
అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఒక్కో మెట్టు అధిరోహిస్తున్న 25 ఏళ్ల శుభ్‌మన్ గిల్(Shubman Gill) ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌లో వరల్డ్ నంబర్‌వన్ ర్యాంకర్‌గా కొనసాగుతున్నాడు. అంతేకాకుండా ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy)లో భారత జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపికైన అతడు బ్యాటర్‌గానూ ఇరగదీస్తున్నాడు.
అంతా కలిసొస్తే భవిష్యత్‌లో భారత భావి కెప్టెన్‌గా గిల్‌ను చూడవచ్చు.... పంజాబ్ యువ ఓపెనర్ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన గిల్ ప్రస్థానం వర్దమాన ఆటగాళ్లకు ఆదర్శం.
బ్యాట్ పట్టగానే ఆ కుర్రాడు తన పరుగుల వేట ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపెట్టాడు. అంతర్ జిల్లా అండర్–16 క్రికెట్ టోర్నీ మ్యాచ్‌లో 351 పరుగులు చేసి ప్రకంపనలు రేపాడు. అదే ఊపులో విజయ్ మర్చంట్ ట్రోఫీ అరంగేట్రంలోనే అజేయ డబుల్ సెంచరీతో చెలరేగాడు. అండర్–19 జాతీయ జట్టుకు సులువుగానే ఎంపికయ్యాడు. అప్పటికే ఓపెనర్‌గా రాటుదేలిన ఆ కుర్రాడు 2018లో జరిగిన అండర్–19 ప్రపంచకప్ టోర్నీలో విశ్వరూపం ప్రదర్శించాడు.
న్యూజిలాండ్ వేదికగా జరిగిన ఆ టోర్నీలో 372 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలవడంతో పాటు ’ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కించుకొని యువభారత జట్టు ట్రోఫీ చేజిక్కించుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. తదనంతరం అండర్–19 ప్రదర్శనతో అనతి కాలంలోనే జాతీయ సీనియర్ జట్టుకు ఎంపికయ్యాడు. మనం చెప్పుకున్న ఈ విశేషాలన్నీ పంజాబ్ యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ గురించే.
సీనియర్ ప్లేయర్లు ఉన్న జట్టుకు వైస్ కెప్టెన్
విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, షమీ వంటి సీనియర్ ప్లేయర్లు ఉన్న జట్టుకు గిల్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడంటే అతడి ప్రతిభ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. మూడు ఫార్మాట్లలోనూ జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగిన గిల్ ముఖ్యంగా వన్డేల్లో తన అసాధారణ ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు.
2019లో న్యూజిలాండ్‌పై అంతర్జాతీయ వన్డే అరంగేట్రం చేసిన గిల్ ఇప్పటి వరకు 52 మ్యాచ్‌లు ఆడి 62.13 సగటుతో 2734 పరుగులు సాధించాడు. క్రీజులో నిలదొక్కుకుంటే చాలు భారీ ఇన్నింగ్స్‌లు ఆడతాడనే గుర్తింపు తెచ్చుకున్న గిల్ ఇప్పటికే ఒక డబుల్ సెంచరీ, 8 సెంచరీలు ఖాతాలో వేసుకున్నాడు.
మూడు ఫార్మాటల్లో సెంచరీలు చేసిన అతికొద్దిమంది ఆటగాళ్లలో ఒకడైన గిల్ ఇటీవల ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో వీరవిహారం చేశాడు. మూడు మ్యాచ్‌లలో ఒక సెంచరీ రెండు హాఫ్ సెంచరీలు నమోదు చేసుకొని ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో తిరిగి అగ్రస్థానం దక్కించుకున్నాడు.
అండర్–19 స్థాయిలోనే గిల్ కంటే మెరుగైన నైపుణ్యం ఉన్న ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు ప్రపంచకప్ అందించిన పృథ్వీ షా ఇప్పుడు టీమిండియా సెలక్షన్ దరిదాపుల్లో కూడా లేకుండా పోగా ప్రతిభకు క్రమశిక్షణ జోడించిన శుభ్‌మన్ గిల్ ‘ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి’ అనే ప్రాథమిక సూత్రాన్ని పాటిస్తున్నాడు. 2023 ఐపీఎల్ సీజన్ గుజరాత్ టైటాన్స్ తరఫున 890 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ అందుకున్న గిల్ ప్రస్తుతం ఆ ఫ్రాంచైజీ సారథిగా కొనసాగుతున్నాడు.
– ఇంతియాజ్ మొహమ్మద్