రేటే 'బంగార'మాయెనే..! | Sunday Special And Cover Story About Gold Go Ahead With High Prices | Sakshi
Sakshi News home page

రేటే 'బంగార'మాయెనే..!

Published Sun, May 5 2024 7:51 AM | Last Updated on Sun, May 5 2024 10:07 AM

Sunday Special And Cover Story About Gold Go Ahead With High Prices

1990లో 1 కేజీ బంగారం = మారుతీ 800 కారు
2000లో 1 కేజీ బంగారం = మారుతీ ఎస్టీమ్‌
2005లో 1 కేజీ బంగారం = టయోటా ఇన్నోవా
2010లో 1కేజీ బంగారం = టయోటా ఫార్చూనర్‌
2016లో 1 కేజీ బంగారం = బీఎండబ్ల్యూ ఎక్స్‌1
2019లో 1 కేజీ బంగారం = వోల్వో ఎస్‌60
2024లో 1 కేజీ బంగారం = ఆడి క్యూ5
2030 వరకు దాచిపెట్టుకుంటే... 
ఏకంగా ప్రైవేట్‌ జెట్‌నే కొనేయొచ్చేమో!

అతిశయోక్తిగా ఉంది కదూ! ఆకాశమే హద్దుగా.. రోజు రోజుకు కొత్త రికార్డులతో దూసుకెళ్తున్న పుత్తడి దూకుడు చూస్తే ఏమో.. పసిడి పెరగావచ్చు అనిపించక మానదు!! ఏడాది క్రితం 10 గ్రాములు రూ.60,000 స్థాయిలో ఉన్న బంగారం రేటు తాజాగా రూ. 75,000 స్థాయికి చేరి ధర‘ధగ’లాడిపోతోంది. అసలే రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధంతో అట్టుడుకుతుంటే... పులిమీద పుట్రలా పశ్చిమాసియాలో ఇరాన్‌–ఇజ్రాయెల్‌ మిసైళ్ల మోతతో ప్రపంచానికి ముచ్చెమటలు పడుతున్నాయి.

అధిక ధరలతో అతలాకుతలం అవుతున్న ఆర్థిక వ్యవస్థలను ఈ యుద్ధభయాలు వెంటాడుతుండటంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు సురక్షిత సాధనమైన బంగారం వైపు పరుగులు తీస్తున్నారు. దీనికితోడు అమెరికా డాలర్‌ ప్రాభవానికి గండిపడటంతో ప్రభుత్వాలు కూడా కనకాన్నే నమ్ముకుని, ఎగబడి కొంటున్నాయి. మరోపక్క, రేటెంతైనా తగ్గేదేలే అంటూ జనాలు సైతం పసిడి వెంటపడుతున్నారు.

ఇలా అన్నివైపుల నుంచి డిమాండ్‌ పోటెత్తి రేటు ’మిసైల్‌’లా దూసుకెళ్తోంది. అసలు ఈ స్వర్ణకాంతులకు కారణమేంటి? ప్రపంచవ్యాప్తంగా పసిడి నిల్వల సంగతేంటి? ఈ గోల్డ్‌ రష్‌.. పుత్తడిని ఇంకెన్ని కొత్త శిఖరాలకు చేరుస్తుంది? పసిడిలో పెట్టుబడికి ఏ రూటు బెటర్‌? ఇవన్నీ తెలుసుకోవాలంటే బంగారు‘గని’ అలా తవ్వొద్దాం పదండి!!

యుగాలుగా ప్రపంచమంతా కాంతులీనుతున్న లోహం ఏదైనా ఉందంటే నిస్సందేహంగా బంగారమే! అందుకే వేల సంవత్సరాల నుంచి, ఏ నాగరికత చూసినా పసిడి వేట కొనసాగుతూనే ఉంది. అయితే, ప్రస్తుతం భూమ్మీద ఉన్న బంగారం మొత్తంలో దాదాపు 86 శాతం గడచిన 200 ఏళ్లలోనే తవ్వి తీసినట్లు చరిత్రకారులు, జియాలజిస్టులు చెబుతున్నారు. అధునాతన మైనింగ్‌ టెక్నిక్‌లు అందుబాటులోకి రావడంతో 18వ శతాబ్దం ఆరంభంలో పెద్దయెత్తున పసిడి ఉత్పత్తి ప్రారంభమైంది.

కాలిఫోర్నియా గోల్డ్‌ రష్‌ అన్నింటిలోకెల్లా ప్రాచుర్యం పొందింది. 1848 నుంచి 1855 నాటికి ఇక్కడ 2 బిలియన్‌ డాలర్ల విలువైన బంగారాన్ని వెలికి తీయడం విశేషం. ఇక 1890 వరకు అమెరికా, ఆస్ట్రేలియా, రష్యా టాప్‌–3 పుత్తడి ఉత్పత్తి దేశాలుగా ఉండేవి. అయితే, 1886లో దక్షిణాఫ్రికాలోని విట్‌వాటర్‌స్రాండ్‌ బేసిన్‌లో కనుగొన్న నిక్షేపాలు ఆ దేశ ముఖచిత్రంతో పాటు ప్రపంచ పసిడి మార్కెట్‌ను సైతం సమూలంగా మార్చేశాయి. అతిపెద్ద బంగారు క్షేత్రాల్లో ఒకటిగా ఇది చరిత్ర సృష్టించింది.

శతాబ్దం పాటు ఉత్పత్తిలో రారాజుగా స్వర్ణకాంతులతో మెరిసిపోయింది. 1970లో దక్షిణాఫ్రికా పసిడి ఉత్పత్తి 1,002 టన్నుల గరిష్ఠ స్థాయిని అందుకుంది. ఇప్పటిదాకా ఏ దేశం కూడా ఒకే ఏడాదిలో ఇంత బంగారాన్ని ఉత్పత్తి చేయలేదు. 1980 నుంచి పసిడి ధరలు అంతకంతకూ పెరగడంతో ప్రపంచంలో చాలా చోట్ల స్వర్ణం కోసం వేట జోరందుకుంది. 2007 నాటికి చైనా ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఆవిర్భవించడం విశేషం. ప్రస్తుతం 40కి పైగా దేశాల్లో పుత్తడి మైనింగ్‌ జోరుగా సాగుతోంది.

ఉత్పత్తి మందగమనం...
వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ లెక్కల ప్రకారం 2018లో ప్రపంచవ్యాప్తంగా 3,655 టన్నుల బంగారం గనుల నుంచి ఉత్పత్తయింది. ఇదే ఇప్పటిదాకా ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయి. అక్కడి నుంచి తగ్గుముఖం పట్టి, గత మూడేళ్లుగా ఉత్పత్తి ఎదుగూబొదుగూ లేకుండా 3,600 టన్నులకే పరిమితమవుతోంది. ఒకప్పుడు ప్రపంచ బంగారు గనిగా పేరొందిన దక్షిణాఫ్రికా ఇప్పుడు వెలవెలబోతోంది. చైనా 2023లో 370 టన్నులను ఉత్పత్తి చేసి ‘టాప్‌’లేపింది. తర్వాత టాప్‌–10లో రష్యా (310 టన్నులు), ఆస్ట్రేలియా (310), కెనడా (200), అమెరికా (170), కజక్‌స్థాన్‌ (130), మెక్సికో (120), ఇండోనేషియా (110) దక్షిణాఫ్రికా (100), ఉజ్బెకిస్థాన్‌ (110), పెరూ (90) ఉన్నాయి. రికార్డు ధరల నేపథ్యంలో పాత బంగారం రీసైక్లింగ్‌ కూడా పుంజుకుంటోంది. 2023లో 9 శాతం పెరిగి 1,237 టన్నులకు చేరింది. ప్రస్తుత ప్రపంచ పసిడి ఉత్పత్తిలో 32 శాతం వాటా చైనా, రష్యా, ఆస్ట్రేలియాలదే కావడం గమనార్హం.

తవ్విందెంత.. తవ్వాల్సిందెంత?
ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా భూమి నుంచి వెలికితీసిన బంగారం మొత్తం 2,01,296 టన్నులుగా అంచనా. ఇందులో ఆభరణాల రూపంలోనే దాదాపు సగం, అంటే 93,253 టన్నులు ఉంది. దీని విలువ 7.2 ట్రిలియన్‌ డాలర్లు. ప్రైవేటు పెట్టుబడుల రూపంలో 3.4 ట్రిలియన్‌ డాలర్ల విలువైన 44.384 టన్నుల (22%) స్వర్ణం వాల్టుల్లో భద్రంగా ఉంది. వివిధ దేశాల (సెంట్రల్‌ బ్యాంకులు) వద్ద నిల్వలు 34,211 టన్నులు (17%). వీటి విలువ 2.7 ట్రిలియన్‌ డాలర్లు. పారిశ్రామిక అవసరాల కోసం వినియోగంలో ఉన్నది 29,448 టన్నులు (15%). 2.3 ట్రిలియన్‌ డాలర్లు. ప్రస్తుత ధర ప్రకారం ఈ బంగారం మొత్తం విలువ 15.6 ట్రిలియన్‌ డాలర్లు. మన కరెన్సీలో చెప్పాలంటే రూ. 1,303 లక్షల కోట్లు. ఇక భూమిలో ఇంకా నిక్షిప్తమై ఉన్న బంగారం విషయానికొస్తే, ప్రపంచవ్యాప్తంగా మైనింగ్‌ కంపెనీలు కనుగొన్న కచ్చితమైన నిల్వలు 53,000 టన్నులు మాత్రమే మిగిలాయి. ప్రస్తుత వార్షిక ఉత్పత్తి (3,600 టన్నులు) ప్రకారం చూస్తే, మరో 15 ఏళ్లలో ఈ నిల్వలన్నీ అయిపోతాయి. ఈలోగా కొత్త నిక్షేపాలను కనిపెట్టాలి. లేదంటే ఉత్పత్తి అడుగంటి, రీసైక్లింగ్‌పై ఆధారపడాల్సిందే!

రేటెందుకు పరుగులు పెడుతోంది?
ఏ వస్తువు (కమోడిటీ) ధరకైనా గీటురాయి డిమాండ్, సరఫరానే. గత కొన్నేళ్లుగా గనుల నుంచి పసిడి ఉత్పత్తి మందగించింది, భూమిలో మిగిలున్న నిల్వలు అడుగంటుతున్నాయి. 2021 నుంచి భారీ నిక్షేపాలేవీ దొరకడం లేదు. దీంతో భవిష్యత్తులో స్వర్ణం మరింత అరుదైన లోహంగా మారనుంది. మరోపక్క ఆభరణాల డిమాండ్‌ ఏమాత్రం తగ్గడం లేదు. వన్నె తగ్గని సురక్షిత పెట్టుబడి, ద్రవ్యోల్బణానికి విరుగుడుగా ఇన్వెస్టర్లు ఈటీఎఫ్‌ల వంటి సాధనాల ద్వారా పుత్తడిలో మదుపు చేసేందుకు ఎగబడుతున్నారు. ప్రపంచ దేశాలు డాలర్లలో వాణిజ్యానికి క్రమంగా చెల్లు చెప్పడంతో పాటు తమ విదేశీ కరెన్సీ నిల్వల్లో డాలర్‌ నిధులను తగ్గించుకుంటున్నాయి.

ఫలితంగా డీ–డాలరైజేషన్‌ జోరందుకుంది. ఆంక్షల భయాలకు తోడు కరెన్సీ క్షీణతకు విరుగుడుగా బంగారం నిల్వలను సెంట్రల్‌ బ్యాంకులు పెంచుకుంటూ పోతున్నాయి. గత పదేళ్లలో సగటున ఏటా 800 టన్నులు కొన్నాయి. ఇటీవల కొనుగోళ్ల జోరు పెంచిన మన ఆర్‌బీఐ వద్ద 817 టన్నుల బంగారం ఉంది. ఇక పారిశ్రామిక అవసరాలు (ఎలక్ట్రానిక్స్, డెంటిస్ట్రీ, అంతరిక్ష రంగం) ఎగబాకుతున్నాయి. ఇలా సరఫరా మందగించి.. డిమాండ్‌ పెరిగిపోవడమే బంగారం పరుగుకు ప్రధాన కారణం. ఇక రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధానికి తోడు, ఇరాన్‌–ఇజ్రాయెల్‌ దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది.

ఈ భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలతో ద్రవ్యోల్బణం ఎగసి జేబుకు చిల్లుపెడుతోంది. దీంతో ఇన్వెస్టర్లు అనిశ్చితుల్లో ఆదుకునే సురక్షిత సాధనాల్లోకి, ముఖ్యంగా బంగారంలోకి తమ పెట్టుబడులను తరలిస్తున్నారు. ఫిబ్రవరిలో 2,000 డాలర్లకు అటూఇటుగా ఉన్న ఔన్స్‌ బంగారం ధర ఇరాన్‌–ఇజ్రాయెల్‌ ఘర్షణలతో భగ్గుమంది. తాజాగా 2,449 డాలర్ల ఆల్‌టైమ్‌ గరిష్ఠాన్ని తాకింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కొండెక్కి కూర్చున్న వడ్డీరేట్లు ఇకపై దిగొచ్చే అవకాశాలున్నాయి. ఇది పసిడికి మరింత డిమాండ్‌ను పెంచడంతో పాటు ధరలు ఎగిసేందుకు దారితీసే అంశం.

స్టోర్‌ ఆఫ్‌ వాల్యూలో టాప్‌..
ప్రపంచంలో ఏ అసెట్‌ (ఆస్తి)కీ లేనంత స్టోర్‌ ఆఫ్‌ వాల్యూ బంగారం సొంతం. స్టోర్‌ ఆఫ్‌ వాల్యూ అంటే మన దగ్గర ఏదైనా అసెట్‌ (కరెన్సీ, బంగారం, భూమి, ఇళ్లు, షేర్లు ఇతరత్రా) ఉంటే, ఎన్నాళ్లయినా దాని విలువ పెరగడమే కానీ ఆవిరైపోకుండా ఉండటం అన్నమాట. ఉదాహరణకు లక్ష రూపాయలు పెట్టి బంగారం కొని, అదే సమయంలో లక్ష రూపాయలను దాచామనుకోండి. కొన్నేళ్ల తర్వాత పసిడి విలువ కచ్చితంగా పెరుగుతుందే తప్ప దిగజారదు. కానీ నగదు విలువ మాత్రం పడిపోతుంది. రెండేళ్ల కిందట కేజీ బియ్యం ధర రూ.40 స్థాయిలో ఉంటే ఇప్పుడు 70కి చేరింది. అంటే కరెన్సీకి ఉన్న కొనుగోలు విలువ అంతకంతకూ ఆవిరైపోతోందని అర్థం. స్టోర్‌ ఆఫ్‌ వాల్యూ కలిగిన అతి కొద్ది అసెట్లలో భూమి కూడా ఉన్నప్పటికీ, పుత్తడిలా వెంటనే సొమ్ము చేసుకోవడం (లిక్విడిటీ) కష్టం. కాబట్టి అసలుకు మోసం రాకుండా... లిక్విడిటీలోనూ పసిడిని మించింది లేదు. మన పెద్దలు ‘పొలం పుట్రా.. నగా నట్రా’ వెనకేసుకోమన్నది అందుకే!

ఎలా కొన్నా.. బంగారమే!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న బంగారంలో దాదాపు సగం ఆభరణాల రూపంలోనే ఉంది. మగువలకు బంగారమంటే ఎంత మక్కువో చెప్పేందుకు ఇదే నిదర్శనం. రేటు ఎగబాకుతుండటంతో అందకుండా పోతుందేమోనన్న ఆతృత అందరిలోనూ పెరిగిపోతోంది. అందుకే పసిడి పెట్టుబడులూ జోరందుకున్నాయి. మరి ఏ రూపంలో కొంటే మంచిది అనేది చాలా మందికి వచ్చే డౌటు. నిజానికి పెట్టుబడికి కూడా మన దేశంలో ఇప్పటికీ ఆభరణాల రూపంలో కొనేవారే ఎక్కువ. ఎందుకంటే నచ్చినప్పుడు ధరించి, ఆనందించవచ్చనేది వారి అభిప్రాయం.

దీనివల్ల తరుగు, మజూరీ పేరుతో కొంత నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి, ధరించేందుకు అవసరమైనంత ఆభరణాలను పక్కనబెడితే, పెట్టుబడికి మాత్రం కాయిన్లు, బార్ల రూపంలో 24 క్యారెట్ల బంగారాన్ని కొనడం బెటర్‌. అయితే, ఇందులో కూడా అదనపు చార్జీల భారం ఉంటుంది. అంతేకాకుండా భౌతిక రూపంలో బంగారాన్ని కొన్నా, అమ్మినా 3 శాతం వస్తుసేవల పన్ను (జీఎస్‌టీ) బాదుడు తప్పదు. ఆభరణాలు, నాణేలు, కడ్డీల రూపంలో కొని దాచుకోవడం రిస్కు కూడా. పోనీ లాకర్లలో దాచుకోవాలంటే ఫీజులు కట్టాల్సి ఉంటుంది. వీటన్నింటికీ మెరుగైన ప్రత్యామ్నాయం సార్వభౌమ గోల్డ్‌ బాండ్లు (ఎస్‌జీబీలు), గోల్డ్‌ ఎక్సే్ఛంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (ఈటీఎఫ్‌లు) తదితర రూపాల్లో లభించే డిజిటల్‌ గోల్డ్‌.

అయితే, వీటిని కొనాలంటే డీమ్యాట్‌ ఖాతా ఉండాలి. బంగారం మార్కెట్‌ ధరకు అనుగుణంగా షేర్ల మాదిరిగానే ఇవి కూడా ట్రేడవుతాయి. నచ్చినప్పుడు విక్రయించుకొని సొమ్ము చేసుకోవచ్చు. ఈటీఎఫ్‌లలో నామమాత్రంగా చార్జీలు ఉంటాయి. కానీ, ఎస్‌జీబీలకు ఎలాంటి చార్జీలూ లేవు. అంతేకాదు, వార్షికంగా 2.5 శాతం వడ్డీ కూడా లభిస్తుంది. అయితే, ఏ రూపంలో కొన్నాసరే ఇన్వెస్టర్లు తమ తమ పెట్టుబడి మొత్తంలో కనీసం 10–15 శాతాన్ని బంగారానికి కేటాయించడం ఉత్తమమని, క్రమానుగత పెట్టుబడి(సిప్‌) రూపంలో ఇన్వెస్ట్‌ చేయాలనేది ఆర్థిక నిపుణుల ‘బంగారు’ మాట!

