళ లోపు రవ్వల దుద్దులు నా సెవులకు ఏలాడ్తా మెరిసిపోవాల. దుడ్లు బాగా కూడబెట్నా. 
‘కొడుకు సూరిగాడు సదువు సంకనెక్కి బేకార్గా తిరగతాండాడు. ఆడికి సేద్యంగీద్యం వచ్చిసావదు. యాపారం చేసే తలకాయున్నోడు కాకపాయే. ఆడి సంగతి కాట్లోకేసి ఇదేం పిచ్చే..’ అంటా మా ఆయన ఎగర్తాన్నా.. కొనసెవిల్లోక్కూడా ఎయ్యలా. 
సంకరాత్రికి తీయిచ్చిన సుక్కలసీర సింగారించి పెద్దమ్మని తోడ్కొని రవ్వల దుద్దులు తీసుకోటానికి పట్నం ఎళ్ళబారినాం. నా ఆనందం అంతా ఇంతా కాదనుకో. ఇంటి ఎనకాలే సీల్తోవలో పోతే పట్నం సానా దగ్గిర. ఇద్దరం నడుత్తా పోతాండాము.
‘ఏమే లచ్చీ.. సిన్నప్పట్నుంచి దుద్దులు దుద్దులంటాండావు.. ఒకతూరైనా తీసీలేదా మీ నాయనా’ అనంది పెద్దమ్మ.
‘దుడ్లుంటే కదా నాయనకాడ రవ్వల దుద్దులు తీసిచ్చేకి! రాత్రిపవళ్లు దుమ్ము నెత్తిన పోసుకున్నా దమ్మిడీ ఆదాయం లేదు. కూలికింత నాలికింతపోను గానిగెద్దులా గిరగిరా తిరిగి పన్జేసినా సింతాకంత మిగల్కపాయే’  అని అంటూ నడుత్తున్నాము దారెంటి.  ‘సర్లే.. అనుకుంటే తీర్తాయా పోతాయా’ అనంది పెద్దమ్మ.

దావమొత్తం పరిక్కంపలే. సూసి సూసి అడుగెయ్యాల. సింతోపు దాటి రెండడుగుల్నేసినాం అంతే.. నా కొడుకు సూరిగాడు పరిగెత్తుతా వస్తాన్నాడు..  ‘అమ్మా..అమ్మోయ్‌’ అంటా!  బిరబిరా వచ్చి ‘నాయనకి  నోట్లో బురుగొచ్చింది కొక్కరతేవులొచ్చిన కోడిలా తండ్లాడతాన్నాడు భయమేసి నీకాడకు పరెగెత్తుకొచ్చినా’ అనన్నాడు కొడుకు. 
ఓలమ్మో మల్లా అట్లనే ఐందా పెండ్లైనప్పట్నుంచి అట్టా ఏపొద్దూ కాలే. అంతకుముందు అయ్యేది, మాయవ్వ పసురు పెట్టి మేల్జేసినాది. మల్లా రోగం తిరగబెట్టిందా అనుకుంటా.. దుద్దుల సంగతి దేవుడెరుక.. పరిగెత్తుతా ఇంటికిపోయినా. మంచం మీద ఎల్లకిలా పడున్నాడు. శర్మం బాగా సెగ పుట్టినాది. నాటువైద్యుని దగ్గర్కి తీస్కుపోతే బాగా పసురు కలియబెట్టి తాపించి రెండేసి వేలు తీస్కున్నాడు. ఇంగిలీసు మందు మింగమంటే నాకొద్దంటాడు. రవ్వల దుద్దులకని దాపెట్టుకున్న పైసలు మా ఆయన రోగాన్కే ఎళ్ళిపాయే. 

తిరునాళ్ళింక సానా దినాల్లేదు దగ్గర పన్యాది. ఎట్ల సెయ్యాలో ఏందో దిక్కుతోచలే. ఎట్లైనా సరే రవ్వల దుద్దులు తిరునాళ్ళకు పెట్టాల, దేవుడు ఎన్నడు దావిత్తాడో ఏందో అనుకుంటా కూకున్నాను. ఇంట్లో కూసాన్కి ఆనుకొని. ఎవరో భుజం తట్టినట్లైతే తలెత్తి సూసినా.  మా ఆయన ‘అట్టా దిగులెట్టి కూకోమాకే. పాపం నీ బాధ సూత్తాంటే ప్యాణం తరుక్కుపోతాంది.  రవ్వల దుద్దులు పెట్టుకోవల్లనే ఆశ తీరకపోతాండాది. సంతోసంగా ఎళ్ళబారుతావ్‌ తీరా ఆశ తీర్తాదనంగా ఏందో ఒకటి అడ్డొచ్చి పడ్తాది. దేవుడున్నాడే పో.. పోయి అన్నంకడి తిను యాళపొద్దు దాటిపోతాండాది’ అనంటుంటే కండ్లలో నీళ్లు తిరిగినాయి. నాకే కాదు ఆయనక్కూడా! నేను రవ్వల దుద్దులెట్టుకుని తిరునాళ్ళకు పోతాంటే సూడాలనుంది అందుకే అంతలా బాధ పడ్తాన్నాడు.
∙∙ 
ఆపొద్దు పొద్దుగాలే లేసి పన్లన్నీ చేసేసి. బువ్వ చేసి మా ఆయన్కి, కొడుక్కి పెట్టి ఆళ్ళు తినినాక పుట్టింటికి పోయ్యెద్దామని బయల్దేరినాను.  ‘వాళ్ళగ్గానీ ఎక్కనుంచి వత్తాయి లెక్కలు, రవ్వల దుద్దుల కోసం అంతదూరం పోవాల్నా.. నేనే ఏదోటి చేసి కొనిత్తాలే. శీనయ్య పెండ్లాం రవ్వల దుద్దులేసినాదంటే నాగ్గానీ పేర్రాదా సెప్పు’  మా ఆయన మాటకి ప్యాణం లేసొచ్చినాది కన్నుల్లో ఆనందం ఎగజిమ్మినాది. మా ఆయన సావుకారి బసప్పతాకి పోయి వడ్డీకి దుడ్లు తెచ్చినాడు. ‘ఇదిగో తీసుకో పోయి తెచ్చుకో’ అంటా దుడ్లు నా చేతికి ఇస్తాంటే ఇంగ నా కోరిక తీరిపోయినాదని దండిగా సంబరపన్యాను. పెద్దమ్మని తోడ్కొని పట్నం ఎళ్ళబారినాను.


పట్నమంతా తిరిగి తిరిగి రవ్వల దుద్దుల  కోసం పోయింతావల్లా తిప్పి తిప్పి సూసినాం. నచ్చక ఇంగోతాకి పోయినాం. సుమారు పది అంగళ్ళు తిరిగినాం. యాడా కుదర్లే. ‘పెద్దమ్మ.. నచ్చింది సిక్కేదే బొరువు. వద్దనుకునేవి దండిగా వుంటాయి ఏందో’  అనంటే ‘అవునే.. ఇన్నాళ్ళంతా దుద్దులు కొనుక్కోవల్లని నానాయాతన పన్యావు. ఇప్పుడైతే సరైన దుద్దులు సిక్కేదే కట్టమైనాది’ అనుకుంటా నడుత్తాండాము. బాగా తిరిగి నీళ్ళు దప్పిగ్గొని ఒకతావ నిలబన్యాము.

చిరుతిండ్లమ్మె గుడిసెల్లో నీళ్ళడిగితే గుటకడు నీళ్ళు కావాలంటే ఏందైనా కొనుక్కోవాలంట.. ఏం కాలమొచ్చిందో ఏమో..అనుకుంటా పోయినాం. ఒక శేటు దగ్గిర రవ్వల దుద్దులు కుదిర్నాయి. రేటు కట్టి సరిపోతాయో లేదోనని ఏసి సూసి తీసేసినా.  ‘రవ్వల దుద్దులు ఎట్టుకుంటే ఎంత బాగా కానత్తాండావే లచ్చీ మీ ఆయన సూడల్లా.. మురిసిపోతాడు’  పెద్దమ్మనగానే సిగ్గు సింతసెట్టెక్కినాదనుకో. బేరమాడి కొనుక్కొని ఇంటికి బయల్దేరినాం.

మొదట మా ఆయనకే సూపించాల. మొదట మొదట్నే ఊళ్ళో వాళ్ళ కండ్లు పడ్తే దిష్టి తగుల్తాది. రేపే తిరునాళ్ళు. దేవుడు నా బాధ సూల్లేక.. కోరిక తీర్చినాడు. బిరిగ్గా రవ్వల దుద్దులు పెట్టుకుందామని బిరబిరా ఇంటికి పోయినాను. ఇంటి ముందర జనాలు గుంపుగా నించోనుండారు.  ‘మా ఇంటికాడ ఇంతమంది గుమికూడ్నారెందుకు’ అనుకుంటా పోయి సూసినా. 

కొడుకు తాళ్ళమంచం కోళ్లు పట్టుకుని ఏడుస్తాన్నాడు. మా ఆయన మంచంపై పడుకున్నాడు. నన్ను సూడగానే కొడుకు ఎక్కిళ్లు పట్టి ఏడుస్తా పరిగెత్తుకొచ్చినాడు ‘అమ్మా... నాయనా సచ్చిపొయ్యాడు..’  ఈ మాట కొడుకంటానే కండ్లెంటి నీళ్లు కారిపోయినాయి. కొనుక్కొచ్చిన రవ్వల దుద్దులు ఆడనే జార్నిడ్చి మా ఆయనపైబడి బోరున మొత్తుకున్నాను.

‘పాపం రవ్వల దుద్దులు పెట్టుకోవల్లని ఎంత ఆశ పెట్టుకుందో పిచ్చిది. కడసారికి తీరకుండానే పాయే’ అంటా పెద్దమ్మ ఏడుత్తాంటే ఊరాళ్ళందరూ కండ్లలో నీళ్ళెట్టుకున్నారు. మొగుడే పొయ్యాకా రవ్వల దుద్దులు ఉంటేనేం ఊడితేనేం అనుకుంటా.. ఒకతూరి రవ్వల దుద్దులకేసి సూసినాను.  మట్లో పడిపోయిన దుద్దులు నిగనిగా మెరుత్తాంటే కన్నులు తేలేసినాను.
‘పాపం.. రవ్వల దుద్దుల మోజు తీర్కపాయే. ఏసుకునే భాగ్యంల్యాకపాయే. అప్పులు తీర్తాదా మొగున్కి దినాల్సెత్తాదా ఒట్టి పిచ్చిది’ అన్యారెవరో..

- రజిత కొండసాని

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement