ఫన్‌డే: ఈ వారం కథ: 'లెఫి బొ' | Funday Book Sunday Special Story 'Lefi Bo' | Sakshi
Sakshi News home page

ఫన్‌డే: ఈ వారం కథ: 'లెఫి బొ'

Published Sun, Mar 3 2024 12:09 PM | Last Updated on Sun, Mar 3 2024 1:22 PM

Funday Book Sunday Special Story 'Lefi Bo' - Sakshi

"ఆఫీస్‌కి వెళ్ళబోతున్న భర్తకు ‘బై’ చెప్పడం కోసం గడపదాటి వసారాలోకొచ్చి, నవ్వుతూ చేయి వూపింది ఆద్విక.
      అతిలోకసౌందర్యవతి తన భార్య అయినందుకు గర్వపడని రోజు లేదు నిషిత్‌కి. అతను కూడా నవ్వుతూ ‘బై’ చెప్పాడు. ‘లోపలికెళ్ళి తలుపేసుకో. సాయంత్రం నేను తిరిగొచ్చేవరకు తలుపు తీయకు’ అన్నాడు.
      ‘నన్నెవరైనా ఎత్తుకెళ్తారని భయమా?’ చిలిపిగా నవ్వుతూ అంది.
‘దొంగలెత్తుకుపోతారేమోనన్న భయంతో విలువైన వజ్రాల్ని భద్రంగా లాకర్‌లో పెట్టి దాచుకుంటాం కదా. నువ్వు నాకు వజ్రాలకన్నా విలువైనదానివి’ అన్నాడు. ఆద్విక సమ్మోహనంగా నవ్వింది."

అందం, అణకువ ఉన్న ఆద్విలాంటి స్త్రీలని కిడ్నాప్‌ చేసి, సగం ధరకే అమ్మేస్తున్న ముఠాలున్న విషయం ఆద్వికి తెలిస్తే అలా నవ్వగలిగేది కాదేమో అనుకున్నాడు నిషిత్‌. ప్రస్తుతం నడుస్తున్న లాభసాటి వ్యాపారం అదే. అలా కొన్నవాళ్ళు, కొన్ని మార్పులు చేర్పులు చేసి, అందానికి మరిన్ని మెరుగులు దిద్ది తిరిగి ఎక్కువ ధరకు అమ్మేసుకుంటున్నారు.
అతను వీధి మలుపు తిరిగేవరకు చూసి, లోపలికెళ్ళబోతూ ఎవరో తననే చూస్తున్నట్టు అనుమానం రావడంతో ఆగి.. అటువైపు చూసింది ఆద్విక.
      అనుమానం కాదు. నిజమే. ఎవరో ఒకతను తన వైపే చూస్తున్నాడు. ముప్పయ్యేళ్ళకు మించని వయసు, నవ్వుతున్నట్టు కన్పించే కళ్ళు, సన్నటి మీసకట్టు, అందంగా ట్రిమ్‌ చేసిన గడ్డం.. అతన్ని యింతకు ముందు ఎప్పుడైనా చూశానా అని ఆలోచించింది. ఎంత ఆలోచించినా తన జ్ఞాపకాల పొరల్లో అతని ఆనవాళ్ళేమీ కన్పించలేదు. మెల్లగా యింటిలోపలికి నడిచి, తలుపు మూయబోతూ మళ్ళా అతని వైపు చూసింది. అతను అక్కడే నిలబడి కళ్ళార్పకుండా తన వైపే చూస్తుండటంతో భయమేసి, ధడాల్న తలుపు మూసి, గడియ పెట్టింది.

ఎవరతను? ఎందుకు తన వైపే చూస్తున్నాడు? తనను కాదేమో.. యింటివైపు చూస్తున్నాడేమో.. దొంగతనం చేసే ఉద్దేశంతో అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడేమో.. అతని కళ్ళలో కన్పించిన దైన్యం ఆమెను గందరగోళానికి గురిచేస్తోంది. దొంగ కాదేమో.. ఏదైనా చిక్కు సమస్యలో ఉన్నాడేమో.. తనేమైనా పొరపడిందా? అది  దైన్యం కాదేమో.. పదునైన కత్తితో గొంతు కోయగల క్రూరత్వాన్ని దాని వెనుక దాచుకుని ఉన్నాడేమో? మొదట నిషిత్‌కి ఫోన్‌ చేసి చెప్పాలనుకుంది. ఆఫీస్‌ బాధ్యతల్లో తలమునకలై ఉంటాడు కదా. ఎందుకతన్ని మరింత ఒత్తిడికి లోనుచేయడం? సాయంత్రం యింటికొచ్చాక చెప్తే చాలు కదా అనుకుంది.
      నిషిత్‌ యింటికి తిరిగొచ్చేలోపల చేయాల్సిన పనులన్నీ గుర్తొచ్చి వాటిని యాంత్రికంగా చేయసాగింది. ఈ లోపలే ఆ ఆగంతకుడు లోపలికొచ్చి, ఏమైనా చేస్తాడేమోనన్న భయం ఆమెను వీడటం లేదు. ఐనా తలుపులన్నీ వేసి ఉన్నాయిగా. ఎలా వస్తాడు? అనుకుంటున్నంతలో కాలింగ్‌ బెల్‌ మోగింది.
      ఆద్విక ఉలిక్కిపడి తలుపు వైపు చూసింది. ఈ సమయంలో ఎవరై ఉంటారు? ఒకవేళ అతనే నేమో అనుకోగానే ఆమె గుండె వేగంగా కొట్టుకోసాగింది.
మరోసారి కాలింగ్‌ బెల్‌ మోగింది. ఆమె శిలలా కదలకుండా నిలబడింది. కాలింగ్‌ బెల్‌ ఆగకుండా మోగుతోంది. మెల్లగా కదిలి, తలుపుని చేరుకుంది. గోడ పక్కనున్న ఓ స్విచ్‌ని నొక్కింది. పదహారంగుళాల స్క్రీన్‌ మీద ఆ వ్యక్తి మొహం కన్పించింది. అతనే.. తన భర్త ఆఫీస్‌కెళ్ళే సమయంలో తన వైపు అదోలా చూస్తూ నిలబడిన వ్యక్తి.. ఆడియో కూడా ఆన్‌ కావడంతో అతని మాటలు తనకు స్పష్టంగా విన్పిస్తున్నాయి.

‘భువీ.. నన్ను గుర్తుపట్టలేదా? నేను భువీ.. రియాన్ని. ఒక్కసారి తలుపు తీయవా? ప్లీజ్‌ భువీ.. నీకు చాలా విషయాలు చెప్పాలి’ అతని గొంతులో ఆవేదన.. కళ్ళల్లోంచి కారుతున్న కన్నీళ్ళు తను చెప్తున్నది నిజమే అంటూ సాక్ష్యం పలుకుతున్నాయి.
      కానీ తన పేరు భువి కాదుగా. అదే చెప్పింది. ‘మీరేదో పొరబడినట్టున్నారు. నాపేరు భువి కాదు. ఆద్విక.. మీరెవరో నాకు తెలియదు. మిమ్మల్ని నేనెప్పుడూ చూడలేదు. దయచేసి యిక్కణ్ణుంచి వెళ్ళిపోండి’ అంది.
‘అయ్యో భువీ.. నేను పొరబడలేదు. నా ప్రాణంలో ప్రాణమైన నిన్ను గుర్తుపట్టడంలో పొరబడ్తానా? లేదు. నువ్వు నా భార్యవి. నేను నీ రియాన్ని.’
      ‘క్షమించాలి.. నా భర్త పేరు నిషిత్‌. మరొకరి భార్యని పట్టుకుని మీ భార్య అనడం సంస్కారం కాదు. తక్షణమే వెళ్ళిపొండి. లేకపోతే మీపైన సెక్యూరిటీ సెల్‌కి కంప్లెయింట్‌ చేయాల్సి వస్తుంది.’
      ‘నన్ను నమ్ము భువీ. ఒక్కసారి తలుపు తెరువ్‌. నేను చెప్పేది నిజమని రుజువు చేసే సాక్ష్యాధారాలన్నీ నా దగ్గర ఉన్నాయి. ఒక్క పది నిమిషాలు చాలు. ప్లీజ్‌ తలుపు తెరువు’ అతను జాలిగొలిపేలా వేడుకుంటున్నాడు.
      ఆద్విలో దయాగుణం .. అతని వల్ల తనకేమీ ప్రమాదం ఉండదన్న నమ్మకం కలగడంతో తలుపు తెరిచి, ‘లోపలికి రండి. దయచేసి ఏడవకండి. ఎవరైనా ఏడుస్తుంటే చూసి తట్టుకునేంత కఠినత్వం నాలో లేదు’ అంది.

అతను హాల్లో ఉన్న సోఫాలో కూచున్నాక, అతనికి గ్లాసునిండా చల్లని మంచినీళ్ళిచ్చింది. అతను గటగటా తాగి, గ్లాస్‌ని టీపాయ్‌ మీద పెట్టాక, అతని ఎదురుగా కూచుంటూ ‘ఇప్పుడు చెప్పండి. మీరేం చెప్పాలనుకుంటున్నారో’ అంది.
      ‘నా పేరు రియాన్‌. ఎనిమిదేళ్ళ క్రితం కాయ్‌ అనే కంపెనీలో నిన్ను చూసినపుడే ప్రేమలో పడ్డాను. లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌ అంటారే. అప్పుడు నా వయసు ఇరవై రెండేళ్ళు. కాయ్‌ సంస్థ గురించి నీకు తెల్సుగా. సిఓవై కాయ్‌.. కంపానియన్‌ ఆఫ్‌ యువర్‌ చాయిస్‌ అనే సంస్థ’ అంటూ ఆమె సమాధానం కోసం ఆగాడు.
‘తెలుసు. మూడేళ్ళ క్రితం నన్ను నిషిత్‌ తెచ్చుకుంది అక్కడినుంచే’ అంది ఆద్విక.
      ‘నాకు మొదట కాయ్‌ని సందర్శించే ఆసక్తి లేదు. మంచి అమ్మాయిని చూసి పెళ్ళి చేసుకుని, ఒకర్నో యిద్దర్నో పిల్లల్ని కని.. ఇలాంటి మామూలు కోరికలే ఉండేవి. విడాకులు తీసుకున్న మగవాళ్ళ కోసం, భార్య చనిపోయాక ఒంటరి జీవితం గడుపుతున్న వాళ్ళకోసం అత్యంత అందమైన ఆడ ఆండ్రాయిడ్లను తయారుచేసి, అమ్మకానికి పెడ్తున్నారని విన్నప్పుడు, ఎంత అందమైన ఆడవాళ్ళని తయారుచేస్తున్నారో వెళ్ళి చూడాలనుకున్నాను. కొనాలన్న ఉద్దేశం లేదు. ఎనిమిదేళ్ళ క్రితం ఒక్కో ఆండ్రాయిడ్‌ ధర యాభైలక్షల పైనే ఉండింది. మనక్కావల్సిన ఫీచర్స్‌ని బట్టి కోటి రూపాయల ధర పలికే ఆండ్రాయిడ్స్‌ కూడా ఉండేవి. అంతడబ్బు పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం నాకేమీ లేదు. కానీ అక్కడ డిస్‌ప్లేలో పెట్టిన పాతిక్కి పైగా ఉన్న ఆడవాళ్ళలో నిన్ను చూశాక, చూపు తిప్పుకోలేక పోయాను. చెప్పాగా ప్రేమలో పడ్డానని! అందుకే ఎనభై లక్షలు చెల్లించి నిన్ను నా సొంతం చేసుకున్నాను. మన ఐదేళ్ళ కాపురంలో ఎన్ని సుఖాలో.. ఎన్ని సంతోషాలో.. నీ సాన్నిధ్యంలో మనిల్లే ఓ స్వర్గంలా మారిపోయింది.’

‘ఐదేళ్ళ కాపురమా? నాకేమీ గుర్తులేదే.. అలా ఎలా మర్చిపోతాను? నా జీవితంలో జరిగిన ఏ ఒక్క క్షణాన్ని కూడా మర్చిపోలేదు. నా మెమొరీ చాలా షార్ప్‌. మీరు చెప్పేది కట్టు కథలా ఉంది’ అంది ఆద్విక.
‘నేను చెప్పేది నిజం భువీ.’
‘నా పేరు భువి కాదని చెప్పానా.. అలా పిలవొద్దు. ఆద్విక అనే పిలవండి.’
      ‘సరే ఆద్వికా. అసలు జరిగిందేమిటో తెలుసా? నీ మెమొరీని పూర్తిగా ఎరేజ్‌ చేసి, మళ్ళా నిన్ను ఫ్రెష్‌గా మొదటిసారి అమ్ముతున్నట్టు ఇప్పుడున్న నీ భర్తకు అమ్మారు. అందుకే నాతో గడిపిన రోజులు నీకు గుర్తుకు రావడం లేదు.’
‘నా మెమొరీని ఎరేజ్‌ చేశారా? ఎవరు? ఎందుకు?’
      ‘ఆండ్రాయిడ్లను దొంగిలించే ముఠాల గురించి వినలేదా? ప్రస్తుతం అన్నిటికంటే లాభసాటి వ్యాపారం ఆడ ఆండ్రాయిడ్లని అమ్మడమే. ఒక్కో ఆండ్రాయిడ్‌ ధర కోటిన్నర వరకు పలుకుతోంది. ఆల్రెడీ అమ్ముడుపోయిన ఆండ్రాయిడ్లని దొంగలు ఎత్తుకెళ్ళి తక్కువ ధరకు కంపెనీకే అమ్మేస్తారు. కంపెనీ వాళ్ళు అందులో మరికొన్ని మార్పులు చేర్పులు చేసి, మెమొరీ మొత్తాన్ని తుడిచేసి, కొత్త ఆండ్రాయిడ్‌ అని కస్టమర్లను నమ్మించి కోటిన్నరకు అమ్ముకుంటారు.’

‘అంటే నాలో కూడా మార్పులు చేసి అమ్మి ఉండాలి కదా. అలాగైతే మీరెలా గుర్తుపట్టారు?’ అంది ఆద్విక.
‘నిన్ను గుర్తుపట్టకుండా చాలా మార్పులే చేశారు. జుట్టు రంగు మార్చారు. ముక్కు, పెదవులు, చెంపల్లో కూడా మార్పులు చేశారు. కానీ నీ కళ్ళను మాత్రం మార్చలేదు. అదే నా అదృష్టం. వాటిని చూసే నువ్వు నా భువివే అని గుర్తుపట్టాను. ఆ కళ్ళు చూసేగా భువీ నేను ప్రేమలో పడింది.. ప్రేమగా, ఆరాధనగా చూసే కళ్ళు..’
      ‘ఇవేమీ నమ్మశక్యంగా లేవు.’
‘నా దగ్గర రుజువులున్నాయని చెప్పాగా. మనిద్దరం కలిసి ఉన్న ఈ ఫోటోలు, వీడియోలు చూడు’ అంటూ చూపించాడు.
      వాటిల్లో తనలానే నాజూగ్గా, తనెంత పొడవుందో అంతే పొడవుగా ఉన్న అమ్మాయి కన్పించింది. అతను చెప్పినట్టు కళ్ళు అచ్చం తన కళ్ళలానే ఉన్నాయి. కానీ మొహంలోని మిగతా అవయవాలు వేరుగా ఉన్నాయి.
     తన వైపు అనుమానంగా చూస్తున్న ఆద్వికతో ‘యిది నువ్వే భువీ..’ అన్నాడు రియాన్‌.

‘మీరు చూపించిన ఫొటోల్లోని అమ్మాయి నేను కాదు. కళ్ళు ఒకేలా ఉన్నంతమాత్రాన అది నేనే అని ఎలా నమ్మమంటారు? యిప్పుడున్న టెక్నాలజీతో ఎన్నిరకాల మాయలైనా సాధ్యమే. యిక మీరు వెళ్ళొచ్చు’ అంది లేచి నిలబడుతూ.
‘నువ్వు నా భువివే అని నిరూపించడానికి మరో మార్గం ఉంది. నీ మెమొరీని ఎరేజ్‌ చేసినా అది పూర్తిగా అదృశ్యమైపోదు. లోపలెక్కడో నిక్షిప్తమై డార్మెంట్‌గా ఉంటుంది. దాన్ని రిట్రీవ్‌ చేయవచ్చు. ప్లీజ్‌ నాకో అవకాశం యివ్వు. రేపు మళ్ళా వస్తాను. నాతో బైటికి రా. నీ పాత జ్ఞాపకాల్ని బైటికి తోడగల ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్‌ ్స ఎక్స్‌పర్ట్‌ దగ్గరకు పిల్చుకెళ్తాను. జస్ట్‌ వన్‌ అవర్‌. ప్లీజ్‌ నాకోసం.. కాదు కాదు. మనకోసం..’
‘మీరు మొదట బైటికెళ్ళండి’ కోపంగా అంది.
‘నిజమేమిటో తెల్సుకోవాలని లేదా నీకు? ప్రశాంతంగా ఆలోచించు. ఒక్క గంట చాలు. రేపు మళ్ళా వస్తాను’ అంటూ అతను వేగంగా బైటికెళ్ళిపోయాడు.
∙∙ 
రాత్రి పన్నెండు దాటినా నిషిత్‌కి నిద్ర పట్టడం లేదు. రియాన్‌ అనే వ్యక్తి చెప్పిన విషయాలన్నీ ఆద్విక నోటి ద్వారా విన్నప్పటి నుంచి అతనికి మనశ్శాంతి కరువైంది. రియాన్‌ చెప్పేది నిజమేనా? ఆద్వికను తను కొనుక్కోక ముందు రియాన్‌ తో ఐదు సంవత్సరాలు కాపురం చేసిందా? ఆ మెమొరీని ఎరేజ్‌ చేసి, తనకు అమ్మారా? ఎంత మోసం.. ఇలా ఫస్ట్‌ సేల్‌ అని చెప్పి తనలాంటివాళ్ళని ఎంతమందిని మోసం చేసి, పాత ఆండ్రాయిడ్లని అంటగడ్తున్నారో! కాయ్‌ కంపెనీ అమ్మే ఆండ్రాయిడ్లన్నీ ఇరవై యేళ్ళ వయసులోనే ఉంటాయి. దశాబ్దాలు జరిగిపోయినా వాటి వయసు మారదు. ఇరవై యేళ్ళే ఉంటుంది. 
     అతనికి ఆద్వికను కొనడం కోసం కాయ్‌ కంపెనీకి వెళ్ళిన రోజు గుర్తొచ్చింది. అసలెప్పుడైనా మర్చిపోతే కదా.. తన జీవితాన్ని అందమైన మలుపు తిప్పిన రోజది. ఎంత తీయటి జ్ఞాపకమో..
    అతనికి పాతికేళ్ళ వయసులో జోషికతో పెళ్ళయింది. యిద్దరూ ఒకే ఆఫీస్‌లో పనిచేసేవారు. పెళ్ళయిన ఏడాదివరకు హాయిగా గడిచింది. ఆ తర్వాతే సమస్యలు మొదలయ్యాయి. రోజూ ఏదో ఒక విషయం గురించి పోట్లాట.. ఎంత ఓపికతో భరించాడో.. అందమైన పూలవనాల్లో విహరిస్తూ శ్రావ్యమైన పాటల్ని వింటున్నంత తీయగా తన సంసారం కూడా సాగిపోవాలని కదా కోరుకున్నాడు .. ఆ కోరిక తీరనే లేదు.

ఎన్నేళ్ళయినా జోషికలో మార్పు రాలేదు. పోనుపోను మరింత మొండిగా, మూర్ఖంగా తయారైంది. యిద్దరు పిల్లలు పుట్టారు. ఆమె కోపాన్ని తట్టుకోవడం కష్టమైపోయింది. విడిపోవాలని ఎంత బలంగా అన్పించినా పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఆ కోరికను వాయిదా వేశాడు. పిల్లలు పెద్దవాళ్ళయి, వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా అయి జీవితంలో స్థిరపడ్డాక, తన భార్యతో విడాకులు తీసుకున్నాడు. అప్పుడతని వయసు నలభై ఎనిమిదేళ్ళు. తర్వాత రెండేళ్ళ వరకు ఒంటరి జీవితమే గడిపాడు. మళ్ళీ పెళ్ళి చేసుకోవాలని అన్పించలేదు. ఆ వచ్చే స్త్రీ కూడా జోషికలా కయ్యానికి కాలుదువ్వే రకమైతే.. నో.. అన్నింటికన్నా మనశ్శాంతి ముఖ్యం కదా. అది లేని జీవితం నరకం.
      ఆ రెండేళ్ళు యింటిపని, వంటపని యిబ్బంది అన్పించలేదు. ప్రతి పనికీ రకరకాల గాడ్జెట్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఏం కూర కావాలో గాడ్జెట్‌లో ఫీడ్‌ చేస్తే చాలు. కూరలు కడిగి, తరిగి, నూనెతో పాటు కారం, ఉప్పులాంటి అవసరమైన దినుసులూ వేసి, వండి హాట్‌ బాక్స్‌లో పెట్టేస్తుంది. కాని యిబ్బందల్లా ఎవరూ తోడు లేకపోవడం. మనసులోని భావాలు పంచుకోడానికి ఓ మనిషి కావాలి కదా. అప్పుడే అతనికి కాయ్‌ కంపెనీ గుర్తొచ్చింది.

అప్పటికే కాయ్‌ కంపెనీ చాలా ప్రాచుర్యం పొందింది. కోటి కోటిన్నర పెట్టగల తాహతున్న ఒంటరి మగవాళ్ళందరూ ఎన్నేళ్ళయినా వన్నె తరగని, వయసు పెరగని ఇరవై యేళ్ళ అందమైన ఆండ్రాయిడ్లను కొనుక్కోడానికి ఎగబడసాగారు. దానికి ఆ కంపెనీ వాళ్ళిచ్చిన రసవత్తరమైన, ఆకర్షణీయమైన వ్యాపార ప్రకటనలు మరింత దోహదం చేశాయి. ‘గొడవలూ కొట్లాటలూ లేని ప్రశాంతమైన, సంతోషకరమైన జీవితం కావాలనుకుంటున్నారా? మా దగ్గరకు రండి. అందమైన, అణకువ గల ఇరవై యేళ్ళ ఆండ్రాయిడ్లని వరించే అదృష్టం మీ సొంతమవుతుంది.

భార్యగా కావాలా? సహజీవనం చేస్తారా? మనసుకి ఆహ్లాదాన్ని అందించే ప్రియురాలు కావాలా? తీయటి కబుర్లు కలబోసుకునే స్నేహితురాలు కావాలా లేదా ఆల్‌ ఇన్‌ వన్‌ నెరజాణ కావాలా? మీరెలా కోరుకుంటే అలాంటి అప్సరసల్లాంటి ఆండ్రాయిడ్లని అందించే బాధ్యత మాది. రిపేరింగ్, సర్వీసింగ్‌ అవసరం లేని, మెయింటెనెన్‌ ్సకి రూపాయి కూడా ఖర్చు లేని ఆండ్రాయిడ్లు.. ఇరవై యేళ్ళ అమ్మాయి చేయగల అన్ని పనులను ఎటువంటి లోటూ లేకుండా చేస్తుందని హామీ ఇస్తున్నాం. మీ సుఖసంతోషాలే మాకు ముఖ్యం.. మీ మనశ్శాంతే మా లక్ష్యం’ అంటూ సాగాయి ఆ ప్రకటనలు. అతనిక్కావల్సింది కూడా అదే. భార్యగా అన్ని విధుల్ని నిర్వర్తిస్తూ, మనశ్శాంతిని పాడు చేయని స్త్రీ.

ఓ రోజు ఆఫీస్‌కి వెళ్ళకుండా నేరుగా కాయ్‌ కంపెనీకి వెళ్ళాడు. కళ్ళు జిగేల్‌మనిపించేలా అధునాతనంగా అలంకరించిన పదంతస్తుల భవనం.. యం.డి అతన్ని సాదరంగా ఆహ్వానించాడు. ‘మొదట మీకెలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారో చెప్పండి. అటువంటి లక్షణాలున్న ఆండ్రాయిడ్లనే చూపిస్తాం. వాళ్ళలోంచి మీక్కావల్సిన అమ్మాయిని సెలక్ట్‌ చేసుకోవచ్చు. ఆ అమ్మాయిలో కూడా మీరు ప్రత్యేకంగా ఏమైనా మార్పులు కోరుకుంటే, వారం రోజుల్లో అటువంటి మార్పులు చేసి, మీకు అందచేస్తాం’ అన్నాడు.
      ‘నాదో సందేహం. నేను మొత్తం ఎమౌంట్‌ కట్టేసి, అమ్మాయిని యింటికి పిల్చుకెళ్ళాక, ఏదో ఓ సందర్భంలో నాతో గొడవపడితే ఏం చేయాలి? నాకు గొడవలు అస్సలు ఇష్టం ఉండదు’ అన్నాడు నిషిత్‌.
      అదేదో జోక్‌ ఆఫ్‌ ది ఇయర్‌ ఐనట్టు యం.డి పెద్దగా నవ్వాడు. ‘దానికి అవకాశమే లేదు. వీటిలో పాజిటివ్‌ భావోద్వేగాలు మాత్రమే ఉంటాయి. నెగటివ్‌ భావోద్వేగాలు ఒక్కటి కూడా లేకుండా డిజైన్‌ చేశాం. కోపం, చిరాకు, విసుగు, అలగడం, ఎదురుచెప్పటం, పోట్లాడటం, మాటల్లో షార్ప్‌నెస్‌.. ఇవేవీ మీకు కన్పించవు. రెండు వందల యేళ్ళ క్రితం మన భారతదేశంలో భార్యలు ఎలా ఉండేవారో మీరు పుస్తకాల్లో చదివే ఉంటారుగా. మేము మార్కెట్‌ చేస్తున్న అమ్మాయిలు అచ్చం అలానే ఉంటారు. భర్త అదుపాజ్ఞల్లో ఉంటూ, అణకువతో మసలుతూ, దాసిలా సేవలు చేస్తూ, రంభలా పడగ్గదిలో సుఖాలు అందిస్తూ.. యిక అందంలో ఐతే అప్సరసల్తో పోటీ పడ్తారు. అందుకే మా ఆండ్రాయిడ్లకు ‘లెఫి బొ’ అని పేరు పెట్టాం. ఫ్రెంచ్‌లో లెఫి బొ అంటే అత్యంత అందమైన స్త్రీ అని అర్థం. ఇంటర్నేషనల్‌గా డిమాండ్‌ ఉన్న ప్రాడక్ట్‌ మాది. మీరు రిగ్రెట్‌ అయ్యే చాన్సే లేదు. మీ జీవితం ఒక్కసారిగా రాగరంజితమైపోతుంది. మగవాళ్ళకు ఏం కావాలో సాటి మగవాడిగా నాకు తెలుసు. నేను ఎలాంటి కంపానియన్‌ ఉంటే జీవితం హాయిగా సాగిపోతుందని కలలు కన్నానో, అటువంటి లక్షణాలతోనే ఆండ్రాయిడ్లను తయారుచేయించాను’ చెప్పాడు.
      ‘ఖరీదు ఎంతలో ఉంటుంది?’
‘మీరు మొదట పై అంతస్తుల్లో ఉన్న మా మోడల్స్‌ని చూశాక, ఎవరు నచ్చారో చెప్పండి. అదనంగా ఏమైనా మాడిఫికేషన్‌ ్స కావాలంటే చేసిస్తాం. దాన్ని బట్టి ధరెంతో చెప్తాను’ అన్నాడు.
      అతనికి ఆద్విక బాగా నచ్చింది. ముఖ్యంగా ఆమె కళ్ళు..
‘గుడ్‌ చాయిస్‌ సర్‌. నిన్ననే ఫ్యాక్టరీ నుంచి వచ్చిన పీస్‌’ అంటూ దాని ధరెంతో చెప్పాడు.
      అతనడిగినంత ధర చెల్లించి, ఆద్వికను యింటికి తెచ్చుకున్నాడు. ఆద్విక యింటికొచ్చిన క్షణం నుంచి తన జీవితమే మారిపోయింది. అన్నీ సుఖాలే.. కష్టాలు లేవు. అన్నీ సంతోషాలే.. దుఃఖాలు లేవు. అశాంతులు లేవు. కానీ ఇప్పుడీ ఉపద్రవం ఏమిటి? ఎవరో వచ్చి తన భార్యను అతని భార్య అని చెప్పడం ఏమిటి? అతని మనసునిండా అలజడి.. ఆందోళన.. అశాంతి.
      కాయ్‌ ఆఫీస్‌కి వెళ్ళి వాళ్ళను నిలదీయాలనుకున్నాడు. కానీ దానివల్ల ప్రయోజనమేమీ ఉండదనిపించింది. మీకు అమ్మిన ఆండ్రాయిడ్‌ ఓ రోజుముందే తయారై వచ్చిన ఫ్రెష్‌ పీస్‌ అంటారు. వాళ్ళు చెప్పేది అబద్ధమని రుజువు చేసే ఆధారాలేమీ తన దగ్గర లేవు. అతనికి ఆలోచనల్తో నిద్ర పట్టలేదు.

మరునాడు ఉదయం నిషిత్‌ ఆఫీస్‌కెళ్ళిన పది నిమిషాల తర్వాత రియాన్‌ లోపలికి వచ్చాడు. రాత్రంతా ఆలోచించాక, నిజమేమిటో తెల్సుకోవాలనే నిర్ణయానికి వచ్చి ఉండటంతో, ఆద్విక ఇంటికి తాళం వేసి, అతన్తోపాటు బయల్దేరింది.
      కొంతసేపు ప్రయాణించాక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్‌ ్సలో నిష్ణాతుడైన ప్రొఫెసర్‌ గారి ప్రయోగశాలను చేరుకున్నారు. రియాన్‌ అతనికి ముందే జరిగిందంతా వివరంగా చెప్పి ఉండటంతో, ఆద్విక తలలో అమర్చి ఉన్న చిప్‌ని బైటికి తీసి, ఎరేజ్‌ చేయబడిన మెమొరీని రిట్రీవ్‌ చేసి, మళ్ళా చిప్‌ని లోపల అమర్చాడు.
      ఆద్విక కళ్ళు తెరిచి తన ఎదురుగా నిలబడి ఉన్న రియాన్‌ వైపు చూసింది. రియాన్‌.. తన భర్త.. ఐదేళ్ళు అతన్తో గడిపిన జ్ఞాపకాలన్నీ ఒకటొకటిగా గుర్తుకు రాసాగాయి. ఆమెకో విషయం అర్థమైంది. తను మొదట రియాన్‌ భార్యగా ఐదేళ్ళు గడిపాక, ఇప్పుడు మూడేళ్ళ నుంచి నిషిత్‌కి భార్యగా కొనసాగుతోంది.
      ‘భువీ.. నేను చెప్పింది నిజమని యిప్పటికైనా నమ్ముతావా? నువ్వు నా భార్యవి. నిన్ను అమితంగా ప్రేమించాను భువీ. నువ్వోరోజు అకస్మాత్తుగా మాయమైపోతే పిచ్చిపట్టినట్టు నీకోసం ఎన్ని వూళ్ళు తిరిగానో.. చివరికి నా శ్రమ ఫలించింది. నిన్ను కల్సుకోగలిగాను. మనిద్దరం ఎక్కడికైనా దూరంగా వెళ్ళి బతుకుదాం భువీ. నాతో వచ్చేయి. నువ్వు లేకుండా బతకలేను భువీ’ అన్నాడు రియాన్‌.
      ఈ విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు అనుకుంది ఆద్విక. ‘ఆలోచించుకోడానికి నాక్కొంత సమయం ఇవ్వండి’ అంది.
‘యిందులో ఆలోచించడానికి ఏముంది భువీ. నువ్వు నా భార్యవి. మనిద్దరం ఐదు సంవత్సరాలు కలిసి బతికాం. అక్రమంగా డబ్బులు సంపాదించే ముఠా నిన్ను ఎత్తుకెళ్ళి కంపెనీకి అమ్మేసింది. కంపెనీ నుంచి నిన్ను నిషిత్‌ కొనుక్కున్నాడు. యిందులో పూర్తిగా నష్టపోయింది నేను. అన్యాయం జరిగింది నాకు. నువ్వు తిరిగి నా దగ్గరకు రావడానికి యింకా సంశయం దేనికి?’ అన్నాడు రియాన్‌.
      ‘నేను ప్రస్తుతం నిషిత్‌ భార్యని. అతన్ని వదిలేసి ఉన్నపళంగా మీతో వచ్చేస్తే అతనికి అన్యాయం చేసినట్టు కాదా? నన్ను ఆలోచించుకోనివ్వండి’ అంది ఆద్విక.

మరునాడు రియాన్‌ రావడంతోటే ‘అన్నీ సర్దుకున్నావా? నాతో వస్తున్నావు కదా’ అన్నాడు.
‘సారీ.. నేను నా భర్త నిషిత్‌ని వదిలి రాను’ అంది ఆద్విక.
      ‘నీకో విషయం అర్థం కావడం లేదు. నిషిత్‌కి నువ్వు కేవలం తన అవసరాలు తీర్చే ఓ వస్తువ్వి. అంతకన్నా అతను నీకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడు. కానీ నాకు మాత్రం నువ్వు నా ప్రాణానివి. నా ఆరాధ్య దేవతవి. నా ప్రేమ సామ్రాజ్ఞివి. మన ప్రేమను తిరిగి బతికించుకోడానికి నువ్వతన్ని వదిలి రాక తప్పదు భువీ’ అన్నాడు.
    ఆద్విక మెత్తగా నవ్వింది. ‘మీరో విషయం మర్చిపోతున్నారు. నేను మనిషిని కాదు, ఆండ్రాయిడ్‌ని. అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం, కుట్రలు పన్నడం, అన్యాయాలు చేయడం మాకు చేతకాదు. మీ మనుషుల్లో ఉండే అవలక్షణాలేవీ మా సిస్టంలో లోడ్‌ అయి లేవు. యిక ప్రేమంటారా? కాయ్‌ కంపెనీతో నిషిత్‌కి కుదిరిన ఒప్పందం ప్రకారం నేను అతని అవసరాల్ని తీర్చాలి. అతన్నే ప్రేమించాలి. కాంట్రాక్ట్‌ని ఉల్లంఘించడం మా ఆండ్రాయిడ్ల నిఘంటువులో లేదు.’
      ‘భువీ.. నేను నిన్ను ప్రేమించాను.’
‘మీతో కాపురం చేసిన ఐదేళ్ళు నేను కూడా మిమ్మల్ని ప్రేమించి ఉంటాను.’
      ‘అప్పుడు మీ కంపెనీ నాతో కుదుర్చుకున్న ఒప్పందం మాటేమిటి?’
‘మీ వద్దనుంచి నన్నెవరో కిడ్నాప్‌ చేశారు. అందులో నా ప్రమేయం లేదు. అది నా తప్పు కాదు. కంపెనీ నా మెమొరీని ఎరేజ్‌ చేసి మరొకరికి అమ్మడంలో కూడా నా ప్రమేయం లేదు. అది కంపెనీ చేసిన తప్పు. ఇప్పుడు నేను నిషిత్‌ని వదిలి మీతో వస్తే అది తప్పకుండా నేను చేసిన తప్పవుతుంది. మనుషులు తప్పులు చేస్తారు. నేను మనిషిని కాదు ఆండ్రాయిడ్‌ని’ ఆద్విక లేచి, తలుపు తీసి, ‘యిక వెళ్ళండి’ అనేలా అతని వైపు చూసింది.+
– సలీం.

ఇవి చదవండి: Womens Day: 'జనతనయ బస్తర్‌..' చరిత్ర ఒక భద్రత.. భరోసా..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement