‘పడిపోవడంలో తప్పు లేదు కాని, పడ్డ ప్రతిసారి పైకి లేవడమే గొప్ప’... కన్ఫ్యూషియస్ చెప్పిన ఈ మాట అతనికి సరిగ్గా సరిపోతుంది. రెండు దశాబ్దాల క్రితం తొలిసారి భారత జట్టు తరఫున అతను అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగు పెట్టాడు. ఈ ఇరవై ఏళ్ల అతని ప్రయాణం అందరికంటే ఎంతో భిన్నంగా సాగింది. ఆటలో ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నాడు. ఎంతో ప్రతిభ ఉన్నా అనివార్య కారణాలతో అతడికి జట్టులో చోటు దక్కలేదు. అయినా, ఏనాడూ ఆశ కోల్పోలేదు. ఎప్పుడూ సాధన మానలేదు. ఇక ముగించాలని భావించలేదు.
స్థానం కోల్పోయిన ప్రతిసారి పట్టుదలగా పోరాడి పునరాగమనం చేశాడు. ఎప్పుడు వచ్చినా కొత్తగా ఏదో ఒకటి నేర్చుకొని తన ప్రత్యేకతను ప్రదర్శిస్తూ వచ్చాడు. మరోవైపు వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురయ్యాయి. మరొకరైతే అలాంటి స్థితిలో అన్నింటినీ వదిలేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయేవారేమో! కానీ అతను ధైర్యంగా నిలబడ్డాడు. ఎక్కడా తన కెరీర్‌పై ఆ ప్రభావం లేకుండా స్థితప్రజ్ఞతో ముందుకు సాగాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆగిపోయినా ఐపీఎల్‌లో సత్తా చాటి తన విలువేంటో చూపించాడు. ఆడే అవకాశం లేని సమయంలో వ్యాఖ్యాతగా తన మాట పదునును ప్రదర్శించాడు.
39 ఏళ్ల వయసులోనూ యంగ్‌గా, మైదానంలో చురుగ్గా ఆడుతూనే ఇటీవలే ఐపీఎల్‌కు ముగింపు పలికిన ఆ క్రికెటరే దినేశ్ కార్తీక్. గత ఇరవై ఏళ్లలో భారత జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా మారిన పెద్ద సంఖ్యలో మ్యాచ్‌లు ఆడిన ఇతర ఆటగాళ్లందరితో పోలిస్తే కార్తీక్ ప్రస్థానం వైవిధ్యభరితం, ఆసక్తికరం. దిగ్గజ ఆటగాళ్ల మధ్య కూడా తన ప్రత్యేకతను నిలుపుకోవడంలో అతను సఫలమయ్యాడు.
భారత క్రికెట్‌లో వికెట్ కీపింగ్‌కు సంబంధించి అన్ని రుతువులతో పాటు ‘మహేంద్ర సింగ్ ధోని కాలం’ కూడా ఒకటి నడిచింది. వికెట్ కీపర్లను ధోనికి ముందు, ధోని తర్వాతగా విభజించుకోవచ్చు. ‘ధోని కాలం’లో ఎంతో మంది యువ వికెట్ కీపర్లు తెర వెనక్కి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఎంతో ప్రతిభ ఉన్నా, దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా ఆడుతూ వచ్చినా ధోని హవా, అతని స్థాయి ముందు అవన్నీ చిన్నవిగా మారిపోయాయి.
అలాంటి బాధితుల జాబితాలో అగ్రస్థానం దినేశ్ కార్తీక్‌దే. 2008–2016 మధ్య ఐదు సీజన్ల పాటు అతను దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారించడంతో పాటు వికెట్ కీపర్‌గా కూడా రాణించాడు. కానీ ఈ ప్రదర్శన కూడా అతడికి టీమిండియాలో రెగ్యులర్‌గా చోటు ఇవ్వలేకపోయింది. నిజానికి ధోనికి ఏడాది ముందే భారత్ తరఫున టెస్టు మ్యాచ్ ఆడిన కార్తీక్...ధోని అరంగేట్రానికి మూడు నెలల ముందే వన్డేల్లోకి అడుగు పెట్టాడు.
కానీ ఒక్కసారి ధోని పాతుకుపోయిన తర్వాత కార్తీక్‌కు అవకాశాలు రావడం గగనంగా మారిపోయింది. కానీ అతను ఎప్పుడూ నిరాశ పడలేదు. తన ఆటనే నమ్ముకుంటూ ముందుకు సాగాడు. కీపర్‌గా స్థానం లభించే అవకాశం లేదని తెలిసిన క్షణాన తన బ్యాటింగ్‌ను మరింతగా మెరుగుపరచుకున్నాడు. తన ప్రదర్శనలతో స్పెషలిస్ట్ బ్యాటర్‌గా తనకు చోటు కల్పించే పరిస్థితిని సృష్టించుకోగలిగాడు.
అలా మొదలై...
సెప్టెంబర్ 5, 2004... అంతర్జాతీయ క్రికెట్‌లో దినేశ్ కార్తీక్ తొలి మ్యాచ్. ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరిగిన ఈ పోరులో అద్భుత వికెట్ కీపింగ్‌తో అతను ఆకట్టుకున్నాడు. భూమికి దాదాపు సమాంతరంగా గాల్లో పైకెగిరి మైకేల్ వాన్‌ను అతను స్టంపౌట్ చేసిన తీరు ఈ కొత్త ఆటగాడి గురించి అందరూ చర్చించుకునేలా చేసింది. మరో రెండు నెలల తర్వాత ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్‌లో అరంగేట్రం.
2007లో ధోని సారథ్యంలో భారత జట్టు సాధించిన టి20 ప్రపంచకప్ విజయాన్ని ఎవరూ మరచిపోలేరు. ఈ మెగా టోర్నీకి దాదాపు పది నెలల ముందు భారత జట్టు ఒకే ఒక అంతర్జాతీయ టి20 మ్యాచ్ ఆడింది. ఇందులో కూడా ధోని ఉన్నా, బ్యాటర్‌గా దినేశ్ కార్తీక్‌కు స్థానం లభించింది. దక్షిణాఫ్రికాపై మన టీమ్ నెగ్గిన ఈ పోరులో కార్తీక్‌కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ పురస్కారం దక్కడం విశేషం. చారిత్రాత్మక వరల్డ్ కప్ విజయంలో కూడా కార్తీక్ తన వంతు పాత్ర పోషించాడు.
అలా మూడు ఫార్మాట్‌లలో కూడా అతను భారత జట్టులో భాగంగా మారాడు. టెస్టుల్లో కార్తీక్ హైలైట్ ప్రదర్శన 2007లోనే వచ్చింది. స్వింగ్‌కు విపరీతంగా అనుకూలిస్తూ అగ్రశ్రేణి బ్యాటర్లకే కొరుకుడు పడని ఇంగ్లండ్ గడ్డపై అతను సత్తా చాటాడు. కొత్త బంతిని ఎదుర్కొంటూ అక్కడి పరిస్థితుల్లో ఓపెనర్‌గా రాణించడం అంత సులువు కాదు. కానీ తాను ఎప్పుడూ ఆడని ఓపెనింగ్ స్థానంలో జట్టు కోసం ఆడేందుకు సిద్ధమయ్యాడు. నాటింగ్‌హామ్‌లో అతను చేసిన 77 పరుగులు, ఆ తర్వాత ఓవల్‌లో సాధించిన 91 పరుగులు భారత జట్టు 1986 తర్వాత ఇంగ్లండ్‌లో టెస్టు సిరీస్‌ను గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాయి.
జట్టులోకి వస్తూ పోతూ...
ఇంగ్లండ్‌లో రాణించిన తర్వాత కూడా కార్తీక్ కెరీర్ వేగంగా ఊపందుకోలేదు. తర్వాతి మూడేళ్లలో అతను 7 టెస్టులు మాత్రమే ఆడగలిగాడు. కీపర్ స్థానానికి అసలు అవకాశమే లేకపోగా, రెగ్యులర్ బ్యాటర్ స్థానం కోసం తన స్థాయికి మించిన అగ్రశ్రేణి ఆటగాళ్లతో పోటీ పడాల్సి రావడంతో తగినన్ని అవకాశాలే రాలేదు. వన్డేల్లోనైతే వరుసగా రెండు మ్యాచ్‌లలో ఆడే అవకాశం వస్తే అదే గొప్ప అనిపించింది. 2010లో వన్డే జట్టులోనూ స్థానం పోయింది. కానీ కార్తీక్ బాధపడలేదు.
పునరాగమనం చేయాలంటే ఏం చేయాలో తనకు బాగా తెలుసని నమ్మాడు. అందుకే మూడేళ్ల పాటు దేశవాళీ క్రికెట్‌లో చెలరేగాడు. ఫలితంగా 2013లో ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీ టీమ్‌లో మళ్లీ స్థానం లభించింది. ధోని ఉన్నా సరే, బ్యాటర్‌గా చోటు దక్కించుకొని విజేతగా నిలిచిన జట్టులో సభ్యుడయ్యాడు. మరో ఏడాది తర్వాత టీమ్‌లో మళ్లీ చోటు పోయింది. ఇప్పుడూ అదే పని. దేశవాళీలో బాగా ఆడటంతో మూడేళ్ల తర్వాత వెస్టిండీస్ పర్యటనకు ఎంపికయ్యాడు.
ఆ తర్వాత కొన్ని చక్కటి ప్రదర్శనలతో తర్వాతి రెండేళ్లు నిలకడగా రాణించిన అనూహ్యంగా 2019 వన్డే వరల్డ్ కప్ టీమ్‌లోనూ చోటు దక్కించుకొని అందరినీ ఆశ్చర్యపరచాడు. టెస్టుల్లో ధోని రిటైర్మెంట్ తర్వాత కూడా దురదృష్టవశాత్తూ కార్తీక్ పేరును పరిశీలించకుండా సెలక్టర్లు సాహాను ప్రధాన కీపర్‌గా తీసుకున్నారు. అయినా అతను కుంగిపోలేదు. ఏకంగా ఎనిమిదేళ్ల విరామం తర్వాత 2018లో మళ్లీ టెస్టు మ్యాచ్ బరిలోకి దిగగలిగాడంటే అతని పట్టుదల ఎలాంటితో అర్థమవుతుంది.
2021 ముస్తక్ అలీ ట్రోఫీతో...
మరచిపోలేని ప్రదర్శనతో...
అంతర్జాతీయ టి20ల్లోనూ కార్తీక్ ప్రస్థానం పడుతూ లేస్తూనే సాగింది. వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడే అయినా ఎక్కువ అవకాశాలు రాలేదు. అన్నింటికీ ఒకటే సమాధానం...ధోని ఉండగా చోటెక్కడుంది? 2010లో భారత్ తరఫున టి20 ఆడిన మరో ఏడేళ్లకు 2017లో అతను తన తర్వాతి మ్యాచ్ ఆడాడంటే అతని కమ్‌బ్యాక్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అయితే 2018లో నిదాహస్ ట్రోఫీలో కార్తీక్ ప్రదర్శన అతనికి కొత్త అభిమానులను తెచ్చి పెట్టింది.
సరిగ్గా చెప్పాలంటే 14 ఏళ్ల కెరీర్ తర్వాత ఇది కార్తీక్ మ్యాచ్ అనే గుర్తింపును తెచ్చి పెట్టింది. శ్రీలంకతో జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో భారత్ విజయానికి చివరి 12 బంతుల్లో 34 పరుగులు అవసరమయ్యాయి. ఈ దశలో కేవలం 8 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో అతను జట్టును గెలిపించాడు. ఆఖరి బంతికి అతను కొట్టిన సిక్సర్ హైలైట్‌గా నిలిచింది. ఎప్పుడో కెరీర్ ముగిసింది అనుకున్న దశలో 2022 టి20 వరల్డ్ కప్ జట్టులో కూడా అతను చోటు దక్కించుకొని 37 ఏళ్ల వయసులో అంతర్జాతీయ టి20 మ్యాచ్ ఆడటం మరో విశేషం.
మరో వైపు ఐపీఎల్‌లో కూడా ఎన్నో మంచి ప్రదర్శనలు కార్తీక్‌కు గుర్తింపును తెచ్చి పెట్టాయి. ఐపీఎల్‌లో 6 టీమ్‌లకు ప్రాతినిధ్యం వహించిన కార్తీక్ విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ టీమ్‌లో సభ్యుడిగా ఉన్నాడు. ఐపీఎల్ మొదలైన 2008నుంచి 2024 వరకు కార్తీక్ 257 మ్యాచ్‌లు ఆడి అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంతో తన లీగ్ కెరీర్ ముగించాడు. ఈ టోర్నీలో 4842 పరుగులు చేసిన అతను అత్యధిక పరుగులు చేసినవారిలో పదో స్థానంలో నిలిచాడు.
ఫ్యామిలీతో...
ఆటుపోట్లు ఎదురైనా...
కార్తీక్ స్వస్థలం చెన్నై. మాతృభాష తెలుగు. తండ్రి ఉద్యోగరీత్యా బాల్యం కువైట్‌లో గడిపినా... తర్వాత మద్రాసులోనే స్థిరపడ్డాడు. తండ్రి నేర్పించిన ఆటతో దిగువ స్థాయి క్రికెట్‌లో మంచి ప్రదర్శనలు ఇస్తూ సీనియర్ జట్టు వరకు ఎదిగాడు. అయితే ఆటగాడిగా భారత జట్టులో సుస్థిర స్థానం కోసం ప్రయత్నిస్తున్న సమయంలో కార్తీక్ వ్యక్తిగత జీవితంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. 2007లో అతను తన మిత్రురాలు నికితను పెళ్లి చేసుకున్నాడు.
ఐదేళ్ల తర్వాత వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. అయితే తనతో వివాహ బంధంలో ఉండగానే భారత జట్టు, తమిళనాడు జట్లలో తన సహచరుడైన మురళీ విజయ్‌ను ప్రేమించడం, ఆపై తనకు దూరం కావడం అతడిని తీవ్రంగా బాధించాయి. ఆ డిప్రెషన్ నుంచి బయటపడేందుకు చాలా సమయం పట్టింది. ఎట్టకేలకు భారత స్టార్ స్క్వాష్ క్రీడాకారిణి దీపిక పల్లికల్‌తో పరిచయం అతని జీవితంలో కొత్త ఉత్సాహాన్ని తెచ్చింది. 2015లో వీరిద్దరు పెళ్లి చేసుకోగా, వీరికి మూడేళ్ల వయసు ఉన్న కవల అబ్బాయిలు ఉన్నారు. –మొహమ్మద్ అబ్దుల్ హాది
Comments
Please login to add a commentAdd a comment