బంగారు భారత్‌!
ఆర్‌బీఐ దగ్గరున్న 817 టన్నుల బంగారాన్ని పక్కనబెడితే, అనధికారిక లెక్కల ప్రకారం భారతీయుల వద్ద ఆభరణాలు, ఇతరత్రా రూపాల్లో ఉన్న బంగారం మొత్తం 25,000 టన్నులకు పైగానే ఉంటుందని అంచనా. భూమ్మీద ఉన్న మొత్తం బంగారంలో ఇది 13 శాతం. అంటే దాదాపు 1.93 ట్రిలియన్‌ డాలర్లు. మన కరెన్సీలో రూ. 161 లక్షల కోట్లు. భారత స్థూల దేశీయోత్త్పత్తి (3.7 ట్రిలియన్‌ డాలర్లు)లో సగానికి సమానమన్నమాట!

తులం... రూ. లక్ష!
కనకం.. పూనకాలు లోడింగ్‌ అంటూ నాన్‌స్టాప్‌ ర్యాలీ చేస్తోంది. ఫిబ్రవరి నుంచి మొదలైన దూకుడుతో ఏకంగా 20 శాతం పైగా ఎగబాకింది. ఇప్పుడు కొనొచ్చా.. తగ్గేదాకా వేచి చూడాలా? ఇంకా పెరిగితే ఏంటి పరిస్థితి? అందరిలోనూ ఇవే సందేహాలు. అయితే, పుత్తడిని ఏ రేటులో కొన్నా దీర్ఘకాలంలో లాభాలే కానీ, నష్టపోయే పరిస్థితైతే ఉండదనేందుకు దాని ‘ధర’ చరిత్రే సాక్ష్యం! ఈ ఏడాదిలోనే అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర ఔన్స్‌కు 2,700 డాలర్లను తాకొచ్చని ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం గోల్డ్‌మన్‌ శాక్స్‌ అంచనా వేసింది. దీని ప్రకారం చూస్తే, దేశీయంగా 10 గ్రాముల మేలిమి బంగారం రేటు రూ. 85,000కు చేరే అవకాశం ఉంది. అంటే తులం (11.6 గ్రాములు) బంగారం కొనాలంటే రూ. లక్ష పెట్టాల్సిందే. అయితే, పశ్చిమాసియా, ఉక్రెయిన్‌ వివాదాలు శాంతించడం, అమెరికాలో వడ్డీరేట్లు మరింత పెరగడం, లేదంటే యథాతథంగా కొనసాగించడంతో పాటు సెంట్రల్‌ బ్యాంకుల కొనుగోళ్లకు బ్రేక్‌ పడితే పసిడి ధరలకు కళ్లెం పడుతుందని గోల్డ్‌మన్‌ శాక్స్‌ అంటోంది.

రూపాయి వాత.. సుంకం మోత!
మన దేశంలో మగువలే కాదు పురుషులూ పసిడి ప్రియులే. అయితే, పుత్తడి రేటు విషయంలో మన జేబుకు అటు ప్రభుత్వం, ఇటు ‘రూపాయి’ బాగానే చిల్లుపెడుతున్నాయి. పసిడి దిగుమతులపై ప్రభుత్వం 15 శాతం సుంకం విధిస్తోంది. మరోపక్క, రూపాయి విలువ కూడా అంతకంతకూ బక్కచిక్కుతూ పసిడి ధరకు ఆజ్యం పోస్తోంది. అది ఎలాగంటే, వాస్తవానికి ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఒక ఔన్స్‌ (31.1 గ్రాములు) పసిడి ధర 2,400 స్థాయిలో ఉంది. ప్రస్తుత రూపాయి విలువ ప్రకారం 10 గ్రాముల మేలిమి బంగారం రేటు దాదాపు రూ.65,000. కానీ రేటు రూ.75,000 స్థాయిని తాకింది. అంటే 15 శాతం సుంకం లెక్కన ప్రభుత్వానికి రూ.10,000 చెల్లించుకోవాల్సి వస్తోంది. ఇక రూపాయి పతనం విషయానికొస్తే, 2022లో డాలరుతో రూపాయి మారకం విలువ 80 వద్ద ఉండేది. ఇప్పుడు 83.5కు పడిపోయింది. రూపాయి 80 స్థాయిలోనే ఉంటే ప్రస్తుత పసిడి ధర రూ.62,400. దీనికి 15 శాతం సుంకం కలిపితే, 71,720 కింద లెక్క!

సెంట్రల్‌ బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు ఎందుకు...
ఏ దేశానికైనా ఎగుమతి–దిగుమతులు సజావుగా జరిగేందుకు విదేశీ మారక (ఫారెక్స్‌) నిల్వలు ఎంత అవసరమో, అందులో బంగారం నిల్వలను తగినంతగా ఉంచుకోవడం కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే, ఏదైనా అనుకోని ఆర్థిక విపత్తులు తలెత్తినప్పుడు, అంటే ఫారెక్స్‌ నిధులు అడుగంటి పోవడం వంటి సందర్భాల్లో ప్రభుత్వాలకు దన్నుగా నిలిచేది పుత్తడే! 1991లో దేశంలో ఫారెక్స్‌ నిల్వలు (డాలర్లు) నిండుకున్నాయి.

దిగుమతులకు చెల్లించేందుకు, విదేశీ రుణాలపై వడ్డీ కట్టేందుకు డాలర్లు లేక చెల్లింపుల సంక్షోభం తలెత్తింది. దీంతో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు, ఆర్థిక మంత్రి మన్మోహన్‌ సింగ్‌ రిజర్వ్‌ బ్యాంకు (ఆర్‌బీఐ) వద్దనున్న బంగారాన్ని కుదువపెట్టి విదేశీ రుణాలను సమీకరించారు. దేశం దివాలా తీయకుండా కాపాడారు. అంటే, అత్యవసరంగా డబ్బు అవసరమైనప్పుడు బంగారం చేతిలో ఉంటే మనకు ఇట్టే అప్పు ఎలా పుడుతుందో.. ప్రభుత్వాలకు సైతం ఆపదలో ఆదుకునే ఆపన్న హస్తం స్వర్ణమే!

మరికొన్ని ‘బంగారు’ ముచ్చట్లు...

  • ప్రపంచంలో ఇప్పటిదాకా వెలికితీసిన బంగారం అంతటినీ కరిగించి ముద్దగా చేస్తే ఎటు చూసినా 21.8 మీటర్లుండే క్యూబ్‌లో పట్టేస్తుంది.

  • అత్యధిక సాంద్రత, సాగే గుణం కారణంగా ఔన్సు (31.1 గ్రాములు) బంగారాన్ని  187 చదరపు అడుగుల పలుచని గోల్డ్‌ లీఫ్‌గా సాగదీయొచ్చట.

  • ప్రతి యాపిల్‌ ఐఫోన్‌లో 0.034 గ్రాముల పసిడి ఉంటుందని అంచనా.

  • దక్షిణాఫ్రికాలో కనుగొన్న ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు గని (విట్‌వాటర్‌స్రాండ్‌ గోల్డ్‌ఫీల్డ్‌) కార్మికుల కోసం 1900 శతాబ్ది ఆరంభంలో నెలకొల్పిన జొహానస్‌బర్గ్‌ సెటిల్‌మెంట్‌.. ఇప్పుడు ఆ దేశంలో అతిపెద్ద నగరం.

  • ప్రస్తుతం సాధారణ గ్రేడ్‌ టన్ను క్వార్ట్‌›్జ ముడి ఖనిజం నుంచి ఓపెన్‌ పిట్‌ గనిలో సగటున 1.4 గ్రాములు, భూగర్భ గనిలో 5–8 గ్రాములు మాత్రమే బంగారం లభిస్తోంది.

  • నేరుగా ముద్దల రూపం (నేటివ్‌ స్టేట్‌)లో కూడా దొరికే అతి విలువైన లోహం కూడా బంగారమే. ప్రపంచంలో అతిపెద్ద బంగారం ముద్ద ఆస్ట్రేలియాలోని విక్టోరియా గోల్డ్‌ ఫీల్డ్స్‌లో 1869లో దొరికింది. ‘వెల్కమ్‌ స్ట్రేంజర్‌’గా పేరు పెట్టిన దాని బరువు ఏకంగా 72 కేజీలు! మన కోలార్‌ గనుల్లోనూ బొప్పాయి, గణేషుడి రూపాల్లో ఇలా పసిడి ముద్దలు లభించాయట.

  • అతిపెద్ద పసిడి భాండాగారాన్ని (వాల్ట్‌) న్యూయార్క్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్వహిస్తోంది. మాన్‌హటన్‌లోని బ్యాంక్‌ బేస్‌మెంట్‌లో ఉన్న భూగర్భ వాల్ట్‌లో ప్రస్తుతం వివిధ దేశాల సెంట్రల్‌ బ్యాంకులు, ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థలకు చెందిన 7,000 టన్నుల బంగారం ఉన్నట్లు అంచనా.

  • లండన్‌ బులియన్‌ మార్కెట్‌ పసిడి ట్రేడింగ్‌లో నంబర్‌ వన్‌గా నిలుస్తోంది. ప్రపంచంలో ట్రేడయ్యే మొత్తం గోల్డ్‌లో 70 శాతం వాటా దీనిదే.

  • భారత్‌లోని మొత్తం బంగారంలో 3,000–4,000 టన్నులు దేవాలయాలకు చెందినవేనని అంచనా. కేరళ పద్మనాభస్వామి గుడిలోని నేలమాళిగల్లో దాదాపు 1,300 టన్నుల బంగారం నిక్షిప్తమై ఉందట. ఇక తిరుపతి వెంకటేశ్వరస్వామి తరఫున టీటీడీ ఇప్పటిదాకా బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసిన బంగారం 11,329 కేజీలు (11.32 టన్నులు). ఒక్క 2023–24లోనే 1,031 కేజీల బంగారాన్ని డిపాజిట్‌ చేసింది.

కేజీఎఫ్‌.. మన బంగారు కొండ!
భారత్‌లో క్రీస్తు పూర్వం 1వ సహస్రాబ్ది నుంచి దక్కన్‌ ప్రాంతంలో పసిడి వేట జరుగుతోందని చరిత్ర చెబుతోంది. కర్ణాటకలోని కోలార్‌ ప్రాంతంలో క్రీస్తు శకం 2–3 శతాబ్దాలకు పూర్వమే బంగారాన్ని వెలికితీశారు. ఆ తర్వాత గుప్తులు, చోళుల కాలంలో ఇక్కడ పుత్తడి మైనింగ్‌ కార్యకలాపాలు విస్తరించాయి. విజయనగర సామ్రాజ్యంలో, ఆపై టిప్పు సుల్తాన్‌ హయాంలో పసిడి ఉత్పత్తి జోరందుకుంది. అయితే, బ్రిటిష్‌ పాలనలో కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ (కేజీఎఫ్‌) దశ తిరిగిపోయింది. జాన్‌ టేలర్‌ అండ్‌ కంపెనీకి బ్రిటిషర్లు దీన్ని అప్పజెప్పారు. అప్పట్లో ఈ ప్రాంతాన్ని ‘లిటిల్‌ ఇంగ్లండ్‌’గా పిలిచేవారు.

1884–1904 మధ్య చాలా తక్కువ లోతులోనే బంగారం దొరికేది. మొదట్లో ఒక టన్ను క్వార్ట్‌›్జ ముడి ఖనిజం నుంచి 45 గ్రాముల పసిడి వచ్చేదట. దీంతో ప్రపంచంలో అత్యంత శ్రేçష్ఠమైన పసిడి నిల్వలున్న గోల్డ్‌ ఫీల్డ్‌గా చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత అమెరికాలోని నెవాడాలో కనుగొన్న ఫైర్‌ క్రీక్‌ భూగర్భ బంగారు గనిలో టన్ను ఖనిజం నుంచి గరిష్టంగా 44.1 గ్రాములు లభించింది. కానీ, మన కేజీఎఫ్‌ ‘గోల్డెన్‌’ రికార్డును మాత్రం బ్రేక్‌ చేయలేకపోయింది. కేజీఎఫ్‌ 120 ఏళ్ల జీవిత కాలంలో సగటున టన్ను ఖనిజాన్ని శుద్ధి చేస్తే 15 గ్రాముల బంగారం లభ్యమైంది.

దక్షిణాఫ్రికాలో అతిపెద్ద గోల్డ్‌ మైన్‌ విట్‌ఫాటర్‌స్రాండ్‌ బేసిన్‌లో సగటు ఉత్పత్తి 9 గ్రాములే. 1956లో ప్రభుత్వం కేజీఎఫ్‌ను జాతీయం చేసింది. అప్పటిదాకా జాన్‌ టేలర్‌ కంపెనీ చేతిలోనే ఉండేది. కేజీఎఫ్‌ చరిత్రలో దాదాపు 1,000 టన్నుల బంగారం ఉత్పత్తి అయినట్లు అంచనా. ఇందులో చాలావరకు బ్రిటిషర్లే తన్నుకుపోయారు. అయితే, తలకు మించిన ఉత్పాదక వ్యయం, పర్యావరణ సమస్యలతో కేజీఎఫ్‌ 2021లో పూర్తిగా మూతబడింది. అప్పటికి ‘చాంపియన్‌’ రీఫ్‌ మైన్‌ భూగర్భంలో 3.2 కిలోమీటర్ల లోతు వరకు మైనింగ్‌ జరిగింది. ప్రపంచంలోని అత్యంత లోతైన బంగారు గనుల్లో ఒకటిగా చరిత్రి సృష్టించింది.

