క్రికెట్ పండగొచ్చింది.. 'టీ' కప్ లో పరుగుల సునామీ! | Cricket T20 World Cup 2024 Funday Special Cover Story | Sakshi
Sakshi News home page

క్రికెట్ పండగొచ్చింది.. 'టీ' కప్ లో పరుగుల సునామీ!

Published Sun, Jun 2 2024 8:24 AM | Last Updated on Sun, Jun 2 2024 11:26 AM

Cricket T20 World Cup 2024 Funday Special Cover Story

ధనాధన్‌ సిక్సర్లు.. ఫటాఫట్‌ ఫోర్లు.. ప్రపంచ క్రికెట్‌ అభిమానుల కోసం ట్వంటీ20 పండగ సిద్ధమైంది.. ఐపీఎల్‌ ముగిసి వారం రోజులే కాలేదు.. అప్పుడే మరో 20–20 సమరానికి అంతా రెడీ.. మీరు హైదరాబాద్‌ అభిమానులైనా, రాజస్థాన్‌ ఫ్యాన్స్‌ అయినా.. బెంగళూరును ఇష్టపడినా... కోల్‌కతాను ప్రేమించినా.. ఇప్పుడు మాత్రం అంతా భారత జట్టు వీరాభిమానులే..

ఫ్రాంచైజీ క్రికెట్‌ ఎలాంటి వినోదాన్ని అందించినా ఆటలో అసలు కిక్కు మాత్రం మన దేశం, మన జట్టు అనడంలోనే ఉంది! కాబట్టే టి20 వరల్డ్‌కప్‌ అంటే అంత క్రేజ్‌! అందుకే పదహారేళ్ల వ్యవధిలో ఎనిమిది మెగా టోర్నీలు వంద శాతం ఆనందాన్ని పంచాయి. ఈసారీ ఆ సంబరంలో ఎలాంటి లోటు రానివ్వనన్నట్లుగా మరో వరల్డ్‌కప్‌ మన ముంగిటకు వచ్చేసింది. అందమైన కరీబియన్‌ సముద్ర తీరాన కలిప్సో సంగీతంతో సాగే టి20 మ్యాచ్‌లకు ఈసారి అగ్రరాజ్యం అమెరికా కూడా జత కట్టడం కొత్త ఆకర్షణ. ఇన్నేళ్లుగా క్రికెట్‌ అంటేనే మైళ్ల దూరంలో ఉన్న యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా (యూఎస్‌ఏ) ఇప్పుడు ఆతిథ్య జట్టుగా తమ దేశంలో కామన్వెల్త్‌ దేశాల ఆటకు స్వాగతం పలుకుతోంది. బరిలోకి దిగనున్న జట్ల సంఖ్య తొలిసారి 20కి చేరడం ఈసారి మరో ప్రత్యేకత. సంప్రదాయాలు, ప్రారంభోత్సవాల తంతు ముగిస్తే ఇక జట్లు మైదానంలో తలపడటమే మిగిలింది. ఇకపై నెల రోజుల పాటు ట్రవిస్‌ హెడ్‌ మనవాడు కాదు, కమిన్స్‌పై అభిమానం అస్సలు కనిపించదు, క్లాసెన్‌ తొందరగా అవుట్‌ కావాలనే మనం కోరుకోవాలి.

గతంలో రెండుసార్లు చాంపియన్‌గా నిలవడంతో పాటు ఇప్పుడు ఆతిథ్యం కూడా ఇస్తూ వెస్టిండీస్‌ మరో కప్‌పై కన్నేసింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌ తమ మూడో టైటిల్‌ వేటలో జట్టునంతా హిట్టర్లతో నింపేయగా.. మాజీ విజేత ఆస్ట్రేలియా తమ స్థాయిని మళ్లీ ప్రదర్శించేందుకు ‘సై’ అంటోంది.ఒకసారి చాంపియన్లుగా నిలిచి రెండో టైటిల్‌ కోసం తీవ్రంగా శ్రమిస్తున్న పాకిస్తాన్, శ్రీలంక తమ అస్త్రాలతో సిద్ధమయ్యాయి. దక్షిణాఫ్రికా, న్యూజీలండ్‌లు ఇన్నేళ్లుగా పోరాడుతున్నా ట్రోఫీ మాత్రం ఇంకా అందని ద్రాక్షగానే ఉంది. ఈ సారైనా ఆ జట్ల రాత మారుతుందా అనేది చూడాలి. లెక్కల్లో భాగంగా ఉన్నా డజను టీమ్‌లు టైటిల్‌ గెలిచే అంచనాల్లో లేవు. అయితే తమ స్థాయికి మించిన ప్రదర్శనతో సంచలనానికి అవి ఎప్పుడూ రెడీనే.

ఇక చివరగా.. మన రోహిత్‌ శర్మ బృందం ఏ స్థాయి ప్రదర్శనతో భారత అభిమానుల కోరిక తీరుస్తుందనేది ఆసక్తికరం. ఎప్పుడో 2007లో తొలి టి20 వరల్డ్‌ కప్‌ను గెలుచుకున్న తర్వాత ఏడు ప్రయత్నాల్లోనూ మనకు నిరాశే ఎదురైంది. ఈసారి విండీస్‌ దీవుల్లో విజయీభవ అంటూ అందరం దీవించేద్దాం!

జట్ల సంఖ్యను పెంచి...
టి20 వరల్డ్‌కప్‌ చరిత్రలో ఇప్పటి వరకు 8 టోర్నీలు జరిగాయి. 2007 నుంచి 2022 మధ్య వీటిని నిర్వహించారు. ప్రస్తుతం జరగబోయేది 9వ టోర్నీ. గత నాలుగు వరల్డ్‌ కప్‌లలో 16 జట్లు పాల్గొనగా ఈసారి ఆ సంఖ్యను మరింత పెంచి క్రికెట్‌కు ప్రాచుర్యం కల్పించాలని ఐసీసీ నిర్ణయించింది. అందుకే ఈసారి 20 జట్లకు అవకాశం కల్పించింది. 2022 టోర్నీలో టాప్‌–8లో నిలిచిన ఎనిమిది జట్లు ముందుగా అర్హత సాధించాయి. రెండు ఆతిథ్య జట్లతో పాటు ఐసీసీ టి20 ర్యాంకింగ్స్‌ ప్రకారం మరో రెండు టీమ్‌లను ఎంపిక చేశారు.  రీజినల్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీల ద్వారా వేర్వేరు ఖండాల నుంచి మరో 8 జట్లు అర్హత సాధించాయి. కెనడా, ఉగాండా తొలిసారి టి20 ప్రపంచకప్‌లో ఆడనుండగా... ఆతిథ్య హోదాలో అమెరికా కూడా మొదటిసారి ఈ విశ్వ సమరంలో బరిలోకి దిగుతోంది.

నవంబర్‌ 16, 2001... అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) 2024లో జరిగే టి20 ప్రపంచకప్‌ నిర్వహణ హక్కుల ప్రకటన వెలువరించింది. యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా క్రికెట్‌ బోర్డు, వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు కలసి సంయుక్తంగా ఈ అవకాశం కోసం బిడ్‌ వేశాయి. అమెరికాలో కొత్తగా క్రికెట్‌ను అభివృద్ధి చేసేందుకు వచ్చిన అవకాశం... కరీబియన్‌ దీవుల్లో కొత్త తరంలో క్రికెట్‌పై తగ్గిపోతున్న ఆసక్తిని పెంచేందుకు ఈ రెండు దేశాల బోర్డులు కలసి ముందుకు వెళ్లాలని 2019లోనే నిర్ణయం తీసుకున్న తర్వాత సంయుక్త బిడ్‌కు సిద్ధమయ్యాయి. అమెరికాలాంటి అగ్రరాజ్యంలో క్రికెట్‌కు ఇప్పటి వరకు ఉన్న ఆదరణ అంతంత మాత్రమే. దేశంలోని వివిధ జట్లలో కూడా దక్షిణాసియా దేశాల నుంచి వచ్చినవారే సభ్యులుగా ఉంటున్నారు. అయితే వాణిజ్యపరంగా ఆ దేశంలో మంచి అవకాశాలు ఉండటం కూడా అమెరికాను ఐసీసీ ప్రోత్సహించేందుకు మరో కారణం. పైగా 2028లో లాస్‌ ఏంజెలిస్‌లో జరిగే ఒలింపిక్స్‌ క్రీడల్లో కూడా టి20 క్రికెట్‌ను చేర్చడంతో దానికి ఒక ట్రయిలర్‌గా ఈ వరల్డ్‌కప్‌ ఉండనుంది. మరోవైపు విండీస్‌ గడ్డపై క్రికెట్‌కు క్రేజ్‌ తగ్గుతుండటంతో స్టేడియాల నిర్వహణ సరిగా లేక ఆ జట్టు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో వరల్డ్‌కప్‌తో కాస్త కళ పెంచే అవకాశం ఉండటంతో విండీస్‌ ముందుకు వచ్చింది. ఏర్పాట్ల కోసం కనీసం రెండేళ్ల సమయం తీసుకునేలా ఐసీసీ ఈ రెండు బోర్డులకు అవకాశం కల్పిస్తూ హక్కులను కేటాయించింది.

మొత్తం 9 వేదికలు..
వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ల ఎంపిక కోసం అమెరికా–వెస్టిండీస్‌లకు హక్కులు ఇచ్చినా మ్యాచ్‌లు జరిగే వేదికల విషయంలో ఐసీసీ చిక్కులు ఎదుర్కొంది. ముందుగా అమెరికాలో నాలుగు స్టేడియాలను ఎంపిక చేశారు. వీటిలో న్యూయార్క్‌ శివార్లలో ఉన్న బ్రాంక్స్‌ స్టేడియానికి సంబంధించి జనం నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సుదీర్ఘ సమయంపాటు పార్క్‌ స్థానికులకు అందుబాటులో లేకపోవడంతోపాటు పర్యావరణ సమస్యలూ తలెత్తుతాయని వాదించడంతో దానిని పక్కన పెట్టాల్సి వచ్చింది. వేర్వేరు దేశాల సమాహారమైన వెస్టిండీస్‌ నుంచి కూడా ఏడు వేదికలను వరల్డ్‌కప్‌ కోసం ఐసీసీ ఎంపిక చేసింది. అయితే గ్రెనడా, జమైకా, సెయింట్‌ కిట్స్‌ అండ్‌ నెవిస్‌ ఆర్థిక సమస్యల కారణంగా మ్యాచ్‌ల నిర్వహణ కోసం బిడ్‌ వేయకుండా వెనక్కి తగ్గాయి. మైదానం సిద్ధం చేసేందుకు తమ వద్ద తగినంత సమయం లేదని డొమినికా కూడా తప్పుకుంది. చివరకు వాటి స్థానంలో కొత్త వేదికలను చేర్చి మొత్తంగా ఆరింటిని ఖరారు చేశారు.

ఏ జట్టులో ఎవరున్నారంటే...
భారత్‌..
రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్, హార్దిక్‌ పాండ్యా, శివమ్‌ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్, రిషభ్‌ పంత్, సంజూ సామ్సన్, కుల్దీప్‌ యాదవ్, యుజువేంద్ర చహల్, అర్ష్‌దీప్‌ సింగ్, సిరాజ్, బుమ్రా.

ఇంగ్లండ్‌..
జోస్‌ బట్లర్‌ (కెప్టెన్‌), హ్యారీ బ్రూక్, డకెట్, మొయిన్‌ అలీ, విల్‌ జాక్స్, లివింగ్‌స్టోన్, స్యామ్‌ కరన్, బెయిర్‌స్టో, ఫిల్‌ సాల్ట్, జోఫ్రా ఆర్చర్, టామ్‌ హార్ట్‌లే, క్రిస్‌ జోర్డాన్, ఆదిల్‌ రషీద్, రీస్‌ టాప్లీ, మార్క్‌ వుడ్‌.

దక్షిణాఫ్రికా..
మార్క్‌రమ్‌ (కెప్టెన్‌), హెండ్రిక్స్, మిల్లర్, మార్కో జాన్సెన్, డికాక్, క్లాసెన్, రికెల్టన్, స్టబ్స్, బార్ట్‌మన్, కొయెట్జీ, జాన్‌ ఫార్చూన్, కేశవ్‌ మహరాజ్, నోర్జే, 
రబడ, షమ్సీ.

ఆస్ట్రేలియా..
మిచెల్‌ మార్ష్‌ (కెప్టెన్‌), టిమ్‌ డేవిడ్, హెడ్, వార్నర్, గ్రీన్, మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, అగర్, ఇంగ్లిస్, వేడ్, కమిన్స్, ఎలిస్, హాజల్‌వుడ్, స్టార్క్, 
జంపా.

న్యూజీలండ్‌..
విలియమ్సన్‌ (కెప్టెన్‌), ఫిన్‌ అలెన్, చాప్‌మన్, గ్లెన్‌ ఫిలిప్స్, బ్రేస్‌వెల్, మిచెల్, నీషమ్, రచిన్‌ రవీంద్ర, సాన్‌ట్నర్, డెవాన్‌ కాన్వే, బౌల్ట్, ఫెర్గూసన్, హెన్రీ, ఇష్‌ సోధి, సౌతీ.

పాకిస్తాన్‌..
బాబర్‌ ఆజమ్‌ (కెప్టెన్‌), ఫఖర్‌ జమాన్, సయీమ్‌ ఆయూబ్, ఇఫ్తికార్‌ అహ్మద్, ఆఘా సల్మాన్, ఇమాద్‌ వసీమ్, ఇర్ఫాన్‌ ఖాన్, షాదాబ్‌ ఖాన్, మొహమ్మద్‌ రిజ్వాన్, హారిస్‌ రవూఫ్, ఆమిర్, నసీమ్‌ షా, షాహిన్‌ అఫ్రిది, అబ్రార్‌ అహ్మద్, 
ఆజమ్‌ ఖాన్‌.

శ్రీలంక..
హసరంగ (కెప్టెన్‌), నిసాంక, అసలంక, ధనంజయ డిసిల్వా, ఏంజెలో మాథ్యూస్, కామిందు మెండిస్, షనక, వెల్లలాగె, కుశాల్‌ మెండిస్, సమరవిక్రమ, చమీర, మధుషంక, పతిరణ, తీక్షణ, నువాన్‌ తుషారా.

వెస్టిండీస్‌..
రోవ్‌మన్‌ పావెల్‌ (కెప్టెన్‌), హెట్‌మైర్, బ్రాండన్‌ కింగ్, రూథర్‌ఫర్డ్, రోస్టన్‌ ఛేజ్, రసెల్, హోల్డర్, జాన్సన్‌ చార్లెస్, నికోలస్‌ పూరన్, అల్జారి జోసెఫ్, షమర్‌ జోసెఫ్, రొమారియో ఫెఫర్డ్, అకీల్‌ హొసెన్, గుడకేశ్‌ మోతీ.

బంగ్లాదేశ్‌..
నజ్ముల్‌ హొస్సేన్‌ (కెప్టెన్‌), షకీబ్‌ అల్‌ హసన్, సౌమ్య సర్కార్, తన్‌జిద్, తౌహిద్‌ హృదయ్, మహ్ముదుల్లా, మెహదీ హసన్, లిటన్‌ దాస్, జకీర్‌ అలీ, తస్కిన్‌ అహ్మద్, తన్వీర్‌ అస్లాం, రిషాద్‌ హొస్సేన్, ముస్తఫిజుర్, షోరిఫుల్‌ ఇస్లాం, తన్‌జిమ్‌.

నేదర్లండ్స్‌..
స్కాట్‌ ఎడ్వర్డ్స్‌ (కెప్టెన్‌), మాక్స్‌ ఒడౌడ్, తేజ నిడమనూరు, విక్రమ్‌జిత్‌ సింగ్, సైబ్రాండ్, లెవిట్, బస్‌ డి లీడి, టిమ్‌ ప్రింగిల్, వెస్లీ బరెసి, లొగాన్‌ వాన్‌ బీక్, ఆర్యన్‌ దత్, ఫ్రెడ్‌ క్లాసెన్, డేనియల్‌ డోరమ్, మికెరెన్, వివియన్‌ కింగ్మా.

ఐర్లండ్‌..
పాల్‌ స్టిర్లింగ్‌ (కెప్టెన్‌), రోస్‌ అడెర్, బల్బీర్నీ, టెక్టర్, డెలానీ, కాంఫర్, డాక్‌రెల్, నీల్‌ రాక్, టకర్, మార్క్‌ అడెర్, హ్యూమ్, జాషువా లిటిల్, మెకార్తీ, క్రెయిగ్‌ యంగ్, బెంజమిన్‌ వైట్‌.

కెనడా..
సాద్‌ బిన్‌ జఫర్‌ (కెప్టెన్‌), నవ్‌నీత్‌ ధలీవాల్, ఆరన్‌ జాన్సన్, మొవ్వ శ్రేయస్, రవీందర్‌పాల్‌ సింగ్, కన్వర్‌పాల్, దిల్‌ప్రీత్‌ బాజ్వా, పర్గత్‌ సింగ్, రయాన్‌ పఠాన్, హర్ష్‌ ఠాకెర్, జెరెమి జోర్డాన్, డిలాన్‌ హెలిగర్, కలీమ్‌ సనా, జునైద్‌ సిద్దిఖి, నికోలస్‌ కీర్టన్‌.

నమీబియా..
గెరార్డ్‌ ఎరాస్మస్‌ (కెప్టెన్‌), డావిన్, జేన్‌ గ్రీన్, కోట్జీ, మలాన్‌ క్రుగెర్, లీచెర్, స్మిట్, ఫ్రయ్‌లింక్, లింజెన్, డేవిడ్‌ వీస్, బ్లిగ్నాట్, జేక్‌ బ్రాసెల్, లుంగామెని, షాల్ట్‌జ్, షికోంగో, ట్రంపెల్‌మన్‌.

అఫ్గానిస్తాన్‌..
రషీద్‌ ఖాన్‌ (కెప్టెన్‌), ఇబ్రహీమ్‌ జద్రాన్, నజీబుల్లా జద్రాన్, నాంగ్యాల్‌ ఖరోటి, అజ్మతుల్లా ఒమర్జాయ్, నబీ, గుల్బదిన్, కరీమ్‌ జనత్, రహ్మానుల్లా గుర్బాజ్, ఇషాక్, ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్, నవీనుల్‌ హక్, ఫజల్‌హక్‌ ఫారూఖి, ఫరీద్‌ అహ్మద్‌ మాలిక్, నూర్‌ అహ్మద్‌.

నేపాల్‌..
రోహిత్‌ పౌడెల్‌ (కెప్టెన్‌), ఆసిఫ్‌ షేక్, దీపేంద్ర సింగ్, కుశాల్‌ భుర్తెల్, సందీప్‌ జోరా, కరణ్, కుశాల్‌ మల్లా, ప్రాతిస్, అనిల్‌ సాహ్, సోంపాల్‌ కామి, అభినాష్‌ బొహరా, గుల్షన్‌ జా, లలిత్‌ రాజ్‌బన్షీ, కమాల్‌ ఐరీ, సాగర్‌ ఢకాల్‌.

ఒమన్‌..
అకీబ్‌ ఇలియాస్‌ (కెప్టెన్‌), ప్రతీక్‌ అథవాలె, ఖాలిద్, మెహ్రాన్‌ ఖాన్, నసీమ్, కశ్యప్‌ ప్రజాపతి, షోయబ్‌ ఖాన్, జీషాన్‌ మక్సూద్, అయాన్‌ ఖాన్, నదీమ్, బిలాల్‌ ఖాన్, ఫయాజ్, కలీముల్లా, షకీల్‌ అహ్మద్, 
రఫీయుల్లా.

పపువా న్యూ గినీ..
అసద్‌ వాలా (కెప్టెన్‌), సెసె బావు, కిప్లిన్, హిరి హిరి, లెగా సియాక, టోనీ ఉరా, చార్లెస్‌ అమిని, సెమో కమెయి, జాన్‌ కరికో, కబువా, అలె నావో, చాద్‌ సోఫెర్, నార్మన్‌ వనువా, జేక్‌ గార్డెనర్, హిలా వరె.

స్కాట్లండ్‌..
రిచీ బెరింగ్టన్‌ (కెప్టెన్‌), మాథ్యూ క్రాస్, మైకేల్‌ జోన్స్, జార్జి మున్సే, లీస్క్, మెక్‌ములెన్, గ్రెవెస్, జార్విస్, షరీఫ్, క్రిస్‌ సోల్, మార్క్‌ వాట్, బ్రాడ్‌ వీల్, ఒలీ కార్టర్, బ్రాడ్లీ కరీ, చార్లీ టియర్‌.

ఉగాండా..
బ్రియాన్‌ మసాబా (కెప్టెన్‌), ఫ్రెడ్‌ అచెలమ్, దినేవ్‌ నక్రాని, అల్పేష్‌ రాంజానీ, కెన్నెత్‌ వైస్వా, బిలాల్‌ హసన్, కాస్మస్, రియాజత్‌ అలీషా, జుమా మయాగి, రోజర్‌ ముకాసా, ఫ్రాంక్‌ నుసుబుగా, రాబిన్సన్‌ ఒబుయా, రోనక్‌ పటేల్, హెన్రీ సెన్యోండో, సిమోన్‌ సెసాజి.

అమెరికా..
మోనాంక్‌ పటేల్‌ (కెప్టెన్‌), ఆరోన్‌ జోన్స్, ఆండ్రీస్‌ గౌస్, నితీశ్‌ కుమార్, షాయన్‌ జహంగీర్, స్టీవెన్‌ టేలర్, కోరె అండర్సన్, హర్మీత్‌ సింగ్, మిలింద్‌ కుమార్, నిసర్గ్‌ పటేల్, షాడ్లీ, హసన్‌ అలీఖాన్, జెస్సీ సింగ్, నోస్తుష్‌ కెంజిగె, సౌరభ్‌ నేత్రావల్కర్‌.

వందల్లో ‘ఒక్కడు’... ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌...
బరిలో డజను కంటే ఎక్కువ జట్లు.. 200 మంది కంటే ఎక్కువ ప్లేయర్లు.. చివరకు ఒక జట్టే విజేత.. టోర్నీ ఆసాంతం నిలకడగా రాణిస్తూ తమ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించే వారుంటారు.. కొన్నిసార్లు వీరి ప్రదర్శన ఆయా జట్లను అందలాన్ని ఎక్కిస్తుంది.. లేదంటే టైటిల్‌కు చేరువ చేస్తుంది.. తుది ఫలితాలతో సంబంధం లేకుండా ఒకే ఒక్కడికి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ రూపంలో పురస్కారం వరిస్తుంది. ఇప్పటి వరకు 8 సార్లు టి20 ప్రపంచకప్‌ జరగ్గా.. మూడుసార్లు మాత్రమే విజేత జట్టు నుంచి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ పురస్కారం అందుకున్నవారున్నారు. 
వారి వివరాలు క్లుప్తంగా..

2007
షాహిద్‌ అఫ్రిది (పాకిస్తాన్‌)
దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన తొలి టి20 ప్రపంచకప్‌ టోర్నీలో పాకిస్తాన్‌ ఆల్‌రౌండర్‌ షాహిద్‌ అఫ్రిదికి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు లభించింది. ఈ టోర్నీలో పాకిస్తాన్‌ ఫైనల్లో భారత్‌ చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. ఓవరాల్‌గా ఈ టోర్నీలో అఫ్రిది 91 పరుగులు సాధించడంతోపాటు 12 వికెట్లు పడగొట్టాడు.

2010
కెవిన్‌ పీటర్సన్‌ (ఇంగ్లండ్‌)
ఏడాది తిరగకుండానే మూడో టి20 ప్రపంచకప్‌ జరిగింది. వెస్టిండీస్‌ ఆతిథ్యమిచ్చింది. ఇంగ్లండ్‌ జట్టు తొలిసారి చాంపియన్‌గా అవతరించింది. ఇంగ్లండ్‌ బ్యాటర్‌ కెవిన్‌ పీటర్సన్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు సొంతం చేసుకున్నాడు. మొత్తం ఆరు మ్యాచ్‌లు ఆడిన పీటర్సన్‌ 243 పరుగులు సాధించాడు. ఇందులో రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి.

2009 
తిలకరత్నే దిల్షాన్‌ (శ్రీలంక)
ఇంగ్లండ్‌లో జరిగిన రెండో ప్రపంచకప్‌లో శ్రీలంక బ్యాటర్‌ తిలకరత్నే దిల్షాన్‌ నిలకడగా రాణించాడు. టోర్నీ మొత్తంలో ఏడు మ్యాచ్‌లు ఆడిన దిల్షాన్‌ మూడు అర్ధ సెంచరీల సహాయంతో మొత్తం 317 పరుగులు సాధించి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ పురస్కారం గెల్చుకున్నాడు. ఫైనల్లో పాకిస్తాన్‌ చేతిలో ఓడిపోయి శ్రీలంక రన్నరప్‌గా నిలిచింది.

2012
షేన్‌ వాట్సన్‌ (ఆస్టేలియా)
శ్రీలంకలో జరిగిన నాలుగో టి20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌ జట్టు తొలిసారి చాంపియన్‌గా అవతరించింది. ఫైనల్లో ఆతిథ్య శ్రీలంక జట్టును వెస్టిండీస్‌ ఓడించింది. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ షేన్‌ వాట్సన్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు లభించింది. ఈ టోర్నీలో వాట్సన్‌ 249 పరుగులు చేయడంతోపాటు 11 వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియా జట్టు సెమీఫైనల్‌ చేరేందుకు దోహదపడ్డాడు. సెమీఫైనల్లో వెస్టిండీస్‌ చేతిలో ఆస్ట్రేలియా ఓడిపోయింది.

2014 
విరాట్‌ కోహ్లీ (భారత్‌)
వరుసగా రెండోమారు టి20 ప్రపంచకప్‌ ఆసియాలోనే జరిగింది. బంగ్లాదేశ్‌ ఈ మెగా టోర్నీకి తొలిసారి ఆతిథ్యమిచ్చింది. ఫైనల్లో భారత జట్టును ఓడించి శ్రీలంక జట్టు తొలిసారి చాంపియన్‌గా నిలిచింది. విరాట్‌ కోహ్లీ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు సంపాదించాడు. ఆరు మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ నాలుగు అర్ధ సెంచరీల సహాయంతో మొత్తం 319 పరుగులు సాధించి ‘టాప్‌ స్కోరర్‌’గా నిలిచాడు.

2016 
విరాట్‌ కోహ్లీ (భారత్‌)
వరుసగా మూడోమారు టి20 ప్రపంచకప్‌ ఆసియాలోనే జరిగింది. ఆరో టి20 ప్రపంచకప్‌కు తొలిసారి భారత్‌ వేదికయింది. వెస్టిండీస్‌ జట్టు రెండోసారి చాంపియన్‌గా నిలిచింది. సెమీఫైనల్లో వెస్టిండీస్‌ చేతిలో భారత్‌ ఓడిపోయింది. విరాట్‌ కోహ్లీ వరుసగా రెండో ప్రపంచకప్‌లోనూ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు కైవసం చేసుకున్నాడు. ఐదు మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ మూడు అర్ధ సెంచరీల సహాయంతో మొత్తం 273 పరుగులు సాధించాడు.

2021
డేవిడ్‌ వార్నర్‌ (ఆస్ట్రేలియా)
రెండేళ్లకోసారి జరిగే టి20 ప్రపంచకప్‌ టోర్నీకి ఈసారి ఐదేళ్ల విరామం వచ్చింది. 2020లో భారత్‌ వేదికగా ఏడో టి20 ప్రపంచకప్‌ జరగాల్సింది. అయితే కరోనా మహమ్మారి కారణంగా ఈ టోర్నీ ఒక ఏడాది వాయిదా పడింది. 2021లో ఒమన్‌–యూఏఈ సంయుక్తంగా ఈ టోర్నీకి ఆతిథ్యమిచ్చాయి. ఫైనల్లో న్యూజీలండ్‌ను ఓడించి ఆస్ట్రేలియా తొలిసారి టి20 విశ్వవిజేతగా నిలిచింది. ఆసీస్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ ఏడు మ్యాచ్‌లు ఆడి మూడు అర్ధ సెంచరీలతో కలిపి మొత్తం 289 పరుగులు సాధించి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు గెల్చుకున్నాడు.

2022
స్యామ్‌ కరన్‌ (ఇంగ్లండ్‌)
ఏడాది తిరిగేలోపు ఎనిమిదో టి20 ప్రపంచకప్‌ టోర్నీకి ఆస్ట్రేలియా తొలిసారి ఆతిథ్యమిచ్చింది. ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి ఇంగ్లండ్‌ జట్టు రెండోసారి చాంపియన్‌గా నిలిచింది. ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ స్యామ్‌ కరన్‌ బంతితో మెరిపించి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు సొంతం చేసుకున్నాడు. స్యామ్‌ కరన్‌ ఆరు మ్యాచ్‌లు ఆడి 13 వికెట్లు పడగొట్టాడు.

టోర్నీ ఫార్మాట్‌..
మొత్తం 20 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. ఒక్కో గ్రూప్‌లో ఐదు జట్లు ఉన్నాయి. ప్రతిజట్టూ తమ గ్రూప్‌లో ఉన్న మిగతా నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్‌ ఆడుతుంది. పాయింట్లపరంగా ప్రతిగ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు (మొత్తం 8) తర్వాత దశ సూపర్‌ ఎయిట్‌కు అర్హత సాధిస్తాయి. ఇక్కడ టీమ్‌లను రెండు గ్రూప్‌లుగా విభజిస్తారు. ప్రతిటీమ్‌ తన గ్రూప్‌లో ఉన్న మిగతా 3 జట్లతో తలపడుతుంది. టాప్‌–2 టీమ్స్‌ సెమీఫైనల్‌కు చేరతాయి. సెమీఫైనల్లో గెలిచిన రెండు జట్లు టైటిల్‌ కోసం ఫైనల్లో తలపడతాయి.

గ్రూప్‌ల వివరాలు..

గ్రూప్‌-ఎ
భారత్, పాకిస్తాన్, ఐర్లండ్, కెనడా, అమెరికా.

గ్రూప్‌-బి
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, స్కాట్లండ్, ఒమన్, నమీబియా.

గ్రూప్‌-సి
వెస్టిండీస్, న్యూజీలండ్, అఫ్గనిస్తాన్, ఉగాండా, పపువా న్యూగినీ.

గ్రూప్‌-డి
శ్రీలంక, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, నేదర్లండ్స్, నేపాల్‌.


టి20 వరల్డ్‌కప్‌ షెడ్యూల్‌ బ్రిడ్జ్‌టౌన్‌ గ్రౌండ్‌ ఫైనల్‌ మ్యాచ్‌ వేదిక..

– మొహమ్మద్‌ అబ్దుల్‌ హాది, కరణం నారాయణ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement