‘మైదానంలో కొత్త తరహాలో ఇలా ఆలోచించాలంటే అశ్విన్ బుర్ర వాడాల్సిందే’... సూపర్ ఓవర్ సమయంలో భారత కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రశంస. ఆ మ్యాచ్‌లో అశ్విన్ ఆడటమే లేదు. అయినా అతని ప్రస్తావన రావడం అంటే ఆ బుర్ర విలువేమిటో అర్థమవుతుంది.
‘మన్కడింగ్’తో వివాదాస్పదరీతిలో ప్రత్యర్థి బ్యాటర్‌ను అవుట్ చేసి కూడా తాను చేసింది సరైందని ఒప్పించగల సామర్థ్యం అశ్విన్‌ది.. ఇది అతని గురించిన మరో ప్రశంస. గ్రౌండ్‌లో క్రికెటర్ అంటే తన ఆట మాత్రమే బాగా ఆడుకొని వెళ్లిపోవడం కాదు.. ఎవరి అంచనాలకూ అందని వ్యూహాలతో అవతలి జట్టు ఆటగాళ్లను పడగొట్టడం కూడా! అది ఒక కళ.
అందులో ఆరితేరినవాడు రవిచంద్రన్ అశ్విన్.. కెప్టెన్ కాకపోయినా సారథిగా బాధ్యతను భుజానికెత్తుకోగలడు.. కోచ్ కాకపోయినా కుర్రాళ్లకు మార్గనిర్దేశనం చేయగలడు.. ఒక్క మాటలో చెప్పాలంటే అతను ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేస్తున్న చదరంగపు ఆటగాడు. క్రికెట్ నిబంధనలకే పాఠాలు చెప్పగల జీనియస్.. భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకొని పలు ఘనతలను తన పేరిట రాసుకున్న అశ్విన్ ప్రస్థానం ఎంతో ప్రత్యేకం.
క్రికెటర్‌గా అశ్విన్ గొప్పతనం ఏమిటో అతని గణాంకాలు చెబుతాయి. వంద టెస్టులు కూడా ఆడకముందే, 500 వికెట్లకు చేరువైన తరుణం, లెక్కలేనన్ని ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ పురస్కారాలు.. ఆధునిక క్రికెట్‌లో ఏ బౌలర్ కూడా అతని దరిదాపుల్లో లేడు. అయితే అంతకు మించి అశ్విన్‌లోని సృజనాత్మక ఆలోచనలు అతడిని అందరికంటే భిన్నంగా నిలబెట్టాయి.
సాధారణంగా వేర్వేరు కారణాలతో అంతర్జాతీయ ఆటగాళ్లు చదువుపై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టలేక ఆటకే అంకితం అవుతూ ఉంటారు. కానీ మద్రాసులో ఇంజినీరింగ్ చదివిన అశ్విన్ దానిని అక్కడితో వదిలి పెట్టలేదు.
ఆ టెక్నిక్స్‌ను క్రికెట్ మైదానంలో వాడాడు. అప్పటి వరకు జట్టు ఏదైనా వ్యూహం అనుసరిస్తోంటే దానికి భిన్నమైన కొత్త ఆలోచన కోసం టీమ్ అంతా తన వైపు చూసేలా చేశాడు. పిచ్‌ను సరిగ్గా అంచనా వేయడం మొదలు బ్యాటర్లు ఊహించని రీతిలో బౌలింగ్‌తో మానసికంగా దెబ్బ కొట్టడం వరకు అంతా అశ్విన్‌కే చెల్లింది.
సమయోచిత వ్యూహాలతో..
స్పిన్ బౌలర్‌గా అశ్విన్ ఎన్నో రికార్డులు సాధించాడు. కానీ బ్యాటర్‌గా కూడా అతను విలువైన ఇన్నింగ్స్‌తో జట్టును నడిపించాడు. 2022.. టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో అత్యంత కీలక స్థితిలో అశ్విన్ ఆడిన తీరు దీనికి ఉదాహరణ. మరో బ్యాటర్ గనుక ఉంటే చివరి బంతిని ముందూ వెనకా ఆలోచించకుండా ఆడి అవుటైపోయేవాడేమో.
కానీ బౌలర్ బంతిని వదులుతున్న తీరును బట్టే అది వైడ్ అవుతుందని అంచనా వేసి దానిని వదిలేయడమే కాదు.. తర్వాతి బంతిని కూడా సరైన అంచనాతో మిడాఫ్ మీదుగా ఆడటం అతనిలోని ‘థింకర్’ను చూపించింది. క్రికెట్ అనేది ఒక సైన్స్ అయితే అశ్విన్ ఒక ఐన్‌స్టీన్ వంటివాడు అనే మాటను అతను అక్షరాలా రుజువు చేశాడు. అద్భుతమైన ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను గెలిపించిన కోహ్లీ కూడా అశ్విన్‌ను ప్రశంసించేందుకు ప్రత్యేక పదాలు వెతుక్కోవాల్సి వచ్చింది.
‘అశ్విన్ తన మెదడుకు అదనంగా మరో మెదడును వాడినట్లున్నాడు’ అంటూ మ్యాచ్ తర్వాత కోహ్లీ వ్యాఖ్యానించాడు. 2021 సిడ్నీ టెస్టులో వెన్నునొప్పితో బాధపడుతూనే 38 పరుగులతో జట్టును ఆదుకున్న ఇన్నింగ్స్.. బంగ్లాదేశ్‌తో టెస్టులో భారత్ 74 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా వెళుతున్నప్పుడు ఆపద్బాంధవుడిగా నిలిచి.. గెలిపించిన తీరు ఎలాంటి లెక్కల ప్రకారం అశ్విన్ ఆడతాడనేది చూపిస్తుంది.
అపార ప్రతిభతో ఆకట్టుకొని..
కోచ్ చంద్రశేఖర్ చిన్నతనంలోనే అశ్విన్‌లోని ప్రతిభను గుర్తించాడు. అందుకే 12 ఏళ్ల వయసులోనే మైదానంలో అతనికి ఫీల్డింగ్‌ను ఎంచుకునే అవకాశం కల్పించాడు. ఆరంభంలో పేస్ బౌలింగ్‌తో మొదలుపెట్టిన అతను ఆ తర్వాత ఆఫ్‌స్పిన్‌కు మారాడు. అయితే ఇది అంత సులువుకాలేదు. చాలా కష్టపడ్డాడు.
ఒక వైపు ఆటకు పదును పెడుతూనే మరో వైపు చదువులో కూడా ఎక్కడా తగ్గకుండా సాగాడు. ఎస్సెసెన్ ఇంజినీరింగ్ కాలేజీలో మూడో సంవత్సరం చదువుతున్నప్పుడే రంజీ ట్రోఫీకి ఎంపికైన అశ్విన్ ఆ తర్వాత కొన్నాళ్లకే అటు ఇంజినీరింగ్ పూర్తి చేసుకోవడంతో పాటు ఇటు భారత జట్టులోకి కూడా ఎంపికయ్యాడు. ఆ తర్వాత మరో కోచ్ సుబ్రహ్మణ్యం వద్ద చేరడంతో అతని ఆటే మారిపోయింది.
ఆటతో పాటు దృక్పథమూ మారింది. ‘నేను మొదటిసారి అతన్ని కలిసినప్పుడు అంతా ప్రశ్నలు, ప్రశ్నలే. అందులోనే అతడి ఉత్సాహాన్ని, తెలివితేటలను నేను గమనించాడు. అశ్విన్ కచ్చితంగా గొప్పవాడు అవుతాడని భావించి శిక్షణనిచ్చి ప్రోత్సహించాను’ అని కోచ్ గుర్తు చేసుకున్నాడు. అయితే అద్భుతమైన క్రికెటింగ్ బ్రెయిన్ అంటూ పొగడ్తలు అందుకున్నా.. భారత జట్టు కెప్టెన్ పదవి కోసం బీసీసీఐ అతన్నెప్పుడూ పరిశీలనలోకి తీసుకోలేదు.
దిగ్గజాల సరసన..
ప్రపంచవ్యాప్తంగా 3 వేలకు పైగా పరుగులు చేసి 400కు పైగా వికెట్లు తీసిన అరుదైన జాబితాలో ఆరుగురు క్రికెటర్లు ఉన్నారు. వారిలో అశ్విన్ ఒకరు. భారత ఆల్‌రౌండర్లలో.. దిగ్గజం కపిల్‌దేవ్ తర్వాతి స్థానం అతనిదే. ముందుగా ఐపీఎల్‌తో అశ్విన్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత అతనికి భారత జట్టులో స్థానం దక్కింది. వన్డేల్లో వరల్డ్ కప్, చాంపియన్స్ ట్రోఫీలు గెలిచిన భారత జట్లలో అతను భాగంగా ఉన్నాడు.
అనిల్ కుంబ్లే రిటైర్ అయిపోవడంతో పాటు హర్భజన్ తన కెరీర్ చివరి దశలో వరుసగా విఫలమవుతున్న సమయంలో అశ్విన్ జట్టులోకి వచ్చాడు. భారత్‌కు సంబంధించి కూడా అది ఒక కీలక దశ. నాణ్యమైన అగ్రశ్రేణి స్పిన్నర్ కోసం టీమ్ ఎదురు చూస్తుండగా అశ్విన్ రూపంలో ఒక ఆణిముత్యం లభించింది. తన తొలి టెస్టులోనే 9 వికెట్లు పడగొట్టి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన అశ్విన్ ఈ ఘనారంభాన్ని ఆ తర్వాతా కొనసాగించాడు.
తన తొలి 16 టెస్టుల్లోనే 9 సార్లు ఐదు వికెట్లు పడగొట్టాడంటే అశ్విన్ జోరు ఏమిటో తెలుస్తుంది. ఈ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ అత్యంత వేగంగా 300 వికెట్ల మైలురాయిని అందుకున్న బౌలర్‌గా అశ్విన్ నిలిచాడు. ఏడాదికి కనీసం 50 వికెట్ల ఘనతను అతను నాలుగుసార్లు నమోదు చేయడం విశేషం. 2016–17లోనైతే అశ్విన్ బౌలింగ్ శిఖరానికి చేరింది.
ఐదు సెంచరీలు చేశాడు
ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌లపై కలిపి 13 టెస్టుల్లోనే అతను ఏకంగా 82 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లో సాధించిన ఐదు సెంచరీలు కూడా అశ్విన్ బలాన్ని చూపిస్తున్నాయి. ఒకే టెస్టులో ఐదు వికెట్లు పడగొట్టడంతో పాటు అర్ధసెంచరీ కూడా చేసిన ఫీట్‌ను మూడుసార్లు నమోదు చేసిన ఏకైక ఆటగాడు అతనే కావడం విశేషం.
ఐసీసీ మెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌తో పాటు ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ వంటి ప్రతిష్ఠాత్మక అవార్డులన్నీ అతని ఖాతాలో ఉన్నాయి. వ్యక్తిగతంగా చూస్తే తమిళ సినిమాలను ఇష్టపడే అతను రజినీకాంత్‌కు వీరాభిమాని. 2011లో ప్రీతిని వివాహమాడిన అశ్విన్‌కు ఇద్దరు అమ్మాయిలు.
కుట్టి స్టోరీస్ పేరుతో క్రికెట్‌ను అద్భుతంగా విశ్లేషిస్తూ యూట్యూబ్‌లో అతను చేసే వీడియోలు సూపర్‌హిట్ అయ్యాయి. కెరీర్ చివర్లో ఉన్న అశ్విన్ ఎప్పుడు రిటైరైనా అద్భుతమైన కామెంటేటర్ కాగలడు. అయితే ఆటగాడిగా అతని శైలి మాత్రం ప్రత్యేకంగా ఉండిపోతుంది. అశ్విన్ ప్రస్తుతం ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై టెస్టు సిరీస్‌తో బిజీగా ఉన్నాడు.
-మొహమ్మద్ అబ్దుల్ హాది
Comments
Please login to add a commentAdd a comment