ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు కొన్నేళ్ల క్రితం ఒక 17 ఏళ్ల కుర్రాడిని ఎంచుకుంది. అయితే తుది జట్టు సమీకరణాల్లో భాగంగా అతనికి ఆరంభంలో అవకాశాలు రాలేదు. ఆ తర్వాత వరుస పరాజయాలతో ఢిల్లీ ప్లే ఆఫ్స్ అవకాశాలు కోల్పోయింది. దాంతో చివరి మూడు మ్యాచ్‌లలో కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇచ్చి ఒక ప్రయత్నం చేయాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావించింది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌తో తొలి అవకాశం దక్కించుకున్న ఆ కుర్రాడు చెలరేగిపోయాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి19 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 46 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అనంతరం మరో మ్యాచ్‌లోనూ నాటౌట్ ఉన్న అతను ఇంకో పోరులో ఒక భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో అవుటయ్యాడు.
టీమ్ కోచ్ రికీ పాంటింగ్ అతని దగ్గరకు వచ్చాడు. సాధారణంగా ఇలాంటివి ఆడితే కోచ్‌లు అవసరంగా ఆ షాట్ ఆడావని, లేదా తొందరపడ్డావు, కాస్త జాగ్రత్త వహించాల్సిందని చెబుతారు. కానీ పాంటింగ్ మాత్రం ‘ఈ షాట్ మళ్లీ ఆడితే నాకు బంతి అక్కడ ప్రేక్షకుల గ్యాలరీల్లో కనిపించాలి’ అని ప్రోత్సహించాడు. ఆ కుర్రాడి మనసులో ఇది బాగా ముద్రించుకుపోయింది. ఆపై ఎప్పుడు అవకాశం వచ్చినా అతను దానిని మరచిపోలేదు. ఇప్పుడు ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ తరఫున రికార్డు స్థాయిలో సిక్సర్ల పంట పండిస్తున్న ఆ కుర్రాడే అభిషేక్ శర్మ. ఢిల్లీపై చెలరేగిన మ్యాచ్ అతనికి ఐపీఎల్‌లో మొదటి మ్యాచ్ మాత్రమే కాదు, ఓవరాల్‌గా కూడా అతని సీనియర్ కెరీర్‌లో తొలి టి20 కావడం విశేషం. తన వీర దూకుడుతో హైదరాబాద్ అభిమానుల దృష్టిలో అభిషేక్ కొత్త హీరోగా మారిపోయాడు. ఓపెనర్‌గా తన విధ్వంసక ఆటతీరుతో జట్టుకు అద్భుత విజయాలు అందించి అతను రైజర్స్ రాత మార్చాడు.
ఐపీఎల్ ఈ సీజన్‌లో మెరుపు బ్యాటింగ్ చూస్తున్నవారికి అభిషేక్ శర్మ అనూహ్యంగా దూసుకొచ్చిన ఆటగాడిలా కనిపించవచ్చు. కానీ స్కూల్ క్రికెట్ స్థాయి నుంచే అతను అసాధారణ ప్రతిభతో వేర్వేరు వయో విభాగాల్లో రాణిస్తూ పై స్థాయికి చేరాడు. పంజాబ్‌లోని అమృత్‌సర్ అతని స్వస్థలం. మాజీ క్రికెటర్ అయిన తండ్రి రాజ్‌కుమార్ శర్మ తొలి కోచ్ అయి ఆటలో ఓనమాలు నేర్పించాడు. ప్రస్తుత భారత జట్టులో కీలక ఆటగాడైన శుభ్‌మన్ గిల్, అభిషేక్ చిన్ననాటి స్నేహితులు. అండర్–12 నుంచి అండర్–19 స్థాయి వరకు, ఆపై దేశవాళీలో సీనియర్ స్థాయిలో కూడా కలసి ఆడారు. అయితే గిల్ లిఫ్ట్ అందుకున్నట్లుగా వేగంగా దూసుకుపోతే, మెట్ల ద్వారా ఒక్కో అడుగు పైకి ఎదిగేందుకు శ్రమిస్తున్న అభిషేక్‌కు గుర్తింపు దక్కడం ఆలస్యమైంది. భారత దేశవాళీ క్రికెట్‌లో అభిషేక్ తొలిసారి అందరి దృష్టిలో పడింది 2015–16 సీజన్‌లోనే. ఆ ఏడాది అండర్–16 విజయ్ మర్చంట్ ట్రోఫీలో 7 మ్యాచ్‌లలోనే అతను 1200 పరుగులు సాధించడంతో పాటు బౌలింగ్‌లో 57 వికెట్లు పడగొట్టడం విశేషం.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అందుకుంటూ..
అండర్–19 ప్రపంచకప్‌తో..
విజయ్ మర్చంట్ ట్రోఫీ తర్వాత అభిషేక్ అడుగు సహజంగానే అండర్–19 స్థాయి వైపు పడింది. 16 ఏళ్ల వయసులోనే అతను భారత అండర్–19 జట్టులోకి ఎంపికయ్యాడు. అంతే కాకుండా కెప్టెన్‌గా కూడా అవకాశం దక్కించుకున్నాడు. 2016లోనే ఆసియా కప్‌లో జట్టును విజేతగా నిలిపి తన సారథ్య ప్రతిభను కూడా ప్రదర్శించాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే అండర్–19 వరల్డ్ కప్ కూడా వచ్చింది. ఈసారి పృథ్వీ షా కెప్టెన్సీలో జట్టు ఆడింది. అయితే కెప్టెన్సీ లేకపోయినా జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న అభిషేక్.. మన టీమ్ వరల్డ్ కప్ విజేతగా నిలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ ప్రపంచకప్ విజయానికి సరిగ్గా వారం రోజుల ముందే వేలంలో ఢిల్లీ టీమ్ అతడిని రూ. 55 లక్షలకు తీసుకుంది.
ఆల్‌రౌండ్ ప్రతిభతో..
‘క్లీన్ స్ట్రయికర్’.. అభిషేక్ ఆట గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా అతని గురించి వినిపించే ఏకవాక్య ప్రశంస. బ్యాటింగ్‌లో ఎక్కడా తడబాటు కనిపించకుండా, బంతిని బలంగా బాదిన సమయంలో కూడా చూడముచ్చటగా, కళాత్మకంగా షాట్ ఆడే తీరుపై అందరూ చెప్పే మాట అది. కెరీర్ ఆరంభంలో లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తూ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ చేసే ఆటగాడిగా ఉన్న అభిషేక్ ఆ తర్వాత తన శ్రమతో, పట్టుదలతో టాప్ ఆర్డర్‌కు చేరాడు. ఓపెనర్‌గా విధ్వంసక బ్యాటింగ్ చేయడమే కాదు, కీలక సమయాల్లో జట్టుకు ఉపయోగపడే స్పిన్నర్‌గానూ గుర్తింపు తెచ్చుకున్నాడు. స్పిన్‌లో ఎంతో సాధనతో అతను బ్యాక్ స్పిన్నింగ్ లెగ్‌కట్టర్ అనే ప్రత్యేక తరహాలో బౌలింగ్ అస్త్రాన్ని తయారుచేసుకున్నాడు. ఇది ఎన్నోసార్లు అతనికి వికెట్‌ని తెచ్చిపెట్టింది.
తండ్రి రాజ్‌కుమార్ శర్మ, యువరాజ్ సింగ్‌తో..
యువరాజ్ మార్గనిర్దేశనంలో..
భారత మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అంటే మొదటి నుంచి అభిషేక్‌కు వీరాభిమానం. తర్వాతి రోజుల్లో అది అభిమానంగా మాత్రమే కాకుండా మరింత పెద్ద స్థాయికి చేరింది. గత కొన్నేళ్లుగా యువీ అతనికి మెంటార్‌గా వ్యవహరిస్తూ ప్రోత్సహిస్తున్నాడు. అధికారికంగా పంజాబ్ క్రికెట్‌లో ఎలాంటి హోదా లేకపోయినా కేవలం అభిషేక్ కోసం అతను తన సమయాన్ని వెచ్చిస్తూ అతని ఎదుగుదలలో కీలక పాత్ర పోషించాడు. అభి స్టాన్స్, షార్ట్ బంతులు ఆడటంలో మెలకువలు, మానసికంగా దృఢంగా మార్చడం.. ఇలా అన్నింటిలో యువీ అండగా నిలిచాడు. ఇప్పుడు ఈ కుర్రాడు ఆడే కొన్ని దూకుడైన షాట్లు యువీ ఆటను గుర్తుకు తెస్తాయంటే ఆశ్చర్యం లేదు. గత ఏడాది అభిషేక్ తన అద్భుత ఆటతో పంజాబ్ జట్టుకు తొలిసారి దేశవాళీ టి20 టోర్నీ ముస్తాక్ అలీ ట్రోఫీని అందించాడు. ఈ టోర్నీలో 2 సెంచరీలు, 3 సెంచరీలు సహా ఏకంగా 180 స్ట్రైక్‌రేట్‌తో అతను 485 పరుగులు చేశాడు. ఇందులో ఆంధ్రపై 51 బంతుల్లోనే 112 పరుగులు చేసిన మ్యాచ్‌లో పంజాబ్ టోర్నీ రికార్డు స్కోరు 275 పరుగులను నమోదు చేసింది.
ఐపీఎల్‌తో రైజింగ్..
2019లో సన్‌రైజర్స్ టీమ్ శిఖర్ ధావన్‌ను ఢిల్లీకి బదిలీ చేసి అతనికి బదులుగా ముగ్గురు ఆటగాళ్లను తీసుకుంది. వారిలో అభిషేక్ శర్మ కూడా ఒకడు. అయితే వరుసగా మూడు సీజన్లలో కూడా అతడిని లోయర్ ఆర్డర్‌లోనే ఆడించడంతో పాటు పరిమిత అవకాశాలే వచ్చాయి. దాంతో అతని అసలు సామర్థ్యం వెలుగులోకి రాలేదు. అయితే మూడో ఏడాది (2021) చివరి రెండు మ్యాచ్‌లలో అతను ఆశించినట్లుగా టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయించారు. ముంబైతో మ్యాచ్‌లో 16 బంతుల్లో 33 పరుగులు సాధించడంతో అతని దూకుడైన శైలి మేనేజ్‌మెంట్‌కు అర్థమైంది. తాము చేసిన పొరపాటును సరిదిద్దుకుంటున్నట్లుగా 2022 ఐపీఎల్ వేలంలో సన్‌రైజర్స్ ఏకంగా రూ.6.5 కోట్లకు అభిషేక్‌ను మళ్లీ తీసుకుంది.
అమ్మ, తోబుట్టువుతో..
రెండు సీజన్ల పాటు నిలకడగా రాణించిన అతను జట్టుకు విజయాలు అందించాడు. అయితే అభిషేక్ విశ్వరూపం ఈ ఏడాదే కనిపించింది. అటు పేస్, ఇటు స్పిన్ బౌలింగ్‌పై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడిన అతను 200కు పైగా స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు సాధించాడు. మరో ఓపెనర్ ట్రవిస్ హెడ్‌తో కలసి అతను అందించిన ఆరంభాలు రైజర్స్‌కు ఘన విజయాలను ఇచ్చాయి. టోర్నీలో అతను కొట్టిన ఫోర్లకంటే సిక్సర్లే ఎక్కువగా ఉండటం అతని విధ్వంసం ఎలాంటిదో చూపిస్తుంది. ఐపీఎల్ టోర్నీ చరిత్రలో టీమ్ అత్యధిక స్కోరు (277) సాధించడంలో అతనిదే కీలక పాత్ర. ముంబైతో జరిగిన ఈ మ్యాచ్‌లో అభిషేక్ కేవలం 16 బంతుల్లో హాఫ్ సెంచరీ బాది హైదరాబాద్ టీమ్ తరఫున లీగ్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీని నమోదు చేశాడు.
ఇక లక్నోతో జరిగిన మ్యాచ్‌లోనైతే 28 బంతుల్లోనే 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 75 పరుగులు చేసి అజేయంగా నిలిచిన ఇన్నింగ్స్‌ను ఐపీఎల్ అభిమానులెవరూ మరచిపోలేరు. సరిగ్గా చెప్పాలంటే గత కొన్నేళ్లలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించక ముందే ఐపీఎల్‌లో ఆడి (అన్‌క్యాప్డ్ ప్లేయర్) సత్తా చాటిన ఆటగాళ్లలో అభిషేక్ అగ్రస్థానంలో ఉంటాడంటే అతిశయోక్తి కాదు. అతని తాజా ప్రదర్శనతో వచ్చే టి20 వరల్డ్ కప్‌లో అభిషేక్‌కు చోటు ఇవ్వాల్సిందనే చర్చ జరిగింది. అయితే స్వయంగా మెంటార్ యువరాజ్ కూడా దానికి ఇంకా సమయం ఉందని, 23 ఏళ్ల అభిషేక్ రాబోయే ఇంకా మరిన్ని అస్త్రశస్త్రాలతో సిద్ధమై భారత జట్టులో అరంగేట్రం చేయగలడని విశ్వాసం వ్యక్తం చేశాడు. వరల్డ్ కప్ తర్వాత టీమిండియాలో సీనియర్ల స్థానంలో కుర్రాళ్లు చోటు దక్కించునే అవకాశాలు ఉండటంతో ఆ జాబితాలో అభిషేక్ పేరు తప్పక ఉండవచ్చనేది మాత్రం వాస్తవం. – మొహమ్మద్ అబ్దుల్ హాది
Comments
Please login to add a commentAdd a comment