భూగర్భంలో 1,400 కిలోమీటర్ల పొడవైన సొరంగాలు కేజీఎఫ్‌ కింద విస్తరించి ఉన్నాయట. అప్పుడప్పుడూ అవి కుంగడం వల్ల ఇప్పటికీ కోలార్‌లో భూమి కంపిస్తుంది. ఇక ప్రస్తుతం భారత్‌లో ఉత్పత్తి జరుగుతున్న ఏకైక గోల్డ్‌ మైన్‌ హట్టి. ఇదీ కర్ణాటకలోనే (రాయచూరు) ఉంది. ఇప్పటిదాకా 84 టన్నుల బంగాన్ని వెలికితీశారు. టన్ను ఖనిజానికి 3 గ్రాముల బంగారమే లభ్యమవుతోంది. ఏటా 1.5 టన్నుల పసిడి ఇక్కడ లభిస్తోంది. కాగా, దేశంలో కనుగొన్న పసిడి నిల్వల్లో 88 శాతం కర్ణాటకలోనే ఉన్నాయి.

వినియోగంలో భారత్, చైనాలే టాప్‌..
2023లో ప్రపంచ బంగారు ఆభరణాల డిమాండ్‌లో 50 శాతం భారత్, చైనాల్లోనే నమోదవుతోంది. దీనికి తోడు పసిడి పెట్టుబడులు కూడా క్రమంగా ఎగబాకుతున్నాయి. 2023లో గనుల నుంచి 3,600 టన్నుల బంగారం వెలికితీయగా అందులో భారత్‌ దాదాపు 800 టన్నులు, చైనా 824 టన్నులు దిగుమతి చేసుకున్నాయి. తద్వారా వినియోగంలో భారత్‌ను అధిగమించింది చైనా. అయితే, భారత్‌ పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడుతుండగా. చైనా బంగారు ఉత్పత్తిలో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండటం విశేషం.

ద్రవ్యోల్బణానికి విరుగుడు... పెట్టుబడికి నిశ్చింత! 
ధరల పెరుగుదలకు సరైన విరుగుడు బంగారం. ఎందుకంటే ధరలు పెరిగే కొద్దీ.. కరెన్సీ విలువలు పడిపోతూనే ఉంటాయి. రాబడికి కూడా చిల్లు పడుతుంది. ఉదాహరణకు 5 ఏళ్ల వ్యవధికి ఓ లక్ష రూపాయలు బ్యాంకులో (ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌) దాచుకుంటే సగటున 7 శాతం వార్షిక వడ్డీ రేటు ప్రకారం వచ్చే మొత్తం సుమారు రూ.1,41,500. అయితే, ద్రవ్యోల్బణం 7 శాతం గనుక ఉంటే, వచ్చే రాబడి సున్నా. పెట్టుబడి మాత్రమే మిగులుతుంది.

ద్రవ్యోల్బణం మరింత పెరిగితే పెట్టుబడికీ చిల్లే! షేర్లు, బాండ్లు, క్రిప్టో కరెన్సీ, చివరికి బంగారం... ఇలా ఏ పెట్టుబడిలోనైనా ద్రవ్యోల్బణ ప్రభావం ఉంటుంది. అయితే, పసిడి పెట్టుబడులు మాత్రం దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణానికి మించిన రాబడులే (రెండంకెల స్థాయిలో) అందిస్తున్నాయి. దానికితోడు ఏమాత్రం రిస్కులేని వ్యవహారం. పసిడి ధర ఐదేళ్లలో రెట్టింపునకు పైగా పెరిగింది. పదేళ్లలో నాలుగు రెట్లు ఎగబాకింది.

స్టాక్‌ మార్కెట్లో (షేర్లలో) ఇంతకుమించి లాభాలొచ్చే వీలున్నా, అనుకోని పరిస్థితుల్లో మనం షేర్లు కొన్న కంపెనీ మూతబడితే అసలుకే మోసం రావచ్చు. నూటికి నూరు శాతం రిస్కుతో కూడుకున్నవి. ఇక భూమి, ఇళ్లు ఇతరత్రా స్థిరాస్తులు కూడా బంగారంలాగే రిస్కులేనివే! అయితే, పసిడి మాదిరిగా ఎప్పుడు కావాలంటే అప్పుడు విక్రయించుకుని సొమ్ము చేసుకునే అవకాశం వాటికి తక్కువ. అంతేకాదు, అతితక్కువ వడ్డీకే, బంగారంపై ఇట్టే రుణం కూడా పొందొచ్చు. అందుకే బంగారం అంటే భరోసా. పెట్టుబడికి ఢోకా లేకుండా, కష్టకాలంలో ఆదుకోవడంలో బంగారాన్ని మించింది మరొకటి లేదు!

‘కంచు మోగినట్లు.. కనకంబు మోగునా’ అన్నట్లు.. ఎన్ని రకాల పెట్టుబడి సాధనాలున్నా పసిడికున్న విలువ, వన్నెకు సాటిరావు. అందుకే బంగారం ఎప్పటికీ బంగారమే! – శివరామకృష్ణ మిర్తిపాటి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement